అల్లాహ్ త ఆలా ఇలా తెలియజేశాడు:
أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا
“నమాజు నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆన్ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్ఞుద్ (నమాజులో ఖుర్‌ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌మూద్‌కు (ప్రశంసనీయమైన స్థానానికి) చేరుస్తాడు.” (సూరతు ఇస్రా /బనీ ఇస్రాయీల్: 78-79).
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది” అంటే ఫజ్ర్ వేళ అల్లాహ్ దూతలు దివి నుండి భువికి దిగివస్తారు. (సహీహ్ తిర్మిజీ: 3135, సహీహ్ ఇబ్నుమాజా:670)
మరో హదీసులో ఇలా ఉంది: ‘రాత్రి వేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లాహ్ సన్నిధికి చేరుకున్నపుడు – తనకంతా తెలిసినప్పటికీ – మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదలి వచ్చారు? అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. దానికి వారు: “మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు. మేము వారివద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నులై ఉన్నారు” అని సమాధానమిస్తారు.’ (బుఖారీ:522,ముస్లిం:1001).
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.
యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.
దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్ ఖుర్‌ఆన్ (ఖుర్‌ఆన్ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.
[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్: సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్: 1432]
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో ఖుర్‌ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు.” (బుఖారీ:4639)
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం కారణంగా కొన్ని జాతుల్ని ఉన్నతమైన స్థితికి పెంచుతాడు. మరికొన్ని జాతుల్నిదీని కారణంగానే అధోగతికి దిగజార్చుతాడు.” (ముస్లిం1353)
ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:
“సుమధుర స్వరంతో గొంతెత్తి ఖుర్‌ఆన్ పారాయణం చేసే దైవప్రవక్త కంఠ శ్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా అల్లాహ్ మరే స్వరాన్నీ ఆలకించడు.” (బుఖారీ:4636, ముస్లిం:1319).
సమధుర స్వరంతో ఖుర్‌ఆన్ పారాయణం చేసేవాని పట్ల అల్లాహ్ ప్రసన్నుడయి అతని ఆచరణను అంగికరిస్తాడు అని అర్ధం.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అను) కథనం: అన్సార్ జాతికి చెందిన ఒక సహాబీ (అనుచరుడు) మస్జిద్ ఖుబాలో ఇమామత్ చేసేవారు. ఆయన ప్రతి రకాతు ఆరంభంలో ‘ఖుల్‌హువల్లాహు అహద్” సూరా పఠించిన తరువాత మరొక సూరా చదివేవారు. ఇలాగే ఆయన ప్రతి రకాతులో చేసేవారు.
కొందరు ఆయనను ఇలా అడిగారు? “నీవు ఆ సూరాను నమాజులో చదవకుంటే నమాజు కానట్టుగా ప్రతి రకాతులో నిత్యం చదువుతుంటావు, నీవు చదివేటుగా ఉంటే ఆ సూరను మాత్రమే చదువు లేకుంటే ఇతర సూరాలను చదువు అని అన్నారు.”
తరువాత ఆయన ఇలా సమాధానమిచ్చారు: “‘చూడండి! నేను ఇలాగే నమాజు చదువుతాను .మీకిష్టమైతే నేను మీ కొరకు ఇమామత్ చేస్తాను, మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇమామత్ మానుకుంటాను” అని అన్నారు. వారిలో అందరికంటే గొప్ప వ్యక్తిగా ఆయనను వారు భావించేవారు. కనుక ఇతరులు ఇమామత్ చేయడం వారికి ఇష్టముండేది కాదు.
చివరికి కొంత మంది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు పోయి ఈ సమస్య గురించి తెలియజేశారు.
తరువాత ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తితో: “వారి కోరిక ప్రకారం (ఇమామత్) చేయుటకై నీకు ఏ విషయం అడ్డు? ఆ సూరానే నీవు ఎందుకు ప్రతి రకాతులో చదవాలనుకుంటున్నావు?” అని అడిగారు.
దానికి ఆ వ్యక్తి: “యా రసూలల్లాహ్! “నేను ఆ సూరా (ఖులహువల్లాహు అహద్) ను ఇష్టపడుతున్నాను అని అన్నారు.
అది విని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో: “ఆ సూరాను నీవు ఇష్టపడుతున్నావంటే అది నీన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది? అని చెప్పారు.
[సహీహ్ తిర్మిజీ:2901]
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఖుర్‌ఆన్‌లో ముప్పై వాక్యాలు గల, ఒక సూరా ఉంది. అది (అల్లాహ్ సన్నిధిలో) ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసి ఆఖరికి అతనికి క్షమాభిక్ష లభించేలా చేసింది.” అదే, “తబారకల్లిజీ బియదిహిల్ ముల్కు.” (తిర్మిజీ: 2891, ఇబ్నుమాజా: 3786, అబూదావూద్).
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక సూరా ఉంది. అది తనను పఠించేవాని తరఫున వాదిస్తుంది. కడకు అతన్ని స్వర్గంలో చేర్పిస్తుంది.” (మజ్‌మవుజ్ జవాయిద్).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్జ్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ ప్రతి రాత్రి చదివిన కారణంగా అల్లాహ్ వారిని సమాధి శిక్షనుండి కాపాడుతాడు.” [హాకిమ్, సహీహ్ తర్గీబ్ వత్ తర్హీబ్ : 1589]
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “అలిఫ్ లామ్ మీమ్ తంజీల్ అస్ సజ్దా’ మరియు ‘తబారకల్లజీ’ సూరాలు పారాయణం చేసేవరకు నిద్రపోయేవారు కాదు.” అని తెలిపారు. [సహీహ్ తిర్మిజీ: 2892]
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “సూరతుల్ జుమర్ మరియు “బనీ ఇస్రాయిల్” సూరాలు పారాయణం చేసేవరకు నిదపోయేవారు కాదు.” అని తెలిపారు.” [సహీహ్ తిర్మిజీ: 2892]
హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఖుర్‌ఆన్ గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పది పుణ్యాలకు సమానంగా ఉంటుంది.” నా అభిప్రాయం ప్రకారం: ‘అలిఫ్ లామ్ మీమ్” అనేది ఒకే అక్షరం కాదు. పైగా ‘అలిఫ్’ ఒక అక్షరం, లామ్’ ఒక అక్షరం,మీమ్ ఒక అక్షరం అని అన్నారు.“ (సహీహ్ తిర్మిజీ: 2910, సహీహ్ నసాయి: 2391, హాకిమ్).
[ఇది జఫరుల్లాహ్ ఖాన్ హఫిజ హుల్లాహ్ గారు రాసిన అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి అను పుస్తకం నుండి తీసుకోబడింది]