మహానుభావుడైన అల్లాహ్ దే గొప్పతనం. విస్తృతమైన రాజ్యం అతనిదే

అల్లాహ్ ఈ విధంగా బోధించినట్లు ప్రవక్త మహానీయులు ﷺ తెలిపారని అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

“ఓ నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరిపై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి.

నా దాసులారా! మీరందరు మార్గం తప్పినవారు, నేను సన్మార్గం ఎవరికి ప్రసాదించానో వారుతప్ప. కనుక నాతోనే సన్మార్గం కొరకై అర్థించండి. నేను సన్మార్గం చూపుతాను.

నా దాసులారా! మీరందరు నగ్నంగా ఉండేవారు నేను దుస్తులు ప్రసాదించినవారు తప్ప, కనుక దుస్తులకై నాతో అర్థించండి నేను మీకు దుస్తులు ప్రసాదిస్తాను.

నా దాసులారా! మీరు రాత్రింభవళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు నేను సర్వ పాపాల్ని క్షమిస్తూ ఉంటాను. కనుక నాతో క్షమాపణ కోరండి నేను మిమ్మల్ని మన్నిస్తాను.

నా దాసులారా! మీరు నాకు నష్టం చేకూర్చడానికి ఎంత ప్రయత్నం చేసినా, నష్టం చేకూర్చలేరు. లాభం చేయాలనుకున్నా లాభం చేయలేరు.

నా దాసులారా! మీలోని మొదటివారు, చివరివారు, మానవులు, జిన్నాతులు సయితం అందురూ మీలోని ఎక్కువ దైవభీతి కలిగిన వ్యక్తిలా అయిపోయినా దాని వల్ల నా రాజ్యంలో ఏ కొంచమూ ఎక్కువ కాదు. నా దాసులారా! మీలోని మొదటివారు, వెనకటివారు మానవులూ, జిన్నాతులు అందరూ మీలోని ఒక దుర్మార్గునిలా అయిపోయినా నా రాజ్యంలో ఏ మాత్రం లోటు కలుగదు.

నా దాసులారా! మీలోని మొదటివారు, వెనకటివారు మానవులూ, జిన్నాతులూ కలిసి ఒక మైదానంలో గుమికూడి నేను మీలో ప్రతి ఒక్కడు అడిగినంత ఇచ్చినప్పటికినీ సముద్రంలో సూదిని ముంచి తీస్తే (ఎంత నీరు తరుగుతుందో) అంత కూడా నా వద్ద ఉన్న దానిలో తరుగదు.

నా దాసులారా! మీరు చేసే కార్యాల్ని నేను లెక్కిస్తాను. దాని ప్రతిఫలం సంపూర్ణంగా మీకు నొసంగుతాను. ఎవరైతే సత్ఫలితం పొందుతాడో అతడు అల్లాహ్ స్తోత్రము పఠించాలి. అలాగాక దుష్ఫలితం పొందినవాడు తన ఆత్మనే నిందించుకోవాలి.”

(ముస్లిం).

విశేషాలు:

1- పవిత్రుడైన అల్లాహ్ దే గొప్పతనం. మరియు విస్తృతమైన రాజ్యం అతనిదే.

2- అల్లాహ్ శక్తి, బలము, చాలా గొప్పది. ఆయన ఏ మాత్రం అక్కరలేనివాడు. తన సృష్టి నుండి అతీతుడు.

3- మానవులు అల్లాహ్ తరఫున సన్మార్గం, ఆహారం, మన్నింపు పొందుటకు చాలా అవసరం కలిగియున్నారు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడినది :
దిన చర్యల పాఠాలు [పుస్తకం]
https://teluguislam.net/?p=423

అల్లాహ్ (త’ఆలా) – Allah (Ta’ala);
https://teluguislam.net/allah/

%d bloggers like this: