2.7 ఖుర్భానీ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1280 – حديث جُنْدَبٍ، قَالَ: صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَوْمَ النَّحْرِ ثُمَّ خَطَبَ ثُمَّ ذَبَحَ، فَقَالَ: مَنْ ذَبَحَ قَبْلَ أَنْ يُصَلِّيَ فَلْيَذْبَحْ أُخْرَى مَكَانَهَا، وَمَنْ لَمْ يَذْبَحْ فَلْيذْبَحْ بِاسْمِ اللهِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 23 باب كلام الإمام والناس في خطبة العيد

1280. హజ్రత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఈదుల్ అద్ హా (బక్రీద్ పండుగ) రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మొదట నమాజు చేశారు. తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. ఆ తరువాత బలి (ఖుర్బానీ) పశువుని జిబహ్ చేశారు. (ఆ సందర్భంలో) ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరైనా నమాజుకు పూర్వం పశువుని జిబహ్ చేసి ఉంటే అతను దానికి బదులు మళ్ళీ మరొక పశువుని జిబహ్ చేయాలి. నమాజుకు ముందు ఖుర్బానీ ఇవ్వనివాడు (నమాజు తరువాత) అల్లాహ్ పేరుతో (అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి) పశువుని జిబహ్ చేయాలి”.

(సహీహ్ బుఖారీ:- 13వ ప్రకరణం – ఈదైన్, 23వ అధ్యాయం – కలామిల్ ఇమామి వన్నాసి ఫీ ఖుత్భతిల్ ఈద్)

1281 – حديث الْبَرَاءِ بْنِ عَازِبٍ، قَالَ: ضَحَّى خَالٌ لِي، يُقَالُ لَهُ أَبُو بُرْدَةَ، قَبْلَ الصَّلاَةِ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: شَاتُكَ شَاةُ لَحْمٍ فَقَالَ: يَا رَسُولَ اللهِ إِنَّ عِنْدِي دَاجِنًا جَذَعَةً مِنَ الْمَعَزِ قَالَ: اذْبَحْهَا، وَلَنْ تَصْلُحَ لِغَيْرِكَ ثُمَّ قَالَ: [ص:4] مَنْ ذَبَحَ قَبْلَ الصَّلاَةِ فَإِنَّمَا يَذْبَحُ لِنَفْسِهِ، وَمَنْ ذَبَحَ بَعْدَ الصَّلاَةِ فَقَدْ تَمَّ نُسُكُهُ وَأَصَابَ سُنَّةَ الْمُسْلِمِينَ
__________
أخرجه البخاري في: 73 كتاب الأضاحي: 8 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لأبي بردة ضح بالجذع من المعز

1281. హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మా మామయ్య హజ్రత్ అబూ బర్దా (రదియల్లాహు అన్హు) పండుగ నమాజుకు పూర్వం ఖుర్బానీ పశువుని జిబహ్ చేశారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో “నీ మేక మాంసం కోసం కోయబడిన మేకయ్యింది (ఖుర్బానీ కాలేదు)” అని అన్నారు. దానికి మా మామయ్య “దైవప్రవక్తా! నా దగ్గర (ఇప్పుడు) ఒక మేక పిల్ల మాత్రమే ఉంది” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “దాన్నే జిబహ్ చేసెయ్యి (ఈ రాయితీ నీ కోసం ప్రత్యేకం). నీకు తప్ప మరెవరికీ పశుపిల్లను బలివ్వడం ధర్మసమ్మతం కాదు” అని అన్నారు. ఆ తరువాత ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఈద్ నమాజుకు ముందు పశువుని బలిస్తే అతను తన కోసం పశువుని బలిచ్చిన వాడవుతాడు. మరెవరైనా పండుగ నమాజు తరువాత పశువుని కోస్తే అతను ఖుర్బానీ చేసిన వాడవుతాడు. అదీగాక అతను ముస్లిముల సంప్రదాయాన్ని ఆచరించిన వాడిగా పరిగణించబడతాడు”.*

(సహీహ్ బుఖారీ:- 73వ ప్రకరణం – అజాహి, 8వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) లి అబీ బుర్దత జహ్హీ బిల్ జజయి మినల్ మఅజీ)

* ఖుర్బానీ (పశుబలి) నిర్ణీత సంపద గల ధనికునికి వాజిబా (తప్పనిసరా) కాదా అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భేదాభిప్రాయాలున్నాయి, అధిక సంఖ్యాక ధర్మవేత్తల దృక్పథం ప్రకారం ఖుర్బానీ ఇవ్వడం సున్నత్ (ప్రవక్త సంప్రదాయం) మాత్రమే, (విధి కాదు). కాబట్టి ఖుర్బానీ ఇవ్వనివాడు పాపాత్ముడు కాలేడు. దీనికి ఖజా కూడా లేదు. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ అబూ యూసుఫ్ (రహిమహుల్లాహ్), ఇస్ హాఖ్ (రహిమహుల్లాహ్) , అబూసౌర్ (రహిమహుల్లాహ్) , లజ్ని (రహిమహుల్లాహ్), దావూద్ జాహిరీ (రహిమహుల్లాహ్) మొదలైన వారి అభిప్రాయం ఇదే. ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) , ఔజాయి (రహిమహుల్లాహ్) , రబిఆ (రహిమహుల్లాహ్) , లైస్ (రహిమహుల్లాహ్)ల అభిప్రాయం ప్రకారం నిర్ణీత సంపదగల ధనికునికి ఖుర్బానీ ఇవ్వడం తప్పనిసరి. ఇమామ్ నఖయి (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ధనికుడు హజ్ నియమాలు పాటిస్తూ ఖుర్బానీ రోజున (జిల్ హజ్ పదో తేదీ) మినాలో ఉండకపోతే విధి (వాజిబ్)గా ఖుర్బానీ ఇవ్వాలి. జిల్ హిజ్ పదో తేదీన సూర్యోదయానికి ముందే ఖుర్బానీ ఇస్తే అది సరయిన పద్దతి కాదన్న విషయంపై అందరి మధ్యా ఏకీభావం ఉంది.

పోతే సూర్యాస్తమయం తరువాత ఖుర్బానీ ఇచ్చే విషయంలో కూడా భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్), అబూదావూద్ (రహిమహుల్లాహ్) , ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ల దృక్పథం ప్రకారం జిల్ హిజ్ పదో తేదీన సూర్యాస్తమయం తరువాత పండుగ నమాజు, రెండు ఖుత్బాలు (ప్రసంగాలు) జరిగినంత సమయం గడిచిపోతే ఖుర్బానీ ఇచ్చే వేళ అయినట్లే. ఆ తరువాత ఎవరైనా ఖుర్బానీ ఇస్తే అది సమంజసమే అవుతుంది. అతను ఇమామ్ వెనుక ఈద్ నమాజు చేసినా, చేయకపోయినా, అతను పట్టణవాసి అయినా, పల్లెవాసి అయినా, బాటసారి అయినా కాకపోయినా, అప్పటి దాకా ఇమామ్ ఖుర్బానీ ఇచ్చినా, ఇవ్వకపోయినా, అతను ఖుర్బానీ ఇస్తే విధి నెరవేరినట్లే. ఇమామ్ అబూహనీఫా (రహిమహుల్లాహ్) , అతా (రహిమహుల్లాహ్) ల దృక్పథం ప్రకారం గ్రామాల్లో, అడవుల్లో నివసించే వారికి జిల్ హజ్ పదో తేదీ ఉషోదయం తరువాత ఖుర్బానీ వేళ ప్రారంభమవుతుంది. పట్టణ వాసులకు ఇమామ్ నమాజు, ఖుత్బా విధులు నెరవేర్చనంత వరకు, ఖుర్బానీ వేళ కాదు. అంటే దానికి ముందు ఖుర్బానీ ఇస్తే అది సరికాదన్న మాట. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ఇమామ్ నమాజు, ఖుత్బాలు ముగించనంతవరకు ఇతరులు ఖుర్బానీ ఇస్తే అది సరికాదు. ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ఇమామ్ నమాజు చేయడానికి ముందు ఇతరులు ఖుర్బానీ ఇవ్వడం సరికాదు. ఇమామ్ నమాజ్ చేసిన తరువాత అతను ఖుర్బానీ ఇంకా ఇవ్వకపోయినా ఇతరులు (పట్టణవాసులు, గ్రామీణ వాసులు) మాత్రం ఖుర్బానీ ఇవ్వవచ్చు. రబియా (రహిమహుల్లాహ్) అభిప్రాయం ప్రకారం ఇమామ్ లేని చోట సూర్యోదయానికి పూర్వం ఖుర్బానీ ఇవ్వడం సరికాదు. సూర్యోదయం తరువాత ఇవ్వొచ్చు. ఖుర్బానీ ఇచ్చే చివరి వేళ ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) , ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) ల దృష్టిలో పదమూడవ తేదీ సాయంత్రం వరకు ఉంది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) , ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) ల దృష్టిలో పన్నెండవ తేదీ సాయంత్రం వరకు ఉంది. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) దృష్టిలో రాత్రివేళ ఖుర్బానీ ఇవ్వడం సరికాదు. (ఇమామ్ నవవీ- రహిమహుల్లాహ్)

1282 – حديث أَنَسٍ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ ذَبَحَ قَبْلَ الصَّلاَةِ فَلْيُعِدْ فَقَامَ رَجُلٌ، فَقَالَ: هذَا يَوْمٌ يُشْتَهى فِيهِ اللَّحْمُ وَذَكَرَ مِنْ جِيرَانِهِ فَكَأَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَدَّقَهُ قَالَ: وَعِنْدِي جَذَعَةٌ أَحَبُّ إِلَيَّ مِنْ شَاتَيْ لَحْمٍ، فَرَخَّصَ لَهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلاَ أَدْرِي أَبَلَغَتِ الرُّخْصَةُ مَنْ سِوَاهُ، أَمْ لاَ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 5 باب الأكل يوم النحر

1282. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- “ఎవరైనా పండుగ నమాజుకు పూర్వం ఖుర్బానీ ఇచ్చి ఉంటే అతను (నమాజు తరువాత) మళ్ళీ ఖుర్బానీ ఇవ్వాల్సి ఉంటుంది” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఒక వ్యక్తి ఈ మాట విని లేచి “దైవప్రవక్తా! ఈ రోజు జనం మాంసాన్ని కోరుకుంటారు కదా! (అందుచేత నేను ముందే ఖుర్బానీ ఇచ్చాను)” అని అన్నాడు. తరువాత అతను ఇరుగుపొరుగు (అవసరాలను) గురించి కూడా ప్రస్తావించాడు – దాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా సమర్థించినట్లు. ఆ తరువాత అతను మళ్ళీ ఇలా అన్నాడు: “నా దగ్గర ఒక మేకపిల్ల ఉంది. అది కండగల రెండు మేకల కన్నా నాకెంతో ఇష్టమైనది. (మరి ఇప్పుడు నేను దీన్ని బలివ్వాల్నా?” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని (ఆ మేక పిల్లను బలివ్వడానికి) అతనికి అనుమతినిచ్చారు. అయితే ఈ అనుమతి అతని కొక్కడికే ఉందా లేక ఇతరులక్కూడా ఉందా అన్న సంగతి నాకు తెలియదు.

(సహీహ్ బుఖారీ:- 13వ ప్రకరణం – ఈదైన్, 5వ అధ్యాయం – అల్ అక్లి యౌమనహ్ర్ )

1283 – حديث عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَعْطَاهُ غَنَمًا يَقْسِمُهَا عَلَى صَحَابَتِهِ، فَبَقِيَ عَتُودٌ، فَذَكَرَهُ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: ضَحِّ أَنْتَ
__________
أخرجه البخاري في: 40 كتاب الوكالة: 1 باب وكالة الشريكِ الشريكَ في القسمة وغيرها

1283. హజ్రత్ ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులకు పంచివ్వడానికి నాకు కొన్ని మేకలను అప్పగించారు. (పంచి పెట్టిన తరువాత) యేడాది వయసు గల ఒక మేక పిల్ల మిగిలిపోతే దాన్ని గురించి నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర ప్రస్తావించాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అది విని “దాన్ని నీవు ఖుర్బానీ ఇచ్చుకో” అని చెప్పారు.

(సహీహ్ బుఖారీ:- 40వ ప్రకరణం – వికాలా, 1వ అధ్యాయం – వకాలతుష్షరీకి అష్షరీక ఫిల్ ఖిస్మా వగైరిహా)

1284 – حديث أَنَسٍ، قَالَ: ضَحَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِكَبْشَيْنِ أَمْلَحَيْنِ أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى وَكَبَّرَ، وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا
__________
أخرجه البخاري في: 83 كتاب الأضاحي: 14 باب التكبير عند الذبح

1284. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు గొర్రెలను ఖుర్బానీ ఇచ్చారు. అవి తెలుపు నలుపు రంగు గలవి. వాటికి కొమ్ములు కూడా ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాటిని తమ స్వహస్తాలతో జిబహ్ చేశారు. జిబహ్ చేసేటప్పుడు “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని పఠించి గొర్రె మెడ మీద తన కాలు పెట్టారు.

(సహీహ్ బుఖారీ:- 73వ ప్రకరణం – అజాహి, 14వ అధ్యాయం – అత్తక్బీరీ ఇన్దజ్జబ్ హి)

1285 – حديث رَافِعِ بْنِ خَدِيجٍ، قَالَ: قُلْتُ يَا رَسُولَ اللهِ إِنَّا لاَقُو الْعَدُوِّ غَدًا، وَلَيْسَتْ مَعَنَا مُدًى فَقَالَ: اعْجَلْ أَوْ أَرِنْ، مَا أَنْهَرَ الدَّمَ وَذُكِرَ اسْمُ اللهِ فَكُلْ، لَيْسَ السِّنَّ وَالظُّفُرَ، وَسَأُحَدِّثُكَ أَمَّا السِّنُّ فَعَظْمٌ، وَأَمَّا الظُّفُرُ فَمُدَى الْحَبَشَةِ وَأَصَبْنَا نَهْبَ إِبِلٍ وَغَنَمٍ، فَنَدَّ مِنْهَا بَعِيرٌ، فَرَمَاهُ رَجُلٌ بِسَهْمٍ، فَحَبَسَهُ فَقَالَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّ لِهذِهِ الإِبِلِ أَوَابِدَ كَأَوَابِدِ الْوَحْشِ، فَإِذَا غَلَبَكُمْ مِنْهَا شَيْءٌ فَافْعَلُوا بِهِ هكَذَا
__________
أخرجه البخاري في: 72 كتاب الذبائح والصيد: 23 باب ما ندّ من البهائم فهو بمنزلة الوحش

1285. హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో “దైవప్రవక్తా! రేపు ఉదయం మనం శత్రువును ఎదుర్కొనవలసి ఉంది. మరి మా దగ్గర కత్తులు లేవు” అని అన్నాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు. “(పశువును) శీఘ్రంగా జిబహ్ చేయండి. రక్త ప్రవాహానికి కారణమయ్యే వస్తువుల్లో నీవు తలచిన వస్తువుతో జిబహ్ చేయవచ్చు. జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు పఠించాలి. ఆ తరువాత దాన్ని తిను. (మరొక విషయం ) పళ్ళతో, గోళ్ళతో జిబహ్ చేయకూడదు. దానిక్కారణం చెబుతాను. పన్ను కూడా ఎముకే (ఎముకతో జిబహ్ చేయడం ధర్మసమ్మతం కాదు). గోరు నీగ్రోల కత్తి”.

ఒకసారి మాకు విజయప్రాప్తిగా ఒంటెలు, మేకలు లభించాయి. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. ఒక వ్యక్తి దాని మీదికి ఒక బాణం వదిలాడు. దాంతో అది ఆగిపోయింది. ఆ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు: “ఈ ఒంటెలలో కూడా కొన్ని క్రూరమైనవి ఉంటాయి. అందువల్ల వాటిలో ఏదైనా ఒంటే తప్పించుకుపోతే దాని పట్ల ఇలాంటి పద్ధతే అవలంబించాలి”.

(సహీహ్ బుఖారీ:- 72వ ప్రకరణం – అజ్జిబాయిహి వ స్సైద్, 23వ అధ్యాయం – మానిద్దమినల్ బహాయిమ్)

1286 – حديث رَافِعِ بْنِ خَدِيجٍ، قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، بِذِي الْحُلَيْفَةِ، فَأَصَابَ النَّاسَ جُوعٌ، فَأَصَابُوا إِبِلاً وَغَنَمًا، قَالَ: وَكَانَ النَّبِيُّ فِي أُخْرَيَاتِ الْقَوْمِ، فَعَجِلوا وَذَبَحُوا وَنَصَبُوا الْقُدُورَ فَأَمَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَالْقُدُورِ فَأُكْفِئَتْ، ثُمَّ قَسَمَ، فَعَدَلَ عَشَرَةً مِنَ الْغَنَمِ بِبَعِيرٍ، فَنَدَّ مِنْهَا بَعِيرٌ، فَطَلَبُوهُ فَأَعْيَاهُمْ وَكَانَ فِي الْقَوْمِ خَيْلٌ يَسِيرَةٌ فَأَهْوَى رَجُلٌ مِنْهُمْ بِسَهْمٍ، فَحَبَسَهُ اللهُ ثُمَّ قَالَ: إِنَّ لِهذِهِ الْبَهَائِمِ أَوَابِدَ كَأَوَابِدِ الْوَحْشِ، فَمَا غَلَبَكُمْ مِنْهَا فَاصْنَعُوا بِهِ هكَذَا قُلْتُ: إِنَّا نَرْجُو أَوْ نَخَافُ الْعَدُوَّ غَدًا، وَلَيْسَتْ مُدًى، أَفَنَذْبَحُ بِالْقَصَبِ قَالَ: مَا أَنْهَرَ الدَّمَ وَذُكِرَ اسْمُ اللهِ عَلَيْهِ، فَكُلُوهُ، لَيْسَ السِّنَّ وَالظُّفُرَ، وَسَأُحَدِّثُكُمْ عنْ ذلِكَ أَمَّا السِّنُّ فَعَظْمٌ، وَأَمَّا الظُّفُرُ فَمُدَى الْحَبَشَةِ
__________
أخرجه البخاري في: 47 كتاب الشركة: 3 باب قسمة الغنم

[ص:7] ما كان من النهي عن أكل لحوم الأضاحي بعد ثلاث في أول الإسلام وبيان نسخه وإِباحته إِلى من شاء

1286. హజ్రత్ రాఫె బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) కథనం:- మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట జిల్ హులైఫా ప్రాంతానికి చేరుకున్నాము. అప్పుడు జనానికి ఆకలి కావడం మొదలెట్టింది. వారి దగ్గర విజయప్రాప్తిగా లభించిన మేకలు, ఒంటెలు ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఉండే సైనికదళంలో ఉన్నారు. (ఆయన ఇంకా ఆ ప్రాంతానికి చేరుకోలేదు). అప్పుడు ప్రజలు తొందరపడి విజయప్రాప్తి పంపిణీ చేయకముందే ఆ పశువుల్ని జిబహ్ చేసి, మాంసం కుండలు పొయ్యి మీద పెట్టారు. అందువల్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశంతో ఆ కుండలు బోర్ల పడవేశారు. ఆ తరువాత విజయప్రాప్తి పంచబడింది. ఒక ఒంటె పది మేకలకు సమానంగా పరిగణించబడింది. ఆ ఒంటెలలో ఒక ఒంటె బెదిరి పారిపోయింది. అప్పుడు జనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కాని చాలా అలసిపోయారు. ఆ రోజుల్లో జనం దగ్గర గుర్రాలు చాలా తక్కువగా ఉండేవి – ఒక వ్యక్తి ఆ ఒంటె మీదికి బాణం వదిలాడు. దాంతో అల్లాహ్ దాన్ని ఆపివేయించాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఈ జంతువుల్లో కూడా అడవి మృగాల్లా బెదిరిపోయే క్రూర జంతువులు ఉంటాయి. అందువల్ల అవి మీ అదుపులో లేకుండా పోతే వాటి పట్ల ఇలాంటి పద్ధతే పాటించండి”.

నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! రేపు మనం శత్రువులతో యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుందేమో. మా దగ్గర కత్తులు లేకపోతే వెదురు బద్దలతో పశువుల్ని జిబహ్ చేయవచ్చా?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: “రక్త ప్రవాహానికి కారణభూతమయ్యే ప్రతి వస్తువుతోనూ మీరు జిబహ్ చేయవచ్చు. జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు పఠించి తినాలి. అయితే పళ్ళు, గోళ్ళతో జిబహ్ చేయకూడదు. దానిక్కారణం చెబుతాను. పన్ను ఒక విధమైన ఎముకే, గోరు నీగ్రోల కత్తి (గనక దాంతోనూ పశువుని జిబహ్ చేయకూడదు.)”

(సహీహ్ బుఖారీ:- 47వ ప్రకరణం – షిర్కత్,3వ అధ్యాయం – ఖిస్మతిల్ ఘనం)

1287 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: كُلُوا مِنَ الأَضَاحِي ثَلاَثًا وَكَانَ عَبْدُ اللهِ يَأْكُلُ بِالزَّيْتِ حِينَ يَنْفِرُ مِنْ مِنًى مِنْ أَجْلِ لُحُومِ الْهَدْيِ
__________
أخرجه البخاري في: 73 كتاب الأضاحي: 16 باب ما يؤكل من لحوم الأضاحي وما يتزود منها

1287. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:-

“ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజుల దాకా తినవచ్చని” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఖుర్బానీ మాంసం తినలేరు. అందుచేత ఆయన ‘మినా’ నుండి వెళ్ళిన తరువాత జైతూన్ నూనెతో రొట్టె తినేవారు.” (*)

(సహీహ్ బుఖారీ:- 73వ ప్రకరణం – అజాహి, 16వ అధ్యాయం – మా యూకలు మిల్లుహూ మిల్ అజాహి వమా యుతజవ్వదూ మినహా)

(*) ధర్మవేత్తలలో కొందరు ఈ హదీసుని ఆచరించారు. వారి దృష్టిలో ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి దగ్గర పెట్టుకోవడం నిషిద్ధం. అయితే అధిక సంఖ్యాక ధర్మవేత్తల ప్రకారం ఈ హదీసు రద్దయి పోయింది. వారి దృష్టిలో ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి దగ్గర పెట్టుకోవడం, నిల్వ ఉంచడం ధర్మసమ్మతమే. . (ఇమామ్ నవవీ- రహిమహుల్లాహ్).

1288 – حديث عَائِشَةَ، قَالَتْ: الضَّحِيَّةُ كُنَّا نُمَلِّحُ مِنْهُ، فَنَقْدَمُ بِهِ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ، فَقَالَ: لاَ تَأْكُلُوا إِلاَّ ثَلاَثَةَ أَيَّامٍ وَلَيْسَتْ بِعَزِيمَةٍ، وَلكِنْ أَرَادَ أَنْ يُطْعِمَ مِنْهُ، وَاللهُ أَعْلَمُ
__________
أخرجه البخاري في: 73 كتاب الأضاحي: 16 باب ما يؤكل من لحوم الأضاحي وما يتزود منها

1288. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఖుర్బానీ మాంసాన్ని మేము ఉప్పు కలిపి నిల్వ ఉంచుకునేవారము. తరువాత ఈ మాంసాన్ని మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించేవాళ్ళము. ఆయన ఈ సందర్భంలో “ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజుల దాకా మాత్రమే తినండి” అని అన్నారు. అయితే ఇది తప్పనిసరిగా పాటించవలసిన ఆదేశం కాదు. ఈ మాంసాన్ని (అంటే ఎంతో కాలం నిల్వ ఉంచకుండా) (పేద) ప్రజలకు ఇవ్వండన్నదే ఆయన ఉద్దేశ్యం. వాస్తవం అల్లాహ్ కే తెలుసు. (*)

(సహీహ్ బుఖారీ:- 73వ ప్రకరణం -అజాహి, 16వ అధ్యాయం – మా యూకలు మిల్లుహూ మిల్ అజాహి వమా యుతజవ్వదూ మినహా)

(*) ఈ హదీసుని బట్టి ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి దగ్గర పెట్టుకోవడం తప్పుకాదు. కాకపోతే అందులో నుంచి పేదవాళ్ళకు కూడా దానం చేయాలి. మొత్తం మాంసాన్ని మూడు సమాన భాగాలుగా చేసి ఒక భాగం స్వయంగా తినాలి, మరొక భాగం పేదలకు దానం చేయాలి. వేరొక భాగం బంధుమిత్రలకు ఇచ్చి వేయాలి అని ధర్మవేత్తలు అన్నారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం సగం స్వయంగా తిని, సగం పేదలకు దానం చేయాలి. ఖుర్బానీ మాంసం తినడం అభిలషనీయం మాత్రమే, విధికాదు. (ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్).

1289 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، قَالَ: كُنَّا لاَ نَأْكُلُ مِنْ لُحُومِ بُدْنِنَا فَوْقَ ثَلاَثِ مِنًى، فَرَخَّصَ لَنَا النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: كُلُوا وَتَزَوَّدُوا فَأَكَلْنَا وَتَزَوَّدْنَا
__________
أخرجه البخاري في: 25 كتاب الحج: 124 باب ما يأكل من البدن وما يتصدق

1289. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- మేము మొదట్లో ‘మినా’లో ఉన్నప్పుడు ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజుల కన్నా ఎక్కువ కాలం ఉంచుకొని తినేవాళ్ళము కాదు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “తినండి, నిల్వ కూడా ఉంచుకోండి” అని అనుమతించారు. అందువల్ల మేము తిన్నాము, నిల్వకూడా ఉంచుకున్నాము.

(సహీహ్ బుఖారీ:- 25వ ప్రకరణం – హజ్, 124 వ అధ్యాయం – మా యూకలు మినల్ బుద్ని వమాయత సద్దఖ్ )

1290 – حديث سَلَمَةَ بْنِ الأَكْوَعِ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَنْ ضَحَّى مِنْكُمْ فَلاَ يُصْبِحَنَّ بَعْدَ ثَالِثَةٍ وَفِي بَيْتِهِ مِنْهُ شَيْءٌ فَلَمَّا كَانَ الْعَامُ الْمُقْبِلُ، قَالُوا: يَا رَسُولَ اللهِ [ص:8] نَفْعَلُ كَمَا فَعَلْنَا عَامَ الْمَاضِي قَالَ: كُلُوا وَأَطْعِمُوا وَادَّخِرُوا، فَإِنَّ ذَلِكَ الْعَامَ، كَانَ بِالنَّاسِ جَهْدٌ فَأَرَدْتُ أَنْ تُعِينُوا فِيهَا
__________
أخرجه البخاري في: 73 كتاب الأضاحي: 16 باب ما يؤكل من لحوم الأضاحي وما يتزود منها

1290. హజ్రత్ సలమా బిన్ అక్వ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశిస్తూ “ఖుర్బానీ చేయదలచుకున్న వ్యక్తి మూడు రోజులకు మించి తనింట్లో ఆ మాంసాన్ని మిగిల్చి ఉంచకూడదు” అని అన్నారు. ఆ తరువాత సంవత్సరం “దైవప్రవక్తా! ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం చేసినట్లే చేయాలా?” అని అడిగారు అనుచరులు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీరు తినండి, అర్హులకు అందజేయండి, నిల్వ కూడా ఉంచుకోండి. గత సంవత్సరం ప్రజలు కష్టాలలో ఉన్నారు. అందువల్ల మీరు వారికి సహాయం చేయడానికి నేనలా అన్నాను” అని అన్నారు. (అంటే మాంసం మూడు రోజులకు మించి నిల్వ ఉంచకుండా దాన్ని కష్టాలలో ఉన్న వారికి పంచి పెట్టండని చెప్పాను.)

(సహీహ్ బుఖారీ:- 73వ ప్రకరణం – అజాహి, 16వ అధ్యాయం – మా యూకలు మిల్లుహూ మిల్ అజాహి వమా యుత జవ్వదూ మినహా)

1291 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: لاَ فَرَعَ وَلاَ عَتِيرَةَ وَالْفَرَعَ أَوَّلُ النِّتَاجِ كَانُوا يَذْبَحُونَهُ لَطَوَاغِيتِهِمْ
__________
أخرجه البخاري في: 71 كتاب العقيقة: 3 باب الفرع

1291. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “ఫరా, అతీరా (ఒంటె పిల్లలు) * రెండూ అధర్మమైనవి”. (హదీసు ఉల్లేఖకుని కథనం:-) ఫరా అంటే విగ్రహాల పేర బలివ్వబడే మొదటి ఒంటెపిల్ల. (సహీహ్ బుఖారీ:- 71 వ ప్రకరణం – అఖీఖా , 3వ అధ్యాయం – అల్ ఫరా)

* రజబ్ నెల మొదటి దశకంలో జిబహ్ చేసే ఒంటె పిల్లను ‘అతీరా‘ అంటారు. ఫరా గురించి ఒక అభిప్రాయం ప్రకారం ఎవరి దగ్గరైనా వంద ఒంటెలు పోగయితే, అతను అందులో మొదట ఈనిన ఒంటె పిల్లను విగ్రహాల పేర బలి ఇస్తాడు. ఈ రెండు రకాల ఒంటె బలులు అజ్ఞాన కాలం నాటి దురాచారాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చేయకూడదని ఉపదేశిస్తూ ఇవి దురాచారాలు మాత్రమేనని అన్నారు. అయితే ఎవరైనా (తాను వంద ఒంటెల యజమాని అయినందుకు) అల్లాహ్ పట్ల కృతజ్ఞతగా అల్లాహ్ పేర బలి ఇస్తే అది ధర్మసమ్మతమే. ఇతర హదీసుల్లో ఇలా చేయడానికి అనుమతి ఉంది. (ఇమామ్ నవవీ – రహిమహుల్లాహ్).