తలాఖ్(విడాకులు)కు ముందు ఇది తప్పనిసరి ( قبل أن تطلق) [వీడియో]

బిస్మిల్లాహ్

తలాక్ ముందు ఇస్లాం మనకు కొన్ని ఆదేశాలు పాటించాలని చెప్పింది, వాటిని ఆచరించడం తప్పనిసరి. వాటిని ఆచరించక ముందే విడాకులు చెెప్పడం మహా పాపం.

[వీడియో: 20 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

దాంపత్య జీవితం ఒక బలమైన ఒప్పందం. అల్లాహ్ స్వయంగా వారి మధ్యలో ప్రేమ నూరిపోశాడు. ఒకరి ద్వారా మరొకరికి సుఖశాంతులు కలగజేశాడు. (సూరా రూం 30:21). ఘోర పాపాల్లో ఒకటైన అబద్ధాన్ని అన్ని వేళల్లో నిషిద్ధపరచిన అల్లాహ్, దాంపత్య జీవితంలో రగులుతున్న జ్వాలల్ని ఆర్పడానికి దానిని యోగ్యపరచాడు. ఈ విధంగా రాస్తూ పోతే చాలా ఉంది, ఇలాంటి ప్రగాఢ ఒడంబడికను తెంచటం, తెంచుకోవటం, ఒకరికి మరొకరు శరీరంతో దుస్తులు అంటుకొనియున్నట్లుగా ఉన్నవారు వేరైపోవడం ఎంత బాధకర విషయం. దీని వల్ల స్వయం వారిద్దరికీ, సంతానం ఉంటే వారికీ, ఇరువైపుల కుటుంబాలకు మొత్తం సమాజానికే ఒక్క నష్టం ఏమిటి? ఎన్నో నష్టాలు వాటిల్లుతాయి. అందుకే వారిరువురిలో ఏదైనా బేధభావం ఏర్పడి, భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు ‘తలాక్’ అనడంలో త్వర పడకుండా ముందు ఈ క్రింది పద్ధతులు పాటించాలి.

1- అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో దాంపత్య జీవితం ఎలా గడపాలో స్వయంగా భర్త ముందు నేర్చుకోవాలి, భార్యకు నేర్పే ప్రయత్నం చేయాలి.

2- భర్త తన భార్యలో లేదా భార్య తన భర్తలో తనకు నచ్చని ఏదైనా అలవాటు, లోటు చూసినప్పుడు వెడబాటుకు త్వరపడకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ఈ ఆదేశాలను అర్థం చేసుకొని ఆచరించాలి:

وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا

“… వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే, ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో!” (నిసా 4:19).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ఏ విశ్వాసి కూడా తన విశ్వాసురాలైన భార్యను అసహ్యించుకోకూడదు/వదులు కోకూడదు. అతను ఆమెలోని ఏదైనా ఒక గుణం నచ్చకపోతే, అతనికి నచ్చిన మరో గుణం ఆమెలో ఉండవచ్చు”. (ముస్లిం 1469).

మరొక హదీసులో ఉంది:

నిస్సందేహంగా స్త్రీ ప్రక్కటెముకతో సృజించబడింది, అది ఏ విధంగానూ తిన్నగా కాదు, కనుక నీవు ఆమె నుండి ప్రయోజనం పొందాలనుకుంటే వంకరగా ఉన్నప్పుడు కూడా పొందగలవు. నీవు ఆమెను తిన్నగా చేయటానికి ప్రయత్నిస్తే ఆమెను విరగ్గొడతావు, ఆమెను విరగ్గొట్టటం అంటే ఆమెకు విడాకులివ్వటమే”. (ముస్లిం 1468, బుఖారి 3331).

3- ఓపిక సహనాలు ఎన్ని వహించినా, అవి పనికి రావు అనుకొని, విడాకులకే పరుగిడ కూడదు. అల్లాహ్ సూర నిసా (4:34) లో ఇచ్చిన ఈ మూడు ఆదేశాలను పాటించాలి:

وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ

ఎప్పుడైతే మీ భార్యలు అవిధేయతకు పాల్పడతారని భయం చెందుతారో అప్పుడు మీరు వారికి నచ్చజెప్పండి, పడకలో వేరుగా ఉంచండి. వారిని (మెల్లగా) కొట్టండి. [సూర నిసా (4:34)]

అయితే ఈ మూడు పద్ధతులు ఒకేసారి కాకుండా క్రమంగా ఒకటి తరువాత ఒకటి ఉపయోగించాలి. ముందు ఖుర్ఆన్ ఆయతులు, ప్రవక్త హదీసుల, సహాబాల, పుణ్యాత్ముల చరిత్ర ద్వారా నచ్చజెప్పుతూ ఉండాలి. ఇలా ప్రయోజనం కానరాకుంటే పడకలో వేరు చేయాలి. అంటే ఆమెను ఆమె అమ్మగారింటికి పంపడం కాదు, తన వద్ద, తన ఇంట్లోనే ఉండనివ్వాలి, కాని ఒకే పడకపై ఆమెతో కలసి పడుకోకూడదు. ఇక కొట్టడం అంటే; దొరికింది అవకాశం అని ఎడాపెడా కొట్టడం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: ‘గైర ముబర్రహ్’ కొట్టడం అని. అయితే ఈ గైర ముబర్రహ్ అంటే ఏమిటి అన్న దానికి హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) చెప్పారు: ఎముక విరిగినట్లు కాదు, మిస్వాక్ (పళ్ళపుల్ల)తో కొట్టడం అని. హసన్ బస్రీ చెప్పారు: ఆ దెబ్బ వల్ల ఏలాంటి గుర్తు, వాపు, వాతలు రాకుండా ఉండాలి అని. (తఫ్సీర్ ఇబ్ను కసీర్).

4- భర్తలో ఏమైనా లోపాలుంటే భార్య నచ్చజెప్పాలి, స్వయం చెప్పలేకపోతే పెద్దలతో చెప్పించాలి. ఈ ఆయతు భావాన్ని శ్రద్ధగా చదవండి:

وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

“భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అనేది అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ ఈ వ్వవహారశైలి అల్లాహ్ కు బాగ తెలుసు అన్న నమ్మకం కలిగి ఉండండి”. (నిసా 4:128).

పై ఆయతు ప్రకారం ఆచరించే ప్రయత్నం చేసినా, దాంపత్య జీవితంలోని ప్రేమానురాగాలు పెరగనప్పుడు, దినదినానికి వారి మధ్య విభేదాలే ఎక్కువైనప్పుడు; ఇరువురి వైపున ఒక్కొక్క మధ్యవర్తినీ నియమించాలి, వారు న్యాయవంతులు, ధర్మావగాహన కలిగి ఉన్నవారు, అల్లాహ్ ప్రీతి కొరకు వీరిని కలిపే ప్రయత్నం చేసేవారై ఉండాలి. చదవండి అల్లాహ్ అదేశం:

وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا

ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు“. (నిసా 4:35).

ఇలా ఆ ఇద్దరి మధ్యవర్తుల ప్రయత్నం వారిని కలపండలో ఫలిస్తే అల్ హందులిల్లాహ్! అదే కావలసింది, అదే వారు చెయ్యాల్సింది కూడా. కాని ఏదైనా కారణంగా వారి ప్రయత్నాలు ఫలించక, వారిరువురిలో ద్వేష జ్వాలలే రగులుతూ ఉంటే, వారు ఆ దంపతుల మధ్య ఎడబాటుయే మేలు అని భావించి విడాకుల (తలాక్)కు సలహా ఇచ్చినా పాపంలో పడరు. కాని అనవసరంగా, లేదా దంపతుల్లో ఎటైనా ఒకరి వైపు మ్రొగ్గు చూపి విడాకులకు సలహా ఇస్తే వారు షైతాన్ ను ప్రసన్నం చేసినవారవుతారు, వారితో షైతాన్ చాలా సంతోషిస్తాడు. (ముస్లిం 2813. ఈ పూర్తి హదీస్ చదవండి). ఇలాంటి వారి గురించి ప్రవక్త ఒక సందర్భంలో ఇలా తెలిపారు: “ఎవరైతే ఒక మనిషిని అతని భార్యకు వ్యతిరేకంగా పురికోల్పుతాడో అతడు మాలోని వాడు కాదు”. (అబూ దావూద్ 5170). మరియు వారి మాయమాటలలో పడి, తెలిసి కూడా అన్యాయంగా, అనవసరంగా విడాకులిచ్చే భర్త, లేదా విడాకులు కోరే భార్య ఎంత ఘోరమైన పాపానికి ఒడిగడతారో ప్రవక్తగారి ఈ హదీసుల ద్వారా తెలుసుకోండి!

అల్లాహ్ వద్ద ఘోర పాపాల్లో ఒకటి: మనిషి ఒక స్త్రీతో వివాహమాడి, ఆమెతో కాపురం చేసి, ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి ఆమె మహర్ కూడా కాజేయడం”. (హాకిం 2743, సహీహా 999).

ఏ భార్య తన భర్తతో అనవసరంగా విడాకులు కోరుతుందో ఆమె స్వర్గ సువాసనను కూడా నోచుకోదు”. (అబూదావూద్ 2226, తిర్మిజి 1187).

కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.

ఇతరములు:

%d bloggers like this: