ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]

లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర
https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.

ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

అల్లాహ్ ఇద్దరు దైవదూతలను అందమైన యువకుల రూపంలో అక్కడికి పంపాడు. వారు మొదట పలస్తీనాలోని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఇంటికి వచ్చారు. బాటసారులుగా వచ్చిన వారిద్దరిని ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) స్వాగతించి అతిథి మర్యాదలు చేశారు. తన వద్ద ఉన్న ఉత్తమమైన ఆహారపానీయాలు ఇచ్చి ఆదరించారు. వారు ఆహారాన్ని ముట్టకపోవడం చూసి ఆయన ఆందోళన చెందారు. వారి ప్రవర్తన చూసి ఆయన వారిని శత్రువులుగా భావించారు (ఆ కాలంలో శత్రువులు ఒకరి ఆహారాన్ని మరొకరు ముట్టుకునేవారు కాదు). కాని వారు ఆయన భయాలను దూరం చేస్తూ, భయపడవలసిన పనిలేదని, తాము దైవదూతలమని (అందుకే ఆహారాన్ని ముట్టుకోలేదనీ), లూత్ (అలైహిస్సలాం) జాతి ప్రజలను శిక్షించడానికి వచ్చామని, అల్లాహ్ మీకు ఒక శుభవార్త కూడా చెప్పమన్నాడని, ఈ ముసలి వయసులో మీకూ సారాకు సంతానాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడని చెప్పారు. (అప్పటికి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం), సారాలు ఇరువురూ వయోవృద్ధులు).

అల్లాహ్ అనుగ్రహాల పట్ల ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. కాని సదూమ్ పట్టణం పట్ల చాలా ఆవేదన చెందారు. ఈ విధ్వంసంలో తన సోదర కుమారుడు లూత్ (అలైహిస్సలాం)కు కూడా హాని కలగవచ్చని భయపడ్డారు. ఆ పట్టణ వాసులకు ఒక అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆయన దైవదూతలతో వాదించారు. ఆ పట్టణవాసులు సన్మార్గానికి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దైవ దూతలు ఆయనకు హామీ ఇస్తూ లూత్ (అలైహిస్సలాం)కు, ఆయన కుటుంబానికి, (భార్యకు తప్ప) ఎలాంటి హాని కలుగదని హామీ ఇచ్చారు. లూత్ (అలైహిస్సలాం) భార్య ఆ పట్టణ వాసుల మాదిరిగా చెడుల్లో కూరుకుపోయిన మహిళ.

ఆ పిదప దైవదూతలు సదూమ్ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ముఖ ద్వారం వద్ద ఒక బాలిక నీటిని తీసుకువెళ్ళడాన్ని వాళ్ళు చూశారు. తాము బాట సారులమని చెప్పి వారు ఆ బాలిక సహాయం కోరారు. పట్టణవాసుల వ్యవహారం, వారి అలవాట్లు తెలిసిన ఆ బాలిక ఈ బాటసారులకు ఎలాంటి ప్రమాదం కలుగ రాదన్న ఉద్దేశ్యంతో వారిని అక్కడే ఉండవలసిందిగా కోరింది. ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించడానికి వెళ్ళింది. ఆమె నిజానికి లూత్ (అలైహిస్సలాం) కుమార్తె. తన తండ్రితో ఆమె, “శివార్లలో ఇద్దరు బాటసారులు ఉన్నారు. వారికి మీ సహాయం కావాలి. వారు ఇద్దరు అందమైన యువకులు. వారి గురించి పట్టణంలో తెలిస్తే వారి పట్ల పట్టణవాసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు” అని చెప్పింది.

మొదట లూత్ (అలైహిస్సలాం) ఈ కొత్తవారిని ఆహ్వానించడానికి సిద్ధపడలేదు. గుంపు నుంచి వారిని కాపాడ్డం తన వల్ల కాదని ఆయన భయపడ్డారు. కాని ఆయన చాలా మంచి వ్యక్తి. కాబట్టి చివరకు ఆ బాటసారులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారిని రహస్యంగా తీసుకురావాలని ఆయన భావించారు. అయితే ఆయన భార్య కూడా మిగిలిన పట్టణవాసుల మాదిరిగా చెడుల్లో కూరుకు పోయిన మహిళ. తన భర్త తీసుకువచ్చిన అతిథుల గురించి ఆమె అందరికీ చెప్పివేసింది. ఒక పెద్ద గుంపు తన ఇంటి వైపు రావడాన్ని చూసిన లూత్ (అలైహిస్సలాం) తలుపులు మూసివేశారు. ఆ గుంపు తలుపులు బాదడం ప్రారంభించింది. లూత్ (అలైహిస్సలాం) ఆ గుంపును బ్రతిమాలుతూ తన అతిథులను వదలివేయమని, అల్లాహ్ శిక్షకు భయపడమని చెప్పారు. కామవాంఛలు భార్యల వద్ద తీర్చుకోవడమే మేలయిన పద్ధతి అనీ, అల్లాహ్ అనుమతించిన పద్ధతి అదేనని వారికి బోధించారు. చివరకు తన కుమార్తెలను వారికిచ్చి పెళ్ళి చేయడానికి కూడా సిద్ధపడ్డారు.

లూత్ (అలైహిస్సలాం) వారించినప్పటికీ ఆ గుంపు ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. ఆయనకు బదులిస్తూ, “లూత్! నీ కుమార్తెల పట్ల మాకు ఆసక్తి లేదు. మేము కోరేదేమిటో నీకు బాగా తెలుసు” అన్నారు. కామంతో కళ్ళు మూసుకు పోయిన వారు ఆవేశంతో తలుపులు విరగ్గొట్టారు. లూత్ (అలైహిస్సలాం) విపరీతమైన ఆగ్రహంతో వారిని ఆపాలనుకున్నారు. కాని ఆ గుంపును నిరోధించే శక్తి ఆయనలో లేదు. తన అతిథులను దౌర్జన్యం నుంచి రక్షించే స్థితిలో ఆయన లేరు. అయినప్పటికీ ఆయన నిర్భయంగా గుంపును నిరోధిస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన నిస్సహాయంగా, దుఃఖంతో నిలబడి ఉండడాన్ని చూసిన దైవదూత, “లూత్! మేము సాధారణ మానవులం కాదు. మేము దేవుని దూతలం. ఈ ప్రజల దౌర్జన్యాల నుంచి నిన్ను కాపాడ్డానికే వచ్చాము. వారిలో ఎవ్వరూ నీకు ఎలాంటి హాని కలిగించలేరు. వారంతా నేడు ఓటమి పాలవుతారు” అన్నారు. ఈ మాటలు విన్న గుంపు భయంతో లూత్ (అలైహిస్సలాం) ఇంటిని వదలి పారిపోయింది. వెళుతూ వెళుతూ లూత్ (అలైహిస్సలాం)ను బెదిరిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాతి రోజు దైవదూతలు లూత్( అలైహిస్సలాం)కు సలహా ఇస్తూ, సూర్యోదయానికి ముందే పట్టణం వదలి వెళ్ళి పొమ్మన్నారు. తనతోపాటు కుటుంబ సభ్యులను (ఒక్క భార్యను తప్ప మిగిలిన వారిని) తీసుకు వెళ్ళిపొమ్మని చెప్పారు.

సదూమ్ పట్టణాన్ని నాశనం చేయాలని అల్లాహ్ ఆదేశించాడు. లూత్ (అలైహిస్సలాం) ఆయన కుటుంబం ఆ పట్టణాన్ని వదిలిన మరుక్షణం ఆ పట్టణాన్ని ఒక భయానకమైన భూకంపం కుదిపేసింది. ఒక మహాశక్తి ఆ పట్టణాన్ని ఎత్తికుదేసి నట్టయ్యింది. పట్టణంపై రాళ్ళవాన కురిసింది. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క వస్తువు నాశనమయ్యింది లూత్ (అలైహిస్సలాం) భార్యతో సహా.

(చదవండి దివ్యఖుర్ఆన్: 7:80-84, 27:54-58, 11:67-83, 29:27-35, 26:160-175, 15:56-77, 37:133-138, 6:86, 21:74-75, 22:43-44, 18:13-14, 54:33-39, 14:37)

లూత్ (అలైహిస్సలాం) కథ, అతిచెడ్డ చేష్ట అయిన స్వలింగ సంపర్కం నుంచి ముఖ్యంగా వారిస్తుంది. ఇది అత్యంత అశ్లీలమైన చేష్ట. ఇది ప్రకృతి నియమాలను ఉల్లంఘించే, వాటిని కలుషితం చేసే రోగగ్రస్తమైన మనస్తత్వానికి సంబంధించిన చేష్ట. ఈ చేష్ట మనిషిని జంతువుకన్నా హీనమైన స్థాయికి దిగజార్చుతుంది. ఎందుకంటే జంతువులు కూడా ఇలాంటి హీనమైన చేష్టకు పాల్పడవు. స్వలింగ సంపర్కులు ఈ నికృష్టమైన చేష్టకు పాల్పడుతుంటారు. వీరిని “గే“లని, ‘ఫెయిలీ’లని పిలువడం కూడా జరుగుతోంది. పురుషులే కాక స్త్రీలు కూడా స్వలింగ సంపర్కానికి పాల్పడడం జరుగుతోంది. వీరిని ‘లెస్బియన్ల’ని అంటు న్నారు.

దివ్యఖుర్ఆన్ స్వలింగ సంపర్కాన్ని ఒక అత్యాచారంగా, తీవ్రమైన అజ్ఞానంగా, శక్తిని వ్యర్ధం చేయడంగా, అల్లాహ్ మానవాళికి నిర్దేశించిన హద్దులను అతిక్రమించడంగా పేర్కొన్నది. కాని ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల ఈ నికృష్టమైన చేష్ట “వ్యక్తిగత స్వేచ్ఛ” పేరిట సర్వ సాధారణమైపోయింది.

స్వలింగ సంపర్కం వల్ల లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ వ్యాప్తి చెందు తాయి. ప్రస్తుతం మానవ సమాజాలను ఎయిడ్స్ ఒక శాపంగా కబళిస్తోంది. చివరకు అమాయక శిశువులు కూడా తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధికి గురవుతున్నారు.

స్వలింగ సంపర్కం వంటి అనైతిక చేష్టకు ఇస్లామ్ తీవ్రమైన శిక్షలను నిర్దేశించింది. ఇమామ్ అహ్మద్ ఈ విషయమై ఉటంకించిన హదీసు దీన్ని స్పష్టంగా తెలుపుతోంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పిన ప్రవచనాన్ని ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: “స్వలింగ సంపర్కానికి పాల్పడిన వారిద్దరినీ హతమార్చండి.” ఇమామ్ షాఫయీ, ఇమామ్ హంబలీ ఇంకా వారితో పాటు చాలా మంది ధర్మవేత్తలు ఈ శిక్షను ఆమోదించారు. ఇమామ్ అబూహనీఫా ఈ చేష్టకు శిక్షగా నేరస్తులను ఒక కొండ మీది నుంచి క్రిందికి గెంటేయాలని, వారిపై రాళ్లను దొర్లించాలని పేర్కొన్నారు. అంటే అల్లాహ్ లూత్ (అలైహిస్సలాం) పట్టణ ప్రజలను శిక్షించిన విధంగా అన్నమాట.

అతిథుల ప్రాణాలను, వారి గౌరవమర్యాదలను కాపాడవలసిన బాధ్యత ముస్లింపై ఉంటుంది. లూత్ (అలైహిస్సలాం) అందుగ్గాను పూర్తి ప్రయత్నాలు చేశారు. నేరస్తులను నిరోధించడానికి గాను చివరకు తన కుమార్తెలను వారికి ఇచ్చి పెళ్ళి చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తన అతిథులను దౌర్జన్యం నుంచి కాపాడడానికి తనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేశారు.

బైబిలులో లూత్ (అలైహిస్సలాం) గురించిన ప్రస్తావన చాలా అనుచితమైన రీతిలో ఉంది. లూత్ (అలైహిస్సలాం) కుమార్తెలు ఆయనకు మద్యం తాగించి ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆయనతో లైంగిక క్రియలో పాల్గొన్నారని, ఫలితంగా గర్భం దాల్చారని (జెనిసిస్ 19:30-38) ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావన దిగ్భ్రాంతికరమైనది. తన ప్రవక్త ద్వారా ఇలాంటి పనులు జరిగేలా అల్లాహ్ అనుమతిస్తాడన్నది ఆలోచనకు కూడా అందని విషయం. దీనికి భిన్నంగా దివ్య ఖుర్ఆన్ అల్లాహ్ ప్రవక్తలు అందరిని ఉత్తమమైన వారిగా, ధర్మ పరాయణులుగా, సన్మార్గులుగా పేర్కొన్నది. ప్రవక్తల వల్ల అనైతికమైన చేష్టలు జరిగిన ఒక్క సంఘటన కూడా దివ్యఖుర్ఆన్లో లేదు.

స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం. దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَتَأْتُونَ ٱلْفَٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍۢ مِّنَ ٱلْعَٰلَمِينَ إِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ شَهْوَةً مِّن دُونِ النِّسَاءِ ۚ بَلْ أَنتُمْ قَوْمٌ مُّسْرِفُونَ وَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا أَخْرِجُوهُم مِّن قَرْيَتِكُمْ ۖ إِنَّهُمْ أُنَاسٌ يَتَطَهَّرُونَ

మేము లూతు (అలైహిస్సలామ్‌)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99]” (Quran – 7 : 80-82)

[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?

[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.

[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.

[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّا جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَٰذَا يَوْمٌ عَصِيبٌ وَجَاءَهُ قَوْمُهُ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا يَعْمَلُونَ السَّيِّئَاتِ ۚ قَالَ يَا قَوْمِ هَٰؤُلَاءِ بَنَاتِي هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ فِي ضَيْفِي ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ قَالُوا لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ قَالَ لَوْ أَنَّ لِي بِكُمْ قُوَّةً أَوْ آوِي إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్‌ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్‌! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. [132](సూరా హూద్  11 :77 – 83)

[125] హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి  పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.

[126] లూత్‌ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.

[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్‌ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్‌).

[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్‌ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.

[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్‌ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.

[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్‌ లూత్‌ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్‌ లూత్‌ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్‌ లూత్‌ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.

[131] ఒకవైపు లూత్‌ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్‌! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.

[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.

ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై అల్లాహ్ శిక్షలు దాపురించాయి!.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

وَلَمَّآ أَن جَآءَتْ رُسُلُنَا لُوطًۭا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًۭا وَقَالُوا۟ لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا ٱمْرَأَتَكَ كَانَتْ مِنَ ٱلْغَٰبِرِينَ

మరి మా దూతలు లూత్‌ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము” (సూరా అంకబూత్ 29 : 33 – 35)

[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.

[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)

[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ

సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది  [50] (సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)

[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.

[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.

[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.

[49] ఆయతులో ‘ముతవస్సిమీన్‌” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్‌’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.

[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్‌ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్‌ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్‌ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్‌ జిబ్రీల్‌ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్‌). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.