విధివ్రాత ప్రకరణం – మహాప్రవక్త ﷺ మహితోక్తులు

బిస్మిల్లాహ్

విధి వ్రాత ప్రకరణం [PDF]
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan)

1వ అధ్యాయం – మాతృగర్భంలో మానవ నిర్మాణ స్థితి, అతని ఉపాధి, వయస్సు, కర్మలు మొదలగునవి

1695. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కథనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సత్యమూర్తి. ఇది తిరుగులేని సత్యం. ఆయన ఇలా ప్రవచించారు :

“మిలో ప్రతి వ్యక్తి మాతృ గర్భంలో ఈ విధంగా రూపొందుతాడు : మొదట నలభై రోజుల దాకా (వీర్యబిందువు రూపంలో) ఉంటాడు. తరువాత అన్ని రోజులే ద్రవరక్తం రూపంలో ఉంటాడు. ఆ తరువాత అన్నే రోజులు మాంసపు ముద్ద (పిండం) రూపంలో ఉంటాడు. ఆ తరువాత అల్లాహ్ ఒక దైవదూతను నాలుగు ఆజ్ఞలు ఇచ్చి పంపుతాడు – అతని కర్మలు, ఉపాధి, ఆయుషును గురించి వ్రాయమని ఆదేశిస్తాడు. అతను దౌర్భాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా అనే విషయాన్ని కూడా వ్రాయమని ఆదేశిస్తాడు. ఆ తరువాత అతనిలో ప్రాణం పోయబడుతుంది. పోతే మీలో ఒక వ్యక్తి (సత్) కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా చివరికి (ఆ సత్కర్మల కారణంగా) అతనికి, స్వర్గానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. ఆ తరువాత అతని జాతకం మారిపోయి అతను నరకవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్పర్యవసానంగా అతను నరకం పాలవుతాడు). అదే విధంగా మరొకడు (దుష్) కర్మలు చేస్తూ ఉంటాడు. అలా చివరికి (ఆ దుష్కర్మల కారణంగా) అతనికి, నరకానికి మధ్య ఒక గజం మాత్రమే ఎడం ఉండిపోతుంది. అంతలో అతని జాతకం మారిపోయి అతను స్వర్గవాసులు చేసే పనులు చేసేస్తాడు (తత్ఫలితంగా అతను స్వర్గానికి వెళ్తాడు).”

(సహీహ్ బుఖారీ:- 59వ ప్రకరణం – బ యిల్ ఖల్స్, 6వ అధ్యాయం – జి ల్ మలాయికా)

1696. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :- “అల్లాహ్ మాతృగర్భం దగ్గర ఒక దైవదూతను నియమిస్తాడు. ఆ దైవదూత “ప్రభూ! ఇప్పుడు వీర్య బిందువు ….. ప్రభూ! ఇప్పుడు ద్రవరక్తం ….. ప్రభూ! ఇప్పుడు మాంసపు ముద్ద (పిండం)” అని అంటాడు. ఆ తరువాత దేవుడు ఆ పిండాన్ని (మానవుడిగా) సృష్టించడానికి పూనుకుంటాడు. అప్పుడు ఆ దైవదూత “ఇతను బాలుడా, లేక బాలికా? ఇతను దౌర్బాగ్యుడవుతాడా లేక సౌభాగ్యుడవుతాడా? ఇతని ఉపాధి ఎంత? ఇతని ఆయుషు ఎంత?” అని అడుగుతాడు. ఈ విషయాలన్నీ మాతృగర్భంలో ఉండగానే వ్రాయబడతాయి.

(సహీహ్ బుఖారీ:- 6వ ప్రకరణం – అల్ హైజ్, 17వ అధ్యాయం – ముఖల్ల ఖతిన్ వ గైరి ముఖల్లఖతి)

1697. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం :- మేమొక జనాజా (శవం) వెంట ‘బఖీ’ శ్మశాన వాటికకు వెళ్ళాము. . అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా వచ్చి ఓ చోట కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాము. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తల వంచుకొని బెత్తంతో నేలను గీకసాగారు. కాస్సేపటికి “మీలో ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేక నరకంలో వ్రాయబడి ఉంది. అతను సౌభాగ్యుడా లేక దౌర్బాగ్యుడా అనే విషయం ముందుగానే వ్రాయబడింది” అని అన్నారు ఆయన. ఒకతను ఈ మాట విని “దైవప్రవక్తా! అయితే మనం విధివ్రాతని భావించి కర్మలు ఆచరించకుండా ఎందుకు కూర్చోకూడదు. మనలో ఎవరైనా సౌభాగ్యుడై వుంటే అతను ఎలాగూ సత్కర్మలు ఆచరిస్తాడు, దౌర్బాగ్యుడయితే ఎలాగూ దుష్కర్మలు ఆచరిస్తాడు కదా!” అని అన్నాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)సమాధానమిస్తూ “కాని వాస్తవం ఏమిటంటే అదృష్టవంతుడికి సత్కార్యాలు చేసే సద్బుద్ధి కలుగుతుంది, దౌర్భాగ్యుడికి దుష్కార్యాలు చేసే దుర్బుద్ధి పుడ్తుంది” అని అన్నారు. ఆ తరువాత ఆయన (దివ్య ఖురాన్ లోని) ఈ సూక్తులు పఠించారు : “ధనాన్ని దానం చేసి దైవ అవిధేయతకు దూరంగా ఉంటూ, మంచిని (సత్యాన్ని) సమర్ధించే వాడికి మేము సన్మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము. (దీనికి భిన్నంగా) పిసినారితనం వహించి (దైవం పట్ల) నిర్లక్ష్య భావం ప్రదర్శిస్తూ, మంచిని (సత్యాన్ని) ధిక్కరించే వాడికి మేము కఠిన మార్గాన నడిచేందుకు సౌలభ్యం కలగజేస్తాము” (92 : 5-10).

(సహీహ్ బుఖారీ :- 23వ ప్రకరణం – జనాయిజ్, 83వ అధ్యాయం – మౌఇజతిల్ ముహద్దిసి ఇన్దల్ ఖబీ వఖువూది అహాబిహీ హౌలహు)

1698. హజ్రత్ ఇమ్రాన్ బిన్ హు సైన్ (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక వ్యక్తి లేచి “దైవప్రవక్తా! స్వర్గవాసులెవరో నరకవాసులెవరో (ముందుగానే) గుర్తించబడ్డారా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లం) ఔనన్నారు. “అలాంటప్పుడు మానవులు కర్మలు ఆచరించడం దేనికి?” అని ప్రశ్నించాడా వ్యక్తి మళ్ళీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధానమిస్తూ “ప్రతి మనిషీ తాను దేని కొరకు పుట్టించబడ్డాడో ఆ పనులే చేస్తాడు” అని అన్నారు. లేక “ఎలాంటి బుద్ధి ఇవ్వబడిందో అలాంటి పనులే చేస్తాడు” అని అన్నారు.*

(సహీహ్ బుఖారీ :- 82వ ప్రకరణం – ఖద్, 2వ అధ్యాయం – జప్ఫల్ ఖలము అలా ఇల్మిల్లాహ్)

*ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుంటే అతని అదృష్టంలో స్వర్గం రాసి ఉందని భావించవచ్చు. అలాగే మరొక వ్యక్తి చెడ్డ పనులు చేస్తుంటే అతని అదృష్టంలో నరకం రాసి ఉందని అనుకోవచ్చు. ఈ హదీసు భావం ఇదే. అయితే అదృష్టం గురించిన జ్ఞానం మనకు లేదు గనక నిజంగా ఫలానా వ్యక్తి స్వర్గానికి పోతాడని, ఫలానా వ్యక్తి నరకంలో పడిపోతాడని ఖచ్చితంగా చెప్పలేము. చెప్పకూడదు కూడా. మనం ఏం చేస్తున్నామో, ఏం జరుగుతున్నదో అంతా విధి నిర్ణయమే. అయితే విధి నిర్ణయం, విధి వ్రాత ఏమిటో మనకు తెలియదు గనక మనం చేసే పనులకు మనమే బాధ్యులవుతాము.దాని ప్రకారమే మనకు పరలోక ప్రతిఫలం లభిస్తుంది. అంతేగాని, మనం కావాలని తప్పుడు పనులు చేస్తూ విధి వ్రాత అంటూ వాటి బాధ్యతను దేవునిపై నెట్టి మనం మన పాపాల దుష్పర్యవసానం నుండి బయట పడగలమని భ్రమించకూడదు. (అనువాదకుడు)

1699. హజ్రత్ సహెల్ బిన్ సాద్ సాదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు : “ఒక వ్యక్తి ప్రజల దృష్టిలో స్వర్గవాసులు చేసేటటువంటి పనులే చేస్తాడు. కాని అతను నరకవాసి అవుతాడు. అలాగే మరొకతను జనం దృష్టిలో నరకవాసులు చేసేటటువంటి పనులు చేస్తాడు. కాని అతను స్వర్గనివాసి అవుతాడు.”

(సహీహ్ బుఖారీ:- 56వ ప్రకరణం – జిహాద్, 77వ అధ్యాయం – లా యుఖాలు ఫులానన్ షహీద్)

2వ అధ్యాయం – హజ్రత్ ఆదం, హజ్రత్ మూసా (అలైహి)ల మధ్య సంభాషణ

1700. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్బోధించారు : (ఓసారి) హజ్రత్ ఆదం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) మాట్లాడుతూ “ఆదం గారూ! మీరు మా పితామహులు. కాని వారు మమ్మల్ని దౌర్భాగ్యులుగా చేశారు. మమ్మల్ని స్వర్గం నుంచి తీసివేయించారు” అని ఆరోపించారు. దానికి హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) సమాధానమిస్తూ “మూసా! అల్లాహ్ నీకు తనతో ప్రత్యక్ష సంభాషణా భాగ్యం కలిగించాడు. పైగా ఆయన నీకు తన స్వహస్తాలతో (తౌరాత్ పలకలను) రాసిచ్చాడు. (అంతటి హోదా పొంది కూడా) నీవు, నా పుట్టుకకు నలభై ఏళ్ళు పూర్వమే నా అదృష్టంలో రాసిన విషయాల్ని గురించి నన్ను నిందిస్తున్నావా?” అని అన్నారు.

ఈ మాట ఆధారంగా హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) హజ్రత్ మూసా (అలైహిస్సలాం) పై సంవాదనలో ఆధిక్యత పొందారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (ఈ మాట దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడుసార్లు అన్నారు).*

(సహీహ్ బుఖారీ:- 82వ ప్రకరణం – ఖద్, 11వ అధ్యాయం – తహాజ్ఞ ఆదము వ మూసా ఇద్దల్లాహ్)

*ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా రాస్తున్నారు: మనలో కూడా ఎవరైనా పాపం చేసినవాడు హజ్రత్ ఆదం (అలైహిస్సలాం)లా సమాధానమిచ్చి నింద, శిక్షల నుండి విముక్తి పొందగలడా? అన్న ప్రశ్న ఉదయిస్తుందిక్కడ. దానికి సమాధానం ఇది – లేదు. విముక్తి పొందలేడు. ఎందుకంటే అంతనింకా ఇహలోకంలోనే ఉన్నాడు. ఇహలోకం ఆచరణా స్థలం. ఇక్కడ ఆచరణకు ఎగనామం పెట్టి మాటల గారడితో మోక్షం పొందడం కుదరదు. హజ్రత్ ఆదం (అలైహిస్సలాం) క్రియా ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తరువాత ఇలా సమాధానమిచ్చారు. అదీగాక అల్లాహ్ ఆయన తప్పును క్షమించాడు. అందువల్ల ఆయన పై ఇక ఎలాంటి నిందను మోపలేము. (అనువాదకుడు)

5వ అధ్యాయం – ఆదం పుత్రుని నొసట వ్యభిచార భాగం కొదో గొప్పో లిఖించబడింది

1701. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేశారు :-

అల్లాహ్ ఆదం పుత్రుడి అదృష్టంలో వ్యభిచార భాగం (కొద్దీ గొప్పో) లిఖించాడు. అది అతనికి ఎలాగూ లభిస్తుంది. అందుచేత (పర స్త్రీని కామదృష్టితో చూడటం) కళ్ళ వ్యభిచారం, (పర స్త్రీతో అశ్లీల మాటలు పలకడం) నోటి వ్యభిచారం. మానవుని మనస్సు (అశ్లీల చేష్టలను) కోరుతుంది. (ఇది భావ పరమైన వ్యభిచారం). అయితే అతని మర్మాంగం ఆ కోరికకు కార్యరూపం ఇవ్వటమో లేక ధిక్కరించటమో చేస్తుంది.”

(సహీహ్ బుఖారీ:- 79వ ప్రకరణం – ఇస్తియిజాన్, 12వ అధ్యాయం – జినల్ జవారి హిదూనల్ ఫర్జ్)

6వ అధ్యాయం – ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు

1702. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఇలా అన్నారు :- “ప్రతి పిల్లవాడు (ఏ మతస్థుడైనా) ప్రకృతి ధర్మంపై (అంటే ఇస్లాం ధర్మం పై) పుడతాడు. కాని ఆ తరువాత అతని తల్లిదండ్రులు అతడ్ని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేదా మజూసీ (అగ్ని పూజారి)గానో మారుస్తారు, జంతువుల్ని మార్చినట్లు. జంతువులు పుట్టేటప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి. (ఆ తరువాత ఈ మానవులు వాటి చెవులనో, కొమ్ములనో కోసి పారేస్తారు) ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా? “

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈ క్రింది ( ఖుర్ఆన్) సూక్తిని పఠించేవారు.

అల్లాహ్ మానవులను ఏ ప్రకృతి ధర్మంపై పుట్టించాడో అది మార్చనలవి కానిది. ఇదే సవ్యమైన, స్థిరమైన ధర్మమార్గం”. (30:30)

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం • జనాయిజ్, 8వ అధ్యాయం – ఇజా అస్లమస్సబియ్యు ఫమాత హల్ యుసల్లా అలైహి)

1703. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- బహుదైవారాధకుల యుక్త వయస్సుకురాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ప్రశ్నించటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “వారు పెరిగి పెద్ద వాళ్ళయిన తరువాత ఎలాంటి కర్మలు ఆచరిస్తారో దేవునికే తెలుసు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 93వ అధ్యాయం – మాఖీల ఫీ ఔలాదిల్ ముఫ్రికీన్)

1704.హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం :- బహుదైవారాధకుల యుక్త వయస్సుకు రాని పిల్లలను గురించి (వారు స్వర్గానికి పోతారా లేక నరకానికి పోతారా అని) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడగటం జరిగింది. దానికి ఆయన సమాధానమిస్తూ “ఆ పిల్లలను దేవుడు పుట్టించాడు గనక వారు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఏం చేస్తారో దేవునికి మాత్రమే తెలుసు” అని అన్నారు.

(సహీహ్ బుఖారీ:- 23వ ప్రకరణం – జనాయిజ్, 93వ అధ్యాయం – మాఖీల ఫీ ఔలాదిల్ ముషైకీన్)

విధి వ్రాత ప్రకరణం – అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు) [PDF ]

%d bloggers like this: