
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 27, 2వ ప్రశ్న
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
సూరా అల్ మూ ‘మినూన్
23:1 قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. [1]
23:2 الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. [2]
23:3 وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు [3]
23:4 وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు. [4]
23:5 وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.
23:6 إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు.
23:7 فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు. [5]
23:8 وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. [6]
23:9 وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. [7]
23:10 أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
ఇలాంటి వారే వారసులు.
23:11 الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
(స్వర్గంలోని) ఫిర్‌దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. [8]
[1] “ఫలాహ్” అంటే చీల్చటం, నరకటం, కోయటం అని అర్థం. వ్యవసాయం చేసే వానిని కూడా ఫల్లాహ్ అని అంటారు. ఎందుకంటే రైతు నేలను దుక్కి లేదా త్రవ్వి విత్తనం నాటుతాడు. బంధనాలను త్రెంచుకుంటూ, అవరోధాలను అధిగమిస్తూ పోయి తన లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తిని ముఫ్లిహున్ (విజేత)గా వ్యవహరిస్తారు.
అయితే షరీయతు పరిభాషలో విజేత ఎవరంటే అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేసేవాడు. తద్వారా అతను పరలోకంలో తన నిజప్రభువు క్షమాభిక్షకు అర్హుడుగా ఖరారు చేయబడతాడు. దాంతోపాటు ప్రాపంచిక అనుగ్రహాలు కూడా అతనికి లభిస్తే ఇక చెప్పాల్సిందేముందీ!? సుబ్‌హానల్లాహ్! అయితే సిసలైన సాఫల్యం మాత్రం పరలోక సాఫల్యమే. కాని ప్రజలు ప్రాపంచిక జీవితంలో ఆస్తి పాస్తులు, అధికారాలు, పదవులు లభించిన వారినే భాగ్యవంతులుగా, విజేతలుగా భావిస్తుంటారు. సిసలైన విజేతలు ఎవరో, వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పటం జరిగింది. ఉదాహరణకు తరువాతి ఆయతులో చూడండి.
[2] “ఖాషివూన్” (خَاشِعُونَ) అని అనబడింది. “ఖుషూ‘ అంటే మానసిక ఏకాగ్రత, మనసును లగ్నం చేయటం, భక్తిభావంతో అణగారి పోవటం అని అర్థం. నమాజులో ఏకాగ్రత పొందటమంటే ఆలోచనలను ఇతరత్రా వ్యాపకాలపైకి పోనివ్వకుండా ఉంచాలి. మనసులో దేవుని ఔన్నత్యం, భయం పాదుకునేలా చేయాలి. అశ్రద్ధ, పరధ్యానం, చిరాకువంటి వాటిని దరికి చేరనివ్వరాదు. నమాజులో అటూ ఇటూ చూడటం, కదలటం, మాటిమాటికీ జుత్తును, దుస్తులను సరిచూసుకోవటం లాంటి వన్నీ అణకువకు విరుద్ధమైనవి. ఒక సాధారణ వ్యక్తి రాజ్యాధికారి సమక్షంలోకి వెళ్ళి నప్పుడు ఎంతో వినమ్రుడై నిలబడతాడు. అలాంటిది సర్వలోక ప్రభువు సమక్షంలో ప్రార్ధనకు నిలబడినపుడు ఇంకెంత వినయం, మరెంత వినమ్రత ఉట్టిపడాలో ఆలోచించండి!?
[3] “లఘ్‌వున్‘ అంటే నిరర్ధకమైన పనులు, పనికిరాని మాటలు, వ్యర్థ విషయాలు అని అర్థం. లేదా ప్రాపంచికంగాగానీ, ధార్మికంగాగానీ నష్టం చేకూర్చే విషయాలు అని భావం. వాటిని పట్టించుకోకపోవటం అంటే వాటికి పాల్పడకపోవటం అటుంచి కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పైగా అలాంటి వాటికి ఆమడ దూరాన ఉండాలి.
[4] అంటే అల్లాహ్ విధిగా చేసిన జకాత్‌ను చెల్లిస్తారని భావం. (జకాత్‌కి సంబంధించిన పరిమాణం, నిష్పత్తి తదితర తప్ప్సీళ్లు – మదీనాలో అవతరించినప్పటికీ మౌలిక ఆదేశం మాత్రం మక్కాలోనే అవతరించినదని పండితులు అంటున్నారు). ఆత్మ శుద్ధికి దోహదపడే, నడవడికను తీర్చిదిద్దే పనులను చేయాలన్నది ఈ ఆయతు భావమని మరి కొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు.
[5] దీనిప్రకారం ఇస్లాంలో ‘ముత్‌ఆ‘ పద్ధతికి ఇప్పుడు ఏమాత్రం అనుమతి లేదని విదితమవుతోంది. లైంగిక వాంఛల పరిపూర్తికి ధర్మసమ్మతమైన పద్ధతులు రెండే రెండున్నాయి. 1. ఇల్లాలితో సమాగమం జరపటం. 2. యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాలితో సంభోగించటం. అయితే ప్రస్తుతం అలాంటి బానిసరాళ్ల ఉనికి ఎక్కడా లేదు. 14 వందల సంవత్సరాల క్రితం జరిగిన ధర్మయుద్దాల వంటివి జరిగే పరిస్థితి గనక ఏర్పడి, తద్వారా షరీయతు బద్ధంగా స్త్రీలు యాజమాన్యంలోకి వస్తే అట్టి పరిస్థితిలో అలాంటి బానిసరాళ్లతో సమాగమం జరపటం ధర్మసమ్మతం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో “నికాహ్” ద్వారా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీతో తప్ప మరొకరితో లైంగిక కోర్కె తీర్చుకోవటం నిషిద్ధం (హరామ్).
[6] అరబీలో ‘“అమానాత్‘ అంటే అప్పగించబడిన బాధ్యతలను సజావుగా నిర్వర్తించటం, ఇతరులకు చెల్లించవలసిన పైకాన్ని యధాతథంగా చెల్లించటం, రహస్య విషయాలను రహస్యంగానే ఉంచటం, అల్లాహ్‌తో చేసిన బాసలకు కట్టుబడి ఉండటం, ఎవరి సొమ్ములను వారికి ఇవ్వటం – ఇవన్నీ అమానతులుగా పరిగణించబడతాయి.
[7] ఆఖరిలో మళ్లీ ‘నమాజుల పరిరక్షణను సాఫల్యానికి సోపానంగా అభివర్ణించటం గమనార్హం. నమాజుల ప్రస్తావనతో మొదలైన విశ్వాసుల సుగుణాలు (ఆయత్ నెం. 2) నమాజుల ప్రస్తావనతోనే (ఆయత్ నెం.9) ముగియటాన్ని బట్టీ అల్లాహ్ దృష్టిలో నమాజుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అవగతమవుతోంది. అయితే నేటి ముస్లిములు ఇతరత్రా సదాచరణలను విస్మరించినట్లే నమాజును కూడా విస్మరిస్తున్నారు. ఒకవేళ నమాజులు చేసినా లాంఛనప్రాయంగా చేస్తున్నారు. నమాజులలో ఏ అణకువ, మరే భక్తీ పారవశ్యం ఉండాలో అవి ఉండటం లేదు.
[8] పై ఆయతులలో ప్రస్తావించబడిన సుగుణాలు కల విశ్వాసులు మాత్రమే స్వర్గానికి వారసులవుతారు. అదీ దేనికి?! స్వర్గంలోని అత్యున్నత ప్రదేశమైన జన్నతుల్ ఫిర్‌దౌస్‌కి! స్వర్గంలోని సెలయేళ్లు ఆ స్ధలం నుంచే వెలువడతాయి (సహీహ్ బుఖారీ – కితాబుల్ జిహాద్, కితాబుత్ తౌహీద్).
[అయతులు మరియు వ్యాఖ్యానం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది.]
You must be logged in to post a comment.