సంతాన శిక్షణ – పార్ట్ 03 [వీడియో]

బిస్మిల్లాహ్

[1:03:42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

పుస్తకం & ముందు పాఠాలు
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి
https://teluguislam.net/?p=1697

7. సద్వర్తన నేర్పుట

పిల్లలకు అనుభవాలు తక్కువ ఉంటాయి గనక ఉపదేశ అవసరం ఎక్కువ ఉంటుంది. మంచి బోధన, శిక్షణకై ఎవరు ముందడుగు వేస్తారో వారే హృదయం మరియు మదిలో స్థానం పొందుతారు. అందుకే పిల్లల శిక్షణ విషయంలో ప్రవక్త ముందుగా చర్య తీసుకొని వారికి ఉత్తమ నడవడిక, మంచి సభ్యత సంస్కారాలు నేర్పేవారు.

ఉదాహరణకు: హసన్ బిన్ అలీ చిన్నగా ఉన్నప్పుడే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా బోధచేశారు: “నిన్ను సందేహంలో పడవేసేదాన్ని వదలి సందేహం లేని దాన్ని ఎన్నుకో, సత్యంలో తృప్తి, నెమ్మది ఉంది. మరియు అబద్ధంలో అనుమానం”. (తిర్మిజి. అల్బానీ దీనిని సహీ అని చెప్పారు). హసన్ (రదియల్లాహు అన్హు) దానిని మంచిగా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఎందుకనగా తన చిన్నతనంలోనే అది తన మదిలో నాటుకుంది.

అలాగే ఇబ్ను ఉమర్ చిన్నతనంలోనే ఈ పలుకులు ప్రవక్త నోట విన్నారు: “నీవు ప్రపంచంలో విదేశీయుడు లేదా ప్రయాణీకుని మాదిరిగా ఉండు (జీవించు).” (బుఖారి).

ఉమర్ బిన్ అబీ సలమ అనే బాలుడు భోజనం చేస్తున్నప్పుడు పళ్ళంలో అతన చేయి తిరుగుతున్నది చూసి “ఓ బాలుడా! అల్లాహ్ నామంతో (భోజనం ఆరంభించు), కుడి చేత్తో తిను మరియు పళ్ళంలో నీ దగ్గర ఉన్నదే తిను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలికారు. (బుఖారి, ముస్లిం).

చాలా బాధకరమైన విషయమేమంటే? కొందరు తల్లిదండ్రులు తమ సంతానానికి ఉత్తమ నడవడిక మరియు శిక్షణ అసలే బోధించరు. వారిద్దరు తమ కొడుకును అతని స్నేహితులతో కఠినంగా, కర్కశంగా ప్రవర్తిస్తూ చూస్తారు అయినా ఏమీ చెప్పరు. లేదా అతడ్ని ఒంటరిగా, దూరదూరంగా ఉండటం చూస్తారు కాని ఏమీ బోధించరు. ఇంకా ఇలాంటి ప్రవర్తనలు ఎన్నో ఉంటాయి, వాటికి సంబంధించిన సరియైన సూచనలు, చికిత్స చాలా అవసరం.

8. సద్వర్తనులకు బహుమానం

పిల్లలు ఉత్తమ సభ్యత, సంస్కార బోధన చేయబడి, దానికి అనుగుణంగా సద్వర్తన పాటించి, మంచి నడవడిక అవలంభించినప్పుడు మరింత ప్రోత్సహించి, ఏదైనా ప్రతిఫలం తప్పక ఇవ్వాలి. అది కనీసం వారిని ప్రశంసించడం, వారి కొరకు మంచి దుఆ ఇవ్వడం అయినా సరే.

బుఖారి, ముస్లింలో ఉంది: ఇబ్ను అబ్బాస్  తన చిన్నతనంలో ఓసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద రాత్రి గడిపిన సంఘటన ఇలా తెలిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరుగుదొడ్డికి వెళ్ళారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వుజూ చేసుకోవటం కోసం నేను నీళ్ళు పెట్టాను. ప్రవక్త (మరుగుదొడ్డి నుండి బైటికి వచ్చి) ఈ నీళ్ళు ఎవరు పెట్టారు? అని అడిగారు. పెట్టినవారి గురించి ఆయనకు తెలిసిన వెంటనే “అల్లాహ్! ఇతనికి ధర్మ అవగాహన మరియు ఖుర్ఆన్ వ్యాఖ్యానజ్ఞానం ప్రసాదించు” అని దీవించారు. ఈ బాలుడు చేసిన ఓ మంచితనానికి ప్రతిఫలంగా, అతను పాటించిన సద్వర్తనకు బదులుగా ఈ గొప్ప దుఆ లభించింది.

