
క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
మార్గదర్శక ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) [డైరెక్ట్ PDF] [71పేజీలు]
మూలం : మౌలానా చిరాగ్ హసన్ హస్రత్ , అనువాదం : సుహైల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్
తొలి పలుకులు
మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరుల గురించీ, ముఖ్యంగా మార్గదర్శక ఖలీఫాల (ఖులఫాయె రాషిదీన్) జీవిత చరిత్ర గురించి పుస్తకాలు ఎందుకు ప్రచురించటం లేదు? అని పాఠకులు చాలా కాలంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఒనరుల కొరతవల్లనూ, ఇతరత్రా పనుల ఒత్తిడి మూలంగానూ పాఠకుల ఈ కోర్కెను ఇంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చాము. అల్లాహ్ కృప వల్ల గత నెలలోనే ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) జీవిత విశేషాలపై ఒక చిరుపుస్తకాన్ని వెలువరించాము.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణలో ఆరితేరిన సహాబీలు ఎంతో అదృష్టవంతులు. ప్రవక్తగారి ఒక్కొక్క పలుకును, ఒక్కొక్క సంజ్ఞను శిరసావహించి, ఒక్కో ఆచరణను తు.చ. తప్పకుండా అనుసరించిన సహాబీల జీవితాలను అధ్యయనం చేసిన కొద్దీ మన “విశ్వాసం” (ఈమాన్) బలపడుతుంది. ధర్మపథంలో ఆత్మస్థయిర్యం ఒనగూడుతుంది.
మీ ముందున్న ఈ చిరుపుస్తకం (ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు) కూడా మీ ధార్మిక పరిజ్ఞానంలో వృద్ధినొసగగలదని భావిస్తున్నాము. తెలుగు అనువాదకులు మిత్రులు సుహైల్ అహ్మద్ గారు గత ఐదారేండ్లుగా అల్ హఖ్ రెసిడెన్షియల్ స్కూలు (హైదరాబాద్)లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన మొదటిసారిగా ‘తర్జుమా’కు ఉపక్రమించారు. మున్ముందు వీరు మరిన్ని రచనలు, అనువాదాలు చేయగలరని ఆశిస్తూ.
– అజీజుర్రహ్మాన్ (డైరెక్టర్, అల్హఖ్ తెలుగు పబ్లికేషన్స్)
ఇస్లాంకు పూర్వం
మక్కా నగరానికి నాయకత్వం వహించే ఖురైష్ తెగ పది శాఖలుగా చీలి ఉండేది. ఆ పది కుటుంబ పెద్దలపై వేర్వేరు బాధ్యతలు ఉండేవి. ఒకరు కాబా గృహ యాత్రీకులకు నీళ్ళందించేవారు. మరొకరు నేర విచారణ జరిపేవారు. అలాగే ఇంకొక కుటుంబం యుద్ధకాలంలో సైన్యాధిపత్య బాధ్యతలు స్వీకరించేది. ఈ పది కుటుంబాల్లో బనూ అదీ (అదీ కుటుంబం) కూడా ఒకటి. ఖురైష్ తెగవారు ఇతర తెగల వద్దకు రాయబారం పంపించదలచినప్పుడు, అదీ కుటుంబీకులకే ఈ కార్యబాధ్యతలు అప్పగించేవారు. ఈ అదీ కుటుంబానికి చెందినవారే హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు).
హజ్రత్ ఉమర్ (రజి) హిజ్రత్కు నలభై సంవత్సరాల ముందు జన్మించారు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పదమూడు సంవత్సరాలు మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) కన్నా పదకొండు సంవత్సరాలు వయస్సులో చిన్నవారు. వీరి కుటుంబాలు సఫా మర్వా కొండ ప్రాంతాల నడుమ ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడ ఇక్కడే జన్మించారు. పెరిగి పెద్దవారయింది కూడా ఇక్కడే. ప్రాజ్ఞ వయసొచ్చేసరికి నాన్నగారు ఒంటెలు మేపే పనిని అప్పగించారు. ఒక అంగి వేసుకొని మక్కా సమీపంలోని మైదానంలో ఒంటెలు మేపేవారాయన. పని చేస్తూ అలసిపోయి విశ్రాంతి కోసం కొద్దిసేపు కూర్చొన్నప్పుడు తండ్రిగారి చేతి మొట్టికాయలు పడేవి.
ఆ రోజుల్లో, అరబ్బుల్లో వంశపారంపర్య జాబితాల కంఠస్థం ఒక తప్పనిసరి విద్యగా పరిగణించబడేది. కొందరికైతే వేరు వేరు తెగలకు చెందిన పుట్టుపూర్వోత్తరాలన్నీ జ్ఞాపకముండేవి. వీరు తమ తాత ముత్తాతల పేర్లతో పాటు తమ వంశస్థుల పేర్లనన్నింటినీ చకచకా చెప్పేవారు. హజ్రత్ ఉమర్ (రజి) వంశస్థులు కూడా ఈ అద్భుత విచిత్ర విద్యలో ఆరితేరినవారే. ఉమర్ గారు కూడా స్వయాన తన తండ్రి ఖత్తాబ్ నుండి ఈ విద్యను అభ్యసించారు. ఏకాగ్రచిత్తంతో పరిశ్రమించి నిష్ణాతులనిపించుకున్నారు. దీంతోపాటు ఆయన సైనిక విన్యాసాల్లోని మెళుకువలన్నింటిపై బాగా పట్టు సంపాదించారు. తృటిలో అశ్వంపై లంఘించి వాయువేగంతో దూసుకు పోతుంటే, (వేగంలో) వాహనానికి, వాహకుడికి మధ్య తారతమ్యం కానరాకుండా పోయేది.
మక్కాకు సమీపంలో ‘అక్కాజ్’ అనే విశాల మైదానముండేది. ప్రతి సంవత్సరం అక్కడ భారీ మేళాలు వెలిసేవి. కళాప్రవీణులందరూ అక్కడ గుమిగూడేవారు. ప్రదర్శనలు-విన్యాసాలు-ప్రతిఘటనల మధ్య ఈ మేళాలు అనంత వైభవంతో, అపార సౌందర్యాలతో ప్రేక్షకులనలరించేవి. యుద్ధవీరులు సైనిక విన్యాసాలు ప్రదర్శించేవారు.
కవిపుంగవులు తమ కవిత్వాల ద్వారా ప్రజల నీరాజనాలు పొందేవారు. గుర్రపుస్వారీ, బాణసంచా ఖడ్గపోరాటం మల్ల యుద్ధాల్లో పోటీలు జరిగేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడా “అక్కాజ్ మైదానంలో మల్ల యుద్ధ పోటీల్లో పాల్గొనేవారు. ఆయన అరబ్బులందరిలో ఎదురులేని పరాక్రమశాలిగా పేరు పొందారు. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా కవి కాకపోయినా కవిత్వంపై గల ఆసక్తి వల్ల ఎందరో కవుల కవిత్వాలను జ్ఞాపకముంచుకొనేవారు.
ఆజానుబాహులు. ఆయన పదిమందిలో నిల్చుంటే (గుర్రంపై కూర్చున్నట్లు) ఎత్తుగా కనిపించేవారు. ఆయన కంఠం కంచుకంఠం. హజ్ సమయంలో తన గుడారం నుండి ‘తక్బీర్’ పలికితే మస్జిద్ దాకా వినిపించేది. అనర్గళ ఉపన్యాసాల ద్వారా ప్రజల హృదయాలను ఆకట్టుకునే ప్రావీణ్యం గల వక్త ఆయన. ఆయన నైజంలో కోపం కించిత్ ఎక్కువ ఉండేది. ఆయనంటే అందరూ భయపడేవారు. ఖలీఫా అయిన తరువాత ఆయన మనస్సు కొంచెం మెత్తబడింది. అరబ్బుల్లో సాధారణంగా అన్ని తెగలు, ప్రధానంగా ఖురైష్ తెగ ముఖ్యవృత్తి వ్యాపారం. వ్యాపార నిమిత్తం కొందరు సిరియా ఈరాన్లలో పర్యటించగా, మరికొందరు భారత్-చైనాలకు పయనించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వ్యాపారం చేసేవారు. విద్యావంతులు తక్కువగా ఉండే ఆ కాలంలో, హజ్రత్ ఉమర్ (రజి) యుక్త వయస్సులోనే విద్యనభ్యసించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు, ఖురైష్ తెగలో ప్రతిభావంతులైన విద్యావంతుల సంఖ్య కేవలం పదిహేడు మాత్రమే!
ఇస్లాం స్వీకారం
హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆఖరి సంతానమైన హజ్రత్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) వంశానికి చెందినది ఖురైష్ కుటుంబం. ఆరంభ దశలో వారు తమ మత పెద్దలనుసరించే మతాన్నే అవలంబించేవారు. వారి మత పెద్దలు నిఖిల జగతికి యజమాని అయిన అల్లాహ్ నే ఆరాధించేవారు. కాలం గడిచిన కొలదీ, వారందరూ సన్మార్గాన్ని వీడి అపమార్గాల్లో జీవనం గడపసాగారు. చివరకు దైవ ధిక్కార ధోరణికి కూడా ఒడిగట్టుతూ, సూర్యచంద్ర నక్షత్రాలను, రాయీరప్పలను ఆరాధ్యదైవాలుగా పూజించసాగారు. దైవభీతికి దూరమై, స్వేచ్ఛాజీవులై నిర్భయంగా జీవిస్తూ, అతిపవిత్రమైన కాబా గృహంలోనే మూడొందల అరవై విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారినే ఆరాధ్య దైవాలుగా, ఆపద్బాంధువులుగా భావించి, పూజాపునస్కారాలు జరపసాగారు. మొక్కుబడులు తీర్చుకొనేవారు. అయితే ఆ అజ్ఞానయుగంలో విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఏకేశ్వరవాదాన్ని విశ్వసించే సజ్జనులు అప్పటికీ కొందరున్నారు. వారు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) మతాన్ని అవలంబించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) పినతండ్రి కుమారుడైన ‘జైద్ బిన్ నఫీల్’ కూడా వారిలో ఒకరు. ఆయన సాంగత్య ప్రభావం వల్ల బాల్యదశ నుండి హజ్రత్ ఉమర్ (రజి) చెవుల్లో ఏకేశ్వరనినాదాలు ప్రతిధ్వనింపసాగాయి. అయినప్పటికీ ఆయన తమ పూర్వీకుల మతంపైనే నిలకడగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తరువాత చాలాకాలం వరకు కూడా ఆయన ఇస్లాం స్వీకరించలేదు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు. ఆయన మక్కా నగర ప్రముఖులలో ఒకరుగా పరిగణింపబడేవారు. అదీ కుటుంబానికి అప్పగింపబడిన కార్యబాధ్యతలన్నీ హజ్రత్ ఉమర్ స్వయంగా నిర్వహించేవారు. ఖురైష్ నాయకులు వేరే తెగ వైపుకు రాయబారం పంపించదలచినప్పుడు, హజ్రత్ ఉమర్ (రజి)నే పంపించేవారు. ఎందుకంటే, ఆయన వాక్చాతుర్యం అటువంటిది. సంసార గొడవల్లో ఎప్పుడైనా ఇరువురి మధ్య కలహాలు రేగి, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) పెద్దమనిషిగా తీర్పులు ఇచ్చేవారు. మక్కా నగరంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏకేశ్వర నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖులలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఉన్నారు. ఒకమారు ఆయన తన వద్ద బానిసరాలిగా ఉండే ‘లుబీనా’ ఇస్లాం స్వీకరించగా, ఆమెను శతవిధాలా దండించారు.
ఒకరోజు ఆయన మక్కానగర స్థితిగతులపై ఆలోచిస్తూ, మక్కానగరంలో రోజు-రోజుకూ విపరీతంగా ప్రబలుతున్న ఏకేశ్వర నినాదానికి మూలకారకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని భావించి ఇంటి నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో (అంతకు ముందే ఇస్లాం స్వీకరించిన) అదీ తెగసభ్యుడు ‘నయీమ్ బిన్ అబ్దుల్లా’ తారసపడ్డారు. కుశల ప్రశ్నలు వేశారు నయీమ్. హజ్రత్ ఉమర్ (రజి) ముఖకవళికలను గమనించిన నయీమ్ కు ప్రమాద సూచిక కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగారు నయీమ్. “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి” అని ఆవేశంతో సమాధానమిచ్చారు ఉమర్ . అందుకు నయీమ్ స్పందించి ‘ముందు నీ ఇంటి వ్యవహారం చక్కదిద్దుకో, స్వయంగా నీ అక్కా-బావలిద్దరూ ముస్లింలైపోయారు” అని చెప్పారు. అంతే! హజ్రత్ ఉమర్ (రజి) వెనుతిరిగారు. తిన్నగా సోదరి ఇంటికే వెళ్ళారు. ఆ సమయంలో వారిద్దరూ దివ్యఖురాన్ పారాయణంలో నిమగ్నులై ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) రాకను గమనించిన వారిద్దరూ దివ్యఖురాన్ పవిత్ర పుటలను దాచేశారు. ‘ఇందాక మీరు చదువుతున్నదేమిటి?’ అని నిప్పులు చెరుగుతూ అడిగారు ఉమర్. దానికి ఆ దంపతులిద్దరూ సమాధానమివ్వక మౌనం వహించారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “మీరిద్దరూ, మన పూర్వీకుల ధర్మాన్ని విడనాడారని నాకు తెలిసింది” అని అగ్రహోదగ్రులై బావను కొట్టసాగారు. సోదరి అడ్డుపడగా ఆమెను కూడా ఎడాపెడా బాదారు. ‘మా ప్రాణాలు పోయినా సరే, మేము ఇస్లాం నుండి వెనుదిరగడం అసంభవం” అని వారిద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పేశారు. రక్తంలో తడిసి ముద్దయిన సోదరిని చూచి, ఆయన ఆవేశం చల్లబడింది. ‘సరే….. మీరిందాకా చదివిందేమిటి? చూపించండి?” అన్నారు ఉమర్ (రజి). దివ్యఖురాన్ పుటలను కొన్నిటిని ఆయనకు చూపించారు ఆ దంపతులు. ఆయన కూడా దైవగ్రంధ పారాయణం మొదలెట్టారు. పఠిస్తున్న కొద్దీ ఆయన ముఖకవళికలలో మార్పు రాసాగింది. దైవగ్రంధ వచనాలలోని మాధుర్యాన్ని ఆయన ఆస్వాదించసాగారు. నెమ్మదిగా రాతిగుండె కరగడం మొదలెట్టింది. ఒక్కసారిగా ఆలోచనా సముద్రంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తరువాత అప్రయత్నంగా ఆయన నోట వెలువడిందొక నిర్ణయాత్మకమయిన వాక్యం! “నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తున్నాను”.
అక్కడ నుండి నేరుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు బయలు దేరారు. తలుపు తట్టి లోనికి ప్రవేశానికై అనుమతికోరారు. ఖడ్గము చేతపట్టుకొని యున్న హజ్రత్ ఉమర్ (రజి)ను చూచిన సహచరులందరూ ఆందోళన చెందారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రియైన హజ్రత్ హమ్జా (రజి) అక్కడే ఉన్నారు. ఆయన కూడా మక్కా నగరంలో ఎన్నదగ్గ శూరుడు. “మంచి ఉద్దేశ్యంతో వస్తే సరి… లేదా… అతని ఖడ్గంతో అతన్నే వధిస్తాను!” అని హజ్రత్ హమ్డా (రజి) అందరికీ అభయమిచ్చారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి, ఉమర్ తో “నీ రాకలోని ఉద్దేశ్య మేమిటి?” అని నిదానంగా అడిగారు. అందుకు ఉమర్ (రజి) కంపిస్తూ “ఇస్లాం స్వీకరించడానికి వచ్చాను.” అని సమాధానమిచ్చారు. ఈ మాట విన్న ముస్లింలందరూ సంతోషంతో ‘అల్లాహు అక్బర్’ అంటూ మక్కా పర్వతాలన్నీ ప్రతిధ్వనించేలా తక్బీర్ పలికారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫైమూడు సంవత్సరాలు. ఆయన ఇస్లాం స్వీకారం మక్కాలో తీవ్ర సంచలనం సృష్టించింది. విరోధులందరూ ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పలు దిశల నుండి నిరసన ధ్వనులు మ్రోగసాగాయి. ఆయన నిర్ణయానికి మండి పడినప్పటికీ బంధుప్రీతి మూలంగా కొంతమంది ఆయన జోలికి రాలేకపోయారు. వారందరూ కేవలం నిరసనలు, నినాదాలతోనే తమ కోపాగ్నిని బహిర్గతం చేశారు. హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణ నాటికి మక్కాలో ముస్లింల సంఖ్య కేవలం నలభై మాత్రమే. వారు తమ తమ ఇండ్లల్లోనే నమాజ్ చేసేవారు. ‘కాబా’లో నమాజ్ చేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణతో ముస్లింలందరూ నిర్భయంగా కాబాలో నమాజ్ చేయగలిగారు. వారినడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.
ఇస్లాం స్వీకారం తరువాత
హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన తరువాత ఏడు సంవత్సరాల వరకు మక్కాలోనే ఉన్నారు. ఆ కాలం విశ్వాసులకు వ్యధాభరితమైన కాలం. దైవ తిరస్కారులు (కాఫిర్లు) ముస్లింలను శతవిధాలుగా హింసించేవారు. చిత్రహింసలూ పెట్టేవారూ. మక్కానగర వీధులగుండా విశ్వాసులెవరైనా పోతూ ఉంటే వారిని పరిహసించేవారు. రాళ్ళు రువ్వి గాయపరచేవారు. ఇస్లాం స్వీకరించిన బానిసలను, దళిత జనులను అనుదినం వేధించడం మామూలే. అయితే, మక్కాలో ఇస్లాం స్వీకరించిన ప్రముఖులను, సర్దారులను కూడా ఖురైషులు వదలలేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి అయిన అబూతాలిబ్ (హజ్రత్ అలీ తండ్రి) ఇస్లాం స్వీకరించనప్పటికీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అన్ని విధాల ఆదుకునేవారు. ఆయన ప్రవర్తనను పరికించిన ఖురైషీయులు, ఆయనకు అల్టిమేటం ఇస్తూ, “మీ అబ్బాయిని మాకప్పగించండి, లేదా మాదారి నుండి వైదొలగండి” అని చెప్పేశారు. కాని ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడ్పడటం మానలేదు. పైగా ఆయన హషిమ్ కుటుంబీకులందరినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సహాయపడేలా ఒప్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అబూతాలిబ్ అండదండలు ఉన్నంత వరకు వారితో సంబంధములన్నీ తెంపుకోవాలని ఖురైషీయులు నిశ్చయించారు. సంఘ బహిష్కారానికి సంబంధించిన పత్రాన్ని వ్రాయించి, దానిపై అందరి సంతకాలు తీసుకొని కాబా గృహం వద్ద దానిని వ్రేలాడదీశారు.
అబూతాలిబ్ కుటుంబ సభ్యులందరితో కలసి ఒక పర్వత లోయలో శరణు తీసుకున్నారు. అది ‘షేబే- అబీతాలిబ్’ లోయగా ప్రసిద్ది చెందింది. లోయ వాసులకు ఎలాంటి అన్నపానీయాలు సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఖురైషీయులు. లోయల్లో అబీతాలిబ్ కుటుంబీకులందరూ దాదాపు మూడు సంవత్సరాలు ఆకులలములు తిని కడు దీనావస్థలో కాలం వెళ్ళబుచ్చేవారు. వారి పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక అలమటిస్తూ ఉన్నా ఖురైష్ కరకు గుండెలు కరిగేవి కావు. వ్యధాభరితమైన ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండిన ముస్లింలు అవకాశం దొరికినప్పుడు చాటుగా తినుబండారాలు సరఫరా చేసేవారు. కాని అవి వారందరికీ సరిపోయేవి కావు. లోయవాసులు దయనీయస్థితిపై జాలి కలిగిన కొందరు బసూహాషిమ్ బంధువులు దైవగృహ ద్వారంపై వ్రేలాడదీసియున్న ఫర్మానాను చించివేశారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సంవత్సరాల అతికఠినమైన సంఘబహిష్కార ఆంక్షల నుండి విముక్తి పొందిన కొద్దిరోజుల్లోనే మరో విషాదకర సంఘటన జరిగింది. పినతండ్రి అబూతాలిబ్ మరణించారు. వాలుగు రోజుల తరువాత ప్రవక్త సతీమణి హజ్రత్ ఖదీజా (రజి) కూడా ఊర్థ్వలోకాలకెళ్ళి పోయారు. అబూతాలిబ్ బ్రతికి ఉన్నంతకాలం ఖురైషీయులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జోలికి పోవడానికి సాహసించలేకపోయేవారు. వారెప్పుడైనా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు హాని కల్గించే యత్నం చేసినా, అబూతాలిబ్ అండదండల వలన వారి ఎత్తులు ఫలించేవి కావు. కాని అబూతాలిబ్ మరణంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కాపాడుతున్న తాలిబ్ రక్షాకవచము కూడా తొలగిపోయింది. ముస్లింలపై ఖురైషీయుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తొమ్మిదవయేట అబూతాలిబ్ మరణించారు. అయితే మక్కాకు సుమారు రెండొందల మైళ్ళ దూరంలో ‘యస్ రిబ్’ అని పిలువబడే మదీనా పట్టణానికి ఇస్లాం పరిమళం సోకింది. స్వల్పకాల వ్యవధిలోనే అనేకులు ఇస్లాం స్వీకరించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాకు ఏతెంచాలని మదీనా ముస్లింలు కోరారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు బదులు సహాబీలను మదీనా వెళ్ళడానికి అనుమతించారు. మొదటి విడత ఐదుమంది మదీనా వెళ్ళారు. వారిలో హజ్రత్ బిలాల్ (రజి) ఒకరు. రెండవ విడత హజ్రత్ ఉమర్ (రజి) ఇరవై సహాబీలతో మదీనాకు ప్రస్థానం చేశారు. ఈ విధంగా దాదాపు ముస్లింలందరూ మదీనా వెళ్ళిన తరువాత, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి)తో కలిసి మదీనాకు పయనించారు. అందరికన్నా చివర హజ్రత్ అలీ (రజి) మదీనాకు చేరారు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనవద్ద ప్రజలు ఉంచిన అమానతులను సంబంధీకులకు అప్పగించే బాధ్యతను హజ్రత్ అలీ (రజి) గారిపై మోపారు.
ఆనాడు మదీనా పట్టణం చాలా చిన్నది. అందుచేత మహాజిరు లందరూ ఆ పట్టణానికి దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉన్న ‘ఖుబా’ ప్రాంతంలో నిలిచారు. హజ్రత్ ఉమర్ (రజి)కూడా అక్కడే బసచేశారు. కొన్ని రోజుల తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ అబూబకర్ (రజి) ఇద్దరూ కలసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండువారాల పాటు బసచేసి, ఒక ఆరాధనాలయాన్ని (మస్జిద్ ను) నిర్మించారు. తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా వెళ్ళిపోయారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘ఖుబా’లోనే ఉండిపోయారు. అటు మదీనాలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహాజిర్ల మరియు అన్సార్ల మధ్య సోదర ఒప్పందం చేయించారు. మదీనా ప్రజలు, తమతో మమేకమైన మక్కావాసికి, తమ సిరిసంపదలన్నింటిలో సగభాగం పంచిపెట్టారు. మదీనావాసుల్లో ప్రముఖుడైన (బనూసాలెమ్ తెగ సర్దారు) ‘ఉత్బాన్ బిన్ మాలిక్’ (రజి) ఖుబా నగరంలోనే ఉన్నారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) హజ్రత్ ఉమర్ (రజి)లు రెండ్రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరవటం మామూలుగా చేసుకున్నారు. మదీనా చేరిన తరువాత మస్జిదె నబవీలో నమాజీల సంఖ్య బాగా పెరగసాగింది. ముస్లింలకు సరైన సమయానికి నమాజుకు పిలిపించటానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలంచారు. ఎందుకంటే సమయ నిర్ధారణ లేనందువలన కొందరు సమయానికన్నా ముందు, మరికొందరు ఆలస్యంగా నమాజుకు వచ్చేవారు. సరైన సమయం తెలియనందున కొందరు సామూహిక నమాజ్ కూడా చేయలేకపోయేవారు. క్రైస్తవుల వలే తాము కూడా శంఖమూది నమాజ్ వైపుకు పిలువవచ్చు అని కొందరు సలహా ఇచ్చారు. ఆ సమయంలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. శంఖమూది ప్రజలను నమాజ్ వైపు పిలవడానికి బదులుగా, ఒక వ్యక్తిని నియమించి అతనికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆయన సలహా నచ్చింది. అప్పుడే, ఆయన మధుర కంఠస్వరం గల హజ్రత్ బిలాల్ (రజి)ను ఈ పని నిమిత్తం నియమించారు. అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అప్పటి నుండీ ప్రజలకు దైవారాధన వైపుకు పిలవటానికి ఈ సులువైన ప్రభావవంతమైన విధానం ఆచరణలో ఉంది. ఇది ఒక విధంగా నమాజ్కు ఉపోద్ఘాతం వంటిది.
హిజ్రత్ అనంతరం
హిజ్రత్ అనంతరం ముస్లింలకు ఖురైష్ సుదీర్ఘ యుద్ధ పరంపరకు బీజం పడింది. ప్రారంభంలో ఇరువురి మధ్య చిన్నపాటి జగడాలు మాత్రమే జరిగేవి. హిజ్రత్ రెండవ సంవత్సరం బద్ర్ మైదానంలో సంభవించిన ధర్మసంగ్రామం, ఖురైషీయుల శక్తి ప్రాబల్యములన్నింటినీ నీరుగార్చింది. వంద స్వారీలు కలిగి, వేయిమంది సైనికులతో ఖురైషీయులు కయ్యానికి కాలుదువ్వారు. వారిని ప్రతిఘటించడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం మూడొందల పదమూడు మంది యోధులతో సంగ్రామ స్ధలానికి చేరుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) పన్నెండు మందితో కలసి పాల్గొన్నారు. అందులో కొందరు ఆయన కుటుంబీకులు కాగా, మరికొందరు మిత్రవర్గానికి చెందినవారు. అల్లాహ్ ఈ యుద్ధంలో ముస్లింలకు అద్భుత విజయాన్ని ప్రసాదించాడు. శత్రుసైన్య ప్రముఖ నాయకుడైన అబూజహల్తో పాటు డెబ్బైమంది శత్రు సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. దాదాపు అంతేమంది బంధించబడ్డారు కూడా. విశ్వాసవర్గానికి చెందిన పద్నాలుగు మంది సైనికులు అమరగతి నొందారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో హజ్రత్ ఉమర్ (రజి) చేత హతమార్చబడిన ఖురైష్ ప్రధాన నాయకుడు ‘హజ్రత్ ఆసీ బిన్ హెషామ్’ వరుసకు ఆయన మామ అవుతాడు. విశ్వాసవర్గ వైపు నుండి వీరగతి పొందిన వారిలో హజ్రత్ ఉమర్ (రజి) బానిస ‘మహాబా’ కూడా ఉన్నాడు. ఖైదీలుగా బంధించబడిన వారిలో కొందరు ముస్లింల బంధువులు కూడా ఉన్నారు. ఖైదీలుగా బంధింపబడ్డ హజ్రత్ అబ్బాస్ (రజి), మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు పినతండ్రి మరియు హజ్రత్ హంజా (రజి)కు సోదరులు. హజ్రత్ అలీ (రజి) సోదరుడు హజ్రత్ అఖిల్ (రజి) కూడా ఖైదీలలో ఒకరు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైదీల పట్ల జరుపబోయే వ్యవహారం గురించి సహాబీలందరితో సమాలోచన జరిపారు. ‘ఖైదీలకు బంధవిముక్తి ప్రసాదించాలని’ హజ్రత్ అబూబకర్ (రజి) సలహా ఇచ్చారు. “ధర్మం విషయంలో అనుబంధం ఆత్మీయతలకు ఎలాంటి తావు లేకుండా, ఖైదీలందరినీ హతమార్చవలయునని” హజ్రత్ ఉమర్ (రజి) నిర్మొహమాటంగా తమ మనోసంకల్పాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఎవరి బంధువులను వారు తుదముట్టించాలనీ, హంజా (రజి) అబ్బాస్ ను, అలీ (రజి) అఖీల్ ని హత మార్చాలని కూడా ఆవేశపూరితంగా చెప్పారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి) సలహాను సమర్థిస్తూ ఖైదీలను విడుదల చేశారు.
రెండవ సంవత్సరం ఖురైషీయులు పెద్ద సైనిక బలగాలతో, బద్ర్ యుద్ధ ఒటమికి ప్రతీకారాన్ని తీర్చుకొనేందుకు వచ్చారు. వారి సైన్యంలో కవచాలు ధరించిన ఏడొందల సిపాయిలు ఉన్నారు. మరియు రెండొందల మంది స్వారీ అయి ఉన్నారు. మదీనా పట్టణానికి మూడు మైళ్ళ దూరంలో ‘ఉహద్’ పేరుతో విశాల మైదానమొకటి ఉంది. అక్కడే ముస్లింలకు- ఖురైషీయులకు మధ్య, యుద్ధం జరిగింది. ఇటు ముస్లింలు ఏడువందల సైనికులతో ప్రతిఘటనకు సన్నద్ధులయ్యారు. యుద్ధ మైదానంలో ముస్లిం సైనికుల వీరోచిత పోరాటానికి, శత్రుసైన్యం తొలుత ఖంగుతింది. ముఖ్యంగా హజ్రత్ హంజా (రజి), హజ్రత్ అలీ (రజి) మరియు హజ్రత్ అబూదజానా (రజి)లు ప్రత్యర్థులపై విరుచుకుపడి కలకలం రేపారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం ప్రారంభంగాక ముందు యాభై మంది బాణ సంచారులను రక్షణార్థం ఉహద్ కొండలపై నియమించారు. ఖురైషీ సైనికులు యుద్ధ మైదానం విడిచి పారిపోవడం గమనించిన వీరు తమ స్థానాలను వదలి శత్రుసైన్యం వైపు పరిగెత్తారు. అటుకొండ ప్రాంతం వెనుక భాగంలో వేచి వున్న శత్రు సైన్యబలగమొకటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మెరుపుదాడికి దిగింది. పారిపోతున్న ఖురైషీ సైనికులు ఇదే అదనుగా వచ్చారు. అంతే!…. రణరంగ రూపురేఖలే మారిపోయాయి.
బద్ర్ సంగ్రామంలో, శత్రుసైన్య వీరులెందరినో హతమార్చిన హజ్రత్ హంజా (రజి) ఒక బానిస చేతిలో వీరగతి పొందారు. స్వయంగా ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. ఒక దశలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వదంతులు వాయువేగంతో వ్యాపించాయి. అది విన్న ముస్లింలు కొందరు నిస్పృహచెంది మదీనావైపుకు తిరోన్ముఖులయ్యారు. మరికొందరు ప్రత్యర్థులకు లొంగిపోయారు. ‘మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేని తమ జీవితం నిరర్థకమని తలంచి కొందరు ఆవేశంతో శత్రుసైన్యం వైపుకు దూసుకుపోయారు. యుద్ధ మైదానంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) రణరంగాన్ని వదలి వెళ్ళకపోయినా, ఖడ్గాన్ని పారేసి, ఇక బ్రతికి మాత్రం ప్రయోజనమేమిటని ఆలోచిస్తూ ఒక ప్రక్క కూర్చున్నారు. అంతలోనే సహాబీలలో ఒకరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తీవ్ర మనస్థాపం చెందిన సహచరులు, ఆయన జీవించియున్నారని తెలియగానే, అమితానందంతో ఆయన చుట్టూ గుమిగూడారు. హజ్రత్ ఉమర్ (రజి) పట్టరానంత సంతోషంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సమీపించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నారని తెలియగానే ఖురైషీయులు తిరిగి దాడి చేశారు. ముస్లింల ఎదురుదాడికి వారందరూ పలాయనం చిత్తగించారు. సరైన సమయం చూచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబీలందరితో ఒక కొండ పైభాగాన చేరుకున్నారు. అప్పుడు ఖురైషు నాయకుడొకడు అటువైపుకు వచ్చి “ప్రజలారా! మీలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉన్నారా?” అని ప్రశ్నించాడు. అందరూ మౌనం వహించారు. ఎవరూ సమాధానమివ్వలేదు మరియు రెండవసారి అతడు “మీలో, అబూబకర్ (రజి) మరియు ఉమర్ (రజి) బ్రతికియున్నారా?” అని గర్జించాడు. ఈసారి కూడా సమాధానం రాకపోవడంతో బహుశా వీరందరూ యుద్ధభూమిలో మరణించి ఉంటారని అబూసుఫియాన్ అన్నాడు. అప్పటి వరకూ నిశబ్దంగా ఉన్న ఉమర్ (రజి)కు ఓపిక నశించింది. ‘ఓ అల్లాహ్ విరోధీ! మేమంతా బ్రతికే ఉన్నామ”ని ఎలుగెత్తి ప్రకటించారు. “ఓ హబల్! (*) నీవు ఉన్నతుడవు” అని అబూ సుఫియాన్ అన్నాడు. దానికి సమాధానమివ్వమని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించగా హజ్రత్ ఉమర్ (రజి) బిగ్గరగా చాటారు ‘అల్లాహ్ యే ఉన్నతుడు. సర్వాధికుడు!’
(*) ఖురైషులు కల్పించుకున్న ఆరాధ్య దైవాలలో ‘హబల్’ ఒకడు.
ఉహద్ యుద్ధంలో ముస్లింలపై ఖురైషీయులదే పైచేయి అయినప్పటికీ వారికి పరిపూర్ణ విజయం మాత్రం లభించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు మదీనాపై దాడి చేయ ప్రయత్నించలేదు. తమకు లభించిన ఈ విజయాన్నే గొప్పగా భావించి వెళ్ళిపోయారు.
కొన్ని రోజుల తరువాత యూదులు మరియు ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మదీనాకు చెందిన యూదులు తమ ఒడంబడికకు కట్టుబడ లేదు. అనుదినం ఒక ఉపద్రవం సృష్టించేవారు. చివరకు వారు మదీనా నుండి బహిష్కరించబడ్డారు. మదీనా నుండి ప్రస్థానము చేసి వారు ఖైబర్ ప్రాంతంలో తిష్ఠవేశారు. ముస్లింలకు విరుద్ధంగా కొన్ని తెగలను ప్రేరేపించారు. ఖురైషీయులు ఇలాంటి సందర్భాల కోసమే ఎప్పటి నుంచో వేచి యున్నారు. యూదులు వారిని, ముస్లింలకు ప్రతికూలంగా సహాయం కోరగా, వారు పదివేలమంది సైనికులతో దండెత్తి వచ్చారు. అటు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో సమాలోచన జరిపి, మదీనా చుట్టూ కందకం త్రవ్వాలని నిశ్చయించారు. శత్రుసైన్యం నెలరోజుల పాటు మదీనాను ముట్టడించింది. అసలే ఆ రోజుల్లో మదీనాలో కరువు ఏర్పడి ఉంది. ఆహార ధాన్యాల కొరత వల్ల ముస్లింలు పస్తులుండేవారు. ఖుద్దుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడేసి రోజులు ఆకలి బాధను సహించారు.
శత్రు సైనికులు అడపాదడపా కందకం దాటి దాడి చేసేవారు. అందువల్ల కందకం.వల్ల దాడి జరిపే శత్రు సైనికులనెదిరించడానికి సహాబాల సారధ్యంలో సైనిక బృందాలు నియమింపబడ్డాయి. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా ఒక నిర్ణీత ప్రదేశం వద్ద కందకానికి కాపలా కాస్తున్నారు. ఆ స్థలంలో ఆయన పేర ఒక మస్జిద్ నిర్మింపబడింది. నేటికీ అది చిరస్మరణీయంగా మిగిలి ఉంది. ఈ యుద్ధ సందర్భంగా ఒకమారు శత్రు సైనిక వీరులు నలుగురు అగడ్త దాటి దండయాత్రకు దిగారు. వారిలో అరబ్బులందరిలో పరాక్రమశాలిగా వ్యవహరింపబడే ‘అమ్ర్ బిన్ అబ్దూ’ ఒకడు. అతడు ఏకంగా ‘నన్నెదిరించేవారెవరైనా ఉన్నారా?’ అని సవాలు విసిరాడు. ఇటునుండి హజ్రత్ అలీ (రజి) సమరానికి సిద్ధమై, పోరాడి అతన్ని కడతేర్చారు. మిగిలిన ముగ్గురూ హజ్రత్ అలీపై దాడి జరిపారు. కాని ఆయన ఖడ్గ విన్యాసం చూసి తోక ముడిచారు. పారిపోయే యత్నంలో ఒకడు కాలుజారి గోతిలో పడిపోయాడు. అతను కూడా హజ్రత్ అలీ (రజి)చే తుదముట్టించబడ్డాడు. ఒకవైపు ‘అమ్ర్ బిన్ అబ్దూ’ లాంటి పరాక్రమశాలి మరణం శత్రుసైన్యంలో కలకలం రేపగా మరోవైపు ఆ రాత్రి భయంకరమైన పెనుగాలులు వీచి, గుడారములన్నీ నేలకూలాయి. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టయింది అవిశ్వాసుల పరిస్థితి. బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చని తలంచి వచ్చినదారే వెళ్ళిపోయారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ ఆరవయేట దైవగృహాన్ని (కాబాను) సందర్శించాలనుకున్నారు. ఈ శుభయాత్రలో ఆయన వెంట పధ్నాలుగు వందల మంది సహాబాలు ఉన్నారు. యుద్ధ సమయం కానందున, వారు ఆయుధము లేమీ లేకుండానే వెళ్ళారు. మదీనా నుండి ఆరుమైళ్ళు ప్రయాణించిన పిదప హజ్రత్ ఉమర్ (రజి), ఈ విధంగా నిరాయుధులై ప్రయాణించటం సరికాదని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు ఆయుధాలు తెప్పించబడ్డాయి. మక్కాకు సమీపించక ముందే ఖురైషీయులు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారని వార్తలందాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను రాయబారిగా పంపాలనుకున్నారు. “మక్కాలో నాకు రక్షణ ఇవ్వగలవారు ఎవ్వరూ లేరు… పైగా ఖురైషీయులు నన్ను చంపాలని చూస్తున్నారు” అని హజ్రత్ ఉమర్ (రజి) అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపండి, ఎందుకంటే ఆయన కుటుంబీకులెందరో అక్కడ ఉన్నారు అని సలహా ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులతో హుదైబియా వద్ద విడిది చేసి, ఖురైషీయులతో సంప్రదింపుల నిమిత్తం హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపారు. అటు ఖురైషీయులు వారిని ఆపుకున్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యగావింపబడ్డారన్న వార్తలు వాయు వేగంతో వ్యాపించాయి. “మన ప్రాణాల్నైనా ధారపోసి, హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యకు ప్రతీకారం తీర్చు కుంటాము” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ ఒక తుమ్మ చెట్టు క్రింద తీసుకొనబడింది. అందుకే దీనిని “బైతు- ష్షజర” అంటారు. ఇదిలా వుండగా తరువాత ఖురైషీయులు చర్చల నిమిత్తం ఒక రాయబారిని పంపారు. వారిరువురి మధ్య ఎన్నో వాగ్వివాదాల తర్జనభర్జనల తరువాత కొన్ని షరతులపై సయోధ్య కుదిరింది. దీని ప్రకారం ఆ సంవత్సరం ముస్లింలు మక్కాలో ప్రవేశించకూడదు. రాబోయే సంవత్సరం దైవగృహ దర్శనార్థం వచ్చి, కేవలం మూడు రోజులు విడిది చేసి వెళ్ళిపోవాలి. మక్కావాసులైన ముస్లింలను తమ వెంట తీసుకుపోరాదు. మక్కాలోని విశ్వాసులు, అవిశ్వాసులు ఎవరైనా మదీనా వెళ్ళితే మాత్రం వారిని తిప్పి పంపివేయాలి. మరయితే మక్కాకు ప్రస్థానం చేసి వచ్చే ముస్లింలను తిరిగి పంపడమనేది జరగదు.
ఒడంబడికలోని ఆఖరి నిబంధనను పరిశీలిస్తే, ముస్లింలు, ఒత్తిడికి తలొగ్గి రాజీపడ్డారని అవగతమౌతుంది. దీనిపై హజ్రత్ ఉమర్ (రజి) ఎంతో కలత చెందారు. “ఈ విధంగా తలొగ్గి సంధి కుదుర్చుకోవటం సమంజసం కాదని” ఆయన అబూబకర్ (రజి) ముందు వెల్లడించారు. మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఏది చేసినా ముందుచూపుతోనే చేస్తారని హజ్రత్ అబూబకర్ (రజి) ఆయనకు నచ్చజెప్పారు. హజ్రత్ ఉమర్ (రజి) సంతృప్తి చెందలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కెళ్ళి ‘మీరు నిజమైన ప్రవక్త కారా!’ అని ప్రశ్నించారు. “నిస్సందేహంగా, నేను నిజమైన దైవప్రవక్తనే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు. ‘మరలాంటప్పుడు ఈ అవమానాన్ని మనమెందుకు భరించాలి’. శత్రువులకు లొంగిపోయినట్లుగా సంధిచేసే అవసరమెందు కొచ్చింది’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాజ్ఞను జవదాటలేను’ అని సమాధానమిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తో తాను సంభాషించిన తీరును తలచుకొని జీవితాంతం బాధపడేవారు. పాపపరిహారంగా ఎన్నో ఉపవాసాలు కూడా పాటించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. బానిసలెందరినో విముక్తుల్ని గావించారు. కానీ అప్పటికీ ఆయన మనస్సు కుదుటపడలేదు.
మహాప్రవక్త (నఅసం) హుదైబియా నుండి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ‘మేము, మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము’ అని అల్లాహ్ సందేశం అవతరించింది. అప్పటి వరకూ హజ్రత్ ఉమర్ (రజి)కు ఒడంబడికపై మనశ్శాంతి కలుగలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, అ స్పష్టమైన విజయమేమిటి?’ అని అడిగారు. హుదైబియా ఒడంబడిక నిస్సందేహంగా ఇస్లాంకు లభించిన విజయమేనని కొన్నాళ్ళ తరువాత అందరికీ తెలిసింది. ఒడంబడిక అనంతరం అరేబియాలో ముస్లింలకు-ముస్లిమేతరులకు మధ్య సంబంధాలు మెరుగైనాయి. మక్కా మరియు ఇతర అరబ్బు ప్రాంతాల వారు మదీనాకు వచ్చి పోయేవారు. సంబంధాలు పరస్పరం మెరుగుపడటం వల్ల ప్రజలకు ముస్లింల ఆచరణా వ్యవహారశైలుల్ని గమనించే అవకాశం లభించింది. వారి హృదయాలు నెమ్మదిగా అల్లాహ్ సత్యధర్మం వైపుకు మొగ్గసాగాయి. ఒడంబడిక రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ రెండు సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య, లోగడ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారికంటే అధికమే!
హుదైబియా ఒడంబడిక అనంతరం ఖైబర్ యుద్ధం జరిగింది. మదీనా నుండి బహిష్కరించబడిన యూదులు ఖైబర్ ప్రాంతంలో నివసించనారంభించారు. వీరు రోజుకొక ఉపద్రవం సృష్టించేవారు. కందక యుద్ధం కూడా వీరి మూలంగానే జరిగింది. ఖురైషీయులను ముస్లింలకు విరుద్ధంగా ప్రేరేపించింది కూడా యూదులే. కందక యుద్ధంలో ఓటమి చవి చూసిన తరువాత కూడా, వీరు తమ దుష్టకార్యకలాపాలను విడనాడలేదు. అందుచేత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ముస్లింలను యూదుల దుష్టపన్నాగాల నుండి ముక్తిని ప్రసాదించటానికై పదహారు వందల మంది సైనికులతో ఖైబర్ దిశగా ప్రయాణించారు. ఖైబర్ లో యూదులు పటిష్టమైన కోటలను నిర్మించారు. ఒక్కొక్కటిగా వాటినన్నింటినీ ముస్లింలు వశపరచుకున్నారు. కాని యూదుల ప్రముఖ యుద్ధవీరుడైన ‘మర్ హబ్’ అధీనంలో ఉన్న రెండు కోటలు మాత్రం ఇంకా జయింపబడలేదు. కోటను ముట్టడించమని హజ్రత్ ఉమర్ (రజి)కు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశమిచ్చారు.
కాని ఆయనకు విజయం లభించలేదు. రెండవసారి కూడా హజ్రత్ ఉమర్(రజి)ను పంపగా, ఈసారి కూడా సఫలీకృతులు కాలేకపోయారు. మూడవరోజు హజ్రత్ అలీ (రజి) ‘మర్ హబ్ ఓడించి కోటను వశపరచు కున్నారు. ‘మర్ హబ్’ మరణానంతరం యూదులు లొంగిపోయారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ భూమిని ముస్లింలకు పంచిపెట్టారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కూడా సస్యశ్యామలమైన కొంత భూమి లభించింది. దాన్ని ఆయన అల్లాహ్ మార్గంలో అంకితం చేశారు.
హుదైబియా ఒడంబడికను ఖురైషీయులు రెండేళ్ళ తరువాత ఉల్లంఘించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేలమంది సైనికులతో మక్కా వైపునకు పయనించారు. మార్గమధ్యంలో ఇతర తెగలు కూడా సైన్యంలోకి వచ్చి చేరాయి. మక్కాకు ఒక మైలు దూరంలో సైనిక బృందం విడిది చేసింది. కారుచీకటిని చీల్చడానికి సైనికులు మంటలు వేశారు. అనేక బృందాలు పెట్టిన వేర్వేరు మంటలతో ఎడారి ప్రాంతమంతా ఒక్కసారిగా జిగేలు మంది. మక్కా నుండి అబూసుఫ్యాన్ ఇద్దరు నాయకులతో పరిస్థితుల్ని సమీక్షించే నిమిత్తం బయలుదేరాడు. వెలుగుల్లో మునిగి తేలుతున్న ఇసుకపుడమిని వీక్షించి అబుసుఫియాన్ నివ్వెరపోయాడు. కాని అదే సమయంలో అతడు హజ్రత్ ఉమర్ (రజి) కంటపడ్డాడు. ఆయన అతని కథను కంచికి చేర్చాలనుకున్నారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి హజ్రత్ అబ్బాస్ (రజి) ఆయన్ను అడ్డుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరుపరచగా ఆయన అతనికి క్షమాభిక్ష ప్రసాదించారు.
మక్కావాసుల్లో పోరాట పటిమ ఇంకెక్కడిది? వారంతా తమ దురాగతాలకు గాను క్షమాభిక్ష కోరడానికి హాజరయ్యారు. వారి దుష్కర్మలన్నీ క్షమింపబడ్డాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రమాణాలు తీసుకునేప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. స్త్రీల వంతు వచ్చినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను ప్రమాణాలు తీసుకోమన్నారు. స్త్రీలు హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం చేశారు.
మక్కా జయింపబడిన తరువాత హునైన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అప్పటి వరకూ ఇస్లాం స్వీకరించని రెండు బలమైన తెగలతో ముస్లింలు తలపడవలసి వచ్చింది. ఈ యుద్ధంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు హజ్రత్ ఉమర్ (రజి) కూడా పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం తబూక్ సంగ్రామం జరిగింది. రోమ్ మరియు సిరియా దేశాలకు చెందిన క్రైస్తవులు మదీనా పట్టణంపై దండయాత్ర జరపనున్నారని వార్తలు వ్యాపించటంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మార్గమధ్యంలోనే నిలువరించాలని నిర్ణయించారు. ఆ సంవత్సరం అరబ్బులో కరువు ఏర్పడింది. అయినప్పటికీ సహాబీలందరూ తమ స్థోమతకు మించి విరాళాలు, ఒంటెలు, గుర్రాలు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రజి) తన సంపదలో సగభాగాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో సమర్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులతో తబూక్ ను సమీపించారు. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత క్రైస్తవులు దండయాత్ర జరపనున్నారన్న వార్త అసత్యమని తెలిసింది. ఈ సంఘటన జరిగిన ఒక ఏడాదికి ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. దీనినే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అంతిమ హజ్ యాత్ర’ అంటారు. ఈ సందర్భంలో కూడా హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే ఉన్నారు. ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేసి నేరుగా మదీనా చేరుకున్నారు. కొన్ని రోజుల తరువాత అస్వస్థతకు లోనయ్యారు. క్రమంగా ఆరోగ్యం క్షీణించసాగింది. ఈ అస్వస్థతతోనే తనువు చాలించారు అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం.
హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) హయాంలో
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చివరి కాలంలో వ్యాధిగ్రస్తులై ఉన్నా నమాజు చదివించేవారు. దినదినం ఆరోగ్యం క్షీణించటం వల్ల నమాజ్ చదివించడం కష్టతరమైపోయింది. అంచేత ఆయన హజ్రత్ అబూబకర్ (రజి)ను నమాజ్ చేయించమని కోరారు. హజ్రత్ అబూబకర్ (రజ), హజ్రత్ ఉమర్(రజ)ను నమాజ్ చదివించమన్నారు. హజ్రత్ ఉమర్ (రజ) నిరాకరించారు. పైగా ‘నమాజ్ చదివించడానికి మీరే అన్ని విధాలుగా అర్హులు, కాబట్టి మీరే నమాజ్ చదివించండి’ అని సలహా ఇచ్చారు. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొన్ని రోజులు అస్వస్థతకు లోనై ఉండి తుదకు ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మరణవార్తను హజ్రత్ ఉమర్ (రజి) విశ్వసించలేకపోయారు. కారుణ్యమూర్తి ఛాయ నిజంగానే ముస్లింలపై లేకుండా పోయిందా…? అని వాపోయారు. నలుదిశలా ప్రజలను ఆందోళనకర స్థితిలో చూసిన ఆయన ‘ప్రియప్రవక్త’ (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారని పలికిన వాని తల ఏకంగా ఖండిస్తాను’ అని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ‘అల్లాహ్ త్వరలోనే ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయన తిరస్కారులను, కపటులను శిక్షిస్తారు’ అని కూడా ప్రకటించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసం విన్న తరువాత ఆయన ఆవేశం చల్లారింది. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వార్త సత్యమని ఆయనకు అర్ధమైంది. హఠాత్తుగా గుండెపై పిడుగు పడినట్లయింది. కాళ్ళక్రింద నేల కదలినట్లయింది. ఒక్కసారిగా మూర్చపోయిన వానిలా నేలపై పడి పోయారు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. ఆయనకన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ ఆయన అగ్రశ్రేణి సహచరుల జాబితాలో పరిగణింపబడేవారు. కీలకమయిన సలహా సంప్రదింపులలో ఆయన పేరు ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) తరువాత హజ్రత్ ఉమర్ (రజి) పేరే సర్వత్రా వినవచ్చేది. ఆయన ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమీపబంధువులు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులలో ఒకరైన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హ) ఆయన పుత్రికే. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను ‘ఫారూఖ్‘ అని బిరుదిచ్చారు. (ఫారూఖ్ అంటే సత్యాసత్యాలను స్పష్టంగా వేరుపరచేవాడు అని అర్థం) అంచేత ‘ఫారూఖ్’ హజ్రత్ ఉమర్ (రజి) నామంలో మిళితమై హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి)గా వ్యవహరింపబడసాగింది.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ముస్లింలలో చీలిక వస్తుందన్న భయం పీడించింది. తమలో నుండే ఎవరినైనా ఖలీఫాగా నియమించాలన్న సంకల్పంతో అన్సార్లు ఒకవైపు సమావేశమయ్యారు. ఆ ఉత్కంఠభరిత వాతావరణంలో ముస్లింల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తకుండా హజ్రత్ ఉమర్ (రజి) అహర్నిశలూ కృషి చేశారు. ఆయన మరియు హజ్రత్ అబూబకర్ (రజి) కలిసి అన్సార్ (మదీనావాసులు) ల వద్దకు చేరుకున్నారు. అక్కడ హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసమిస్తూ హజ్రత్ ఉమర్ (రజి) పేరును ఖలీఫాగా ప్రతిపాదించారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘మీరుండగా నేనేవిధంగా ఖలీఫాగా కొనసాగుతాను’? అని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ (రజి)ను ఖలీఫాగా ఆమోదిస్తున్నట్లు ఆయన చేతిపై ప్రమాణాలు చేశారు. తరువాత ప్రజలందరూ ఆయన చేతిపై ప్రమాణం (బైత్) చేశారు.
ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సంభవించిన ముఖ్యసంఘటనలను ఎదుర్కొనటంలో హజ్రత్ ఉమర్ (రజి) సలహాలు కీలకపాత్ర వహించాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం అరబ్బులు అనేకులు “జకాత్” ఇవ్వడానికి నిరాకరించారు. కొందరైతే స్వయంగా తమను ప్రవక్తలుగా ప్రకటించుకున్నారు. మరి ఆ స్వకల్పిత ప్రవక్తల్ని అనేక తెగలు విశ్వసించాయి కూడా. జకాత్ ఇవ్వ నిరాకరించిన వారి పట్ల మృదువైఖరితో వ్యవహరించాలని సహాబాలు తమ మనోభావాల్ని వ్యక్తపరిచారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వారితో ఏకీభవించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఖురాన్ ఆధారంగా జకాత్ ప్రాముఖ్యాన్ని విడమరచి చెప్పిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఆయనతో ఏకీభవించారు. ఖురాన్ ఆదేశాన్ని విన్నప్పుడల్లా హజ్రత్ ఉమర్ (రజి) తన స్వంత అభిప్రాయాలను ప్రక్కనపెట్టి, తక్షణం తలవంచేవారు. ఇది ఆయన విధేయతాభావానికి ఒక మచ్చుతునక మాత్రమే.
హజ్రత్ ఉమర్ (రజి) స్వభావంలో ఆవేశం అధికమనిపిస్తుంది. చిన్నపాటి మాటలపై కూడా ఆవేశపూరితులై ఖడ్గాన్నే లేవనెత్తేవారు. హజ్రత్ అబూబకర్ (రజి) కాలంలో కూడా ఆయన ప్రవర్తనావళిలో ఎలాంటి మార్పులు గోచరించలేదు. హజ్రత్ అబూబకర్ (రజి) అస్వస్థతకు లోనై ఉన్నప్పుడు హజ్రత్ ఉమర్ (రజి)ను ఖలీఫాగా నియమించాలనుకున్నారు. ‘ఖలీఫా నియమకానికి ఆయన అన్ని విధాలా అర్హులే’ కాని ఆయనలోని కరకుదనం మాత్రం వాంఛించదగినది కాదు” అని సలహాదారులు కొందరు సూచించారు. ప్రస్తుత ఖలీఫాయైన మీ ముందే ఆయన మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తే, ఖలీఫాగా ఇంకా ఏం చేస్తారో అల్లాహ్ యెరుగు” అని అభిప్రాయపడ్డారు. దానికి అబూ బకర్(రజి) “నా మెతక వైఖరి కారణంగా ఆయన కఠినంగా ప్రవర్తించారు. ఖిలాఫత్ బాధ్యతలు గనక భుజాలపై పడితే మనసు దానంతట అదే మెత్తబడుతుంది” అని వారిని సముదాయించారు. నిజంగానే ఖలీఫాగా నియమింపబడిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి)లో ఆశించిన మార్పు వచ్చేసింది. అవును, బాధ్యత అటువంటిది మరి! అందునా అల్లాహ్ సమక్షంలో జవాబుదారుడినని భావించిన పరిపాలకుడాయె!!
ఖిలాఫత్
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పుడాయన వయస్సు ముఫ్ఫైమూడు. ఖలీఫాగా నియమించబడే నాటికి ఆయన వయస్సు యాభైమూడు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచర్యంలో పద్దెనిమిది సంవత్సరములు గడిపారు. ముఖ్యమైన యుద్ధాలన్నింటిలోనూ పాల్గొని హేమాహేమీలను సైతం గడగడలాడించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఆయనకు అమితమైన ప్రేమ, గౌరవము, ఆదరాభిమానమూను. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆయన ఎంతో ఆదరించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) సాధారణంగా బిగ్గరగా మాట్లాడేవారు. మహాప్రవక్త (సఅనం) సమక్షంలో హెచ్చుస్వరంతో మాట్లాడరాదని అల్లాహ్ ఆజ్ఞ అవతరించిన తరువాత, ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన మాట్లాడేదేమిటో కూడా అర్థమయ్యేదికాదు.
హజ్రత్ఉ మర్ (రజి) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు పొడవాటి మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు, నిరాడంబర జీవి. మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. అప్పుడప్పుడు రొట్టెలను నెయ్యి, తేనె, మాంసం, మరియు పాలతో తినేవారు. ముతక దుస్తులు ధరించేవారు. ప్రయాణీకుల మాదిరిగా తలపై టోపీ ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడ అతుకులు కూడా ఉండేవి. ఒకమారు కూఫా నుండి కొందరు ఆయన్ని కలవడానికి వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) కోసం వారెంతో నిరీక్షించారు. చివరకు ఆయన ఆలస్యంగా వచ్చారు. వంటిపై ఉన్న దుస్తులను ఉతికి, ఆరవేసి మరల ధరించేందుకు ఇంత ఆలస్యమైందని అప్పుడు తెలిసింది.
హజ్రత్ ఉమర్ (రజి) తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ లో భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వంలేని దయామూర్తి. ఒకమారు ఆయన ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: “ఒకప్పుడు నేను దీనావస్థలో ఉండేవాణ్ణి. ప్రజలకు నీళ్ళు తోడి అందించేవాడిని. వారు ప్రతిఫలంగా నాకు ఖర్జూరపు పండ్లు ఇచ్చేవారు. దానితోనే నా జరుగుబాటు అయ్యేది”. ఉపన్యాసమిచ్చి ఆయన వేదిక దిగగానే, ఒక వ్యక్తి “ఇలాంటి మాటలు ఉపన్యాసం’లో వ్యక్తీకరించడం సమంజసం కాదు” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ ‘ (రజి) “నా నైజంలో కించిత్ గర్వం తొంగిచూసింది. దాన్ని పారద్రోలటానికి నేను నా గతాన్ని నెమరువేసుకున్నాను” అని వివరణ ఇచ్చారాయన.
ఖలీఫాగా నియమింపబడక ముందు వ్యాపారమే ఆయన జీవనా ధారం. ఖలీఫాగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత భార్యాపిల్లల పోషణ కష్టతరమైపోయింది. ఈ విషయమై ఆయన సహచరులను పిలిచి సంప్రతించారు. “మీరు కూడా హజ్రత్ అబూబకర్ (రజి) మాదిరిగా అన్న పానీయాలు, వస్త్రధారణకవసరమైనంత ధనాన్ని కోశాగారం నుండి తీసుకోండి” అని హజ్రత్ అలీ (రజి) అన్నారు. ముస్లింలకు వారి శక్తియుక్తుల, ప్రతిభానైపుణ్యాల ఆధారంగా ఆయన ఉపకార వేతనాలను (భృతి) నిర్ధారించారు. ఉపకారవేతనాలను చెల్లించటంలో ముస్లింలు ఇస్లాంకు చేసిన సేవలను ఆధారంగా తీసుకొనేవారు. బద్ర్ సంగ్రామంలో పాల్గొన్నవారికి అధిక స్థాయిలో ఉపకారవేతనం ఉండేది. రెండవ స్థాయిలో ఉహద్ యుద్ధంలో పాల్గొన్నవారు ఉండేవారు. ఈ విధంగా అనేక భాగాలుగా చేసి ఆయన ఉపకారవేతనాలు చెల్లించారు. హజ్రత్ ఉమర్ (రజి) కంటే అధిక మొత్తంలో ఉపకారవేతనం పొందేవారు అనేకమంది ఉండేవారు.
మక్కానుండి హిజ్రత్ (వలస) చేసిన హజ్రత్ ఉమర్ (రజి), మదీనా పట్టణానికి మూడు మైళ్ళదూరంలో ఉన్న ఖుబా ప్రాంతంలో విడిదిచేశారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ఆయన ధార్మిక సోదరుడు. హజ్రత్ ఉమర్ (రజి) రెండు రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయ్యేవారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తాను వెళ్ళలేని రోజు హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ను పంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియమింపబడిన తరువాత మదీనాలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆయన నివాసం మస్జిదె నబవీ సమీపంలో ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) ఖలీఫా (అల్లాహ్ ప్రతినిధి)గా ఉన్న కాలంలోనే, ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసుల నాయకుడు) అని వ్యవహరించేవారు. ఖిలాఫత్ నిర్వహణలో హజ్రత్ ఉమర్ (రజి), అబూబకర్ (రజి) కు పూర్తి సహాయసహకారాలు అందించేవారు. కఠిన నిర్ణయాలెప్పుడైనా తీసుకోదలచి నప్పుడు సహాబాలందరి సలహాలు తీసుకొనేవారు. ఈ సమాలోచనా సభలో, ప్రజల్లో పలుకుబడి గల నాయకులను పిలిపించేవారు. వారిలో వృద్ధులు, యువకులు మరియు మధ్యవయస్కులు కూడా ఉండేవారు. అవసరాని కనుగుణంగా ఈ సమావేశాలకు మహాజిర్ లు, అన్సార్ లు మరియు సైనికాధికారులను కూడా ఆహ్వానించేవారు. ఈ సలహా సంప్రదింపుల సమావేశం సాధారణంగా ‘మస్జిదె నబవీ’లో జరిగేది. సలహామండలి సభ్యులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, నిర్ద్వంద్వంగా సలహాలు ఇచ్చేవారు. ఖలీఫా స్వయంగా ఏదైనా తప్పిదానికి లోనైతే ఆయన్ని అభిశంసించే అధికారం ప్రజలకు ఉండేది. ఆయన మండలాధికారుల పనితీరును నిశితంగా పర్యవేక్షించేవారు. అధికారులెవరైనా తప్పుడు కార్యాలకు పాల్పడినట్లయితే వారిని ప్రజలందరి సమక్షంలో శిక్షించేవారు.
‘గస్సాన్’ తెగకు చెందిన రాకుమారుడు ‘జబలాబిన్ ఏహమ్’ ఆస్తీ అంతస్తులుగల వాడు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో అతడు మదీనా వచ్చి ఇస్లాం స్వీకరించాడు. ఒకరోజు అతడు కాబాగృహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పల్లెటూరి వ్యక్తి అతని దుప్పటిని త్రొక్కినాడు. ‘ఏహామ్’ ఆగ్రహోదగ్రుడై ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటనపై హజ్రత్ ఉమర్ (రజి)కు ఫిర్యాదు అందింది. ఆయన ‘ఏహమ్’ను పిలిపించి ‘నీవు ఇతడికి చెంపదెబ్బ కొట్టావు, కాని ఇప్పుడు నీవు ఇతనిచేత చెంపదెబ్బ తినాలి’ అని అన్నారు. అప్పుడు ‘ఏహమ్” మా ఇద్దరి మధ్య భూమ్యాకాశాలంత తారతమ్యముంది అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “ధనిక పేదల మధ్య ఎలాంటి తారతమ్యాలకు ఇస్లాంలో తావులేదు. తప్పుచేసిన ప్రతి వ్యక్తీ శిక్షింపబడక తప్పదు” అని అన్నారు. ‘ఏహామ్’ ఆలోచించడానికి ఒకరాత్రి సమయం కావాలని విన్నవించుకున్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతని విన్నపాన్ని ఆమోదించారు. అతడు అర్థరాత్రి ఆ ప్రాంతం విడిచి పారిపోయాడు.
హజ్రత్ ఉమర్ (రజి) ముస్లింల విషయంలో చింతాగ్రస్థులై ఉండేవారు. వారిలో ఎవరికేదైనా నష్టం జరిగితే ఆయన మనస్సు బాధతో చివుక్కుమనేది. రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల పరిస్థితులను బేరీజు చేసేవారు. మదీనా పొలిమేరల్లో విడిదిచేసివున్న యాత్రీకుల స్థితిగతులను పర్యవేక్షించేవారు. ఒక సాధారణ సైనికుని మాదిరిగా రాత్రి మొత్తం గడిపేవారు. ఒకరాత్రి మదీనాకు కొంత దూరంలో ఒక గుడారంలో మండుటాగ్ని కనిపించింది. దగ్గరికి వెళ్ళిచూశారు. మంటకిరువైపులా నలుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు. విషయమేమని అడగ్గా తన పిల్లలకు ఎన్నో రోజుల నుండి తినడానికి తిండి లేదనీ, కుండలో నీళ్ళు పోసి పొయ్యిమీదుంచాననీ ఒక స్త్రీ వివరించింది. అది విన్న వెంటనే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాకు వెళ్ళారు. నెయ్యి, మాంసం, పిండి, మరియు ఖర్జూరపు పండ్లు తెచ్చి ఆ ముందుంచారు. ఆమె పిండితో రొట్టెలు చేసి పిల్లలకు తినిపించింది. హజ్రత్ ఉమర్ (రజి) వెళ్తుండగా ఆమె ఆయన్ను పిలిచి “హజ్రత్ ఉమర్ (రజి) స్థానంలో మీరు ఖలీఫాగా ఉంటే బాగుండు!” అని అంది. ఆమె పలుకులు హజ్రత్ ఉమర్ (రజి) హృదయాంతరాళాన్ని కుదిపివేసాయి. మరునాడు ఆమెను దర్బారుకు పిలిపించి పెన్షన్ ఇప్పించారు.
ఖలీఫాగా నియామకం జరిగిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) విలాసవంతమయిన విశ్రాంతితో కూడిన జీవితానికి ఆమడ దూరంగా ఉండేవారు. తన వద్ద ఉన్న మొత్తం సమయాన్ని ఖిలాఫత్ కార్యకలాపాల పై వెచ్చించేవారు. మస్జిద్లో కూర్చున్నా సహచరులతో సలహా సంప్రతింపులు జరిపేవారు. రోమ్ మరియు ఈరాన్కు సైనిక బృందాలు పంపించమని మస్జిద్ లోనే ప్రతిపాదనలు వస్తున్నాయి. సైన్యాధికారులకు ఉపదేశాలు పంపబడుతున్నాయి. అధికారులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించి మరీ లేచేవారు. నీటిబిందెలను భుజాలపై ఎత్తుకుని వితంతువులకు నీళ్ళందించేవారు. వారి దీవెనలు పొందేవారు. మస్జిదె నబవీలో ఐదు పర్యాయాలు నమాజు సారధ్యం వహించే బాధ్యత కూడా ఆయనపై ఉండేది. ఎలాంటి కార్యంలో నిమగ్నమై ఉన్నా నమాజ్ సమయానికి మస్జిద్ చేరుకొనేవారు. ఒకరోజు నమాజ్ చేయించి మస్జిద్ నుండి బయటకు రాగానే, ప్రజాధనం (బైతూల్ మాల్) నుండి ఒక ఒంటె పారి పోయిందని తెలిసింది. వెంటనే ఆయన దానిని వెదికేందుకు వెళ్ళిపోయారు. ఈ పనికోసం సేవకుడెవరినైనా పంపించవచ్చుగదా! అని ప్రజలు సలహా ఇవ్వగా ‘నేనే సేవకుణ్ణి’ అంటూ తన బాధ్యతలను గుర్తు చేసుకునేవారు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. పనిచేసి అలసిపోయినప్పుడు కటిక నేలపై మేను వాల్చేవారు. రాత్రి సమయాల్లో మస్జిదె నబవీలో ఇషా నమాజు చేయించాక, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు వెళ్ళేవారు. ఒక్కోసారి రాత్రంతా గస్తీలోనే గడిచిపోయేది.
ఇరాక్ – ఈరాన్ యుద్దాలు
ఆ కాలంలో అరబ్బు దేశానికిరువైపులా బలమైన సామ్రాజ్యాలు రెండు ఉన్నాయన్న అంశము గమనార్హం. ఒకవైపు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా వంటి మూడు ఖండాలలో విస్తరించియున్న రోము సామ్రాజ్యం ఉండగా, రెండవవైపు ఆసియా ఖండ అధిక భూభాగాన్ని ఆధీనంలో ఉంచుకున్న ఈరాన్ సామ్రాజ్యం ఉంది. ఈ రెండు సామ్రాజ్యాధిపతులు మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)జీవిత కాలంలోనే ముస్లింలతో కయ్యానికి కాలుదువ్వారు. హజ్రత్ అబూబకర్(రజి) హయాంలో అది యుద్ధ రూపాన్ని దాల్చింది. ఒకవైపు ముస్లింలు అనేక ప్రదేశాలనుండి ఈరానీయులను తరిమివేశారు. రెండవవైపు ముస్లింలు సిరియా, ఫాలస్తీనాలలో రోమన్ క్రైస్తవులను అంచెలంచలుగా ఓడించి పెద్ద భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. ‘యరమూక్’ యుద్ధం ముస్లింలకు క్రైస్తవులకు మధ్య జరిగిన యుద్ధాలలో పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) ఖిలాఫత్ చివరి కాలంలో ప్రారంభమైంది. యుద్ధం సమాప్తం కాకముంచే హజ్రత్ అబూబకర్ (రజి) మరణించారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈరాన్తో అనేక యుద్ధాలు జరిగాయి.
హజ్రత్ అబూబకర్(రజి) ఇరాఖైపై దండయాత్ర నిమిత్తం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)కు సైన్యం ఇచ్చి పంపారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్(రజి). మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు. అగ్రశ్రేణి సైన్యాధిపతి. “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను, ‘సైఫుల్లా” అను బిరుదుతో సత్కరించారు. సైఫుల్లా అంటే అల్లాహ్ ఖడ్గం అని అర్థం.
ఈయన ఇరాక్లోని కొంత భాగాన్ని జయించారు. తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) ఆయన్ను సిరియా వైపుకు పంపి, ఆయన స్థానంలో ఇరాక్ మరియు అరేబియా సరిహద్దు ప్రాంతవాసియైన, అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన ‘ముసన్నా బిన్ హారిస్ (రజి) ను సైన్యాధిపతిగా నియమించారు. ముసన్నా వద్ద ఉన్న సైన్యం చాలా తక్కువ. అంచేత ఆయన ‘హీరా’ నగరాన్ని జయించిన తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) సన్నిధిలో హాజరైనారు. హజ్రత్ ముసన్నా (రజి) హాజరైన రోజు హజ్రత్ అబూబకర్ (రజి) తీవ్ర జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. అయినా హజ్రత్ ఉమర్ (రజి) ను పిలిచి ముసన్నా (రజి) సహాయార్థం సైన్యాన్ని పంపవలసిందిగా ఆదేశించారు. ఆ రోజు సాయంకాలమే ఆయన పరమపదించారు.
హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం (బైత్) చేయటానికి మారుమూల ప్రదేశాల నుండి ప్రజలు వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) వారికి ఇరాక్ పరిస్థితులను వివరించారు. ధర్మయుద్ధం (జిహాద్) కోసం వారిని ప్రేరేపించారు. మొట్టమొదటగా సఖీఫ్ తెగకు చెందిన ప్రముఖ నాయకుడు ఇరాఖ్ వెళ్ళి ఈరానీయులతో పోరాడటానికి సంసిద్ధత వ్యక్తపరచాడు. తరువాత ప్రజలందరూ సన్నద్ధులయ్యారు. హజ్రత్ ఉమర్ (రజి), అబూ ఉబైదా (రజి)ను సైన్యాధిపతిగా నియమించారు. వారు ఇస్లామీయ సైన్యం విడిది చేసియున్న ‘హీరా’ ప్రాంతానికి బయలుదేరారు.
ఆ రోజుల్లో ‘పూరాన్ దఖ్త్’ ఈరాన్ మహారాణి. ఆమె తమకు కలిగే పరాజయ పరంపరకు కలవరం చెంది ‘ఖురాసాన్’ గవర్నర్ పుత్రుడైన ‘రుస్తుమ్’ ను పిలిచి రక్షణశాఖామంత్రిగా నియమించింది. ‘రుస్తుమ్’ రణనీతిలో ఆరితేరిన వాడు. పరాక్రమశాలి కూడానూ. అతడు రాయబారులను పంపి ప్రముఖ సర్దారులందరినీ సమావేశపరచాడు. ముస్లింలకు విరుద్ధంగా పోరాడమని వారిని ప్రేరేపించాడు. ఫలితంగా ముస్లింలు హస్తగతం చేసుకొన్న కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. పలు ప్రాంతాలు ముస్లింల చేజారిపోయాయి. అయినప్పటికీ రణరంగంలో ముస్లింలు, ఈరానీయులతో తలపడినప్పుడు ముస్లింలదే పై చేయి అయింది. వారు అనేక ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకున్నారు. ఈ వార్తలు ‘రుస్తుమ్’ కు తెలిసిన వెంటనే అతడు, ఈరాన్ దేశ జాతీయ పతాకం ‘దుర్ ఫిష్ కాదియాని’ తీసుకున్నాడు. ప్రజలు ఈ జాతీయ పతాకాన్ని అమితంగా గౌరవించేవారు. చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, ఈ జాతీయ జెండాపై బంగారం, వెండి, వజ్రాల వర్షం కురిపించేవారు. ఈ ధ్వజం చేబూనిన ప్రతీ యుద్ధం’లోనూ విజయం తమకే ప్రాప్తమవుతుందన్నది ఈరానీయుల దృఢ విశ్వాసం. “బహ్మన్” అనే ప్రముఖ నాయకుడికి ఈ పతాకమిచ్చి ముస్లింలతో సమరానికి పంపడం జరిగింది.
‘బహ్మన్’ నైలు నదీ తీరం చేరాడు. ఇటువైపు నుండి ‘హజ్రత్ అబూ ఉబైద్ సఖ్ ఫీ’ కూడా పయనించి నదికి రెండవ వైపు చేరుకున్నారు. నైలునదికి ఒక వైపున ముస్లింలు రెండవ వైపున ఈరానీయులు విడిదిచేశారు. ఇరుసైన్యాల మధ్య నదీ ప్రవాహం మాత్రమే అడ్డుగా ఉంది. “వీరు తీరం దాటి వస్తారా! లేక మేమే రావాలా?” అని బహ్మన్ ముస్లింలకు సందేశం పంపించాడు. ఈరానీయులనే నదీ దాటి రమ్మని సందేశం పంపమని ముసన్నా బిన్ హారిస్ మరియు ఇతర నాయకులు సలహా ఇచ్చారు. కాని ఔత్సాహికుడైన అబూఉబైదా (రజి) వారి సలహాను లెక్కచెయ్యక హడావిడిగా నదిపై వంతెన నిర్మించి సైన్యంతో సహా నదిని దాటేశాడు. చూడబోతే ఆవల వైపు యుద్ధ మైదానం మరీ ఇరుకుగా ఉంది. ముస్లిం సైనికులకు వెనక్కి తగ్గడానికి కూడా స్థలం లేదు. పైగా ఈరానీ సైన్యంలో ఏనుగులు అధికంగా ఉన్నాయి. మృదంగాలు, డప్పులు వాయిస్తూ ఈరానీ సైన్యం వడివడిగా ముందుకు కదులుతూ ఉంటే, నల్లమేఘాల్లా తమవైపు సమీపిస్తున్న ఏనుగులను చూసి ముస్లిం సైన్యంలోని గుర్రాలు బెదిరిపోయాయి. అబూఉబైదా (రజి) వెంటనే స్పందిస్తూ “ఏనుగులన్నింటినీ చుట్టు ముట్టి వాటి పగ్గాలను కోసేయమని” సైనికులను ఆదేశించాడు. ఒకప్పుడు భారతరాజు ఈరాన్ చక్రవర్తికి బహూకరించిన తెల్లటి ఏనుగు యుద్ధంలో ముందుకు దూసుకు పోసాగింది. అబూఉబైదా (రజి) ఆ ఏనుగుపై లంఘించి, ఒక వేటుతో దాని తొండాన్ని నేలకూల్చారు. గాయాలపాలైన ఏనుగు అదుపు తప్పి ఆగ్రహావేశాలతో అబూ ఉబైదాను పడవేసి, ఉదరభాగంపై కాలు వేసి నలిపివేసింది. అబూఉబైదా (రజి) అక్కడికక్కడే ‘కన్నుమూశారు. ఆయన సోదరుడు సైనిక ధ్వజాన్ని చేతపట్టుకున్నారు. తుదకు ఆయన కూడా హతులయ్యారు. అంతలో శత్రుసైనికుడు ముస్లింలు పారిపోకుండా వంతెనను కూల్చివేశాడు. యుద్ధ మైదనంతో బెదిరిపోయిన ఏనుగులు వీరవిహారం చేశాయి. మారణహోమం రేకెత్తించాయి. ఒక్క ముస్లిం సైనికుడు కూడా ప్రాణాలతో మిగులుతాడా అన్న ఆందోళన కలిగింది. ఈ పరిస్థితులను వీక్షించిన ‘ముసన్నా (రజి)’ వెంటనే సైనిక పగ్గాలు తన ఆధీనంలో తీసుకున్నారు. ఒక వంక వంతెన మరమ్మత్తుకు వెంటనే కొంత మందిని పంపారు. మరోవంక మిగిలిన సైన్యంతో ఈరానీ సైన్యాన్ని చుట్టుముట్టారు. ఎట్టకేలకు సైనికులు నది దాటటంలో సఫలమయ్యారు.. నది దాటిన పిదప సైనికులను గణించగా మొత్తం తొమ్మిది వేలమందిలో కేవలం మూడు వేల మంది మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగు వేల సైనికులు సమరభూమిలో స్వర్గసీమకు చేరుకున్నారు. దాదాపు రెండువేల మంది సైనికులు పారిపోయ్యారు. యుద్ధభూమి నుండి వెనుదిరిగిన సైనికులు సంవత్సరాల పాటు ముఖాలు చాటేసుకొని తిరిగారు. కొంతకాలం తరువాత వైలు నదీ తీరాన మరొకసారి యుద్ధం జరిగింది. అప్పుడు ‘మహరాన్’ ఈరానీ సైన్యానికాధిపత్యం వహించాడు. ముస్లిం సైన్యానికి ‘హజ్రత్ ముసన్నా బిప్ హారిస్ (రజి)’ సారథ్యం వహించారు ముసన్నా (రజి) నది దాటి యుద్ధం చేయడానికి బదులు ఈరానీయులనే నది దాటి రమ్మని కబురంపారు. ఈ యుద్ధంలో ఈరానీయులు పెద్ద సైనిక బలగాలతో రంగంలోకి దూకారు, మహాబీభత్సం సృష్టించిన ఈ యుద్ధంలో ముస్లింలదే పై చేయి అయింది.
పరాభవాన్ని మూటగట్టుకుని ఈరానీయులు తిరోగమించారన్న వార్తలు ఈరానీ రాజధాని ‘మదాయన్’ వరకు వ్యాపించాయి. అప్పుడు ఈరానీ నాయకులు, ఐశ్వర్యవంతులందరూ కలసి యువకిశోరుడైన ‘యజ్ద్ గిర్ద్’కు రాజ్యాధికారం కట్టబెట్టారు. అతడు రాజ్యాధికార బాధ్యతలు స్వీకరించగానే ఈరానీయులలో పోరాటపటిమ, పరాక్రమశక్తులు పదింతలు పెరిగాయి. తమ జాతి గౌరవాన్నీ నీలబెట్టుకొనేందుకు వారు రేయింబవళ్లు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ ముసన్నా (రజి)కు అరబ్బు సరిహద్దు ప్రాంతాలకు తిరిగి రమ్మని సందేశం పంపారు తరువాత ఆయన కూడా సైనిక సమీకరణకు ఉపక్రమించారు. హజ్ కాలం కావటం వల్ల సులభంగా విశాల సైన్యం సమకూరింది. హజ్రత ఉమర్ (రజి) స్వయంగా ఈ సైన్యంతో బయలుదేరాలని సంకల్పించుకున్నారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాలో ఉండడం చాలా అవసరమని సహచరులు సలహా ఇచ్చారు. చివరకు ‘హజ్రత్ సాద్ బిన్ వఖాస్’ (రజి)ను సైనికాధికారిగా నియమించి ఈరాన్ పంపారు. కాని హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ఈరాస్ చేరకముందే హజ్రత్ ముసన్నా (రజి) కన్ను మూశారు. వంతెన యుద్ధంలో ఆయనకు తగిలిన గాయాలు తిరగదోడాయి. కడకు ఆయన ఆ బాధతోనే తనువు చాలించారు.
హజ్రత్ సాద్ (రజి) ముప్ఫైవేల మంది సైనికులతో వచ్చారు. ఆయన్ని ప్రతిఘటించడానికి ‘రుస్తూమ్’ విశాలమైన సైన్యంతో ఎదురువచ్చాడు. అతని శిరస్సుపై దుర్ ఫిషే జాతీయ పతాకం రెపలాడుతూ ఉంది. అతని వెనుక పెద్ద పెద్ద సర్దారుల బృందం కూడా ఉంది. వారిలో ప్రముఖ నాయకుడైన ‘బహిమన్’ కూడా ఉన్నాడు ఇతడు వంతెన యుద్ధంలో ఈరానీ సైన్యాధిపతిగా ఉన్నాడు. “ఖాదసియా” మైదానంలో శత్రు సైన్యాలు ముఖా-ముఖి అయ్యాయి. ‘రుస్తుమ్’ భారీ సైన్యాన్ని వెంట బెట్టుకొని పచ్చినప్పటికీ యుద్ధాన్నారంభించడానికి సాహసించలేకపోయాడు. కారణం అంతకు ముందు ఎదురయిన చేదు అనుభవమే. అందుకేనేమో సంధి కోసం సన్నాహాలు ప్రారంభించాడు. చాలా రోజుల వరకు ఇరుపక్షాల తరపున రాయబారాలు నడిచాయి. అనశ్చితస్థితి నెలకొన్నది. కాని ఫలితం శూన్యం. ఇరువురి మధ్య ఒడంబడిక కుదరలేదు. యుద్ధ మేఘాలు ఆవరించాయి. సరిగ్గా అదే సమయంలో ‘సాద్ బిన్ వఖాస్’ (రజి)ను అనారోగ్యం చుట్టుముట్టింది. కనీసం రెండడుగులు ముందుకు వేసి నడవలేని స్థితిక ఆయన ఆరోగ్యం క్షీణించింది. అంచేత ఆయన (ముస్లింల అధీనంలో ఉన్న) ఒక కోటపై కూర్చొని ఉండేవారు. అక్కడి నుంచే సూచనలు ఒక కాగితంపై వ్రాసి రాయిలో చుట్టి కోటపైనుండి పడవేసేవారు. దాని ప్రకారమే సైన్యం తమ రణనీతిని రూపొందించుకునేది.
ఆ కాలపు యుద్ధ నియమ నిబంధనల ప్రకారం ఇరువైపుల నుండి సైనికులు ఒక్కక్కరూ మైదానంలో దిగేవారు. వారిద్దరి మధ్య చాలాసేపు పోరాటం జరిగేది. తరువాత రెండు సైన్యాలు యుద్ధానికి దిగేవి, ఖాదసియా మైదానంలో కూడా యుద్ధం ఇదే విధంగా జరిగింది. మొదట ఈరానీ సైన్యం నుండి యుద్ధవీరుడొకడు మైదానంలో దిగి, ప్రతిపక్ష సైనికుడిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. ముస్లిం సైన్యం నుండి జుబైద్ తెగ నాయకుడైన ఉమరి ఎన్ మాదీకర్బ్ (రజి) అతనితో తలపడ్డారు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. చివరకు అతడు నేలకొరిగాడు. ఇదే విధంగా చాలాసేపు ఇరువైపుల నుండి యుద్ధవీరులు ఒంటరి పోరాటం సాగించారు. తరువాత ఈరానీయులు సైన్యంతో సహా ముందుకురికారు. వారి ఏసుగులు స్వైర విహారం చేయసాగాయి. వాటిని చూచి ముస్లిం సైన్యపు గుర్రాలు బెదిరిపోయాయి. సాద్ బిన్ వఖాస్ (రజి) ఇస్లామి సైన్యం వైపు నల్లమేఘాల్లా దూసుకెళుతున్న ఏనుగులను నిరోధించమని ‘అసద్’ తెగ నాయకుడిని ఆదేశించారు. ఆయన బాణసంచారులను కొందరిని తీసుకొని పెనుతుఫాను సృష్టిస్తున్న మదపుటేనుగులను ఆపారు. ‘తమీమ్’ తెగకు చెందిన యోధులు గుర్రాల నుండి దిగి బాణాల వర్షం కురిపించారు. బీభత్సం సృష్టిస్తున్న ఈ యుద్ధ పరిణామాలు తలకముందే సూర్యుడు తలదాచుకున్నాడు. యుద్ధ మైదానమంతా అంథకారం అలముకుంది. సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోయాయి.
రెండవ రోజు ఇంకా యుద్ధం మొదలవలేదు. అంతలోనే ఒక వైపు నుండి ధూళి లేపుతూ సైనిక బృందం ఒకటి దావడం అందరూ గమనించారు. సైనికుల ఖడ్గమొనలు, ఈటెలకొనలు కాంతి పరావర్తనం వలన నక్షత్రాల మాదిరిగా మెరుస్తూ కనిపించాయి. ఈరాన్ నుండి సైన్యం వచ్చిందని కొందరు భావించగా, మదీనా నుండి సైన్యం అడుగిడిందని మరికొందరు తలంచారు. వారందరూ ఈ ఊహాగానాల్లోనే నిమగ్నమై ఉండగా వార్తాహరులు కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి “సిరియా ఇస్లామీ సైనిక నాయకుడైన ‘హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి) హాషియ్ లిన్ ఉత్ప(రజి) మరియు ఖాఖాన్ బిస్ అమ్ (రజి)’ సారధ్యంలో ఆరువేల సిపాయిలు తరలి వచ్చాయ”ని చెప్పారు. ‘ఖాఖాన్ బిన్ అమ్రి'(రజి) సమత స్థలానికి చేరిన ముందే నెంగినే యుద్ధంలో ఈరాని సైనికులకు నాయకత్వం వహించిన నాయకుడు ‘బహీమని’ ఆయనత పోరాటానికి దిగాడు. తనను ఎదురించే ప్రయత్నం చేసేవాడు ‘బహిమన్’ అని తెలిసిన ‘ఖాఖాన్ (రజ) అతనిపై విరుచుకుపడి ప్రత్యర్ధిని ఉక్కిది బిక్కిరి చేశాడు. ఖడ్గ పోరాటంలోని మెళకువలన్నింటిని ‘బహిమస్’ ప్రయోగించాడు. కాని ఆకస్మాత్తుగా అతనిపై పడిన ఒక్కవేటుకు చేయి తెగిపడింది. ఇటు ఇస్లామీ సైన్యం అల్లాహు అక్బర్’ అని నినాదాలు చేయసాగింది. యుద్ధమైదానమంతా ఈ నినాదాలతో మ్రోగిపోసాగింది. ఈధానీ సైనికుల గుండెల్లో దడ పెరిగింది. వారి ముఖాలపై విషాద ఛాయలు గోచరించసాగాయి. ఇరుసైన్యాల మధ్య భీకర యుద్ధం ప్రారంభమయింది. యుద్ధ మైదానంలో ఈరానీయుల ఏనుగులు గందరగోళాన్ని సృష్టించాయి. ఏనుగుల కోలాహలానికి గుఱ్ఱాలు బెదిరి అదుపు తప్పాయి. ‘ఖాఖాన్ బిస్ అమ్'(రజి) దీనికి విరుగుడు కని పెట్టారు. ఒంటె వీపులపై ఉయ్యాలను కట్టించి, నల్లటి ముసుగును దానికి తొడిగించాడు. ఒంటె వీపులపై ఉన్న విచిత్ర ఉయ్యాల వలన ఒంటెలు భయంకర విచిత్ర జంతువులుగా కనిపించాయి. వాటిని చూచి ఏనుగులు భయపడి చెల్లా చెదురైనాయి.
ఖాదసియా యుద్ధం మూడు రోజులపాటు జరిగింది. మూడవరోజు యుద్ధపు తుది ఘట్టం. ‘ఖాఖాన్’ (రజి) రాత్రిపూట కొంతమంది సైనికులను అడవిలో దాచి ఉంచారు. ఉదయం యుద్ధం ప్రారంభం కాగానే నందమంది సైనికుల బృందం ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తూ రణరంగంలోకి దూకింది. సిరియానుండి మరో సైనిక పటాలం వచ్చిందని అందరూ తలంచారు. దైవ కృష్ణవలన ఆ రోజు ఏడొందల సైనికుల బలగమొకటి వచ్చింది. ఆ రోజు ఈరావీయులు తమ సైన్యానికిరువైపులా ఏనుగులను నిలబెట్టి ఉంచారు. ‘అమ్రూ మాది కర్స్ (రజి), ‘ఖాఖాన్ (రజి) మరియు ‘ఆసిమ్ ‘ (రజి) శరీరదారుడ్యంగల రెండు ఏనుగల వైపు గురిపెట్టారు. వాటిలో ఒకటి శ్వేతగజము కాగా రెండవది నలుపు రంగు ఏసుగు. హజ్రత్ ఆసిమ్ (రజి) తెల్ల ఏనుగుపై ఈటెతో దాడిచేసి, దాని రెండు కళ్ళూ పనికిరాకుండా చేశాడు. ‘ఖాఖాన్ (రజి)’ ఒక్క వేటుతో దాని తొండాన్ని సరికివేశాడు. నల్ల ఏనుగులు గాయాలపాలై ఫారిపోసాగాయి. వారు తమ ఇతర నాయకులతో కలసి ఇతర ఏనుగులపై కూడా దాడి జరిపారు యుద్ధభూమినుండి వాటినన్నింటినీ పారద్రోలారు. అదుపుతప్పి పరిగెత్తే గజగాములు అడ్డువచ్చిన వారినందరినీ తొక్కుకుంటూ వీరవిహారం చేశాయి.
అంతే! ఈరానీ సైన్యంలో కలకలం మొదలయింది. ఆ తరుణం లోనే సూర్యాస్తమయం జరిగింది. యుద్ధనిబంధనల ప్రకారం రెండు సైన్యాలు యుద్ధాన్ని ఆపి తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోవాలి. కాని ముస్లింలు అటో- ఇటో తేల్చుకోవాలని శపథం చేసుకున్నారు. నడిరేయి చీకట్లో, చంద్రుని వెలుగునీడల మధ్య ఖర్గ విన్యాసాలు జరగసాగాయి. తన శిరస్సుపై ఈరానీ జాతీయ పతాకం తగిలించుకొనిన ‘రుస్తూమ్’ యుద్ధమైదానంలో ఉన్నంత వరకూ, ఈరానీయులు సమరభూమి నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరని ముస్లిం సైనికాధికారులకు తెలుసు. ఖాన్ బిన్ అమ్రూ(రజి)). ‘మాదీకర్స్ (రజి)’, ‘అష్తోత్ (రజి)’ మరియు ‘ఆసిమ్ (రజి)’లు అశ్వరూఢులై రుస్తుమ్ విడిదిచేసి ఉన్న దిశగా పయనించారు. ముస్లిం నాయకులు తనవైపుకే దూసుకురావడాన్ని గమనించిన ‘రుస్తూమ్’ అప్పటికప్పుడే ఖడ్గాన్ని తీసి పోరాటానికి సిద్ధం అయ్యాడు. క్షతగాత్రుడై ప్రాణభయంతో పలాయనం చిత్తగించాడు. దారిలో ఒక పెద్ద కాలువ వచ్చింది. ఎలాగయినా దాన్ని ఈదుకుంటూ అవతలివైపుకు చేరుకోవచ్చని ఆశించాడు. కాని హిలాల్ (రణి)’ అనే సిపాయి అతన్ని వెంబడించి అతని కథను కంచికి చేర్చారు.
‘రుస్తుమ్’ మరణంతో ఈరానీ సైన్యంలో ఆత్మ విశ్వాసం పదలి విషాదఛాయలు అలముకున్నాయి. వారు మానసికంగా కృంగిపోయారు. ముస్లిం సైనికులు వేల సంఖ్యలో ఈరానీ సైనికులను హతమార్చారు. విజయం ముస్లింలను వరించింది. ఇరాఖ్ లో ఈరానీయుల పెత్తవానికి చరమగీతం పాడబడింది. ఈరాన్ రాజధాని ‘మదాయన్’పై విజయం ఈ యుద్ధంలోని ప్రధాన ఘట్టం. ఈ ప్రదేశము దజీలా’ తీరాన ఉండేది. తురానీయులు దజలానటిపై గల వంతెనను కూల్చివేశారు. ఓడలను కాల్చివేశారు. ఈ పరిస్థితిని వీక్షించిన సాద్ బిస్ సఖాన్ (రజి) అగ్రహావేశంతో నదీప్రవాహాన్ని చీల్చుతూ గుర్రాన్ని నదిలో పరుగెత్తించారు. సైన్యాధిపతి శౌర్యం చూచిన మిగిలిన సైనికులు కూడా ఆయస్ను అనుసరించారు. ‘సాద్ బిన్ ఖాస్’ (రజి) సారథ్యంలో ముస్లిం సైన్యం సదీప్రవాహాన్ని చీల్చుకుంటూ వస్తున్న అపురూప దృశ్యం తిలకించిన శత్రుసైనికులు ఆశ్చర్యచకితులయ్యారు. మానవ మేధస్సుకు అందని ముస్లింల అపురూప విన్యాసాన్ని చూచిన ఈరానీయులు… వీరు మానవులు కారు… దయ్యాలు, భూతాలై ఉంటాయి. వీరితో యుద్ధం అసంభవం’ అని తలంచి యుద్ధమైదానం నుండి పారిపోయారు. ఇలా ఒక్క విజయంతో దాదాపు ఈధాన్ ప్రాంతాలన్నీ ముస్లింల వశమైనాయి. కాని ‘ఈరాన్’ ఇంకా మిగిలే ఉంది హజ్రత్ ఉమర్ (రజి) తరపునుండి ‘ఈరాస్’ పై దాడికి సంబంధించిన ఎలాంటి సంకేతం రానందున ముస్లింలు ఆగిపోయారు.
ముస్లింలు ఈరాస్పై దండెత్తినప్పుడు ఈరానీయుల్లో ఐకమత్యం అంతంత మాత్రమే. కాని అరబ్బులు సంఘటితంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముస్లింలతో పారాటం జరిపిన వారిలో ఈరానీయులు బలమైనవారు. వారిలో జాత్యాభిమానము అమితంగా ఉండేది. దానితోపాటు వారివద్ద యుద్ధ సామగ్రికి ఎలాంటి కొదువ లేకుండింది. యుద్ధపు టేనుగులు, గుర్రాలు వారి వద్ద అధికంగా ఉండేవి. ప్రత్యేకంగా ఏనుగులు విధ్వంసాన్ని సృష్టించేవి. అడ్డువచ్చిన వారందరినీ అని మసలి వేసేవి. పైగా ఏనుగుల నీవులపై లోహపు పల్లకీలు కట్టబడియుండేవి. వాటిలో బాణాసంచారులు కూర్చొని బాణాల వర్షం కురిపించేవారు. ఈ పల్లకీలు ఒక విధంగా చెప్పాలంటే సడిచే విధ్వంస వాహనాలు. ఇటు ఏనుగులు యుధ్ధమైదానంలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటే ఈరానీయులు యుద్ధంలో చెలరేగిపోయేవారు. వారికి విరుద్ధంగా ముస్లిం సైనికులు యుద్ధాల్లో ఖడ్గాలు మరియు ఈటెలు అధికంగా ఉపయోగించేవారు. గాయాలబారిన పడకుండా కొందరు చర్మపు కవచములు తొడిగేవారు. ముస్లిం సైనికులలో అధికులు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో పోరాడేవారు. ముస్లిం సైనికులు యుద్ధ భూమిలో నిరాయుధులై ఉన్నప్పటికీ, దైవకృపవలన వారు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో, లోహపు ఈటెలను ముక్కలు, ముక్కలు గావించారు. ముస్లింలు ఉపయోగించే బాణాలు కూడా పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. వాస్తవమేమిటంటే…. ముస్లింలు సాధించిన విజయగాధలు సైనిక బలగాలు, ఆయుధ పరిమాణాలపై ఆధారపడిలేవు. కేవలం వారు విశ్వాస ప్రతిష్ఠ, దైవనిష్ఠల ద్వారానే విజయం సాధించారు. వారు మృత్యువుకు భయపడేవారు కాదు. అరచేతిలో ప్రాణముంచుకొని యుద్ధంలో దిగేవారు. పరిణామం తేల్చుకోవాల్సినప్పుడు గుర్రం వీపులపై నుండి దుమికి వీరోచితంగా పోరాడేవారు. వీరగతి ప్రాప్తికొరకు సైనిక బలగాలపై ఊడిపడి పంక్తులకు పంక్తులే నేలమట్టం చేసేవారు.
ప్రముఖ సేనాని ‘ముసన్నా బిన్ హారిస్ (రజి)’ ఇస్లాం స్వీకరణకు ముందు ఇలా అనేవారు. “ఒకప్పుడు పదిమంది అరబ్బు సైనికులు, ఒక్కో ఈరానీ సైనికుని ముందు నిలబడడానికి సాహసించే వారు కాదు…. కాని ఇప్పుడు పదిమంది ఈరానీ సైనికులకు ఒక అరబ్బు సైనికుడు చాలు”. అదీ ‘విశ్వాసం’ (ఈమాన్) ప్రసాదించిన బలం!
సిరియా మరియు ఈజిప్ట్ సంగ్రామాలు
ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండ భూభాగాలను కలుపుకొని బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది రోమ్ సామ్రాజ్యం. ఆసియా ఖండంలోని సిరియా, పాలస్తీనా, సరిహద్దు ప్రాంతాలు ఈ సామ్రాజ్య అధీనంలో ఉండేవి. ఈజిప్ట్ మరియు ఆఫ్రికా ఖండ సరిహద్దు ప్రాంతాల అధిక భూభాగం కూడా రోమనుల అధీనంలోనే ఉండేది. ఇది కాకుండా ఐరోపా ఖండం కూడా రోమనుల ఆధీనంలోనే ఉండేది. రోమన్ క్రైస్తవులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవనకాలం నుండే పోరాటాలు ప్రారంభించారు. ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) హయాంలో ఈ పోరాటాలు తీవ్రరూపం దాల్చాయి. ముస్లింలు ఆ రాజ్యపు అధిక భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. రోమన్ క్రైస్తవులు, ముస్లింలకు మధ్య జరిగిన సమరాల్లో ‘యరమూక్’ యుద్ధం అతి పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) జీవితపు చివరి కాలంలో ప్రారంభమై ఆయన మరణాంతరం హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముగిసింది. యరమూక్ యుద్ధంలో, రోమనులు రెండు లక్షల పైచిలుకు సైన్యంతో సన్నద్ధమై వచ్చారు. వారితో పోల్చినట్లయితే ముస్లిం సైన్యం కేవలం ఐదవ వంతు మాత్రమే అయినప్పటికీ యుద్ధ మైదానంలో ముస్లింలదే పై చేయి అయింది. రోమనుల శక్తియుక్తులన్నీ పటాపంచలై పోయాయి. ఇక మీదట వారు ముస్లింలకు వ్యతిరేకంగా విశాల సైన్యాన్ని సమకూర్చుకోటానికి సాహసించలేకపోయారు. హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సిరియా ఇస్లామీ సైన్యాధిపత్య బాధ్యతలు ‘హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)’ అధీనంలో ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా ఎన్నికయిన తరువాత హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి)ను, ఖాలిద్ బిన్ వలీద్ (రజి) స్థానంలో సైన్యాధిపతిగా నియమించారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) ప్రతిభా నైపుణ్యం గల అగ్రశ్రేణి సైనికాధికారి. సమరభూమిలో శత్రు సైనికులను చిత్తు చేయడంలో ఆయన ఆరితేరిన దిట్ట. అయితే, ఆయన మితిమీరిన ఆవేశంతో ముస్లిం సైనికుల ప్రాణాలనిరకాటంలో పెడతారేమోనన్న ఆలోచన హజ్రత్ ఉమర్ (రజి)ను వెంటాడుతుండేది. హజ్రత్ అబూఉబైదా (రజి) ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన సహాబాలలో ఒకరు. పైగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సన్నిహితులు కూడాను, ఆయన కనికర హృదయం గలవారు. ఆచితూచి అడుగువేసి ముస్లింల ప్రాణాలకు అపాయం కలుగకుండా యుద్ధ సన్నాహాలు చేసేవారు. హజ్రత్ అబూఉబైదా (రజి) ఎల్లప్పుడూ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)తో సంప్రదిస్తూ ఉండేవారు. యుద్ధ మైదానంలో సైనికులు మోహరించే స్థానం సులభంగా విజయం సాధించటానికి శత్రుసైన్యపు ఏ భాగంపై గురి పెట్టాలి – ఇత్యాది నిర్ణయాలన్నీయు ఖాలిద్ బిన్ వలీద్ తో సలహా సంప్రదింపులు జరిపిన తరువాతనే తీసుకోబడేవి.
యర మూక్ యుద్ధంలో ఈరానీయులను ఓడించిన తరువాత ముస్లింలు డెమాస్కస్ నగరం వైపు పురోగమించారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ నలువైపుల నుండి ముట్టడించారు. ఒకరోజు ‘క్రైస్తవ సైన్యాధికారి ఇంట పుత్రుడు జన్మించాడన్న వార్త ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కు అందింది. ఈ సందర్భంలో నగర ప్రముఖులందరూ అతని భవనంలో విందు జరుపుకోవడానికి వచ్చారు. క్రైస్తవులు రక్షణార్థం తమ నగరం చుట్టూ కందకాలు త్రవ్వి వాటిని నీటితో నింపి యుంచేవారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కందకాన్ని ఈదుకుంటూ పోయి త్రాడు సహాయంతో ప్రహరిగోడపై ఎక్కిపోయారు. లోనికి దుమికి నగర ప్రముఖ ప్రవేశద్వారాన్ని తెంచారు. అంతలోనే ఇస్లామీ సైన్యం మొత్తం నగరంలోనికి ప్రవేశించింది. అప్పటికి క్రైస్తవ సైన్యాధికారులు మత్తులో మునిగి కదలలేని స్థితిలో పడి ఉన్నారు. వారెవ్వరూ యుద్ధానికి సాహసించలేదు. కొద్దిసేపటికి వారు ‘శరణం’ ‘శరణం’ అన్న నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. ఈ విధంగా ముస్లింలు డెమాస్కస్ నగరాన్ని సులభంగా జయించగలిగారు. ‘డెమాస్కస్ ‘ తరువాత సిరియా దేశ ప్రముఖ నగరాలు ఒక్కొక్కటీ ముస్లింల అధీనంలోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటనలు కూడా జరిగాయి. ఈ యుద్ధాల్లో ‘అజ్ నాదీన్ ‘ యుద్ధం అత పెద్దది. ఈ ప్రాంతం క్రైస్తవ నాయకుల పట్టులో ఉండేది. పైగా అక్కడి నాయకుడు రణనీతిలో సాటిలేని మేటి. కాని ఈ యుద్ధంలో అతని ప్రతిభా నైపుణ్యాలేవీ పనికి రాకుండా పోయాయి. క్రైస్తవులకు ఘోర పరాజయం చవిచూడవలసి వచ్చింది. ఈ నగరాన్ని జయించిన తరువాత ముస్లిం సైనికులు ‘బైతుల్ మఖ్దిస్ ‘ను ముట్టడించారు.
ఈ నగరం దైవ ప్రవక్తల జీవిత విశేషాలకు నిలయం. యూదులు, క్రైస్తవుల మాదిరిగా ముస్లింలు కూడా ఈ నగరాన్ని పవిత్రమైనదిగా తలపోస్తారు. క్రైస్తవులు ‘బైతుల్ మఖ్దిస్’ను ముస్లింలకు అప్పగించటానికైతే అంగీకరించారు కాని, వారు హజ్రతీ ఉమర్ (రజి)ను స్వయంగా విచ్చేసి వాగ్దాన పత్రం పై సంతకం చేయాలని షరతు విధించారు.
హజ్రత్ ఉపుర్ (రజ) తన స్థానంలో హజ్రత్ అలీ (రజి)కి కార్యబాధ్యతలు అప్పగించి ‘బైతుల్ మఖ్దిస్’కు పయనించారు. ఆయన వెంట ఎలాంటి సైనిక బలగాలు లేవు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాన్నిధ్యంలో జీవనం గడిపిన కొందరు వృద్ధ వయస్కులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఆ చిన్నపాటి బృందాన్ని తిలకించడానికి ఆబాల గోపాలమంతా తరలి వచ్చింది. తమ చక్రవర్తుల దర్పాన్ని మందీ మార్బలాన్ని తిలకించే సిరియా ప్రజానీకం ఈ సాధారణ మానవ సమూహాన్ని చూచి ఆశ్చర్యపోయింది. స్వయంగా ఖలీఫా ఆధిపత్యం వహించే ఈ బృందంలో డప్పు వాయిద్యాలుగానీ, నర్తకీలుగానీ, భజనపరులుగానీ ఎవరూ లేకపోవడంతో సిరియా ప్రజానీకం నివ్వెరపోయింది. మరి అదే రోమన్ రాజులు ప్రయాణించేటప్పుడు రాజు వాహనానికి కిరువైపులా సైనిక సమూహాలు, ఖడ్గం చేతపట్టుకొని పట్టువస్త్రాలు ధరించినవారు ఒకవైపు ఉండగా, ఊరేగింపు ముందు భాగంలో ‘పిల్లలు జరగండి’. రాజు గారొస్తున్నారు. అని నివాదం చేసే నినాదకర్తలు మరియు వెనుక భాగంలో తినుభండారాలు, టెంటులను మొదలగు వాటిని మోసుకు వస్తున్న ఒంటెలు ఉండేవి. రాజ వాహనం తిష్టవేసిన ప్రదేశమంతా ఒక నగరంగా వెలసి పోయేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) సారధ్యంలో వచ్చినవారు ముతక దుస్తులు వేసుకొని ఉన్నారు. వాటిపై చర్మపు అతుకులు ఉన్నాయి. యాత్రీకులు ధరించే టాప్ ఒకరు ధరించి యుండగా, మరికొందరు తలపాగా కట్టుకొని ఉన్నారు. వస్త్రధారణరీత్యా వారిలో రాజెవరో, రైతెవరో తెలియని పరిస్థితి। వారు దిగినచోటనే గుడారములు కట్టారు. ముందుగా ‘వుజ’ చేసి ‘అజాన్’ ఇచ్చారు. నమాజ్ చేశారు. అనంతరం సంచుల నుండి తినుబండారాలు బయటకు తీసి సహపంక్తి భోజనం చేశారు. భోజనంలో పిండి. కొన్ని ఖర్జూరములు, జున్నుముక్కలు, మాంసం మొదలగునవి ఉన్నాయి. అన్న పానీయాలు పూర్తయిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత సంఘటనలు లేదా ప్రాపంచిక స్థితిగతులపై సింహావలోకనం జరిపారు. వారి ముఖాలు దేదిప్యమానంగా వెలిగిపోతున్నాయి అయితే వారి చూపుల్లో చూపులు కలిపే ధైర్యం ఎవరికీ లేదు. అదో అనిర్వచనీయమైన పరిస్థితి.
హజ్రత్ ఉమర్ (రజి) ‘బైతుల్ మఖ్దిస్’ చేరుకోగానే కొందరు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. వారు పట్టు వస్త్రములు ధరించి ఆకర్షణీయంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కోసం వచ్చింది. ‘మీరు పరాయి రాజ్యంలోకి రాగానే ఇక్కడి తళుకు బెళుకులకు ఆకర్షితులైపోయారా? అని మండిపడ్డారు. “ఆహాఁ అదికాదు. ఈ వస్త్రాల లోపల మేము కవచాలు ధరించి ఉన్నాము” అని వారు సమాధానమిచ్చారు. అప్పుడు గాని ఆయన కోపం చల్లారలేదు.
హజ్రత్ ఉమర్ (రజి) బైతుల్ మఖ్దిస్ లో అనేక రోజులు బస చేశారు. క్రైస్తవులను కలుసుకున్నారు. క్రైస్తవ ప్రార్ధనాలయాన్ని సందర్శించారు. వాగ్దాన పత్రంపై సంతకం చేశారు. ముస్లింలను కలిశారు. వారికి హితబోధ చేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఅజ్జన్ ‘హజ్రత్ బిలాల్ (రజి) ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ఆయన ‘అజాన్’ ఇవ్వలేదు. ఆ రోజు ఆయన హజ్రత్ ఉమర్ (రజి) కోరికపై ‘అజాన్’ ఇచ్చారు. ఆయన మధురమైన కంఠం నుండి అజాన్ పదాలు జాలువారుతుంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు మధుర ఘడియలు గుర్తొచ్చి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడ హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చదివారు. తరువాత కొందరు ముస్లింలు ఆ ప్రాంతంలో ఒక మస్జిదు నిర్మించారు. ఆ మస్జిదు హజ్రత్ ఉమర్ (రజి) పేరుతో నేటికీ చిరస్మరణీయంగా మిగిలి ఉంది.
ఆ ఈ సంఘటన జరిగిన రెండవ సంవత్సరం సిరియాలో భయంకర మహమ్మారి ప్రబలింది. ఈ వార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) ఆందోళన చెంది వెంటనే సిరియాకు బయలుదేరారు. అప్పటికే మహమ్మారి విస్తృతంగా వ్యాపించింది. అందువల్ల దానిని నిర్మూలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. సిరియా ప్రయాణ సమయంలో ఆయన ఒంటరిగా వెళ్ళారు. ఆయన వెంట కేవలం ఒక బానిస మాత్రమే ఉన్నాడు. ఇద్దరికీ ఒకే ఒంటె ఉంది. దానిపై హజ్రత్ ఉమర్ (రజి) మరియు ఆ బానిస వంతుల వారీగా కూర్చునేవారు. సిరియా చేరేసరికి బానిస ఒంటె పై కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఒంటె పగ్గాలు పట్టుకుని ముందు నడుస్తున్నారు. అక్కడి అధికారులు, అనధికారులు ఈ దృశ్యం చూచి నివ్వెరపోయారు.
ఈ మహమ్మారి వలన ముస్లింలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు, అపారమైన ప్రాణనష్టం సంభవించింది. దాదాపు పదిహేను వేల ముస్లింలు మృత్యువాతన పడ్డారు. వారిలో హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రజి), హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రజి) కూడా ఉన్నారు. మరణానంతరం హజ్రత్ ఉమర్ (రజి) ఆయన ఆస్తిపాస్తులను వారి వారసులతో పంచిపెట్టారు. ప్రజల్లో జీతభత్యాలు, ఉపకారవేతనాలు పంచిపెట్టారు. ఈ కార్యసాధనకై ఆయనకు సిరియాలోని పలు ప్రాంతాలలో పర్యటించవలసి వచ్చింది.
అప్పుడు ఈజిప్ట్ దేశం కూడా రోమను సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. ఖురైషీయులలో ప్రముఖులైన హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఇస్లాం స్వీకరణకు ముందు అక్కడే ఉండేవారు. అక్కడి పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన హజ్రత్ ఉమర్ (రజి)తో ఈజిప్ట్ పై దండయాత్రకు అనుమతివ్వమని కోరారు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి) అంగీకరించలేదు. కానీ హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) మరొకసారి అనుమతి కోరగా, ఆయన అనుమతించారు. కాని ఈజిప్ట్ చేరకముందు నా ఉత్తరం గనుక మీకు అందితే తక్షణం వెనక్కి తిరిగి రావాలి అని తాకీదు చేశారు. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఈజిప్ట్కు చేరుకున్న తరువాత హజ్రత్ ఉమర్ (రజి) ఉత్తరం అందింది. అప్పటికే ఆయన ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి యున్నారు. అంచేత ఆయన వెనుతిరగకుండా ముందుకు పయనించారు.
అమ్ర్ బిన్ ఆస్ (రజి) వెంట నాలుగువేల మంది సైనికులు ఉన్నారు. ఈజిప్ట్ అధినేత అయిన ‘మఖూఖష్’ భారీ సైన్యంతో ఆయన్ను ఎదిరించడానికి వచ్చారు. అనేకమార్లు పోరాటాలు జరిగాయి. అన్ని విధాలా ముస్లింలదే పై చేయి అయింది. చివరకు ‘మఖూఖష్’ ఒక కోటలో కూర్చొని యుధ్ధపుణ్యహం రచించసాగారు. ఈ కోట నైలునదీ తీరాన ఉంది. నదీ మార్గము నుండి కోటవాసులకు ఆహార సామగ్రి సరఫరా అయ్యేది. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి)కు ఉత్తరం వ్రాసారు. ఆయన ప్రముఖ నాయకుడైన హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) సారథ్యంలో పదివేల సైన్యాన్ని పంపించారు. ఈ సైన్యం ఏడు నెలల వరకూ కోటను ముట్టడించింది. కాని కోటను జయించడంలో విఫలమయ్యింది. ఒకరోజు హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) ఖడ్గం తీసుకొని వల త్రాడు సహాయంతో కోట ప్రహరీ గోడపై ఎక్కిపోయారు. కొందరు సహబాలు కూడా ఆయన్ను అనుసరించారు. వారి నినాదాలకు రోమన్ సైన్యం భయభ్రాంతులకు లోనయింది. ఒక్కసారిగా ముస్లిం సైన్యమంతా ‘అల్లాహు అక్బర్’ అని నివారం చేయగా, అది కోటలు బీటలు వారినట్లు ప్రతిధ్వనించింది. రోమన్ సైనికులు భయపడి పారిపోవటానికి మార్గం వెతకసాగారు. అంతలో హజ్రత్ జుబైర్ (రజి) గోడపై నుండి లోపలికి దూకి కోట ముఖద్వారాన్ని తెరిచారు. ముస్లిం సైన్యమంతయూ కోటలోకి జొరబడింది. క్రైస్తవ సైన్యం లొంగిపోయింది. ఈ విధంగా ముస్లింలు కోటను సునాయాసంగా జయించగలిగారు.
ఈ విజయానంతరం ముస్లింలు ‘అస్కందరియా’ (అలెగ్జాండ్రియా) పట్టణం వైపు పురోగమించారు. తీవ్ర ప్రతిఘటన తరువాత ఆ నగరం వశమయింది. దాంతో క్రైస్తవుల ప్రాబల్యం దాదాపు అంతరించింది. అనంతరం ఈజిప్ట్ ప్రధాన పట్టణాలన్నీ ముస్లింల హస్తగతమయ్యాయి.
హజ్రత్ ఉమర్ (రజి) పదిన్నర సంవత్సరాలు ఖలిఫాగా ఉన్నారు. పైన ప్రస్తావించిన యుద్ధాలన్నీ ఆయన హాయాంలోనే జరిగాయి. దాదాపు ఈరాన్ సామ్రాజ్యమంతా ముస్లింల అధీనంలోకి వచ్చేసింది. కాని రోమన్ సామ్రాజ్యపు కాంతభాగం మాత్రమే ముస్లింలు జయించగలిగారు. ఆసియా ఖండపు ఒక ప్రాంతం విడిచి ఐరోపాలో కూడా వారి పరిపాలన అనేక సంవత్సరాలు కొనసాగింది ఈరానీయులు అగ్నిని పూజించేవారు మరియు రోమన్లు, క్రైస్తవులు. కాని యుద్ధ మైదానంలో ఇరువురూ ఆరితేరినవారే రోమన్ సైన్యంలో ఏనుగులు ఉండని మాట వాస్తవమే. ఈరానీయులలో రోమన్లకన్నా జాత్యాభిమానం అధికంగా ఉండేది.
ప్రపంచంలో ఎందరో విజయధీరులు ఉన్నారు. కానీ ముస్లింల విజయపరంపర తీరే వేరు. వారు ఇతరుల మాదిరిగా నిస్సహాయులపై చేయి చేసుకోలేదు. పిల్లలు, వృద్ధుల జోలికి పోలేదు. తమను ఎదిరించడానికి వచ్చిన వారితోనే వారు యుద్ధం చేశారు. వెళ్ళిన చోటల్లా వారు చెట్లను, పంటపొలాలను నాశనం చేయలేదు. వెళ్ళిన ప్రతిచోటా వీరు తమదైన శైలిలో ఎదుటివారి మనస్సులను గెలుచుకున్నారు. యర్ మూక్ యుద్ధ సందర్భంలో ముస్లింలు సిరియా నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడు ‘అల్లాహ్ మిమ్మల్ని మళ్ళీ మా వైపు వంపుగాక’ అని విలపిస్తూ క్రైస్తవులు వీడ్కోలు చెప్పారు.
ఆనాడు ముస్లిమేతరులకు మతావలంబన విషయంలో పూర్తి స్వాతంత్ర్యం ఉండేది. వారు తమ మత సిద్ధాంతాల కనుగుణంగా ప్రార్థనలు జరిపేవారు. వారిని ఆపే సాహసం ఎవ్వరూ చేయలేకపోయేవారు. ముస్లింలు, ముస్లిమేతరులపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా శిక్షించబడేవారు. ఒకప్పుడు ఒక ముస్లిం, ఒక ముస్లిమేతరుడ్ని హతమార్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే హంతకుడిని వారి బంధువులకు అప్పగించారు. వాస్తవమేమిటంటే మహాప్రసక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన ప్రియ సహచరులు దైవభీతితో, బాధ్యతాయుత జీవసం గడిపేవారు. ముస్లింల ఈ సదాచార వైఖరికి ముస్లిమేతరులు ప్రభావితులై వారివైపు మొగ్గు చూపేవారు. వారు చేసిన సత్కార్యాలు, దైవపరాయణత, నిస్వార్ధగుణం మెందలను వాటిని చూసి ముస్లిమేతరులు ఇస్లాం స్వీకరించేవారు. ఇది కాకుండా యుద్ధ మైదానాల్లో నిరాయుధులైన ముస్లింలు హేమా హేమీలను పల్టీ కొట్టించిన తీరుసు చూచి ముస్లింల విజయాల వెనుక అల్లాహ్ హస్తం ఉందని నమ్మి కూడా అనేకులు ఇస్లాం స్వీకరించారు.
ఈ సంగ్రామాలన్నింటిలో హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా పాల్గొనకపోయినా, యుద్ధ సన్నాహాలు అన్నీ ఆయన నేతృత్వంలోనే జరిగాయి. ‘ఖాదసియా’ యుద్ధంలో హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ముస్లిం సేనాధిపతిగా వ్యవహరించినప్పటికీ హజ్రత్ ఉమర్ (రజి) మధీనాలో కూర్చొనే సంకేతాలు పంపేవారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేసేవారు. ఆయన వాయువేగంతో చూసుకువెళ్ళే అశ్వరూఢులు బలగమొకటి తయారు చేసి ఉంచారు. వారి ద్వారా ఆయనకు ఎప్పటికప్పుడు వార్తలందేవి.
హజ్రత్ ఉమర్ (రజి) పరిపాలనా కాలం
హజ్రత్ ఉమర్ (రజి) సహాబాలతో సంప్రదించి రాజ్యపరిపాలన కొనసాగించేవారన్న విషయం ఇదివరకే వివరించబడింది. రాజ్యసంక్షేమం కోసం సలహామండలి తీసుకొనే కీలక నిర్ణయాలకు ‘మస్జిదె నబవీ’ వేదికగా ఉండేది. పరిపాలనా దక్షత గల వివేచనాపరులు మరియు విషయావగాహన గల సహాబాలు ఈ సలహామండలిలో సభ్యులు. సమావేశానికి అప్పుడప్పుడు సైనికాధికారులను కూడా పిలిపించేవారు. అవసరాన్ని బట్టి ఇది వరకు ఇస్లాం స్వీకరించిన ఈరాన్ దేశవాయకుడు ‘హర్ మ్ జాన్ ‘ ను సంప్రదింపుల నిమిత్తం కబురంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి)కు స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం లేదు.
హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లామీయ ప్రభుత్వాన్ని ఎనిమిది మండలాలుగా విభజించారు. ‘ఆహ్వాజ్’ మరియు ‘బహరైన్’లను కలిపి ఒక మండలము… ఇదే విధంగా సీస్తాన్, మక్రాన్ మరియు కిర్మాన్ లను కలిపి వేరొక మండలముగా చేశారు. ‘ఖిరాసాన్’ మరియు ‘తిబ్రీస్థాన్’లను వేరు- వేరు మండలాలుగా ఉంచారు. దక్షిణ ఈరాన్ ప్రాంతం కూడా వేరొక మండలంగా విభజింపబడింది. ఈజిప్ట్, సిరియా మరియు ఇరాఖ్ లను రెండు భాగాలుగా విభజించారు. మండలానికొక అధ్యక్షుడిని నియమించారు. ఈ మండలాధ్యక్షులు పరిపాలనా వ్యవహారాలతో పాటు ‘జుమా నమాజు’కు సారథ్యం కూడా వహించేవారు. ఇది వరకు మండలాధ్యక్షులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) పలు చోట్ల న్యాయస్థానాలు నిర్మించి న్యాయమూర్తులను వేరుగా నియమించారు. మండలాధ్యక్షులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. అందరి మాదిరిగా వారు కూడా బజారుల్లో తిరిగేవారు. వారికెలాంటి సెక్యూరిటీ ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ వారిని సులభంగా కలనుకోగలిగేవారు. అధికారులెవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఋజువైతే వారిని అందరి సమక్షంలో శిక్షించేవారు. ప్రతి మండలంలో మండలాధ్యక్షులు వ్యాయమూర్తులతో పాటు ప్రధాన మున్షీ . పోలీసు అధికారి మరియు కోశాధికారి ఉండేవాడు. భూమి శిస్తు వసూలుకై ప్రత్యేక అధికారి నియామకం జరిగేది.
ఇరాఖ్ మండలం రెండు ప్రాంతాలుగా విభజింపబడి ఉండింది. ఒక ప్రాంతానికి ‘కూఫా’ మరొక ప్రాంతానికి ‘బస్రా’ రాజధానులుగా ఉండేవి. ఈ రెండు పట్టణాలు హజ్రత్ ఉమర్ (రణి) కాలంలో ఆవిర్భవించినవే. ‘దజ్లా’ నది పరివాహక ప్రాంత వాతావరణం అరబ్బులకు సానుకూలంగా ఉండేది కాదు. అందువల్ల హజ్రణ్ ఉమర్ (రజి) అరబ్బులకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం అన్వేషించే వారు. చివరకు ‘ఫరాత్’ నది పరివాహక ప్రాంతపు పశ్చిమంలో ఇసుక ప్రాంతమొకటి లభించింది. దానికి ‘కూఫా’ అను నామకరణం చేశారు. ఈ పట్టణం సముద్ర తీర ప్రాంతంలో రాళ్ళూ, రప్పలతో కూడిన ఇసుకపుడమిపై వెలసినది. ఆ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేనందున ముస్లింలు ‘దజ్లా’ నది నుండి ఒక కాలువను త్రవ్వారు. ఫలితంగా మంచినీటి సమస్య దూరమైంది.
హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియుక్తులైన తరువాత అనేకచోట్ల కాలువలు నిర్మించారు. జలవనరులను సమకూర్చారు. బావులు, సత్రములు, ధర్మశాలలు, వసతి గృహములు నిర్మించారు. భూమిశిస్తు వసూలు చేయబడేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) క్రొత్తగా మరొకసారి భూములను సర్వే చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రెవిన్యూ వ్యవస్థను పునర్నిర్మించారు. ప్రజాధనాన్ని (బైతుల్మాల్) నెలకొల్పారు. విద్యాలయాలు స్థాపించారు. సైనిక కాలనీలు నిర్మించారు. ప్రారంభదశలో సైనికుల జాబితా ఉండేది కాదు. వారికి సక్రమంగా జీతభత్యాలు కూడా లభించేవి కావు. హజ్రత్ ఉమర్ (రజి) సైనికుల జాబితాను రూపొందించి వారికి జీతభత్యాలను ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాలలో ఎనిమిది భద్రతాదళాలు ఎల్లప్పుడూ సహారా కాస్తుండేవి. వాటిలో అనేకమంది సైనికులు, నాలుగువేల అశ్వములు ఎల్లప్పుడూ సంగ్రామానికి సిద్ధంగా ఉండేవి. ఏటేటా సైన్యంలో ముప్పైవేలమంది సైనికులు చేరేవారు. యుద్ధ సమయాల్లో సైనిక బృందంతో పాటు వైద్య బృందం కూడా ఉండేది. సైన్యం రెండు భాగాలుగా విభజింపబడి ఉండేది. ఒకటి పాదచారులు బృందం కాగా రెండవది వాహన బృందం.
ఆదాయం:
మూడు ప్రధాన ఆదాయపు శాఖలు ఉండేవి, ఒకటి భూమిశిస్తు, రెండవది జకాత్ (జకాత్ చెల్లించుట ప్రతి ముస్లిం విధి), ముస్లిమేతరుల నుండీ జకాత్ తీసుకోబడేది కాదు, కాని ఇరవై ఏడు సంవత్సరముల నుండి యాభై సంవత్సరములు గల వారికి కొంత మొత్తంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉండేది. దీని పేరు ‘జిజియా‘. వికలాంగులు మరియు వృద్ధుల నుండి జిజియా తీసుకోబడేది కాదు. నిజానికి ముస్లిమేతరుల నుండి ఈ పన్ను సైనిక సహాయార్థం తీసుకోబడేది. ముస్లిం సైన్యంలో సైనికులుగా చేరిన ముస్లిమేతరులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఉండేది. ‘యర మూక్’ యుద్ధానికి ముందు ముస్లింలు తాము జయించిన ప్రాంతాలు వదిలి వెళ్ళేటప్పుడు వారు తాము వసూలు చేసిన జిజియా పన్ను పాలితులకు తిరిగి ఇచ్చారు. ‘మీ ధనమానాలను పరిరక్షించే స్థోమత లేనప్పుడు, మీ నుండి పన్ను ఎలా ఎలా తీసుకోగలము? అని వారు అన్నారు.
ముస్లింల చే జయింపబడిన ప్రాంతాల యందు నివసించే ముస్లిమేతర ప్రజా సమూహమును “జిమ్మీ“గా పిలువబడుతుంది. ‘జమ్మీ’లపై అత్యాచారం చేయటానికి ఏ విశ్వాసీ సాహసించ లేకపోయేవాడు. జమ్మీలతో ముస్లింల వ్యవహారసరళి ఒకే విధంగా ఉండేది. జిమ్మీలలో ఎవరైనా వృద్ధాప్యానికి చేరి అసరాలేని అభాగ్యులై జరుగుబాటు కష్టతరమైనప్పుడు వారికి ‘జిజియా’ నుండి పూర్తి మినహాయింపు ఇచ్చి, వారి జరుగుబాటుకై ‘బైతుల్మాల్’ నుండి ఉపకారవేతనములు చెల్లించటం జరిగేది. హజ్రత్ ఉమర్ (రజి) జిమ్మీలతో పాటు బానిసల విషయంలో కూడా చింతాగ్రస్తులై ఉండేవారు.
వ్యవసాయ విధానం :
హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో వ్యవసాయరంగం అభివృద్ధిపథంలో పయనించసాగింది. దీనికి కారణం వ్యవసాయరంగంలో శీఘ్రగతిన జరిగిన సంస్కరణలే. ఆయన అనేకచోట్ల కాలువలు త్రవ్వించారు. ‘దజ్లా’ మరియు ‘పరాత్’ నదులకు ఆనకట్టలు నిర్మించారు. ‘నైలు’ ‘భిల్ జిమ్’ నదుల మధ్య కాలువ త్రవ్వించారు. దాని వలన ఈజిప్ట్ నుండి ఆహారధాన్యాలు ఓడలలో అరబ్ దేశానికి చేరేవి. రాత్రి సమయాల్లో సహారా కోసం ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఖైదీల నుంచడానికి కారాగారములు కట్టించారు. అరబ్బుల్లో కవిత్వాలు చర్చనీయాంశంగా ఉండేవి. వారిలో నక్షత్ర విద్యనభ్యసించే మోజు కూడా అధికంగా ఉండేది. రోమ్ మరియు ఈరాన్ ఆధిపత్యంలో ఉన్న అరబ్ రాజ్యాలకు చెందిన గాయకులు కవులకు, కవిత్వాలకు విపరీతమైన ఆదరణ ఇచ్చేవారు. వారి ఆదరాభిమానాల కారణంగా కవిత్వం, చరిత్ర మరియు నక్షత్ర విద్యలు ఖ్యాతి గడించాయి. కాని అరబ్బుల్లో విద్యాభ్యాసం తక్కువే. ప్రజలు కవితలను కంఠస్తం చేసుకునేవారు. ఈ పరంపర చాలాకాలం వరకు ఈ విధంగానే నడిచింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించినప్పుడు అరబ్బుల్లో అక్షరాస్యుల శాతం చాలా తక్కువ. బద్ర్ సంగ్రామంలో బందీలు గావింపబడిన ఖురైష్ సైనికులు పరిహారం (ఫిదియా) చెల్లించి బంధ విముక్తులయ్యారు. వారిలో పరిహారం చెల్లించలేని వారు కొందరు ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిలోని ఒక్కొక్కరు పదేసిమంది ముస్లింలకు విద్యబోధించి ముక్తిని పొందవచ్చని ఆదేశించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించే నాటికి అరబ్బుల్లో అక్షరాస్యుల సంఖ్య పెరిగింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈ అక్షరాస్యత తారస్థాయికి చేరింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో విద్యాలయాలు వెలిసాయి. ఉపాధ్యాయుల నియామకం జరిగింది. వారికి ప్రజాధనం (బైతుల్మాల్) నుండి జీతాలు లభించేవి.
హజ్రత్ ఉమర్ (రజి) అతి నిరాడంబరంగా జీవించేవారు, కానీ అయన ఖిలాఫత్ సమయంలో రోమ్ ఈరాన్ ప్రభావం వల్ల అరబ్బుల ఆచార ‘వ్యవహారాల్లో అనేక మార్పులు టోటు చేసుకున్నాయి. మొదటవారు అతి సామాన్యమైన ఇళ్లల్లో నివసించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖిలాఫత్ సమయంలో రోమ్ మరియు ఈరాన్లు జయింపబడిన పిదప వారు పక్కా ఇళ్లను నిర్మించసాగారు. అందులో రోమ్ మరియు ఈరాన్లో వాస్తుకళ ఉట్టిపడేది. ఒకప్పుడు అరబ్బులు దేహభాగమంతయూ కప్పబడి ఉండునట్లుగా (పాదాల వరకు) అంగి ధరించేవారు. దానిపై ఒక చర్మపు పట్టీ మరియు ఒంటె వెంట్రుకలతో చేయబడిన నగిషీ ఉండేది. కాని యుద్ధ సమయాల్లో మాత్రం వారు బిగుతైన దుస్తులు ధరించేవారు. పట్టణాల్లో అంగీ, లాగులు ధరించే సంప్రదాయం ండేది. ఈరాన్, రోమ్ రాజ్యాల వక్త్రధారణతో ప్రభావితులైన ప్రజలు ‘ఖుబా’ ధరించేవారు. ఇది పొడవైన చేతులు గల కోటు, తలపై తలపాగా ఒకటి ధరించేవారు. భుజాలు, మెడపై ఎండ తాపానికి లోనవకుండా రుమాలు వేసుకునేవారు. స్త్రీలు వివిధ డిజైనులు గల సరళ దుస్తులు ధరించేవారు. తలపై వోణీ కప్పుకునేవారు. బయటికి వెళ్ళేటప్పుడు శరీరమంతా కప్పబడి ఉండేలా తలపై నుండి దుప్పటి వేసుకునేవారు.
హజ్రత్ ఉమర్ (రజి), తన వలెనే ఇతరులు సాధారణ జీవన కూడా శైలినవలంబించాలని కాక్షించేవారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ముస్లింలు సంప్రదాయబద్ధంగా వ్యవహరించేవారు. అరబ్బులు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించేవారు కాదు. కాని మదీనాకు దూరంగా సిరియా, ఈజిప్ట్ దేశాల్లో నివసించేవారు కాలక్రమేణా ఆధునికతకు ప్రభావితులు కాసాగారు. అధికారులెవరైనాసరే అవధుల్ని అతిక్రమిస్తే మాత్రం హజ్రత్ ఉమర్ (రజి) వారిని కఠినంగా శిక్షించే వారు. ఒకప్పుడు ఈజిప్ట్ అధిపతియైన ‘అయాజ్ బిన్ ఘనమ్’ (రజి) పలుచటి వస్త్రాలు ధరిస్తారని, ఇంటి ముందు కాపలా దారుల్ని నియమించారని ఫిర్యాదు వచ్చింది. హజ్రత్ ఉమర్ (రజి) పరిశోధనార్ధం ‘ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)’ ను ఈజిప్ట్ పంపారు. ఈజిప్ట్ చేరిన ముసల్లమా (రజి) అయాజ్ను పలుచటి వస్త్రాలలో చూశారు. ఇంటిముందు కాపలాదారులు కూడా ఉన్నారు. అదే స్థితిలో ఆయన్ను మదీనా తీసుకెళ్ళారు. హజ్రత ఉమరి (రజి) ఆయన ఒంటిపై నుండి మెత్తని సన్నని వస్త్రాలు తీయించి, వెంట్రుకలతో చేయబడిన గరకు దళసరి వస్త్రాలు తొడిగించి, మేకలు మేపేందుకు అడవికి వెళ్ళమని ఆదేశించారు. ఈ శిక్ష ఫలితంగా ఆయాజ్ జీవితాంతం ఎన్నడూ పలుచని దుస్తులు ధరించలేదు.
హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ‘కూఫా’లో రాజభవనం ఒకటి నిర్మించారు. అందులో ఒక ‘దివాణం’ కూడా ఉండేది. హజ్రత్ ఉమర్ (రజి), ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)ను దివాణాన్ని దహించమని ఆదేశించారు. ఖలీషా ఆదేశం పాటించబడింది. సాద్ బిన్ వఖాస్ (రజి) ఈ కార్యమంతటినీ మౌనంగా తిలకిస్తూ కూర్చున్నారు.
హజ్రత్ ఉమర్ (రజి) నిరాడంబర జీవితానికి ఇంతగా ప్రాధాన్యమివ్వటానికి అనేక కారణాలు ఉన్నాయి. విలాసవంతమైన జీవితంలో మునిగి తేలినవారు, ప్రాపంచిక వ్యామోహానికి లోనైపోయి సోమరులుగా మెలుగుతారు. కష్టాలకు ఎదురీదలేరు. ఇలాంటి వారే ఇతర జాతుల సంప్రదాయాలకు బానిసలౌతారు.
హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల పట్ల కఠిసంగా వ్యవహరించేవారు. కాని ఆయన తనపై, తన కుటుంబీకుల పట్ల అంతకన్నా ఎక్కువ కఠిన వైఖరి నవలంబించేవారు. ఆయన ఎల్లప్పుడూ దళసరి దుస్తులు ధరించేవారు. పైగా వాటికి అతుకులు ఉండేవి. ఆయన ముస్లింలకు ప్రతిభయే కొలమానంగా భావించి, దాని ప్రకారం ఉపకారవేతనాలు చెల్లించేవారు. ఆయన ప్రజాధనం (బైతుల్మాల్) నుండి రోజుకు కేవలం రెండు దిర్హమ్ లో మాత్రమే పొందేవారు. సిరియా జయింపబడిన తరువాత రోము రాజ్యాధినేతలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. ఒకప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) సతీమణి ‘ఉమ్మెకుల్సుమ్ (రజి) రోము రాణికి సుగంధ ద్రవ్యాలతో నిండిన సీసాలు కొన్నింటిని కానుకగా పంపించారు. రోము రాణి ఆ సీసాల నిండా వజ్రాలు నింపి తిరిగి పంపించింది. హజ్రత్ ఉమర్ (రజి)కు ఈ సంగతి తెలియగా ఆయన తన భార్యతో ‘నిస్సందేహంగా, నీవు పంపిన సుగంధ ద్రవ్యాలు నీవె… కాని వాటిని తీసుకెళ్ళినవాడు ప్రభుత్వ రాయబారి అంటూ వజ్రములన్నింటినీ ప్రజాధనములో జమచేయించారు. ఒకసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. తేనె సేవించమని వైద్యులు సలహాఇచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) మస్జిదుకు వచ్చి, ముస్లింలను సమావేశపరచి వారితో “మీరు అనుమతిస్తే ప్రజాధనాగారం నుండి కొంత తేనె తీసుకుంటాను” అని అడిగారు.
తాను చేసిన తప్పును తెలుసుకున్న వెంటనే ఆయన క్షమాపణ కోరుకునేవారు. ఒకప్పుడు ఒకరిని కొట్టడానికి కొరడా ఎత్తారు. కాని తాను మితిమీరానని తెలిసిన వెంటనే క్షమాపణ కోరుకున్నారు. అప్పుడప్పుడు ప్రజలు కూడా ఆయనపై ధ్వజమెత్తేవారు. యుద్ధ రంగంలో పోరాటానికెళ్ళిన సైనికుల ఇండ్లకు వెళ్ళి వారికి కావలసిన సామాన్లు సమకూర్చేవారు. సైనికుల ఉత్తరాలు వస్తే వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి ఇచ్చేవారు. చదివి వినిపించే వారు కూడాను, అవసరమైతే అక్కడే ఇంటి అరుగుపై కూర్చుని ఉత్తరాలు వ్రాసిచ్చేవారు.
పరలోక యాత్ర
హజ్రత్ ఉమర్ (రజి) మరణానికి కొంతకాలం ముందు హజ్ చేశారు. ఆయన ‘జిల్ హజ్జ్’ నెలలో హజ్ ఆచారాలు నెరవేర్చి మదీనా చేరుకున్నారు. శుక్రవారం రోజు మస్జిదులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన దైవ ప్రాతినిధ్యం (ఖలీఫా) పై కొన్ని అంశాలను వివరించారు. ఆయన తన వారసుని విషయంలో చింతాగ్రస్తులై ఉన్నట్లు ఆ ప్రసంగం ద్వారా వ్యక్తమయింది.
మదీనాలో అబూలూలూ ఫేరోజ్ అను ఒక పారసీక బానిస ఉన్నాడు. ఒకరోజు అతడు హజ్రత్ ఉమత్ (రజి)తో నేను పగలంతా శ్రమించి సంపాదించిన కొద్ది మొత్తంలోంచి, నా యజమాని రెండు దిర్హమ్ లు వసూలు చేసుకుంటాడు అని ఫిర్యాదు చేశాడు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి), నీ వృత్తి ఏమిటి? అని అడిగారు. అతడు ‘నేను కుమ్మరిని మరియు నగిషి కూడా వేస్తాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “రెండు దిర్హమ్ లు నీ కోసం పెద్ద సొమ్ము కాదే!?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) సమాధానంతో సంతృప్తిపడని అబూలూలూ ఫేరోజ్ మాటువేసి రెండవరోజు హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చేస్తూ ఉండగా, ఆయనపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఆ స్థితిలో కూడా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)ను తన స్థానంలో నిలబెట్టారు. ఇటు హజ్రత్ ఉమర్ (రజి) గాయాలతో కొట్టుమిట్టాడుతుంటే అటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) నమాజు సారథ్యం వహించారు.
అబూలూలూ ఫేరోజ్ ఇంకొందరిని గాయపరిచాడు. పట్టుబడిన తరువాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమాజ్ పూర్తయిన తరువాత ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ఇంటికి తీసుకెళ్ళారు. హజ్రత్ ఉమర్ (రజి) ‘తనపై హత్యాయత్నం చేసిన వాడెవడు?’ అని అడిగారు’ ప్రజలు అబూలూలూ ఫెరోజ్ పేరు చెప్పారు. తనపై హత్యాయత్నం చేసినవాడు ముస్లిం కానందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు వెలిబుచ్చుకున్నారు. ఆయన తన పుత్రుడైన అబ్దుల్లా (రజి)ను పిలిచి, నేను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన సమాధి గావింపబడాలనుకుంటున్నాను. అందుకు హజ్రత్ అయిషా (రజి) అనుమతి తీసుకోండి’ అని సందేశము పంపారు. అందుకు హజ్రత్ ఆయిషా (రజి) ‘నేను ఈ స్థలాన్ని నా కోసం ప్రత్యేకించుకున్నాను. అయితే హజ్రత్ ఉమర్ (రజి)కు ప్రాధాన్యత ఇస్తున్నాను” అంటూ అనుమతి ఇచ్చారు.
హజ్రత్ ఉమర్ (రజి) తరువాత ఆయన వారసుడు ఎవరు? అన్న ఉత్కంఠభరితమయిన ప్రశ్న తలెత్తింది. ప్రజలందరూ వారసుడి నియామకానికై హజ్రత్ ఉమర్ (రజి)ను సంప్రదించగా, ఆయన హజ్రత్ అలీ(రజ), హజ్రత్ సాది బిన్ వఖాస్ (రజి), హజ్రత్ జుబైర్ (రజి), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్(రజి), హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు హజ్రత్ తల్హా (రజి)ల పేర్లు ప్రస్తావించి, ‘వీరిలో ఎవరినైనా ఖలీఫాగా నియమించుకోండి’ అని సూచించారు. శరీరమంతా గాయాలతో రక్తసిక్తమై విపరీత బాధ కలుగుతున్నా ఆయన ఆ సమయంలో కూడా జిమ్మీలను మరువలేదు. తన తరువాత రాబోయే ఖలీఫాను ఉద్దేశిస్తూ, “నా తరువాత ఖలీఫాగా ఎన్నికయ్యేవారు మన అధీనంలో ఉన్న ఇతర మతావలంబీకులందరినీ ఆదరించాలి. వారి యెడల సత్ప్రవర్తనతో మెలగాలి” అని శాసించారు.
గాయపడిన మూడవ రోజు హజ్రత్ ఉమర్ (రజి) పరమపదించారు. (జిల్ హిజ్జా 23వ తేదీ హిజ్రి 23వ సంవత్సరం లేదా క్రీ.శ. 644). అప్పటికి ఆయన వయస్సు 63 సంవత్సరములు. ఆయన పదిన్నర సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆయన కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ప్రజాధనం (బైతుల మాల్) నుండి లభించే జీతభత్యాలు జరుగుబాటుకు సరిపడేవి కావు. మరణం నాటికి ఆయన ఎనభై ఆరువేల దిర్హమ్ లు బాకీ ఉన్నారు. ఈ అప్పును ఆయన ఇల్లు అమ్మి తీర్చడం జరిగింది.
సంతానం
హజ్రత్ ఉమర్ (రజి) సంతానంలో హజ్రత్ హఫ్సా(రజి), హజ్రత్ అబ్దుల్లా (రజి) మరియు హజ్రత్ ఉబైదుల్లా (రజి) మరియు హజ్రత్ ఆసిమ్ (రజి) లు ప్రముఖులు. హజ్రత్ హఫ్సా (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణి. హజ్రత్ అబ్దుల్లా (రజి) దైవభీతికలవారు, సదాచార సంపన్నులు, ధర్మజ్ఞాని కూడానూ. ఆయన అగ్రశ్రేణి సహాబీలలో ఒకరుగా పరిగణించ బడేవారు. ఆయన హజ్రత్ ఉమర్(రజి) తోపాటే ఇస్లాం స్వీకరించారు, మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి ఎన్నో ధర్మయుద్ధాల్లో పాల్గొన్నారు. తన తండ్రి మాదిరిగా ఆయన కూడా సత్యవాది, నిరాడంబరజీవి. మక్కానగరాన్నేలి ప్రజలను హింసాకాండకు గురిచేసిన మక్క గవర్నర్ హజ్జాజ్ బిస్ యూసుఫ్ ఒకప్పుడు కాబాలో ప్రసంగిస్తున్నప్పుడు. హజ్రత్ అబ్దుల్లా (రజి) లేచి ‘ఇతడు అల్లాహ్ విరోధి. ఎందుకంటే ఇతడు దైవాభిమానులను హతమార్చాడు’ అని నిర్భయంగా విమర్శించారు. ఆసిమ్, ఉబైదుల్లాలు కూడా సమర్థులు, పేరుమోసిన వారే. హజ్రత్ ఉలైదుల్లా (రజి) పరాక్రమశాలి. ప్రముఖ యుద్ధ వీరుడు. ఆయన మూడవ కుసూరుడు హజ్రత్ ఆసిమ్ (రజి) సౌశీల్యవంతులు, పండితులు.
హజ్రత్ ఆసిమ్ (రజి) ఆజానుబాహులు, మంచికవి కూడా. కవులందరూ కవిత్వాలల్లేటప్పుడు అనవసర పదజాలాన్ని ఉపయోగించేవారు. కాని హజ్రత్ ఆసిమ్ (రజి) కవిత్వం దీనికి వ్యతిరేకం. ప్రపంచ ఖ్యాతి గాంచిన హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై) ఈయన మనుమడే. ఆయన తన రెండున్నరేళ్ళ స్వల్ప పరిపాలనా వ్యవధిలో సాధించిన విజయాలు, చేసిన ఘనకార్యాలు అనితరసాధ్యం. ప్రళయకాలం వరకూ ప్రజలు ఆయన్ని మరువలేరు.
ఖలీఫాగా సాధించిన విజయాలు
హజ్రత్ ఉమర్ (జి) ఖిలాఫత్ కాలంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు మానవజాతికి ఎంతో మేలును చేకూర్చాయి. మేము వీటిని పెద్ద పెద్ద గ్రంధాల నుండి సేకరించి పొందు పరుచుచున్నాము.
- బైతుల్ మాల్ (ప్రజాధనం) స్థాపించబడింది.
- న్యాయస్థానాలు నెలకొల్పి న్యాయమూర్తులను నియమించారు.
- హిజ్రీ శకానికి నాందీ వాచనం పలికారు. ఇప్పటికీ ఇది అమలులో ఉంది.
- చక్రవర్తి కొరకు “అమీరుల్ మోమినీన్” (విశ్వాసుల నాయకుడు) అను బిరుదును ఇచ్చారు.
- సైనిక కార్యాలయాన్ని స్థాపించారు.
- ఇస్లామీయ సేవకులకు ఉపకార వేతనములు నిర్ధారించారు.
- కోశాధికారి కార్యాలయాన్ని స్థాపించారు..
- భూములను సర్వే చేయడానికి సరికొత్త విధానాలను రూపొందించారు.
- జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టారు.
- వ్యవసాయం కోసం కాలువలు త్రవ్వించారు.
- పెద్ద పెద్ద పట్టణాలను వసింప చేశారు..
- ఇస్లామీయ రాజ్యాలన్నింటినీ మండలాలుగా విభజించారు.
- సముద్రజీవుల (అంబర్ లాంటి చేపల)పై సుంకాన్ని విధించారు.
- తమతో పోటీపడే రాజ్యాలతో ఎగుమతి దిగుమతులను అనుమతించారు.
- ఖైదీల కోసం కారాగారాలను నిర్మించారు.
- కొరడా ఉపయోగాన్ని అమలులో తెచ్చారు.
- రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల బాగోగులను తెలుసుకొనే శాసనాన్ని రూపొందించారు.
- ప్రజా సంక్షేమం కోసం పోలీసు వ్యవస్థమ స్థాపించారు.
- అనేక చోట్ల సైనిక కాలనీలను, బారకాసులను నిర్మించారు.
- గుర్రాలలో తారతమ్యం కొరకు గుర్తును నిర్ధారించారు.
- పరిస్థితుల మెరుగుదలకు వార్తాహరులను నియమించారు.
- మక్కానుండి మదీనా వరకు యాత్రికుల కోసం భవనాలు నిర్మించారు.
- నడిరోడ్డు పై పడి ఉన్న అభాగ్యుల, అనాధ బాలల పెంపకం కోసం ధర్మశాలలను స్థాపించారు.
- ప్రధాన పట్టణాలలో అతిథి గృహాలను నిర్మించారు.
- అరబ్బు దేశస్తులు (ముస్లిమేతరులయినా సరే) బానిసలుగా మెలగకూడదనే శాసనాన్నినిర్ధారించారు.
- పేద క్రైస్తవులు యూదుల కోసం ధర్మసత్రాలను స్థాపించారు.
- గ్రంథాలయాలను నిర్మించారు.
- ఉపాధ్యాయుల కోసం ఉపకారవేతనాలను నిర్ధారించారు.
- క్రమపద్ధతిలో దివ్యఖుర్ఆన్ సేకరణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
- రమజాన్ నెలలో సామూహిక తరావీహ్ నమాజును స్థాపించారు.
- మద్య సేవనం పై ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించారు.
- వ్యాపార, వాణిజ్య గుర్రాలపై ‘జకాత్’ నిర్ధారించారు.
- వక్ఫ్ విధానాన్ని స్థాపించారు.
- మస్జిద్ ఉపన్యాస, ఉపదేశాల రివాజును ప్రారంభించారు.
- ఇమామ్, ముఅజ్జిన్ ల కోసం జీతాలను నిర్ధారించారు.
- రాత్రి సమయాల్లో మస్జిదులలో దీపాలను పెట్టించారు.
- కవితా గేయాల్లో స్త్రీ నామ స్మరణాన్ని నిషేధించారు.
ఆదర్శ రాజ్య ప్రణేతగా హజ్రత్ ఉమర్ (రజి)
పరిపాలకునిగా ఉంటూనే ఒక నౌకరుగా సేవలందించిన అధినేత ప్రపంచంలో ఎవరయినా ఉన్నారా? హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు మదీనా వీధుల్లో ఒంటరిగా తిరిగేవారు. చేతిలో కొరడా పట్టుకొని దారిలో శిక్షించదగిన నేరస్తులెవరైనా తారసపడితే వారిని తగిన విధంగా అక్కడికక్కడే శిక్షించేవారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా గస్తీ చేసేవారు. మదీనా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా “ఆయన కొరడా, ఇతరుల ఖడ్గాలకంటే భయంకరమైనది” అని అనేవారు. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేసేటప్పుడు ఎదురయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలు హజ్రత్ ఉమర్ (రజి) బాధ్యతా భావనకు, సమర్థ పరిపాలనకు అద్దం పడతాయి. వాటిలో కొన్నింటిని పొందుపరచటం జరిగింది.
1) ఒకరోజు వర్తక బృంద మొకటి మదీనాకు వచ్చి పట్టణ పాలిమేరల్లో విడిది చేసింది. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. విడిది చేసిన యాత్రకులను చూచి హజ్రత్ ఉమర్ (రజి) ‘ఈ వర్తక బృందానికి కాపలాగా ఈ రాత్రి ఇక్కడే ఉందామ’ని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)తో అన్నారు. ఆ రాత్రి వారిద్దరూ కాపలా కాశారు. ‘తహజ్జుద్’ నమాజ్ కూడా అక్కడే చేశారు. ఆ రాత్రంతా ఒక పసివాడి ఏడుపు శబ్దం, దానికి ఆ పసివాడి తల్లి నిర్లక్ష్యం హజ్రత్ ఉమర్ (రజి)ను ఎంతో కలవరపరచాయి. కోపోద్రిక్తులైన హజ్రత్ ఉమర్ (రజి) ఆ తల్లిని గట్టిగా మందలించారు. హజ్రత్ ఉమర్ (రజి) మందలింపుతో సహనం కోల్పోయిన ఆ తల్లి ఆయనపై ఇలా శివమెత్తింది. “పసివాడిని పాల నుండి విడిపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ వాడు మారాం చేస్తున్నాడు”. ‘పసివాడి వయస్సెంత?’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘కొన్ని నెలలు మాత్రమే! సమాధానమిచ్చింది తల్లి. ‘ఇంత తొందరగా పాలు ఎందుకు విడిపిస్తున్నావు?’ అని హజ్రత్ ఉమర్ (రజి) తిరిగి అడిగారు. అప్పుడు ఆమె ‘హజ్రత్ ఉమర్ (రజి) పాలు విడిచిన పసిపిల్లలకు మాత్రమే జీవనభృతిని నిర్ధారించారు కదా’ అని అంది. పాలువిడిపించటంలో తొందరపడకు అని తల్లితో చెప్పి హజ్రత్ ఉమర్ (రజి) వెళ్ళిపోయారు. తరువాత ఆయన ‘ఫజ్ర్’ నమాజ్ కోసం అరుదెంచారు. నమాజ్ చదివిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) తనను తాను నిందించుకుంటూ ‘ఓ ఉమర్ ! నీకు మూడింది. ముక్కుపచ్చలారని పసికూనలెందరిని ఇప్పటి వరకు నీవు బలొగొన్నావో?!’ అని కన్నీరు మున్నీరై ఏడుస్తూ కూర్చున్నారు. తరువాత ఆయన “తల్లులెవరూ తమ పసిపాపలను పాలు విడిపించుటలో తొందరపడరాదు. ఇకనుండి పిల్లల జీవనభృతి వారి పుట్టుకతోనే ఇవ్వబడుతుంది” అని ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనను ఆయన రాష్ట్రాధికారులందరి వద్దకూ లిఖితపూర్వకంగా పంపించారు.
2) హజ్రత్ అనస్ (రజి) ఇలా వివరించారు: ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తున్నారు. ఒక జనపదుడి (పల్లెవాసి) గుడారం వద్దకు వెళ్ళారు. అతడు తన గుడారం ముందు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతన్ని పలకరించారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంతలోనే గుడారంలోంచి బాధాకరమైన ఏడుపు శబ్దం వినపడింది. ‘గుడారంలో ఎవరున్నారు? ఆ అరుపులు శబ్దమేంటి?’ అని హజ్రత్ ఉమర్ (రజి)ఆ పల్లెవాసిని అడిగారు. ‘గుడారంలో ఒక స్త్రీ ఉందనీ పురిటి నొప్పులు భరించలేక ఏడుస్తోందని’ ఆ పల్లెవాసి సమాధానమిచ్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే తన ఇంటికెళ్ళి తన భార్యయైన ఉమ్మె కుల్సుమ్(ర.అన్హ)ను పిలుచుకువచ్చారు. గుడారంలో మూలుగుతున్న స్త్రీ సహాయార్ధం ఆమెను గుడారంలోకి పంపారు. కొద్దిసేపటికి గుడారం నుండి ఉమ్మెకుల్సుమ్ (ర.అన) ‘ఓ అమీరుల్ మోమినీన్! అబ్బాయి పుట్టాడని మీ మిత్రునికి శుభవార్త అందజేయండి’ అని బిగ్గరగా చెప్పారు. ‘అమీరుల్ మోమినీన్’ అన్న పదం చెవిన పడగానే ఆ పల్లెవాసి భయంతో వణకసాగాడు. చేతులు జోడించి క్షమాపణ కోరసాగాడు. తరువాత హజ్రత్ ఉమర్ (రజి), ఫరవాలేదు. తెల్లవారాక వచ్చి పసిపిల్లవాడికి నిర్ధారించబడిన జీవనభృతిని తీసుకెళ్ళమని అతనితో అన్నారు.
3) ఒకసారి సిరియా నుండి తిరిగి వచ్చిన తరువాత హజ్రత్ ఉమర్(రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ఒంటరిగా వెళ్ళారు. మార్గంలో ఆయనకొక ముసలావిడ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె నుద్దేశ్యించి, ‘మీ పరిపాలకుడు ఎలాంటివాడు?’ అని అడిగారు. అందుకు ఆమె దురుసుగా సమాధానమిస్తూ ‘ఆయన ఖలీఫాగా నియుక్తులైనప్పటి నుండి నాకొక్కపైసా కూడా లభించలేదు’ అని అంది. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘బహుశా నీ గురించి హజ్రత్ ఉమర్ (రజి)కు తెలియదేమో…. నీవే ఆయనతో నీ పరిస్థితిని గురించి విన్నవించుకుంటే బాగుంటుందేమో!’ అని పరోక్షంగా అడిగారు. దానికి ఆ ముసలావిడ ‘ఆయన విశ్వాసులందరికీ నాయకుడు. రాజ్యంలో జరిగే ప్రతిసంఘటన పట్ల ఆయనకు అవగాహన ఉండాలి’ అని సూటిగా సమాధానమిచ్చింది. అది వినగానే ఆయన ‘నాకు’ హజ్రత్ ఉమర్ (రజి)పై జాలి కలుగుతుంది’ అని అన్నారు. ‘నీకు జరిగిన అన్యాయానికి, నీవెంత పరిహారం తీసుకుంటావు’? అని హజ్రత్ ఉమర్ (రజి) అడిగారు. అప్పుడు ఆమె ‘నాతో పరిహాసమాడకండి’ అని అంది. ‘అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘నేను’ పరిహాసమాడట్లేదు’ అని అన్నారు. అంతలోనే హజ్రత్ అలీ (రజి), హజ్రత్ ఇబ్నె మసూద్ (రజి)లు అక్కడికి ఏతెంచి, ‘అస్సలాము అలైకుమ్ అమీరుల్ మోమినీన్’ అని పలికారు. అది విన్న వృద్ధురాలు ఒకేసారి ఆశ్చర్యచకితురాలైంది, మనసుపై పిడుగు పడినట్లయింది. సాక్షాత్తు అమీరుల్ మోమినీన్నే నిందించానన్న ఆవేదన ఆమెను తొలచి వేయసాగింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె పట్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా ఇరవై ఐదు బంగారు నాణెములు చెల్లిస్తున్నానని ఒక చర్మపు ముక్కపై వ్రాయించుకున్నారు. ఈ విషయంలో హజ్రత్ అలీ (రజి), హజ్రతి ఇబ్నె మసీద్ (రజ)లు సాక్షులుగా ఉన్నారు.
4) ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లోనుంచి పాటలు వినవస్తున్నాయి. హజ్రత్ ఉమర్ (రజి) వెనకగోడ నుండి దూరి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి తోడుగా మందు ఉంది, మగువ కూడా ఉంది. అది చూచి ఆగ్రహోదగ్రులైన హజ్రత ఉమర్ (రజి), ‘ఓ ధర్మద్రోహి ! నీవు చేసే ఈ దుష్కార్యాన్ని అల్లాహ్ మరుగుపరుస్తాడను కుంటున్నావా?’ అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి హజ్రత్ ఉమర్ (రజి) తో, “ఓ ఖలీఫా! ఆవేశపడకండి. నేను కేవలం ఒక్క నేరాన్ని చేశాను. కాని మీరు మూడు నేరాలు చేశారు. ‘ఒకరి లోపాలను ఎంచకండి’ అని అల్లాహ్ అన్నాడు. కాని మీరు ఈ నియమాన్ని ఉల్లంఘించారు. ఇది మీ మొదటి నేరం. ‘ఇతరుల ఇంట్లో తలుపు ద్వారా లోనికి ప్రవేశించండి అని అల్లాహ్ చెప్పగా మీరు వెనకగోడ నుండి ఇంట్లోకి వచ్చారు. ఇది మీ రెండవ నేరం. ‘అనుమతి లేనిది ఎవరింట్లోనూ ప్రవేశించకండి’ అని అల్లాహుతాలా స్పష్టపరచగా మీరు నా అనుమతి లేనిదే ఇంట్లో ప్రవేశించారు. ఇది మీరు చేసిన మూడో నేరం”. ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి) నేను నిన్ను క్షమిస్తాను. దానికి ప్రతిఫలంగా నీవేమి ఇస్తావు?’ అని అడుగగా అతడు ‘ఇక ముందు ఇలాంటి చెడు పసుల జోలికిపోను’ అని హామీ ఇచ్చాడు.
5) అది రాత్రి సమయం.. ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లో ఎవరో సంభాషించుకుంటున్న వైనం ఆయన చెవిన పడింది. ఒక వృద్ద వయస్కురాలైన తల్లి, తన కూతురితో పాలలో నీళ్ళుకలపనుని పట్టుబట్టటం, పాలలో నీళ్ళు కలిపి అమ్మవద్దని ఖలీఫా ప్రకటించారు కదా! అని కూతురు సూటిగా బదులు పలకటం హజ్రత్ ఉమర్ (రజ) విన్నారు. ‘ఖలీఫా మనల్ని చూడవచ్చాడా ఏమిటి?’ త్వరగా నీళ్ళు కలుపు అని తల్లి పురమాయించింది. ‘పైకి విధేయత కనబరుస్తూ.., అంతరంగంలో అవిధేయతా భావంతో మెలగడం ఎంత మాత్రం సమంజసం కాదని కూతురు అంటోంది. ఆ బాలిక నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్నారు హజ్రత్ ఉమర్ (రజి). ఆ ఇంటిని సులభంగా తెలుసుకునేందుకు ఆ ఇంటిపై గుర్తువేయమని తనతో ఉన్న సేవకునికి చెప్పారు. మరునాడు హజ్రత్ ఉమర్ (రజి) ఒక వ్యక్తిద్వారా ఆ అమ్మాయిని తన కుమారుడు హజ్రత్ ఆసిమ్ (రజి) కిచ్చి వివాహం జరిపించవలసిందిగా ఆ ఇంటికి సందేశం పంపారు. ఆ విధంగా ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నారు.
6) ఒకరాత్రి గస్తీ చేస్తూ హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటివద్దకు చేరారు. అచట ఒక స్త్రీ, ఆమె చుట్టూ కొందరు పిల్లలు కూర్చొని ఏడవటాన్ని ఆయన చూశారు. పొయ్యిపై ఉన్న ఒక పాత్రను కూడా ఆయన గమనించారు. పిల్లల రోదనకు గల కారణాలను హజ్రత్ ఉమర్ (రజి) దర్యాప్తు చేయగా, ‘ఆకలి బాధకు తాళలేక ఏడుస్తున్నారని’ తల్లి సమాధానం చెప్పింది. ‘పాత్రలో ఏముంది?’ అని హజ్రత్ ఉమర్ (రజి) అడుగగా కేవలం నీళ్ళుమాత్రమే ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు ఇలా చేసాను. ఏడుస్తూ… ఏడుస్తూ వారే పడుకుంటారు’ అని తల్లి సమాధానమిచ్చింది. తల్లి నిస్సహాయస్థితిని చూసిన హజ్రత్ ఉమర్(రజి) నయనాలు కన్నీరు మున్నీరై ప్రవహించసాగాయి. ఆయన వెంటనే ప్రజాధనాగారానికి వెళ్ళి పిండి, నెయ్యి, మాంసం, ఖర్జూరపు పండ్లు మరియు దుస్తులను కొన్నింటిని మూటకట్టి తన వీపుపై స్వయంగా మోసుకునివచ్చారు. తాను తెస్తానని ఒక బానిస అద్దుపడగా ‘వద్దూ… వారి గురించి నన్నే అడగటం జరుగుతుంది. నేనే జవాబు దారుణ్ణి’ అని చెప్పారు. ఆ మూటను ఇంటివద్ద చేర్చి, పాత్రల్లో పిండి మాంసం, ఖర్జూరపు పండ్లు మిళితంచేసి పొయ్యిపై పెట్టి, తానే స్వయంగా పొయ్యి రాజేశారు. మంటవల్ల ఏర్పడిన దట్టమైన పొగలు ఆయన గడ్డం నిండా వ్యాపించాయి. వంట అయ్యాక పిల్లలందరికీ తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు.
7). ఒకసారి హజ్రత్ ఉమర్ (ర), హజ్రత్ జారూర్ (రజి) మస్జిద్ నుండి బయటకు వచ్చారు. వారికి దారిలో ఒక స్త్రీ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) వారికి సలాం చేశారు. ఆమె జవాబిచ్చింది. మరియు ఇలా అంది. “ఓ ఉమర్! ‘ఉక్కాజ్’ బజారులో ప్రజలు నిన్ను ‘ఉమైర్’ అని పిలవడం నాకు గుర్తుంది. తరువాత వారు నిన్ను ‘ఉమర్ ‘గా పిలుస్తున్నారు. ఇప్పుడు నీవు ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసం నాయకుడు) అయ్యావు. అల్లాహ్ కు భయపడుతూ మెలగు”. ఆ మాటలు వినగానే తాను ఆమెపై మండిపడ్డానని హజ్రత్ జారూర్(రజి) అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) నాతో “ఈమెను గుర్తు పట్టావా ‘ఈమె సాధారణ స్త్రీ కాదు. ఈమె విన్నపం సప్తాకాశాలపై ఆమోదించబడింది. ఈమెయే హజ్రత్ ఖౌలా బిన్తె హకీమ్’ కనుక ఆమె హితబోధను నేను వినకతప్పదు” అని అన్నారు.
-సమాప్తం-
హజ్రత్ ఉమర్ (రజి అల్లాహు అన్హ హు) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు. నిరాడంబర జీవి, మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. ముతక దుస్తులు ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడా అతుకులు కూడా ఉండేవి. తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వం కూడా లేని దయామూర్తి. (రజి అల్లాహు అన్హ హు)
**
[36 నిముషాలు]
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259