ఇదియే ఇస్లాం (This is Islam)
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [57 పేజీలు]
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0xhBkxGpiuQE8mtLa8ON92 [4 వీడియోలు]
వీడియో పాఠాలు (కొన్ని)
- 1- మనం ఎందుకు పుట్టించబడ్డాం, ఇస్లాం అంటేమిటి? [YTవీడియో]
- 2- ఇదియే ఇస్లాం, మానవ సృష్టి [YTవీడియో]
- 3- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాస పునాదులు [YTవీడియో]
- 4- ఇదియే ఇస్లాం – ఇస్లాంలో ఆరాధన [YTవీడియో]
విషయ సూచిక
- 1. ముందు మాట
- 2. మనమెందుకు పుట్టాం?
- 3. ఇస్లాం అంటే ఏమిటి ?
- 4. మానవ సృష్టి
- 5. ప్రవక్త ముహమ్మద్
- 6. ఆయన వంశం, జీవితం
- 7. ఆయన సద్గుణాలు,సద్వర్తన
- 8. మహత్యములు
- 9. ఇస్లాం పునాదులు
- 10. ఇస్లాంలో ఆరాధన
- 11. ఇస్లాం మూల సూత్రాలు
- 12. మూల సూత్రాల భావం
- 13. ఇస్లాం ప్రత్యేకతలు
- 14. ఇస్లాం లోని ఉత్తమ విషయాలు
- 14.1 ఇస్లామీయ ఆదేశాలు
- 14.2 ఇస్లామీయ నిషిద్ధతలు
- 15. పరలోకం
- 16. ప్రళయం దాని గుర్తులు
- 17. నరకం, దాని శిక్షలు
- 18. స్వర్గ భోగభాగ్యాలు
- 19. ఇస్లాంలో స్త్రీ స్థానం
- 20. స్త్రీ యెక్క సామాన్య హక్కులు
- 21. భార్య హక్కులు భర్తపై
- 22. పరద-హిజాబ్
- 23. బహు భార్యత్వం
- 24. ఇస్లాంలో ప్రవేశం
[క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]
1-ముందు మాట
మనిషి తను జీవిస్తున్న ఈ ధర్తి, సుందర విశాలమైన ఈ జగం, ఆశ్చర్యంలో పడవేసే నక్షత్రాలతో నిండియున్న ఆకాశం, అంతయూ పటిష్ఠమైన వ్యవస్థతో నడుస్తున్నదని ఆలోచిస్తాడు. భూమి, అందులో ఉన్న పర్వతాలు, లోయలు, సెలయేర్లు, చెట్లు, గాలి, నీరు, సముద్రం, ఎడారి మరియు రాత్రి పగలన్నిటిని చూసి వీటన్నిటిని సృష్టించినవాడెవడూ? అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది.
ఈ నీరు లేనిది జీవిత భావమే శూన్యం, దీనిని ఆకాశం నుండి కుర్పించేదెవరు? దాని ద్వారా పంటలు, చెట్లు, పుష్పాలు, ఫలాలు వెలికి తీసేవాడెవడు? మనుషులకు, పశువులకు దానిని ఉపయోగకరమైనదిగా చేసినవాడెవడు? నీరును తన గర్భంలో భద్రపరిచే శక్తి భూమికిచ్చిందెవరు?
ప్రతి వస్తువును అవసరమున్నంత ప్రమాణంలో మాత్రమే ఆకర్షించుకునే శక్తి భూమికి ఇచ్చిందెవరు? అవసరానికి మించి ఆకర్షించదు, చలనమే కష్టం అవుతుంది గనక. అవసరానికంటే తక్కువ ఆకర్షిస్తే ప్రతి వస్తువు ఈదుతూ ఉంటుంది.
మనిషిని అందమైన ఆకారంలో సృష్టించినవాడెవడు?
అంతెందుకూ! మనిషి స్వయం తన ఆకృతి గురించి గమనిస్తే ఆశ్చర్యపడతాడు. నీ శరీరములో ఉన్న అవయవాలపై ఒకసారి దృష్టి సారించు, ఒక నిర్ధిష్టమైన పద్దతిలో అవి పని చేస్తున్నాయి. వాటి పని విధానం గురించి నీకు తెలియునది అతితక్కువ. అలాంటప్పుడు దాని గురించి ఖచ్చితమైన నిర్ణయం ఎలా చేయగలవు?
నీవు పీల్చుతున్న ఈ గాలిని గమనించు! అది ఒక క్షణమైనా ఆగితే నీ జీవితమే అంతమవుతుంది. అయితే దాన్ని ఉనికిలోకి తెచ్చిందెవరు?
నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారం, నీవు నడుస్తున్న ఈ నేల, నీకు వెలుతురునిస్తున్న సూర్యుడు, ఇంకా నీవు తిలకిస్తున్న ఆకాశ చంద్రతారలన్నింటిని సృష్టించినవాడెవడు?
అల్లాహ్. నిశ్చయంగా అల్లాహ్ యే.
అవును, అల్లాహ్ యే ఈ జగమంతటినీ సృష్టించాడు. ఆయన ఒక్కడే దాన్ని నడుపుతున్నాడు. అందులో మార్పులు చేస్తున్నాడు. ఆయనే నీ ప్రభువు, నిన్ను సృజించాడు, ప్రాణం పోశాడు, ఆహారం ఇస్తున్నాడు, చివరికి మరణానికి గురిచేస్తాడు. ఆయనే నిన్ను, ఈలోకాన్ని సైతం శూన్యం నుండి ఉనికిలోకి తెచ్చినవాడు.
ఇదంతా తెలిసాక, ఎవరైనా బుద్ధిమంతుడు, ‘ఈ లోకమంతా వృధాగా పుట్టించబడిందని, మనుషులు జన్మిస్తున్నారు, కొంత కాలం జీవించి చనిపోతున్నారు, ఇలా అంతా సమాప్తమవుతుంది’ అని అనగలడా?
అయితే వాస్తవం ఏమిటంటే: మనం మానవులం ఎందుకు పుట్టించబడ్డాము? అనే ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి.
2-మనమెందుకు పుట్టించబడ్డాము?
అల్లాహ్ మనల్ని పుట్టించింది కేవలం ఆయనను ఆరాధించడానికే. ఆ ఆరాధన విధానం తెలియజేయడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఎవరయితే ఆయన్నే పూజించి, ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన నివారించిన వాటి నుండి దూరంగా ఉంటాడో అతడే ఆయన సంతృష్టిని పొందినవాడు. మరెవరయితే ఆయన ఆరాధన నుండి విముఖుడై, ఆయన విధేయతను నిరాకరిస్తాడో అతడే ఆయన ఆగ్రహానికి, శిక్షకు గురైనవాడు.
అల్లాహ్ ఈ లోకాన్ని ఆచరణ మరియు పరీక్ష కొరకు పుట్టించాడు. మానవులు చనిపోతూ ఉంటారు. ఓ రోజు ప్రళయం సంభవిస్తుంది. అల్లాహ్ తీర్పు చేసి ఫలితాలు ఇవ్వడానికి మానవులను వెలికి తీస్తాడు. అల్లాహ్ అక్కడ వివిధ వరాలతో ఓ స్వర్గం సిద్ధపరిచాడు. దానిని ఏ కన్నూ చూడలేదు. ఏ చెవీ వినలేదు. అది ఊహలకూ అతీతమైనది. విశ్వసించి, ఆయన ఆజ్ఞా పాలన చేసినవారి కొరకు అల్లాహ్ దానిని సిద్ధపరిచాడు.
అలాగే మానవులు ఊహించని రకరకాల శిక్షలతో కూడిన నరకాన్ని తయారు చేశాడు. అల్లాహ్ ను తిరస్కరించి, ఇతరుల్ని పూజించి, ఇస్లామేతర మతాలను అవలంభించిన వారి కొరకు అది సిద్ధంగా ఉంది.
3-ఇస్లాం అంటేమిటి?
ఇస్లాం, అల్లాహ్ ఇష్టపడిన ధర్మం. అనగా అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను పాటించుట. ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభిస్తే దాన్ని అల్లాహ్ ఎన్నటికీ స్వీకరించడు. ఇది మానవ సమాజంలో ఏదో కొందరిది కాదు, సర్వ మానవులకు చెందినది.
అల్లాహ్ మానవులకు కొన్ని ఆదేశాలిచ్చాడు, మరికొన్ని విషయాలను నిషేధించాడు. ఎవడైతే ఇందులో అల్లాహ్ కు విధేయత చూపుతాడో అతడు సాఫల్యం మరియు (నరకం నుండి) రక్షణ పొందుతాడు. ఎవడైతే అవిధేయత చూపుతాడో అతడు విఫలుడౌతాడు మరియు నష్టపోతాడు.
ఇస్లాం కొత్త ధర్మం కాదు. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండీ అల్లాహ్ వారి కొరకు ఇష్టపడిన ధర్మం
4-మానవ సృష్టి
ఈ గాథ ‘ఆదం’ (అలైహిస్సలాం) ను అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ప్రారంభం అవుతుంది. అల్లాహ్ అతడ్ని మట్టితో పుట్టించి, అతనిలో ఆత్మను ఊదాడు. సర్వ వస్తువుల పేర్లు అతినికి నేర్పాడు. అతని గౌరవ, ప్రతిష్ఠల ఉన్నతి కొరకు అతని ముందు సాష్టాంగ పడాలని దైవదూతలను ఆదేశించాడు. అందరూ సజ్దా చేశారు, కాని ఇబ్లీసు ఆదంతో తనకున్న ఈర్ష్య వలన సజ్దా చేయుటకు నిరాకరించి, అహంభావానికి గురి అయ్యాడు. అందుకు అల్లాహ్ అతడ్ని ఆకాశాల్లో ఉన్నటువంటి సౌకర్యాల నుండి తరిమి, అవమానం పాలు జేసి, తన కారుణ్యానికి దూరం చేశాడు. అతనిపై శాపం, దౌర్భాగ్యం మరియు నరకం విధించాడు. అప్పుడు అతడు అల్లాహ్ తో ప్రళయం వరకు వ్యవధి కోరాడు. అల్లాహ్ అతనికి వ్యవధి ఇచ్చాడు. అక్కడే అతడు ఆదం సంతానాన్ని సన్మార్గం నుండి తప్పిస్తానని ప్రమాణం చేశాడు.
ఆదం చెలిమి, చనువు మరియు సుఖ, శాంతులు పొందుటకు అల్లాహ్ అతని నుండి అతని సహవాసి ‘హవ్వా’ను సృజించాడు. ఏ మానవుని ఊహలకు అందనటువంటి భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గంలో ఉండాలని ఆదేశించాడు. వారిద్దరి శత్రువైన ‘ఇబ్లీసు’ గురించి తెలియజేశాడు. వారిద్దరిని పరీక్షించడానికి స్వర్గంలో ఉన్న వృక్షాల్లో ఒక వృక్షం నుండి తినుటను నివారించాడు. అప్పుడు ‘షైతాన్’ వారిని ప్రేరేపించి ఆ వృక్షం నుండి తినుట మనోహరమైనదిగా చేసి, ‘నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని’ అని ప్రమాణం చేసి ఇలా అన్నాడుః మీరు ఈ వృక్షం నుండి తింటే మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుంద’ని చెప్తూ వారిని అపమార్గం పట్టించే వరకు అతడు పట్టు విడవ లేదు. చివరికి వారు ఆ వృక్షం నుండి తినేశారు. తమ ప్రభువు యొక్క అవిధేయతకు పాల్పడ్డారు. పిదప తాము చేసినదానిపై పశ్చాత్తాప పడి, తమ ప్రభువుతో క్షమాపణ కోరారు, ఆయన వారిని క్షమించాడు. కాని వారిని స్వర్గము నుండి భూమిపైకి దించాడు. ఆదం (అలైహిస్సలాం) తన భార్యతో భూమిపై నివసించారు. అల్లాహ్ వారికి సంతానం ప్రసాదించాడు. సంతానం యొక్క సంతానం ఇలా ఇప్పటికీ పెరుగుతునే ఉన్నారు.
ఆదం సంతానాన్ని మార్గదర్శకత్వం నుండి తప్పించడానికి, సర్వ మంచితనాల నుండి అభాగ్యుల్ని చేయడానికి, చెడును మనోహరమైనది (ఆకర్షణీయమైనది)గా చేయడానికి, అల్లాహ్ కు ప్రియమైన వాటి నుండి దూరంగా ఉంచడానికి మరియు ప్రళయదినాన నరకం పాలు చేయడానికి ఇబ్లీసు మరియు అతని సంతానం ఎల్లవేళల్లో పోరాటానికి సిద్ధమైయున్నారు.
అయితే అల్లాహ్ మానవుల్ని నిర్లక్ష్యంగా వదలలేదు. ధర్మం, సత్యం అంటేమిటో స్పష్టపరచడానికి, వారి మోక్షం ఎందులో ఉందో తెలుపడానికి వారి వద్దకు ప్రవక్తల్ని పంపాడు.
ఆదం అలైహిస్సలాం చనిపోయిన తరువాత పది శతాబ్దాల వరకు వారి సంతానం ఏకత్వపు’ (తౌహీద్) సిధ్ధాంతం, అల్లాహ్ విధేయతపైనే ఉండిరి. ఆ తరువాత అల్లాహ్ తో పాటు అల్లాహ్ యేతరులను ఆరాధించడం మొదలై ‘షిర్క్’([1]) సంభవించింది. ప్రజలు విగ్రహాలను సయితం ఆరాధించడం మొదలెట్టారు. అప్పుడు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవడానికి, విగ్రహారాధన నుండి నిరోధించడానికీ తొలి ప్రవక్త ‘నూహ్’ uని అల్లాహ్ పంపాడు. ఆ తరువాత ప్రవక్తల పరంపర ఆరంభమయింది. వారు ప్రజల్ని (ఇస్లాం) వైపునకు అంటే ‘అల్లాహ్ అద్వితీయుని ఆరాధన చేయుట, ఇతరుల ఆరాధనను త్యజించుటకు’ ఆహ్వానిస్తుండేవారు.
అదే పరంపరలో హజ్రత్ ‘ఇబ్రహీం’ (అలైహిస్సలాం) ఒకరు. ఆయన కూడా తమ జాతి వారిని ‘విగ్రహారాధన వదలండనీ, అల్లాహ్ అద్వితీయున్నే ఆరాధించండని’ బోధించారు. ఆయన తరువాత ప్రవక్త పదవి ఆయన ఇద్దరు సుకుమారులైన ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) మరియు ‘ఇస్ హాఖ్’ uకు, వారి తరువాత మళ్ళీ ‘ఇస్ హాఖ్’ సంతానానికి లభించింది. ‘ఇస్ హాఖ్’ సంతానంలో గొప్ప స్థానం గలవారు: ‘యాఖూబ్’, ‘యూసుఫ్’, ‘మూసా’, ‘దావూద్’, ‘సులైమాన్’ మరియు ‘ఈసా’ అలైహిముస్సలాం. ‘ఈసా’ (అలైహిస్సలాం) తరువాత ‘ఇస్ హాఖ్’ (అలైహిస్సలాం) సంతానంలో ఏ ప్రవక్తా రాలేదు.
అక్కడి నుండి ప్రవక్త పదవి ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) సంతతికి మరలింది. అందులో ఏకైక ప్రవక్త ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లం ను చిట్టచివరి ప్రవక్తగా, ప్రవక్తల అంతిమునకు ముద్రగా మరియు ఆయన తీసుకువచ్చిన ధర్మమే చివరి వరకు ఉండాలని అల్లాహ్ ఎన్నుకున్నాడు. ఆయనపై అవతరించిన దివ్యగ్రంథం ఖుర్ఆనే మానవులకు అల్లాహ్ యొక్క అంతిమ సందేశం. అందుకే అది అరబ్బులకు, అరబ్బేతరులకు అంతే కాదు సర్వ మానవులకు మరియు జిన్నాతుల కొరకు కూడా చెందినది. ప్రతి కాలానికి మరియు యుగానికి అనుకూలమైనది. ప్రతి మేలును గురించి ఆదేశించినది. ప్రతి చెడును నివారించినది.
ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకువచ్చిన ఈ ధర్మం తప్ప, ఏ వ్యక్తి నుండీ మరే ధర్మాన్ని అల్లాహ్ స్వీకరించడు.
5-ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
అల్లాహ్ అద్వితీయుని ఆరాధన గురించి ప్రజలకు మార్గదర్శకత్వం చేయడానికి, దీనికి విరుధ్ధంగా వారు పాటిస్తున్న విగ్రహాల ఆరాధనను ఖండించడానికి అల్లాహ్ ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతిమ ప్రవక్తగా పంపాడు. ఆయనతో అంతిమ సందేశాన్ని పంపాడు.
మక్కా నగరములో, నలబై సంవత్సరాల వయస్సులో ఉండగా ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవికి ముందు నుంచే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ జాతివారిలోనే కాదు, సర్వ మానవుల్లోకెల్లా ఉత్తమ నడవడిక, సద్వర్తన కలిగి యున్నారు. సత్యాన్ని పాటించడం, అమానతులను కాపాడటంలో ఆయనకు ఆయనే సాటి. సభ్యతా, సంస్కారంలో కూడా ఉన్నత శిఖరాన్ని అందుకున్నవారు ఆయనే. అందుకే తమ జాతివారే ఆయనకు “అమీన్” (విశ్వసనీయుడు) అన్న బిరుదునిచ్చారు. ఆయన “ఉమ్మీ”. అంటే చదవడం, వ్రాయడం రానివారు. అటువంటి వారిపై అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ అవతరింపజేసి, సర్వ మానవులు ఏకమై కూడా దీని వంటిది తీసుకురాలేరని ఛాలెంజ్ చేశాడు.
6-ఆయన ﷺ యొక్క వంశం మరియు జీవిత సారంశం
ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ‘ఇస్మాఈల్’ బిన్ ‘ఇబ్రాహీం’ సంతతి. ప్రవక్త ﷺ తల్లి పరంపర ఇదిః ఆమిన బిన్తె వహబ్ బిన్ అబ్ది మునాఫ్ బిన్ జుహ్ రా. జుహ్ రా ప్రవక్త గారి తాత యొక్క సోదరుడు.
అబ్దుల్లాహ్ వివాహం ఆమినతో జరిగింది. మూడు మాసాలు దాంపత్య జీవితం గడిపారు. కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది. (తొమ్మిది మాసాలు ప్రవక్తను మోసింది, కాని) ఏ మాత్రం కష్టంగా భావించలేదు. చివరికి క్రీ.శ. 571 సంవత్సరం సొమవారం రోజున ఆమె సంపూర్ణ శరీరాకారముగల, అందమైన బాలుణ్ణి (ప్రవక్తను) జన్మనిచ్చింది. ఆయన ﷺ తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి పరమపదించారు. అందుకు ఆయన తాతగారు ఆయన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన తల్లి మూడు రోజులు ఆయనకు పాలు త్రాగించింది. తరువాత పాలు త్రాగించడానికి ఒక గ్రామీణురాలైన హలీమ సఅదియకు ఆయన్ని అప్పగించడం జరిగింది. ఆ కాలంలో తమ చంటి పాపలను గ్రామాల్లో ఉంచి పాలు త్రాగించడం అరబ్బుల ఆనవాయితిగా ఉండేది. ఎందుకనగా అచ్చట శరీర ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు తగినన్ని వసతులు లభించేవి గనక. హలీమ సఅదియ ఆ శిశువులో ఎన్నో వింత విషయాలు చూసింది. అందులో కొన్ని: హలీమ తన భర్తతో ఒక బక్కచిక్కిన, వేగం లేని గాడిదపై వచ్చింది. కాని మక్కా నుండి తిరిగిపోయే సందర్భంలో ప్రవక్త ఆమె ఒడిలో పాలు త్రాగుతున్నారు, అదే గాడిద వేగాన్నందుకొని ఇతర స్వారీలను వెనక వదలి ముందుకు సాగిపోయింది. దానికి హలీమ యొక్క తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
స్వయంగా హలీమ కథనం ప్రకారం ఆమె రొమ్ముల్లో పాలు అతి తక్కువగా ఉండేవి, అవి ఆమె వద్ద ముందు నుండే ఉన్న ఓ పాలు త్రాగే శిశువుకు సరిపోక, అతడు ఆకలితో ఏడుస్తూ ఉండేవాడు. అవే రొమ్ములు ప్రవక్త తన నోట్లోకి తీసుకున్నాక పాలతో ఉట్టిపడ్డాయి. ఇద్దరు శిశువులూ కడుపు నిండా త్రాగేవారు.
బనూ సఅద్ ప్రాంత భూములు అనావృష్టి కారణంగా ఎండిపోయేవి. ఈ అదృష్టవంతుణ్ణి (ప్రవక్తను) పొందే భాగ్యం కలిగిన తరువాత అక్కడి భూములు పండుట మరియు పశు సంపదలో పెరుగుదల మొదలైంది. దౌర్భాగ్యం, పేదరికం అనేవి దూరమై సిరి సంపదలు, భోగభాగ్యాలు ఆవరించాయి.
రెండు సంవత్సరాల తరువాత హలీమ ప్రవక్తను ఆయన తల్లి, తాతల వద్ద మక్కాకు తీసుకు వచ్చింది. అయితే ఈ రెండు సంవత్సరాల్లో కలిగిన శుభాలను చూసి మరోసారి ప్రవక్తను తీసుకు పోవుటకు పట్టుదలతో ప్రాధేయపడింది. అందుకు ఆమిన ఒప్పుకుంది. అప్పుడు హృదయ- పూర్వకంగా సంతోషంతో అదృష్టవంతుడైన అబ్బాయిని తిరిగి తెచ్చుకుంది. ఆ రెండు సంవత్సరాలు కూడా గడిసాక హలీమ ప్రవక్తను ఆయన తల్లికి అప్పగించింది. అప్పుడు ప్రవక్త వయస్సు నాలుగు సంవత్సరాలు. ఇక తల్లి తను చనిపోయే వరకు పోషించింది. తల్లి చనిపోయేటప్పుడు ఆయన వయస్సు ఆరు సంవత్సరాలు. ఇక తాత తన వద్ద ఉంచుకొని రెండు సంవత్సరాల తరువాత ఈ లోకం వీడారు. అప్పుడు పినతండ్రి అబూ తాలిబ్ తన రక్షణలో తీసుకొని తన సంతానం కంటే ఎక్కువ ప్రేమ చూపారు. అతడు సిరిమంతుడు కాదు గనక ప్రవక్త ﷺ ఐహిక భోగభాగ్యాలను, సుఖాలను అనుభవించలేదు. ఆయన ﷺ బనూ సఅద్ గ్రామంలో ఉన్నప్పుడు తన పాల సంబంధ సోదరులతో మేకలు మేపిన అనుభవం పోందారు, కనుక ఇక్కడ మక్కావాసుల మేకలు మేపసాగారు. దాని నుండి పొందే వేతనం తన పినతండ్రి అబూ తాలిబ్ కు ఇస్తూ ఉండేవారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో వ్యాపారనిమిత్తం అబూతాలిబ్ తో సీరియా దేశానికి వెళ్ళారు. మరొక సందర్భంలో ఖదీజ బిన్తె ఖువైలిద్ (ఆమె మక్కాలో పేరుగాంచిన ధనవంతురాలు) యొక్క సామాగ్రి వ్యాపారం కొరకు సీరియా తీసుకెళ్ళారు. అధిక రెట్ల లాభం (ఏలాంటి మోసం లేకుండా) ఆర్జించుకొని వచ్చారు. అందుకు ఆమె ఆయన ﷺకు ఇతరులకంటే ఎక్కువ వాటా ఇచ్చింది. ఈ సీరియా ప్రయాణంలో ఆమె యొక్క బానిస మైసర ఆయన ﷺతో ఉండి చూసిన ఆయన యొక్క ఉన్నత ప్రవర్తన, ఉత్తమ నడవడికను ఖదీజ విన్నాక ఆయన ﷺ ను తన సహవాసిగా చేసుకోవాలన్న కాంక్ష ఆమెకు మరింత అధికమైంది. -ఇంతకు ముందు ఆమె భర్త చనిపోయాడు-. పిదప పెద్దల సమక్షంలో శుభసంతోషాలతో ధర్మంగా వారి పెళ్ళి జరిగి- పోయింది. అప్పుడు ఆయన ﷺవయస్సు 25, ఖదీజ వయస్సు 40 సం.
ఎప్పుడైతే ప్రవక్త ﷺ తన జీవితపు నాలుగో దశాబ్దానికి చేరువయ్యారో ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడేవారు. మక్కాకు బయట కొంత దూరంలో ఉన్న ‘హిరా’ గుహలో రోజుల తరబడి ఒంటరిగా ఉండి అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు. అన్నపానీయాలు ముగిసినప్పుడు అవి తీసుకొనుటకే ఇంటికి వెళ్ళేవారు. ఒక రాత్రి అదే గుహలో జిబ్రీల్ దూత ఆకాశం నుండి వచ్చి ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని సమాధానం పలికారు. అతడు మళ్ళీ ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త చెప్పారు. మళ్ళీ అతడు ((చదువు)) అని చెప్పాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త జవాబిచ్చారు. ప్రవక్త యొక్క ప్రతి జవాబు తరువాత జిబ్రీల్ ఆయన ﷺ ని తన ఛాతితో అదిమి వదిలేశేవాడు. అప్పుడు ప్రవక్తకు శ్వాస ఆగిపోయెంత బాధ అయ్యేది. మూడోసారి అదిమి విడిచాక మొదటిసారిగా దివ్యఖుర్ఆన్ యొక్క ఈ ఐదు (5) ఆయతులు అవతరించాయి. ((ఇఖ్ రఅ బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఖలఖల్ ఇన్ సాన మిన్ అలఖ్. ఇఖ్ రఅ వరబ్బుకల్ అక్ రమ్. అల్లజీ అల్లమ బిల్ ఖలమ్. అల్లమల్ ఇన్ సాన మాలమ్ యఅలమ్)). చదువు సర్వ సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ణి నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి నేర్పాడు. (ఇవి సూర అలఖ్ (96)లోని మొదటి ఐదు ఆయతులు).
విద్యాజ్ఞానాల గురించి ఆదేశిస్తూ, మానవ పుట్టుక ఆరంభాన్ని తెలియజేస్తూ అవతరించిన గొప్ప ఆయతులు ఇవి. ఈ ఆయతుల ద్వారానే ప్రవక్తపై అల్లాహ్ యొక్క వహీ (దివ్యజ్ఞాన) అవతరణ ఆరంభమయ్యింది. ప్రవక్త భయకంపితులై ఖదీజ వద్దకు వచ్చారు. వచ్చీరాగానే (పడక మీద పడి) “దుప్పటి కప్పండి దుప్పటి కప్పండి” అన్నారు. ఇల్లాలు దుప్పటి తెచ్చి కప్పింది. కొంత సేపటికి భయం తొలిగిపోయాక, జరిగినదంతా తన ఇల్లాలి ఖదీజకు వర్ణిస్తూ, ‘తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లనున్నట్లు అనిపిస్తుందని’ అన్నారు. అప్పుడు ఖదీజ ఓదార్చుతూ, “అల్లాహ్ సాక్షిగా! అలా జరగదు. అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ అవమానపరచడు. ఎందుకనగా మీరు బంధువుల్ని ఆదరిస్తారు. ఇతరుల బరువు బాధ్యతల్ని మోస్తారు. సంపాదించలేనివారికి సంపాదించి పెడ్తారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలలో సహకరిస్తారు” అని చెప్పింది.
మరో సారి జిబ్రీల్ ప్రవక్త ﷺ వద్దకు వచ్చిన విషయం గురించి స్వయంగా ప్రవక్త ﷺ ఇలా తెలిపారు: నేను నడుస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. కన్నెత్తి చూసే సరికి హిరా గుహలో వచ్చిన దూతయే అక్కడ ఉన్నాడు. ప్రవక్త ﷺ భయపడ్డారు. కాని మొదటి సారి భయం కన్నా తక్కువ. ఇంటికి చేరుకొని దుప్పటి కప్పండి, దుప్పటి కప్పండి అని చెప్పారు. ఆ తరువాత ఈ ఆయతులు అవతరించాయిః ((యా అయ్యుహల్ ముద్దస్సిర్. ఖుమ్ ఫ అన్ జిర్. వ రబ్బక ఫ కబ్బిర్. వ సియాబక ఫ తహ్హిర్. వర్రుజ్ జ ఫహ్ జుర్)). అనగా: వస్త్రం కప్పుకొని పడుకున్న మనిషీ లేచి నిలబడు. ఖుర్ఆన్ ద్వారా ప్రజల్ని హెచ్చరించు. అల్లాహ్ సందేశం వారికి అందజేయి. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. విగ్రహాలకు దూరంగా ఉండు. (ఇవి సూర ముద్దస్సిర్ (74)లోని మొదటి ఆయతులు). ఆ తరువాత ఎడతెగ కుండా వహీ రావడం మొదలైనది. అల్లాహ్ ముహమ్మద్ ﷺ కు ఆదేశించాడు: నీవు ప్రజల్ని అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపునకు మరియు అల్లాహ్ ప్రజల కొరకు ఇష్టపడిన ఇస్లాం ధర్మం వైపునకు పిలువమని. ఈ ఆదేశానుసారం ప్రవక్త ﷺ వివేకం మరియు చక్కని హితబోధతో ప్రచార కార్యక్రమంలో నిమగ్నులయ్యారు.
మొట్టమొదటిసారిగా ఆయన ﷺ సందేశాన్ని అంగీకరించిన స్త్రీలలో ఆయన ﷺ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా, పురుషుల్లో ఆయన ﷺ ప్రాణమిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్(రదియల్లాహు అన్హు), యువకుల్లో ఆయన ﷺ పినతండ్రి కుమారుడు అలీ బిన్ అబీ తాలిబ్(రదియల్లాహు అన్హు). తర్వాత ప్రజలు ఒకరి వెనుక మరొకరు ‘ఇస్లాం’ ధర్మాన్ని స్వీకరించగలిగారు. ఇస్లాం స్వీవకరించినవారు బహుదైవారాధకుల, అవిశ్వాసుల తరఫున కఠిన యాతనలకు గురయ్యారు. (అయినా ఇస్లాంను వీడలేదు). ఆ కష్టాలను సహిస్తూ ప్రవక్త ﷺ పదమూడు సంవత్సరాలు మక్కాలో ఇస్లాం ప్రచారం చేస్తూ పోయారు. దినదినానికి అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు స్వయం ప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల (ఇస్లాం స్వీకరించినవారి) పట్ల అధికమయ్యాయి. అప్పుడు ఆయన ﷺ మరియు ఆయన సహచరులు ‘మదీన’కు వలసపోయారు. అక్కడ సయితం ప్రచారంలోనే అహర్నిశలు శ్రమించారు. కొద్ది సంవత్సరాల్లో మక్కాలో విజయ పతాకం ఎగరవేస్తూ ప్రవేశించారు. అప్పుడు అక్కడి ప్రజలందరూ ఇస్లాంలో ప్రవేశించారు.
ఆయన ﷺ ప్రవక్త పదవికి ముందు నలబై, ఆ తరువాత ఇరవై మూడు ఇలా మొత్తం అరవై మూడు సంవత్సరాలు జీవించారు. తరువాత ఈ లోకాన్ని వీడి శాశ్వతమైన పరలోకానికి వెళ్ళారు.
ముహమ్మద్ ﷺ కు ఇచ్చిన సందేశాలతోటే ఆకాశ సందేశాల రాకను సమాప్తి చేశాడు అల్లాహ్. ఆయన ﷺ విధేయత సర్వమానవాళిపై విధిగా చేశాడు. ఆయన ﷺ విధేయత పాటించినవారు ఇహములో అదృష్టవంతులై పరలోకంలో స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆయన ﷺ కు అవిధేయత చూపినవారు ఇహములో దురదృష్టవంతులై పరలోకంలో నరకంలో ప్రవేశిస్తారు.
ఆయన ﷺ మరణించాక ఆయన సహచరులు ఆయన అడుగుజాడలో నడచి, ఆయన సందేశాన్ని ఇతరులకు అందజేశారు. ఇస్లాంను నలుమూలలో వ్యాపింప జేశారు.
7-ఆయన ﷺ సద్గుణాలు, సద్వర్తన
సర్వ మానవాళిలో అత్యుత్తమ నడవడిక గలవారు ప్రవక్త ముహమ్మద్ ﷺ. ఇది వారిలో ప్రవక్త పదవి లభించక ముందు నుంచే ఉండినది. అది లభించాక మరింత అధికమయింది. స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడుః నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీలం కలవాడవు. (68: ఖలం: 4). ఆయన ﷺ ఇస్లాం ప్రచారం చేస్తూనే ఉత్తమ శీలం, మంచి నడవడికను గురించి బోధించి, ప్రోత్సహించేవారు. మరియు స్వయంగా తమ సహచరులకు బోధించే ప్రవర్తనకు గొప్ప నిదర్శనగా ఉండేవారు. సద్వర్తనను తమ సహచరుల మదిలో ఉపదేశాలతో నాటే ముందు తమ నడవడిక, ఆచరణలతో ఉన్నతమైన సద్ర్పవర్తన అంటేమిటో వారి మదిలో నాటేవారు. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. అల్లాహ్ సాక్షి! ఒక్కసారి కూడా నన్ను హూఁ అని అన లేదు. ఇలా ఎందుకు చేశావు? అలా ఎందుకు చేయలేదు? అని ఏనాడూ నిలదీయలేదు. (ముస్లిం).
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: నేనొక రోజు దైవప్రవక్త ﷺతో కలసి నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన నజ్రాన్ కండువ కప్పుకొని ఉన్నారు. దాని అంచులు లావుగా ఉండేవి. దారిలో ఓ పల్లెవాసి కలసి ప్రవక్త (కండువ)ను పట్టి గట్టిగా లాగాడు. అలా గట్టిగా లాగడం వల్ల ప్రవక్త ﷺ భుజం మీద కండువా అంచులు గీరుకుపోయి ఆ ప్రదేశం కందిపోయింది. (పల్లెవాసి అంతటితో ఊరుకోక కటువుగా మాట్లాడుతూ) ‘మీకు అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి నాకు కొంచెం ఇప్పించండి’ అని అన్నాడు. దైవప్రవక్త ﷺ అతని వైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వుతూ అతనికి కొంత ధనం ఇవ్వమని (సహచరుల్ని) ఆజ్ఞాపించారు. (బుఖారి 3149, ముస్లిం 1057).
ప్రవక్త ﷺ తమ ఇంట్లో ఉన్నప్పుడు ఏమి చేసేవారని ఆయన పవిత్ర భార్య ఆయిషా రజియల్లాహు అన్హాని ప్రశ్నించినప్పుడు ‘ఆయన తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజు సమయమయిన వెంటనే వుజూ చేసుకొని నమాజు కొరకు బయలుదేరేవారు’ అని సమాధానమిచ్చారు. (బుఖారి 676).
ప్రవక్త ﷺ కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదని అబ్దుల్లాహ్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) తెలియజేస్తున్నారు. అందరికీ తెలిసిన ఆయన ఉత్తమ గుణాల్లో కొన్ని ఇవి: ఆయన దాత, ఎన్నడూ ఏ కొంచమైనా పిసినారితనం చూపలేదు. శూరుడు, సత్యం, ధర్మం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవతంలో సంత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు. (తిర్మిజి 3641).
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఎవరైనా, ఏదైనా అడిగితే ‘లేదు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ అనలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహాసములాడేవారు. (ధనిక, పేద బేధ లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిలవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టుకొని ఆడించేవారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు. (అపరాధుల సాకును) ఒప్పుకునేవారు. తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబోధించేవారు. మాట్లాడుతున్నవారి మధ్య ఆటంకం కలిగించేవారుకారు. అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ఒకసారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవ చేయుటకు సిద్ధమయ్యారు. అప్పుడు సహచరులిలా అన్నారుః ప్రవక్తా! మేము ఉన్నాము కదా చాలు. “వీరు మా సహచరులకు తగిన విధంగా ఆదరించారు. ప్రతీకగా నేను కూడా మంచి ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను” అని ప్రవక్త బదులిచ్చారు.
మరో సందర్భంలో ఇలా సంబోధించారుః “నేనొక దాసుణ్ణి, దాసుడు తినే విధంగా నేనూ తింటాను. దాసుడు కూర్చునే విధంగా నేనూ కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు. నిరుపేద, బీదవాళ్ళతో సమానంగా కూర్చునేవారు.
స్కాట్డలాండ్ కు చెందిన థామస్ కార్లిల్ అనే తత్వవేత్త (Scottish philosopher, Thomas Carlyle) నోబెల్ ప్రైజ్ పొందిన తన రచన “On Heroes, Heroworship, and the Heroic in History”లో తన క్రైస్తవ జాతిని సంబోధించి ప్రవక్త ﷺ గురించి చాలా విషయాలు వ్రాశాడు, అందులోని ఒక విషయం ఇది: ‘ఇస్లాం ధర్మం అసత్యం, ముహమ్మద్ మోసగాడు, అసత్యవాది అని వినబడే మాటలను చెవి యొగ్గి వినుట అతినీచ కార్యం అని ఈ కాలంలో చాలా స్పష్టం అయింది’.
8-మహాప్రవక్త ﷺ మహత్యములు
ప్రవక్తకు లభించిన మహత్యాల్లో అతి గొప్పది ఖుర్ఆన్. అది భాషాప్రవీణులను
లొంగదీసింది. అందరూ కలసి అందులో ఉన్నటువంటి ఒక్క సూరానైనా తేగలరా అని అల్లాహ్ సవాలు చేశాడు. ఈ శక్తి తమకు లేదని ఆవిశ్వాసులు ఒప్పుకున్నారు. ఈ సవాలు ఇప్పటికీ ఉంది.
చంద్రుణ్ణి రెండు ముక్కలు చేసి చూపించండని మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో ఛాలెంజ్ చేసినప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ తో ప్రార్థించారు. ఆ తర్వాత చంద్రుడు రెండు ముక్కలైనది స్పష్టంగా కనిపించింది.
ఎన్నో సార్లు వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి. ఆయన చేతిలో కంకర రాళ్ళు తస్బీహ్ (అల్లాహ్ పవిత్రత) పఠించాయి.
ప్రవక్తను హతమార్చడానికి ఒక యూదురాలు విషం కలిపి బహుకరించిన మాంసపు ముక్క ఆయన ﷺ తో మాట్లాడింది.
ఒక పల్లెవాసి ఒక మహత్యం చూపమని కోరాడు. ఆయన ﷺ ఒక చెట్టును ఆదేశించగా అది ఆయన వద్దకు వచ్చింది. మరలా ఆదేశించగా అది దాని చోటుకి వెళ్ళి పోయింది.
పాలు లేని ఒక మేక పొదుగును తమ శుభహస్తాలతో ముట్టుకోగా అందులో పాలు సమకూరాయి, దాని పాలు పితికి స్వయంగా తాగారు. తమ మిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కు కూడా త్రాగించారు.
అలీ బిన్ ఆబీతాలిబ్ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో అవస్త ఉండగా ఆయన ﷺ ఆ కళ్ళల్లో తమ ఉమ్మి వేశారు. అవి అప్పటికప్పుడే బాగుపడ్డాయి.
ఒక సహచరుని కాలుకు అవస్త ఉండగా తమ చేతితో తుడువగానే అక్కడికక్కడే నయం అయింది.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)కు దీర్ఘ ఆయుష్షు, అనేక ధన, సంతానం కలుగజేయు అని అల్లాహ్ ను ప్రార్థిస్తే ఆయన 120 సంవత్సరాలు జీవించారు. ఆయనకు కలిగిన సంతానం 120 మంది. ఆయన ఖర్జూరపు తోట సంవత్సరంలో రెండు సార్లు ఫలించేది. అయితే అది సంవత్సరానికి ఒక సారి మాత్రమే ఫలిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
మస్జిద్ లో మెంబర్ పై నిలబడి ప్రసంగిస్తున్నప్పడు ‘అనావృష్టి సంభవించి చాలా నష్టం కలుగుతున్నది’ అని ఒక వ్యక్తి చెప్పగా ఆయన ﷺ అల్లాహ్ ను ప్రార్థించారు. ఆకాశంలో ఎక్కడా లేని మేఘాలు, కొద్ది క్షణాల్లో పర్వతాల మాదిరిగా గుమిగూడి వారం రోజులు ఎడతెగకుండా వర్షం కురిసింది. మరోసారి వర్షాలు చాలా ఎక్కువయ్యాయి అని చెప్పగా, వర్షాలు ఆగిపోవాలని దుఆ చేసారు అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలు ఎండలో నడిచి వెళ్ళారు.
ఒక యుద్ధం (జంగె ఖందఖ్)లో రెండున్నర కిలోల జొన్న పిండితో చేసిన రొట్టెలు మరియు ఒక మేక మాంసం వెయ్యి మంది సహచరులతో కలిసి ఆయన ﷺ భుజించారు. ఆ రొట్టెలు, వండిన కూర మొత్తం అలాగే మిగిలింది.
వంద మంది అవిశ్వాసులు ఆయన ﷺ ను హతమార్చడానికి ఆయన గృహాన్ని చుట్టుముట్టారు. ఆయన ﷺ వారి ముఖాలపై మట్టి విసిరి వెళ్ళిపోయారు. వారు చూడలేకపోయారు.
సురాఖ బిన్ మాలిక్ ఆయన ﷺ ను చంపడానికి వెంటపడి దగ్గరికి రాగానే, ఆయన ﷺఅతనిపై శపించారు. అతని గుఱ్ఱపు మొదటి రెండు కాళ్ళు మొకాళ్ళ వరకు భూమిలోకి దిగిపోయాయి.
ఇవేగాక ఇంకా అనేక మహత్యాలున్నాయి. అన్నియు అల్లాహ్ తరఫు నుండి లభించినవే. ఎందుకనగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని రుజువు పరచడానికి.
9-ఇస్లాం ధర్మం యొక్క పునాదులు
1- అల్లాహ్ పై విశ్వాసం: ఇది ఇస్లాం ధర్మం యొక్క అసలైన పునాది. అల్లాహ్ పై విశ్వాసం అంటేః అల్లాహ్ ఉన్నాడని, అతడే ప్రతిదానికి పోషకుడు, అధికారి, ఏకైక సృష్టికర్త మరియు సర్వ జగత్తును నడిపేవాడని గాఢంగా విశ్వసించుట. ఇంకా అతడొక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడు, అతనికెవ్వడూ భాగస్వామి లేడు. సర్వ ఉత్తమ గుణాలు గలవాడు. ప్రతి లోపాలకు, దోషాలకు అతీతుడు. తన సృష్టిలో దేనికీ పోలినవాడు కాడు అని దృఢంగా విశ్వసించాలి.
ఈ లోకాన్ని, ఇందులో ఉన్న సృష్టిని గమనించేవాడు ఇవి తమంతట తామే ఉనికిలోకి రావడం అసాధ్యం అని నమ్ముతాడు. వీటన్నిటికి ఒక సృష్టకర్త లేనిదే ఉనికిలోకి రావడం కూడా అసాధ్యం అని నమ్ముతాడు. అయితే ఆ సృష్టికర్త ఎవరు?. అతడే అల్లాహ్.
2- దైవదూతలపై విశ్వాసం: వారు మన కళ్ళకు కనబడని ఒక సృష్టి. అల్లాహ్ యే వారిని పుట్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. లేక వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అల్లాహ్ ఆదేశాల సంపుర్ణ పాలన గుణం మరియు బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే గుణం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
ఒక ముస్లిం వారి ఉనికినీ మరియు వారి సరియైన సంఖ్య అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదని విశ్వసించాలి.
ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని వారి పేర్లతోనే విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్ మరియు మాలిక్ తదితరులు.
ఎవరిది ఏ గుణం, ఏ పని ఉందో వారిని అలాగే విశ్వసించాలి.
3- గ్రంధాలపై విశ్వాసం: సత్యాన్ని స్పష్ట పరచుటకు మరియు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలుచుటకు పూర్వ ప్రవక్తల్లో కొందరిపై అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడని ముస్లిం విశ్వసించాలి. ఉదాః తౌరాత్, ఇంజీల్, జబూర్. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ పై అల్లాహ్ ఖుర్ఆన్ అవతరింపజేశాడని విశ్వసించాలి.
ఖుర్ఆన్: సర్వమానవాళికి ఇది అల్లాహ్ యొక్క అంతిమ సందేశం.
ఖుర్ఆను తెచ్చిన దాని ప్రకారంగా ఉన్న ఆచరణలనే అల్లాహ్ అంగీకరిస్తాడు. ఇది పూర్వ గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ధ్రువీకరిస్తుంది మరియు పరిరక్షిస్తుంది. దీని ప్రత్యేకమైన ఒక విషయం: ‘దీనిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు’; అందుకే ఇందులో మార్పులు చేర్పులు జరగలేవు. పూర్వ గ్రంథాలు మార్పు చేర్పులకు గురి అయ్యాయి; ఎందుకనగా అల్లాహ్ వాటి రక్షణా బాధ్యత తీసుకోలేదు.
ఖుర్ఆన్ అతి ఉత్తమ సాహిత్య శైలికి దర్పణం లాంటిది. దీనిలోని ధార్మిక శాసనాలు అతి ఉన్నతమైనవి. ఇందులో ఏ మానవునికీ తెలియని అల్లాహ్ కు సంబంధించిన విషయాలు, అగోచర విషయాలు తెలుపబడినవి. ఏ మనిషీ తన మేధను ఉపయోగించి కూడా వాటిని తెలుసుకోలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో, ఆ తరువాత కాలములో లేక ఆ తరువాత కాలాల్లో ఎవరికీ తెలియని నెచురల్ సైన్స్ (Natural scince)కు సంబంధించిన నియమాలను మరియు దృగ్గోచర విషయాలను (Phenomenon) సూచించింది. ఇంకా అందులో సూచించబడిన ఎన్నో విషయాలు ప్రవక్త ముహమ్మద్ ﷺ తరువాత పదమూడు వందల సంవత్సరాలకు కనిపెట్టబడినవి, స్పష్టమయినవి. ఇంకెన్నో ఇప్పటికీ స్పష్టం కాలేదు.
సర్వ మానవులు ఈ ఖుర్ఆన్ వంటిది, లేదా కనీసం దీనిలోని ఒక్క సూరా వంటిది తీసుకురాగలలేరని అల్లాహ్ సవాల్ చేశాడు. వారు లొంగిపోయారు. ఆ సవాల్ ఇప్పటికీ ఉంది. ప్రజల్లో బలహీనత కూడా ఉంది అంటే వారు ఇప్పడు కూడా దానిలాంటిది తేలేరు.
భాషాప్రవీణులను లొంగదీసే తత్వం కేవలం దాని పదాల్లోనే కాదు, లేక కేవలం అగోచర విషయాల గురించి చెప్పడంలోనే కాదు, లేక ధార్మిక శాసనాల్లోనే కాదు, అన్నింటిలోనూ కలిసి ఉంది.
4- ప్రవక్తలపై విశ్వాసం: ప్రజల్ని అల్లాహ్ వైపు ఆహ్వానించడానికి దానికి వ్యెతిరేకంగా ఉన్న దానిని ఖండించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడని ముస్లిం విశ్వసించాలి. వారు మానవులు. అల్లాహ్ వారిని సృష్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అన్నపానీయాలు, చావు బ్రతుకుల్లాంటి మానవ ఆవసరాలే వారికీ ఉన్నాయి. ప్రవక్తలు సర్వమానవుల్లో శ్రేష్ఠులు. అల్లాహ్ వారిని సందేశహరులుగా, ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారిని విశ్వసించుట అంటే వారికి ఇవ్వబడిన సందేశం సత్యం అని భావం. ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని ఆ పేర్లతోనే విశ్వసించాలి. వారు ఇచ్చిన వార్తలను సత్యంగా నమ్మాలి. చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ తెచ్చిన ధర్మాన్ని ఆచరించాలి. ఆయన ﷺ తర్వాత ఇంకెవ్వరి ధర్మం కూడా చెల్లదు. అంగీకరించబడదు.
5-పరలోక విశ్వాసం: అది అంతిమదినం. ఆ రోజున పాపపుణ్యాల లెక్క తీసుకొని ప్రతి ఒక్కరికి తగిన ఫలితమిచ్చుటకు అల్లాహ్ అందరినీ సమాధుల నుండి లేపుతాడు. దానిని అంతిమ దినం అనడానికి హేతువు ఏమనగా ఆ తరువాత ఏ దినమూ ఉండదు. స్వర్గవాసులు తమ స్థానంలో మరియు నరకవాసులు తమ స్థానంలో ఉండిపోతారు.
పరలోక (అంతిమదిన) విశ్వాసం అంటే ఆ దినం ఖచ్చితంగా రానుందని దృఢంగా విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి.
పరలోక విశ్వాసంలో మూడు విషయాలు వస్తాయిః
అ: మృతులను బ్రతికించడంపై విశ్వాసం. ఆ రోజు అల్లాహ్ చనిపోయినవారందరినీ సమాధుల నుండి నగ్న శరీరము, నగ్న పాదములతో మరియు శిశ్నాగ్రచర్మంతో (సున్నతీలేకుండా) నిలబెడతాడు.
ఆ: లెక్క, ప్రతిఫలం జరుగుననే విశ్వాసం. ఆ రోజు అల్లాహ్, ఇహలోకంలో ఏమి చేశావు అని ప్రతి మానవుడ్ని అడుగుతాడు. దాని ప్రకారం ఫలితమిస్తాడు. ఎవరైతే విశ్వసించి, విధేయత చూపి, సత్కార్యాలు చేయుదురో వారికి స్వర్గం లభించును. ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడి అవిధేయతకు గురియగుదురో వారికి నరకం ప్రాప్తమగును. లెక్క, ప్రతిఫలం జరుగుట వివేకంతో కూడిన విషయం. ఎందుకనగా అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడు. ప్రవక్తల్ని పంపాడు. ప్రజలకు మంచి చెడులన్నియు స్పష్టపరచాడు. ఆ తరువాత ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఆజ్ఞాపాలన చేయాలని ఆదేశించాడు. అయితే కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు తిరస్కారులయ్యారు. ఇక వీరిద్దరినీ సమానంగా చూచుట అల్లాహ్ వివేకానికీ, న్యాయానికి తగినది కాదు. దివ్యగ్రంథంలో అల్లాహ్ ఇలా తెలిపాడు: ((మేము విధేయుల స్థితిని అపరాధుల స్థితి మాదిరిగా చేస్తామా? ఏమయింది మీకు, ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?)). (68:35,36).
ఇ: స్వర్గం, నరకం పట్ల విశ్వాసం. అది మానవుల శాశ్వత స్థానం. స్వర్గం భోగభాగ్యాలతో కూడుకున్న స్థానం. అది అల్లాహ్ విధించిన వాటిని విశ్వసించిన భక్తిపరులు, నిర్మలమైన భక్తితో అల్లాహ్ ఆయన ప్రవక్తకు విధేయులై, ప్రవక్త అడుగుజాడల్లో నడిచినవారి కొరకు సిధ్ధపరచబడింది. స్వర్గంలో చేరినవారు తమ సత్కర్మల ప్రకారం వివిధ అంతస్తుల్లో ఉంటారు.
నరకం శిక్షల స్థానం. అల్లాహ్ ను విశ్వసించని, ప్రవక్తకు విధేయత చూపని దుర్మార్గుల కొరకు సిద్ధపరచబడింది. నరకంలో వివిధ స్థానాలు, అంతస్తులున్నాయి. ఎవరి పాపాల తీరు వారు అందులో ఉంటారు.
6- విధివ్రాతపై విశ్వాసం: భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానమంతయు అల్లాహ్ కు గలదు. అల్లాహ్ కోరినదే జరుగును, ఆయన కోరనిది జరగదు. ఏది సంభవించినా ఆయన జ్ఞానం, కోరిక లేనిదే సంభవించదు అని విశ్వసించుట.
10-ఇస్లాంలో ఆరాధన
ఇస్లాం ప్రకారం ‘ఆరాధన’ చిత్తశుద్ధితో అల్లాహ్ కు ప్రత్యేకించి చేస్తేనే తప్ప అంగీకరించబడదు. ప్రవక్త ﷺ పద్దతికి అనుగుణంగా ఉండడం కూడా తప్పనిసరి. ఉదాః నమాజ్ ఒక ఆరాధన. అది కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. ప్రవక్త ﷺ చేసి చూపిన పద్దతిలోనే చేయాలి.
అది ఈ కారణంగాః
1- ఆరాధన చిత్తశుధ్ధితో ఏకైక అద్వీతీయుని కొరకే చేయాలని స్వయంగా అల్లాహ్ ఆదేశించాడు. ఆయనతో పాటు ఇతరుల ఆరాధన, ఆయనకు సాటి కల్పించినట్లగును. అల్లాహ్ ఆదేశం: ((అల్లాహ్ నే ఆరాధించండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి)). (4:36).
2- ధర్మం, షరియత్ కు సంబంధించిన ఆదేశాలిచ్చే హక్కు (Legislative power) కేవలం అల్లాహ్ కే ఉంది. ఇతరుల ఆరాధనను అల్లాహ్ ధర్మసమ్మతం చేయలేదు. అల్లాహ్ ధర్మ సమ్మతం చేయని ఆరాధన ఏ మనిషైతే చేస్తాడో అతడు Legislative power([2]) ను తన చేతిలోకి తీసుకున్నవాడవుతాడు.
3- మన కొరకు ధర్మాన్ని అల్లాహ్ సంపూర్ణం చేశాడు. అల్లాహ్ సంపూర్ణం చేసిన ధర్మంలో లేని ఆరాధన కనిపెట్టినవారు, ఆచరించినవారు సంపూర్ణ ధర్మంలో లోపం చూపినవారవుతారు.
4- మనిషి తనకు నచ్చిన ఆరాధన, తాను కోరిన విధంగా చేయుటయే సరిఅయినదై ఉంటే, విభిన్న అభిరుచుల కారణంగా ప్రతి మనిషికీ తనదైన ప్రత్యేక ఆరాధన ఉండేది.
11-ఇస్లాం మూలసూత్రాలు
అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇస్లాం మూల సూత్రాలు ఐదు.
1- (లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్) ‘అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ముహమ్మద్ ﷺ అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
2- నమాజు స్థాపించుట.
3- జకాత్ (విధి దానం) చెల్లించుట.
4- రమజాను మాసములో ఉపవాసం ఉండుట.
5- హజ్ చేయుట.
12-ఇస్లాం మూలసూత్రాల భావం
1- (లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్) సాక్ష్యం యొక్క భావం ఏమనగా నోటితో పలికిన పదాలకు అనుగుణంగా ‘అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు, అద్వితీయుడు, భాగస్వామి లేనివాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త, సందేశం అందజేయువారు అని దృఢంగా విశ్వసించాలి.
ఏ మనిషి అయినా, అతని ఇస్లాం మరియు కర్మల అంగీకారం అల్లాహ్ పట్ల ఉన్న అతని చిత్తశుద్ధి (ఇఖ్లాస్)పైనా మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ అనుసరణ, విధేయతపైనా ఆధారపడి ఉంది.
(లాఇలాహ ఇల్లల్లాహ్) యొక్క భావం: అల్లాహ్ యే సత్య ఆరాధ్య దైవం, ఆయన అద్వితీయుడు అన్న విశ్వాసంతో ఈ వచనం నోటితో పలకాలి. నోటితో పలకడం సరిపోదు, దాని ప్రకారం ఆచరించాలి. అల్లాహ్ ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపాలి. (ముహమ్మదుర్రసూలుల్లాహ్) యొక్క భావం: ప్రవక్త చెప్పిన మాటను సత్యపరచాలి. ఆయన ఆదేశాలను అనుసరించాలి. ఏ పనుల నుండి హెచ్చరించారో, నివారించారో వాటికి దూరంగా ఉండాలి. అల్లాహ్ యొక్క ఆరాధన ఆయన ﷺ చూపిన విధంగా చేయాలి.
2- నమాజు స్థాపించుటః రేయింబవళ్ళలో ఐదు పూటల నమాజు ఇస్లాంలో విధిగా ఉంది. అవిః ఫజ్ర్ నమాజ్, జొహ్ ర్ నమాజ్, అస్ర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్.
3- జకాత్ చెల్లించుటః ధనంలోని ఒక నిర్ణీత ప్రమాణం అల్లాహ్ సూర తౌబా (9:60)లో తెలిపిన ప్రకారం పేదవారికి, అవసరార్థులకు, తదితరులకు ఇచ్చుట.
జకాత్ లాభాలుః ఆత్మశుద్ధి కలుగును. దురాశ మరియు పిసినారితనం దూరమగును. పేద ముస్లింల అవసరాలు తీరును. పేద, ధనవంతుని మధ్య ప్రేమ సంబంధాలు స్థిరపడును. స్వార్థం, ఈర్ష్య లాంటి దుర్గుణాలు దూరమగును. ఆప్యాయత, వినమ్రత మరియు ఇతరుల అవసరాల పట్ల అవగాహన కలుగును.
4- రమజాన్ ఉపవాసాలుః రమజాను మాసములో పగలంతా అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో ఉపవాసం భంగము చేయు విషయాలకు దూరంగా ఉండుట. ప్రతి ముస్లిం రమజాను మాసమెల్ల ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ యొక్క ఆరాధనోద్దేశంతో
అన్నపానీయాలు మరియు లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి.
ఉపవాసం యొక్క లాభాలుః ఆత్మశుద్ధి. అల్లాహ్ సంతృప్తి పొందే ఉద్దేశంతో ఇష్టమున్న వాటిని విడనాడే అలవాటు మనస్సుకు కల్గించుట. ఇంకా కష్టాలు భరించే, సహనం వహించే అలవాటు కల్గించుట. చేసే సత్కార్యాలు చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట. బాధ్యతలను నెరవేర్చుట. ఇతరుల ఆకలిదప్పులను గ్రహించుట. ఆరోగ్యవంతంగా ఉండుట మొదలగునవి.
5- హజ్: కాబా వరకు చేరుకునే శక్తిగలవారు జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళి హజ్ కు సంబంధించిన కార్యాలు నెరవేర్చుట.
13-ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకతలు
సర్వ మానవాళి కొరకు అల్లాహ్ ఇష్టపడిన ధర్మం ఇస్లాం. అది ప్రతి యుగానికి, ప్రతి సమాజానికి అనుకూలమైనది. ప్రతి మంచిని గురించి బోధించునది. ప్రతి చెడును గురించి నివారించునది. మానవులకు ఇహలోక సుఖం, పరలోక ముక్తి లభించాలంటే ఇస్లాం ధర్మాన్నే స్వీకరించాలి. దాన్ని మన జీవిత వివధ వ్యవహారాల్లో పాటించాలి. ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇతర ధర్మాల్లో లేని, దాని ప్రత్యేకతలే సరిపోవును.
1- ఇది అల్లాహ్ తరఫున వచ్చిన ధర్మం. మానవుల అవసరాలను అల్లాహ్ యే బాగా ఎరుగును. అల్లాహ్ ఆదేశం: ((పుట్టించినవాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడు)). (67:14).
2- ఇది మానవ మొదటి స్థితిని, అంతిమ గతిని మరియు సృష్టి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపుతుంది. ఇంకా మానవుడు ఇహలోకంలో విధిగా నడవవలసిన దారి ఏదో విశదపరుస్తుంది. విధిగా విడనాడవలసిన వాటిని సయితం వివరిస్తుంది. చదవండి ఈ క్రింది దివ్యగ్రంథ ఆయతులుః ((మానవులరా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు)). (4:1). ((ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము. దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము)). (20:55). ((నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరిదేని కొరకూ సృష్టించలేదు)). (51:56). ((ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను)). (5:3).
3- ఇది స్వభావిక ధర్మం. ప్రకృతి, స్వభావానికి విరుద్ధం కాదు. ((అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి)). (30:30).
4- ఇది మేధ ప్రాముఖ్యతను కాదనదు. సవ్యమైన రీతిలో యోచించాలని ఆదేశిస్తుంది. మూర్ఖత్వం, అంధానుకరణకు అనుమతి ఇవ్వదు. అలాగే సవ్యమైన యోచన నుండి అశ్రద్ధను అసహ్యించుకుంటుంది. అల్లాహ్ ఆదేశం ఇలా వుందిః ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు)). (39:9). ((భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్ని వేళలా అల్లాహ్ ను స్మరించే, భూమి, ఆకాశాల నిర్మాణం గురించి చింతనచేసే వివేకవంతులకు ఎన్నో సూచనలున్నాయి. (వారు ఇలా అంటారుః) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు)). (3:191,192).
5- ఇందులో విశ్వాసం మరియు ధర్మశాస్త్రం (జీవన విధానం) రెండూ సంపూర్ణంగా ఉన్నాయి. ఇది కేవలం ఊహగానాల వరకు పరిమితమైనది కాదు. నిజమైన విశ్వాసాలు, వివేకంతో కూడిన వ్యవహారాలు, సుందర ప్రవర్తన అన్నియూ ఇందులో ఉన్నాయి. ఇది వ్యక్తికీ మరియు సంఘానికీ, ఇహలోకానికీ మరియు పరలోకానికీ సంబంధించిన ధర్మం.
6- ఇది మనిషి భావాలకు (sentiments) ప్రాముఖ్యతనిస్తుంది. మంచికి, నిర్మాణ కార్యక్రమాలకు యంత్రంగా మలచుటకు ఇస్లాం మార్గదర్శకత్వం చేస్తుంది.
7- ఇది స్నేహితులు, శత్రువులు, తనవాళ్ళు, పరాయివాళ్ళు అందరితో న్యాయం చేయమని బోధిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((న్యాయం చేయండని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు)). (16:90). ((పలికితే న్యాయమే పలకండి)). (6:152). ((ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి అత్యంత సమీపమైనది)). (5:8).
8- సత్యమైన సోదరభావంగల ధర్మం ఇస్లాం. ముస్లిములందరూ ధార్మిక సోదరులు. దేశాలు, జాతులు మరియు రంగులు వారిని విడదీయవు. ఇస్లాంలో కుల, వర్ణ ప్రాధాన్యతలు లేవు. ప్రాధాన్యతలకు గీటురాయి దైవభీతి. అల్లాహ్ ఆదేశం: ((వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు)). (49:13).
9- ఇది విద్య, విజ్ఞతలను పెంపొదిస్తుంది. ఇస్లాం తన అనుచరులను విద్యనభ్యసించాలని ఆదేశిస్తుంది. దానిపై గొప్ప ప్రతిఫల వాగ్దానం చేస్తుంది. చదవండి అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించిన వారికి, జ్ఞానం ప్రసాదింపబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు)). (58:11). ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా?)). (39:9). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా ప్రవచించారుః “విద్యనభ్యసించుట ప్రతి ముస్లింపై విధిగా ఉంది”.
10- ఎవరు ఇస్లాం స్వీకరించి, మంచిరీతిలో దాన్ని అనుసరించాడో -వ్యక్తి అయినా లేక సంఘం అయినా- అతనికి సౌభాగ్యం, గౌరవం ప్రసాదించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే, ఆయన వారిని, వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలు (ప్రతినిధులు)గా చేస్తాడు, అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి యొక్క (ప్రస్తుత) భయస్థితిని శాంతిభద్రతలతో కూడిన స్థితిగా మారుస్తాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవ్వరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు)). (24:55). ((పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే, విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. (పరలోకంలో) అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము)). (16:97).
11- ఇది పరస్పరం ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపవలసినదిగా బోధించే ధర్మం. మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “ముస్లిముల ఉదాహరణ వారి పరస్పర దయాశీలత, ప్రేమ, మరియు అన్యోన్య అనురాగంలో ఒక దేహం లాంటిది. దేహంలో ఒక అవయవానికి ఏదయినా జబ్బు చేస్తే దేహంలోని ఇతర అవయవాలు కూడా విశ్రమాన్ని వదలి జ్వరంలో పాలు పంచుకుని దానికి తోడవుతాయి”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “కరుణించువారిపై కరుణామయుడైన అల్లాహ్ కరుణించును. అందుకు భువిలో ఉన్నవారిని మీరు కరుణించండి. దివిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణించును”. మరో సందర్భంలో ఇలా హెచ్చరించారుః “తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఏ వ్యక్తి కూడా నిజమయిన విశ్వాసి కాజాలడు”.
12- ఇస్లాం పని చేయాలని, కష్టపడాలని, ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “బలహీనుడయిన విశ్వాసికన్నా బలశాలి అయిన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ప్రియుడు, ఉత్తముడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమైతే నీకు లాభదాయకమైనదో దాని గురించి ఎక్కువ ఆశపడి (దాన్ని పొందే ప్రయత్నం చేయి). ధైర్యాన్ని కోల్పోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం వాటిల్లితే, లేక కష్టం కలిగితే ‘నేను ఆ విధంగా చేసివుంటే మరో విధంగా జరిగి ఉండేది’ అని అనకుము. దానికి బదులుగా ‘అల్లాహ్ యే నిర్ణయం చేశాడు. తనకు కోరినట్లు జరిగింది’ అను”.
13- విరుద్ధ విషయాలు ఇందులో లేవు. అల్లాహ్ ఆదేశం: ((ఇది అల్లాహ్ తరఫునుండి కాక వేరొకరి తరఫునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండేవి)). (4:82).
14- ఇది స్పష్టంగా, సులభంగా ఉంది. ప్రతి ఒక్కరికీ తేలికగా అర్థమయ్యేటట్లు ఉన్నది. ((నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?)). (54:17).
15- దాని ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరచి ఉన్నాయి. దాన్ని నేర్చుకోవాలన్న, దాన్ని స్వీకరించాలన్న వ్యక్తిని వద్దని వారించదు.
16- ఇది ఉత్తమ ప్రవర్తన, సత్కర్మల వైపునకు ఆహ్వానిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంభించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు)). (7:199). ((నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు)). (41:34). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉపదేశించారుః “అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునవిః అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “ప్రజల్లో అల్లాహ్ కు అతిప్రియుడు వారికి లాభం చేకూర్చేవాడు. సత్కార్యాల్లో అల్లాహ్ కు చాలా ప్రియమైనవిః నీవు నీ తోటి ముస్లిములను సంతోషపరుచుట. లేక అతని ఒక ఆపదను దూరం చేయుట. లేక అతనిపై ఉన్న ఋణాన్ని తీర్చుట. లేక అతన్ని ఆకలి బాధ నుండి తప్పించుట. ఒక ముస్లిం వెంట ఉండి అతని అవసరాన్ని తీర్చడం, ఒక నెల మస్జిద్ లో ‘ఏతికాఫ్’ (ప్రార్థన చేస్తూ మస్జిద్ లో ఉండుట) కంటే నాకు ఎంతో ప్రియమైనది”.
17- ఇది బుద్ధీ జ్ఞానాలను కాపాడుతుంది. అందుకే మత్తుపదార్థాలను, డ్రగ్స్ మరియు బుద్ధిని చెడగొట్టే ప్రతిదానిని నిషేధించింది. అల్లాహ్ ఆదేశం ఇదిః ((మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్ కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి)). (4:29).
18- ఇస్లాం ధనసంపదలను రక్షిస్తుంది. అందుకే అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ప్రోత్సహించింది. అలాంటి వారికి ఉత్తమ జీవనోపాధి మరియు స్వర్గ ప్రవేశం వాగ్దానాలు చేయబడ్డాయి. దొంగతనం నిషేధించబడింది. ప్రజల సొమ్ము దొంగలించే మరియు వారిని భయాంధోళనకు గురి చేసే ధైర్యం చేయకుండా ఉండుటకు, వారికి ఇహపరాల్లో శిక్ష గురించి హెచ్చరిక చేయబడింది.
19- ఇస్లాం ప్రాణాన్ని కూడా కాపాడుతుంది. అందుకే హత్యను నిషేధించింది. హంతకునికి ఇహంలో హతం మరియు పరంలో శాశ్వత నరకం శిక్ష తెలిపింది. ఏ ఇస్లామీయ దేశాల్లో ఈ చట్టం ఉందో అచ్చట హత్య సంఘటనలు కానరావడం చాలా అరుదు. ఒకర్ని హత్య చేస్తే తనూ చంపబడుతాడని తెలిసిన వ్యక్తి హత్యకు దూరంగానే ఉంటాడు. ఇలా నేరస్తుల నేరాల నుండి ప్రజలు నిర్భయంగా, శాంతిగా ఉంటారు.
20- ఇస్లాం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది. అల్లాహ్ ఆదేశం: “తినండీ, త్రాగండీ, మితిమీరకండి”. (7:31). ఈ వాక్యంలో వైద్య శాస్త్ర మూలం తెలుపబడింది. అది ఎలా అనగా తినత్రాగడంలో మితిమీరకుండా జాగ్రత్తపడుటయే ఆరోగ్య రక్షణకు మూల కారణం. ఆరోగ్యాన్ని కాపాడుటకే మత్తు, డ్రగ్స్ లను ఇస్లాం నిషేధించింది. మరియు అవి ఆరోగ్యానికి ఎంత హానికరమైనవో తెలియనిది కాదు. అదేవిధంగా వ్యభిచారం, స్వలింగసంపర్కం (Sodomy)ను నిషేధించింది. వాటి వల్ల వ్యాపిస్తున్న సుఖవ్యాధులు, లైంగికవ్యాధులు (syphillis, gonorhoea) ఇప్పుడు గుప్తంగా ఏమాత్రం లేవు. ఉదాహరణకుః హెచ్.ఐ.వి./ఏయిడ్స్, herpes, venereal తదితర వ్యాధులు.
