మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లాహ్ ధర్మం ఆదేశం తెలిపి, దాని నిరూపణలు, నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతివిరోధి, సంకీర్ణవాది, బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానపడేవాడు అని నానారకాలుగా దూషిస్తారు. పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్దగా చదవండి:
“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టుకునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్ జామి 4921).
ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండి:
“రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది“. (అహ్మద్ 1/412, సహీహుల్ జామి 4126).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవరైనా ఉన్నారా? (సమాధానం ఎవరూ లేరు అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండి:
“నేను స్త్రీలతో కరచాలనం చేయను”.
(ముస్నద్ అహ్మద్ 6/357, సహీహుల్ జామి 2509).
మరో సందర్భంలో ఇలా అన్నారు:
“నేను స్త్రీల చేతులను తాకను“.
(తబ్రానీ కబీర్ 24/342, సహీహుల్ జామి 7054. ఇంకా చూడండి: ఇసాబ 4/354, దారుల్ కితాబిల్ అరబీ ముద్రణ).
ఆయిషా (రది అల్లాహు అన్హా) ఇలా చెప్పారు:
“ఎన్నడూ లేదు, అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో మాట ద్వారా బైఆత్ (విధేయత ప్రమాణం) చేసేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).
జాగ్రత్త! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్‌తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్‌గా కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్దితుల్లో పరస్త్రీలతో కరచాలనం నిషిద్దమే అవుతుంది .
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది. పదాలలో కొన్ని చిన్న మార్పులు చేశాము ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/






You must be logged in to post a comment.