మొక్కుబడి నియమాలు – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

మొక్కుబడి నియమాలు – Rulings of An-Nadhr (Vows)
https://youtu.be/d3XZ5Pz3iOw [24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

  • మొక్కుబడి అంటే ఏమిటి? దాని నిర్వచనం
  • మొక్కుబడి ఆరాధన క్రిందికి వస్తుందా?
  • ఖురాన్ & సున్నత్ లో మొక్కుబడి కి సంబంధించిన కొన్ని ఉదాహరణలు
  • మొక్కుబడి చేసుకుంటే అది తప్పనిసరిగా నెరవేర్చాలా?
  • ధర్మ సమ్మతమైన వాటినే మొక్కుబడి చేసుకోవాలి
  • అధర్మ మైన విషయాలకు మొక్కుబడి చేసుకోకూడదు, ఒకవేళ చేసుకొంటే అది నెరవేర్చకూడదు, పరిహారం చెల్లించుకోవచ్చు
  • తన అధీనంలో లేని వాటి మీద మొక్కుబడి చేసుకోరాదు.
  • అర్థరహితమైన మొక్కుబడులు చేసుకోరాదు
  • చనిపోయిన వారి మొక్కుబడులు వారి తరపున బ్రతికున్నవారు, వారసులు పూర్తిచేయాలా?
  • అల్లాహ్ కు తప్ప వేరెవరికీ మొక్కుబడులు చేసుకోకూడదు
  • మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను, ఖదర్ ను మార్చదు
  • మొక్కుబడిని ఒక వ్యాపారం లాగా చేయకూడదు. అల్లాహ్ తో షరతు పెట్టి మొక్కుబడి చేయకూడదు. “ఓ అల్లాహ్ ఈ పని జరిగితే ఉపవాసం ఉంటాను.” ఇలాగ మొక్కుబడులు చేసుకోకూడదు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మొక్కుబడి నియమాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొక్కుబడి అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, అరబీ భాషలో మొక్కుబడిని నజర్ అంటారు. ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలిపి ఉన్నారు.

أَنْ تُوْجِبَ عَلَى نَفْسِكَ مَا لَيْسَ بِوَاجِبٍ لِحُدُوْثِ أَمْرٍ
(అన్ తూజిబ అలా నఫ్సిక మా లైస బివాజిబిన్ లిహుదూసి అమ్ రిన్)

అంటే, నీపై తప్పనిసరి కాని ఒక కార్యాన్ని, ఆ పని నేను చేస్తాను అని సంకల్పం చేసుకున్న కారణంగా, నీపై ఆ పని చేయడం తప్పనిసరి అయిపోతుంది కదా? అలా అనుకోవటాన్ని మొక్కుబడి అంటారు, అని ధార్మిక పండితులు మొక్కుబడి యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా తెలియజేశారు.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్లాం ధర్మంలో చాలా రకాల ఆరాధనలను ఉంచి ఉన్నాడు. ఆ ఆరాధనలలో ఒక ఆరాధన మొక్కుబడి చేసుకోవటం. మొక్కుబడి కూడా ఒక ఆరాధన అని ఖురాను మరియు హదీస్ గ్రంథాలలో మనకు తెలుపబడి ఉంది. ఉదాహరణకు మనము చూచినట్లయితే, సూర బఖరాలోని 270వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు,

وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ
(వమా అన్ఫఖ్ తుం మిన్ నఫఖతిన్ అవ్ నజర్తుం మిన్ నజ్రిన్ ఫఇన్నల్లాహ యఅలముహు)
మీరు దైవ మార్గంలో ఎంత ఖర్చు చేసినా, ఏ మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్‌కు దాని గురించి పూర్తిగా తెలుసు.

అంటే, భక్తులు చేసుకుంటున్న మొక్కుబడిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తిగా గమనిస్తున్నాడు అని మొక్కుబడి గురించి ఈ వాక్యంలో ప్రస్తావించబడింది.

అభిమాన సోదరులారా, మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలను చదివినట్లయితే ఒక విషయం మనకు తెలుస్తుంది, అదేమిటంటే, మొక్కుబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది.

ఉదాహరణకు, మన ప్రియ ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి అమ్మమ్మ, ఆవిడ పేరు హన్నా అని గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఆవిడ భర్త పేరు ఇమ్రాన్ అని కూడా వ్రాయబడి ఉంది. ఆవిడ గర్భం ధరించినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో మొక్కుబడి చేసుకుందట. ఏమని మొక్కుబడి చేసుకుందట?

رَبِّ إِنِّى نَذَرْتُ لَكَ مَا فِى بَطْنِى مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّىٓ
(రబ్బీ ఇన్నీ నజర్తులక మాఫీ బత్నీ ముహర్రరన్ ఫతకబ్బల్ మిన్నీ)

ఓ అల్లాహ్, నా గర్భంలో ఉన్న శిశువుని నీ పుణ్యక్షేత్ర సేవ కొరకు నేను అంకితం చేసేస్తానని మొక్కుబడి చేసుకుంటున్నాను ఓ అల్లాహ్, నీవు నా ఈ మొక్కుబడిని స్వీకరించు, అని ఆ రోజుల్లోనే ఏసుక్రీస్తు(ఈసా) అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకుందని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఖురాన్‌లో తెలియజేశాడు.

అలాగే, ఆవిడ తర్వాత, ఈసా అలైహిస్సలాం, ఏసుక్రీస్తు వారి తల్లి, మర్యం అలైహస్సలాం గురించి మనం చూసినట్లయితే, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకునిందని, ఆవిడకు ఆ మొక్కుబడి చేసుకోమని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా మర్యంలో మర్యం అలైహస్సలాం వారి చరిత్రను తెలుపుతూ, ఎప్పుడైతే మర్యం అలైహస్సలాం ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా, ఎలాంటి తప్పు పని చేయకుండా, అల్లాహ్ ఆజ్ఞతో ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించిందో, గర్భం ధరించిన తర్వాత ఆవిడ ఏకాంతంలో ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ఏకాంతంలో ఆవిడ ఉంటున్నప్పుడు, పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆవిడ మనుసులో చాలా కంగారు పడ్డారు. అయ్యో, ఇక త్వరలోనే నాకు బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని నేను సమాజంలోకి వెళితే, ప్రజలు నాలుగు రకాలుగా నన్ను నిలదీస్తారు. అప్పుడు లేనిపోని నిందలు కూడా నా మీద వేస్తారు. ఆ మాటలు వినలేను. ఆ రోజు రాకముందే నేను ఈ ప్రపంచంలో నుంచి లేకుండా వెళ్ళిపోతే బాగుండు కదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి మర్యం అలైహస్సలాం వారికి ఏమని చెప్పాడంటే,

 فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا
(ఫఇమ్మా తరయిన్న మినల్ బషరి అహదన్ ఫఖూలీ ఇన్నీ నజర్తు లిర్రహ్మాని సౌమన్ ఫలన్ ఉకల్లిమల్ యౌమ ఇన్సియా)
ఏమనిషైనా నీకు తారసపడితే, ‘నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను’ అని చెప్పు.”

దైవదూత వచ్చి మర్యం అలైహస్సలాం వారితో అంటున్నాడు, చూడండి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండండి. మీకు ఆకలి వేస్తే ఇదిగో ఈ ఖర్జూరపు చెట్టు ఉంది కదా, ఆ ఖర్జూరపు చెట్టుని ముట్టుకోండి, ఖర్జూరపు పండ్లు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు భుజించండి. ఇదిగో ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, ఆ నీటిని త్రాగండి, మీ దాహాన్ని తీర్చుకోండి. ఒకవేళ ఎవరైనా పురుషులు ఇటువైపు మీతో తారసపడితే, అప్పుడు వారు మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు వాళ్లకి ఏమని సమాధానం ఇవ్వాలంటే “నేను కరుణామయుడైన అల్లాహ్ నామం మీద ఉపవాసం ఉంటానని మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని నేను అమలుపరుస్తూ ఈ రోజు ఉపవాస వ్రతంలో ఉన్నాను కాబట్టి ఎవరితో నేను ఈ రోజు మాట్లాడలేను” అని సైగ చేసేయండి, అని దైవదూత మర్యం అలైహస్సలాం వారికి తెలియజేశాడు.

అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం వారి అమ్మమ్మ మొక్కుబడి చేసుకున్నట్టు, అలాగే ఈసా అలైహిస్సలాం వారి తల్లి మర్యం, ఆవిడ కూడా మొక్కుబడి చేసుకున్నట్టు, ఇద్దరు కూడా మొక్కుబడి చేసుకున్నట్టు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో మనకు తెలియజేశాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వం గతించిన ప్రవక్తల శాసనాలలో కూడా మొక్కుబడి ఉండేది. ఆ రోజుల్లోని భక్తులు కూడా మొక్కుబడి చేసుకునేవారు అని మనకు తెలుస్తుంది.

ఇక మీరు ప్రశ్నించవచ్చు, ఏమండీ, మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఉన్న వాళ్ళము కదా, మాకు వేరే ప్రవక్తల శాసనాలతో పని ఏమిటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి ఉందా లేదా? అది చెప్పండి అని మీరు అడగవచ్చు. అభిమాన సోదరులారా, అటువైపే నేను వస్తున్నాను. రండి, ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మొక్కుబడి గురించి అల్లాహ్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని చెప్పారో తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొక్కుబడిని ఉంచాడు. ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించుకోవాలని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ఆదేశించి ఉన్నాడు. చూడండి, ఖురాన్‌లోని సూరా హజ్ 29వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

ثُمَّ لْيَقْضُوا۟ تَفَثَهُمْ وَلْيُوفُوا۟ نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا۟ بِٱلْبَيْتِ ٱلْعَتِيقِ
(సుమ్మల్ యఖ్జూ తఫసహుం వల్ యూఫూ నుజూరహుం వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్)

హజ్ చేయడానికి వెళ్తారు కదండీ? కాబా పుణ్యక్షేత్రానికి వెళ్లి అక్కడ హజ్ ఆచరించాలని హాజీలు వెళ్తారు కదండీ? ఆ హాజీల గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే, ఆ తరువాత వారు, అనగా హజ్ చేసేవారు, తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి. మొక్కుబడులను చెల్లించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో ఆదేశిస్తున్నాడు.

అలాగే అభిమాన సోదరులారా, స్వర్గానికి వెళ్ళే వాళ్ళు భక్తులు, వాళ్ళు ఉత్తములు. అలాంటి సజ్జనుల లక్షణాలలో ఒక లక్షణం ఏమిటంటే, స్వర్గవాసులు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో ఏదైనా మొక్కుబడి చేసుకుని ఉంటే ఆ మొక్కుబడి తప్పనిసరిగా చెల్లించేవారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి యొక్క లక్షణాలను కూడా మనకు తెలియజేశాడు. చూడండి, సూరా దహర్‌లోని ఏడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజ్జనుల లక్షణాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే,

يُوفُونَ بِٱلنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُۥ مُسْتَطِيرًا
(యూఫూన బిన్నజ్రి వయఖాఫూన యౌమన్ కాన షర్రుహు ముస్తతీరా)

సజ్జనులు ఏమి చేస్తారంట? వారు తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారు, కీడు నలువైపులా విస్తరించే రోజు గురించి భయపడుతూ ఉంటారు. అంటే, పరలోక దినం గురించి వాళ్ళు భయపడుతూ ఉంటారు. మొక్కుబడులు చేసుకుంటే ఆ మొక్కుబడులను తప్పనిసరిగా వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఇది సజ్జనుల లక్షణము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇక్కడ తెలియజేశాడు.

అభిమాన సోదరులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో కూడా మొక్కుబడి ఉంది. మొక్కుబడి చెల్లించుకోవటం సజ్జనుల లక్షణమని మనకు ఈ వాక్యాల ద్వారా తెలిసింది కాబట్టి, ఇక మొక్కుబడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలియజేస్తున్నాను, అవి కొంచెం జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకుని ఆచరించే ప్రయత్నం చేయండి.

మొదటి నియమం ఏమిటంటే, మొక్కుబడి చేసుకునే వాళ్ళు ధర్మ సమ్మతమైన విషయాల మీదే మొక్కుబడి చేసుకోవాలి. ఉదాహరణకు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేరు మీద నేను ఒక జంతువు జబా చేసి అన్నం తినిపిస్తాను లేదా నలుగురికి దాహం తీర్చడానికి నీటి సౌకర్యం కల్పిస్తాను, ఈ విధంగా ఏదైనా ఒక సత్కార్యాన్ని, ధర్మ సమ్మతమైన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవచ్చు. ధర్మ సమ్మితమైన విషయాల మీద మాత్రమే మొక్కుబడి చేసుకోవాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ
(మన్ నజర అన్ యుతీఇల్లాహ ఫల్ యుతిఅ)
అల్లాహ్ ఆదేశాలను పాటించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ మొక్కుబడిని చెల్లించాలి.

అలాగే మొక్కుబడికి సంబంధించిన మరొక నియమం ఏమిటంటే, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదు. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి నేను నలుగురికి సారాయి తాపిస్తాను అని మొక్కుబడి చేసుకోవడం. అభిమాన సోదరులారా, ఇస్లాంలో సారాయి సేవించటం స్వయంగా త్రాగటము కూడా నిషేధమే, ఇతరులకు త్రాపించటము కూడా నిషేధమే, లేదా సారాయిని ఒకచోట నుండి మరొక చోటికి తరలించడానికి సహాయపడటము కూడా నేరమే, అది కూడా నిషేధమే. కాబట్టి అల్లాహ్ నిషేధించిన కార్యాన్ని నేను చేస్తాను అని మొక్కుబడి చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلا يَعْصِهِ
(మన్ నజర అన్ యఅసియహు ఫలా యఅసిహి)
అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించడానికి ఎవరైనా మొక్కుబడి చేసుకుంటే అతను అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించరాదు, అలాంటి మొక్కుబడి చేసుకోరాదు అని తెలియపబడింది.

అభిమాన సోదరులారా, మీరు ఒక్క విషయం ఇక్కడ ప్రశ్నించవచ్చు. ఏమండీ, ఒక వ్యక్తి అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్నాడు. కాకపోతే ఆ అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోరాదని తరువాత అతనికి తెలిసింది. ఇప్పుడు అతను ఏమి చేయాలి? అతనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా అంటే, అభిమాన సోదరులారా, అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు మొక్కుబడి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ పరిహారం చెల్లించుకోవచ్చును. పరిహారం ఏమిటంటే, 10 మందికి అన్నం తినిపించాలి లేదా 10 మందికి బట్టలు తొడిగించాలి లేదా ఒక బానిసను విముక్తుడిని చేయాలి లేదా మూడు రోజుల ఉపవాసం ఉండాలి. ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణాన్ని భంగపరిస్తే కూడా ఇదే పరిహారం ఇవ్వాలి, అదే పరిహారము అధర్మమైన విషయాల మీద మొక్కుబడి చేసుకున్న వాళ్ళు కూడా పరిహారం చెల్లించుకోవాలి.

ఇక రండి అభిమాన సోదరులారా, మొక్కుబడికి సంబంధించిన మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు. అలాగే మనం చూస్తున్నట్లయితే చాలా మంది, నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ కార్యం పూర్తి చేస్తే, నేను ఇన్ని కిలోల బంగారాన్ని దానం చేస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. వాస్తవానికి అన్ని కిలోల బంగారం వాళ్ళ వద్ద లేదు. వారి ఆధీనంలో, వారి శక్తి సామర్థ్యానికి మించిపోయిన విషయాల గురించి మొక్కుబడి చేసుకోరాదు.

అలాగే, అర్థరహితమైన మొక్కుబడులు కూడా చేసుకోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ మీద నిలుచుని ప్రసంగిస్తూ ఉంటే, ఒక సహాబీ ఎండలో నిలబడి ప్రసంగాన్ని వింటూ ఉన్నాడు. అందరూ లోపల వచ్చి కూర్చుని ఉన్నారు, ఆయన ఒక్కడు మాత్రం ఎండలోన నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరండి అతను? ఎందుకు అక్కడ ఎండలో నిలబడిపోయాడు? లోపలికి ఎందుకు రావట్లేదు? పిలవండి అతనికి అని అడిగితే, అప్పుడు కూర్చుని ఉన్న సహాబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసే విషయం ఏమిటంటే, ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన పేరు అబూ ఇస్రాయీల్, ఆయన ఈ రోజు మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు అంటే, ఈ రోజు నేను నీడలోకి రాను ఎండలోనే ఉంటాను, అలాగే ఈ రోజు నేను ఎవరితో మాట్లాడను, అలాగే ఈ రోజు నేను రోజు మొత్తం నిలబడే ఉంటాను కానీ కూర్చోను, అలాగే ఈ రోజు నేను ఆహారం భుజించను, ఉపవాసంలో ఉంటాను. ఆ విధంగా అతను మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి ఓ దైవ ప్రవక్త, అతను కూర్చోవట్లేదు, అతను అలాగే నిలబడి ఉన్నాడు, నీడలోకి రావట్లేదు, ఎండలోనే నిలబడి ఉన్నాడు అని చెబితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అన్నారు.

مُرُوهُ فَلْيَتَكَلَّمْ، وَلْيَسْتَظِلَّ، وَلْيَقْعُدْ، وَلْيُتِمَّ صَوْمَهُ
(మురూహు ఫల్ యతకల్లెం వల్ యస్తజిల్ వల్ యఖ్అద్ వల్ యుతిమ్మ సౌమహు)

ఇదేంటండి? మీరు వెంటనే అతనికి ఆదేశించండి. అతను మాట్లాడనని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది అర్థరహితమైన మొక్కుబడి. అతనికి మాట్లాడమని చెప్పండి. అలాగే ఈ రోజు మొత్తం నేను నీడలోకి రాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి వెంటనే నీడలోకి రమ్మని ఆదేశించండి. ఈ రోజు మొత్తం నేను కూర్చోను, నిలబడే ఉంటాను అని మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఇది కూడా అర్థరహితమైన మొక్కుబడి. అతనికి ఆదేశించండి, వచ్చి వెంటనే కూర్చోమని చెప్పండి. అయితే ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను అని అన్నాడు కదా, ఇది మాత్రం ధర్మ సమ్మితమైన విషయమే కాబట్టి ఉపవాసాన్ని పూర్తి చేయమని చెప్పండి. ఉపవాసం పూర్తి చేయమని చెప్పండి కానీ నిలబడతాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, కూర్చోమని చెప్పండి. ఈ రోజు నేను నీడలోకి రాను అన్నాడు కదా, అది మాత్రం తగదు, నీడలోకి రమ్మని చెప్పండి. ఈ రోజు నేను మాట్లాడను అని చెప్పాడు కదా, అది కూడా తగదు, మాట్లాడమని చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, తన ఆధీనంలో లేని విషయాల మీద, అర్థరహితమైన విషయాల మీద మొక్కుబడి చేసుకోకూడదు.

అలాగే, మొక్కుబడి గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పూర్వీకులు లేదా మన తల్లిదండ్రులు, మన బంధువులలో ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారు. మొక్కుబడి చేసుకున్నారు కానీ మొక్కుబడి చెల్లించక మునుపే మరణించారంటే, మరణించిన వారి యొక్క వారసులు వారి మొక్కుబడులను చెల్లించాలి.

ఉదాహరణకు, జుహైనా తెగకు సంబంధించిన ఒక మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుంది కానీ హజ్ చేయకుండానే మరణించింది. నేను నా తల్లి తరఫు నుంచి ఆ మొక్కుబడి చెల్లించవచ్చునా? అని ఆ మహిళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమమ్మా, నీ తల్లి ఇతరుల వద్ద ఎవరి దగ్గరైనా బాకీ తీసుకుని ఉంటే, ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ బాకీ నీవు తీరుస్తావా, తీర్చవా? ఆ తప్పనిసరిగా తీర్చుతాను ఓ దైవ ప్రవక్త అన్నప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ తల్లి అల్లాహ్ పేరు మీద హజ్ చేస్తానని మొక్కుబడి చేసుకుని, అల్లాహ్‌కు బాకీ అయిపోయింది కాబట్టి, మీ తల్లి తరఫు నుంచి ఆ అల్లాహ్ మీద చేసుకున్న బాకీని నీవు తీర్చవమ్మా అన్నారు.

కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, మన పెద్దలు ఎవరైనా మొక్కుబడి చేసుకున్నారు, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆ తర్వాత మొక్కుబడి చెల్లించకుండానే వాళ్ళు మరణించారంటే, వాళ్ళ వారసులమైన మనము వాళ్ళ తరఫు నుంచి మొక్కుబడులను తప్పనిసరిగా చెల్లించాలి.

అలాగే అభిమాన సోదరులారా, చివరి యొక్క ముఖ్యమైన నియమం ఏమిటంటే, మొక్కుబడి ఒక ఆరాధన అని నేను ముందుగానే ప్రారంభంలోనే తెలియజేశాను కాబట్టి, ఈ మొక్కుబడి కేవలం అల్లాహ్ దగ్గర మాత్రమే చేసుకోవాలి. అల్లాహ్ తప్ప ఇతరుల ఎవరి వద్ద కూడా మొక్కుబడి చేసుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేశాడు, అదేమిటంటే

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ
(వఖజా రబ్బుక అల్లా తఅబుదూ ఇల్లా ఇయ్యాహు)
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు, మీరు ఆయనను తప్ప మరెవరికీని ఆరాధించకూడదు.

అల్లాహ్‌కు తప్ప ఎవరినీ ఆరాధించకూడదు అని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు. అలాగే మరోచోట

وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا
(వఅబుదుల్లాహ వలా తుష్రికూ బిహీ షైఅన్)
అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి అని ఆదేశించి ఉన్నాడు.

ఇక మొక్కుబడి ఒక ఆరాధన కదండీ? ఇది అల్లాహ్ దగ్గర కాకుండా ఒక దర్గా దగ్గరనో లేదా ఒక చెట్టు దగ్గరనో లేదా ఒక పుట్ట దగ్గరనో ఎవరైనా మొక్కుబడి చేసుకుంటున్నాడు అంటే అతను అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పిస్తున్నాడు. కాబట్టి మొక్కుబడులు చెట్ల దగ్గర, పుట్టల దగ్గర, సమాధుల దగ్గర చేసుకోకూడదు, కేవలం అల్లాహ్ వద్ద మాత్రమే చేసుకోవాలి.

ఇక చివరిగా ఒక విషయాన్ని తెలిపి ఇన్షా అల్లాహ్ నా మాటను ముగిస్తున్నాను, అదేమిటంటే మొక్కుబడి చేసుకుంటే అభిమాన సోదరులారా, మొక్కుబడి అల్లాహ్ రాసిన రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ఇది మనం గమనించాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే మొక్కుబడి చేసుకుంటే ప్రాణాపాయం తప్పిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది, లేదా ఇంకేదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మొక్కుబడి ఒక ఆరాధన, ధర్మ సమ్మితమైన విషయాల పైన ఆ మొక్కుబడి చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా మొక్కుబడి చెల్లించాలి, ఇవన్నీ ఆదేశాలు ఉన్నాయి, కానీ ఒక భక్తుడు గమనించాల్సిన, తెలుసుకోవలసిన, విశ్వసించవలసిన విషయం ఏమిటంటే మొక్కుబడి అల్లాహ్ రాసిన వ్రాతను ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

فَإِنَّ النَّذْرَ لَا يَرُدُّ مِنْ قَدَرِ اللَّهِ شَيْئًا
(ఫఇన్నన్నజర లా యరుద్దు మిన్ ఖదిరిల్లాహి షైఆ)
అల్లాహ్ రాసేసిన విధి వ్రాతను మొక్కుబడి ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రకమైన అయిష్టాన్ని కూడా ఒక సందర్భంలో తెలియజేశారు. ఏమన్నారంటే

وَإِنَّمَا يُسْتَخْرَجُ بِالنَّذْرِ مِنَ الْبَخِيلِ
(వఇన్నమా యుస్తఖ్రజు బిన్నజ్రి మినల్ బఖీల్)

పిసినారులు ఉంటారు కదండీ, దైవ మార్గంలో ఖర్చు చేయాలంటే వాళ్ళు వాళ్ళ చేతులు లేయవు. పిసినారులు ఉంటారు కదండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు “పిసినారుల జోబులో నుంచి డబ్బు బయటికి తీయించడానికి ఒక మార్గము ఈ మొక్కుబడి” అన్నారు. అల్లాహు అక్బర్.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తుడు విశ్వసించవలసిన విషయం ఏమిటంటే, మొక్కుబడి విధివ్రాతను మార్చలేదు. పిసినారుల జబ్బు నుంచి కొంత డబ్బు దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి ఒక మార్గము మాత్రమే.

అభిమాన సోదరులారా, మరొక దురభిప్రాయం మన సమాజంలో ఎలా ఉందంటే, మొక్కుబడిని సరైన రీతిలో చేసుకోరు, ఒక వ్యాపారం లాగా చేస్తారు. ఎలాగంటే, ఫలానా నా పని జరిగితే నేను ఫలానా కార్యాన్ని చేస్తాను. ఫలానా నా కోరిక తీరితే నేను ఇన్ని రకాతుల నమాజు చదువుతాను, లేదంటే ఇన్ని ఉపవాసాలు ఉంటాను, లేదంటే ఒక జంతువుని జబా చేసి సదఖా చేస్తాను, ఈ విధంగా షరతు పెట్టేస్తారంట మాట. ఆ షరతు పూర్తి అయితేనే ఆ పని చేస్తారు లేదంటే ఆ పని చేయరు. ఇది సరైన విధానం కాదు. ఇది అల్లాహ్‌తో ఒక రకమైన వ్యాపారం ఆడుతున్నట్టు. అంటే ఆ పని చేయకపోతే నీవు నమాజులు చదవవా? ఆ పని పూర్తి కాకపోతే నీవు ఉపవాసాలు ఉండవా? ఆ పని పూర్తి కాకపోతే నువ్వు ఖుర్బానీలు చేయవా? అంటే అల్లాహ్‌తో నువ్వు షరతు పెడుతున్నావు, అంటే ముందు అల్లాహ్ నీ పని చేయాలి, తర్వాత నీవు అల్లాహ్ పని చేస్తావు. ఇది సరైన విషయం కాదు అభిమాన సోదరులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన కార్యాలను పూర్తి చేస్తున్నప్పుడు మనం సంతోషంగా అల్లాహ్ నువ్వు నా ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నావు కాబట్టి నేను సంతోషంగా నీకు కృతజ్ఞత తెలుపుతూ మొక్కుబడి చేసుకుంటున్నాను, నేను ఈ విధంగా ఈ పని చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని వెంటనే ఆ పని అమలు పరచాలి. అది సరైన విధానము.

కాబట్టి చివరిలో నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, ఇప్పటివరకు మొక్కుబడి గురించి మనం ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలుసుకున్న నియమాలను సరిగా అర్థం చేసుకుని, దైవ మార్గంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాల ప్రకారము నడుచుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

వఖూలు హౌలి హాజా అస్తగఫిరుల్లాహ లీ వలకుం వలిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్రహీం.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=17005

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7