అలాగే జఅ’ఫర్ బిన్ అబీ తాలిబ్ లో ఉన్న ఉత్తమ నడవడికను గురించి ప్రశంసిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి ఇలా అన్నారు: “రూపంలో మరియు నైతిక స్వభావంలో నీవు నాకు పోలి ఉన్నావు“. (బుఖారి).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), యువకుడైన ముఆజ్ బిన్ జబల్ లో, (ప్రవక్త) సంప్రదాయాల పట్ల అధిక శ్రద్ధ చూపడం, ఎక్కువగా ఆయన సమక్షంలో కూర్చుండటం లాంటి ఉత్తమ పద్ధతి చూసి అతడ్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారు: “ముఆజ్! నేను అల్లాహ్ కొరకై నిన్ను ప్రేమిస్తున్నాను“. (నిసాయి. అల్బానీ దీనిని సహీ అని చెప్పారు). ప్రవక్తగారి ఈ ప్రోత్సాహం వల్ల మఆజ్ పై ఎంత గొప్ప ప్రభావం పడి ఉంటుంది?.

మనలో అనేకులు తమ కొడుకులను మంచి పనులు చేస్తూ, మరియు ఉత్తమ నడవడిక పాటిస్తూ చూసి, వారిని ప్రశంసించరు. అది ఓ సామాన్య విషయమే కదా అని భ్రమపడతారు. కాని అవే మంచితనాలు అతనిలో లేనప్పుడు చీవాట్లు పెడతారు. ఉదాహరణకు: పెద్దలను గౌరవించడం, చదువులో ముందుగా ఉండడం, నమాజులను పాబందీగా పాటించడం, సత్యం, అమానతు (అప్పగింత)లను పాటించడం లాంటివి వగైరా.

9. పిల్లల్ని ప్రేమిస్తున్నామని తెలియజేయుట

1. వారిని ప్రేమిస్తున్నట్లు వారికి తెలియజేయుట

తల్లిదండ్రుల నుండి లేదా సంరక్షకుల నుండి ప్రేమ, అప్యాయత మరియు అంగీకారం ఉన్నట్లు పిల్లలకు తెలిసియుండుట అతి ముఖ్య అవసరాల్లో లెక్కించబడుతుంది. ఈ విషయం వారికి తెలియనిచో వారిలో మానసికంగా చాలా లోటు ఏర్పడుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పిల్లల ఈ అవసరాన్ని చాలా వరకు తీర్చేవారు. సహీ బుఖారిలో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని తమ వడిలో తీసుకొని ఇలా అన్నారు: “అల్లాహ్! నేను ఇతడ్ని ప్రేమిస్తున్నాను. నీవు కూడా ఇతడ్ని ప్రేమించు మరియు ఇతడ్ని ప్రేమించేవారిని కూడా నీవు ప్రేమించు“.

ఒకసారి అఖ్ రఅ బిన్ హాబిస్ (రదియల్లాహు అన్హు) వచ్చాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ మరియు హుసైనులతో ముద్దాడుతున్నారు. ఇది చూసిన అఖ్ రఅ ‘మీరు మీ పిల్లలను ముద్దాడుతారా? నాకు పది మంది సంతానం, నేను ఎప్పుడు ఏ ఒక్కడిని ముద్దాడ లేదు’ అని అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సమాధానమిచ్చారు: “నీ హృదయంలో నుండి అల్లాహ్ కరుణను తీసి వేస్తే నేనేమైనా చేయ గలనా?“. (బుఖారి, ముస్లిం).

ప్రవక్త ఎంతటి వివేకులైన శిక్షకులో గమనించండి; అఖ్ రఅ బిన్ హాబిస్ ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యంతో ఇచ్చారు. అది దాని జవాబు కంటే ఉత్తమం మరియు సంపూర్ణంగా ఉంది. దాని సారాంశం ఏమిటంటే: చిన్నారుల పట్ల కారుణ్యభావం చూపని మరియు వారికి ప్రేమభావం తెలియజేయని వారిలో కారుణ్య గుణం లేనట్లు. చిన్నారులతో మసలుకొనేటప్పుడు ఈ కారుణ్యం కోల్పోయే వారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు. “మా చిన్నారుల పట్ల కరుణభావంతో మెలగనివారు మాలోని వారు కారు“. (అహ్మద్, అబూ దావూద్, తిర్మిజి). ప్రవక్త గారి పసిబాబు ఇబ్రాహీం ఈ లోకాన్ని వీడెటప్పుడు ఈ కారుణ్యమే ఆయన్ను కన్నీటిలో ముంచింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడు తాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచివేసింది“. (బుఖారి).

వీరిద్దరు ఈ లోకంలో నాకు రెండు పుష్పాలు” (బుఖారి). అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్, హుసైన్ ల గురించి చెప్పినప్పుడు వారు విని మానసికంగా, శిక్షణ పరంగా ఎంత సంతోషం కలిగి ఉండవచ్చురు?.

దీనికి భిన్నంగా కొందరు ఎంతటి ఓర్వలేని మనస్తత్వం మరియు శిక్షణపరంగా తప్పుడు మార్గానికి ఒడిగడతారు; సంతానం పట్ల గల ప్రేమను వారికి తెలియజేయడం, వారితో ఉండే వాత్సల్యాన్ని వెల్లడించడం మానుకుంటారు, ఏ భ్రమతో అంటే; దీనివల్ల వారు చెడిపోతారని లేదా వారిని పురుషులుగా తీర్చిదిద్దడానికి మరియు వారి జీవిత సంసిద్ధతకు సరియైన విధానం కాదు అని.

2. వారితో ఆడడం, వారి హృదయాలకు చేరువవడం

ఈ విషయంలోని శ్రద్ధ వల్లనే ఓసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లిములకు నమాజు చేయిస్తూ సజ్దా నుండి చాలా ఆలస్యంగా లేశారు. ఎందుకో తెలుసా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో ఉన్నప్పుడు ఒక పసిబాలుడు అంటే హసన్ బిన్ అలీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వీపుపై కూర్చున్నాడు. ఈ సందర్భంలో ప్రవక్త ఆ బాలుని సంతోషంలో అడ్డు కలిగించదలచలేదు. (అందుకే చాలా దీర్ఘంగా సజ్దా చేశారు). నమాజు ముగించిన తర్వాత తమ సహచరులతో ఇలా చెప్పారుః “(నేను దీర్ఘమైన సజ్దా ఎందుకు చేశానంటే) నా కొడుకు నాపై కూర్చున్నాడు అతని కోరిక తీరక ముందే లేవడం నాకు ఇష్టం లేకపోయింది“. (అహ్మద్, నిసాయి).

ఒక ప్రశ్న: ఇలాంటి సంఘటన ఈ రోజుల్లో మన మస్జిదుల్లోని ఏ ఒక్క ఇమాముతోనైనా జరిగితే ఎలా ఉంటుంది? పసిబాలుని పట్ల ప్రవక్త శ్రద్ధ చూపుతూ దీర్ఘంగా సజ్దా చేసినట్లు అతను గనక చేస్తే మన ముక్తదీలు ఎలా ప్రవర్తిస్తారు?.

ఇది పిల్లలతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పరిస్థితి. నమాజులో ఉండి పిల్లల పట్ల ఇంత శ్రద్ధ చూపేవారు, వేరే సందర్భాల్లో పిల్లలతో హాస్యమాడే వారు, ఆటలాడే వారంటే ఏమిటాశ్చర్యం?. “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అబ్బాయితో ఆడుతూ తమ నాలుక బైటికి తీశారు. దాని ఎర్రపు భాగాన్ని ఆ అబ్బాయి చూశాడు“. (ఇబ్ను హిబ్బాన్).

ఒక్కోసారి పిల్లల్లో కొందరితో ఇలా చెప్పేవారుః “ఎవరు నా వైపు ముందుగా పరుగెత్తుకు వస్తారో వారికి ఇదిస్తాను“. (అహ్మద్). ఇలా పిల్లలతో ఆటలాడుతూ ఉండడంలో శిక్షణపరంగా మంచి ప్రభావం ఉంటుంది. ఎవరు వారితో పరిహాసాలాడుతూ, ప్రేమ పూర్వకంగా ఉంటారో వారి పట్ల పిల్లలు ఎక్కువ దగ్గర అవుతారు. వారి మాట విన్నంత మరెవరి మాట వినరు.


%d bloggers like this: