‘హదీసు’వేత్తల జీవిత విశేషాలు – మిష్కాతుల్ మసాబీహ్

‘హదీసు’వేత్తల సంక్షిప్త జీవిత గాథలను బస్తవీ గారు ”రియాదుల్ముహద్దిసీన్”లో పేర్కొన్నారు. ఇక్కడ కేవలం రచయిత తన ముందుమాటలో పేర్కొన్న ‘హదీసు’వేత్తలను గురించి పేర్కొనబడింది.

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] – టెక్స్ట్ రూపంలో [Text]

బు’ఖారీ పేరు, ముహమ్మద్‌ – అబూ అబ్దుల్లాహ్. బిరుదు ఇమాముల్‌ ము’హద్దిసీ’న్‌, అమీరుల్‌ ము’హద్దిసీ’న్‌. ఇతని వంశ పరంపర ముహమ్మద్బిన్ఇస్మాయీల్బిన్ఇబ్రాహీమ్బిన్అల్ముగీరహ్.

జన్మం, ఖరసాన్ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.). మరణం, 1-10-256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖందులో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు. ఇతని శిక్షకులు, అహ్మద్ బిన్ హంబల్, అలీ బిన్ మదీనీ, ఇస్హాఖ్ బిన్ రహ్వే. ఇతని శిశ్యులు ముస్లిం బిన్ హజ్జాజ్, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.

బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్‌, బిరుదు అబుల్‌ ‘హసన్‌. ఇతను మలిక్ బిన్ అనస్ శిశ్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్‌ చాలా పరిశుద్ధులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లాడుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్‌ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్‌’ఖలానీ)

బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవే కాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థించడం, దైవ భీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొర పెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్నతనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతులెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్‌ (అ)ను కలలో చూశారు. ‘నీ ప్రార్థన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్‌ నీ కొడుకు కళ్ళకు స్వస్థత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని ”తారీఖ్కబీర్” అనే పుస్తకం వ్రాశారు.

బాల్యం, విద్యాభ్యాసం, శిక్షణ, గురువులు: బు’ఖారాలో 194 హిజ్రీ శకంలో రమ’దాన్‌ 13వ తేదీన జుమ’అహ్ నమా’జ్‌ తర్వాత జన్మించారు. బు’ఖారీ గురించి చాలా తక్కువ విషయాలు తెలిసినా, అతని విద్యాభ్యాసం, శిక్షణ జరిగిన తీరు చాలా ఉత్తమ మైనదని తెలుస్తుంది. ఎందుకంటే అతని తండ్రి కూడా ఒక ‘హదీసు’వేత్తే. అతని తండ్రి ఇస్మా’యీల్‌ బాల్యం లోనే మరణించారు. అందువల్ల తల్లి సంరక్షణా బాధ్యతలు తనపై ఎత్తుకున్నారు. కొంత వయస్సు పెరిగిన తర్వాత ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక కలిగింది. ఎందుకంటే వారిది ‘హదీసు’వేత్తల కుటుంబం.

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: ”నేనింకా బడిలో ఉండగానే ‘హదీసు’ విద్య నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగింది.” వర్రాఖ్‌ బు’ఖారీని ”మీకు ‘హదీసు’ విద్య నేర్చుకోవాలని కోరిక కలిగినప్పుడు మీ వయస్సు ఎంత” అని అడిగితే ”అప్పుడు నా వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు. అప్పటి నుండే బు’ఖారీ ‘హదీసు’వేత్తల సభలలో పాల్గొన సాగారు.

ప్రారంభదశలోనే ఒక సంఘటన జరిగింది. బు’ఖారా లోని ప్రఖ్యాత పండితులు దా’ఖలీ అలవాటు ప్రకారం ‘హదీసు’లను బోధిస్తున్నారు. అప్పుడు ఆ సభలో బు’ఖారీ కూడా ఉన్నారు. దా’ఖలీ ఒక ‘హదీసు’ ప్రామాణికతను పేర్కొంటూ, ”సుఫియాన్‌ అన్‌ అబి’జ్జుబేర్‌ అన్‌ ఇబ్రాహీమ్‌” అని అన్నారు. బు’ఖారీ అది విని, ”అన్న అబా’జ్జుబేర్‌ లమ్‌ యరౌ ఇబ్రాహీమ్‌” – అంటే ‘అబు ‘జ్జుబేర్‌ ఇబ్రాహీమ్‌ ద్వారా ఉల్లేఖించ లేదు,’ అని అన్నారు. అప్పుడు బు’ఖారీ వయస్సు 11 సంవత్సరాలు.

బుఖారీ అప్రమత్తత: అజ్‌లోనీ బు’ఖారీ అప్రమత్తత గురించి, ఉపద్రవాలకు దూరంగా ఉండటాన్ని గురించి ఒక సంఘటన పేర్కొన్నారు. ”బు’ఖారీ తన విద్యాభ్యాసం రోజుల్లో ఒకసారి సముద్ర ప్రయాణం చేశారు. ఓడపై ఎక్కారు. అతని వద్ద 1000 అష్రఫీలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి బు’ఖారీకి సేవలు చేసి, చాలా గౌరవభావం వ్యక్తం చేశాడు. బు’ఖారీతో చాలా కలివిడిగా ప్రవర్తించ సాగాడు. బు’ఖారీ కూడా అతన్ని తన శ్రేయోభిలాషిగా భావించసాగారు. చివరికి తన వద్ద 1000 అష్రఫీలు ఉన్నాయని కూడా అతనికి తెలుపడం జరిగింది.

ఒక రోజు బు’ఖారీ మిత్రుడు నిద్రలేచి ఏడ్వటం పెడబొబ్బలు పెట్టటం, తల మొత్తుకోవడం చేశాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడ సాగారు. అసలే ఏమయిందని అడగారు.’ ప్రజలు అంతగా అడుగు తుంటే, ఆ వ్యక్తి నా దగ్గర 1000 అష్రఫీల సంచి ఉండేది. అది పోయింది అని ఏడువసాగాడు. ప్రజలు పడవలో ఉన్న వారందరినీ సోదా చేశారు. బు’ఖారీ ఎవరికీ తెలియకుండా తన అష్రఫీల సంచిని సముద్రంలో పారవేశారు. ఆ తరువాత బు’ఖారీని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరి వద్దా అది దొరక్కపోయే సరికి, వారు ఆ వ్యక్తినే చీవాట్లు పెట్టారు.

ప్రజలందరూ ఓడనుండి దిగారు. ఆ వ్యక్తి ఏకాంతంలో బు’ఖారీని కలిశాడు. ‘తమరు ఆ అష్రఫీల సంచి ఏం చేశారు?’ అని అడిగాడు. బు’ఖారీ, ‘ఆ సంచిని సముద్రంలో పారవేసాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఇంత పెద్ద మొత్తాన్ని పారవేయటానికి మీ మనసెలా ఒప్పింది,’ అని అడిగాడు. ”నీకు బుద్ధుందా? నా జీవితమంతా ప్రవక్త (స) ‘హదీసు’లను రాయడంలోనే గడచి పోయింది. నాకు ప్రజల్లో గౌరవ ఆదరణలు ఉన్నాయి. మరి నాపై దొంగతనం నింద రావటాన్ని నేనెలా భరించగలను? జీవితమంతా శ్రమించి సంపాదించిన నీతి నిజాయితీని కొన్ని అష్రఫీలకు ఎలా బలి చేయగలను,” అని సమాధానం ఇచ్చారు.

సద్గుణాలు, అలవాట్లు, ప్రవర్తన: బు’ఖారీకి వారసత్వంలో తండ్రి ఆస్తి అధిక మొత్తంలో లభించింది. అతని తండ్రి గారిది చాలా పెద్ద వ్యాపారం. సాధారణంగా వ్యాపారుల్లో అనేక అవకతవకలు, లోటు పాట్లు జరుగుతుంటాయి. అందువల్ల వ్యాపారం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బు’ఖారీ తండ్రి ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో తన ప్రత్యేక శిష్యుడైన అబూ హఫ్స్‌తో, ‘నేను నా ధనంలో ఒక్క దిర్‌హమ్‌ కూడా అధర్మమైనదిగా ఎరుగను.’ అని అన్నారు. అది విన్న అబూ హఫ్స్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇస్మా’యీల్‌ వ్యాపారంలో చాలా అప్రమత్తంగా ఉండే వారు. ఇస్మా’యీల్‌ తన మరణ సమయంలో అబూ హఫ్స్‌తో నా వారసునికి సహాయ సహకారాలు అందించాలి, అతన్ని విడిచి వెళ్ళిపోకూడదు, కష్టాల్లో అతని నుండి సహాయం పొందు,’ అని హితవు చేశారు.

‘హదీసు’వేత్త ముహమ్మద్‌ బిన్‌ అబీ హాతిమ్‌ కథనం: బు’ఖారీ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టారు. ఎటువంటి చింత లేకుండా ధార్మిక సేవలో నిమగ్నమై పోయారు. అల్లాహ్‌ అతన్ని ఎటువంటి కష్టాలకు, ఆపదలకు గురి కాకుండా సంరక్షించాడు.

స్వభావంలో ఎంతో నమ్రత, సున్నితత్వం, కారుణ్య గుణం ఉండేది. ఒకసారి వ్యాపార భాగస్వామి 25 వేల దిర్‌హమ్‌లు నొక్కేశాడు. శిష్యులు, ‘అప్పు తీసుకున్న వాడు వచ్చాడు, అతన్నుండి అప్పు వసూలు చేసుకోండి, ‘ అని అన్నారు. దానికి బు’ఖారీ, ‘అప్పు వాడిని ఇబ్బంది పెట్టడం సబబు కాదు’ అని అన్నారు.

బు’ఖారీ తన వ్యాపార లాభాలతో పండితులను, విద్యార్థులను సంరక్షించాలని ప్రయత్నించేవారు. ప్రతి నెల తన ఆదాయంలో నుండి 500 దిర్‌హమ్‌లు దీనికి కేటాయించే వారు. పండితులకు, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. అన్న పానీయాల విషయంలో భోగ, విలాసాలకు దూరంగా ఉండేవారు. బు’ఖారీ గుమస్తా అయిన ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘హాతిమ్‌ కథనం: ఒకసారి విద్యార్జనా కాలంలో ఆదమ్‌ బిన్‌ అబీ అయాస్‌ వద్దకు వెళ్ళే ప్రయాణంలో ప్రయాణ సామగ్రి అంతా అయి పోయింది. కొన్ని రోజుల వరకు ఆకులు అలములు తిని గడిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ ఏదీ అడగలేదు. బు’ఖారీ దైవ భీతి, దైవభక్తి, దయ, న్యాయం, ధర్మం మొదలైన ఉత్తమ గుణాలు కలిగి ఉండేవారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ అస్సియార్‌ఫీ కథనం: నేను ఒకసారి ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ ఇంటికి వెళ్ళాను. అతని సేవకురాలు అతని ప్రక్క నుండి వెళ్ళింది. ఆమె కాలు తగిలి సిరా పడిపోయింది. వెంటనే బు’ఖారీ ఆగ్రహం చెంది, ‘ఎలా నడుస్తున్నావు?’ అని అన్నారు. దానికి సేవకురాలు, ‘దారిలేకపోతే ఎలా నడిచేది? ‘ అని చెప్పింది. అది విని బు’ఖారీ ఆగ్రహం చెందడానికి బదులు, ”పో నిన్ను నేను విడుదల చేసి వేశాను,” అని అన్నారు. అప్పుడు నేను ”ఆమె మిమ్మల్ని కోపం తెప్పించింది. తమరు కోప్పడటానికి బదులు ఆమెను విడుదల చేసి వేశారా?” అని అడిగాను. దానికి బు’ఖారీ, ”ఆమె చేసినదానికి నన్ను నేను సంతృప్తి పరచుకున్నాను.” అంటే బు’ఖారీ ఆమెను చీవాట్లు పెట్టే బదులు తన్ను తాను చీవాట్లు పెట్టుకున్నారు.

ఒకసారి బు’ఖారీ తండ్రిగారి శిష్యుడైన అబూ ‘హఫ్‌స్‌ కొంత సరుకును బు’ఖారీ వద్దకు పంపారు. కొంత మంది వ్యాపారులు సాయంత్రం వచ్చి 5000 రుసుము ఇచ్చి సరుకు తీసుకొని వెళతామని అన్నారు. దానికి బు’ఖారీ ‘ఇప్పుడు వెళ్ళిపోండి, ఉదయం రండి, ఇచ్చి తీసుకు వెళ్ళండి’ అని అన్నారు. మరుసటి రోజు ఉదయం కొందరు వ్యాపారులు వచ్చి, 5వేలకు బదులు 10 వేలు ఇచ్చి సరకు తీసుకు వెళతామన్నారు. కాని బు’ఖారీ తరువాత వచ్చిన వ్యాపారులను రాత్రి వచ్చిన వ్యాపారికి అమ్మాలని నిశ్చయించుకున్నాను అని చెప్పి వాళ్ళను పంపి వేశారు. అనంతరం మొదట వచ్చిన వ్యాపారులకు ఆ సరకును అమ్మివేశారు. ఈ విధంగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక తన వాగ్దానానికి ప్రాధాన్యత ఇచ్చారు.

‘హదీసు’వేత్తల నాయకుడు బగ్దాద్‌ పట్టణం చేరుకున్నారు. బగ్దాద్‌ బనీఅబ్బాస్ పరిపాలనా కాలంలో ఇస్లామీయ విద్యకు కేంద్రంగా మారిపోయింది. హారూన్‌, మామూన్‌ వంటి మహారాజులు దీని అభి వృద్ధికి కృషి చేశారు. బగ్దాద్‌ గొప్ప గొప్ప పండితులకు, ధార్మిక వేత్తలకు నిలయంగా మారింది. బు’ఖారీ పేరు ప్రఖ్యాతులు బగ్దాద్‌ వరకు వ్యాపించాయి.

బు’ఖారీ బగ్దాద్‌ వచ్చారు. అతని రాక మామూలు విషయం కాదు. అతన్ని పరీక్షించటానికి బగ్దాద్‌ నగర పండితులు, ‘హదీసు’వేత్తలందరూ ఏకమయ్యారు. వంద ‘హదీసు’లను వాటి సాక్ష్యాధారాలను కలగా పులగం చేసి, బహిరంగంగా ప్రజల ముందు పరీక్షించడానికి ఏర్పాటు చేశారు. నగరంలోని మహా విద్యావంతులందరూ ఏకమయ్యారు. అతని ముందు నిర్దేశించిన వ్యక్తులు ‘హదీసు’లు చదవసాగారు. బు’ఖారీ, ”నాకు తెలియదు” అని అన్నారు. ఈ విధంగా అనేక మంది వ్యక్తులు కలగాపులగం చేసిన, మార్పులు చేర్పులు చేసిన ‘హదీసు’లు చదవగా బు’ఖారీ కేవలం, ”నాకు తెలియదనే” సమాధానం ఇచ్చారు. ఈవిధంగా నిర్ణయించిన ‘హదీసు’లన్నీ అయిపోయాయి. బు’ఖారీని ఎరుగని వారు, బు’ఖారీ ఓడిపోయారని భావించారు. కాని అతన్ని గురించి తెలిసిన వారు బు’ఖారీ మా ఎత్తు తెలుసుకున్నారు అని గ్రహించారు. బు’ఖారీ వెంటనే నిలబడి వారు కలగాపులగం చేసి, మార్పులు చేర్పులు చేసి చదివిన ‘హదీసు’లను సరైన రీతిలో ఏమాత్రం తప్పు లేకుండా చదివి వినిపించారు. ఈ విధంగా వారు వినిపించిన ‘హదీసు’ఇలన్నింటినీ వారికి ఎలాంటి తప్పులు లేకుండా వినిపించారు. అది చూసి బగ్దాద్‌ ప్రజానీకం ఆశ్చర్య పడకుండా ఉండలేక పోయారు. ఇంకా వారి గొప్పతనాన్ని స్వీకరించారు.

మరణం: బు’ఖారీ 13 రోజులు తక్కువ 62 సంవత్సరాల వయస్సులో ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రాత్రి 256 హిజ్రీ శకంలో మరణించారు. మరణించిన తరువాత కూడా శరీరం నుండి చెమట వస్తూనే ఉంది. చివరికి స్నానం చేయించి కఫన్‌ చుట్టు వేయడం జరిగింది. కొంతమంది సమర్‌ఖంద్‌ తీసుకువెళదామని కోరారు. ఇంకా ఖనన ప్రదేశం విషయంలో కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాని తరువాత అక్కడే ఖననం చేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు ”జుహర్‌ నమా’జు తర్వాత ఖననం చేయబడ్డారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ తన మరణానికి ముందు తనను ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం 3 వస్త్రాల్లో ఖననం చేయాలని ఉపదేశించారు.

ఖతీబ్‌ అబ్దుల్‌ వా’హిద్‌ బిన్‌ ఆదమ్‌ అత్తవాల్‌ లేసీ యొక్క సంఘటన పేర్కొన్నారు, ”నేను ప్రవక్త (స)ను తన సహచరుల బృందం వెంట ఒకచోట వేచి ఉన్నారు. ఎవరి గురించో ఎదురుచూస్తున్నారు. నేను సలామ్‌ చేసి, ‘ఎవరి గురించి ఎదురుచూస్తున్నారు’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నేను ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీ’ల్‌ గురించి ఎదురుచూస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బు’ఖారీ మరణ వార్త నాకు తెలిసింది. అప్పుడు నేను కల సమయాన్ని, మరణ సమయాన్ని కలిపి చూశాను. ఆ రెండూ ఒకే సమయం, ఒకే దినంగా నిర్థారించాను. ఎందుకంటే షరీఅత్‌లో సత్యమైన స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగంగా నిర్థారించటం జరిగింది. బు’ఖారీ మరణంపై పండితులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

బుఖారీ రచనలు: అత్తారీ’ఖుల్‌ కబీర్‌, అత్తారీఖుల్‌ అవ్ సత్‌, అత్తారీఖ్ అస్సగీర్, అల్‌ జామిఉల్‌ కబీర్‌, ఖల్‌ఖు అఫ్‌ఆలిల్‌ ఇబాద్‌, కితాబుద్దుఅఫాయిల్‌ అస్సగీర్, అల్‌ ముస్నదుల్‌ కబీర్‌, అత్తఫ్‌సీరుల్‌ కబీర్‌,   కితాబుల్‌ హిబహ్, అసామిస్సహాబహ్, కితాబుల్‌ విజ్‌దాన్‌, కితాబుల్‌ మబ్‌సూత్‌, కితాబుల్‌ ఇలల్‌, కితాబుల్‌ కినా, కితాబుల్‌ ఫవాయిద్‌, అల్‌ అదబుల్‌ ముఫ్రద్‌, జుజ్‌ఉరఫ్‌ఉల్‌ యదైన్‌, బిర్రుల్‌ వాలిదైన్‌, కితాబుల్‌ అష్‌రిబహ్, ఖ’దాయస్సహాబహ్ వత్తాబియీన్‌, కితాబుర్రిఖాఖ్‌, అల్‌ జామిఉస్సగీర్‌ ఫిల్‌ ‘హదీస్’, జు’జ్‌ఉ ఖిరాఅతి ‘ఖల్‌ఫల్‌ ఇమామ్‌ మొదలైనవి.

సహీ బుఖారీ ఆదరణ, దాని గొప్పతనం: బు’ఖారీ రచనల్లో అల్జామిఉస్సహీహ్‌” ఈనాడు ‘స’హీ’హ్ బు’ఖారీ పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ప్రపంచంలోని ఇస్లామీయ ప్రాంతాలన్నింటిలో దీన్ని ప్రచురించడం జరిగింది. బు’ఖారీకి ‘హదీసు’వేత్తల నాయకుడిగా బిరుదు ఇచ్చే కారణాల్లో ఈ పుస్తకం కూడా ఒక కారణమే. దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ తరువాత ఏ పండితుని పుస్తకానికీ ఈ స్థానం లభించలేదు.

హీహ్ బుఖారీ రాయాలనే ఆలోచన: ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహ్‌వియహ్‌ బు’ఖారీని ‘స’హీ’హ్‌ బు’ఖారీ రాయ మని కోరారు. ఇబ్రాహీమ్‌ బిన్‌ మాఖల్‌ నసఫీ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, ”ఒకరోజు మేము ఇస్‌’హాఖ్‌ బిన్‌ రాహ్‌వియహ్‌ వద్ద కూర్చొని ఉన్నాము. అప్పుడతను, ”నువ్వు ప్రవక్త (స) ప్రామాణిక ‘హదీసు’లను ఒకచోట చేర్చితే బాగుండు,” అని అన్నారు. ఆ మాట నా మనసులో నాటుకుంది. నేను అప్పటి నుండే ‘స’హీ’హ్ బు’ఖారీని వ్రాయడం ప్రారంభించాను.

మరో కారణం ఏమిటంటే, బు’ఖారీ ప్రవక్త (స)ను కలలో చూశారు. ”నేను ప్రవక్త(స) సన్నిధిలో నిలబడి నా చేతిలో ఉన్న విసనకర్రతో ప్రవక్త (స)పై నుండి ఈగ లను తోలుతున్నాను.” మేల్కొన్న తరువాత పండితులతో దాని పరమార్థాన్ని గురించి అడిగాను. దానికి వారు, ‘ప్రవక్త (స)పై కల్పించిన అసత్య ‘హదీసు’లను నీవు తొలగిస్తావు,’ అని పరమార్థం తెలిపారు. ఎందుకంటే సత్య స్వప్నాలు దైవ దౌత్యంలోని 46వ భాగం అని ఉంది. ప్రవక్త (స)ను కలలో చూసిన వారు నిజంగా కలలో చూశారు. ఈకల కూడా మరింత కుతూహలాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈవిధంగా ”జామె’ ‘స’హీ’హ్‌” రచనలో బు’ఖారీ నిమగ్నం అయిపోయారు.

రచనా సమయం మరియు సరళి: ‘స’హీ’హ్ బు’ఖారీని, బు’ఖారీ ఎప్పుడు మరియు ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఎలా రచించారు. రచించిన తరువాత, ఎవరి ముందు ప్రవేశపెట్టారు. ప్రతి విషయంపై చర్చించారు.

వర్రాఖ్‌ కథనం: బు’ఖారీ ఇలా అన్నారు, ”నేను జామె’ ‘స’హీ’హ్‌ను మూడుసార్లు రచించాను. అంటే దాన్ని మూడుసార్లు సరిదిద్దాను.”

అబుల్‌ ‘హైస’మ్‌ కష్‌మిహ్నీ కథనం: నేను ఫర్‌బరీ ద్వారా ఇలా విన్నాను, అతను ఇలా అన్నారు. బు’ఖారీ కథనం: నేను ఏ ‘హదీసు’నూ స్నానం చేసి రెండు రకాతులు చదవనంత వరకు అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌లో చేర్చలేదు.

మరో ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: ”దాన్ని నేను మస్జిదె ‘హరామ్‌లో రచించాను. ఇంకా ప్రతి ‘హదీసు’పై రెండు రకాతుల నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవాడిని. దానిపట్ల పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే ‘అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌’లో చేర్చేవాడిని దీన్ని నేను నా సాఫల్యం కోసం వ్రాశాను. 6 లక్షల ‘హదీసు’ల్లో ప్రామాణికమైన ‘హదీసు’లను ఎంచి వ్రాశాను.”

ఇబ్నె అదీ తన గురువుల బృందం ద్వారా ఇలా పేర్కొన్నారు: బు’ఖారీ అల్‌ జామి’ఉ’స్స’హీ’హ్‌ యొక్క అధ్యాయాలన్నిటినీ ప్రవక్త (స) గది మరియు మెంబర్ల మధ్య కూర్చొని, ప్రతి అధ్యాయానికి ముందు రెండు రకాతులు నమా’జు చదివి వ్రాసేవారు.

వర్రాఖ్‌ కథనం: నేను బు’ఖారీ వెంట ఉన్నాను. నేను బు’ఖారీని కితాబుత్తఫ్‌సీర్‌ వ్రాస్తూ ఉండగా చూశాను. రాత్రి 15, 20 సార్లు లేచి దీపం వెలిగించి ‘హదీసు’లపై గుర్తుపెట్టి పడుకునేవారు. దీన్ని బట్టి బు’ఖారీ ఎల్లప్పుడూ, ప్రతి చోట తన ధ్యానం అంతా దానిపైనే పెట్టే వారు. ఒక ‘హదీసు’ పట్ల పూర్తి నమ్మకం కలగగానే దానిపై గుర్తు పెట్టేవారు. ఇక అధ్యాయాలను బు’ఖారీ ఒకసారి ‘హరమ్‌లో మరోసారి ప్రవక్త (స) గదికి మెంబరుకు మధ్య సంకలనం చేసేవారు. ఈ అధ్యాయాలలో ‘హదీసు’లను సంకలనం చేసినపుడు ముందు స్నానం చేసి నమా’జు చదివి ఇస్తిఖారా చేసేవారు.

అబూ జ’అఫర్‌ అఖీలీ కథనం: బు’ఖారీ, ‘స’హీ’హ్ బు’ఖారీని రచించి, ఆనాటి గొప్ప పండితులు అంటే అహ్మద్‌ బిన్‌హంబల్, ‘అలీ బిన్‌ మదీనీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌ మొదలైన వారి ముందు పెట్టారు. అందరూ చాలా మెచ్చుకున్నారు. ఇంకా ప్రశంసించారు. దాని ప్రామాణికతను మెచ్చుకున్నారు. కాని నాలుగు ‘హదీసు’ల పట్ల అభ్యంతరం తెలిపారు. ఈ నాలుగు ‘హదీసు’ల విషయంలో కూడా బు’ఖారీ అభి ప్రాయం సరైనదిగా తేలింది. ఆ నాలుగు ‘హదీసు’లు కూడా ప్రామాణికమైనవిగా తేలాయి. (సీరతుల్‌ బు’ఖారీ)

—–

పేరు, వంశం, జననం: పేరు ముస్లిమ్‌, పిలిచే పేరు అబుల్హసన్, బిరుదు అసాకిరుద్దీన్‌, హిజ్రీ శకం 206 లో, నేషాపూర్లో జన్మించారు. వంశ పరంపర, ముస్లిమ్బిన్హజ్జాజ్బిన్దర్ద్బిన్కూషాజ్, ముస్లిమ్‌ వంశ పరంపర ఖషీర్‌ తెగకు చెందినది. అందువల్ల అతన్ని ఖషీరీ అంటారు. ఇంకా అతని సొంత ఊరు నేషాపూర్‌. ‘హదీసు’ విద్యలో ఆరితేరిన గొప్ప పండితులు. ఇతని విద్యా జ్ఞానాలు, కంఠస్తం, నిజాయితీ గురించి పండితు లందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ముస్లిమ్‌ ‘ఇరాఖ్‌, ‘హిజా’జ్‌, షామ్‌, బగ్దాద్‌ మొదలైన ప్రాంతాల వైపు ప్రయాణం చేశారు. ‘హదీసు’ విద్య విషయంలో ఈ ప్రాంతాలకు అనేక సార్లు పర్యటించడం జరిగింది. అదే విధంగా బగ్దాద్‌ అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఒకసారి బగ్దాద్‌లో బోధించడం కూడా జరిగింది. చివరి సారిగా 259హిజ్రీ శకంలో బగ్దాద్‌ వెళ్ళారు. ఇతనికి అనేక మంది గురువులు ఉన్నారు. యహ్‌యా బిన్‌ యహ్‌యా, అహ్మద్‌ బిన్‌హంబల్, ఇస్‌హాఖ్‌ ఇబ్నె రాహ్‌వయ్‌, అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌లమహ్‌, ముహమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్‌ అల్‌బుఖారీ మొదలైన వారున్నారు. దీన్ని ముస్లిమ్‌ గర్వంగా భావిస్తారు.

శిష్యులు: కూడా అనేకమంది ఉన్నారు. అబూ హాతిమ్‌ రాజీ, అబూ ఈసా తిర్మిజీ‘, అబూ బకర్‌ బిన్‌ ఖుజైమహ్, యహ్‌యా బిన్‌ సాయిదహ్‌, అబూ అవాన్‌ మొదలైనవారు. చాలా గొప్ప పండితులు వీళ్ళందరూ. ముస్లిమ్‌ సంతృప్తికరమైన స్వభావం కలిగి ఉండేవారు. అందువల్లే ఎవరినీ ఏదీ అడిగేవారు కాదు, ఏనాడూ ఎవరినీ గురించీ పరోక్షంగా నిందించలేదు, ఎవరినీ కొట్టలేదు. ఎవరినీ తిట్టలేదు. ‘హదీసు’లను గుర్తించడంలో తన తోటివారి కంటే ముందడుగు వేశారు. కొన్ని విషయాల్లో బు’ఖారీని కూడా అధిగమించారు.

మరణం: 261 హిజ్రీ శకంలో 25 రజబ్ నాడు నేషాపూర్లోని నసీర్‌ ఆబాద్‌లో 55 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని మరణ వృత్తాంతం చాలా ఆశ్చర్యకరమైనది. ఒకరోజు సభలో కొందరు ఒక ‘హదీసు’ గురించి అడిగారు. అనుకోకుండా ఆ ‘హదీసు’ అతనికి గుర్తుకు రాలేదు. ఇంటికి వచ్చి గ్రంథాల్లో, పుస్తకాల్లో వెతకసాగారు. ముందు ఖర్జూరాల బుట్ట ఒకటి ఉంది. ఒక్కొక్క ఖర్జూరం తింటూ ‘హదీసు’ను వెతకసాగారు. ‘హదీసు’ వెతకడంలో నిమగ్నం అయిపోయి, బుట్టలో ఉన్న ఖర్జూరాలన్నీ తినేసారు. అతనికి ఏమాత్రం తెలియలేదు. ఈ కారణంగానే అతను మరణించారు. (తహ్‌జీబుత్తహ్‌జీబ్‌)

అబూ ‘హాతిమ్‌ రా’జీ ముస్లిమ్‌ మరణానంతరం అతన్ని కలలో చూసి ‘ఎలా ఉన్నారు’ అని అడిగారు. దానికి ముస్లిమ్‌ ‘అల్లాహ్‌ నాకు స్వర్గం ప్రసాదించాడు’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్‌ మనందరికి కూడా స్వర్గం ప్రసాదించుగాక! ఆమీన్‌.

రచనలు: ముస్లిమ్‌ రచనల గురించి ‘హాకిమ్‌ ఇలా వ్రాస్తున్నారు: ”ముస్లిమ్‌ రచనల్లో ముస్నద్‌ కబీర్‌ ఒకటి, కితాబుల్‌ అస్మా, కితాబుత్తమీ’జ్‌, కితాబుల్‌ ఇలల్‌, కితాబుల్‌ విజ్‌దాన్‌, కితాబుల్‌ అఫ్‌రాజ్‌, కితాబుల్‌ ఖిరాన్‌, కితాబుసవాలా అహ్‌మద్‌ బిన్‌ హంబల్‌, కితాబు ‘హదీసి’ అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌, కితాబుల్‌ ఇన్‌తిఫా బి ఇహా బిస్సిబా, కితాబు మషాయిఖి ఇమామ్‌ మాలిక్‌, కితాబు మషాయిఖి సౌరీ, కితాబు మషాయిఖి షూబీ, కితాబు మన్‌ లైసలహు ఇల్లా రఅల్‌ వాహిద్‌, కితాబుల్‌ ముహ్‌ఖరీన్‌, కితాబు అల్‌వాది సహాబిహి, కితాబు అన్‌హామిల్‌ ము’హద్దిసీన్‌, కితాబుత్తబఖాత్‌, కితాబు అఫ్‌రాదిష్షామీన్‌.

ఇవి ముస్లిమ్‌ ప్రఖ్యాత రచనలు. వీటిలో అనేకం ప్రచురించబడ్డాయి. వీటిని సంక్షిప్తంగా తజ్‌కిరతుల్‌ ‘హుఫ్ఫా”జ్‌ ద్వారా పేర్కొనడం జరిగింది. వీటి వివరాలు ముతవ్వలాద్‌లో లభిస్తాయి. ముస్లిమ్‌ రచనల్లో ‘స’హీ’హ్ ముస్లిమ్‌ గురించి ముస్లిమ్‌ సమాజంలో అందరికీ తెలిసిందే. కొన్ని విషయాల్లో ముస్లిమ్‌ బు’ఖారీని అధిగమించారు. ‘స’హీ’హ్ ముస్లిమ్‌కు బు’ఖారీపై ప్రాముఖ్యత ఇవ్వడం కూడా కొంతవరకు వాస్తవమే. మ’గ్‌రిబ్‌లోని కొందరు పండితులు ‘స’హీ’హ్ బు’ఖారీపై ‘స’హీ’హ్ ముస్లిమ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బు’ఖారీలో లేని కొన్ని నియమ నిబంధనలు ముస్లిమ్‌లో ఉన్నాయి.

ఇబ్ను ‘సలా’హ్‌ అభిప్రాయం: బు’ఖారీ, ముస్లిమ్‌లో ఉన్న ‘హదీసు’లన్నీ ప్రామాణికమైనవే. వీరి ప్రామాణి కతపై ముస్లిమ్‌ సమాజమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది. ముస్లిమ్‌లో అన్నీ కలిపి 7,275 ‘హదీసు’లు ఉన్నాయి. ఒకేసారి పేర్కొనబడినవి 4000 ఉన్నాయి. ”నేనీ ‘హదీసు’లను 2 లక్షల ‘హదీసు’ల్లో నుండి ఎన్నుకున్నాను” అని ముస్లిమ్‌ అన్నారు. ఇంకా, ”ప్రజలందరూ 200 సంవత్సరాల వరకు ‘హదీసు’లు వ్రాసినా, నా పుస్తకం పట్లనే నమ్మకం కలిగి ఉంటారు,” అని అన్నారు. అదేవిధంగా ముస్లిమ్‌ నుండి ప్రవక్త (స) వరకు మధ్య నలుగురు ఉల్లేఖన కర్తలు ఉన్నదే ముస్లిమ్‌ వద్ద ప్రామాణిక ఉల్లేఖనం. అదేవిధంగా బు’ఖారీ వద్ద ముగ్గురు ఉల్లేఖన కర్తలు ఉన్న ‘హదీసు’ ప్రామాణికమైనది. ముస్లిమ్‌ ‘హదీసు’ వృత్తిలో అనేక పుస్తకాలు రచించారు. అయితే ‘స’హీ’హ్ ముస్లిమ్‌ అన్నిటి కంటే పేరు ప్రఖ్యాతులు పొందింది. ‘స’హీ’హ్ ముస్లిమ్‌ యొక్క అనేక వివరణలు ఉన్నాయి.

—–

మాలిక్‌ బిన్‌ అనస్‌ బిన్ మాలిక్ బిన్ అబూ ఆమిర్ అల్ అస్బాహీ, 93 హిజ్రీ (711క్రీ. శ) లో జన్మించారు. ఇంకా 179 హిజ్రీ (7-11-795 క్రీ. శ)లో మరణించారు. ఇతనికి ఇమాము దారుల్‌ హిజ్రత్‌ అనే బిరుదు కూడా ఉంది. పొడవుగా, దృఢంగా, పొడవైన ముక్కు, అందంగా, వెడల్పు గల నుదురు, తలపై తక్కువ వెంట్రుకలు, దట్టమైన గడ్డం, కేవలం పెదాలపై ఉన్న వెంట్రుకలను కత్తిరించేవారు. రెండు వైపుల వెంట్రుకలను వదలివేసే వారు.

మాలిక్‌ బిన్‌ అనస్‌ తబె తాబయీన్ తరానికి చెందిన వారు. ఇతని గురువుల సంఖ్య 900 ఉండేది. వీరిలో 300 తాబయీన్లు, 600 తబె తాబయీన్లు. ఉల్లేఖనాల మధ్య వ్యక్తుల పరిశీలనలో మాలిక్‌కు మించిన వారెవరూ లేరు. మాలిక్‌కు ‘హదీసు’లోని ఏదైనా భాగంలో అనుమానం వస్తే మొత్తం ‘హదీసు’నే వదలి వేసేవారు. తూర్పూ పడమరల మధ్య ప్రవక్త (స) ‘హదీసు’ల విషయంలో మాలిక్‌ కంటే నమ్మకమైన వ్యక్తి మరొకరు లేరు. అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక కాలం రాబోతున్నది. ప్రజలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కాని, మదీనహ్ పండితుని కంటే గొప్ప పండితుడు దొరకడు.” (తిర్మిజి’, ‘స’హీ’హ్‌) సుఫియాన్‌ బిన్‌ ఉయైన వారు మాలిక్‌ బిన్‌ అనస్‌ అని భావిస్తున్నారు.

ఖల్‌ఫ్‌ బిన్‌ ‘ఉమర్‌ కథనం: నేను ఇమామ్‌ మాలిక్‌ వద్ద కూర్చొని ఉన్నాను. ఇంతలో మదీనహ్ ఖారీ ఇబ్నె కసీర్ ఇమామ్‌ మాలిక్‌కు ఒక పత్రం ఇచ్చారు. ఇమాముగారు దాన్ని చదివి, తన జానీమాజ్‌ క్రింద ఉంచుకున్నారు. అతను నిలబడ్డారు. అతనితో పాటు నేను కూడా నిలబడ్డాను. కూర్చోమని అన్నారు. ఇంకా ఆ పత్రం నాకు ఇచ్చారు. అందులో ఒక స్వప్నం గురించి ఇలా వ్రాసి ఉంది: ”ప్రజలు ప్రవక్త (స) ను చుట్టుముట్టి ఉన్నారు. ప్రవక్త(స)ను ఏదో అర్థిస్తున్నారు. అప్పుడు, ప్రవక్త (స), ‘నేను ఈ మెంబరు క్రింద ఒక పెద్ద గుప్త నిధిని దాచి ఉంచాను. దీన్ని మీకు పంచి పెట్టమని మాలిక్‌కు చెప్పాను, అందువల్ల మీరందరూ మాలిక్‌ వద్దకు వెళ్ళండి. ప్రజలు అక్కడి నుండి తిరిగి వచ్చి ‘మాలిక్‌ పంచిపెడతారా లేదా’ అని అన్నారు. మరొకరు ‘అతడు తనకు ఆదేశించబడింది తప్పకుండా చేస్తాడు’ అని అన్నారు. ఈ కల వల్ల మాలిక్‌ ఎంత ప్రభావితు లయ్యారంటే, అతడు ఏడుస్తూనే ఉన్నారు. అతడు ఏడుస్తూ ఉండగానే నేను వెళ్ళిపోయాను.”

అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ మహ్‌దీ కథనం: మేము మాలిక్‌ వద్దే ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ‘నేను 6 నెలల దూరం నుండి ఒక ప్రశ్న అడగాలని వచ్చాను’ అని అన్నాడు. ‘ఏమిటా ప్రశ్న’ అని అడిగారు. అతను చెప్పాడు. అప్పుడు మాలిక్‌ బిన్‌ అనస్‌, ‘దీన్ని గురించి నాకు సరిగ్గా తెలియదు,’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి ఆశ్చర్యపడి, ‘మరి మా ఊరి వారితో ఏమనాలి’ అని అడిగాడు. దానికి మాలిక్‌ బిన్‌ అనస్‌ ‘తనకు తెలియదని అన్నారని చెప్పు’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి అతని చెల్లెలితో ‘ఇతను ఇంట్లో ఏం చేస్తారు’ అని అడిగాడు. దానికి ఆమె ఖుర్‌ఆన్‌ పఠన సభలో రాజులు, అధికారులు అందరూ ఉంటారు. కాని సభ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది అని సమాధానం ఇచ్చారు.” (తహ్‌జీబుల్‌ అస్మా)

‘హదీసు’వేత్తల మధ్య అన్నిటి కంటే ప్రామాణికమైన ఉల్లేఖనం ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే నాఫె ద్వారా మాలిక్‌, ఇబ్నె ‘ఉమర్‌ ద్వారా నాఫె ఉన్న ఉల్లేఖనం అన్నిటి కంటే ప్రామాణికమైన ఉల్లేఖనంగా భావించబడుతుంది. ”జుహ్‌రీ కూడా ఇతని గురువుల్లో ఒకరు. అతడు కూడా ఇతని ద్వారా లాభం పొందేవారు. లైస్, ఇబ్నె ముబారక్, షాఫయీ ముహమ్మద్వంటి ప్రఖ్యాత పండితులు ఇతని శిష్యులే. షాఫయీ: ‘ఒక వేళ మాలిక్‌, సుఫియాన్‌ ఉండక పోతే హిజా’జ్‌ విద్య అంతమైపోయేది’ అని అనేవారు. ఇతని కంఠస్తం శక్తి ఎలా ఉండేదంటే ఏదైనా విషయం ఒకసారి వింటే చాలు మరెప్పుడూ మరచిపోయేవారు కాదు. ‘హదీసు’లు ఉల్లేఖించడానికి కూర్చున్నప్పుడు వు’దూ చేసి, మంచి బట్టలు ధరించి, సుగంధ పరిమళాలు పూసుకొని, దువ్వుకొని ఉండేవారు. ప్రజలు ఆ అలంకరణ గురించి అడిగితే ప్రవక్త (స) ‘హదీసు’ల గౌరవం కోసం అలా చేస్తున్నానని అన్నారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అల్‌ ముబారక్‌ కథనం: ఒకసారి మాలిక్‌ ‘హదీసు’ బోధన ప్రారంభించారు. మధ్యలో అతని ముఖ వర్చస్సు మారసాగింది. కాని అతడు బోధను ముగించలేదు. తప్పులూ దొర్లలేదు. ముగించిన తర్వాత అడిగితే, ‘హదీసు’ బోధన మధ్యలో తేలు సుమారు 10 సార్లు కుట్టిందని తెలిపారు. ఇంకా ఇదంతా నేను అంత శక్తి నా కుంది అని చేయలేదు. ప్రవక్త (స) ‘హదీసు’లకు అంతరాయం కలుగ కూడదని అలా చేశాను. షాఫయీ తన చరిత్రలో ఇలా వ్రాస్తున్నారు, ”మాలిక్‌ ప్రవక్త (స)ను చాలా అధికంగా ప్రేమించేవారు. చివరికి వృద్ధాప్యంలో కూడా మదీనహ్ లో వాహనంపై ఎక్కేవారు కారు. ఇంకా, ప్రవక్త (స) శరీరం ఉన్న ప్రాంతంలో నేను వాహనంపై ఎక్కలేను అని అనేవారు.

మాలిక్‌ బిన్‌ అనస్‌ యొక్క సభ ఎప్పుడూ ఖరీదైన  చాపలతో విలాసవంతమైన దిండులతో ముస్తాబై ఉండేది. సభ మధ్యలో ప్రత్యేక కుర్చీ ఉండేది. ‘హదీసు’లను బోధించేటప్పుడు అక్కడ కూర్చునే వారు. అక్కడ కూడ శిష్యుల కోసం విసనకర్రలు ఉండేవి. సభ ప్రారంభ సమయంలో సువాసన పరిమళాలు వెదజల్లబడేవి. సభా ప్రాంగణంలో ఒక చెత్త రవ్వ కూడా కనబడేది కాదు. ‘హదీసు’లను బోధించేటప్పుడు ముందు వు’దూ లేదా గుసుల్‌ చేసి ఖరీదైన దుస్తులు ధరించి, తల దువ్వుకొని, సువాసన పులుముకొని వచ్చేవారు.

శిష్యులందరూ వినయ విధేయతలతో తలలు వంచుకొని కూర్చునే వారు. చివరికి అబూహనీఫా కూడా ఈ సభలోకి వచ్చి కూర్చునే వారు. ఆయన కూడా వినయ విధేయతలతో కూర్చునే వారు. సభలో మాలిక్‌ బిన్‌ అనస్‌ గౌరవం, ఆదరణ ఉట్టి పడేది. అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు. షాఫయీ కథనం: మేము పుస్తకాల ప్రతులను శబ్దం అవుతుందేమో నన్న భయంతో తిరగవేసే వాళ్ళం కాము. ఆయన గౌరవం, నిశ్శబ్దం దృష్ట్యా ఆ సభ చక్రవర్తుల సభగా ఉండేది. విద్యార్థులు, పండితులు, అధికారులు, పాలకులు, బాటసారులు అందరూ వచ్చిపోయేవారు.

ఆయనకు ఎటువంటి అధికారం లేకపోయినా, పాలకులు వచ్చి ఆయన ముందు తలలు వంచి కూర్చునే వారు. షాఫయీ ఒకసారి తన విద్యాభ్యాసం కోసం మదీనహ్ గవర్నరును తన గురించి సిఫారసు చేయడానికి రమ్మంటే, అతడు అక్కడ నా మాట ఎలా చెల్లుతుంది అని అన్నాడు. హారూన్రషీద్ మదీనహ్ వచ్చినపుడు మాలిక్‌ను మువత్తా చదివి వినిపించ మని కోరాడు. అప్పుడు మాలిక్‌ తన సభలోకి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాని మాలిక్‌ తన ఇంట్లో సభలో ఉన్నారు. ఆ తరువాత వచ్చి హారూన్‌ రషీద్‌ అడిగితే, ”విద్య మన దగ్గరకు రాదు, మనం విద్య దగ్గరకు వెళ్ళాలి” అని అన్నారు. చివరికి మాలిక్‌ సభలో హారూన్‌ రషీద్‌ కూర్చోవలసి వచ్చింది.

శిష్యులు, లాభం పొందేవారు: మాలిక్‌ ద్వారా ఎంతో మంది ఉల్లేఖించారు, వారిని లెక్క పెట్టటం సాధ్యం కాదు, అని ‘జహ్‌బీ పేర్కొన్నారు. పాండిత్యం పట్టా పొందిన వారు కూడా మాలిక్‌ సభలో శిష్యులుగా చేరే వారు. చివరికి ఆయన గురువులు కూడా ఆయన సభలో శిష్యులుగా కూర్చునే వారు. నాకు విద్య నేర్పి మళ్ళీ నాకు అడిగే అవసరం రానటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అని మాలిక్‌ పేర్కొన్నారు.

మాలిక్‌ శిష్యుల్లో షాఫయీ, ముహమ్మద్, అబూ యూసుఫ్, ఇబ్ను ఖాసిమ్ మాలికీ ప్రముఖులు. ఆది వారం నాడు అనారోగ్యానికి గురయ్యారు. సుమారు 3 వారాలు అనారోగ్యంతో ఉన్నారు. వ్యాధి ఏమాత్రం తగ్గలేదు. ఇది అతని చివరి సమయం అని అందరూ తెలుసుకున్నారు. మదీనహ్ కు చెందిన పండితులు, పాలకులు, మాలిక్‌ను చివరి సారిగా చూడటానికి హాజరయ్యారు. సేవకులు కూడా కంటతడి పెట్టారు. శిష్యులు కాక ‘హదీసు’ మరియు ఫిఖహ్‌కు చెందిన 160 మంది పండితులు, అతని చుట్టూ కూర్చొని కంటతడి పెట్టారు.

చలనం తగ్గుతూ పోయింది. కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి. ప్రత్యేక శిష్యులైన ఖఅబనీ అప్పుడే వచ్చారు. పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు మాలిక్‌ నేను ఏడ్వక పోతే మరెవరు ఏడుస్తారు. నాకు ప్రతి ఖియాస్‌ ఫత్వాపై ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టి నేను ఫత్వా ఇవ్వకుండా ఉంటే బాగుణ్ణు అని మాట్లాడుతూనే ఉన్నారు. ఇంతలో ప్రాణం పోయింది.

మాలిక్‌ బిన్‌ అనస్‌ ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం 93 హిజ్రీలో జన్మించారు. ఇంకా 11 రబీ ఉల్‌ అవ్వల్‌ 179 హిజ్రీ శకంలో మరణించారు. 86 సంవత్సరాలు వయస్సు పొందారు. 117 హిజ్రీ శకంలో విద్యాబోధన ప్రారంభించారు. 62 సంవత్సరాల వరకు ధార్మిక సేవలో నిమగ్నమయి ఉన్నారు. జనాజాలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదీనహ్ గవర్నర్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’హమ్మద్‌ హాష్మీ కాలినడకనే పాల్గొన్నారు. శవాన్ని ఎత్తినవారిలో కూడా ఉన్నారు. మదీనహ్ లో ఒక ప్రఖ్యాత స్మశాన వాటిక ఉంది (బఖీ’). ఇక్కడ పుణ్యాత్ములే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ‘ఆయి’షహ్‌ (ర), ‘ఉస్మాన్‌ (ర), ‘హసన్‌ (ర), ఫాతిమహ్ (ర), ఖననం చేయబడి ఉన్నారు. అనంతరం మాలిక్‌ బిన్‌ అనస్‌ను కూడా ఇక్కడే ఖననం చేయడం జరిగింది.

—–

ఇతను అబూ ‘అబ్దుల్లాహ్‌ముహమ్మద్బిన్ఇద్రీస్బిన్‌ ‘అబ్బాస్బిన్‌ ‘ఉస్మాన్బిన్షాఫె బిన్సాయిబ్బిన్ఉబైద్బిన్అబ్ద్యజీద్హాషిమ్బిన్‌ ‘అబ్దుల్ముత్తలిబ్ఇబ్నెఅబ్దు మునాఫ్ఖురైషీ మరియు ము’త్తలిబీ. షాఫె యవ్వనంలో ప్రవక్త (స)ను కలిసారు. ఇతని తండ్రి సాయిబ్ బద్ర్‌ యుద్ధంలో పట్టుబడ్డారు.. ఇతను బనీ హాషిమ్ నాయకులు. పరిహారం చెల్లించి విడుదల అయ్యారు. ఆ తరువాత ఇస్లామ్‌ స్వీకరించారు.

షాఫయీ, గజ్జహ్, అస్ఖలాన్ అనే ప్రాంతంలో 150 హిజ్రీ (767 క్రీ. శ.) లో జన్మించారు. 2 సంవత్సరాల వయస్సులో మక్కహ్ రావడం జరిగింది. కొందరు షాఫయీ, అస్ఖలాన్లో జన్మించారని అంటారు. ఇది అబూ హనీఫామరణించిన సంవత్సరం. మరికొందరు అబూ హనీఫా మరణించిన రోజే జన్మించారని అంటారు. జన్మించిన దినం గురించి కొన్ని ఉల్లేఖనాల్లో మాత్రమే ఉందని, అయితే ఆ సంవత్సరమే జన్మించిన విషయం మాత్రం ప్రాచుర్యంలో ఉందని బైహఖీ పేర్కొన్నారు. అదేవిధంగా షాఫయీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అతని తల్లిగారు ఒక నక్షత్రాన్ని కలలో చూశారు. అది అతని కడుపు నుండి బయటకు వచ్చి ముక్కలు ముక్కలు అయిపోయింది. దాని ముక్కలు ప్రతి పట్టణంలో పడ్డాయి. స్వప్న పరమార్థాన్ని చెప్పిన వారు, మీకు ఒక మహా ధార్మిక పండితుడు జన్మిస్తాడని అన్నారు. 

షాఫ’యీ కథనం: నేను స్వప్నంలో ప్రవక్త (స)ను దర్శించాను. ప్రవక్త (స) నాతో, ‘అబ్బాయీ! నీవెవరవు?’ అని అడిగారు. దానికి నేను ‘మీ వంశంలో వాడినే’ అని అన్నాను. ప్రవక్త (స), ‘దగ్గరకు రా’ అని అన్నారు. నేను దగ్గరయ్యాను. ప్రవక్త (స) తన ఉమ్మిని చేతిలోకి తీసుకున్నారు. నేను నా నోటిని తెరిచాను. ప్రవక్త (స) తన ఉమ్మిని నా పెదాలపై, నాలుకపై, ముఖంపై పులిమి ‘అల్లాహ్‌ నీలో శుభం ప్రసాదించుగాక!’ అని దీవించారు.

అదేవిధంగా షాఫయీ మరో కథనం: నేను బాల్యంలో ప్రవక్త(స)ను మక్కహ్ లో వెలుగుతో నిండిన వ్యక్తిలా హరమ్‌లో ప్రజలకు నమా’జ్‌ చదివిస్తూ ఉండటం చూశాను. నమా’జు ముగించిన తర్వాత ప్రజల వైపు తిరిగి కూర్చున్నారు. వారికి బోధించసాగారు. నేను అతనితో, ‘ప్రవక్తా! నాకూ బోధించండి’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) తన చంకలో నుండి ఒక తూనిక తీసి నాకిచ్చి, ‘ఇది నీది’ అని అన్నారు. అక్కడ ఎవరో స్వప్నాల పరమార్థం చెప్పే వ్యక్తి ఉంటే, నేనతన్ని అడిగాను. దానికతను, ”నీవు ఒక మహా పండితుడ వవుతావు, ఇంకా నీవు ప్రవక్త సాంప్రదాయంపై స్థిరంగా ఉంటావు, ఎందుకంటే మస్జిదె ‘హరామ్‌ ఇమామ్‌ ఇమాములందరి కంటే గొప్పవాడు గనుక. ఇక తూనిక విషయం ఏమిటంటే, నీవు విషయాల వాస్తవం వరకు వెళతావు” అని అన్నారు.

ప్రజల కథనం: షాఫయీ ప్రారంభంలో అశ్రద్ధకు గురయ్యారు. అతన్ని పాఠశాలలో చేర్పించినపుడు అతని బంధువుల వద్ద గురువుకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ పాఠశాల గురువు అతని పట్ల అశ్రద్ధగా వ్యవహరించే వాడు. కాని ఆ గురువు ఇతర విద్యార్థులకు ఏదైనా విషయం నేర్పడానికి నోటితో పలకగానే దాన్ని కంఠస్తం చేసుకునే వారు. గురువుగారు తన స్థానం నుండి వెళ్ళగానే షాఫయీ పిల్లలకు ఆ విషయాలు నేర్పే వారు. గురువు గారు దీన్ని పసి గట్టారు. షాఫయీ విద్యార్థులకు తనకంటే ఎక్కువ లాభం చేకూర్చడం గ్రహించారు. ఇక ఆ గురువుగారు పారితోషికం అడగటం మానివేసాడు. ఇది ఇలాగే కొనసాగింది. చివరికి 9 సంవత్సరాల వయస్సులో షాఫయీ ఖుర్‌ఆన్‌ విద్యను నేర్చుకున్నారు.

షాఫయీ’ కథనం: నేను ఖుర్‌ఆన్‌ పూర్తయిన తర్వాత మస్జిద్‌లో ప్రవేశించాను. పండితుల సభలో కూర్చోవటం ప్రారంభించాను. ‘హదీసు’లను, సమస్యలను కంఠస్తం చేసుకునేవాడిని. నా ఇల్లు ఖీఫ్వీధి, మక్కహ్ లో ఉండేది. మేము ఎంత పేదవార మంటే కాగితాలు కూడా కొనలేని పరిస్థితి. అందువల్ల నేను దుమ్ములను ఏరి వాటిపై వ్రాసుకునేవాడిని. మొట్టమొదట నేను ఫిఖహ్‌ విద్య ముస్లిమ్బిన్‌ ‘ఖాలిద్ వద్ద నేర్చుకున్నాను. అప్పుడే నాకు మాలిక్బిన్అనస్ అనే ఒక గొప్ప పండితులు ఉన్నారని తెలిసింది. నేనతని వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అనంతరం మక్కహ్ లోని ఒక వ్యక్తి వద్ద నుండి మువత్తా అడిగితీసుకొని దాన్ని కంఠస్తం చేసుకున్నాను. ఆ తరువాత మక్కహ్ పాలకుని వద్దకు వెళ్ళాను. అతనితో మదీనహ్ పాలకునికి, మాలిక్‌ గారికి రెండు ఉత్తరాలు వ్రాయించుకున్నాను. మదీనహ్ చేరి మదీనహ్ పాలకునికి ఇచ్చాను. ఒకవేళ నువ్వు నా మదీనహ్ నుండి మక్కహ్ వరకు కాలి నడకన వెళ్ళమంటే అది నాకు చాలా సులభం గాని, మాలిక్‌ వద్దకు వెళ్ళడం చాలా కష్టం’ అని అన్నాడు. అప్పుడు నేను అతన్ని పిలుచు కుంటే బాగుంటుంది,” అని అన్నాను. దానికి ఆ పాలకుడు ఇది అంతకంటే కష్టమైన పని. ఒకవేళ వెళ్ళి అతని కడప ముందు నిలబడితే అతన్ని కలుసుకోవచ్చు అని ఇద్దరం వాహనం ఎక్కి ఆయన వద్దకు వెళ్ళాం.

ఒక వ్యక్తి ముందడుగు వేసి తలుపు తట్టాడు. నేను కష్టాలు పడిన తరువాత మాలిక్‌ బయటకు వచ్చి కూర్చున్నారు. మదీనహ్ పాలకుడు మక్కహ్ పాలకుని ఉత్తరం అతనికి ఇచ్చాడు. ఉత్తరం చదివిన తరువాత ప్రజలు సిఫారసుద్వారా విద్య నేర్చుకోవా లనుకుంటున్నారు?” అని అన్నారు. ”నీ పేరేమిటి?” అని అడిగారు. ”నేను ముహమ్మద్,” అని అన్నాను. అప్పుడు అతను ‘ఓ ముహమ్మద్‌! దైవానికి భయపడు, పాపాలకు దూరంగా ఉండు. అతి త్వరలో నీ గొప్పతనం బహిర్గతం అవుతుంది. అల్లాహ్‌ నీ హృదయంలో ఒక వెలుగు నింపి ఉంచాడు. దాన్ని దైవ ధిక్కారం ద్వారా ఆర్పివేయకు’ అని పలికి రేపు వచ్చినపుడు మువత్తా చదివే వారినెవరినైనా తీసుకు రా,” అని అన్నారు. అప్పుడు నేను చూడకుండా చదువుకోగలను అని అన్నాను. ఆ తరువాత రెండవ రోజు వచ్చి చదవటం ప్రారంభించాను. ఈవిధంగా అతని వద్ద విద్య ప్రారంభించాను. కొన్ని రోజుల్లోనే నేను మువత్తా పూర్తి చేసుకున్నాను. ఆ తరువాత మాలిక్‌ మరణం వరకు మదీనహ్ లోనే ఉన్నాను.

షాఫయీ మాలిక్‌ ద్వారా ఏదైనా వ్రాస్తే ఇది మా గురువు గారు మాలిక్అభిప్రాయం అని అనేవారు. అబ్దుల్లాహ్బిన్అహ్మద్బిన్హంబల్, ”నేను మా నాన్నగారితో ఈ షాఫయీ ఎవరు? ఎందుకంటే తరచూ తమరు ఆయన్ను గురించి ప్రార్థిస్తూ ఉంటారు” అని అన్నాను. దానికి మా నాన్నగారు, కుమారా! షాఫయీ పగటి సూర్యునిలా ఉండేవారు. ప్రజల కోసం అతడు శాంతి, క్షేమాలుగా ఉండేవారు.

షాఫయీ అనేక ప్రత్యేకతలు కలిగి ఉండేవారు. తూర్పు పడమరల్లో అందరికంటే గొప్ప పండితులుగా ఖ్యాతి గడించారు. అల్లాహ్‌ అనేక విద్యలు ఆయనకు ప్రసాదించాడు. అతనికి ముందు అతని తరువాత ఎవరికీ అంతటి గౌరవం లభించలేదు. షాఫయీ, మాలిక్ బిన్‌ అనస్‌, సుఫియాన్ బిన్‌ ఉయైన, ముస్లిమ్ బిన్‌ ఖాలిద్‌, ముహమ్మద్ బిన్ హసన్ షైబాని, అబూ హనీఫా, ఇంకా అనేకమంది పండితుల ద్వారా ఉల్లేఖించారు. ఇతని ద్వారా అహ్మద్‌ బిన్‌ హంబల్, అబూ సౌర్, ఇబ్రాహీమ్‌ బిన్‌ ఖాలిద్‌, అబూ ఇబ్రాహీమ్ ముజునీ, రబీ బిన్‌ సులైమ్‌ మురాదీ మొదలైనవారు ఉల్లేఖించారు. షాఫయీ 195 హిజ్రీ శకంలో బగ్దాద్ వెళ్ళారని అనేకమంది ఉల్లేఖించారు. అక్కడ రెండు సంవత్సరాలు ఉన్నారు. ఆ తరువాత మక్కహ్ వచ్చారు. కొన్ని నెలల తర్వాత ఈజిప్టు వెళ్ళారు. అక్కడ జుమ’అహ్ రాత్రి ఇషా సమయాన కన్నుమూశారు. శుక్రవారం నాడు, ఖననం చేయబడ్డారు. 30 రజబ్‌, 204 హిజ్రీ (20-1-820 క్రీ.శ.)లో 54 సంవత్సరాల వయస్సులో ఈజిప్ట్ లో మరణించారు.

రచనలు. 1. రిసాలహ్, 2. ఉసూల్ అల్ ఫిఖ్హ్, 3. కితాబ్ అల్ ఉమ్మ్, 4. ముస్నద్ షాఫయీ.

హారూన్ అర్రషీద్, అతని కుమారుడు హారూన్ అల్ అమీన్ – అబ్బాసీ రాజుల కాలంలో ఉన్నారు.

—–

అబూ అబ్దుల్లాహ్ – అహ్మద్‌ బిన్ ముహమ్మద్ బిన్‌ హంబల్‌ అష్షైబానీ 164 హిజ్రీ (780 క్రీ. శ.)లో బగ్దాద్‌లో జన్మించారు. 241 హిజ్రీ (855 క్రీ.శ.) లో 77 సంవత్సరాల వయస్సులో బగ్దాద్‌లోనే మరణించారు. ఫిఖహ్‌, ‘హదీసు’ భక్తి, ఆరాధనాల్లో చాలా ఖ్యాతి గడించారు. న్యాయం ధర్మం విషయంలో ప్రామాణి కతగా వ్యవహరించే వారు. ఇతను అబూ యూసుఫ్ గారి శిశ్యులు. బగ్దాద్‌లోనే విద్యాభ్యాసం పొందారు. ‘హదీసు’ పండితుల వద్ద ‘హదీసు’ విద్య పొందారు. ఆ తరువాత కూఫా, బస్రా, మక్కహ్, మదీనహ్, యమన్‌, సిరియా మొదలైన ప్రాంతాలను సందర్శించారు. ఆ కాలానికి చెందిన పండితులను ఒకచోట చేర్చారు. అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌, య’జీద్‌ బిన్‌ హారూన్‌, యహ్‌యా బిన్‌ సయీద్‌ ఖుతాన్‌, సుఫియాన్ బిన్‌ ఉయైన, ము’హమ్మద్‌ బిన్‌ ఇద్రీస్‌ షాఫయీ, అబ్దుర్రజ్జాఖ్‌ బిన్‌ ఇల్‌హామ్‌ మొదలైన వారి ద్వారా ‘హదీసు’లు విన్నారు. ఇతని ఇద్దరు కుమారులు సాలిహ్‌, ‘అబ్దుల్లాహ్‌, చిన్నాన్న కొడుకు హంబల్‌ బిన్‌ ఇస్‌హాఖ్‌, ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ బుఖారీ, ముస్లిమ్ బిన్‌ హజ్జాజ్‌ నేషాపూరీ, అబూ దావూద్ సఖ్తియానీ ఇంకా అనేకమంది ఇతని ద్వారా ఉల్లేఖించారు. విశేషం ఏమిటంటే కితాబుస్సదఖాత్‌ చివరిలో ఒక ‘హదీసు’ తప్ప బు’ఖారీ తన’స’హీ’హ్ బు’ఖారీలో దేనిని పేర్కొన లేదు. అదేవిధంగా అ’హ్మద్‌ బిన్‌ హుసైన్‌తిర్మిజి‘ కూడా ఇతని ద్వారా మరో ‘హదీసు’ ఉల్లేఖించారు.

అదేవిధంగా ఇతను ఎన్నో ప్రత్యేకతలు గల వ్యక్తి. ఇస్లామీయ విద్యల్లో ప్రముఖ స్థానం గల వ్యక్తి. అనేక దేశాల్లో ఇతని సూచనలను అనుసరించటం జరుగుతుంది. ఇతనికి అనేక ‘హదీసు’లు చాలా అధిక సంఖ్యలో గుర్తు ఉండేవి. అబూ జ’ర్‌అ కథనం ప్రకారం అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌కు 10 లక్షల ‘హదీసు’లు గుర్తు ఉండేవి. అబూ దావూద్‌ సఖ్తియానీ కథనం ప్రకారం అతని సభల్లో పరలోకం గురించి చర్చలు జరిగేవి.

రబీ బిన్‌ సులైమాన్‌ కథనం: షాఫ’యీ ఈజిప్టు వెళ్ళారు. నన్ను ఈ ఉత్తరం అ’హ్మద్‌కు ఇచ్చి వేయమని అన్నారు. నేను ఉత్తరం తీసుకొని బగ్దాద్ వెళ్ళాను. ఫజర్‌ నమా’జులో అతన్ని కలసి ఉత్తరం ఇచ్చాను. ఇది షాఫయీ గారి ఉత్తరం అని చెప్పాను. దానికి అతను నువ్వు దీన్ని చూశావా అని అన్నారు.

సైమూన్‌ బిన్‌ అస్‌బ కథనం: నేను బగ్దాద్‌లో ఉన్నాను. నేను కేకలు విన్నాను. ‘ఈ శబ్దం ఏమిటి?’ అని అన్నాను. దానికి ప్రజలు, ”అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌ను శిక్షించడం జరుగుతుంది,” అని అన్నారు. అతనికి కొరడాతో కొడుతుంటే ”బిస్మిల్లాహ్‌, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌, ఖుర్‌ఆన్‌ దైవ గ్రంథం అని, సృష్టితం కాదని అంటున్నారు. కొరడా దెబ్బలకు అతని పైజామా జార సాగింది. అప్పుడతను ఆకాశం వైపు చూసి, ”ఓ అల్లాహ్‌! నేను నీ ఉత్తమమైన పేర్లు ద్వారా అర్థిస్తున్నాను. నన్ను నగ్నత్వం నుండి కాపాడు” అని ప్రార్థించారు. పైజామా జారకుండా ఉండిపోయింది.

—–

తిర్మిజి హిజ్రీ శకం 209లో జన్మించారు. పేరు ముహమ్మద్‌, అబూ ఈసా కునియత్‌. అతని వంశ పరంపర ముహమ్మద్‌ బిన్‌ ఈసా బిన్‌ సూరా బిన్‌ మూసా బిన్‌ అజ్జిహాక్‌ అస్సల్‌ము అజ్జురీర్‌ అల్‌ బూగీ అత్తిర్మిజీ‘. తిర్మిజీ తాతగారు మురూజీ ప్రాంతానికి చెందినవారు. కొన్ని కారణాల వల్ల తిర్మిజీ‘లో వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. సూరా అతని తాతగారి పేరు. తిర్మిజి’ వంశ పరంపర బనూ సులైమ్కు చేరుతుంది. ఇది బనీ గీలాన్ తెగలోని ఒక శాఖ. తిర్మిజి’ తండ్రిగారి పేరు ‘ఈసా. తిర్మిజీ’కి చాలామంది గురువులు ఉన్నారు. బు’ఖారీ, ముస్లిమ్‌, అబూ దావూద్‌, ఖతీబ్ బిన్‌ స’యీద్‌, ‘అలీ బిన్‌ ‘హాజర్‌, ము’హమ్మద్‌ బిన్‌ బష్షార్‌ మొదలైన వారందరూ తిర్మిజి’ గురువులు. తిర్మిజి’ యొక్క పాండిత్యం జామె తిర్మిజీ’ ద్వారా తెలుసుకోవచ్చు. బ’స్రా, కూఫా, వాసిత్‌, రే, ‘ఖురాసాన్‌, హిజా’జ్‌ మొదలైన ప్రాంతాలన్నీ తిర్మిజీ’ ప్రయాణ కేంద్రాలే.

తిర్మిజీ’ విశాల హృదయులు, జ్ఞాన సంపన్నులు, ఆలోచనా శక్తి, బుద్ధి వివేకాల గురించి వేరే చెప్పనక్కరలేదు లేదు. పై గుణాలన్నిటి గురించి జామె తిర్మిజీ’ ద్వారా తెలుసుకోవచ్చు. జామె తిర్మిజీ’ చదవడం వల్ల ‘హదీసు’వేత్తల నిష్పక్షపాతం, విశాల జ్ఞానం గురించి తెలుసుకోవచ్చు. ‘హదీసు’వేత్తలు సమస్యల్లో దూర దృష్టితో వ్యవహరించే వారు. అన్నీ కోణాల నుండి సమస్యలను పరికించేవారు. తిర్మిజీ’ ‘హదీసు’లు, వాటి వివరణలు  చదివే వారికి  మనశ్శాంతిని ప్రసాదిస్తాయి.

ఇతని శిష్యులు కూడా అనేకమంది ఉన్నారు. కొందరు చరిత్రకారులు తిర్మిజీ’ దైవ భీతివల్ల చాలా ఏడ్చేవారని, దీనివల్ల కళ్ళు దృష్టి కోల్పోయారని పేర్కొన్నారు. మరికొందరు తిర్మిజీ’ పుట్టుగ్రుడ్డివారని పేర్కొన్నారు. తిర్మిజీ’ 279 హిజ్రీ శకంలో, 70 సంవత్సరాలలో, మరణించారు. తిర్మిజీ’ రచనల్లో జామె తిర్మిజీ’, కితాబుల్‌ ఇలల్‌, షమాయిలె తిర్మిజీ’, ప్రఖ్యాతమైనవి. ఇవి అన్ని ప్రాంతాల్లో ప్రచురించబడ్డాయి. జామె తిర్మిజి 11 వందల సంవత్సరాల నుండి పాఠ్యాంశాలుగా కొనసాగుతూ వస్తుంది. జామె తిర్మిజీ’లో వివిధ పందాలు, స’హా బాలు తాబయీన్లు, ప్రామాణికతపై విమర్శలు, ‘హదీసు’ల్లో బలహీనతలు, కారణాలు, ప్రామాణిక ‘హదీసు’లు, అసత్య ‘హదీసు’లు మొదలైన వాటిలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఇతర పుస్తకాల్లో లేవు.

తిర్మిజీ’ కథనం: నేను జామె తిర్మిజిని రచించి ‘హిజా’జ్‌, ‘ఇరాఖ్‌, ఖురాసాన్‌ పండితుల ముందు పెట్టాను. మరో విష యం ఏమిటంటే, తిర్మిజి’ ‘హదీసు’ల పరంపర విషయంలో మోసపోకూడదని ‘హదీసు’వేత్తలు హెచ్చరించి ఉన్నారు. ఆ ప్రామాణిక గ్రంథాలలో బు’ఖారీ, ముస్లిమ్‌ తర్వాత 3 వ స్థానం తిర్మిజీ’కే ఇవ్వడం జరిగింది. దీనిపై ‘హదీసు ‘వేత్త లందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. కాని సుననె దార్మీ, సుననె అబూ దావూద్, సుననె నసాయి, జామె తిర్మిజీ విషయంలో పరస్పరం ప్రాధాన్యత ఇవ్వడం కష్టమే.

తిర్మిజీ’యొక్క పుస్తకం ”కితాబుల్‌ ఇలల్‌” ఒక గొప్ప పుస్తకం. ఇదీ ‘హదీసు’ విద్యార్థులకు చాలా అవసర మైనది. దీని అధిక భాగం బు’ఖారీ నుండి పొందినదే. దీన్ని తిర్మిజి’ స్వయంగా రచించారు.

షమాయిలె తిర్మిజీ: ప్రవక్త (స) దిన క్రియలు, భోజన, పానీయాలు, జీవనం, సలామ్‌, సంభాషణ, వస్త్రధారణ, సాక్సులు, ప్రజల పట్ల ప్రవర్తన, సద్గుణాలపై ఆధారపడి ఉన్నది. ప్రతి ముస్లిమ్‌ ఈ పుస్తకం చదివి ఆ ఉత్తమ గుణాలను అలవరచుకోవాలి. ఎందుకంటే ఈ గుణాలు ఒక ముస్లిమ్‌లో తప్పనిసరిగా ఉండాలి.

—–

ఇతను హిజ్రీ శకం 202లో జన్మించారు. 275 హిజ్రీ శకం షవ్వాల్‌ 14వ తేదీన బస్రాలో మరణించారు. అనేక సార్లు బగ్దాద్ వచ్చారు. చివరి సారిగా 271 హిజ్రీ శకంలో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇతను ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ మస్‌ లమహ్‌, ఖు’తుబీ, య’హ్‌యా బిన్‌ ము’యీన్‌, అహ్మద్బిన్హంబల్‌, ఇంకా ఇతర ‘హదీసు’వేత్తల నుండి ‘హదీసు’ లు సేకరించారు. ఇతన్నుండి ఇతని కుమారులు అబ్దుల్లాహ్‌, అబ్దుర్రహ్మాన్‌ నేషాపూరీ, అహ్మద్‌ బిన్‌ ముహమ్మద్‌ ఖిలాల్‌ మొదలైనవారు ‘హదీసు’లు సేకరించారు. అబూ దావూద్‌ స్రాలో నివాసమేర్పరచు కున్నారు. బగ్దాద్ వచ్చి అక్కడ తన రచన సుననె అబూ దావూద్ ను ఉల్లేఖించారు. అక్కడి ప్రజలు ఆ పుస్తకాన్ని అతని నుండి కాపీ కొట్టారు. దాన్ని అహ్మద్‌ బిన్‌ హంబల్‌ ముందు పెట్టారు. దాన్ని పరిశీలించి అతను చాలా ప్రశంసించారు. పొగిడారు. చాలా గొప్ప కార్యం అని ప్రోత్సహించారు.

నేను ప్రవక్త (స) నుండి పొందిన 5 లక్షల హదీసులను చేర్చాను. వాటిలో ఈ పుస్తకం కొరకు 4,800 ‘హదీసు’లను ఎన్నుకున్నాను. ఇందులో నేను మూడు రకాల హదీసులను పేర్కొన్నాను. వీటిలో ఒక మనిషి  కొరకు నాలుగు ‘హదీసు’లు సరిపోతాయి. 1. ప్రవక్త (స) ప్రవచనం, ”సత్కార్యాలు సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి. 2. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటమే మనిషి గొప్పతనం. 3. మనిషి తన కోసం కోరిందే తన ముస్లిమ్‌ సోదరునికి కోసం కోరనంత వరకు నిజమైన విశ్వాసి కాలేడు. 4. ధర్మ సమ్మతాలు, నిషిద్ధాలు స్పష్టంగా ఉన్నాయి. వీటి మధ్య కొన్ని అనుమానాస్పద విషయాలు ఉన్నాయి. అబూ దావూద్‌ తన కాలంలో అందరి కంటే గొప్ప పండితులు. ఇతని కాలంలో ఇతని కంటే గొప్ప విద్యావకాశాలు పొందలేక పోయారు అని అబూ బకర్‌ ఖిలాల్‌ అభిప్రాయపడ్డారు.

అ’హ్మద్‌ బిన్‌ ముబర్‌జరీ అభిప్రాయం ప్రకారం ప్రవక్త (స) హదీసులను కంఠస్తం చేసేవారిలో, దాని లోటు పాటులు, లోపాలు, ప్రామాణికతలను గుర్తుంచుకునే వారిలో ప్రముఖులు, గొప్ప దైవభక్తులు, అబూ దావూద్‌ ఒక చేయి వదులుగా మరొకటి ఇరుకుగా ఉండేది.

—–

నసాయి’ హిజ్రీ శకం 215H (829G)లో జన్మించారు. పేరు అహ్మద్, కునియత్‌ – అబూ అబ్దుర్రహ్మాన్‌ ప్రఖ్యాత బిరుదు నసాయి. ఇతని వంశ పరంపర అహ్మద్బిన్షుఐబ్బిన్అలీ బిన్బహ్ర్బిన్సనాన్బిన్దీనార్, నాసా పట్టణంలో జన్మించారు. నసాయి ప్రాథమిక విద్య ఇక్కడే జరిగింది. 230 హిజ్రీ శకంలో 15 సంవత్సరాల వయస్సులో తన ఊరు వదలి విద్యార్జన కోసం ప్రయాణం ప్రారంభించారు. అన్నిటి కంటే ముందు బల్‌ఖలో ఉన్న ఖుతైబహ్‌ వద్దకు వెళ్ళారు. అక్కడ  విద్య నభ్యసించిన  తరువాత హిజాజ్‌, సిరియా, ఈజిప్టు, జీరాల వైపు ప్రయాణం చేశారు. చాలాకాలం వరకు ఈజిప్టులో నివసించారు. అతనికి అతని రచనలకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఈజిప్టులోనే. ప్రామాణిక విమర్శలో అందరికంటే గొప్ప పండితులుగా భావించబడేవారు. నసాయి చాలా దృఢంగా ఉండే వారు. ముఖం గులాబీ పువ్వులా ఎర్రగా ఉండేది. అతని శరీరంలో రక్త ప్రవాహం చాలా వేగంగా ఉండేది. కొందరు పండితులు కంఠస్తంలో ముస్లిమ్‌కు సమానులని భావిస్తారు.

నసాయి గురువుల్లో బుఖారీ, అబూ దావూద్ సజిస్తానీ, ఖుతైబ బిన్‌ సయీద్‌, ఇస్‌హాఖ్‌ బిన్‌ రాహ్‌వై, అలీ బిన్‌ ‘హజర్‌, సులైమాన్‌ బిన్‌ అష్‌అస్‌, ము’హమ్మద్‌ బిన్‌ బష్షార్‌ మొదలైన మహా పండితులున్నారు. అదేవిధంగా శిష్యులు కూడా తక్కువ లేరు. అబూ జ’అఫర్‌ తహానీ, అబుల్‌ ఖాసిమ్‌, తబ్రానీ, అబూ బషర్‌ దూలాబీ, అబూ బకర్‌ బిన్‌ సిన్నీ మొదలైన వారందరూ శిష్యులే.

ఒకసారి తర్‌తూన్‌ వెళ్ళినపుడు, అక్కడ ‘హదీసు’ సమ్మేళనం జరిగింది. అతన్నుండి నేర్చుకోవటం జరిగింది. ఇందులో అబ్దుల్లాహ్ అంటే అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌ కుమారులు కూడా పాల్గొన్నారు. తన చివరి కాలంలో 302హిజ్రీ శకంలో ఈజిప్టు నుండి బయలుదేరి దిమిష్క్ చేరారు. అక్కడ ఖవారిజ్ కల్లోలంలో చిక్కు కున్నారు. అతన్ని ‘అలీ మరియు ము’ఆవియహ్‌లలో ఎవరు గొప్ప అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను ‘అలీ(ర) అని అన్నారు. దానికి వారు ఆగ్రహం చెందారు. కొట్టటం ప్రారంభించారు. కొంత ప్రాణం ఉండగా రమ్ తీసుకొని వెళ్ళారు. హిజ్రీ శకం 304 (915 G)లో వీర మరణం పొందారు. అక్కడే ఖననం చేయబడ్డారు. కొందరు చరిత్రకారులు అతన్ని మక్కహ్ తీసుకువెళ్ళారని, సఫా మర్వాల మధ్య ఖననం చేసారని పేర్కొన్నారు. ఇతని రచనల్లో సుననె నసాయి పేరు ప్రఖ్యాతులు గడించింది. ఇంకా అనేక రచనలు ఉన్నాయి. సయ్యిద్‌ జలాలుద్దీన్‌ కథనం ప్రకారం నసాయీ ముందు ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. దాని పేరు అస్సున నుల్కుబ్రా. దీన్ని ఒక ప్రత్యేక పంథాలో వ్రాయడం జరిగింది. అప్పటి పాలకుడు, ‘ఇందులో అన్నీ ప్రామాణిక ‘హదీసు’లు ఉన్నాయా?’ అని అడిగాడు. దానికి అతను, ‘లేదు’ అన్నారు. దానికి ఆ పాలకుడు ప్రామాణిక ‘హదీసు’లన్నిటినీ ఒక చోట సంకలనం చేయమని కోరాడు. అప్పుడు అల్ముజ్తబామిన్సుననుల్కుబ్రా అనే పుస్తకాన్ని సంకలనం చేశారు. ఇప్పుడు అదే సుననె నసాయిగా ప్రాచుర్యంలో ఉంది.

సుననె నసాయిలో ‘హదీసు’ ప్రామాణికతపై చాలా తక్కువగా చర్చించటం జరిగింది. ‘హదీసు’వేత్తలు దానికి అనేక వివరణలు వ్రాసారు. అందులో ఒకటి సిరాజుద్దీన్‌ ఇబ్నుల్‌ ముల్‌ఖిన్‌. దీన్ని కష్‌ఫుజ్జునూన్‌ రచయిత పేర్కొన్నారు. అభిప్రాయాలను ‘హదీసు’ల ద్వారా ఎదుర్కొన్న వారిలో నసాయీ కూడా ఒకరు.

—–

‘హాఫిజ్‌ అబూ ‘అబ్దుల్లాహ్‌ –ముహమ్మద్బిన్జీద్ఇబ్నె మాజా ఈరాన్లో ఖజ్దీన్ పట్టణంలో హిజ్రీ శకం 209లో జన్మించారు. మాజహ్అతని తల్లి. ఆమె పేరుతోనే పిలవటం జరిగింది. అయితే కొందరు చరిత్రకారులు తండ్రి పేరని, మరికొందరు తాతగారి పేరుగా పేర్కొన్నారు. ఇతను రబీఅ బిన్నజార్ తెగకు చెందినవారు. అందువల్లే అతను రబీయీ అని పిలువబడతారు.

ధార్మిక విద్య ప్రత్యేకంగా అంటే ‘హదీసు’ విద్యలో సమయం గడిపేవారు. ఈ విద్య కోసం ఖురాసాన్‌, ఇరాఖ్‌, ‘హిజా’జ్‌, షామ్‌, మరియు ఈజిప్టు పండితుల వద్ద విద్యాభ్యాసం పొందారు. ‘హదీసు’లు సేకరించడంలో చాలా శ్రమించారు. ఇవే కాక అనేక ప్రాంతాలకు ‘హదీసు’లను సేకరించడానికి వెళ్ళడం జరిగింది. ఇతను విద్య నేర్చుకున్న పండితుల్లో జబ్బారహ్‌ బిన్‌ అల్ముఫ్లిస్, ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ మున్జిర్, ఇబ్నె నమిర్మరియు హిషామ్‌ బిన్‌ హిమార్ మొదలైన వారున్నారు. ప్రత్యేకంగా అబూ బకర్‌ బిన్‌ షైబహ్ పేరు కూడా ఇతని ప్రధాన గురువుల చిట్టాలో ఉంది. ‘హదీసు’ విద్యలో ఇబ్నె మాజహ్ మహా పండితులు, నిపుణులు.

తనకు గుర్తున్న ‘హదీసు’ల్లో 4000 ‘హదీసు’లను ఒక పుస్తకంగా సంకలనం చేశారు. అది 1500 అధ్యాయాలతో కూడిన 32 పుస్తకాల ద్వారా తయారు చేయబడింది. ఈ పుస్తకాన్ని తన గురువు పద్ధతిలోనే సంకలనం చేశారు. అయితే గురువుగారు ‘స’హాబాల ఫత్వాలను పేర్కొన్నారు. కాని ఇతను ఈ విషయంలో అతన్ని అనుకరించలేదు.

ఇతని పుస్తకాన్ని ‘హదీసు’వేత్తలు 6 స్థానం కల్పించారు. కొన్ని ‘హదీసు’ల విషయంలో వారికి అభ్యంతరం ఉంది.

6వ శతాబ్దం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ‘హదీసు’వేత్తలు ఈ పుస్తకాన్ని సిహాసిత్తలో చేర్చటం, దీన్ని అనేక విధాలుగా ఉపయోగించటం, ప్రచురణ వల్ల దీనికి ప్రాముఖ్యత ఉందని తెలుస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకతల వల్ల దీనికి ఇతర పుస్తకాలపై ప్రాధాన్యత కూడా లభించింది. ఇబ్నెహజర్ ఈ పుస్తకాన్ని గురించి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇది చాలా ఉత్తమంగా, అనేక అధ్యాయాలపై ఆధారపడి ఉందని ప్రశంసించారు. ఈ పుస్తకం విషయంలో సేవలందించిన వారిలో షమ్‌సుద్దీన్‌ జహ్‌బీ, ‘హాఫిజ్‌ ఇబ్నె రజబ్‌ ‘హంబలీ, ‘హాఫి”జ్‌ ‘ఉమర్‌ బిన్‌ ‘అలీ అల్‌ ముల్ఖిన్‌ అష్షాఫయీ, అష్షైబ్‌ అద్దమీరీ, ‘హాఫిజ్‌ అబూ సీరీ, ‘హాఫిజ్‌ ఇబ్నుల్‌ అజమీ, హాఫిజ్జలాలుద్దీన్సుయూతీ మొదలైనవారు.

అదేవిధంగా ఈ పుస్తకం ద్వారా లాభం పొందినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అతని శిష్యుల్లో అబుల్‌ ‘హసన్‌ త్తాన్, ‘ఈసా అల్‌ బహ్రీ మొదలైన వారున్నారు. చరిత్ర పుస్తకాల్లో ఇబ్నె మాజహ్ గురించి అంత ఎక్కువగా వివరా లేమీ లభించలేదు. కాని ‘హదీసు’ విద్యలో అతను వదలి వెళ్ళిన గ్రంథాల ఆస్తి అతన్ని గుర్తుంచేలా చేస్తుంది. ఇబ్నె మాజహ్ సునన్‌తో పాటు మరో రెండు పుస్తకాలు కూడా రచించారు. ఒకటి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానంలో, మరొకటి చరిత్రలో.

అతను ఈ రెండు పుస్తకాల్లోనూ విలువైన వివరాలు పొందుపరిచారు. చరిత్ర పుస్తకాల్లో ప్రవక్త (స) అనుచరుల కాలం నుండి తన కాలం వరకు గల పరిస్థితులను పొందుపరిచారు. వ్యాఖ్యాన పుస్తకంలో వ్యాఖ్యానానికి సంబంధించిన విలువైన వివరాలు పొందుపరిచారు. ఇబ్నె మాజహ్ జీవిత వివరాలు చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువగా లభిస్తాయి. అతని ఘనకార్యాల ముందు అతని జీవిత వివరాలు అంత ప్రాముఖ్యమైన వేమీ కావు. అందువల్ల చరిత్రకారులు అతని ధార్మిక విద్యా ఘనకార్యాలపైనే దృష్టి సారించారు. చివరిగా అతను 64 సంవత్సరాల వయస్సులో తన నివాస పట్టణమైన ఖజ్దీన్లో హిజ్రీ శకం 273లో మరణించారు.

—–

అబ్దుల్లాహ్‌ బిన్‌ ముబారక్‌ మరణించిన సంవత్సరం అంటే హిజ్రీ శకం 181లో దార్మీ సమర్ఖంద్లో జన్మించారు. దార్మీ అనేది ఒక జాతి పేరు. దార్మీ నిజాయితీ, విద్య, వివేకం, ఆరాధనల్లో ఆదర్శంగా ఉండేవారు. ‘హదీసు’ విద్య కోసం ఇస్లామీయ దేశాలకు ప్రయాణం చేశారు. ఇబ్నె అబీ ‘హాతిమ్‌, దార్మీ తన కాలంలో ఒక గొప్ప పండితులని తన తండ్రిగారు చెప్పే వారని అభి ప్రాయం వ్యక్తం చేశారు. ముస్లిమ్‌, తిర్మిజి‘, అబూ దావూద్‌, హ్మద్మొదలైన వారి సంతానంలాంటి ‘హదీసు’ పండితులు ఇతని వద్ద విద్య నేర్చుకున్నారు. నసాయి కూడా ఇతని ద్వారా ఉల్లేఖించారని హాఫిజ్‌ జహ్‌బీ అభిప్రాయపడ్డారు. ఖురాసాన్లో నలుగురు వ్యక్తులు ‘హదీసు’లను కంఠస్తం చేసేవారున్నారని, అబూ జ’ర్‌ అర్రాజీ, ము’హమ్మద్‌ బిన్‌ ఇస్మాయీల్, అ’హ్మద్‌ కుమారులు పేర్కొన్నారు.

ముస్నద్దార్మీ ఇతని ప్రముఖ రచనల్లో ఒకటి. దీన్ని ముస్నద్‌ అని అనడం ‘హదీసు’వేత్తల సాంప్రదాయానికి వ్యతిరేకం. ఈ పుస్తకంలో సులాసియాత్‌ ఇతర పుస్తకాలన్నిటి కంటే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకం 3557 ‘హదీసు’లతో కూడి ఉంది. అరఫా నాడు దార్మీ మరణించారు. ఈదుల్‌ అ’ద్హా నాడు ఖననం చేయబడ్డారు. బు’ఖారీ ఇతని  మరణవార్త విని విచారంతో తల దించుకున్నారు. కళ్ళంట అశ్రువులు రాలాయి.

ఈ సంవత్సరమే నేషాపూర్‌ ‘హదీసు’వేత్త అబ్దుర్ర’హ్మాన్‌ మరియు వాసిత్‌కు చెందిన ము’హమ్మద్‌ బిన్‌ హరబ్‌ నసాయీ మరియు దిమిష్క్‌కు చెందిన మూసా బిన్‌ ఆమిర్‌ మరియు గ్రోకరామియకు చెందిన వ్యవస్థాపకులు ముహమ్మద్‌ బిన్‌ కిరామ్‌ మొదలైన వారు మరణించారు. (తజ్‌కిరతుల్‌ ‘హుఫ్ఫాజ్‌ 2/105) బుస్తానుల్‌ ము’హద్దిసీన్‌.

—–

దారు ఖుతునీ హిజ్రీ శకం 306 (918CE)లో జన్మించారు. హిజ్రీ శకం 385 (995CE)లో మరణించారు. దార ఖుతున్బగ్దాద్లో ఒక పెద్ద ప్రాంతం పేరు. దార ఖుతునీ ఇక్కడే ఉండే వారు. ‘హదీసు’ విద్య కోసం కూఫా, స్రా, సిరియా, వాసిత్‌, ఈజిప్టు మొదలైన ఇస్లామీయ దేశాలు ప్రయాణం చేశారు. షాఫయీ మార్గాన్ని అనుసరించారు. ‘హాకిమ్‌ నిషాపూరీ, అబుల్ హసన్ ఇస్ఫహానీ, ‘అబ్దుల్‌ ‘గనీ, మున్‌జిరీ, రాజీ, ఫవాయిద్‌, అబూ నయీమ్‌ మొదలైన వారందరూ ఇతని శిష్యులు. ‘హదీసు’ పరిశీలనలో గొప్ప పండితులు. తన ప్రత్యేక దృష్టి కలిగి ఉండేవారు. ఖతీబ్‌ మరియు ‘హాకిమ్‌ వీరిని ఎంతో గౌరవించేవారు. అదేవిధంగా అరబీ గ్రామర్లో కూడా పట్టు ఉండేది. అతని జ్ఞాపకశక్తి ఎలా ఉండేదంటే తన యవ్వనంలో ఇస్మా’యీల్‌ సఫ్ఫార్‌ క్లాసులో కూర్చొని ఏదో వ్రాస్తూ ఉన్నారు, ”ఈ విధంగా అయితే నీ వినడం చెల్లదని, ఇటు వ్రాస్తున్నావు, అటు వింటున్నావు” అని  ఎవరో అన్నారు. అప్పుడు దారు ఖు’తునీ ‘ఇప్పటి వరకు గురువుగారు ఎన్ని ‘హదీసు’లు చెప్పారో గుర్తుందా?’ అని అడిగారు. దానికి అతను ‘లేదు’ అని అన్నారు. అప్పుడు దారు ఖుతునీ ’18 ‘హదీసు’లు’ అని పలికి ఒక్కొక్కటిగా వినిపించటం ప్రారంభించారు. ఇది విని అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అబుల్‌ ‘హసన్‌ బైదావీ ఒక వ్యక్తిని తీసుకొని దారు ఖు’తునీ వద్దకు వచ్చారు. ”ఈ వ్యక్తి చాలా దూరం నుండి ‘హదీసు’ విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. ఇతనికి కూడా కొన్ని ‘హదీసు’లు బోధించండి” అని అన్నారు.

దారు ఖు’తునీ గొప్ప విద్యావంతులు అనడానికి ఒక సంఘటన ఉంది: ఒకసారి దారు ఖుతునీ నమా’జులో నిమగ్నమయి ఉన్నారు. విద్యార్థుల్లో ఒకరు ‘నుసైర్‌’ను ‘బషీర్‌’ అని చదివారు. దారు ఖు’తునీ అది విని ‘సుబ్‌’హా నల్లాహ్‌’ అని అన్నారు. అతడు తన్ను తాను సరిదిద్దు కుంటాడని, కాని ఆ వ్యక్తి మరోసారి ‘యుసైర్‌’ అని చదివాడు. తన్ను తాను సరిదిద్దుకోక పోవటం చూసి, ”నూన్‌ వల్‌ ఖలమి వమా యస్తురూన్‌” చదవటం ప్రారంభించారు. అంటే ఆ ఉల్లేఖన కర్త పేరు నూన్‌తో ప్రారంభమవుతుందని తెలుపటానికి. అదేవిధంగా ఒక వ్యక్తి అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌ను అమ్ర్‌ బిన్‌ స’యీద్‌ అని చదవటం జరిగింది. ఇక్కడ కూడా దారు ఖుతునీ సుబ్‌’హానల్లాహ్‌ అనడం జరిగింది. కాని ఆ వ్యక్తి వినక పోయినప్పటికీ దారు ఖు’తునీ ”యా షుఐబ్‌ అసలాతక తామురుక” అని చదివారు. కితాబు సునన్ దారఖుత్ని వ్రాసారు.

‘హాఫిజ్‌ అబూ నస్ర్‌ మాకూలా కథనం: నేను కలలో దైవ దూతలను దారు ఖుతునీ గురించి అడుగుతున్నాను. దానికి వారు స్వర్గంలో అతనికి ఇమాము అని బిరుదు లభించిందని అన్నారు. బాబ్ ‘హర్బ్‌లో మ’అరూఫ్‌ కర్‌ఖీ వద్ద వీరి సమాధి ఉంది. (తజ్‌కిరహ్‌ 3/186, ఇబ్ను ఖల్‌కా 1/331)

—–

సుననె బైహఖీ యొక్క రచయిత అహ్మద్‌ బిన్‌ హుసైన్‌, షాబాన్‌ నెల హిజ్రీ శకం 384లో బైహఖీ ప్రాంతంలో జన్మించారు. తన కాలంలో ప్రఖ్యాత ‘హదీసు’ వేత్త మరియు ధార్మిక వేత్త. వీరు 1000 వరకు పుస్తకాలు రచించారని ప్రతీతి. వీటిలో ముఖ్యమైనవి కితాబు మబ్‌సూత్‌, కితాబుస్సునన్, కితాబు ఆదాబ్‌, కితాబు ఫ’దాయిలు సహాబహ్, కితాబు ఫ’దాయిలి అల్‌ఖాత్‌, కితాబు షుఅబిల్ఈమాన్ మొదలైనవి.

చరిత్రకారుల ప్రకారం వీరి రచనల ద్వారా ముస్లి ములు లాభం పొందిన 7 పండితుల్లో బైహఖీ ఒకరు. వీరు నేషాపూర్లో హిజ్రీ శకం 486లో మరణించారు.

—–

రజీన్బిన్ముఆవియహ్ పుట్టిన తేదీ తెలియలేదు. వీరు అబ్దుద్దార్ తెగకు చెందినవారు. ఇది ఖురైష్ తెగల్లోని ఒకటి. వీరు హిజ్రీ శకం 520లో మరణించారు.

—–

ఇతని కునియత్‌ అబూ ముహమ్మద్‌. పేరు హుసైన్, తండ్రి పేరు మస్‌’ఊద్‌. వీరు ఖురాసాన్లోని బాగ్షూర్ గ్రామానికి చెందినవారు. వీరు చాలా గొప్ప పండితులు. ‘హదీసు’వేత్త, వ్యాఖ్యాన కర్త, దైవభక్తులు. వీరు ఎండు రొట్టెలపై కాలం గడిపేవారు. ప్రఖ్యాత మఆలిము త్తన్జీల్ను వీరే రచించారు. ‘హదీసు’లో షర్హు స్సున్నహ్‌, తఫ్సీర్ బగవి, రచించారు.  ప్రవక్త (స)ను కలలో చూశారు. ప్రవక్త (స) ఇలా దీవించారు, ”అల్లాహ్‌ నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించు గాక! నీవు నా సాంప్రదాయాన్ని సజీవ పరచినట్టు.” అందువల్లే వీరికి ముహ్యుస్సున్నహ్ అనే బిరుదు లభించింది. మరొక బిరుదు – రుక్నెదీన్.  మసాబీహ్ ను 1.2 విభాగాలలో విభజించారు. ఇది 11 పుస్తకాల నుండి సంకలనం చేశారు. వీరు హిజ్రీ శకం 516 H / 1122 CE లో మరణించారు.

—–

మసాబీహ్‌లో రెఫరెన్సులు ఉండేవి కావు. పండితులు దీన్ని పెద్ద లోపంగా భావించేవారు. ఈ లోపాలను సరిదిద్దటానికి అబ్దుల్లాహ్తీబ్తబ్రేజీ ప్రత్యేకంగా కృషి చేశారు. 737 హిజ్రీ శకంలో లోపాలన్నీ సరిదిద్ది, 3 విభాగం పెంచారు. దీని పేరు  ”మిష్కాతుల్మసాబీహ్” పెట్టారు. దీన్ని ముస్లిములు విశాల హృదయంతో ఆదరించి స్వీకరించారు. ప్రపంచంలోని ఇస్లామీయ విద్యాలయాల్లో దీన్ని పాఠ్యపుస్తకంగా స్థానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేకమంది పండితులు దీని వివరణలు కూడా వ్రాశారు. 1.ముల్లా అలీ ఖారీ, మిర్ఖాతుల్మసాబీహ్ అనే పేరుతో వ్రాశారు. 2. షాహ్అబ్దుల్హఖ్ముహద్దిస్దెహెల్వీ అరబీలో ”షరహ్ లమ్ ఆతిత్తన్‌ఖీ’హ్‌”ను వ్రాశారు. 3. ఫారసీలో ”అష్షిఅతు ల్లమఆత్” వ్రాశారు. ఆధునిక యుగంలో 4. ఉబేదుల్లా ముబారక్పురీ మిర్ఆతుల్మసాబీహ్‌” అనే పేరుతో వివరణ వ్రాశారు. 5. ము’హమ్మద్‌ ఖు’తుబుద్దీన్‌ ము’హమ్మద్‌ ముహ్‌యిద్దీన్‌ దహెల్వీ మజాహెర్‌ హఖ్ అనే పేరుతో ఉర్దూలో మిష్కాత్‌ అనువాదం వ్రాశారు. 6. నిమిత్త మాత్రుడు అబ్దుస్సలామ్బిన్ యాద్ అలీ బస్తవీఅన్వారుల్మసాబీహ్” అనే పేరుతో దీని అనువాదం, వివరణ వ్రాశారు. అల్లాహ్‌ మనందరి కృషిని స్వీకరించుగాక! ఆమీన్‌.

—–

(మిష్కాతుల్సాబీహ్ఉర్దూ అనువాదకులు)

అబ్దుస్సలామ్బిన్షేఖ్యాద్ అలీ బిన్షేఖ్ఖుదా ఖ్ష్బిన్షేఖ్జుహూర్ యొక్క పూర్వీకులు ఫైజాబాద్కు చెందినవారు. 1857లో ఫైజాబాద్‌ నుండి బస్తీ జిల్లాలోని బిషన్పూర్కు వలసపోయారు. ఇక్కడ నివాస మేర్పరచుకున్నారు. వీరు హిజ్రీ శకం 1327లో బిషన్పూర్లో జన్మించారు. ప్రాథమిక విద్యకోసం నేపాల్ వెళ్ళి పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. తల్లిదండ్రులతో పాటు కలకత్తా వెళ్ళారు. 15 రోజుల తర్వాత తండ్రిగారు చనిపోయారు. కేవలం తల్లిగారే మిగిలారు. అప్పుడు వారి వయస్సు 10 సంవత్సరాలు. మిల్లులో పనిచేయ సాగారు. పగలంతా పనిచేసి సాయంత్రం వీధి వారి వద్ద ఉర్దూ చదవసాగారు. 11 సంవత్సరం వరకు ఇలాగే గడిపారు. మళ్ళీ తన సొంత ఊరు వచ్చారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్ళి తన విద్యాభ్యాసం ప్రారంభించారు. ఈ విధంగా అనేక ప్రాంతాలలో విద్యాభ్యాసం జరిగింది.

ఢిల్లీలో 8వ జమాఅత్‌ వరకు విద్యాభ్యాసం పొందారు. ఆ తరువాత దేవ్బంద్లో విద్యాభ్యాసం పొందారు. ఆ తరువాత ఢిల్లీ వచ్చారు. ఆ తరువాత మౌల్వీ ఫాజిల్‌ (పంజాబ్‌) పాసయ్యారు. ఆ తరువాత హిజ్రీ శకం 1349లో షవ్వాల్‌ నెలలో మద్‌రసహ్ ”దారుల్‌ ‘హదీస్‌’ వల్‌ ఖుర్‌ఆన్‌,” మద్‌రసహ్ ”హాజీ ‘అలీ జాన్‌”లో ఉపాధ్యాయునిగా సేవలు ప్రారంభించారు. అల్‌ హమ్‌దులిల్లాహ్‌ 16 సంవత్సరాల వరకు దర్సె’హదీస్‌’ ఇస్తూ ఉన్నారు.

వివాహం: హిజ్రీ శకం 1350లో ఖుర్బాన్‌ ‘అలీ గారి కుమార్తె షాహ్‌బానుతో వివాహం జరిగింది. హిజ్రీ శకం 1354లో ము’హమ్మద్‌ యాఖూబ్‌ ‘అలీ (నేపాల్‌)గారి ఉమ్మె మహ్‌మూదహ్ కుమార్తెతో పెళ్ళి జరిగింది.

సంతానం : మొదటి భార్యతో ‘అబ్దుర్రషీద్‌, ‘అబ్దుల్‌ ‘హలీమ్‌ సానీ, అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ ‘అబ్దుల్‌ మన్నాన్‌. ఆమినహ్‌, ‘అబ్దుల్‌ ‘హలీమ్‌ నెల తర్వాత, ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్ 2 సంవత్సరాల తర్వాత మరణించారు.

రెండవ భార్య ద్వారా ‘అబ్దుల్‌ ‘హయ్యి, ‘అబ్దుల్‌ ‘హన్నాన్‌, మ’హ్‌మూదహ్‌, మస్’ఊదహ్‌. ‘అబ్దు స్సమద్‌ 25 రోజుల తర్వాత, ‘హమీదహ్ 2 సంవత్సరాల తర్వాత మరణించారు.

దేశవిభజన: హిజ్రీ శకం 1366 వరకు ”హాజీ ‘అలీ జాన్‌”లో దర్సె ‘హదీస్‌’ కొనసాగుతూ ఉండేది. కాని హిజ్రీ శకం 1366లో కల్లోలం వల్ల తిరిగి స్వగ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆగస్టు 15, 1947 స్వాతంత్య్రం లభించింది. 100 సంవత్సరాల తర్వాత స్వాతంత్య్రం లభించినందుకు తమ సోదరుల రక్తంతో హోలీ ఆడటం జరిగింది. స్వాతంత్య్రం మత్తులో హద్దుమీరి ప్రవర్తించారు. కళ్ళపై తెరలు క్రమ్ముకున్నాయి. ఇతరుల కోసం తయారుచేసిన ఆయుధాలను తమ సోదరులపైనే ఉపయోగించసాగారు. ఎటు చూసినా విప్లవం వర్థిల్లాలి అనే నినాదాలే వినపడ సాగాయి. ఢిల్లీ భారత రాజధాని. అందువల్ల ఇక్కడ కూడా హత్యలూ, లూటీలు జరుగుతాయని ఎంత మాత్రం అనుమానం రాలేదు. వివిధ ప్రాంతాలను రంగు రంగుల లైట్లతో అలంకరించడం జరిగింది. మా కార్యాలయం చాందినీ చౌక్‌ ప్రక్కనే ఉన్న ఘంటా హౌస్‌ ప్రక్కన మస్జిదె ‘హాజీ ‘అలీ జాన్‌ ఉత్తరాన ఉన్న గదిలో ఉండేది. ఈ 17 సంవత్సరాల కాలంలో చదువు చెప్పటంతోపాటు రచనలు కూడా వ్రాశాను. అనేక అంశాలపై చాలా పుస్తకాలు రచించాను. కొన్ని ప్రచురించ బడ్డాయి, మరికొన్ని పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురణకు నోచుకోలేదు.

1. ఇబ్నె మాజహ్ ‘అరబీ వివరణ, 2. అస్సిమ్‌ సాముల్‌ బారీ అలా ఉన్నఖి జారిహిల్‌ బు’ఖారీ, 3. ఖైరుల్‌ ముతాయిద్‌ఫీ మసాయి లిర్రజాఅ, 4. అల్ల యిబ్‌ బిల్‌ షత్‌రంజ్‌, 5. హుఖూఖుజ్జౌజైన్‌, 6. ఇంకా అనేక వివిధ అంశాలపై గల పుస్తకాలు వీటన్నిటినీ 1947 కల్లోలంలో ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల నేను చాలా విచారానికి గురయ్యాను.

స్వగ్రామం తిరుగు ప్రయాణం: మూడు నెలలు బిక్కు బిక్కుమని గడిపిన తర్వాత స్వగ్రామం తిరుగు ప్రయాణంలో అనేక విలువైన వస్తువులు ధ్వంసం అయ్యాయి. నానా కష్టాలు పడిన తర్వాత స్వగ్రామం చేరుకున్నాము. 27 సంవత్సరాలు ఢిల్లీలో ఉండటం వల్ల ఇంటిని ఇతరులు ఆక్రమించుకొని ఉన్నారు. అందువల్ల బంధువుల వద్దకు వెళ్ళాము. కాని వారు కూడా అసభ్యంగా ప్రవర్తించి, గాయంపై ఉప్పుచల్లే విధంగా ప్రవర్తించారు. ఈ చేదు గుర్తులు ఇంకా మరచి పోకముందే ‘హమీదహ్, ‘అబ్దుల్‌ ‘అ’జీమ్‌ ఒకరి తరువాత ఒకరు మరణించారు. ఇటు పనిలేదు, వ్యాధులు, బంధువుల చేదు మాటలతో దెప్పి  పొడవటం మరీ అధికం అయ్యాయి. పరిస్థితి ఎలా ఉండేదంటే, నేనొకచోట, పిల్లలు ఒకచోట. కొంతమంది బస్తీలో మరికొంతమంది నేపాల్లో అనేక కష్టాల తర్వాత ఒక పాడుపడిన ఇల్లు కొని దాన్ని రిపేరు చేయించి అందులో ఉంచాను. ఆ తర్వాత ఢిల్లీ నుండి అనేక ఉత్తరాలు వచ్చాయి. కాని అనేక అసహాయతల వల్ల వెళ్ళ లేక పొయాను. పరిస్థితులు సద్దు మణిగిన తర్వాత 1948 ఢిల్లీ వచ్చాను. ”రియా’దుల్‌ ‘ఉలూమ్‌,” మఛలీవాలాన్‌లో దర్సె ‘హదీసు’ ప్రారంభమయింది. అల్‌’హమ్‌దులిల్లాహ్‌ హిజ్రీ శకం 1344 నుండి 1378 వరకు ఈ పరంపర కొనసాగింది. మిగిలిన జీవితం కూడా దైవ సేవలోనే గడిపే భాగ్యం ప్రసాదించాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను. ఆమీన్‌.

రచనలు: విద్యాబోధన, సమావేశాలు తరువాత మిగిలిన సమయంలో అనేక పుస్తకాలు వ్రాశాను. అవన్నీ ప్రచురించడం జరిగింది. ఆదరించడం జరిగింది. 1. ఇస్లామీ సీరత్‌, 2. ఇస్లామీ పర్దా, 3. ఇస్లామీ అఖాయిద్‌, 4. ఇస్లామీ వజాయిఫ్, 5. బలాగుల్‌ ముబీన్‌ యొక్క అనువాదం మిస్‌బాహుల్‌ మూమినీన్‌, 6. కష్‌ఫుల్‌ ముల్‌హిమ్‌, 7. ఖవాతీనె జన్నత్‌, 8. ఇస్లామీ తౌహీద్, 9. హలాల్‌ కమాయీ, 10. అఖ్‌లాఖ్‌ నామ, 11. కలిమయె తయ్యిబ విశేషాలు, 12. ఈమాన్‌ ముఫస్సిల్‌, 13. కితాబుల్‌ జుము’అహ్‌, 14. ఇస్లామీ తాలీమ్‌, 15. రిసాల ఉసూలెహదీస్‌’, 16. ఫ’దాయిలె ‘హదీస్‌’, 17. ఫ’దాజాయిలె ఖుర్‌ఆన్‌, 18. నోటిపై నిఘా, 19. మిష్‌కాతుల్‌ మసాబీహ్‌ అనువాదం అన్వారుల్మసాబీహ్, 20. మాసపత్రిక ”అల్‌ ఇస్లామ్‌” 21. పరోక్ష నింద మొదలైనవి.

హజ్‌: చాలాకాలంగా ‘హజ్‌కు వెళ్ళాలని, అల్లాహ్‌ గృహం దర్శనం చేసుకోవాలని కోరికగా ఉండేది. అల్లాహ్‌ దయవల్ల హిజ్రీ శకం 1368లో ఈ భాగ్యం కలిగింది. హిజ్రీ 1368 జుల్‌ ఖఅదహ్‌లో ఢిల్లీ ”రియా’దుల్‌ ‘ఉలూమ్‌” నుండి బయలుదేరాను. ముహమ్మదీ నౌక ద్వారా జిల్‌ హిజ్జహ్‌ 4న జిద్దహ్‌ చేరుకున్నాము. జిల్‌హిజ్జహ్‌ 6న మక్కహ్ ముకర్రమహ్ చేరి అల్లాహ్‌ గృహాన్ని దర్శించు కున్నాను. 8న మినా, 9న అరఫాత్‌, 10న రాత్రి ముజ్’దలిఫా మరియు మినాలో ఉన్నాను. ఈ విధంగా ‘హజ్‌ విధులు నిర్వర్తించాను. క్రీ.శ. 1949 నవంబర్‌ 8న తవాఫె విదా చేసి మదీనహ్ కు బయలుదేరాను. అక్కడకు చేరిన తర్వాత చాలా సంతోషం కలిగింది. చాలా కాలంగా మనసులోని కోరిక తీరిందని చాలా సంతోషించాను. ఆ తరువాత క్షేమంగా జిద్దహ్‌ వచ్చి, అక్కడి నుండి అక్బరీ నౌక ద్వారా ముంబయి చేరుకొని అక్కడి నుండి ఢిల్లీ చేరు కున్నాను. ఈ విధంగా నా ‘హజ్‌ యాత్ర పూర్తయ్యింది. వచ్చిన తర్వాత విధుల్లో నిమగ్నం అయిపోయాను. ఆ తరువాత మరోసారి క్రీ.శ. 1958లో ‘హజ్‌కు వెళ్ళాను. అల్లాహ్‌ దయవల్ల మరోసారి బైతుల్లాహ్‌ దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.

—–

ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్బానీ గారు ఈ కాలపు ప్రముఖ ‘హదీసు’వేత్తలలో ఒకరు. వీరు 2-10-1914 లో షోదర్ అనే అల్బానియా గ్రామంలో జన్మించారు. డెమాస్కస్, సీరియాకు వలస పోయారు. ఇతను మొదట హనఫి ఫిఖ్ ను అనుసరించారు. తరువాత సలఫి అఖీదహ్ పై ఉన్నారు. 60 సంవత్సరాలు ‘హదీసు’ విద్యను బోధించారు. ఇస్లామిక్ యూనివర్సిటీ మదీనహ్ మునవ్వరహ్ లో కూడా ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ బిన్బా’జ్ ఆహ్వానంతో, కొన్ని సంవత్సరాలు ‘హదీసు’ విద్యను బోధించారు. డెమాస్కస్ లో అ’జ్ ‘జుహీరియా లైబ్రరీలో కూడా పని చేసారు.

ఖ’తర్, ఈజిప్ట్, కువైత్, యూ.ఏ.యీ., జోర్డాన్ బేరూత్, దేశాలలో ‘హదీసు’ విద్యను బోధించారు. మక్కహ్ ముకర్రమహ్ లో కొన్ని సంవత్సరాలు ఇస్లామిక్ లా విభాగంలో కూడా పని చేసారు. చివరి కాలంలో జోర్డాన్ లో 1999లో, 89 సంవత్సరాల వయస్సులో మరణించారు.

ఈయన కొన్ని ప్రచురణలు. (1) తర్గీబ్ వ తర్హీబ్, (2) తస్ఫియహ్ వ తర్బియహ్, (3) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – అబూ దావూద్, (4) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – తిర్మిజి’, (5) ‘స’హీ’హ్ వ ‘దయీఫ్ సునన్ – ఇబ్నె మాజహ్, (6) సిల్సితుల్ అ’హాదీస్’ ‘దయాఫహ్ [14 సంపుటాలు], (7) సిల్సితుల్ అ’హాదీస్’ ‘స’హీ’హహ్ [11 సంపుటాలు] మొదలైనవి.

ఈయనకు 1999 లో ఇస్లామిక్ స్టడీస్ లో కింగ్ ఫైసల్ ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా పురస్కరించబడింది.

*****