హదీసు పరిచయము & ప్రాముఖ్యత – అబ్దుస్సలామ్‌ బ‘స్తవీ – మిష్కాతుల్ మసాబీహ్

హదీసు పరిచయం – (బస్తవి) (12 పేజీలు) [PDF]
హదీసు అంటే ఏమిటి? ఖురాన్ లో హదీసు ప్రస్తావన? ఖురాన్ వివరణలో హదీసు ప్రాముఖ్యత. హదీసు వివేక పూరితమైనది. ఇస్లాం ను అర్ధం చేసుకోవడానికి హదీసు అవసరం. హదీసులు కూడా అల్లాహ్ దగ్గర నుండి వచ్చినవే. హదీసు ప్రత్యేకతలు…

పరిచయము

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

ప్రవక్త (స) ‘హదీసు’ల సేవకుడు అబ్దుస్సలామ్‌ బస్తవీ ముస్లిమ్‌ సోదరులకు విన్నవించుకునేది ఏమనగా ప్రస్తుత కాలంలో అవిశ్వాసం, దైవ ధిక్కారం, నాస్తికత్వం, మార్గభ్రష్టత్వం రోజురోజుకూ వ్యాపిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. పరాయి వారే కాదు, ముస్లిములు కూడా వీటికి గురై తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు. ఖుర్‌ఆన్‌ను తమ కల్పిత మూఢ నమ్మకాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అంతే కాదు ప్రవక్త (స) ‘హదీసు’ల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ వీరు ఈ ‘హదీసు’ల ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలుసు కుంటే ఏనాడూ ఇటువంటి మహా పాపాలకు పాల్పడరు. ఇందులో చాలా సులభమైన పద్ధతిలో ‘హదీసు’లను అనువదించడం వివరించడం జరిగింది. అల్లాహుత’ఆలా మనందరికీ ‘హదీసు’లను అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్‌!

హదీసుఅంటే ఏమిటి ?

‘హదీసు’లను వదలి వేసిన వ్యక్తి తన కర్మలను, తన కృషి ప్రయత్నాలను వ్యర్థం చేసుకున్నట్టే. ముస్లిములు ‘హదీసు’లను తిరస్కరించవచ్చా? సత్యవిశ్వాసులు, ప్రవక్త (స) ‘హదీసు’లను ఎంతమాత్రం వదలడానికి సిద్ధం కారు. ఎందుకంటే ‘హదీసు’లు అల్లాహ్ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ యొక్క సంపూర్ణ వివరణ. ఈ ‘హదీసు’ల్లోనే ఏకత్వం, దైవ దౌత్యం, స్వర్గం, నరకం, దైవ దూతలు, జిన్నులు, పర లోకం, ప్రళయం, దైవ ప్రవక్తలు, దైవ భక్తులు, పుణ్యాత్ములు, మంచీచెడులు, వివాహం, జీవితం లోని వివిధ రంగాలకు చెందిన కార్యకలాపాల గురించి, బంధువుల హక్కులను గురించి వివరించబడి ఉంది. ‘హదీసు’లను వదలివేయడం ఇస్లామ్‌ ధర్మాన్ని వదలి వేయడంతో సమానంగా భావించాలి.

హదీసునిర్వచనం : ‘హదీసు’ అంటే సంభాషణ అని అర్థం. ‘హదీసు’వేత్తల భాషలో ప్రవక్త (స) వాక్కు, కర్మ, ఉపదేశాలను ‘హదీసు’ అంటారు. ప్రవక్త (స), ఖుర్‌ఆన్‌ ప్రకారం ఆచరించే వారు. అందువల్ల ‘హదీసు’లు ఖుర్ఆన్‌ వివరణ మరియు వ్యాఖ్యానం అవుతాయి. ప్రవక్త (స) ‘హదీసు’లను చదవటం వల్ల, వాటి ప్రకారం ఆచరించటం వల్ల ఉభయ లోకాల్లోనూ  ముక్తి, సాఫల్యాలు లభిస్తాయి. ఇవి ప్రవక్త సాంప్రదాయాన్ని ప్రధాన అంశంగా చర్చిస్తాయి.

ఆచరణా పరంగా ఖుర్‌ఆన్‌, ప్రవక్త సాంప్రదాయం రెండూ సమానమైనవే. అంటే ఒకే వస్తువుకు రెండు పేర్లు. క్రింది ఆయాతులలో ‘హదీసు’ అనే పదం ఉపయోగించబడింది. అంటే ఖుర్‌ఆన్‌లో ‘హదీసు’ అనే పదం ఉపయోగించటం దాని ప్రాముఖ్యతను విశద పరుస్తుంది. అల్లాహ్‌ ఆదేశం:

1.”…కాని వారికి ఏదైనా కీడు కలిగితే : ‘ఓ ము’హ మ్మద్‌ ! ఇది నీ వల్ల జరిగింది,’ అని అంటారు. వారితో అను, అంతా అల్లాహ్తరఫు నుండే వస్తుంది.’ ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?” (అన్నిసా, 4:78)

2. ”అల్లాహ్‌ ! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మీ అందరినీ పునరుత్థాన దినమున సమావేశపరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్‌ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?” (అన్నిసా’, 4:87)

3. ”వాస్తవానికి, వారి గాథలలో బుద్ధిమంతులకు ఒక గుణపాఠం ఉంది. ఇది (ఈ ఖుర్‌ఆన్‌) కల్పిత గాథ కాదు. కాని ఇది ఇంతవరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది. మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించే వారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను.” (యూసుఫ్‌, 12:111)

4. ”ఏమీ ? వారు ‘ఇతనే దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు,’ అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించదలచుకోలేదు! వారు సత్య వంతులే అయితే దీనివంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను. (అత్తూర్‌, 52 : 3334)

5. ”…నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ దివ్యమైనది. సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సర్వ లోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడింది. ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసు కొంటున్నారా?” (అల్‌ వాఖిఅహ్‌, 56 : 75 – 81)

6. ”అల్లాహ్‌ సర్వ శ్రేష్ఠమైన బోధనను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేసాడు. దానిలో ఒకే రకమైన (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్‌ ధ్యానం వల్ల మెత్తబడతాయి. ఇది అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్‌ మార్గ భ్రష్టత్వంలో వదులుతాడో అతనికి మార్గదర్శకుడు ఎవ్వరూ ఉండడు.” (అజ్జుమర్‌, 39:23)

7. ”ఇదివరకు వచ్చిన హెచ్చరిక చేసే వారివలే, ఇతను (ము’హమ్మద్‌) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే ! రానున్న ఘడియ సమీపంలోనే ఉన్నది. అల్లాహ్‌ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మీరు ఈ సందేశాన్ని చూచి ఆశ్చర్యపడుతున్నారా? ఏమిటి?”  (అన్నజ్మ్‌, 53 : 56 – 59)

ఈ ఆయాతులలో ‘హదీస్‌’ అనే పదం దైవ గ్రంథాన్ని సూచిస్తుంది. ‘హదీసు’ల్లో కూడా ఈ పదానికి దైవ గ్రంథం అనే పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ప్రసంగాల్లో తరచూ ఉత్తమమైన ‘హదీసు’ దైవ గ్రంథం అని పేర్కొనే వారు. అదేవిధంగా ప్రవక్త (స) ప్రవచనాన్ని కూడా ‘హదీసు’ అని అంటారు.

ప్రవక్త (స) ప్రవచనం: ”నా ‘హదీసు’లను విని ప్రజలకు తెలియపరిచే వారికి అల్లాహ్‌ సంతోషా నందాలు ప్రసాదించు గాక!”

దీనివల్ల ఖుర్‌ఆన్‌ను, ప్రవక్త(స) ప్రవచనాల్ని ‘హదీస్’ అంటారు. ఈ రెంటినీ విశ్వసించడం, వీటి ఆదేశాలను పాలించడం తప్పనిసరి. ఖుర్‌ఆన్‌ ఆదేశాల్ని పాలించి నట్లే, ‘హదీసు’ ఉపదేశాల్ని కూడా పాలించాలి. అల్లాహ్‌ను విశ్వసించినట్లే, ప్రవక్త (స)నూ విశ్వసించాలి.

అల్లాహ్‌ఆదేశం:1. ”ఓ విశ్వాసులారా ! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి.” (అన్నిసా’, 4:59).

2. ”మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.” (అన్నిసా’, 4:64) – ఎందుకంటే ప్రవక్త (స) కు విధేయత చూపితే, అల్లాహ్‌కు విధేయత చూపినట్లే.

3. ”ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్‌ కు విధేయత చూపినట్లే.” (అన్ని సా’,4:80)-అందువల్ల ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లను అనుసరించటం వల్లనే అల్లాహ్‌ (త) విధేయత లభిస్తుంది.

ఖుర్ఆన్లోహదీస్‌’ ప్రస్తావన

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ దైవ వాక్కులే. ఎందుకంటే ‘హదీసు’ కూడా అల్లాహ్‌ తరఫు నుండే అవతరించింది. అల్లాహ్‌ ఆదేశం:

1. ” మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానం (హీ) మాత్రమే.” (అన్నజ్మ్‌, 53:3-4)

2. ”(ఓ ప్రవక్తా!) ఇలా అను: ‘మీకు నిజంగా అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్నే అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ క్షమాశీలుడు. అపార కరుణా ప్రదాత.'(ఇంకా) ఇలా అను:’అల్లాహ్‌కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.’  ఒకవేళ వారు కాదంటే! ‘నిశ్చయంగా అల్లాహ్‌ సత్యతిరస్కారులను ప్రేమించడు,’ అని తెలుసుకోవాలి.” (ఆల ఇమ్రాన్‌, 3:3132)

3. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలిపోకండి.” (అల్‌ అన్‌ఫాల్‌, 8:20)

4. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు విధేయులై ఉండండి. మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయభేదం కలిగితే మీరు అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని, విశ్వసించే వారే అయితే, ఆ విషయాన్ని అల్లాహ్‌కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.” (అన్నిసా, 4:59)

‘హదీసు’ను గౌరవించటం ప్రవక్త(స)ను గౌరవించి నట్లే. ప్రవక్త (స)ను గౌరవించటం, అల్లాహ్‌ను గౌరవించి నట్లే. ప్రవక్త (స) ముందు బిగ్గరగా, అసభ్యంగా మాట్లాడరాదు.

ఈ ఆయాతులలో ఖుర్‌ఆన్‌తో పాటు ‘హదీసు’కు కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.

ఖుర్ఆన్వివరణలో హదీసు ప్రాధాన్యత

ఖుర్‌ఆన్‌లోని కొన్ని వాక్యాలకు ప్రవక్త (స) ‘హదీసు’ ద్వారానే వివరణ లభిస్తుంది. ఉదాహరణకు: ”అఖీముస్సలాహ్‌” ఖుర్‌ఆన్‌లో నమా’జు గురించి ఆదేశించబడింది. కాని దాని పద్ధతి లేదు. దీని పద్ధతి వివరంగా ‘హదీసు’లో ఉంది. ”సల్లూ కమా రఅయ్‌తు మూనీ ఉసల్లీ” (బు’ఖారీ) అంటే నేను నమా’జు చేస్తూ ఉండగా చూసినట్లే, మీరూ నమా’జ్‌ చేయండి. అదేవిధంగా ఖుర్‌ఆన్‌లో ‘జకాత్‌ ఇవ్వండి అని ఉంది. దాని పద్ధతి, నియమ నిబంధనలు అన్నీ ‘హదీసు’ల్లో ఉన్నాయి. అదేవిధంగా ఖుర్‌ఆన్‌లో ఉపవాసం గురించి ఉంది. కాని దాని వివరణ, పద్ధతి, నియమ నిబంధనలు లేవు. అవన్నీ ‘హదీసు’ల్లో ఉన్నాయి. అదేవిధంగా ‘హజ్జ్ కూడా. ఇంకా నికా’హ్‌, ‘తలాఖ్‌, వ్యాపారం మొదలైన వాటి వివరాలు కూడా ‘హదీసు’ల్లోనే ఉన్నాయి. ప్రవక్త (స) అనుచరులైన ‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హుసైన్‌ (ర)ను ఇలా ప్రశ్నించటం జరిగింది. ”మీరు వివరించే ‘హదీసు’ల మూలాలు ఖుర్‌ఆన్‌లో లేవే” అని. అది విని ‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హుసైన్‌ ఆగ్రహానికి గురై, ఆ వ్యక్తితో, ‘నువ్వు ఖుర్‌ఆన్‌లో ‘జకాత్‌ గురించి 200 దిర్‌హమ్‌లు ఉంటే ప్రతి 40 దిర్‌హమ్‌లకు ఒక దిర్‌హమ్‌ ఇవ్వాలని, అదే విధంగా మేకల్లో ప్రతి నలభై మేకలకు 1 మేక చెల్లించాలని, ఒంటెల్లో కూడా ఇలాగే ఇవ్వాలని ఖుర్‌ఆన్‌లో ఉన్నాయా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఈ వివరాలు ఖుర్‌ఆన్‌లో లేవు,’ అని అన్నాడు. మరి నీవు ఎక్కడి నుండి నేర్చుకున్నావు? నీవు మా నుండి నేర్చుకున్నావు. మేము ప్రవక్త (స) ద్వారా నేర్చుకున్నాము. ఇలా అనేక విషయాల గురించి చర్చించారు. (అబూ దావూద్‌ – కితాబు’జ్జకాత్‌ 225/1)

దీని వల్ల తెలిసిందేమిటంటే, ఖుర్‌ఆన్‌లో కొన్నిచోట్ల ఆదేశాలను సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ‘హదీసు’ల్లో దాని వివరణ ఉంది.

ఈ వాక్యాల ద్వారా ‘హదీసు’ ఖుర్‌ఆన్‌ వివరణ అని అర్థం అయ్యింది. ఏ విధంగా ఖుర్‌ఆన్‌ ప్రధానమైనదో ‘హదీసు’ కూడా ప్రధానమైనదే.

హదీసువివేక పూరితమైనది

ఖుర్‌ఆన్‌లో ‘హదీసు’ వివేకంగా పేర్కొనబడింది.

అల్లాహ్‌ ఆదేశం: ”ఆయనే ఆ నిరక్షరాస్యులైన వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను చదివి వినిపిస్తున్నాడు. మరియు వారిని సరిదిద్దుతున్నాడు. మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండే వారు. (అల్‌ జుము’అహ్‌, 62:2)

ఈ ఆయతులో గ్రంథం అంటే ఖుర్‌ఆన్‌, వివేకం అంటే ప్రవక్త (స) సాంప్రదాయం అని సూచించడం జరిగింది.

ఖునూజీ, ఫవాయిదుల్‌ ఫవాయిద్‌ 171వ పేజీలో దైలమీ ద్వారా ఈ ప్రామాణిక ‘హదీసు’ను పేర్కొన్నారు. ”అంటే ‘హదీసు’ లేకుండా ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవడం, గ్రహించడం అసాధ్యం. ఎవరు నా ‘హదీసు’ను చదివి అర్థం చేసుకొని, దాన్ని గుర్తుంచుకుంటే, అతడు ఖుర్‌ఆన్‌ అనుచరుడుగా పరిగణించబడతాడు. ఇంకా ” ‘హదీసు’ ఖుర్‌ఆన్‌ నుండి వేరు కాదు,” అని కూడా ఉంది. ఈ రెండు ఒక దాని పట్ల ఒకటి తప్పనిసరి విషయాలు. ‘హదీసు’ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించిన వ్యక్తి ఇహ పరాలు నాశనం అవుతాయి. నన్ను అనుసరించమని, నా ఉపదేశాల ప్రకారం ఆచరించమని అల్లాహ్‌ ఆదేశించి ఉన్నాడు. నా సాంప్రదాయం పట్ల సంతృప్తికరంగా ఉన్న వ్యక్తి ఖుర్‌ఆన్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్టే. నా ‘హదీసు’ను స్వీకరించిన వ్యక్తి ఖుర్‌ఆన్‌ను స్వీకరించినట్టే. ”ప్రవక్త (స) ఇచ్చినదాన్ని తీసుకోండి, వారించిన వాటికి దూరంగా ఉండండి” అని అల్లాహ్‌ ఆదేశించి ఉన్నాడు.

ప్రవక్త (స) ప్రవచనం: నా ‘హదీసు’లను అనుసరించిన వాడు నా అనుచర సమాజంలోని వాడు. నా ‘హదీసు’లను తిరస్కరించిన వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు.

ఈ ‘హదీసు’ ద్వారా ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ షరీ’అత్‌ మూలాలు అని స్పష్టంగా తెలియపర్చటం జరిగింది. ఇంకా ప్రతి ముస్లిమ్‌ ఈ రెంటినీ తప్పనిసరిగా అనుసరించాలి. ‘హదీసు’ను తిరస్కరిస్తే, ఖుర్‌ఆన్‌ను కూడా తిరస్కరించినట్టే. అల్లాహ్‌ (త) తన ప్రవక్తపై ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లను రెంటినీ అవతరింపజేసాడు. ఖుర్‌ఆన్‌లో అనేక చోట్లలో గ్రంథంతో పాటు వివేకం అని కూడా పేర్కొనడం జరిగింది.

సుయూతీ ”మిఫ్‌తాహుల్‌ జన్నహ్‌”లో ఇలా పేర్కొన్నారు, ”ఖుర్‌ఆన్‌లో కొన్నిచోట్ల ‘హదీసు’ ద్వారానే అర్థం చేసుకోవటం, ఆచరించటం సాధ్యం. అంటే ప్రవక్త (స) సాంప్రదాయం ఖుర్‌ఆన్‌ను స్పష్టంగా వివరిస్తుంది.”

ప్రవక్త (స)పై దైవ వాణి అవతరించేది. అయితే జిబ్రీల్‌ (అ), ప్రవక్త (స) వద్దకు ప్రవక్త సాంప్రదాయాన్ని తీసుకువచ్చే వారు. అది దాన్ని స్పష్టంగా వివరించేది.

షాతిబీ, అల్‌జాయీ పదాలను వివరిస్తూ ఇలా పేర్కొన్నారు, ”ఖుర్‌ఆన్‌ వాక్యాల్లో అనేక విధాలుగా గ్రహించటం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించటం జరిగిందో సరిగా అర్థం అయ్యేది కాదు. ‘హదీసు’ దాన్ని ఇది అని నిర్దేశించేది. అంటే ప్రవక్త (స) సాంప్రదాయం అల్లాహ్‌ ఆదేశాలకు వ్యాఖ్యానం, వివరంగా పనిచేసింది.

ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు మూలం, వివరణగా తమ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పరస్పరం వ్యతిరేకం కావు. ఖుర్‌ఆన్‌ మూలం. ‘హదీసు’ దాని వివరణ. అందువల్లే ఖుర్‌ఆన్‌లో ”మేము నీ వద్దకు గ్రంథాన్ని అవతరింప జేసాము, వారికోసం ఆదేశించిన వాటిని స్పష్టంగా వివరించటానికి.” ప్రవక్త (స) యొక్క విధులు, బాధ్యతలనే మనం ‘హదీసు’ అంటాం.

షాతిబీ, ‘హదీసు’ అసలు ఖుర్‌ఆన్‌ యొక్క స్పష్టమైన, వివరమైన రూపం అని, దాని వ్యాఖ్యానం అని పేర్కొన్నారు. ఖుర్‌ఆన్‌ నమా’జు గురించి ఆదేశిస్తే, ‘హదీసు’ దాన్ని స్పష్టంగా విశదపరచి వ్యాఖ్యానించింది. అంటే చేతులు ఎలా ఎత్తాలి, ఎలా కట్టుకోవాలి. ఎందుకంటే ఆచరించటానికి ఇవన్నీ తప్పనిసరి.

ప్రవక్త (స) రెండు విధాలుగా ప్రజలకు బోధించేవారు. ముందు దైవాదేశాలను ప్రజలకు వినిపించేవారు. ఆ తర్వాత వాటిని విశదపరచి, వాటి గురించి స్పష్టమైన సూచనలు ఇచ్చేవారు. ఖుర్‌ఆన్‌ అవతరించినపుడు అరబ్బీ భాషా పండితులు, ప్రవీణులు ఉండేవారు. కాని ఖుర్‌ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి వివరంగా తెలుసుకోవటానికి ప్రవక్త (స) సన్నిధికి వచ్చేవారు. ఉదాహరణకు కొన్ని ఆయతులు:

1. ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని అత్యాచారం తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి భద్రతలు ఉన్నాయి. మరియు వారే సన్మార్గంపై ఉన్నారు. (అల్‌ అన్‌ ఆమ్‌, 6:82)

ఈ ఆయతు అవతరించినపుడు ప్రవక్త (స) అనుచరులు సందేహానికి గురై, ప్రవక్త (స)ను దాని వివరణ కోరగా, ప్రవక్త (స) ఇక్కడ అత్యాచారం అంటే సాటి కల్పించటం అని వివరించారు. అదేవిధంగా సాటి కల్పించటం చాలా నీచ అత్యాచారం. అని బు’ఖారీ, ముస్లిమ్‌లో ఉంది. దీన్ని గురించి కూడా అనుచరులు సందేహానికి గురయ్యారు. ప్రవక్త (స) వారి సందేహానికి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు.

హదీసుఅవసరం

ఇస్లామ్‌ను అర్థం చేసుకోవడానికి ఖుర్‌ఆన్‌ ఎంత అవసరమో, ‘హదీసు’ కూడా అంతే అవసరం. కనుక ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవటానికి ‘హదీసు’ చాలా అవసరం.

ఒకవేళ ‘హదీసు’ను ఖుర్‌ఆన్‌ వివరణగా భావించ కుంటే, ప్రతి వ్యక్తి ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానాన్ని తన అభిప్రాయాల ద్వారా వివరిస్తాడు. ప్రతి ఒక్కరి అభిప్రాయం సరికాదు. ఒక ఆయతు గురించి ఒకరు ఒక విధంగా భావిస్తారు. మరొకరు మరో విధంగా భావిస్తారు. దీని వల్ల అనేక అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఖుర్‌ఆన్‌ పట్ల ఎవరికి ఎలా తోచితే అలా భావిస్తూ ఆటలా చేసుకుంటారు. వాస్తవం ఏమిటంటే ఖుర్‌ఆన్‌ ఒక దిశా నిర్దేశాల ప్రామాణిక గ్రంథం. ప్రవక్త(స) వివరణ లేకుండా దీన్ని అర్థం చేసుకోవటం ఎంత మాత్రం సాధ్యం కాదు. ప్రవక్త (స) యొక్క ఆ ఆదేశాలనే ‘హదీసు’లు అంటారు. ప్రవక్త (స) ‘హదీసు’లను అనుసరిస్తే, ఖుర్‌ఆన్‌ను అనుసరించినట్టే. అదేవిధంగా ‘హదీసు’లను తిరస్కరిస్తే  ఖుర్‌ఆన్‌ను తిరస్కరించినట్టే.

‘హాఫి”జ్‌ ఇబ్నె కసీ’ర్‌: ”ప్రవక్త సాంప్రదాయాన్ని, ‘హదీసు’లను దృఢంగా పట్టుకోండి. ఎందుకంటే ఈ ‘హదీసు’లు ఖుర్‌ఆన్‌ వివరణ మరియు వ్యాఖ్యానాలు.” అని అన్నారు .

అదేవిధంగా షాఫయీ తన పుస్తకంలో ఇలా అభిప్రాయపడ్డారు: ”ప్రవక్త (స) ఏమి ఆదేశించినా, ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకొని ఆదేశిస్తారు. ఎందుకంటే అల్లాహ్‌ ఖుర్ఆన్లో ”మేము నీపై సత్యం ద్వారా గ్రంథాన్ని అవతరింపజేసాము. దాని ద్వారా నీవు ప్రజల్లో తీర్పుచేయాలని,”  అంటే – ‘అల్లాహ్‌ ప్రవక్త (స) ను ఆదేశించినట్టు. దాని ద్వారా ప్రవక్త (స) ప్రజల్లో తీర్పుచేయాలని, అంటే అవి ప్రవక్త (స) ఆదేశాలు, ఆచరణలు అవుతాయి. దాని పేరే ‘హదీసు’. ఇంకా ”నీవు చేసే తీర్పు దైవ తీర్పుగా ఉంటుంది.” అల్లాహ్‌ ఆదేశం, ”ప్రవక్త(స)కు విధేయత చూపిన వాడు అల్లాహ్‌కు విధేయత చూపినట్టే.”

ప్రవక్త (స) కు, విధేయత అంటే ప్రవక్త (స) ఆదేశాలను, ఉపదేశాలను, ఆచరణలను అనుసరించటం. వీటినే మనం ‘హదీసు’లు అంటాం. ప్రవక్త (స) కు విధేయత చూపకుంటే అల్లాహ్‌కు విధేయత చూపలేము. ఎందుకంటే ఇందులో ఒకరి విధేయత మరొకరి విధేయతలో తప్పనిసరిగా చేర్చబడి ఉంది. ఖుర్‌ఆన్‌లో అనేక చోట్లలో ప్రవక్త (స)కు విధేయత గురించి నొక్కి వక్కాణించడం జరిగింది.

1. ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి.” (అన్నిసా’, 4:59).

2. ”మరియు మేము ఏ ప్రవక్తను పంపినా – అల్లాహ్‌ అనుజ్ఞతో – (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము.” (అన్నిసా’, 4:64)

అల్లాహ్‌కు విధేయత చూపటం, ఆయన ప్రవక్తకు విధేయత చూపటం రెండూ తప్పనిసరి విషయాలే. అంటే అల్లాహ్‌ (త) ఆదేశాలను, ప్రవక్త (స) ఉపదేశాలనూ పాటించాలి.

ఇబ్నుల్‌ ఖయ్యీమ్‌ అభిప్రాయం: ‘హదీసు’లను పరిశీలిస్తే, మూడు రకాల ‘హదీసు’లు కనిపిస్తాయి. 1. కొన్నిటిలో ఖుర్‌ఆన్‌లో ఉన్నట్టే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. 2. కొన్నిటిలో సంక్షిప్త పదానికి వివరణ ఉంది. ఈ రెండు రకాల్లో ప్రవక్త (స) విధేయత ప్రత్యేకంగా అవసరం లేదు. 3. కొన్ని ‘హదీసు’ల్లో ఖుర్‌ఆన్‌ మౌనం వహించిన ఆదేశాల గురించి పేర్కొనడం జరిగింది. ఈ ఆదేశాలను పాటించటానికే ”అతీ ఉల్లాహ వర్రసూల” అనే ఆదేశం ఇవ్వబడింది. ఒకవేళ ఈ మూడవ ఆదేశం స్పష్టంగా ఇవ్వకుండా ఉంటే ప్రవక్త విధేయతకు అర్థమే ఉండదు. సారాంశం ఏమిటంటే, అన్ని ఆదేశాలను పాలించినప్పుడే ఈ ఆయతుపై అమలుచేయడం జరుగుతుంది. ఖుర్‌ఆన్‌ ప్రవక్త (స) విధేయతను అల్లాహ్‌ విధేయతగా పేర్కొంది. ప్రవక్త (స) విధేయత ఒక విధంగా అల్లాహ్‌ విధేయత అవుతుంది.

హదీసులు కూడా ఖుర్ఆన్మాదిరిగానే అవతరించబడ్డాయి

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు రెండూ ధార్మిక మూలాలే. రెండూ అల్లాహ్‌ వద్ద నుండి వచ్చినవే. ఇబ్నె కసీ’ర్‌ ఇలా అభిప్రాయపడుతున్నారు: ”ఖుర్‌ఆన్‌ దైవ వాణి ద్వారా అవతరించబడుతుంది, ‘హదీసు’ పఠించబడదు.

హా’జిమీ తన పుస్తకం నాసిఖ్‌, మన్‌సూఖ్‌లో ఇలా పేర్కొన్నారు: అంటే జిబ్రీల్‌ (అ) ‘హదీసు’ను తీసుకొని ఆకాశం నుండి దిగేవారు. ఇంకా ప్రవక్త (స) కు నేర్పే వారు. ప్రవక్త (స) యొక్క ప్రతి ఆదేశం, ప్రతి ‘హదీసు’ దైవ వాణి అవుతుంది. (ఇన్‌తహా – 24వ పేజీ)

ముస్నద్‌ దార్మీలో ఇలా ఉంది: ‘హస్సాన్‌ (ర) కథనం: జిబ్రీల్‌ (అ) ఖుర్‌ఆన్‌ తీసుకొని ప్రవక్త (స)పై అవతరింపజేసినట్టే, ‘హదీసు’ తీసుకొని కూడా అవత రింపజేసేవారు.(ఫత్‌హుల్‌ బారీ – 29, 670 పేజీలు)

షాఫయీ తన పుస్తకం ”అల్‌ ఉమ్ము”లో ఇలా పేర్కొన్నారు: అంటే ప్రవక్త (స) అల్లాహ్‌ ఆదేశం లేనిదే ఎటువంటి ధార్మిక ఆదేశం ఇవ్వలేదు. రెండు విధాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి పఠనా దైవవాణి ద్వారా లేదా ‘హదీసు’ ద్వారా. సూరహ్‌ నిసా’ (4)లో అల్లాహ్‌ తన ప్రవక్త నుద్దేశించి, ”అల్లాహ్‌ నీపై గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేసాడు. గ్రంథం అంటే ఖుర్‌ఆన్‌, వివేకం అంటే ‘హదీసు’. దీన్ని సమర్థిస్తూ ఒక సేవకుని సంఘటన ఉంది. అతడు తన యజమాని భార్యతో వ్యభిచారం చేసాడు. అతని కేసు ప్రవక్త (స) న్యాయస్థానంలోనికి వచ్చింది. అప్పుడు ప్రవక్త (స) ‘నేను అల్లాహ్‌ గ్రంథం ప్రకారం తీర్పు చేస్తాను’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) తీర్పు ఇచ్చి, దాన్ని అమలు జరిపారు. అది ఖుర్‌ఆన్‌లో లేదు, ‘హదీసు’లో ఉంది. దీనివల్ల దైవ గ్రంథం అంటే పఠించబడని దైవవాణి అని స్పష్టంగా తెలుస్తుంది. ‘హదీసు’లను పరిశీలిస్తే, ప్రవక్త (స)ను ఒక విషయం గురించి ప్రశ్నిస్తే, తనకు తెలిసి ఉంటే వెంటనే సమాధానం ఇచ్చేవారు. లేదంటే దైవవాణి కోసం ఎదురు చూసి, దైవవాణి వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేవారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్నింటిని పరిశీలిద్దాం.

1. ఒక వ్యక్తి ప్రవక్త (స)ను ప్రపంచంలో అల్లాహ్‌కు అన్నింటికంటే ప్రీతికరమైన ప్రదేశం ఏది అని అడిగాడు. దానికి ప్రవక్త (స) ”నాకు  తెలియదు. జిబ్రీల్‌ను అడిగి చెబుతాను,” అని అన్నారు. జిబ్రీల్‌ (అ) వచ్చిన తర్వాత అతన్ని అడిగారు. దానికి జిబ్రీల్‌ కూడా నాకు తెలియదు అని, తెలుసుకోవడానికి ఆకాశంపై ఎక్కి అల్లాహ్‌ను అడిగి తెలుసుకొని వచ్చి, ‘అన్నింటికంటే ఉత్తమమైన ప్రదేశాలు మస్జిదులు, అన్నింటికంటే నీచమైన ప్రదేశాలు బజారులు’ అని అన్నారు. ఈ సంఘటన ద్వారా ‘హదీసు’ కూడా దైవవాణి అని తెలుస్తుంది. ఇది జిబ్రీల్‌ ద్వారా ప్రవక్త (స)కు చేరేది. (అహ్మద్‌, తబ్‌రానీ, ఇబ్నె హిబ్బాన్‌)

2. ‘హజ్జ్ లో సుగంధ పరిమళాలు ఉపయోగించ రాదు. ఒక అనుచరుడు తెలియక ఉమ్‌రహ్‌ ఇ’హ్‌రామ్‌ స్థితిలో సుగంధ పరిమళాలు పులుముకున్నాడు. చొక్కా కూడా ధరించాడు. ఇప్పుడు ఏమి చేయాలని ప్రవక్త (స)ను విన్నవించుకున్నాడు. కాని ప్రవక్త (స)కు కూడా దాన్ని గురించి తెలియదు. దైవవాణి వచ్చిన తర్వాత సువాసనను కడిగి వేయమని చొక్కా తీసివేయమని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ)

ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. బు’ఖారీ ఈ విషయంలో ఒక అధ్యాయాన్ని పేర్కొన్నారు. అంటే ప్రవక్త (స)కు తెలియని విషయం గురించి అడగడం జరిగితే, నాకు తెలియదని చెప్పేవారు లేదా సమాధానం ఇచ్చే వారు కాదు. దైవవాణి వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేవారు.

హదీసుప్రత్యేకతలు (దాయల్)

ప్రవక్త(స)కు మానవులందరిపై ప్రత్యేక స్థానం ఉన్నట్టు, ప్రవక్త(స) బోధనలకు కూడా మానవులందరి మాటలపై ప్రత్యేక స్థానం ఉంది. ‘హదీసు’ జ్ఞానం ప్రవక్త (స) ఉనికి నుండి వచ్చినదే. ఎందుకంటే ప్రవక్త(స) అల్లాహ్‌ ప్రవక్త. ప్రవక్త (స) ఆదేశాలు, ఆచరణలనే ‘హదీసు’లు అంటారు. వీటిని చదివి, ఆచరిస్తే ఉభయ లోకాల్లో సాఫల్యం లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ తర్వాత ‘హదీసు’కే గొప్ప స్థానం ఉంది. ‘హదీసు’లను అనుసరించే వారికి గొప్ప గొప్ప స్థానాలు లభిస్తాయి.

అబూ ము’హమ్మద్‌ ఇజ్‌దీ మి’స్‌రీ తన పుస్తకంలో ఇలా పేర్కొన్నారు: ‘హదీసు’ విద్యకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దానికి సహాయ సహకారాలు అందించే వారు ఉన్నత స్థానాలు పొందుతారు. అసంపూర్ణ వ్యక్తి, ‘హదీసు’ విద్యను నేర్చుకొని పరిపూర్ణుడవుతాడు. ఇంకా అందవికారుడు అంద గాడుగా తయారవుతాడు. 1. ‘హదీసు’ విద్య యొక్క మహత్మ్యం రహస్యం ఏమీ కాదు. నిస్సందేహంగా అది జ్ఞాన సముద్రం. దీనివల్ల గౌరవం లభిస్తుంది. 2. ఇందులో అనేక వజ్రాలు, ముత్యాలు ఉన్నాయి. 3. ఎన్నో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి. ‘హదీసు’ విద్య నేర్చుకునేవారు, ఆచరించేవారు అల్లాహ్‌ ధర్మ సేవకులు, సహాయకులూను.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హసన్‌ షీరా’జీ ‘హదీసు’ మరియు ‘హదీసు’లను అనుసరించేవారి గురించి ఇలా పేర్కొన్నారు. ‘ఓ మనిషి నీవు ‘హదీసు’ను అనుసరించే వారితో ఉండు. ఎందుకంటే వారు రుజ మార్గంపై ఉన్నారు. వెలుగు కేవలం ‘హదీసు’ను అనుసరించే వారిలోనే ఉంది. మిగిలిన వారిలో చీకటి రాత్రుల చీకటి ఉంది. సృష్టి రాసుల్లో కెల్లా ఉత్తములు ‘హదీసు’లను అనుసరించే వారే. కల్పితాలకు గురయ్యేవారే అంధులు. ‘హదీసు’లను వదలిన వారు తమ ఆచరణలన్నింటినీ వృథా చేసుకుంటారు. ఒక వ్యక్తి ముస్లిమయి ‘హదీసు’లను వదలగలడా?

హదీసుప్రాధాన్యతను హదీసునోట వినండి

ఇర్‌బా’జ్‌ బిన్‌ సారియ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు మాకు నమా’జు చదివించారు. నమా’జు తర్వాత మా వైపు తిరిగి ఎటువంటి ప్రసంగం చేశారంటే, మా కళ్ళంట అశ్రువులు రాల సాగాయి, హృదయాలు కంపించసాగాయి. ఒక వ్యక్తి లేచి, ‘ఓ ప్రవక్తా! ఈ ప్రసంగం ప్రయాణంపై వెళుతున్న వ్యక్తి తన వారికి హిత బోధ చేసినట్లు ఉంది. మాకేదైనా హిత బోధ చేయండి’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నేను మీకు చేసే హిత బోధ ఏమిటంటే, అల్లాహ్‌కు భయపడుతూ ఉండాలి, ముస్లిమ్‌ పాలకునికి విధే యులై ఉండాలి. ఒకవేళ మీపై నల్ల జాతి వ్యక్తి పాలకుడైనా సరే, నా తరువాత బ్రతికుండేవారు అనేక భేదాభిప్రాయాలు చూస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో నా సాంప్రదాయాన్ని, ‘హదీసు’ను దృఢంగా పట్టుకొని ఉండండి. నా తరువాత ‘ఖలీఫాలను అంటిపెట్టుకుని ఉండండి. పళ్ళతో గట్టిగా పట్టుకొని ఉండండి. కల్పితాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కల్పితం బిద్‌’అత్‌ అవుతుంది. ప్రతి బిద్‌’అత్‌ మార్గభ్రష్టత్వానికి గురి చేస్తుంది.” (అహ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’)

ప్రవక్త (స) ప్రవచనం: ”నేను మీలో రెండు విషయాలను వదలి వెళుతున్నాను. మీరు వాటిని దృఢంగా పట్టుకొని ఉన్నంత వరకు ఎంతమాత్రం మార్గ భ్రష్టత్వానికి గురికారు. అవి: 1. ఖుర్‌ఆన్‌ 2. నా సాంప్రదాయం.” (అల్‌ ‘హాకిమ్‌)

ఈ రెండే మార్గదర్శకాలు. ఈ రెండే సూర్యచంద్రులు. ఈ రెంటిపై నడచి వారెవరూ మార్గభ్రష్టత్వానికి గురి కారు. అభిప్రాయభేదాలు ఏర్పడినప్పుడు ప్రవక్త (స) సాంప్రదాయాన్ని అనుసరించేవారికి 100 అమర వీరుల పుణ్యం లభిస్తుంది.

ప్రవక్త (స) ప్రవచనం: ‘అనుచర సమాజంలో కల్లోల కాలంలో నా సాంప్రదాయాన్ని అనుసరించేవారికి 100 మంది అమర వీరుల పుణ్యం లభిస్తుంది. (బైహఖీ)

అదేవిధంగా ప్రవక్త (స) ‘హదీసు’లను, సాంప్రదాయాలను ప్రేమించేవారు స్వర్గంలో ప్రవక్త (స) సహవాసంలో ఉంటారు. ప్రవక్త (స) ప్రవచనం: నా’ సాంప్రదాయాన్ని ప్రేమించేవారు నన్ను ప్రేమించినట్టు. నన్ను ప్రేమించే వారు స్వర్గంలో నా సహవాసంలో ఉంటారు. (తిర్మిజి’)

అబుల్‌ అ’హ్‌సన్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) ప్రతి గురువారం నిలబడి బిగ్గరగా ”ప్రజలారా! రెండే విషయాలు ఉన్నాయి. 1. దైవ గ్రంథం 2. ఉత్తమ ఆచరణ. అన్నింటికంటే సత్యమైనది దైవ గ్రంథం. అన్నిటి కంటే ఉత్తమమైన ఆచరణ ప్రవక్త (స) సాంప్రదాయం. (జామి ఉల్‌ బయాన్‌, అల్‌ ఇల్మ్‌ వ ఫ’ద్లుహు)

ప్రవక్త (స) ఆచరణ ‘హదీసు’ల ద్వారానే తెలుస్తుంది. ‘హదీసు’ను అనుసరించటం ఖుర్‌ఆన్‌ను అనుసరించటం అవుతుంది. దీన్ని గురించి ఒక సంఘటన ఉంది. ఇబ్రాహీమ్‌ బిన్‌ అల్‌ ఖమహ్‌ కథనం: అసద్‌ తెగకు చెందిన ఒక స్త్రీ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ వద్దకు వచ్చి, ‘మీరు సవరాలు వేసేవాళ్ళను వేయించుకునే వాళ్ళను శపిస్తున్నారట, నేను ఖుర్ఆన్‌ అంతా చదివాను కాని ఖుర్‌ఆన్‌లో ఇలాంటిది ఎక్కడా లేదే! మీ భార్య కూడా దీనికి గురి కాకుండా ఉండదు అని నా అనుమానం’ అని చెప్పింది. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘నువ్వు మా ఇంటికి వెళ్ళి చూసుకో’ అని చెప్పారు. ఆమె వెళ్ళింది. కాని ఆమెకు ఆ విషయం కనబడలేదు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఆమెతో, ”నా భార్య దీనికి పాల్పడి ఉంటే, నేను ఆమె ముఖం చూసే వాడిని కాను. ఖుర్‌ఆన్‌లో ఎక్కడా లేదని నువ్వు అంటున్నావు. కాని ఈ ఆయతు నీవు చూడలేదా? ”వమా అతాకుముర్రసూలు ఫ’ఖుజూ’హు వమా న’హాకుమ్‌ అన్‌హు ఫన్‌తహూ’ ‘(అల్ హష్ర్, 59:7) – ‘…మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి…’ అని అన్నారు. దానికి ఆమె, ‘ఈ ఆయతు చదివాను,’ అని చెప్పింది. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌, ‘చాలు, నోరు మూసుకో, ప్రవక్త (స) దీన్ని శపించారు’ అని అన్నారు.

హదీసుసాఫల్యానికి మార్గం

దైవ ప్రీతి కోరుకునే వారికి ‘హదీసు’ సరైన మార్గం. సుఫియాన్‌ ఇలా పేర్కొన్నారు: ‘భూమిపై ‘హదీసు’ విద్యకంటే ఉత్తమమైన విద్య మరొకటి లేదు. దైవ ప్రీతిని పొందగోరే వారికి ఇది ఎంతో ఉపయోగకరమైనది.’ (తారీఖు బ’గ్‌దాద్‌ / 83)

‘హదీసు’ ఎంతో ఉత్తమమైన ఆరాధన, తస్‌బీహ్‌ కంటే ఉన్నతమైనది. వకీ అభిప్రాయం: ‘హదీసు’కంటే గొప్ప ఆరాధన లేదు. నేను ‘హదీసు’ను తస్‌బీ’హ్‌కంటే ఉత్తమంగా భావిస్తున్నాను. అలా కాకుంటే నేను చెప్పేవాడిని కాను.’

హదీసువిద్య నమాజు వంటిది: ము’హమ్మద్‌ బిన్‌ ‘ఉమర్‌ బిన్‌’అ’తా కథనం: ‘మూసా బిన్‌ యసార్‌ మాకు ‘హదీసు’ బోధిస్తున్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) అతనితో, నీవు ‘హదీసు’ బోధన ముగించితే, సలామ్‌ పలుకు, ఎందుకంటే నీవు నమా’జ్‌లో ఉన్నావు. అంటే ఏవిధంగా నమా’జుకు పుణ్యం లభిస్తుందో, దీనికీ పుణ్యం లభిస్తుంది.’ అని అన్నారు .

‘హదీసు’ విద్యాభ్యాసం అదనపు నమా’జు కంటే ఉత్తమమైనది. వకీ అభిప్రాయం: ‘ఒకవేళ నాకు అదనపు నమా’జులు ‘హదీసు’కంటే ఉత్తమమైనవి అని తెలిస్తే నేను ‘హదీసు’లను ఉల్లేఖించను. అంటే నా వద్ద అదనపు నమా’జు కంటే ‘హదీసు’ బోధన ఉత్తమం. (తారీఖు బ’గ్‌దాద్‌ / 84)

హదీసుప్రచారం విశిష్ఠత

ప్రవక్త (స) ప్రవచనం: ‘మా ‘హదీసు’లను విని గుర్తుచేసుకొని, అలాగే ఇతరులకు అందజేసేవారికి అల్లాహ్ సుఖసంతోషాలు ప్రసాదించు గాక!’

‘హదీసు’ విద్య నేర్పించే, నేర్చుకునేవారు ప్రవక్త (స) వారసులు: ‘హదీసు’ను అనుసరించే వారే ప్రవక్త (స) అసలైన వారసులు. ప్రవక్త (స) వీరి గురించి ప్రత్యేకంగా దు’ఆ చేశారు.

‘అలీ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) మా ఇంటికి వచ్చి, ”ఓ అల్లాహ్‌! నీవు నా వారసులపై కనికరించు,” అని ప్రార్థించారు. దానికి అక్కడున్న వారు, ”ఓ ప్రవక్తా! తమరి వారసులు ఎవరు?” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ”నా తరువాత వచ్చేవారు, నా ‘హదీసు’లను, నా సాంప్రదాయాలను ప్రజలకు బోధించే వారు, వ్యాపింపజేసే వారు,” అని ప్రవచించారు. (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’/32)

మరో ‘హదీసు’లో ఇలా ఉంది: ”ప్రాచీన ప్రవక్తల మరియు నా యొక్క వారసులు ఖుర్‌ఆన్‌ మరియు నా ‘హదీసు’లను కేవలం అల్లాహ్‌ ప్రీతి కోసం వ్యాఖ్యానిస్తారు, బోధిస్తారు.” (షరఫ్‌ / 32)

ఇస్‌’హాఖ్‌ బిన్‌ మూసా ‘హాతిమ్‌ అభిప్రాయం: ‘ఈ అనుచర సమాజంలో అల్లాహ్‌ ‘హదీసు’ వారికి ఇచ్చిన గౌరవం మరెవరికీ ఇవ్వలేదు. అల్లాహ్‌ స్వయంగా తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు: ”మేము మాకు ప్రియమైన, ధర్మం యొక్క సేవా, గౌరవాలను ప్రసాదిస్తాము. అనంతరం ధార్మిక గౌరవం ఈ బృందానికే లభించింది. ఇతరులకు ఇటువంటి గౌరవం లభించలేదు. వీరు ‘హదీసు’లను బోధిస్తే, అందరూ వాటిని స్వీకరిస్తారు.” (షరఫు అస్‌హాబిల్‌ హదీస్‌ /32)

‘హదీసు’ను ఆచరించేవారు, దరూద్‌ షరీఫ్‌ను అధికంగా పఠించడం వల్ల అందరికంటే ప్రవక్త (స)కు దగ్గరగా ఉంటారు.

ఇబ్నెమస్‌’ఊద్‌(ర) కథనం: తీర్పు దినం నాడు అందరికంటే అధికంగా నాపై దరూద్‌ పంపేవారు అందరి కంటే నాకు చేరువగా ఉంటారు. (తారీఖు బగ్‌దాద్‌ / 36)

అబూ న’యీమ్‌ ఈ ‘హదీసు’ను గురించి వ్యాఖ్యానిస్తూ ‘హదీసు’ విద్యను బోధించేవారు, ‘హదీసు’లను వ్యాఖ్యానించేవారు చాలా గొప్ప విశిష్ఠతకు అర్హులు. ఎందుకంటే ఇతరులెవ్వరూ ‘హదీసు’ పండితుల కంటే దరూద్‌ పఠించడంలో ఎక్కువ కారు.

అబూ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా నా నుండి ఏదైనా విషయం రాసి, దానితో పాటు నాపై దరూద్‌ కూడా రాస్తే, ఆ పుస్తకం చదవ బడినంత వరకు అతనికి పుణ్యం లభిస్తూ ఉంటుంది.”

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఏదైనా పుస్తకంలో నాపై దరూద్‌ రాసి ఉంటే, నా పేరు ఆ పుస్తకంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని క్షమాపణ గురించి దు’ఆ చేస్తూ ఉంటారు” అని సెలవిచ్చారు.

అబుల్‌ ఖాసిమ్‌ అబ్దుల్లాహ్‌ మురూజీ కథనం: నేనూ మా తండ్రిగారూ ఇద్దరం కలసి రాత్రిపూట ఒక చోట కూర్చొని ‘హదీసు’ల్లో పోటీలు పడేవారం. ఒకసారి అక్కడ వెలుగుతో కూడిన స్తంభం కనబడింది. అది ఆకాశం అంత ఎత్తుగా ఉంది. ‘ఎందుకలా ఏర్పడింది?’ అని ప్రశ్నించడం జరిగింది. ఎదురెదురుగా కూర్చొని ‘హదీసు’లను ఉచ్చరించినపుడు వారి నోటినుండి వెలు వడే దరూద్‌ శబ్దం వల్ల ఏర్పడిందని సమాధానం ఇవ్వబడింది. (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’, తారీఖ్ బగ్‌దాద్‌)

హదీసును అనుసరించేవారు స్వర్గ వాసులు

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ‘హదీసు’ను అనుసరించేవారి వెంట వెలుగు ఉంటుంది. అల్లాహ్‌ వారితో, మీరు ఎల్లప్పుడూ ప్రవక్త (స) పై దరూద్‌ వ్రాసేవారు. అంటే ప్రతి ‘హదీస్‌’తో పాటు, ‘ ‘సల్లల్లాహు ‘అలైహి వ సల్లమ్‌,’ వ్రాసే వారు. కనుక దరూద్‌ షరీఫ్‌ శుభం మూలంగా మీరు స్వర్గంలో ప్రవేశించండి” అని ఆదేశిస్తాడు.

ఆ తర్వాత సఖావీ అనేక ‘హదీసు’వేత్తల స్వప్నాల గురించి ప్రస్తావిస్తూ, ”చాలామంది ‘హదీసు’వేత్తలకు, ప్రతి ‘హదీసు’తో పాటు, ”సల్లల్లాహు ‘అలైహి వ సల్లమ్’ వ్రాసి నందువల్ల విముక్తి లభించింది,” అని పేర్కొన్నారు.

హదీసుఅనుసరించేవారి కోసం భవిష్యవాణి

ప్రవక్త (స) ప్రవచనం: రాబోయే సంతతిలోని ఉత్తములు ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ విద్యను నేర్చుకొని, హద్దులను అతిక్రమించేవారి మార్పులు, చేర్పులను తొలగిస్తారు. దుర్మార్గుల కల్పితాలు, మార్పులు చేర్పులను దూరం చేస్తారు. ఈ భవిష్యవాణి ‘హదీసు’ వేత్తలపై నిజమయింది.

హదీసులను గురించి అడిగేవారిని గౌరవించమని ప్రవక్త () ఆదేశం

అబూ హారూన్‌ అల్‌ అజ్‌దీ కథనం: మేము అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) వద్దకు వచ్చినప్పుడు, అతడు సంతోషించి, స్వాగతం! ‘మీ కోసం ప్రవక్త (స) హితబోధ చేసి ఉన్నారు.’ దానికి మేము, ‘ప్రవక్త (స) ఏమి హితబోధ చేశారు,’ అని అడిగాము. దానికి అతను ప్రవక్త (స) మాతో ”నా తరువాత ప్రజలు ‘హదీసు’లు తెలుసుకోవటానికి మీ దగ్గరకు వస్తారు, వారిపట్ల సున్నితంగా, గౌరవంగా, సంతోషంగా వ్యవహరించాలి. ఇంకా వారికి ‘హదీసు’లు వినిపించాలి, ఇంకా మీ వద్దకు అన్ని వైపుల నుండి, సుదూర ప్రాంతాల నుండి ‘హదీసు’లు నేర్చుకోవడానికి వస్తారు. వారి పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరించాలి,’ అని ఉపదేశించారు” అని అన్నారు.

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) ‘హదీసు’ విద్యార్థులను చూసి అమాంతంగా ప్రవక్త (స) హితబోధ వల్ల మీకు స్వాగతం! మిమ్మల్ని మా సమావేశాల్లో చోటివ్వమని, మీకు ‘హదీసు’లు నేర్పమని ఆదేశించడం జరిగింది. మీరు మా వారసులు, అహ్లె ‘హదీసు’లు, మా తర్వాత పాలకులు.

ఉభయ లోకాల సాఫల్యం హదీసువినడం, వ్రాయడం వల్ల సిద్ధిస్తుంది

సహల్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ జాహిద్‌ అభిప్రాయం: ఉభయ లోకాల సాఫల్యాన్ని కోరుకునేవారు, ‘హదీసు’లు వ్రాస్తూ ఉండాలి. అందులో ఉభయ లోకాల సాఫల్యం ఉంది. ఇంకా అందులో తన జీవితాన్ని గడిపితే, దానివల్ల ఇహ లోకం కోరుకుంటే ఇహ లోకం లభిస్తుంది, పర లోకం కోరుకుంటే పర లోకం లభిస్తుంది. ‘హదీసు’లను వ్రాస్తే ఇహ లోకంలో గౌరవం లభిస్తుంది. అదేవిధంగా పర లోకం కోరుకునే వారికి పర లోకం లభిస్తుందని సుఫియాన్‌ సౌరీ అభిప్రాయపడ్డారు.

అ’హ్‌మద్‌ బిన్‌ మన్‌సూర్‌ షీరా’జీ పలికిన కవిత్వాల అనువాదం: ప్రజలారా! ‘హదీసు’ను దృఢంగా పట్టుకోండి. దాని వంటి వస్తువు మరొకటి లేదు. ఎందుకంటే ధర్మం అంటే అర్థం శ్రేయోభిలాష. అందువల్ల నేను మీ కోసం మంచిని బహిర్గతం చేశాను. సాధారణంగా మేము ఉల్లేఖనాల్లో ధర్మ జ్ఞానం, ఆదేశాలు, అర్థాలు గ్రహించాము. రాత్రివేళ ‘హదీసు’లను నేర్చుకోవడం చాలా మంచిది. విద్యను గుర్తుచేసుకోవడంలోనే అధిక లాభం ఉంది. ‘హదీసు’లను నేర్చుకున్నవాడు ఉభయ లోకాల సాఫల్యం పొందినట్టే. ప్రజలారా! ఉల్లేఖనాలను దృఢంగా పట్టుకోండి. (షర్‌ఫు అస్‌హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసువారు ఇన్షాఅల్లాహ్ప్రళయం వరకు వర్థిల్లుతారు

ప్రవక్త (స) ప్రవచనం: నా అనుచర సమాజంలో ఒక వర్గానికి ఎప్పుడూ సహాయం లభిస్తూ ఉంటుంది. వారికి కీడు తలపెట్ట గోరే వారు, వారికి ఏమాత్రం నష్టం చేకూర్చ లేరు, చివరికి ప్రళయం సంభవిస్తుంది. (తిర్మిజి’)

య’జీద్‌ బిన్‌ హారూన్‌ కథనం: ఒకవేళ దీని అర్థం అహ్లె ‘హదీసు’లు కాకుండా మరొకరయితే మాత్రం నాకు తెలియదు. ఇబ్నె ముబారక్‌ ఈ ‘హదీసు’ గురించి వివరిస్తూ అహ్లె’హదీసు’లే అని అన్నారు. అ’హ్‌మద్‌ బిన్‌ హంబల్‌ అయితే, ‘అహ్లె’హదీసు’లు తప్ప మరెవరూ ఎంతమాత్రం కారు,’ అని అన్నారు. అ’హ్మద్‌ బిన్‌ సినాన్‌ ఈ ‘హదీసు’ గురించి ప్రస్తావిస్తూ, ”వీరు అహ్లె ‘హదీసు’లే,” అని అన్నారు. అదేవిధంగా ‘అలీ బిన్‌ మదీనీ, ”ఈ ‘హదీసు’ అహ్లె ‘హదీసు’లకే వర్తిస్తుంది,” అని అన్నారు. బు’ఖారీ కూడా, ”ఇది ‘హదీసు’ వారి బృందమే,” అని అన్నారు.

హదీసుకోసం ప్రయాణం

అంటే ‘హదీసు’ విద్య నేర్చుకోవటానికి చేసే ప్రయాణం. ఇది చాలా శుభకరమైన ప్రయాణం. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు: ”ప్రతి తెగ నుండి ధార్మిక విద్య నేర్చుకోవడానికి ఒక బృందం ఎందుకు సిద్ధం కాలేదు. తిరిగి వచ్చి తమ తెగ వారికి నేర్పేవారు కదా!”

ప్రవక్త (స) ఈ శుభకరమైన ప్రయాణం గురించి ఇలా ప్రశంసించారు: ”ధార్మిక విద్య కోసం బయలుదేరే వ్యక్తికి అల్లాహ్‌ స్వర్గ మార్గం సుగమం చేస్తాడు.” (తిర్మిజి’)

ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్‌’హమ్‌ ఇలా అభిప్రాయపడ్డారు: ”అల్లాహ్‌ ఈ అనుచర సమాజం పైనుండి కష్టాలను అస్‌’హాబుల్‌ ‘హదీస్‌’ శుభం వల్ల తొలగిస్తాడు.”

హదీసువిద్య విశిష్ఠత

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల విద్య అభ్యసించటం చాలా అదృష్ట సూచకం. ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మిక విద్యను నేర్చుకోవటానికి బయలుదేరే వ్యక్తికి, మేము స్వర్గ మార్గాన్ని సుగమం చేసి వేస్తాము.” (బైహఖీ)

అదేవిధంగా ధార్మిక విద్య అభ్యసిస్తూ మరణిస్తే అతనికి ప్రవక్త స్థానానికి కేవలం ఒక్క మెట్టు మాత్రమే తేడా ఉంటుంది. ప్రవక్త (స) ప్రవచనం: ధార్మిక విద్య అభ్యసిస్తూ మరణిస్తే అతనికి, ప్రవక్త స్థానానికి కేవలం ఒక్క స్థానమే తేడా ఉంటుంది. (దార్మీ)

అంటే  దీనివల్ల ధార్మిక విద్య విశిష్ఠత తెలుస్తుంది. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ”రాత్రి కొంత సేపు ధార్మిక విద్య నేర్చుకోవటం రాత్రంతా ఆరాధన చేయటంకన్నా ఉత్తమమైనది.”

అల్‌ఖమహ్‌ అభిప్రాయం: ”ధార్మిక విద్య గురించి చర్చించుకుంటూ ఉండండి. ఎందుకంటే విద్య చర్చించడం వల్ల అభివృద్ధి చెందుతుంది.” (జామిఉల్‌ బయాన్‌, అల్‌ ‘ఇల్‌మ్‌ వ ఫ’ద్లుహు)

హదీసులను కంఠస్తం చేయడానికి గల ప్రాధాన్యత

‘హదీసు’లను కంఠస్తం చేసేవాడు తీర్పు దినం నాడు పండితుడు, కోవిదుడుగా లేపబడతాడు. ఇంకా ప్రవక్త (స) సిఫారసు అతనికి లభిస్తుంది.

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో 40 ‘హదీసు’లు కంఠస్తం చేసేవారిని నేను తీర్పు దినం నాడు సిఫారసు చేస్తాను.” (షర్‌ఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’ / 29)

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”నా అనుచర సమాజం లో 40 హదీసులను కంఠస్తం చేసుకున్నవారిని అల్లాహ్‌ తీర్పు దినం నాడు పండితునిగా, ధార్మిక వేత్తగా లేపుతాడు.”

ప్రవక్త (స) ప్రవచనం: ”నా ‘హదీసు’లను విని కంఠస్తం చేసుకొని ఇతరులకు తెలియపరిచే వ్యక్తిని అల్లాహ్‌ సుఖసంతోషాలు ప్రసాదించుగాక!”

అందువల్లే ప్రవక్త (స) అనుచరులు ‘హదీసు’లను చాలా అధికంగా కంఠస్తం చేసేవారు. అంతేకాదు కంఠస్తం చేసి ప్రవక్త (స) తప్పులను సరిదిద్దాలని ప్రవక్త (స)కు అప్పజెప్పేవారు. ఉదాహరణకు బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ సంఘటన ఉంది. బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”నీవు నిద్ర పోయినపుడు వు’దూ చేసుకో, కుడి ప్రక్క పండుకొని దు’ఆ చదివి పడుకో. ఒకవేళ నిద్రలో నీవు మరణిస్తే, ఇస్లామ్‌పైనే మరణం సంభవిస్తుంది. ఆ దు ఇది: ”అల్లాహుమ్మ అస్‌లమ్‌తు వజ్‌హియ ఇలైక వ ఫవ్వజ్‌తు అమ్‌రీ ఇలైక, వ అల్‌జాతు బిజహ్‌రీ ఇలైక ర’గబతహు వ రహీనహు, లా మల్‌జఅ వలా మన్‌జఅ మిన్‌క ఇల్లా ఇలైక, అల్లాహుమ్మ ఆమిన్‌తు బి కితాబిక అల్లజీ అన్‌’జల్‌త వ నబియ్యకల్లజీ అర్‌సల్‌త.” (బుఖారీ) – ‘ఓ అల్లాహ్‌! నేను నా ప్రాణాన్ని, నా శరీరాన్ని నీకు అప్పజెప్పాను. నా కార్యాలను కూడా నీకు అప్పజెప్పాను. నా వీపును నీ వైపు వంచాను. ఆశతోనైనా, భయంతోనైనా. నీ శిక్ష నుండి ఎవరూ శరణు ఇవ్వలేరు. ఓ అల్లాహ్‌! నీవు అవతరించిన గ్రంథాన్ని, నీవు పంపిన ప్రవక్తను విశ్వసించాను.’

బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: మళ్ళీ నేను ఈ దు’ఆను ప్రవక్త (స)కు వినిపించాను. అప్పుడు నేను ”ఆమన్‌తు నబియ్యకల్లజీ అర్‌సల్‌త”కు బదులు రసూలున్‌ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) అలా కాదు, ”వనబియ్యకల్లజీ అర్‌సల్‌త” అని అన్నారు.

ఈ ఉల్లేఖనం ద్వారా అనుచరులు ప్రవక్త (స) ముందు ‘హదీసు’లను ప్రవక్త (స)కు అప్పజెప్పేవారని, తమ తప్పులను సరిదిద్దుకునే వారని తెలుస్తుంది. అంతేకాదు, ప్రవక్త (స) ‘హదీసు’లను కంఠస్తం చేసుకో మని గుచ్చి చెప్పేవారు. ‘అబ్దుల్‌ ఖైస్‌ బృందంతో ఇలా అన్నారు, ”ఈ ‘హదీసు’లను కంఠస్తం చేసుకోండి. మీ జాతి వారిలోకి వెళ్ళి వాటిని గురించి ప్రచారం చేయండి.” (బు’ఖారీ)

‘అలీ (ర) కథనం: ‘హదీసు’లను వల్లిస్తూ ఉండండి, కంఠస్తం చేసి వాటిని గురించి చర్చిస్తూ ఉండండి. లేకుంటే ‘హదీసు’ విద్య నశిస్తుంది. (జామిఉల్‌ ‘ఇల్మ్‌)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ” ‘హదీసు’ లను పఠిస్తూ, చదువుతూ, కంఠస్తం చేస్తూ ఉండండి. వాటి వల్లే అవి గుర్తుంటాయి.” (మారిఫతు ‘ఉలూమిల్‌ ‘హదీస్‌’ – హాకిమ్‌)

అబూ హురైరహ్‌ (ర) ‘హదీసు’లను కంఠస్తం చేసే వారు. ఇతరులు కంఠస్తం చేయలేని విషయాలను అబూ హురైరహ్‌ (ర) కంఠస్తం చేసేవారు. (బు’ఖారీ)

హదీసులను వ్రాయటానికి ప్రాధాన్యత

అ’హ్‌మద్‌ బిన్‌ హంబల్‌ కథనం: ఒక వ్యక్తి అదనపు నమాజుల్లో, అదనపు ఉపవాసాల్లో నిమగ్నమయి ఉన్నాడు. మరో వ్యక్తి ‘హదీసు’లు వ్రాయడంలో నిమగ్నమయి ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తములు అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతడు, ” ‘హదీసు’లను వ్రాసేవాడు,” అని సమాధానం ఇచ్చాడు. (తారీ’ఖ్ బ’గ్‌దాద్‌)

అబూ బకర్‌ అ’హ్మద్‌ బిన్‌ ‘అలీ, ” ‘హదీసు’ విద్యను అభ్యసించటం అదనపు ఆరాధనలకంటే ఉత్తమ మైనది,” అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా య’హ్‌యా బిన్‌ యమాన్‌, ” ‘హదీసు’ విద్యనభ్యసించటం ఆరాధన మరియు శుభ సూచకం,” అని అభిప్రాయ పడ్డారు. (తారీఖ్ బ’గ్‌దాద్‌, షర్‌ఫుఅస్‌’హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసు ద్వారా ఆరోగ్య ప్రాప్తి

దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ ద్వారా స్వస్థత లభించినట్టే, ‘హదీసు’ల ద్వారా కూడా స్వస్థత లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లు రెంటివల్లనూ ప్రాపంచిక శుభాలు, పరలోక సాఫల్యాలు ప్రాప్తం అవుతాయి. ఎన్నిసార్లు ప్రయత్నించడం జరిగింది. రమాదీ అస్వస్థతకు గురైతే ‘హదీసు’ చదివేవాళ్ళను పిలిపించేవారు. వారు వస్తే ‘హదీసు’లు చదివి వినిపించమని చెప్పేవారు. (…/61)

హదీసు చర్చ

 ‘అలీ (ర) కథనం: ‘హదీసు’లను సంరక్షిస్తూ ఉండండి. ‘హదీసు’లను చర్చిస్తూ ఉండండి. ఒకవేళ ఇలా చేయకపోతే ‘హదీసు’ విద్య నశిస్తుంది. అదే విధంగా ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ‘హదీసు’లను చర్చించుకుంటూ ఉండండి. ‘హదీసు’లను నేర్పుతూ, నేర్చుకుంటూ ఉంటేనే అవి నిరంతరం వర్థిల్లుతూ ఉంటాయి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ కథనం: ‘హదీసు’ లను బోధిస్తూ, చర్చిస్తూ ఉండండి. అలా చేయకపోతే ‘హదీసు’ విద్య నశిస్తుంది. అదేవిధంగా ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) మీరు మా నుండి ‘హదీసు’లు వింటే పరస్పరం వాటిని వల్లించడం, చర్చించడం చేసుకుంటూ ఉండండి అని హితబోధ చేశారు. అదేవిధంగా అబూ స’యీద్‌ ‘ఖుద్రీ(ర), ” ‘హదీసు’లను వల్లిస్తూ, చర్చిస్తూ ఉండండి. ఎందుకంటే ఒక ‘హదీసు’ మరో ‘హదీసు’ను గుర్తు చేస్తుంది,” అని అన్నారు. అబూ ఉమామా బాహిలీ (ర) ”ప్రవక్త (స) ఈ జ్ఞాన సభల ద్వారా ప్రవక్త (స) అల్లాహ్‌ ఆదేశాలను అందజేశారు. మీరు కూడా వాటిని మా నుండి విని ఇతరులకు అందజేయండి. సలీమ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: మేము తరచూ అబూ ఉమామ బాహిలీ (ర) వద్ద కూర్చొనే వారం. ఆయన మాకు ప్రవక్త (స) ‘హదీసు’లను వినిపించేవారు. ఆ తరువాత, ‘బాగా అర్థం చేసుకోండి. ఇంకా ఏ విధంగా మీకు అందజేయ బడ్డాయో మీరు కూడా ఇతరులకు అందజేయండి.’

అల్‌ఖమహ్‌ (ర) కథనం: ‘హదీసు’లను గురించి చర్చించుకుంటూ ఉండండి. పరస్పరం నేర్పించడం, నేర్చుకోవటం వల్లే అవి గుర్తుంటాయి. అదేవిధంగా తల్ఖ్‌ బిన్‌ హబీబ్‌ కూడా ‘హదీసు’లను గురించి చర్చించుకుంటూ ఉండమని, ఒక ‘హదీసు’ మరో ‘హదీసు’ను గుర్తుచేస్తుందని అన్నారు. అదేవిధంగా అబుల్‌ ఆలియహ్‌ ”మీరెప్పుడైనా ప్రవక్త (స) ‘హదీసు’ బోధిస్తే దాన్ని బాగా గుర్తుంచుకోండి” అని పేర్కొన్నారు. అదేవిధంగా ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ హిమ్స్‌ గవర్నరుకు ఉత్తరం వ్రాస్తూ ” ‘హదీసు’ పండితులకు మంచి జీతాలు నిర్ణయించమని, వారు ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల విద్య నుండి మరో విషయం వైపు ఆలోచించకూడదని” పేర్కొన్నారు. (తారీఖు బ’గ్‌దాద్‌, ‘షరఫు అస్‌’హాబిల్‌ ‘హదీస్‌’)

హదీసువిద్యను అభ్యసించమని బలవంతంగా తమ పిల్లల్ని ప్రోత్సహించాలి

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ దావూద్‌ (ర) కథనం: ”మనిషి తన పిల్లల్ని ‘హదీసు’లు వినేటట్లు చేయాలి. ధార్మిక విద్య ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల్లో ఉంది. ‘హదీసు’ పర లోకం కోరుకునే వారికి సాఫల్య మార్గంగా పనికి వస్తుంది.”

ఇబ్రాహీమ్‌ బిన్‌ అద్‌హమ్‌ కథనం: మా నాన్నగారు నన్ను, ”కుమారా! ‘హదీసు’లను నేర్చుకో మరియు వాటిని కంఠస్తం చేయి, ఒక్కొక్క ‘హదీసు’కు ఒక దిర్‌హమ్‌ ఇస్తాను.” అని అన్నారు. అనంతరం నేను అనేక ‘హదీసు’లను కంఠస్తం చేశాను.

హదీసులను వినడం, వ్రాయడం, ఉభయ లోకాల సాఫల్యానికి సూచకం

సహల్‌ బిన్‌ స’అద్‌ ‘జాహిద్‌ కథనం: ఉభయ లోకాల సాఫల్యాన్ని కోరుకునే వారు ‘హదీసు’లను వ్రాస్తూ ఉండాలి. ఎందుకంటే, అందులో ఉభయ లోకాల సాఫల్యం ఉంది. అదేవిధంగా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ దావూద్‌ కథనం: ‘హదీసు’ ద్వారా ఇహ లోకం కోరుకునే వారికి ఇహ లోకం లభిస్తుంది, పర లోకం కోరుకునే వారికి పర లోకం లభిస్తుంది. అదేవిధంగా సుఫియాన్‌ సౌ’రీ కథనం:” ‘హదీసు’లను వినేవారికి ఇహ లోకంలో గౌరవం లభిస్తుంది. పర లోకంలో సాఫల్యం సిద్ధిస్తుంది.

హదీసును అనుసరించేవారికి శుభవార్తలు

 హు”జైఫా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ దౌత్యం నాతో అంతమయ్యింది. అయితే శుభవార్తలు ఇంకా సత్య స్వప్నాలు ఉన్నాయి. అదేవిధంగా ‘ఉబాదహ్‌ బిన్‌ సా’మిత్‌ (ర) ప్రవక్త(స)ను ”విశ్వసించి దైవ భీతి గల వారు, వారి కోసం ఉభయ లోకాల్లోనూ శుభ వార్తలు ఉన్నాయి,” అనే వాక్యం గురించి ప్రశ్నించారు. ప్రవక్త (స) ”ముస్లిములు చూచే సత్య స్వప్నాలు,” అని అన్నారు.

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా తన పుస్తకంలో ‘సల్లల్లాహు అలైహి సల్లమ్‌’ వ్రాస్తే, అది పుస్తకంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని క్షమాపణ కొరకు వేడుకుంటూ ఉంటారు.

*****

మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు] [టెక్స్ట్ రూపంలో]
https://teluguislam.net/mm/