అల్లాహ్ కు భయపడే హృదయాలు, భయపడని హృదయాలు
(హృదయ ఆచరణలు – 2వ భాగం)
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్
https://youtu.be/hHPKoRppvPs [16 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]
హృదయ ఆచరణలు – రెండవ భాగం
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.
నా ప్రియమైన ధార్మిక సోదరులారా! అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవలన మనం హృదయాల ఆచరణ అనే అంశానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అల్హందులిల్లాహ్ అదే క్రమములో భాగంగా నిన్న మనం మనిషి యొక్క హృదయాల సంస్కరణ, అదే విధంగా నియ్యత్ యొక్క వాస్తవికతకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సోదరులారా! అదే పరంపరలో భాగంగా ఈరోజు మనము తెలుసుకోబోయే అంశము మూడవ అంశము అల్లాహ్కు భయపడే హృదయాలు, అల్లాహ్కు భయపడని హృదయాలు.
3. అల్లాహ్కు భయపడే హృదయాలు, భయపడని హృదయాలు
సోదరులారా! అల్లాహ్కు భయపడే హృదయాలు ఏమిటి? అల్లాహ్కు భయపడే హృదయాలు అవే ప్రియులారా, ఎవరైతే సత్కార్యాలు చేసి కూడా అల్లాహ్కు భయపడుతూ ఉంటారో. ఏ విధంగానైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పవిత్ర ఖురాన్ గ్రంథములో తెలియజేశారో 23వ సూరా, సూరె అల్ ముమినూన్, వాక్యము సంఖ్య 60. అల్లాహ్ అంటూ ఉన్నారు,
وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
వల్లజీన యుతూన మా ఆతవ్ వ ఖులూబుహుమ్ వజిలతున్ అన్నహుమ్ ఇలా రబ్బిహిమ్ రాజిఊన్
ఇంకా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇవ్వవలసిన దానిని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందన్న భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వివరణలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది వారే ఎవరైతే ఉపవాసం ఉంటూ, నమాజులు ఆచరిస్తూ, దానధర్మాలు చెల్లిస్తూ ఆ పిదప కూడా వారి హృదయాలు భయపడుతూ ఉంటాయి, వారి సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అనే విషయమును గురించి ఆలోచిస్తూ.
అదే క్రమములో సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 25వ సూరా సూరె ఫుర్ఖాన్ వాక్యము సంఖ్య 65 లో ఇలా పలికాడు.
وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا
వల్లజీన యఖూలూన రబ్బనస్ రిఫ్ అన్నా అజాబ జహన్నమ ఇన్న అజాబహా కాన ఘరామా
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, “మా ప్రభు, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనది”.
సోదరులారా! ఇక్కడ నరకపు శిక్షను మాపై నుండి తొలగించు అని ప్రార్థిస్తున్న వారు ఎవరు ప్రియులారా? ఎవరు నరకపు శిక్ష మా నుండి తొలగించు అని ప్రార్థిస్తున్నారు? దానికి ముందు వాక్యములో అల్లాహ్ తెలుపుతున్నారు, ఎవరు అడుగుతున్నారు అల్లాహ్తో ఈ దుఆ? వారే,
وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا
వల్లజీన యబీతూన లి రబ్బిహిమ్ సుజ్జదన్ వ ఖియామా
వారే ఎవరైతే తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారో.
అల్లాహ్ ముందు సజ్దా చేసేవారు, అల్లాహ్ ముందు సాష్టాంగపడేవారు, అల్లాహ్ ముందు తహజ్జుద్ నమాజ్ చేసేవారు అయినప్పటికీ వారు అల్లాహ్తో ప్రార్థిస్తున్నారు “అల్లాహ్, మాపై నుంచి నరకపు శిక్షను తొలగించు” సుబ్ హా నల్లాహ్! ఎందుకంటే ప్రియులారా ఇవి ఆ హృదయాలు, అల్లాహ్కు భయపడే హృదయాలు ప్రియులారా.
ఈ వాక్యానికి సంబంధించి అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో ఇలా అంటూ ఉన్నారు. తిర్మిజీ గ్రంథములో, కితాబుత్ తఫ్సీర్లో ఈ విషయం తెలియజేయబడుతుంది ప్రియులారా. హజరతే ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా ప్రవక్తతో అడుగుతున్నారు, “ఓ ప్రవక్త, ఇంతకీ ఈ విధంగా భయపడే ఈ భక్తులు ఎవరు? వారు సారాయి తాగేవారా లేక దొంగతనము చేసేవారా?“. దానికి ప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, “ఓ అబూబకర్ పుత్రిక, వారు అటువంటి జనము కారు, వారు నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దానధర్మాలు చేసేవారై ఉంటారు. అయినప్పటికీ తమ ఆచరణలు స్వీకారయోగ్యం అవుతాయో లేవో అని భయపడుతూ ఉంటారు.”
సుబ్ హా నల్లాహ్! ప్రియులారా, ఇవి అల్లాహ్కు భయపడే హృదయాలు సోదరులారా. వారు సత్కార్యాలు చేసినప్పటికీ ఆ హృదయాలు వణుకుతూ ఉంటాయి, అల్లాహ్తో ప్రార్థిస్తూ ఉంటాయి ప్రియులారా.
అలా కాక రెండవ వైపున ప్రియులారా వారు ఎవరైతే కపటులు, మునాఫికులు, వారికి మరియు విశ్వాసుల మధ్య తేడా ఏమిటి ప్రియులారా? విశ్వాసి సుబ్ హా నల్లాహ్ సత్కార్యము చేస్తాడు, ఆ తర్వాత కూడా అల్లాహ్తో భయపడుతూ ఉంటాడు, తన సత్కార్యాలు స్వీకరింపబడ్డాయా లేవా అని. కానీ మునాఫిక్, కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ ఉంటాడు, అల్లాహ్తో భయపడడు. విశ్వాసి పుణ్య కార్యాలు చేస్తూ అల్లాహ్తో భయపడుతూ ఉంటాడు అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా అని, కానీ కపట విశ్వాసి పాప కార్యాలు చేస్తూ అల్లాహ్తో భయపడడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయం వారికి ఉండదు.
కాబట్టి సోదరులారా, ప్రస్తుత పరిస్థితులలో అన్నింటికంటే ముందు నేను నాకు నేను ఆ తర్వాత మీ అందరికీ విన్నవిస్తున్న విషయం ప్రియులారా మనం ఏ విధంగా మన హృదయాలను సంస్కరించుకోవాలో తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు మన హృదయాల సంస్కరణ మనకి అవసరం ప్రియులారా. మనం సత్కార్యాలు చేస్తూ అల్లాహ్తో భయపడే వారిగా ఉన్నామా లేక పాప కార్యాలు చేస్తూ అల్లాహ్కు భయపడని వారిగా ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా.
సోదరులారా, ఈరోజు మన హృదయాలపై నిర్లక్ష్యపు తెరలు పడి ఉన్నాయి సోదరులారా. దాని వలన మన హృదయాల జీవితం మారిపోయింది. ఆరాధనలలో ప్రశాంతత, మాధుర్యము మన నుండి లాక్కోబడ్డాయి సోదరులారా. ఖురాన్ చదివే వారికి దాని పారాయణములో మాధుర్యం అనిపించటం లేదు. అల్లాహ్ ఆరాధనలో, నమాజులో నిలబడుతున్నాం కానీ మన నమాజులు మాధుర్యం నుండి ఖాళీగా ఉన్నాయి ప్రియులారా. ఎందుకు ఖాళీగా ఉన్నాయి అంటే ఆ నమాజులు మనల్ని చెడు కార్యాలు, అశ్లీలము, చెడు పనుల నుండి దూరము చేసినప్పుడు మాత్రమే మన నమాజులలో మాధుర్యం వస్తుంది ప్రియులారా. మనం చెడు కార్యాలకు, పాప కార్యాలకు దూరమైనప్పుడు మాత్రమే మనం అల్లాహ్తో సామీప్యాన్ని పొందగలము సోదరులారా. కాబట్టి సోదరులారా మనం మన హృదయాల సంస్కరణ చేసుకోవాలి, అల్లాహ్కు భయపడే హృదయాలుగా మన హృదయాలను మార్చుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ మన హృదయాలను సంస్కరించుకొని సౌభాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.
4. అసలు హృదయం అంటే ఏమిటి? దాని వాస్తవికత ఏమిటి?
ఆ తర్వాత సోదరులారా ఇదే హృదయ ఆచరణ అనే విషయానికి సంబంధించి నాలుగవ అంశం ప్రియులారా. అసలు హృదయం అంటే ఏమిటి? సోదరులారా, హృదయ ఆచరణలు అంటున్నారు కదా మరి వాస్తవానికి హృదయం అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. పదండి సోదరులారా హృదయం అంటే ఏమిటి దాని వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం.
హృదయాన్ని అరబీ భాషలో అల్ ఖల్బ్ అని అంటారు ప్రియులారా. అల్ ఖల్బ్. అల్ ఖల్బ్ అంటే అరబీలో రెండు అర్థాలు ఉన్నాయి ప్రియులారా, మొదటిది ఖాలిసు షై అంటే ఏదైనా వస్తువు యొక్క అసలు విషయాన్ని హృదయము అంటారు. ఖల్బున్ అంటారు ప్రియులారా మరియు రెండవ అర్థం ఒక వస్తువును మరొక వస్తువు పై మరలించటాన్ని కూడా హృదయము అని అంటారు ప్రియులారా.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా ఈ దుఆ చేసేవారు ప్రియులారా తిర్మిజీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేసేవారు:
يَا مُقَلِّبَ الْقُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ
యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్
ఓ హృదయాలను తిప్పేవాడా నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరముగా ఉంచు.
అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, హృదయం, రహ్మాన్ అంటే అల్లాహ్ యొక్క రెండు వేళ్ళ మధ్య ఉంది. అల్లాహ్ కోరిన విధంగా దానిని తిప్పుతారు ప్రియులారా.
హజరతే అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు, “విశ్వాసి యొక్క హృదయం ఒక పక్షి వంటిది అది ఎటు కావాలంటే అటు ఎగురుతుంది“.
అబూ మూసా అష్’అరీ రదియల్లాహు త’ఆలా అన్హు తెలియజేస్తున్నారు ప్రియులారా హృదయాన్ని హృదయం అని ఎందుకు అన్నారు అంటే అది ఎడారిలో ఉన్న ఒక పక్షి రెక్క వంటిది కాబట్టి హృదయం ఎటు కావాలంటే అటు ఎగురుతుంది. కాబట్టి మనం అల్లాహ్తో ఏమి దుఆ చేయాలి? అల్లాహ్ ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మనం దుఆ చేస్తూ ఉండాలి ప్రియులారా.
ఆ తర్వాత హజరతే నోమాన్ బిన్ బషీర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి ప్రసిద్ధమైన హదీసులో ఇలా తెలుపబడింది ప్రియులారా,
أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ أَلَا وَهِيَ الْقَلْبُ
అలా వ ఇన్న ఫిల్ జసది ముద్గతన్ ఇదా సలహత్ సలహల్ జసదు కుల్లుహు వ ఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లుహు అలా వ హియ అల్ ఖల్బ్
బాగా వినండి, శరీరములో ఒక మాంసపు ముద్ద ఉంది. ఒకవేళ అది బాగుంటే పూర్తి శరీరము బాగుంటుంది. ఒకవేళ అది పాడైపోతే, అది చెడిపోతే పూర్తి శరీరము పాడైపోతుంది. అదే హృదయము.
(ముత్తఫఖున్ అలైహ్ , బుఖారి , ముస్లిం గ్రంధాలలో నకలు చేయబడింది)
కాబట్టి ఆ మాంసపు ముద్దను మనం జాగ్రత్తగా ఉంచాలి ప్రియులారా దానిని సంస్కరణ చేసుకుంటూ దానిని ఉంచాలి ప్రియులారా.
హజరతే అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు ప్రియులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యంలో ఉన్నప్పుడు హజరతే జిబ్రయీల్ ప్రవక్త వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరతే జిబ్రయీల్ ప్రవక్తను పట్టుకున్నారు, ప్రవక్త వారిని కిందన పరుండబెట్టారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఛాతిని చీల్చి హృదయాన్ని బయటకు తీశారు ప్రియులారా. అందులో నుండి ఒక మాంసపు ముద్దను బయటకు తీశారు మరియు చెప్పడం జరిగింది, ఇది షైతాన్ యొక్క భాగం మీ నుండి తీసివేయటం జరుగుతుంది. దానిని ఒక బంగారు పళ్ళెములో పెట్టడం జరిగింది, దానిని జమ్ జమ్ నీటితో కడగటము జరిగింది, తిరిగి దానిని దాని స్థానములో ఎలా ఉండేదో అలా పెట్టటం జరిగింది ప్రియులారా.
దీని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏదైతే ఛాతి లోపల హృదయం ఉంటుందో దానిలోనే సన్మార్గము మరియు మార్గభ్రష్టత్వం రెండింటి సంబంధం దానితోనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనిషి తన హృదయాన్ని పరిశీలించుకోవాలి. అది సన్మార్గం పై ఉందా లేదా మార్గభ్రష్టత్వం పైకి వెళుతుందా ఇది చాలా అవసరమైన విషయం ప్రియులారా. మనిషి తన హృదయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, అది ఎటువైపు పయనిస్తుంది అని తెలుసుకోవాలి ప్రియులారా. అల్లాహ్ త’ఆలా మనందరికీ హృదయ సంస్కరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు గాక.
5. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి
ఇక తర్వాత మాట ప్రియులారా ఐదవ అంశం ఈ విషయానికి సంబంధించి హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి. వాస్తవానికి హృదయం యొక్క స్థానం ఏమిటి ప్రియులారా? హృదయం యొక్క స్థానం గురించి చెప్పడం జరుగుతుంది:
أَشْرَفُ مَا فِي الْإِنْسَانِ قَلْبُهُ
అష్రఫు మా ఫిల్ ఇన్సాని ఖల్బుహు
మనిషి శరీరములో ఏదైనా శ్రేష్ఠమైన ఉన్నతమైన వస్తువు ఉంది అంటే అది అతని హృదయము.
ఎందుకంటే హృదయానికి అల్లాహ్ ఎవరో తెలుసు. అది మనిషిని అల్లాహ్ వైపునకు తీసుకువెళుతుంది. అందుకే చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే హృదయం బాగైపోతుందో దానిలో మంచి పనులు అవుతాయి. అల్లాహ్ యొక్క దాస్యం, అల్లాహ్ యొక్క విధేయత వైపునకు మనిషి వెళతాడు ప్రియులారా.
అందుకే హసన్ బస్రీ రహమహుల్లాహ్ తెలుపుతున్నారు, దావీ ఖల్బక్ – మీ హృదయాలకు చికిత్స చేయండి. అల్లాహ్కు దాసుల నుండి ఏ విషయం యొక్క అవసరం ఉంది అంటే అదే మంచి హృదయం యొక్క అవసరం. ఎప్పుడైతే హృదయం సంస్కరింపబడుతుందో మంచి ఆచరణలు జరుగుతాయి. హృదయము చెడిపోతే ఆచరణలు చెడిపోతాయి ప్రియులారా.
ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా మాటను ముగిస్తాను ప్రియులారా. పవిత్ర ఖురాన్ గ్రంథములో 31వ సూరా, సూరె లుక్మాన్. హజరతే లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలామ్కు సంబంధించి చిన్న ఉపమానం బోధిస్తాను. హజరతే లుక్మాన్ చాలా సజ్జనులైన దైవదాసులు ప్రియులారా. ఆయన ఒకరి వద్ద బానిసగా ఉండేవారు ప్రియులారా. ఆయన ఒకని వద్ద బానిసగా ఉండేవారు. ఒకసారి అతని యొక్క యజమాని హజరతే లుక్మాన్ వారికి ఏమి చెప్పాడంటే, ఒక మేకను కోసి ఆ మేకలో అత్యుత్తమ రెండు భాగాలు తెమ్మని ఒకసారి యజమాని చెప్పాడు. హజరతే లుక్మాన్ మేకను కోసి మేక యొక్క హృదయాన్ని నాలికను తీసుకువచ్చారు. మరో సమయములో యజమాని మేకను కోసి అత్యంత హీనమైన రెండు భాగాలను తెమ్మని ఆదేశించగా హజరతే లుక్మాన్ హృదయము నాలికనే తీసుకువచ్చారు. అది ఏమని అడిగితే ఆయన ఇలా అన్నారు, “నోరు హృదయము సజావుగా ఉన్నంత కాలం వాటికంటే వేరే ఉత్తమ వస్తువు లేదు. నోరు హృదయం పాడైపోతే ఆ రెండింటి కన్నా హీనమైన వస్తువు మరొకటి లేదు” [ఇబ్నె కసీర్]. సోదరులారా మాటను అర్థము చేసుకొనే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తదుపరి భాగంలో వస్తాయి ప్రియులారా.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5Ii