జనాజా నమాజ్ ఆదేశాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَٱتَّقُوا۟ يَوْمًۭا تُرْجَعُونَ فِيهِ إِلَى ٱللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍۢ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

మీరు అంతా అల్లాహ్ వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగ బడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (అల్ బఖర 2:281)

ధార్మిక సోదరులారా….

ఈ రోజు జుమా ప్రసంగంలో జనాజా నమాజ్ ఘనత, ఆదేశాల గురించి తెలుసుకుందాం. ఇది ఎలాంటి గమ్యం అంటే ఏదో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ గమ్యానికే చేరుకోవాలి. అల్లాహ్ కూడా ఆ దినం గురించే ఇలా భయపెడు తున్నాడు: “మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.” (అల్ బఖర 2: 287)

ప్రియసోదరులారా..

జనాజా పూర్తిగా తయారయిన తర్వాత ఖనన విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకూడదు. ఒకవేళ మంచి వ్యక్తి అయితే తన నివాసాన్ని చేరుకోవటంలో త్వరగా విజయం పొందుతాడు. ఒకవేళ చెడ్డవాడైతే అతని బరువును మోయటం నుండి మీ భుజాల త్వరగా బరువు తగ్గించుకుంటాయి. జనాజా వెంట వెళ్ళడంలోనే అధిక పుణ్యాలు ఉన్నాయి. అకారణంగా జనాజా కంటే ముందు వాహనం మీద వెళ్ళటం మంచిది కాదు. జనాజాను మోస్తూ వెంట వెంటనే వెళ్ళటం ఉత్తమం. దగ్గరగా ఉంటూ మూడు సార్లు మోస్తే అతని భాధ్యత పూర్తయినట్లే ఇక ఎన్ని సార్లు మోస్తే అన్ని పుణ్యాలు ఎక్కువగా లభిస్తాయి. జనాజా ఎవరిదైనా కూడా దాన్ని చూసి నిలబడటం ఉత్తమం. జనాజా నమాజ్ అయ్యేంత వరకు మృతుని వద్ద ఉండే వానికి ఉహద్ పర్వతం మాదిరిగా ఒక రాశి పుణ్యఫలం పొందుతారు. ఖనన సంస్కారం అయ్యేంత వరకు వేచి ఉన్న వానికి రెండు రాశుల పుణ్యఫలం పొందుతారు. శవపేటికను నేలపై ఉంచే వరకూ ఎవరూ కూర్చోకూడదు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “40 మంది తౌహీద్ ఏకదైవారాధకులు, ఎవరి జనాజాలోనయినా పాల్గొని నమాజ్ పాటిస్తే ఆ మృతుడు క్షమించబడతాడు. అదే విధంగా ఎవరి జనాజాలోనయినా మూడు పంక్తుల సత్య విశ్వాసులు పాల్గొంటే అలాంటి మృతుడికి స్వర్గం ప్రవేశం తప్పక లభిస్తుందని” దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు.

జనాజా నమాజ్ చేయటం ముస్లింలపై తప్పనిసరి (వాజిబ్). ఒకవేళ మృతుడి ఖననం అయిన తరువాత చేరినవారు సమాధి వద్ద జనాజా నమాజ్ చేయవచ్చు ఒకవేళ పురుషుని జనాజా అయితే ఇమామ్ అతని తల భాగాన నిలబడి నమాజ్ పాటించాలి, ఒకవేళ స్త్రీ జనాజా అయితే నడుమ భాగంలో నిలబడాలి.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బైజా గారి ఇద్దరు పుత్రుల జనాజా నమాజ్ మసీదులో చేయించారు. అంటే మసీదులో కూడా జనాజా నమాజ్ పాటించవచ్చు. లేదా మసీదు బయట కూడా ఎక్కడైనా శుభ్రమైన స్థలంలో చదవచ్చు.

మరో ప్రాంతంలో ఉన్నవారు ఎవరి మరణవార్త అయినా అందినట్లయితే వాళ్ళు ఆ రోజే గాయిబానా జనాజా నమాజ్‌ను అంటే పరోక్షంగా చేయవచ్చు.

