దుఆ అంగీకార ఘడియలు
“తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి” అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం).
అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు“. (తిర్మిజి).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించినట్లు సహల్ బిన్ సఅద్ ఉల్లేఖించారు:
“రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటి: అజాన్ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ”. (అబూ దావూద్).
అబూహురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి “నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)
“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిమయితే అల్లాహ్ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్ (రజియల్లాహు అన్హు ) ఉల్లేఖించారు. (ముస్లిం).
విశేషాలు:
1- కొన్ని ప్రత్యేక సమయాలున్నవి వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాలకంటే ఎక్కువగా ఉంటుంది.
2- ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాస పడాలి.
3- ఆ సమయాల్లో కొన్ని ఇవి: సజ్దాలో, అజాన్ ఇఖామత్ ల మధ్యలో, రాత్రి చివరి గడియలో, జీహాద్ లో శత్రువులతో భేటి జరిగినప్పుడు.
దిన చర్యల పాఠాలు పుస్తకం నుండి
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా