అల్లాహ్ యొక్క భయం లేనివాడు ఎలా సంపాదించాలి, ఎందులో ఖర్చు చేయాలి అన్న విషయాన్ని గ్రహించడు. ఎలాగైనా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి. అది దొంగతనం, లంచం, అక్రమం, అపహరణ, అబద్ధం, నిషిద్ధ వ్యాపారం, వడ్డీ, అనాథల సొమ్ము తిని అయినా, లేదా జ్యోతిష్యం, వ్యభిచారం లాంటి నిషిద్ధ పనులు చేసి వాటి బత్తెం తీసుకొని, లేదా బైతుల్ మాల్, పబ్లిక్ ప్రాపర్టీల నుండి అపహరణ చేసి, ఇతరులను ఇబ్బందికి గురి చేసి వారి సొమ్ముతిని, లేదా అనవసరంగా బిక్షమడిగి ఎలాగైనా డబ్బు కావాలన్న ఆశ. ఈ డబ్బుతో అతను తింటాడు, దుస్తులు ధరిస్తాడు, వాహానాల్లో పయనిస్తాడు, ఇల్లు నిర్మిస్తాడు, లేదా కిరాయికి తీసుకుంటాడు మరియు అందులో అన్ని రకాల భోగభాగ్యాలను సమకూర్చుకుంటాడు. ఇలా నిషిద్ధమైన వాటిని తన కడుపులోకి పోనిస్తాడు.
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు:
“నిషిద్ధమైన వాటితో పెరిగిన ప్రతి శరీరం నరకంలో చేరడమే మేలు” .
(తబ్రాని కబీర్: 19/136. సహీహుల్ జామి: 4495).
అంతే కాదు, ప్రతి మనిషి, నీవు ఎలా సంపాదించావు? ఎందులో ఖర్చు చేశావు? అని ప్రళయదినాన ప్రశ్నించబడతాడు. అక్కడ వినాశమే వినాశం. కనుక ఎవరి వద్ద అక్రమ సంపద ఉందో, అతి తొందరగా దాని నుండి తన ప్రాణాన్ని విడిపించుకోవాలి. అది ఎవరిదైనా హక్కు ఉంటే తొందరగా అతనికి అప్పగించి, అతనితో క్షమాపణ కోరాలి. ఈ పని ప్రళయం రాక ముందే చేసుకోవాలి. ఎందుకనగా అక్కడ దిర్హం, దీనార్లు చెల్లవు. కేవలం పుణ్యాలు, లేక పాపాల చెల్లింపులుంటాయి.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది]