కుఫ్ర్ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) , నిర్వచనం, దాని రకాలు
(అ) కుఫ్ర్ నిర్వచనం :
నిఘంటువు ప్రకారం కుఫ్ర్ అంటే కప్పి ఉంచటం, దాచి పెట్టడం అని అర్థం. అయితే షరీయత్‌లో “ఈమాన్‘ (విశ్వాసం)కు విరుద్ధమైన దానిని కుఫ్ర్ (అవిశ్వాసం లేక తిరస్కారం) అంటారు.
ఎందుకంటే – అల్లాహ్ యెడల, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల విశ్వాసం లేకపోవటమనే దానికి మరో పేరే కుఫ్ర్ (అవిశ్వాసం). అందులో ధిక్కరణా వైఖరి ఉన్నా, లేకున్నా అది అవిశ్వాసమే. విశ్వాసం (ఈమాన్)లో సందేహం సంశయమున్నా లేదా విముఖత ఉన్నా లేదా అసూయ ఉన్నా లేదా అహంకార భావమున్నా లేదా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని అనుసరించకుండా మనోవాంఛలు అడ్డుపడినా – ఇవన్నీ కుఫ్ర్ (అవిశ్వాసం)లో అంతర్భాగాలే. కాకపోతే అల్లాహ్ యే లేడని, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రాక అసత్యమని పూర్తిగా కొట్టివేసే వ్యక్తి అవిశ్వాసం చాలా తీవ్రమైనది, కరడుగట్టినది. అలాగే దైవప్రవక్తలు సత్యం అన్న విషయంపై విశ్వాసమున్నప్పటికీ కేవలం అసూయ వల్ల వారిని త్రోసిపుచ్చిన వ్యక్తి కూడా అవిశ్వాసియే (కాఫిరే). (మజ్మూఅ అల్ ఫతావా-షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ-12/335)
(ఆ) కుఫ్ర్ రకాలు :
కుఫ్ర్ (అవిశ్వాసం) రెండు రకాలు : (1) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా అవిశ్వాసం) (2) కుఫ్రె అస్గర్ (చిన్న తరహా అవిశ్వాసం).
మొదటి రకం – కుఫ్రె అక్బర్
ఇది మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. ఇందులో కూడా ఐదు రకాలున్నాయి. అవేమంటే:
(1) కుఫ్రె తక్‌జీబ్ : (అబద్ధంతో కూడుకున్న కుఫ్ర్)
దీనికి ప్రమాణం ఈ అల్లాహ్ ఆదేశం :
وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ
“అల్లాహ్‌కు అబద్దాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినపుడు దానినీ అసత్యమంటూ ధిక్కరించే వానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటి, అటువంటి తిరస్కారుల నివాస స్ధలం నరకంలో ఉండదా?” (అల్ అన్‌కబూత్ 29:68)
(2) కుఫ్రె తకబ్బుర్ వ ఇన్‌కార్ (అహంకారం, నిరాకరణతో కూడుకున్న కుఫ్ర్):
ఒక విషయాన్ని సత్యమని ధ్రువీకరిస్తూనే అహంకారం కారణంగా త్రోసిపుచ్చటం.
దీనికి ఆధారం ఈ అల్లాహ్ సూక్తి :
وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు నిరాకరించాడు. అహంకారి అయి, అవిశ్వాసులలో చేరిపోయాడు.” (అల్ బఖర 2:34)
(3) కుఫ్రె షక్ (అనుమానంతో కూడుకున్న కుఫ్ర్)
దీనినే సంశయంతో, సందిగ్ధంతో కూడుకున్న కుఫ్ర్ అని కూడా అంటారు.
దీనికి ప్రమాణం అల్లాహ్ యొక్క ఈ సూక్తులు :
وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا
ఆ విధంగా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమవుతుందని నేననుకోను. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.” అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించి, ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా? నా మటుకు నేను ఆ అల్లాహ్ యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.” (అల్ కహఫ్ 18:35-38)
(4) కుఫ్రె ఏరాజ్ (విముఖతతో కూడుకున్న కుఫ్ర్)
దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:
وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ
“అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.” (అల్ అహ్‌ఖాఫ్ 46:3)
(5) కుఫ్రె నిఫాఖ్ (కాపట్యంతో కూడిన కుఫ్ర్) :
దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:
ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ
“ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయ బడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు.”(అల్ మునాఫిఖూన్ 63:3)
రెండవ రకం – కుఫ్రె అస్గర్ (చిన్నతరహా కుఫ్ర్)
దీనివల్ల మనిషి తన సముదాయం నుండి వేర్పడడు. దీనినే ‘క్రియాత్మక కుఫ్ర్‘గా కూడా వ్యవహరిస్తారు. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌లో ఇది కుఫ్ర్‌గా పేర్కొనబడి నప్పటికీ ఇది ‘కుఫ్ర్ అక్బర్’ (పెద్ద తరహా కుఫ్ర్ ) పరిధిలోనికి రాదు. ఉదాహరణకు దైవానుగ్రహాల పట్ల కృతఘ్నతా భావం (కుఫ్రానె నీమత్). ఉదాహరణకు:
وَضَرَبَ اللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ
“అల్లాహ్ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుండీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. తరువాత ఆ పట్టణ వాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతఘ్నత చూపారు (అల్లాహ్ చేసిన మేళ్లను మరచిపొయ్యారు).” (అన్ నహ్ల్ 16:112)
ఒక ముస్లిం సాటి ముస్లింతో యుద్ధం చేయటం కూదా ‘కుఫ్రె అస్గర్’ ఉపమానం లోకే వస్తుంది. దీనిని గురించి మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
“ముస్లింను దూషించటం పాపం. అతనిపై కయ్యానికి కాలు దువ్వటం “’కుఫ్ర్”. (బుఖారీ, ముస్లిం)
ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం కూడా ఈ సందర్భంగా గమనార్హమే:
“మీరు నా తదనంతరం ఒకరినొకరి మెడలు నరుక్కొని కాఫిర్లుగా మారకండి.” (బుఖారీ, ముస్లిం)
అల్లాహ్ యేతరుల పేర ప్రమాణం చేయటం కూడా ఈ కోవకు చెందినదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
“అల్లాహ్ యేతరుని పేర ప్రమాణం చేసినవాడు కుఫ్ర్ (అవిశ్వాసాని)కి ఒడిగట్టాడు లేదా షిర్క్ (బహుదైవోపాసన)కి పాల్పడ్డాడు.” (ఈ హదీసును తిర్మిజీ-1535 పొందుపరచి, హసన్‌గా ఖరారు చేశారు. హాకిమ్ మాత్రం దీనిని సహీహ్ – ప్రామాణికం – గా పేర్కొన్నారు).
వేరొక చోట అల్లాహ్ పెద్ద పాపానికి ఒడిగట్టిన వానిని విశ్వాసి (మోమిన్)గా పేర్కొన్నాడు. ఇలా సెలవిచ్చాడు :
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى
“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది.” (అల్ బఖర 2:178)
పై సూక్తిలో అల్లాహ్ హంతకుణ్జి ‘విశ్వాసుల పరిధి నుండి వేరుచేయలేదు. పైగా అతన్ని హతుని తరఫు హక్కుదారునికి సోదరునిగా ఖరారు చేస్తూ అతనిపై ఖిసాస్ చెల్లింపు విధించాడు. తరువాత ఈ విధంగా ఆదేశించాడు :
فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ
“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్జీ కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్త ధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి”. (అల్ బఖర 2:178)
ఇక్కడ ‘సోదరత్వం’ అంటే భావం నిశ్చయంగా ధార్మిక సోదరబంధమే. వేరొకచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا
“ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాలు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి.” (అల్ హుజురాత్ 49:9)
చివరకు అల్లాహ్ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :
إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
“(గుర్తుంచుకోండి) విశ్వాసులంతా అన్నదమ్ములు. కనుక మీ సోదరులిరువురి మధ్య రాజీ కుదుర్చండి.” (అల్ హుజురాత్ 49:10)
(పైన పొందుపరచబడిన విషయం “షరహ్ అత్ తహావియ్యహ్” నుండి సంక్షిప్తంగా సంగ్రహించబడినది).
కుఫ్రె అక్బర్ – కుఫ్రె అస్గర్ మధ్య గల తేడాలు:
(1) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా కుఫ్ర్) మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి వేరుపరుస్తుంది. అతని ఆచరణలన్నీ దీని మూలంగా వృధా అయిపోతాయి. కుఫ్రె అస్గర్ (చిన్న తరహా కుఫ్ర్) వల్ల మనిషి ఇస్లామీయ సమాజం నుండి బహిష్కృతుడవడం గానీ, అతని ఆచరణలు వృధా అవటంగానీ జరగదు. అయితే అతనిలో ‘కుఫ్ర్’ మోతాదునుబట్టి అతని విశ్వాసం బలహీనమవుతుంది. దీనికి పాల్పడిన వ్యక్తిని అది శిక్షార్హునిగా నిలబెడుతుంది.
(2) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా కుఫ్ర్)కు పాల్పడిన వ్యక్తిని అది శాశ్వతంగా నరకానికి ఆహుతి చేస్తుంది. కుఫ్రె అస్గర్ (చిన్న తరహా కుఫ్ర్)కు పాల్పడిన వ్యక్తి ఒకవేళ నరకానికి ఆహుతి అయినప్పటికీ అందులో శాశ్వతంగా పడి ఉండడు. అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతన్ని క్షమించి, నరకంలో వేయకపోవటం కూడా సంభవమే.
(3) కుఫ్రె అక్బర్ – దానికి పాల్చడిన వ్యక్తి ధన ప్రాణాలను అది సమ్మతంగా చేసి వేస్తుంది. కాగా కుఫ్రె అస్గర్ – దానికి పాల్పడిన వ్యక్తి ధన ప్రాణాలను సమ్మతం చేయదు.
(4) కుఫ్రె అక్బర్‌కు ఒడిగట్టిన వ్యక్తికి – విశ్వాసులకు మధ్య విరోధ భావం తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి కుఫ్రె అక్బర్‌కి ఒడిగట్టే వారితో ముస్లింలు స్నేహం చేయటం ధర్మసమ్మతం కాదు – అతనెంత దగ్గరివాడయినాసరే! అయితే కుఫ్రె అస్గర్ ఎట్టి పరిస్థితిలోనూ స్నేహ బంధంలో అవరోధంగా ఉండదు. పైగా అలాంటి వ్యక్తితో – అతనిలో ఉన్న విశ్వాస (ఈమాన్) మోతాదును బట్టి స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవచ్చు. అతనిలో ఉన్న అవిధేయతా భావం, పాపం మోతాదునుబట్టి అతని పట్ల దూరంగా ఉండటం జరుగుతుంది.
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (101-105 పేజీలు)
You must be logged in to post a comment.