576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-
నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”