ఆత్మహత్య చేసుకున్న వారి జనాజా నమాజును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చదివించేవారు కాదు. అదే విధంగా రుణగ్రస్తుని జనాజా నమాజ్ కూడా చేయించేవారు కాదు. ఎవరైనా ఆ రుణగ్రస్తుని రుణభార భాధ్యత తీసుకుంటే అపుడు జనాజా నమాజ్ చేయించేవారు.

అప్పు తీసుకున్న కారణంగా ముస్లిం మృతుని ఆత్మ మధ్యలోనే వేలాడుతూ ఉంటుంది. అప్పు తీర్చిన తరువాత అది పైకి వెళ్ళిపోతుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

స్త్రీలు బహిష్టు (హైజ్) స్థితిలో మరణించినా లేక పురిటిరక్త స్రావ (నిఫాస్) స్థితిలో మరణించినా లేక శిలాశిక్ష వల్ల మరణించినా – వారి జనాజా నమాజ్‌ను తప్పక చేయించాల్సిందే. అయితే యుద్ధంలో అమరగతి నొందిన వారి జనాజా నమాజ్ చేయించనవసరం లేదు. జనాజా నమాజులో 4 తక్బీర్లు ఉంటాయి. ఇందులో రుకూ, సజాలు ఉండవు. మొదటి తక్బీరులో ఫాతిహ సూరహ్ దానితోపాటు మరేదైనా సూరా పఠించాలి. 2వ తక్సీరులో దరూద్, 3వ తక్బీరులో మృతుని మన్నింపు వేడుకోలు చేయాలి. 4వ తక్బీరు పలికి సలాము చేయాలి. మృతుని సమీప బంధువు జనాజా నమాజ్ చదివించటం ఉత్తమం. లేదా మృతుని సమీప బంధువులు ఎవరినైనా నియమించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో లేదా అడవిలో చాలా మృతదేహాలు లభిస్తే అందులో కొందరు ముస్లింలుగాను మరి కొందరు ముస్లిమేతరులుగా నిర్ధారణ అయితే ముస్లింల జనాజా నమాజ్ తప్పక పాటించాలి. ఒకవేళ మిగిలినవారు ముస్లిం లో కారో తెలియకుంటే అందరిని ముస్లింలుగా భావించి నమాజ్ పాటించాలి.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:“మృతుని జనాజ నమాజ్ చేస్తున్నప్పుడు అతని కోసం మనస్ఫూర్తిగా దుఆ చేయండి“.(సునన్ ఇబ్నెమాజా, సునన్ అబూదావూద్)

3వ తక్బీర్లో మృతుని కోసం ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఇలా వేడుకోవాలి.

అల్లాహుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వమయ్యితినా వషాహిదినా వగాయిబినా వసగీరినా వకబీరినా వజకరినా వ ఉన్నాన అల్లాహుమ్మ మన్ అహ్యైతహూ మిన్నా ఫఅహహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫై తహూ మిన్నా ఫతవఫ్ఫహు అలల్ ఈమాన్.

కొందరు అనుచరులు (రదియల్లాహు అన్హు) పిల్లల జనాజా నమాజ్‌లో ఇతర దుఆలను చేసి తరువాత ఈ దుఆ కూడా చేసేవారు.

“ఓ అల్లాహ్ ఈ పిల్లవాడిని మా కొరకు సాక్షిగా, ముందు వాడిగా పుణ్యఫలంగా చెయ్యి.”

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) చిన్నపిల్లల జనాజా నమాజ్‌లో ఇతర దుఆల తరువాత ఈ దుఆ కూడా చేసేవారు.

“ఓ అల్లాహ్ ఇతన్ని సమాధి యాతల నుండి రక్షించు.”

ప్రతీ తక్బీర్ పలుకుతూ చేతులు ఎత్తటం (రఫ్ యదైన్ చేయటం) ఉత్తమం నమాజ్‌ను ఖిరాత్తో బిగ్గరగా చదవటం ఉత్తమం ఖిరాత్ తో కాక మెల్లగా కూడా చదవవచ్చు. హజ్రత్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అనుచరుని జనాజలో బిగ్గరగా అతని మన్నింపుకొరకు దుఆ చేశారు. అప్పుడు నేను బహుశా ఈ జనాజా నాదే అయితే ఎంత బాగుండునని అనుకున్నాను.

జనాజా పురుషులదైనా, స్త్రీలదైనా, లేదా పిల్లలదైనా అందరికి ఇవే దుఆలు చేయటం సహీహ్ హదీసుల ద్వారా రూఢీ అవుతుంది.

జనాజా నమాజ్ ముగిసిన తరువాత శవపేటిక వద్ద నిలబడి ఇతరత్రా సూరాలు పఠించటంగానీ, దుఆలు చేయటంగాని సరికాదు.

గౌరవ సోదరులారా..!

సూర్యాస్తమయ సమయంలోను సూర్యోదయ సమయంలోను, మిట్ట మధ్యాహ్న సమయంలోనూ జనాజా నమాజ్ చేయటం, ఖననం చేయటాన్ని తీవ్రంగా వారించబడింది. మిగతా సమయాల్లో ఎప్పుడైనా నమాజ్ పాటించవచ్చు. ఖనన సంస్కారాలు చేయవచ్చు పగటిపూట మృతుని ఖనన సంస్కారాలు చేయటం ఉత్తమం. అనివార్యమైతే రాత్రిపూట అంత్యక్రియలు జరపటంలో కూడా తప్పులేదు.

హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ఖననం రాత్రివేళలోనే జరిగింది.

సమాధి వెడల్పుగా, లోతుగా, పరిశుభ్రంగా ఉండాలి. బగ్ సమాధి తవ్వటం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయం. సందూఖ్ పెట్టి ఆకార సమాధి కూడా తవ్వవచ్చు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బగ్జీ లీ సమాధిలోనే ఖనన సంస్కారాలు చేశారు.

సమాధిలో జనాజా దించుతూ “బిస్మిల్లాహి వ అలామిల్లతి రసూలిల్లాహ్” (అల్లాహ్ పేరుతో, దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయ పద్ధతిపై దించుతున్నాం) అని పలుకాలి.

సమాధి పూడ్చిన తరువాత పైభాగాన్ని ఎత్తుగా గోపురం లాగా చేయకూడదు. ఒక జానెడు ఎత్తుకంటే ఎక్కువగా ఉండకూడదు. తరువాత కొన్ని నీళ్ళు చల్లాలి. ఆ తరువాత ముస్లిలందరూ కలసి అతని మన్నింపుకై సమాధిలో స్థిరత్వంకై వేడుకోవాలి. చాలా సేపు అతని మన్నింపు, వేడుకోలు స్థితిలోనే నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే సమాధి మొదటి మజిలి. కఠినమైన మజిలి. సమాధిలో జరిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తేనే అతడు మిగతా భాగాల్లోనూ రక్షించబడతాడు, విజయం సాధిస్తాడు.

మొదటి గమ్యంలోనే అతడు విఫలమైతే ఇక నరకయాతన అనుభవించా ల్సిందే. అల్లాహ్! మనందరిని సమాధి శిక్షల నుండి, నరకయాతనల నుండి రక్షించుగాక, సమాధిలో ప్రశ్నాపరీక్షల సమయంలో స్థిరత్వాన్ని నిలకడను ప్రసాదించు గాక ఆమీన్.

సమాదులపై గోరీలు భవనాలు, ఇల్లు నిర్మించటం, వాటిపై దీపాలు, జ్యోతులు, అగరఒత్తులు, కొవ్వత్తులు వెలిగించటం, పూలు, పుష్పాలు పెట్టడం, వాటితో అలంకరించటం ఇత్యావీ విషయాలన్ని నిషిద్ధం (హరాం). సమాధి వద్ద కూర్చొని ఖుర్ఆన్ మజీద్ పారాయణం చేయటం, చేయించటం సమాధిపై మృతుని పేరు, జనన మరణ తేదీలు రాయటం, ఫలకాలు, బోర్డులు తలిగించటం వంటి పనులన్నీ అవాంఛనీయం.

వీటన్నింటినీ ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖండించారు. నిషిద్దమైనవిగా ప్రకటించారు. కాబట్టి ఇస్లామీయ షరీఅత్ లో ఇలాంటి కొత్తపనులకు, షైతాన్ పనులకు ఎలాంటి తావు లేదు. ఎలాంటి సంబంధమూ లేదు. ఇలాంటి కార్యాల్లో చిక్కుకున్న వారు వెంటనే అల్లాహ్ పశ్చాత్తాపంలో క్షమాభిక్ష వేడుకుని దైవప్రవక్త విధానం వైపుకు మరలుతూ వాటన్నింటినీ విస్మరించాలి విడనాడాలి.

సమాధి వైపు తిరిగి నమాజ్ పాటించడాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీవ్రంగా ఖండిం చారు. సమాధిపై కూర్చోవటం, అగ్నిపై కూర్చోవటంతో సమానమని హెచ్చరించారు. సమాధి తల భాగాన ఏదైనా చిన్నరాయి. బండని గుర్తుగా ఉంచటం సున్నత్, పుణ్యాత్ముల, మంచివారి దగ్గర మృతుణ్ణి ఖననం చేయటం ఉత్తమం.

పరస్త్రీ జనాజాను పరపురుషుడు సమాధిలో దించవచ్చు. అయితే ఆ మృతురాలి భర్తగానీ, తండ్రిగానీ అక్కడ ఉన్నప్పుడే ఇలా చేయాలి.

మృతుని కుటుంబీకులు, బంధువులు శోకంతో విలపిస్తూ ఉంటారు కాబట్టి ఇరుగు పొరుగువారు వారికి ఆహార భోజన ఏర్పాట్లు చేసి వారికి తినిపించాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాకీదు చేశారు.

మృతులు చెప్పుల సవ్వడి కూడా వింటాయని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. మృతుణ్ణి సమాధి చేసి తిరిగి వెళ్తున్నపుడు వచ్చే పాదరక్షల చప్పుడును మృతులు వింటారు. ఆ సమయంలో ఆత్మ అతని దేహంలో వేయబడుతుంది. కూర్చోబెట్టి అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది. ఆ తరువాత ఆ ఆత్మను దాని బరఖ్ అవస్థలోని నివాసంలో చేర్చబడుతుంది. ప్రళయం వరకు కూడా ఇక ఆ మృతుడు వినలేడు. పాదరక్షలు ధరించి స్మశానవాటిక (ఖబరస్తాన్) వెళ్ళటంలో ఎలాంటి అభ్యంతరం లేదని మనకు ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. మంచి వ్యక్తి దైవదూతల ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ఇస్తాడు. అపుడు అతనికి నరకం చూపించబడుతుంది. చూడూ అల్లాహ్ నీకు ఆ నరకానికి బదులుగా స్వర్గాన్ని అనుగ్రహించాడు. తరువాత స్వర్గం చూపించబడుతుంది. దాన్ని చూస్తూనే ఉండిపోతాడు.

అదేవిధంగా చెడ్డవ్యక్తికి మొదట స్వర్గం చూపించబడుతుంది. తరువాత వారు వారికోసం వాగ్దానం చేయబడిన శాశ్వత నరకంలో నెట్టివేయబతారు. నరకశిక్షలను అనుభవిస్తూ ఉంటారు.

సమాధులపై పూలు పెట్టడం, చాదర్లు సమర్పించటం, రొట్టెలు మిఠాయిలు తీయ్యని తినుబండరాలు పెట్టడం, పంచడం వంటివి బిన్అత్ (క్రొత్త పనులు) మృతుని ప్రయోజనార్థమని అజాన్ ఇవ్వటం 40 అడుగుల దూరం నుండి దుఆ చేయటం వంటి పనులన్ని బిత్ (కొత్త) పనులే. కొన్ని ప్రాంతాల్లో సమాధి చేసే ముందు ఖబరస్తాన్ లో మిఠాయిలు, డబ్బులు, వడ్లు పంచుతారు. లేదా షర్బత్ వంటి చల్లని పానీయాలు త్రాగిస్తారు. ఇలాంటి అధర్మ కార్యాలనుండి, బిత్ పనుల నుండి బహు దూరంగా ఉండటం తప్పనిసరి.

పెద్దలారా, మిత్రులారా..!

సమాధుల సందర్శన గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బోధించారు: మొదట నేను సమాధుల సందర్శనను వారించాను. కాని ఇపుడు అనుమతిస్తున్నాను. సమాధుల సందర్శన వలన పరలోక భీతి, చింతన కలుగుతుంది. ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరలోకచింతనను తాజా చేసుకోవటం కోసం, మృత్యువుని తలచుకొని పరలోక ఏర్పాట్లు చేసుకోవటం కోసం మాత్రమే అనుమతించారు. ఇలాంటి పరిస్థితి, చింతన కూడా మామూలు సమాధుల వల్లె కలుగుతుంది. కాని ఈ రోజుల్లో మనం దర్గాలుగా, మజార్లులుగా చెప్పుకునే సమాధుల వలన ఆ చింతన, భీతి కలిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మసీదుల కంటే కూడా ఎక్కువగా అందంగా అద్భుతంగా కళాత్మకంగా, నిర్మాణాత్మకంగా నేడు సమాధుల నిర్మాణాలు జరుగుతున్నాయి.

పెద్ద పెద్ద భవనాలు, గోపురాలు, రంగురంగుల చాదర్లు, జెండాలు మొదలుగనవి ఉన్న వాటిని సందర్శించటంలో అర్థం లేదు.

దూరదూర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా సమాధుల సందర్శన కోసమే ప్రయాణం చేయటం వాటికి చాదర్లు సమర్పించటం, మొక్కుబడులు, వేడుకోలు చేయటం, వసీలాగా భావించటం – ఇలాంటివన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలు ఎంతవరకు అమలులో ఉన్నాయో ఆలోచించాలి మరి?

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధుల సందర్శన పద్ధతిని గురించి ఇలా తెలిపారు: మీరు సమాధుల వద్దకు వెళ్ళినపుడు ఇలా పలకండి.

ఓ ముస్లిం, విశ్వాసుల ఇంటివారాలారా! మీపై శాంతి కలుగుగాక! మేము మిమ్మల్ని కలువనున్నాము ఇన్షా అల్లాహ్ మేము మాకోసం, మీ కోసం అల్లాహ్ ను మేలును అభ్యర్థిస్తున్నాము.”

ఖబర్తొన్లో ఉన్నంతవరకు వారి మన్నింపుకు క్షమాభిక్ష వేడుకుంటూ ఉండాలి.

నేను కూడా ఇక్కడికి చేరేవాణ్ణి అని తన మృత్యువును స్మరించుకోవాలి. స్త్రీలు వెళ్ళినా కూడా ఇలానే చేయాలి.

ధార్మిక జ్ఞానం లేని కొందరు స్త్రీలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి వ్యతిరేకంగా శోకం పాటిస్తారు. బోరున ఏడుస్తారు. ఇలాంటి పనులతో సమాధులను దర్శించేవారిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధించారు. అలాంటి స్త్రీలకు అనుమతివ్వటం మంచిదికాదు. కాబాగృహం, మస్జిదె నబవీ, బైతుల్ మఖ్దిస్ తప్ప మిగతవాటన్నింటిని సందర్శనార్థం ప్రయాణం చేయటాన్ని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించారు. మదీనా నగరం వెళ్ళిన వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని, ఆయన సూచించిన విధంగా సందర్శించవచ్చు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన జీవితపు చరమ దశలో ఇలా సెలవిచ్చారు:

యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! వాళ్లు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగ ప్రణామ (సజ్దా) స్థలాలుగా చేసుకున్నారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ‘సజ్దా’ స్థలాలుగా చేసుకోరాదు సుమా! అలాంటి చేష్ట నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నాను”.

ఓ అల్లాహ్! నా సమాధిని పూజా స్థలంగా చేయకు”అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దుఆ చేశారు.

తమ ఇమాములు, పెద్దల సమాధులను మసీదులుగా చేసుకున్నవారి గురించి అల్లాహ్ హెచ్చరిక వచ్చింది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దుఆను అల్లాహ్ ఆమోదించాడు. ఆయన సమాధి విగ్రహ స్థలంగా మారకుండా అల్లాహ్ కాపాడాడు.

మహాశయులారా..!

చివర్లో ఒక హదీసు వినిపిస్తున్నాను. శ్రద్ధగా వినండి. అబ్దుర్రహ్మాన్ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) తన తండ్రి ద్వారా ఉల్లేఖించారు: వారు ఇలా అంటుండేవారు. విశ్వాసి ప్రాణం ఒక పక్షి లాంటిది. అది స్వర్గంలోని వృక్షంపై ఉంటుంది. చివరకు ప్రళయదినాన దానిని దాని శరీరంలోకి అల్లాహ్ పంపిస్తాడు.

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది :

ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్

%d bloggers like this: