ఇస్లాం ప్రియ బోధనలు – సయ్యద్ అబ్దుల్ హకీం [పుస్తకం]

ఇస్లాం ప్రియ బోధనలు (Islam Priya Bodhanalu)
రచయిత: సయ్యద్ అబ్దుల్ హకీం, ఎం. ఎ. (Syed AbdulHakim, M.A)
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరి, ఎం.ఓ.ఎల్. (AbdulBasit Omari M.O.L)

ఈ చిరు పుస్తకంలో ముస్లింలు ఏ విధంగా తమను తాము సరిదిద్దుకోవాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు.

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
PDF (పిడిఎఫ్) 42 పేజీలు – మొబైల్ ఫ్రెండ్లీ బుక్

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

తొలిపలుకు

ఈ లోకం ఆర్థికంగా, భౌతికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మానవతా విలువలు దిగజారుతున్నాయి. అందుకనే ఈ లోకంలో శాంతి సౌభాగ్యాలు కరువై దౌర్జన్యకాండలు, రక్తపాతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నేడు మనశ్శాంతి కోసం అల్లాడుతున్న మానవజాతికి ఇస్లాం ధర్మంలోనే ఆశాకిరణం కానవస్తుంది. ఇస్లాం ధర్మం శాంతి సౌభాగ్య బోధనలతో నిండి ఉంది. సత్ప్రవర్తన, నీతి, న్యాయం, సత్యసంధత, ప్రేమ, సోదరభావం, శాంతి; ఇవన్నీ ఇస్లాం బోధనలకు ప్రతిరూపాలే. సర్వమానవాళిని సృజించిన అల్లాహ్ కు మానవాళి కృతార్థమార్గం తెలియును. కావున వారి కృతార్థతకొరకు ఆయన ఇస్లాం ధర్మాన్ని అవతరింపజేసెను.

పరలోకమునందు, విచారణదినము నందు విశ్వాసం ఉంచటం ఇస్లాం మౌలిక బోధనల్లో ఒకటి. అందువల్లనే మానవుడు దుష్పలితాలకు నరకశిక్షకు భయపడి, సత్ఫలితాలను, స్వర్గ భాగ్యాలను ఆశిస్తూ దుష్కార్యాలకు దూరంగా ఉంటూ, సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇందువల్ల ఈ లోకం శాంతి సౌభాగ్యాలకు అలవాలమవుతుంది. కానీ పరలోక విశ్వాసమే లేకపోతే ఈ లోకం దౌనర్జన్యకాండలకు రక్తపాతాలకు ఆలవాలమై నరకకూపంలా తయారవుతుంది.

ఏక దైవారాధన విశ్వాసం, దైవ ప్రవక్త పై విశ్వాసం, పరలోక విశ్వాసం ఇవి మూడూ ఇస్లాం ధర్మం యొక్క మౌళిక బోధనలు. కానీ ఈ మూడు బోధనల యందు విశ్వాసం ఉంచు ముస్లింలే వాటిని సరిగా అర్థం చేసుకోక వాటి గురించిన విధులు నెరవేర్చ లేకపోతున్నారు. కావున ముస్లింలు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించటం కోసమే ఈ పుస్తకం రచింపబడింది. ఈ విధంగా ముస్లింలు వాస్తవంగా ముస్లిములై ముస్లిమేతరులకు మార్గదర్శులు కాగలరు.

కానీ ఒక చేదు వాస్తవమేమిటంటే కొందరు ముస్లింలు తమ ఆజ్ఞానము వల్ల ముస్లిమేతరులకు తీసిపోని విధంగా తయారయ్యారు. తాము ముస్లింలని చెప్పుకుంటూనే అల్లాహు ను విడిచి సమాధులను, వలీలను పూజిస్తున్నారు. లాభనష్టాలు, సుఖదుఃఖాలు వారి చేతిలోనే ఉన్నాయని భావిస్తున్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడు కాదని, దేవుని భాగం లేదా అవతారమని అపార్థపడుతున్నారు. జంతువులను అల్లాహ్ పేర కాకుండా సమాధుల పేర బలియిస్తున్నారు. నమాజ్ ఆరాథనను అల్లాహ్ కొరకు అంకితం చేయక అబ్దుల్ ఖాదిర్ జీలానీ కొరకు కూడా భాగం ఇస్తున్నారు. సమాధులకు ప్రదక్షిణాలు చేసి హజ్ చేసినంత పుణ్యం దొరికిందని, ఇక స్వర్గప్రవేశం తప్పక లభిస్తుందని సంబరపడుతున్నారు. ఇవన్నీ నామ మాత్రపు ముస్లింలు యేర్పరుచుకున్న బూటకపు దురాచారాలేగానీ, వాటికి ఇస్లాంతో ఎటువంటి సంబంధమూ లేదు. అందుకనే ముస్లింలు సంఖ్యలో అధికంగా ఉన్నా, వారికి యే విధమైన విలువా లేకపోయింది. అజ్ఞానం మరియు ఇస్లాం వాస్తవ బోధనలకు దూరం కావటం వల్లనే ఇలా జరుగుతోంది.

ఇకనైనా ముస్లింలు సువర్ణావకాశాలను చేజార్చుకోకుండా ఇస్లాం వాస్తవ బోధనలు తెలుసుకుని వాటి ప్రకారం ఆచరించి అల్లాహ్ ను సంతుష్టపర్చి ఆయన దయకు పాత్రుల కాగలరని ఆశిస్తున్నాం.

మౌలానా సయ్యద్ అబ్దుల్ హకీం గారు ముస్లింల సంస్కరణ మరియు ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మ ఆహ్వానం మొదలగు ఉన్నత సంకల్పాలతో ఈ పుస్తకాన్ని రచించి ధన్యులయ్యారు. ఇందు అన్ని విషయాలూ దివ్యఖుర్ ఆన్ వాక్యాలు మరియు పవిత్ర హదీసు వచనాల ఆధారంతోనే పేర్కొనబడినవి. ఈ క్రింద అతిక్లుప్తంగా రచయిత జీవిత విశేషాలు ఇవ్వబడుతున్నాయి.

సయ్యద్ అబ్దుల్ హకీం గారు 7-6-1939 సo. హైదరాబాదులో జన్మించారు. ఆయన 1969 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ఎం. ఏ చేశారు. మరొక వైపు ఇస్లాం ధార్మిక విధ్యలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. ఆయన గొప్ప ప్రసంగీకులేకాక ప్రముఖరచయిత కూడా. ఇంతవరకు సుమారు ఇరవై చిరు పుస్తకాలు రచించారు. అవి ఉర్దూభాషలోనే కాక ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో కూడా అనువదింపబడి ప్రచురింపబడినవి. మౌలానా సయ్యద్ అబ్దుల్ హకీం గారు ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రభుత్వం తరుపున దోహ ఖతర్ లో ఇస్లాం ప్రచార బోధనా కేంద్రంలో ధార్మిక బోధకునిగా సేవ చేయుచున్నారు.

అల్లాహ్ రచయితకు, అనువాదకునికీ, ప్రచురణకర్తకు మరియు ఇతర సహకారులందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక! ఈ చిరు ప్రయత్నాన్ని స్వీకరించి మనందరికీ ఇహపరలోకాల కృతార్థత ప్రసాదించుగాక! ఆమీన్.

సయ్యద్ సఈ ముర్రహ్మాన్ ఎం. ఏ.
ప్రధాన కార్యదర్శి జమయ్యతె అహ్లెహదీస్;
హైదరాబాద్ సికింద్రాబాద్.

విషయ సూచిక

  • పవిత్ర వచనం: లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్.
  • విధ్యాభ్యాస ప్రాముఖ్యత
  • ఏకదైవారాధన – మానవ ప్రవర్తనా సంస్కరణ
  • ఏకదైవారాధన సంఘ సంస్కరణ
  • ఇస్లాం ఒక సద్గుణ బోధిని
  • “సలామ్” సదాచార వివరాలు
  • ఏక ధైవారాధనా విశ్వాసం
  • బహు ధైవారాధన
  • విచారణ దిన సిఫారసు వివరాలు
  • ఇస్లాం విశిష్టతలు
%d bloggers like this: