నమాజు నిధులు – పార్ట్ 06: నమాజు కొరకు నిరీక్షిస్తూ ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

నమాజు నిధులు – పార్ట్ 06:
నమాజు కొరకు నిరీక్షిస్తూ ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట
https://www.youtube.com/watch?v=zOIoPfaxrT8 [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

ఈ ప్రసంగంలో, నమాజు కొరకు అజాన్ మరియు ఇకామత్ మధ్య నిరీక్షించే సమయం యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సద్వినియోగం చేసుకునే మార్గాల గురించి వివరించబడింది. ఈ కొద్ది సమయంలో కూడా అధిక పుణ్యాలు సంపాదించవచ్చని వక్త ఉద్బోధించారు. సున్నత్ నమాజులు చేయడం, ఖుర్ఆన్ పఠించడం, దుఆ చేయడం మరియు అల్లాహ్ యొక్క స్మరణ (ధిక్ర్) చేయడం అనే నాలుగు ముఖ్యమైన పనులను సూచించారు. ముఖ్యంగా, ఖుర్ఆన్ పఠనం యొక్క ఘనతను వివరిస్తూ, ఒక్క అక్షరం చదివినా పది పుణ్యాలు లభిస్తాయని హదీసును ఉదహరించారు. సూరతుల్ ఇఖ్లాస్ (ఖుర్ఆన్‌లోని మూడో వంతుకు సమానం), సూరత్ అల్-కాఫిరూన్ (నాలుగో వంతుకు సమానం) మరియు సూరతుల్ ముల్క్ (సమాధి శిక్ష నుండి రక్షణ) వంటి సూరాల ప్రత్యేక ఘనతలను తెలిపారు. అలాగే, ‘సుబ్ హానల్లాహ్’, ‘అల్ హందులిల్లాహ్’ మరియు ‘అస్తగ్ఫిరుల్లాహ్’ వంటి ధిక్ర్ల యొక్క అపారమైన పుణ్యాల గురించి వివరించి, ఈ పవిత్ర సమయాన్ని వ్యర్థం చేయకుండా పుణ్యాలు సంపాదించుకోవాలని ప్రోత్సహించారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.

సోదర మహాశయులారా! కేవలం 20 నిమిషాల మన ఈ దర్సె హదీస్ క్లాస్, ఇందులో మనం నమాజు నిధులు అనే చాలా ముఖ్యమైన అంశం అంటే నమాజుకు సంబంధించిన హదీసులను తెలుసుకుంటూ ఉన్నాము. సోదర మహాశయులారా! ఒకవేళ మీకు గుర్తు ఉండి ఉంటే, మనం ఇంతకుముందు ఐదవ మన ఈ పాఠంలో ఏ విషయాలైతే తెలుసుకున్నామో, ఆ విషయాల తర్వాత ఇప్పుడు,

నమాజు కొరకు నిరీక్షించే ఘనత ఏముంది హదీసుల్లో, చాలా మంచి హదీసులు తెలుసుకొని ఉన్నాము. అయితే ఈ నిరీక్షించే సమయం ఏదైతే ఉందో, ఇకామత్ అయ్యే వరకు మనం మస్జిద్ లో ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షించే ఘనత అయితే తెలుసుకున్నాము. కానీ ఆ నిరీక్షించే సమయాన్ని మనం ఎలా గడపాలి? అందులో మనం ఎలాంటి పుణ్యాలు పొందగలుగుతాము?

అయితే సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల, అవి కొన్ని క్షణాలే కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఐదు నిమిషాలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో పది నిమిషాలు కావచ్చు, కొన్ని సమయాల్లో, సందర్భాల్లో ఐదు నిమిషాల కంటే తక్కువ కావచ్చు. కానీ ఆ తక్కువ సమయంలో కూడా మీరు అధికాను అధిక పుణ్యాలు పొందగలగాలి. ఇదే నా యొక్క కోరిక. అల్లాహ్ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎంత ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవడంలో గడుపుతామో, అది మనకు ఇహలోకంలో కూడా ఎంతో మేలును కలుగజేస్తుంది. పరలోకంలోనైతే మనం ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉన్నాము. మనిషికి ఒక్కొక్క పుణ్యం అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో ఆ మనిషి బంధువులను అడిగినా గాని, స్నేహితులను అడిగినా గాని, ఎక్కడా ఏ పుణ్యం దొరకదు. చివరికి అతడు ఈ పూర్తి ప్రపంచాన్ని ఒకవేళ అల్లాహ్ అతనికి ఇచ్చి ఉండేది ఉంటే, దానిని అతను అక్కడ అల్లాహ్ కు ఇచ్చేసి, దానికి బదులుగా ఏదైనా నరకం నుండి రక్షణ పొందాలనుకుంటే, అది కూడా సాధ్యపడదు. అందుకొరకు ఇహలోకంలో ఇలాంటి అవకాశాలను మనం సద్వినియోగించుకొని పుణ్యాలు అధికంగా సంపాదించాలి.

అయితే ఈ నిరీక్షించే సమయంలో మనం ఏం పుణ్యాలు సంపాదించగలుగుతాము? అల్లాహ్ త’ఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక! ఈ రోజుల్లో మన సమాజంలో ఉన్న పరిస్థితిని మనం ఏం చూస్తున్నాము? ఈ నిరీక్షించే సమయంలో కూడా, మస్జిద్ లో ఉండి కూడా కొందరు పరస్పరం ప్రపంచ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కొందరు పరస్పరం ఏదో ఒక విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఎప్పుడైనా ఒక సందర్భంలో పర్వాలేదు, దీనిని మనం అవసరం ఉండి మాట్లాడుకోవడం తప్పుగా, పాపంగా భావించడం సరైన విషయం కూడా కాదు. కానీ మనం కొందరిని చూస్తాము, ప్రతి నమాజులో అజాన్, ఇకామత్ మధ్యలో నిరీక్షిస్తూ ఉన్న ఆ సమయంలో వారు పరస్పరం మాట్లాడుకోవడం లేదా వేరే ఆలోచనల్లో పడి ఉండడం లేదా మౌనంగా ఉండడం ఒక అలవాటుగా అయిపోయింది. ఇది చాలా నష్టకరం సోదరులారా! ఇది చాలా నష్టకరం. అయితే ఈ మధ్యలో మనం ఏం చేయగలుగుతాము?

పుణ్యాలు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మొదటి మార్గం ఇందులో, నిరీక్షించే సమయంలో మనం సున్నత్ నమాజులు చేసుకుంటే వాటి యొక్క ఘనత చాలా ఉంది. అవి మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా, ప్రత్యేకంగా మా ఛానల్ లో సున్నత్ నమాజుల ఘనత విషయంలో వేరే రెండు ప్రత్యేక వీడియోలు ఉన్నాయి, వాటిని మీరు తప్పకుండా చూడండి అని కూడా చెప్పడం జరిగింది.

రెండో విషయం దేని ద్వారానైతే మనం ఆ నిరీక్షించే సమయంలో పుణ్యాలు పొందగలుగుతామో, అది ఖుర్ఆన్ తిలావత్. వాస్తవానికి సోదర మహాశయులారా! ఈ రోజుల్లో ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ఎన్నో మస్జిదులలో మనం చూస్తాము, కేవలం మింబర్ పై అలా తబర్రుక్ కొరకు, శుభం కొరకు ఒక ఖుర్ఆన్ పెట్టి ఉంటుంది. కానీ వచ్చే నమాజీలు చదవడానికి ఎక్కువ సంఖ్యలో ఖుర్ఆన్లు ఉండవు. అంతకంటే బాధాకరమైన విషయం, మన సమాజంలో ఉన్న మనవాళ్లు ఖుర్ఆన్ తిలావత్ చేయాలి మనం అన్నటువంటి తపన లేదు. ఎవరికైతే ఖుర్ఆన్ చదవ వస్తుందో వారికి లేదు, ఎవరికైతే చదవరాదో మనం నేర్చుకోవాలి, మనం దీని గురించి చదివే ప్రయత్నం చేయాలి అన్నటువంటి వారికి కాంక్ష కూడా మనం కనబడటం లేదు. అయితే సోదర మహాశయులారా! వాస్తవానికి ఇది చాలా బాధాకర విషయం.

ఏ ఖుర్ఆన్ అయితే మన పూర్తి జీవితాన్ని మార్చుటకు వచ్చిందో, ఏ ఖుర్ఆన్ అయితే మన జీవితాల్లో ఆనందాలు, సంతోషాలు, శాంతి స్థాపించడానికి వచ్చిందో, ఏ ఖుర్ఆన్ అయితే మన జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులను, కష్టాలను మరియు మనం ఇహలోకంలో గాని, పరలోకంలో గాని నష్టపోయే విషయాలను దూరం చేయడానికి వచ్చిందో, అలాంటి ఆ ఖుర్ఆన్ పట్ల మనది ఇంత అశ్రద్ధ? ఇది మంచి విషయం కాదు. ఇన్ షా అల్లాహ్, ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ వినడం, చదవడం, దాని పట్ల ఏదైతే ఈ రోజుల్లో శ్రద్ధ వహిస్తున్నామో, దాని యొక్క నష్టం ఎంత, ఇవన్నీ విషయాలు వేరే సందర్భాల్లో తెలుసుకుందాము. కానీ, నమాజు కొరకు నిరీక్షించే ఈ సమయంలో మనం ఖుర్ఆన్ ఎప్పుడైతే చదువుతామో, ఆ ఖుర్ఆన్ చదవడం, చూసి చదవడం గాని లేదా ముందు నుండే మనకు కంఠస్థం ఉన్నటువంటి సూరాలు చదవడం కానీ.

సామాన్యంగా మన ప్రాంతంలో ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఖుర్ఆన్ చూసి చదవలేరు కదా. ఏమంటారు? మాకు ఖుర్ఆన్ చదవడం రాదు అని అంటారు. కానీ కనీసం ఒక్క సూరా ఏదైనా గుర్తుండి ఉంటుంది కదా, రెండు సూరాలు గుర్తుండి ఉంటాయి కదా, కనీసం సూరె ఫాతిహా అయినా గుర్తుండి ఉంటుంది కదా. ఆ సమయంలో దాన్ని చదువుకోండి. ఎందుకు? మనం నమాజులో చదువుతున్నాము కదా అని ఆలోచించకండి. మీకు దొరికిన సమయంలో మీరు ఖుర్ఆన్ యొక్క కొన్ని ఆయతులు పఠించడం, తిలావత్ చేయడం ఎంత గొప్ప పుణ్యమో తెలుసా?

తిర్మిజీలోని సహీ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ‘మన్ కరఅ హర్ఫన్ మిన్ కితాబిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో… ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఒక పదం, పూర్తి ఒక ఆయత్, పూర్తి ఒక ఖుర్ఆన్ అని కాదు. ఒక్క అక్షరం చదువుతారో, వారికి పదేసి పుణ్యాలు లభిస్తాయి అన్నటువంటి శుభవార్త ఇచ్చారు. ఎన్ని పుణ్యాలు లభిస్తాయి? పది పుణ్యాలు లభిస్తాయి. ఇంకా ఎవరికైనా అర్థం కావడంలో ఇబ్బంది కాకూడదు అని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ, ఒక సామెత మాదిరిగా కూడా తెలిపారు. ఏంటి?

الم (అలిఫ్ లామ్ మీమ్)

అని ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ ‘అలిఫ్ లామ్ మీమ్’ అన్నది ఒక్క అక్షరం కాదు. ఇవి మూడు అక్షరాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత వివరంగా చెప్పారు. ‘అలిఫ్’ ఒక అక్షరం, ‘లామ్’ ఒక అక్షరం, ‘మీమ్’ ఒక అక్షరం. ఈ మూడు అక్షరాలు చదివారు, మూడు అక్షరాలతో ఒక్క ఆయత్ అయింది. ఈ మూడు అక్షరాలు చదివినందుకు 30 పుణ్యాలు లభించాయి.

గమనించండి! ఈ విధంగా మీరు ఆలోచించారంటే, ఒకవేళ బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అని మీరు చదివారంటే, ‘బిస్మి’ – మూడు అక్షరాలు ఉన్నాయి. ‘అల్లాహ్’లో నాలుగు అక్షరాలు ఉన్నాయి. ‘అర్రహ్మాన్’లో ఐదు అక్షరాలు ఉన్నాయి. ఇంకా ‘అర్రహీమ్’ – అలిఫ్, లామ్ రెండు, రా, హా, యా, మీమ్ – ఆరు అక్షరాలు ఉన్నాయి. ఈ విధంగా గమనించండి, మొత్తం టోటల్ ఎన్ని అయినాయి? ఆ టోటల్ ని మళ్ళీ పది నుండి మీరు ఇంటు చేయండి. ఎన్ని అవుతున్నాయి? అల్లాహు అక్బర్!

ఈ విధంగా మనం, మనకు ఖుర్ఆన్ చూసి చదవడం రాకపోయినా గాని, మనం ఏదైతే గుర్తు ఉన్న, ముందు నుండి మనకు యాద్ ఉన్న, కంఠస్థం ఉన్న సూరాలు అక్కడ ఆ సందర్భంలో నమాజు కొరకు ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఇమామ్ వచ్చి ఇకామత్ చెప్పి నమాజు కొరకు నిలబడతాడు అని, ఈ సందర్భంలో ఖుర్ఆన్ చదవడం ద్వారా మనం ఎంత గొప్ప పుణ్యం పొందుతాము! అలాగే, ఒకవేళ మనం కొన్ని సూరాల ఘనతను తెలుసుకొని ఉండేది ఉంటే, మరింత ఖుర్ఆన్ తిలావత్ లో మన యొక్క కాంక్ష పెరుగుతుంది. ఉదాహరణకు,

సూరతుల్ ఇఖ్లాస్, ఖుల్ హువల్లాహు అహద్ అన్న సూరా ఏదైతే ఉందో, ఈ ఖుల్ హువల్లాహు అహద్ అనే సూరా ఎంత ఘనత గల సూరా ఇది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఎవరైతే దీని యొక్క గుణాలు, ఇందులో ఉన్నటువంటి అల్లాహ్ గుణాల గురించి దీనిని ప్రేమిస్తారో, అల్లాహ్ అతన్ని ప్రేమిస్తాడు. ఎవరైతే ఈ సంపూర్ణ ప్రేమతో దీనిని పఠిస్తాడో, అల్లాహు త’ఆలా అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అంతే కాదు, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ ఖుర్ఆన్ యొక్క సూరా, సూరతుల్ ఇఖ్లాస్ అంటే ఖుల్ హువల్లాహు అహద్ సూరా, ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగానికి సమానం. అల్లాహు అక్బర్! అంటే ఖుర్ఆన్ లో 30 పారాలు ఉన్నాయి కదా, సుమారు 10 పారాలకు సమానం అన్నటువంటి దాని భావపరంగా, అందులో ఏ విషయాలైతే ఉన్నాయో, దాని పరంగా.

అయితే ఈ విధంగా ఆలోచించండి. మీరు నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో మస్జిద్ లో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ సూరా పూర్తిగా చదివారంటే, ఒక్కొక్క అక్షరానికి పదేసి పుణ్యాలు లభించాయి. అంతేకాకుండా, ప్రత్యేకంగా ఈ సూరాకు, సహీ బుఖారీ యొక్క హదీస్ ఆధారంగా ఈ మూడు ఘనతలు ఏదైతే మనం తెలుసుకున్నామో, అల్లాహ్ ప్రేమిస్తాడు, స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు మరియు ఖుర్ఆన్ లోని మూడో వంతు భాగానికి సమానం – ఇన్ని గొప్ప పుణ్యాలు కూడా మనం పొందుతాము.

అలాగే, ఒకవేళ మనం గమనించామంటే, సూరత్ అల్-కాఫిరూన్, ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ సూరా ఏదైతే ఉందో, దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఉంది, తబరానీ ఔసత్ లో, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. ఏముంది అక్కడ ఘనత? ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ – ఈ సూరా ఖుర్ఆన్ లోని నాలుగో భాగానికి సమానం.

ఇక ఈ సూరా ప్రస్తావన వచ్చింది గనుక ఒక మాట చెప్పేస్తున్నాను మీకు గుర్తుండడానికి. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా మనం ఖుర్ఆన్ తిలావత్ ఉద్దేశంతో చదివితే, పారాయణం చేస్తే, తిలావత్ చేస్తే, పదేసి పుణ్యాలు దొరుకుతాయి. అంతేకాకుండా, ఏ సూరాకు, ఏ ఆయత్ కు, ఏ ప్రత్యేక ఘనత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో, ఆ ఘనతలు కూడా మనం పొందవచ్చు. ఇక్కడ నమాజు కొరకు, ఇకామత్ కొరకు నిరీక్షిస్తున్న సమయంలో చదివే ప్రస్తావన వచ్చింది, అందుకొరకు ఇక్కడ ఈ విషయం చెప్పాము. కానీ ఇదే ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ సూరా, ఎవరైతే పడుకునే ముందు చదువుకుంటారో, అర్థ భావాలతో చదివితే అది విషయం తెలుస్తుంది., వారు షిర్క్ నుండి పూర్తిగా దూరం ఉండి, ఈమాన్, విశ్వాసం స్థితిలో రాత్రి గడిపిన వారు అవుతారు. ఎంత గొప్ప విషయమో గమనించండి. సహీ హదీస్ లో ఈ విషయం రుజువై ఉంది.

అలాగే సూరతుల్ ముల్క్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి శుభవార్త ఏంటి? ఇందులో ముప్పై ఆయతులు ఉన్నాయి. ఎవరైతే ఈ సూరత్ ను చదువుతారో, ఆ సూరా చదివిన వారి పట్ల సిఫారసు చేస్తుంది. ఈ విధంగా ప్రళయ దినాన మనం ఈ సూరా యొక్క సిఫారసుకు అర్హులమవుతాము. ఇక వేరే హదీస్ ద్వారా తెలుస్తుంది, సమాధి శిక్ష నుండి కూడా రక్షణకు ఈ సూరా చాలా గొప్ప సబబుగా నిలుస్తుంది.

ఈ విధంగా సోదరులారా, సోదరీమణులారా! మనం ఇంకా వేరే సూరాల గురించి కూడా ఏ ఘనతలు వచ్చి ఉన్నాయో, అవి తెలుసుకుంటే, మనం నమాజు కొరకు నిరీక్షిస్తున్న ఈ సమయంలో ఖుర్ఆన్ యొక్క కొంత భాగం తిలావత్ చేస్తూ ఉంటే, అల్హందులిల్లాహ్, మనం అనేకానక పుణ్యాలు పొందగలుగుతాము.

ఇంకా సోదర మహాశయులారా! ఈ నమాజు కొరకు నిరీక్షించే ఈ సమయంలో మనం, ఖుర్ఆన్ చదవడం ఒక విషయం. ముందు సున్నతుల విషయం ప్రస్తావన వచ్చింది. అది కాకుంటే, లేదా అది చదివిన తర్వాత ఇంకా సమయం ఉండేది ఉంటే ఖుర్ఆన్ తిలావత్.

ఎప్పుడైనా ఒకసారి మీరు ఖుర్ఆన్ తిలావత్ చేయకుండా, అజాన్ ఇకామత్ మధ్యలో దుఆ చేస్తే, ఆ దుఆ కూడా స్వీకరించబడుతుంది. ఈ హదీస్ మీరు ఇంతకు ముందే విని ఉన్నారు.

ఇక నాలుగో విషయం, దీనికంటే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మనిషి ఐదు పూటల నమాజు ప్రతి రోజు చేయాలి. ప్రతి రోజు తొలి సమయంలో మస్జిద్ కు రావాలి. అయితే ఒక్కోసారి ఖుర్ఆన్ తిలావత్, ఒక్కోసారి సున్నతులు, కొన్ని నమాజుల మధ్యలో నఫిల్లు అధికంగా చేయడం గాని, కొన్ని సందర్భాలలో దుఆలో గడపడం గాని, మరికొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు.

ఏంటి అది? అధికంగా అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఈ నిరీక్షిస్తున్న సమయంలో, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్. సోదర మహాశయులారా! అల్లాహ్ యొక్క ధిక్ర్ గురించి నేను ఏమని చెప్పాలి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో హదీసులు దీని గురించి ఉన్నాయి. స్వయంగా ఖుర్ఆన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ, ఒక్క విషయం ఖుర్ఆన్ లో వచ్చిన ఒక్క విషయం మీరు ఎల్లవేళల్లో మీ మదిలో నాటుకొని ఉన్నారంటే, మీ మదిలో ఎల్లవేళల్లో ఫ్రెష్ గా దాన్ని పెట్టుకున్నారంటే, ధిక్ర్ చేయడంలో ఎప్పుడూ కూడా మీరు అలసిపోరు, ధిక్ర్ చేయడంలో ఎప్పుడూ మతిమరుపు తనానికి గురి కారు. ఏంటి ఆ విషయం? సత్కార్యాలు చాలా ఉన్నాయి కదా! ఏదైనా సత్కార్యం గురించి అల్లాహ్ అధికంగా చేయండి, అధికంగా, అధికంగా, కసీరా, కసీరా అని ఎక్కడైనా వచ్చి ఉంది అంటే, అది కేవలం ఈ ధిక్ర్ గురించే ఉంది.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا
(యా అయ్యుహల్లజీన ఆమనూ ఉజ్ కురుల్లాహ జిక్రన్ కసీరా)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. (33:41)

ఈ ‘అధికంగా’ అన్న పదం, ఏదైనా సత్కార్యం గురించి అల్లాహ్ చెప్పి ఉన్నాడంటే, కేవలం ఈ ధిక్ర్ గురించే చెప్పి ఉన్నాడు. హదీసుల్లో చాలా హదీసులు వచ్చి ఉన్నాయి. కానీ రెండు హదీసుల సారాంశం నేను చెబుతాను. హదీసుల యొక్క రిఫరెన్స్, వాటి అరబీ యొక్క పదాలతో చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు. మొదటి ఒక హదీస్ ఏంటి? అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీరు పర్వతాలకు సమానంగా దానధర్మాలు ఖర్చు చేస్తే అల్లాహ్ మార్గంలో ఎంత పుణ్యం లభిస్తుందో, మీరు యుద్ధ మైదానంలో ఉండి, సత్య అసత్య, ధర్మ అధర్మాల మధ్యలో జరిగే పోరాటంలో పాల్గొంటే ఎంత పుణ్యం లభిస్తుందో, దానధర్మాలు కేవలం డబ్బు రూపంలోనే కాదు, మీ వద్ద పెద్ద పర్వతాలకు సమానంగా వెండి, బంగారాలు ఉంటే దానిని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే ఎంత పుణ్యం లభిస్తుందో, అంత పుణ్యం అల్లాహ్ యొక్క ధిక్ర్ లో లభిస్తుంది. అంతేకాదు, అంతకంటే ఎక్కువ పుణ్యం అల్లాహ్ ధిక్ర్ చేయడంలో మీకు లభిస్తుంది అని చెప్పారు.

నేను ముందే చెప్పాను కదా, హదీసులు ఎన్ని ఉన్నాయంటే, ‘త్రాసును బరువు చేసే సత్కార్యాలు’ అనే మా పుస్తకం ఒకసారి చదివి చూడండి మీరు. నూహ్ అలైహిస్సలాం తన కొడుకుకు ఒక సందర్భంలో చెప్పారు: ‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’ అధికంగా నీవు చదువుతూ ఉండు. ఈ రోజుల్లో ఎన్నో అక్రమ సంపాదనల్లో మనం పడిపోతున్నాము. కానీ, ధర్మపరమైన సంపద, సరియైన మార్గాలు మనం అవలంబిస్తూ, అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండడంలో మన యొక్క ఆహారం, మన యొక్క ఉపాధి దాచబడి ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. నూహ్ అలైహిస్సలాం చెప్పారు:

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ، فَبِهَا تُرْزَقُ الْخَلَائِقُ
(సుబ్ హానల్లాహి వబిహందిహీ, ఫబిహా తుర్ జఖుల్ ఖలాయిక్)
‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’ (అల్లాహ్ పవిత్రుడు మరియు ఆయనకే సర్వస్తోత్రాలు) – దీని ద్వారానే సర్వ సృష్టికి ఉపాధి లభిస్తుంది.

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
భూమ్యాకాశాలలో ఉన్న సమస్త వస్తువులు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. (62:1)

కొన్ని సందర్భాల్లో ‘సబ్బహ లిల్లాహ్’ అని, కొన్ని సందర్భాల్లో ‘యుసబ్బిహు లిల్లాహ్’ అని, ఏడు సూరాల ఆరంభం ఉంది. అంతేకాకుండా, ఎన్నో సందర్భాలలో, ఎన్నో సందర్భాలలో ఖుర్ఆన్ లో ఈ పదాలు వచ్చి ఉన్నాయి. ఏంటి భావం? సర్వ సృష్టి అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి. మరి నూహ్ అలైహిస్సలాం ఏం చెప్పారు? సహీ హదీస్ లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నూహ్ అలైహిస్సలాం తన కొడుకుకు చెప్పారు, సర్వ సృష్టికి ఉపాధి ఏదైతే లభిస్తుందో, రిజ్క్ ఏదైతే అల్లాహు త’ఆలా ఇస్తున్నాడో, రిజ్క్ అని అరబీలో ఏదైతే వస్తుందో పదం ఖుర్ఆన్, హదీస్ లో, అక్కడ కేవలం కడుపు నిండా తిండి కాదు. రిజ్క్ అంటే మన శరీరానికి, కడుపుకు అవసరమైన వస్తువులు, తిండి, త్రాగుడు ఇవి. అంతేకాకుండా, అంతకంటే ముఖ్యమైన మన ఆత్మకు, మన హృదయానికి ఆధ్యాత్మికంగా మన కొరకు కావలసినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అది కూడా. దానికే ప్రాముఖ్యత ఎక్కువ. అందుకొరకు సోదరులారా!

అల్లాహ్ యొక్క ధిక్ర్ విషయంలో ఎన్నో ఇంకా హదీసులు వచ్చి ఉన్నాయి. అయితే, ఈ సందర్భంలో, ఏదైతే మనం జమాఅత్ నిలబడడానికి నిరీక్షిస్తూ ఉన్నామో, ఇక్కడ ‘సుబ్ హానల్లాహ్’, ‘వల్ హందులిల్లాహ్’, ‘వ లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘వల్లాహు అక్బర్’, ‘వ లా హౌల వ లా కువ్వత ఇల్లా బిల్లాహ్’, ‘సుబ్ హానల్లాహి వబిహందిహీ’, అలాగే ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్’ – ఇలాంటి ఈ పుణ్యాలు, ఇలాంటి ఈ అద్కార్ మనం చేస్తూ, ఎన్నో పుణ్యాలు సంపాదించగలుగుతాము.

ముస్లిం షరీఫ్ లోని సహీ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీలో ఒక వ్యక్తి వెయ్యి పుణ్యాలు సంపాదించలేడా? సహాబాలు ఆశ్చర్యంగా, వెయ్యి పుణ్యాలు మాలో ఒక వ్యక్తి ఎలా సంపాదించగలడు ప్రవక్తా? అని అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: ఎవరైతే ‘సుబ్ హానల్లాహ్’ వంద సార్లు చదువుతారో, వారికి వెయ్యి పుణ్యాలు లభిస్తాయి, వారి పాపాల నుండి వెయ్యి పాపాలు తరిగిపోతాయి. అల్లాహు అక్బర్! వెయ్యి పాపాలను అల్లాహ్ మాఫ్ చేస్తాడు. మన్నించేస్తాడు. ఇంకా వెయ్యి పుణ్యాలు మన యొక్క కర్మపత్రంలో రాస్తాడు. ఎంత గొప్ప పుణ్యమో ఆలోచించండి!

ఎవరైతే నమాజు కొరకు నిరీక్షిస్తున్న ఈ సమయంలో ‘అల్ హందులిల్లాహ్’ అని అంటారు. ముస్లిం షరీఫ్ లోని ఒక సహీ హదీస్: ‘సుబ్ హానల్లాహ్ తమ్లఉల్ మీజాన్, వల్ హందులిల్లాహ్ తమ్లఉ మా బైనస్సమాయి వల్ అర్ద్’. ‘సుబ్ హానల్లాహ్’ మీ యొక్క పుణ్యాల త్రాసును నింపేస్తుంది. ‘అల్ హందులిల్లాహ్’ అని మీరు ఎప్పుడైతే అంటారో, ఈ భూమి నుండి ఆకాశాల మధ్యనంతా కూడా నింపేస్తుంది, అంత గొప్ప పుణ్యాలు మీకు లభిస్తాయి.

ఇదే మధ్యలో ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్’ అని, ‘అస్తగ్ఫిరుల్లాహ్’ అని మనం చదువుతూ ఉంటే… ‘అస్తగ్ఫిరుల్లాహ్’ – ఓ అల్లాహ్, నా పాపాలను నీవు క్షమించు అని పూర్తి అర్థ భావాలతో మనం చదువుతూ ఉండేది ఉంటే, ఎంత గొప్ప పుణ్యం మనకు లభిస్తుందో తెలుసా? సూరె నూహ్ లో నాలుగు లాభాలు తెలుపబడ్డాయి. సూరత్ హూద్ లో రెండు లాభాలు తెలుపబడ్డాయి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లోనైతే మరికొన్ని లాభాలు తెలుపబడ్డాయి.

మన సమయం సమాప్తం కావస్తుంది. నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయాన్ని ఎలా గడపాలి అనే ఈ నాటి అంశంలో మనం నాలుగు విషయాల గురించి తెలుసుకున్నాము. రెండు విషయాల వివరణ ఇంతకుముందే తెలుసుకున్నాము. సున్నత్ నమాజులు చేయడం, దుఆ చేయడం. మరియు ఈ రోజు మరో రెండు విషయాల గురించి తెలుసుకున్నాము వివరాలతో: ఖుర్ఆన్ చదవడం, అలాగే ధిక్ర్ లో గడపడం.

అల్లాహు త’ఆలా మనందరికీ ఈ సద్భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్ జజా, వబారకల్లాహు ఫీకుమ్, వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

12 ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట:

మస్జిద్ లో త్వరగా వచ్చిన వ్యక్తి అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు ఎన్నో రకాల ఆరాధనలు పాటించ గలుగుతాడు. ఉదా: జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ వరాల పట్ల యోచించటం, ఇహలోకం, దానికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం ఉండటం. దీని వల్ల మనుసును నమాజులోనే నిలిపి, వినయ వినమ్రత పాటించే అవకాశం ఉండును. అదే వెనక వచ్చే వ్యక్తి (పై లాభాలను నోచుకోలేడు) అతను నమాజు చేసినా అతని మనస్సు ఐహిక విషయాల్లో ఇరుక్కొని ఉంటుంది, నమాజులో లీనమై నమ్రత పాటించకపోవచ్చు. అతని శరీరం మస్జిదులో, నమాజులో ఉన్నా అతని అంతర్యం నమాజులో ఉండకపోవచ్చు.

ముస్లిం సోదరా! నీ పరలోక సేవింగ్ అకౌంట్ పెరుగుదలకై నీవు నమాజు కొరకు నిరీక్షిస్తున్నంత సమయంలో కొన్ని స్వర్ణవకాశాలు ఉదాహరణగా చూపిస్తున్నాను. వాటిపై శ్రద్ధ వహించుః

(అ) దివ్య ఖుర్ఆన్ పారాయణం

పారాయణ పరిమాణంఫలితంవిధానం
1- ప్రతి నమాజు యొక్క అజాన్ మరియు ఇఖామ- తుల మధ్యలో 5పేజిల పారా- యణం. ఇలా ప్రతి రోజు 25 పేజిలవుతాయి.24 రోజుల్లో మొత్తం ఖుర్ఆన్ యొక్క పారాయణం అవు- తుంది.ఖుర్ఆన్ పేజిలు 604 25 పేజిలు × 24 రోజులు = 600
2- నమాజుకై నిరీక్షిస్తూ ప్రతి రోజు ఒక్క పారా.30 రోజుల్లో పూర్తి ఖుర్ఆన్ పారాయణంఖుర్ఆన్ పారాలు 30. నెల రోజులు 30. 30 పారాలు ÷ 30 రోజులు = రోజుకు 1 పార
3- నమాజు కొరకు నిరీక్షిస్తూ ప్రతి రోజు 3 ఆయతులు కంఠస్తం చేయుట.ఇన్షా అల్లాహ్ 8 సంవత్సరాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.అనుభవ పూర్వకమైన విషయం.
4- నమాజు కొరకు నిరీక్షి- స్తున్న వ్యవధిలో ప్రతి రోజు 1 ¼ పేజి కంఠస్తంసుమారు పదహారు మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం అవుతుంది. ఇన్షాఅల్లాహ్!604 ÷ 1¼ పేజి = 483.2 రోజులు 483.2 ÷ 30రోజులు = 16 నెలల 10 రోజులు
5- నమాజు కొరకు నిరీక్షి- స్తున్న వ్యవధిలో ప్రతి రోజు రెండు పేజిలుసుమారు పది మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం ఇన్షాఅల్లాహ్604 ÷ 2 = 302 రోజులు = పది నెలలు.
6- మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణంపూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యంఅబూ సఈద్ ఖుద్రీ  (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు. (బుఖారిః ఫజా-ఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
7- నాలుగు సార్లు సూర ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్.పూర్తి ఖుర్ఆన్ చదివినంత పుణ్యం.ప్రవక్త ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “సూర ఖుల్ హువల్లాహు అహద్ మూడోవంతు ఖుర్ఆన్ మరియు సూర ఖుల్  యా అయ్యుహల్ కాఫిరూన్ నాలుగోవంతు ఖుర్ఆన్ కు సమానం”. (తబ్రానీ ఔసత్ 1/66. 186. సహీహ లిల్ అల్బానీ 2/132).
8- ఒక్క సారి సూర ముల్క్ పారాయణంపాపాల మన్నింపుప్రవక్త ﷺ ఉపదేశిం-చారని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఖుర్ఆనులో 30 ఆయతుల ఒక సూర ఉంది. (దాన్ని చదివిన వారి పట్ల) అది సిఫారసు చేస్తే దాని సిఫారసు అంగీకరింపబడుతుంది. అది తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ (సూర ముల్లక్). (తిర్మిజిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు సూరతిల్ ముల్క్. 2816).  

ఇప్పటికీ మనము పుణ్యాల వనంలోనే ఉన్నాము. నాతో పాటు మీరు సయితం ఖుర్ఆన్ పారాయణం యొక్క ఈ గొప్ప ఘనతపై శ్రద్ధ వహించండి.

عن عَبْدِ الله بْنِ مَسْعُودٍ ÷ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ وَالْـحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ الم حَرْفٌ وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు: “దివ్యగ్రంథంలోని ఒక అక్షరం చదివినవానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్, లామ్, మీమ్ ను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లాం ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం.” (తిర్మిజి 2835).

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా ద్వారా దీని ఉదాహరణ చూడండిః

సూర కౌసర్ యొక్క అక్షరాలు 42.

ఒక పుణ్యం పది రెట్లు ఉంటుంది. ఇలా 42×10=420 అవుతాయి.

ఖుర్ఆనులోని అతి చిన్న సూరా కౌసర్ యొక్క ఘనతను గ్రహించు, ఇక నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో నీవు చాలా పేజీలు చదివినప్పుడు నీకు ఎన్ని పుణ్యాలు లభిస్తాయో యోచించు?

(ఆ) అజ్ కార్ (అల్లాహ్ స్మరణం)

జిక్ర్ఘనత/ పుణ్యంనిదర్శనం
1- 100 సార్లు సుబ్ హానల్లాహ్1000 పుణ్యాలు లేదా 1000 పాపాల మన్నింపుసాద్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త  ﷺ సన్నిధిలో ఉండగా ఆయన ఇలా ప్రశ్నించారుః ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు సంపా దించడం మీలోనెవరితోనైనా కాని పనియా? అచ్చట కూర్చున్నవారిలో ఒకరన్నారుః మాలో ఎవడైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగల డు? దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ చదవాలి. దానికి బదులు అతనికి వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి”.
2- లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీక లహూ ల హుల్ ముల్కు వల హుల్ హందు వహు వ అలా కుల్లి షైఇన్ కదీర్.   100 సార్లు.పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిం చారుః “ఎవరైతే ఒక రోజులో 100 సార్లు “లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీ క లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్” పఠిస్తాడో, అతనికి పది బానిసల్ని విడుదల చేసిన పుణ్యం ప్రాప్తమవుతుంది. 100 పుణ్యాలు లిఖించబడతాయి. 100 పాపాలు మన్నించబడతాయి. అతనికి సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షణ ఉంటుంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాదు.
3- లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్స్వర్గ కోశాల్లో ఒకటిప్రవక్త ﷺ ఇలా ఉప దేశించారని అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః స్వర్గ కోశాల్లోని ఒక కోశం గురించి నీకు తెలుపనా? అని. తప్పక తెలుపండి ప్రవక్తా! అని నేను విన్నవించు కున్నాను. అప్పుడు చెప్పారుః “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”.
4- సుబ్ హా నల్లాహిల్ అజీం వ బి హందిహిఒక్క ఖర్జూ రపు చెట్టు స్వర్గంలో నాట బడు తుందిప్రవక్త ﷺ ఆదేశం: “ఎవరు సుబ్ హానల్లా హిల్ అజీం వ బిహందిహీ” అంటారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాట బడుతుంది.”
5- విశ్వాసులైన స్త్రీ పురు షుల మన్నింపు కొరకు అల్లాహ్ ను కోరడంప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదు లుగా ఒక పుణ్యంప్రవక్త ﷺ ఇలా ఆదే శించారుః “ఎవరు  విశ్వాస స్త్రీ పురుషుల మన్నింపు కొరకు అల్లాహ్ ను వేడుకుంటారో వారికి ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదులు ఒక పుణ్యం లభిస్తుంది“.

ముస్లిం 2698.    బుఖారీ 6403. ముస్లిం 2691. బుఖారీ 6409, ముస్లిం 2704.    తిర్మిజి 3464. తబ్రానీ, సహీహుల్ జామి 6026.

ఒక ముస్లిం ముఖ్యంగా నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి ఈ అమూల్యమైన సమయాన్ని ఈ శ్రేష్ఠ స్థలం (మస్జిద్)లో పై అజ్ కార్ చదవడంలో గడపడాన్ని అదృష్టంగా భావించాలి. తద్వారా అనేక పుణ్యాలు లభించవచ్చు.