తఫ్సీర్ సూర అత్ తహ్రీమ్ [వీడియో]

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తహ్రీమ్):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3rcWu2KG3dbap82eYuTHIS

అహ్సనుల్ బయాన్ (తెలుగు అనువాదం & వ్యాఖ్యానం) నుండి :

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ

66:1 يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు (నీ కొరకు) నిషేధించుకుంటున్నావు? [1] (ఏమిటి?) నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు.

66:2 قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ

(అనుచితమైన) మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేశాడు సుమా![2] అల్లాహ్ యే మీ సంరక్షకుడు. ఆయనే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు.

66:3 وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ

ప్రవక్త తన భార్యలలో ఒకామెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు[3], ఆమె ఆ విషయాన్ని (మరొకామెకు) తెలియపరిచింది.[4].ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా, ప్రవక్త ఈ విషయాన్ని కొంతచేప్పి, మరికొంత దాటవేశాడు.[5] ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినపుడు, “ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు?”[6] అని ఆమె అడిగింది. “అన్నీ తెలిసిన, సర్వం ఎరిగిన అల్లాహ్ నాకీ సంగతిని తెలియజేశాడు” అని ప్రవక్త చెప్పాడు.

66:4 إِن تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ

(ఓ ప్రవక్త సతీమణులారా!) మీరిద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందితే[8] (అది మీకే శ్రేయస్కరం). నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి.[9] మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒండొకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు (అతనికి) ఆదరువుగా ఉన్నారు – అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు.[10]

66:5 عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا

ఒకవేళ అతను (ప్రవక్త) మీకు విడాకులిస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు.[11] వారు ముస్లిములు, విశ్వాసం కలిగి ఉన్న వారు, విధేయత చూపేవారు, పశ్చాత్తాపం చెందేవారు, ఆరాధనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు అయి ఉంటారు. వారు వితంతువులూ అయి ఉంటారు, కన్యలూ అయి ఉంటారు.[12]

66:6 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ

ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి.[13] (ఆ అగ్ని ఎటువంటిదంటే) మనుషులు, రాళ్లు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్టులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు.

66:7 يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ

ఓ అవిశ్వాసులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకివ్వబడుతుంది.

66:8 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి – నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో![14] మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తనూ, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ ఉంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు: “మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు.[15] మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు.”

66:9 يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ

ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు.[16] వారి పట్ల కఠినంగా వ్యవహరించు.[17] వారి నివాసం నరకం.[18] అది చాలా చెడ్డ గమ్యం.

66:10 ضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ

అల్లాహ్ అవిశ్వాసుల (హితబోధ) కోసం నూహు, లూతు భార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు.[19] వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల అధ్వర్యంలో ఉండేవారు. అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు.[20] అందువల్ల వారిద్దరూ (సజ్జనదాసులు) దైవశిక్ష విషయంలో వారిని (తమ భార్యలను) ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు.[21] “పొండి, నరకానికి పోయేవారితో పాటు మీరూ పోయిపడండి”[22] అని ఆ స్త్రీలిరువురితో అనబడింది.

66:11 وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ

మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు.[23] అప్పుడామె ఇలా వేడుకున్నది: “నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని (దుష్ట) పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.”

66:12 وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ

మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యం (గురించి కూడా అల్లాహ్ ఉదాహరిస్తున్నాడు).[24] ఆమె తన మానాన్ని కాపాడుకున్నది. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను,[25] ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరచింది. ఆమె వినయవిధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది.[26]

1. ఇంతకీ అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కొరకు నిషేధించుకున్న ఆ వస్తువుఏమిటి? అల్లాహ్ ఈ విషయమై ఎందుకింతగా అప్రసన్నుడయ్యాడు? అని ప్రశ్నించుకుంటే ఈ సందర్భంగా ఒక సుప్రసిద్ధ సంఘటన ముందుకు వస్తుంది.

సహీహ్ బుఖారీ తదితర హదీసు గ్రంథాలలో వచ్చిన దాని ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతిరోజూ తన ధర్మపత్ని అయిన హజ్రత్ జైనబ్ బిన్తె జహష్ (రదియల్లాహు అన్హా) వద్దకు వెళ్ళి కాస్సేపు ఆగేవారు. ఆమె గారిచ్చిన తేనెను ఆయన సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా మామూలుకన్నా కొంత ఎక్కువ సమయం అక్కడ గడపటాన్ని హజ్రత్ హఫ్సా, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హుమా) లు గమనించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అక్కడ ఆగకుండా చేయటానికి వారిద్దరూ ఒక పథకం తయారుచేశారు. ఈ పథకం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామిద్దరిలో ఎవరింటికి వచ్చినాసరే, “దైవప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం)! తమరి నోటి నుంచి మగాఫీర్ (అదొక రకమైన పువ్వు. దాని వాసన కాస్త వెగటుగా ఉంటుంది) వాసన వస్తోందేమిటి?” అని అడగాలి. వారు అనుకున్నంత పనీ చేశారు కూడా. వారి ప్రశ్నకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ, ”ఏమిటీ, నా నోటినుంచి దుర్వాసన వస్తోందా? నేను జైనబ్ ఇంట కేవలం తేనె మాత్రమే సేవించానే! సరే, ఇకనుంచి ఎన్నడూ తేనె త్రాగనని నేను ఒట్టేసుకుంటున్నాను. కాని ఈ సంగతి మీరెవరికీ చెప్పొద్దు” అన్నారు (సహీహ్ బుఖారీ – అత్తహ్రీమ్ సూరా వ్యాఖ్యానం).

సుననె నసాయిలో వచ్చిన దాని ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన స్వాధీనంలో ఉన్న ఒక బానిసరాలిని తన కొరకు నిషేధించుకున్నారని ఉంది (షేఖ్ అల్బానీ దీనినిప్రామాణికమైన ఉల్లేఖనంగా ఖరారు చేశారు). (సుననె నసాయి – 3/83). కాగా మరికొంతమంది విద్వాంసులు దీనిని బలహీన ఉల్లేఖనంగా అభిప్రాయపడ్డారు.

ఈ సంఘటన గురించి ఇతర గ్రంథాలలో వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.- ఆమె పేరు మారియా ఖిబ్ తియా (రదియల్లాహు అన్హా). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇబ్రాహీం అనే అబ్బాయి కలిగింది ఈమె ద్వారానే. ఒకసారి ఈమె హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హు) ఇంటికి వచ్చారు.ఆ సమయంలో హఫ్సా ఇంట్లో లేరు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే ఉన్నారు. వారిద్దరూ తన కుటీరంలో ఏకాంతంలో ఉండగా హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఏతెంచారు.తాను ఇంట్లో లేనపుడు మారియా ఖిబ్ తియా తన ఇంట్లోకి రావటం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఏకాంతంలో గడపటం హఫ్సాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆమెలోని అసహనాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సయితం పసిగట్టారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హఫ్సాను ప్రసన్నురాలిని చేయటానికి, మారియాను తన కొరకు నిషేధించుకున్నట్టు ఒట్టేసిచెప్పారు. ఈ సంగతి ఎవరి ముందూ ప్రస్తావించరాదని హఫ్సా (రదియల్లాహు అన్హా) కు తాకీదు చేశారు.

దీనిపై ఇమామ్ ఇబ్నె హజర్ ఇలా వ్యాఖ్యానించారు : “ఈ సంఘటన పలు విధాలుగా సంకలనం అయింది. ఒకటి మరో దానికి ఆధారంగా ఉంది. బహుశా ఈ రెండు సంఘటనలూ జరిగి ఉండవచ్చు. ఈ రెండు నిషిద్ధ అంశాల నేపథ్యంలో ఈ ఆయతు అవతరించి ఉండవచ్చు” (ఫత్ హుల్ బారీ – తహ్రీమ్ సూరా వ్యాఖ్యానం). ఇమామ్ షౌకానీ కూడా ఇంచుమించు ఇలాగే అభిప్రాయపడ్డారు. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే అల్లాహ్ ధర్మసమ్మతం (హలాల్) చేసిన ఏ వస్తువునయినా నిషిద్ధం (హరామ్)చేసుకునే అధికారం ఎవరికీ లేదు చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా ఈ నిర్ణయాధికారం లేదు.

2. అంటే – ఏదైతే చెయ్యకూడదని శపథం చేసుకున్నారో దానికి పరిహారం చెల్లించి, దానిని తిరిగి చేసేందుకు అనుమతి ఇచ్చాడు. ప్రమాణానికి (ప్రతిజ్ఞకు) సంబంధించిన ఈ పరిహారం గురించి అల్ మాయిద సూరా 89వ వచనంలో వివరించబడింది. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా పరిహారం ఇచ్చారు. (ఫత్ హుల్ ఖదీర్).

ఈ విషయంలో పండితుల మధ్య అభిప్రాయభేదం ఉంది. ఒక వ్యక్తి ఏదైనా ఒకవస్తువును తన కొరకు నిషేధించుకుంటే అతనేం చేయాలి? అత్యధిక మందివిద్వాంసుల ప్రకారం ఒక్క భార్య తప్ప మరే వస్తువూ అతని కొరకు నిషిద్ధం (హరామ్)కాజాలదు. అతను పరిహారం చెల్లించవలసిన అవసరం కూడా లేదు. కాని అతను భార్యను తన కొరకు నిషిద్ధంగా ప్రకటిస్తే మాత్రం ఇది అతనికి వర్తిస్తుంది. అలా ప్రకటించటం వెనుక అతని ఉద్దేశం విడాకులివ్వటమే అయి ఉంటే విడాకులిచ్చేసినట్లే.ఒకవేళ విడాకులివ్వాలన్నది అతని అభిమతం కాకుంటే మాత్రం అది ప్రమాణం (ప్రతిజ్ఞ)గా పరిగణించబడుతుంది. అట్టి పరిస్థితిలో అతను పరిహారం (కఫ్ఫారా) చెల్లించవలసి ఉంటుంది. (ఐసరుత్తఫాసీర్).

3. ఆ రహస్య విషయం తేనె విషయమో లేక మారియా (రదియల్లాహు అన్హా)ను నిషేధించుకోవటమో అయి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా)తో చెప్పారు.

4. హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఈ విషయాన్ని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)కు చేరవేశారు.

5. తాను చెప్పిన రహస్యాన్ని రట్టుచేసిన సంగతిని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హఫ్సాకు తెలియజేశారు. అయితే తన ఉన్నత స్థానం గౌరవ మర్యాదల దృష్ట్యా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిపైఎలాంటి రాద్ధాంతం చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు. విషయాన్ని చూచాయగా మాత్రమే ప్రస్తావించారు.

6.నేను చెప్పిన రహస్యాన్ని నువ్వు బహిర్గతం చేశావు గదా! అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిలదీసినపుడు హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే ఈ రహస్యాన్ని ఆమె ఆయిషా (రదియల్లాహు అన్హా)కు తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. మొదటి నుంచీ ఈ తంత్రంలో వారిద్దరే భాగస్థులు. కాబట్టి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కూడా ఈ సంగతిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చెప్పే ప్రసక్తే ఉండదు.

7. దీన్నిబట్టి బోధపడేదేమిటంటే ఖుర్ఆన్ మాత్రమేగాక ఇతర విషయాలు కూడాదైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ‘వహీ’ద్వారా తెలియజేయబడేవి.

8. అంటే – మీరు గనక దైవసమక్షంలో పశ్చాత్తాపపడితే మీ పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది.

9. అంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇష్టంలేని ఒకానొక విషయంలో మీరిద్దరూ కుమ్మక్కుఅయ్యారంటే మీ హృదయాలు సత్యం నుండి కొద్దిగా ప్రక్కకు తొలిగాయి. (ఫత్ హుల్ ఖదీర్).

10. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా మీరు జట్టు కట్టినంత మాత్రాన మీరు ప్రవక్తకు ఎలాంటి నష్టం కలిగించలేరు. ఎందుకంటే ప్రవక్తకు అల్లాహ్ అండదండలున్నాయి. దైవదూతల, విశ్వాసుల తోడ్పాటు కూడా అతనికి ఉన్నది.

11. ప్రవక్త సతీమణులకు ఈ ఆయతు హెచ్చరిక వంటిది.జాగ్రత్త! మీరేమనుకుంటున్నారు!? అల్లాహ్ గనక తలిస్తే ప్రవక్తకు మీకన్నా ఉత్తమురాలైన భార్యలను- మీకు బదులుగా – ప్రసాదిస్తాడు.

12. “సయ్యిబాత్” అంటే తిరిగివచ్చే వారు అని అసలు అర్థం. వితంతువు అయిన స్త్రీని ‘సయ్యిబ్’ అని ఎందుకంటారంటే, ఆమె తన భర్త నుండి తిరిగివస్తుంది (భర్తను కోల్పోయి వస్తుంది). కన్య (బిక్రున్) అంటే – ఇంకా భర్త పొందు ఎరగనిది, సృష్టించబడిన స్థితిలోనే ఉన్నది అని అర్థం (ఫత్ హుల్ ఖదీర్).

13.ఈ ఆయతులో విశ్వాసులైన ముస్లింలకు అత్యంత ముఖ్యమైన వారి బాధ్యతను గుర్తుచేయటం జరిగింది. అదేమంటే వారు తమతోపాటు తమ కుటుంబసభ్యులను కూడా సంస్కరించాలి. వారికి ధార్మికంగా మంచి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే వారు నరకాగ్నిబారి నుండి రక్షించుకోగలుగుతారు. అందుకే పిల్లలు ఏడేండ్ల వయస్సుకు చేరుకోగానేవారికి నమాజు గురించి ప్రోత్సహించాలని, పదేండ్ల తరువాత వారు నమాజుల పట్ల అశ్రద్ధవహిస్తే వారిని దండించాలని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు(సుననె అబూ దావూద్, సుననె తిర్మిజీ – కితాబుస్సలాత్). అలాగే వారిచేత ఉపవాసాలు పాటింపజేయాలి. ఇతర షరీయతు ఆదేశాలను కూడా వారు అవలంబించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారు పెద్దవారయ్యాక సత్యధర్మమైన ఇస్లాంకు కట్టుబడి జీవితం గడుపుతారు (ఇబ్నె కసీర్).

14. నిష్కల్మషమైన లేక నిజమైన పశ్చాత్తాపం అంటే ఇది : 1. మనిషి తాను చేసిన ఏ పాపం పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాడో దాన్ని త్యజించాలి. 2. ఆ తప్పుపై అల్లాహ్ సమక్షంలో సిగ్గుతో కుమిలిపోవాలి. 3. ఇకమీదట ఎన్నడూ దానిని తిరిగి చేయనని సంకల్పించుకోవాలి. 4. తాను చేసిన తప్పు మానవ హక్కులకు సంబంధించినదైతే-ఉదాహరణకు: ఎవరి హక్కునయినా తాను కబళించి ఉంటే, దాన్ని తిరిగి ఇచ్చివేయాలి. తాను దౌర్జన్యం చేసిన వారికి క్షమాపణ చెప్పాలి. కేవలం ముఖం మీద లెంపలేసుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు.

15.కపటుల కాంతి ఆర్పివేయబడినప్పుడు విశ్వాసులు ఈ విధంగా ప్రార్థిస్తారు. అల్ హదీద్ సూరాలో దీని వివరాలు వచ్చాయి. స్వర్గంలో ప్రవేశించేవరకూ ఈ కాంతిని మిగిల్చి ఉంచమని, పూర్తి కాంతిని ప్రసాదించమని వారు విన్నవించుకుంటారు.

16. అవిశ్వాసులతో ధర్మయుద్ధం చేయటంతో పాటు కపటులకు కూడా గుణపాఠం నేర్పాలి.ముఖ్యంగా వారు షరీయతు పరిమితులను ఉల్లంఘించినట్లు రుజువైనపుడు కపటులను కఠినంగా శిక్షించాలి.

17. అంటే – ధర్మపరిచయం విషయంలో వారి యెడల చాలా ఖచ్చితంగా ఉండు. షరీయతు ఆదేశాలలో కూడా వారిపట్ల నిర్ద్వంద్వంగా వ్యవహరించు. ఎందుకంటేవారు మృదువుగా వ్యవహరిస్తే వినే రకం కాదు. దండోపాయమే వారికి తగినమందు. దైవసందేశ ప్రచారకార్యంలో మృదుత్వం అవసరమే. కాని ఒక్కోసారి సూటిగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ప్రతిచోటా మెతక వైఖరి మంచిదికాదు. అలాగే ప్రతిచోటా కఠిన వైఖరి కూడా మంచిది కాదు. పరిస్థితుల స్వరూపాన్ని బట్టి, వ్యక్తుల, సముదాయాల మనస్తత్వాలను బట్టి తగు విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది.

18. అంటే – అవిశ్వాసుల, కపటుల నివాస స్థలం నరకం అవుతుంది.

19. అరుదైన, విచిత్రమైన ఒక సంఘటనను బోధించి దానిద్వారా అటువంటి మరోస్థితిని, సంఘటనను వివరించటాన్ని ‘మసలున్’ (ఉపమానం లేక ఉదాహరణ)అంటారు. ఈ ఆయతులో కూడా అవిశ్వాసుల కరడు గట్టిన వ్యతిరేకతనుఎత్తిచూపుతూ, వారి బోధనార్థం గతంలోని ఉదాహరణ ఇవ్వబడింది. ఇది నూహ్ ప్రవక్తగారి భార్య ఉపమానం.

20. ఇక్కడ ‘ద్రోహం’ అంటే భావం శీలానికి సంబంధించిన ద్రోహం కాదు. ఆ మాటకొస్తే ఏ ప్రవక్త భార్య కూడా చెడునడత గలది కాజాలదన్న విషయంపై విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది (ఫత్ హుల్ ఖదీర్). అయితే నూహు, లూతు ప్రవక్తల భార్యలు తమ భర్తల సందేశాన్ని నమ్మలేదు. పైగా వారు కాపట్యానికి లోనై తమ భర్తల సందేశానికి వ్యతిరేకంగా, తమ జాతి జనులకు మద్దతు ఇచ్చారు. ఉదాహరణకు:హజ్రత్ నూహు భార్యనే చూడండి, ఆమె తన భర్త గురించి జనులకు చెబుతూ ‘ఆయన గారికి పిచ్చిపట్టుకున్నట్టుంది’ అని అనేది. అలాగే లూతు భార్య తన భర్తకు వ్యతిరేకంగా గూఢచారి కార్యకలాపాలు నిర్వహించేది. తన భర్త దగ్గరికి వచ్చిన యువ అతిథుల గురించి ఆమె తన జాతి వారికి సమాచారం అందజేసింది. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వీరిద్దరూ తమ భర్తల గురించి ప్రజలకు చాడీలు చెప్పేవారు.

21.హజ్రత్ నూహ్ (అలైహిస్సలాం), హజ్రత్ లూత్ (అలైహిస్సలాం)లు దైవప్రవక్తలు,దైవసామీప్యం పొందిన దాసులై ఉండి కూడా తమ భార్యలను దైవ శిక్ష నుండి రక్షించలేకపోయారు.

22. ఈ మాట వారికి ప్రళయదినాన అనబడుతుంది లేదా మరణ సమయంలో అనబడింది.అవిశ్వాసుల ఈ ఉపమానాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటంలోని ఉద్దేశం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులను హెచ్చరించటమే. వారు ముమ్మాటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి దీపాల వంటివారే. వారు ఇతర మహిళామణుల కన్నా శ్రేష్ఠులు అన్నది కూడా నిజమే. అయినా సరే వారు గనక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదిరించినా, లేక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనసు నొప్పించినా అది క్షంతవ్యం కాజాలదు.అల్లాహ్ వారిని నిలదీయవచ్చు. అదే గనక జరిగితే వారిని ఇక కాపాడేవాడెవడూ ఉండడు.

23. అంటే ముస్లింలలో సహనస్థయిర్యాలను, ధైర్యసాహసాలను, వజ్రసంకల్పాన్ని నూరిపోయటం కోసం ఫిరౌను భార్యను ఉపమానంగా పేర్కొన్నాడు. ఫిరౌను లాంటి కరడు గట్టిన దైవవిరోధి భార్యయే విశ్వాస మార్గంలో నిలకడ కలిగి ఉన్నప్పుడు,మీరు మాత్రం ఎందుకు స్థిరంగా ఉండలేరు? అని అల్లాహ్ యిక్కడ చెప్పదలిచాడు.

24. హజ్రత్ మర్యమ్ (అలైహిస్సలాం)ను ఇక్కడ ప్రస్తావించటంలోని ఉద్దేశ్యం ఇది:ఆమెగారు మార్గ విహీనులైన జనుల మధ్య నివసిస్తూ కూడా శీలవతిగా, వినయవతిగా రాణించి దైవప్రసన్నతను చూరగొన్నది. అల్లాహ్ ఆమెకు ప్రపంచ మహిళలందరిపై శ్రేష్ఠతనుప్రసాదించాడు.

25. ఇక్కడ ప్రభువు వచనాలు అంటే దైవసూచనలు, దైవాజ్ఞలు అని భావం.

26. ఆమె పుట్టిన వంశం దైవభక్తుల వంశం. ఆ వంశంలో అంతకు ముందు చాలామంది సజ్జనులు, విధేయులు జన్మించారు. ఆమె కూడా సద్వర్తనలో ఎన్నదగ్గ మహిళ. హదీసులో ఇలా ఉంది: “స్వర్గంలోని స్త్రీలలో అందరికన్నా ఉత్తములు హజ్రత్ ఖదీజా, హజ్రత్ ఫాతిమా, హజ్రత్ మర్యమ్, ఫిరౌన్ భార్యయగు ఆసియాలు.” (ముస్నద్అహ్మద్ – 1/293; అస్సహీహతు లిల్ అల్బానీ – 1508). మరొక హదీసులోమహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు : ”పురుషులలో పూర్ణపరిణతి గలవారు చాలామంది గతించారు. కాని స్త్రీలలో పరిపూర్ణత నొందినవారు ఫిరౌను భార్యయగు ఆసియా, ఇమ్రాన్ పుత్రిక అయిన మర్యమ్, ఖువైలిద్ కుమార్తె అయిన ఖదీజా(రదియల్లాహు అన్హా)లే. కాగా; సరీద్ వంటకానికి ఇతర వంటకాలపై ఎటువంటి ఆధిక్యత ఉందో మహిళలలో ఆయిషా (రదియల్లాహు అన్హా)కు కూడా అటువంటి ఆధిక్యతే ఉంది`’. (సహీహ్ బుఖారీ – కితాబు బద్ యిల్ ఖల్ఖ్. సహీహ్ ముస్లిం – కితాబుల్ ఫజాయెల్).