21- ఇస్లాం మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది. కాని ఒక హద్దులో. మనిషి స్వేచ్ఛగా క్రయవిక్రయాలు, వ్యాపారము మరియు ప్రయాణాలు వగైరా చేయవచ్చు. కాని ఒకరికి మోసం, ద్రోహం, నష్టం చేయరాదు. అలాగే ఇస్లాంలో తినుట, త్రాగుట, ఆఘ్రాణించుట, పీల్చుట, ధరించుటలో పూర్తి స్వాతంత్రం ఉంది. అయితే స్వయంగా తనకు, లేదా ఇతరులకు నష్టం చేకూర్చే నిషిద్ధానికి పాల్పడకూడదు.
14-ఇస్లాం ధర్మంలోని ఉత్తమ విషయాలు
మనిషికి ఇహలోకములో అవసరమున్న మరియు ఇహపరాల సాఫల్యానికి తోడ్పడే ప్రతి ఒక్కటి నేర్పుటకు ఇస్లాం వచ్చింది. ఇస్లామీయ ఆదేశాలు మరియు నిషిద్ధతలపై దృష్టిసారిస్తే అందులోగల ఉత్తమ విషయాలు స్పష్టమవుతాయి.
14.1 – ఒకటి: ఇస్లామీయ ఆదేశాలు:
1- మానవుడు పశువుల వలే కాకుండా, తన వాంఛలకు బానిస కాకుండా గౌరవస్థాయిలో ఉండుటకు, ఇంకా ఇతర సృష్టిరాసులను గొప్పగా భావించి, తన దైవాన్ని వదలి వారి ముందు నమ్రత చూపకుండా ఉచ్చస్థాయికి చేర్చునటువంటి ఆదేశాలిస్తుంది ఇస్లాం.
2- బుద్ధిజ్ఞానాలను, శరీర అవయవాలను, అవి ఇహపరాల ఏ సత్కార్యాలు చేయుటకు సృష్టించబడ్డాయో వాటినే చేయాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
3- అద్వీతీయుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చిత్తశుద్ధితో చేయాలని, అసత్య దైవాల ఆరాధన విడనాడాలని ఆదేశిస్తుంది.
4- ప్రజల అవసరాలు తీర్చాలని, వారికి సహాయసహకారాలు అందిస్తూ ఉండాలని ప్రోత్సహిస్తుంది.
5- రోగులను పరామర్శించాలని, శవాల వెంట శ్మశానం వరకు నడవాలని, (పరలోక జ్ఞప్తి కొరకు) శ్మశాన దర్శనకు వెళ్ళాలని మరియు వారి కొరకు దుఆ చేయాలని ఆదేశిస్తుంది.
6- ప్రజలకు న్యాయం చేయాలని, అన్యాయం చేయరాదని మరియు తనకు ఇష్టమైనదే, ఇతరులకై ఇష్టపడాలని ఆదేశిస్తుంది.
7- తన జీవనోపాధి సమకూర్చుటకు శ్రమించాలని, తన గౌరవాన్ని కాపాడుకుంటూ, యాచనకు, అగౌరవ చేష్టలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తుంది.
8- మానవుల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపాలని, వారితో మంచి విధంగా వ్యవహరిస్తూ, వారి శ్రేయస్సుకు పాటుపడుతూ నష్టం కలిగించకుండా ఉండాలని ఆదేశిస్తుంది.
9- తల్లిదండ్రులకు విధేయులై, బంధుత్వం పెంచి, ఇరుగుపొరుగువారితో మంచిగా మెలగాలని మరియు పశువుల పట్ల సైతం మార్దవం / దయ చూపాలని ఆదేశిస్తుంది.
10- మిత్రుల పట్ల విశ్వాసం, నమ్మకం ఉంచాలి. భార్యాపిల్లలతో ప్రేమపూర్వకంగా ఉండాలని ఆదేశిస్తుంది.
11- అమానతులను అప్పగించాలని, వాగ్దానం పూర్తి చేయాలని, ఇతరుల గురించి మంచి అభిప్రాయం ఉంచాలని, సర్వ పనుల్లో మృదుత్వాన్ని పాటించాలని మరియు సత్కార్యాల్లో తొందరపడాలని ఆదేశిస్తుంది. ఇవే కాక ఇంకెన్నో ఉత్తమమైన ఆదేశాలిస్తుంది.
14.2 – రెండు: ఇస్లామీయ నిషిద్ధతలు
ఇస్లాం ధర్మంలోని ఉత్తమ విషయాల్లో మరీ గొప్పవి; నిషిద్ధతలు. అవి విశ్వాసిని చెడు కార్యాలకు పాల్పడకుండా నివారిస్తాయి, వాటి దుష్ఫలితాల నుండి కూడా హెచ్చరిస్తాయి, అందరూ సుఖంగా తమ జీవితం గడుపుకొనుటకు. దిగువ ఇవ్వబడిన ఇస్లాం నిషిద్ధపరిచిన విషయాలు చదవండి:
1- అవిశ్వాసానికి, సత్య తిరస్కారానికి పాల్పడుట మరియు అల్లాహ్ కు ఇతరుల్ని భాగస్వాములు చేయుట నిషిద్ధ పరుస్తుంది ఇస్లాం.
2- గర్వం, కపటం, ఆత్మ స్తుతి, ఈర్ష్య మరియు ఆపదలో ఉన్న వారిని చూసి నవ్వుట నివారిస్తుంది ఇస్లాం.
3- చెడు అభిప్రాయం, అపశకునం, నిరాశ నిస్పృహ, పిసినారితనం మరియు వృధా ఖర్చుల నుండి నివారిస్తుంది.
4- సోమరితనం, పిరికితనం, బలహీనత, మాంద్యం, తొందరపాటు, కఠినత్వం, నిర్లజ్జ, అసహనం, దౌర్బల్యం, కోపం, ఉద్రేకం మరియు పోగొట్టుకున్నదానిపై వ్యాకులతకు గురి కావడం నుండి నివారిస్తుంది.
5- బాధితుల, అగత్యపరుల సహాయానికి దూరముంచే రెండు దుర్గుణాల నుండి నివారిస్తుంది. (అ): పాశాన హృదయుడు కావడం. (ఆ): పెడసరితనం/ అహంకారం, అహంభావం.
6- పరోక్షంగా నిందించడం (అంటే ఒక వ్యక్తి ప్రస్తావన అతనికి నచ్చని విధంగా ఇతరుల ముందు చేయడం), చాడీలు చెప్పడం నుండి నివారిస్తుంది.
7- వృధాగా మాట్లాడ్డం, రహస్యాలను బహిరంగ చేయడం, ప్రజలతో హేళన, ఎగతాలి చేయుట నుండి నివారిస్తుంది.
8- దూషించడం, శపించడం, కించపరచడం మరియు చెడుబిరుదులతో పిలవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
9- గొడవ, వాదన, తగాదాలకు దిగుట, చెడు వైపునకు తీసుకెళ్లే హాస్యమాడుట (జోక్ చేయుట) నుండి నివారిస్తుంది.
10- అవసరమున్న చోట సాక్ష్యం ఇవ్వకపోవుట, అబద్ధపు సాక్ష్య-మిచ్చుట, అమాయక స్త్రీలపై అపనిందమోపుట, చనిపోయినవారిని దూషించుట, విద్యను బోధించకపోవుట నుండి నివారిస్తుంది ఇస్లాం.
11- అవివేకం, అశ్లీలం, ఉపకారం చేసి చెప్పుకోవడం, మేలు చేసినవారికి కనీసం ‘ధన్యవాదాలు’ తెలుపక పోవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
12- అపహరణం, మోసం, వాగ్దాన భంగాల నుండి నివారిస్తుంది.
13- తల్లిదండ్రుల అవిధేయత, బంధుత్వాన్ని త్రెంచుట మరియు సంతానానికి ఉత్తమ శిక్షణ ఇవ్వకపోవుట నుండి నివారిస్తుంది.
14- ఇతరుల రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, లోపాలు వెతకడం నుండి నివారిస్తుంది.
15- పురుషులు స్త్రీల లాంటి, స్త్రీలు పురుషుల్లాంటి (వేషా, భాష, వస్త్రణ, ప్రవర్తన) అవలంభించుట నివారిస్తుంది.
16- మత్తు సేవించుట, డ్రగ్స్ ఉపయోగించుట, జూదములను నివారిస్తుంది.
17- అసత్య ప్రమాణాలతో సరుకు అమ్ముట, తూకము మరియు కొలతలలో తక్కువ చేసి ఇచ్చుట, నిషిద్ధ కార్యాల్లో ధనం వెచ్చించుట మరియు ఇరుగుపొరుగు వారిని బాధించుటను నివారిస్తుంది.
18- దొంగతనం, కోపం, భాగస్వామ్యంలో ఉన్న ఇద్దరిలో పరస్పరం మోసం, నష్టం చేయుట, పనివానికి/ సేవకునికి అతని మూల్యం ఇవ్వటంలో ఆలస్యం చేయుట లేక అతనితో పని చేయించుకొని బత్తెము ఇవ్వకపోవుట మొదలగున వాటిని నివారిస్తుంది.
19- ఆరోగ్యానికి హాని కలిగే విధంగా తినుటను నివారిస్తుంది.
20- పెడమొఖంగా ఉండుట, పరస్పరం ద్వేషాలు పెంచుకొనుట, పరస్పరం దూరమగుట నివారిస్తుంది. మూడు రోజుల కంటే ఎక్కువ పరస్పరం మాటలు విడనాడుట నుండి హెచ్చరిస్తుంది.
21- కారణం లేకుండా ఒకరిని కొట్టడం మరియు ఆయుధాలతో బెదిరించడాన్ని నివారిస్తుంది.
22- వ్యభిచారం, స్వలింగ సంపర్కం మరియు ఆత్మహత్యలను నిషేధిస్తుంది.
23- లంచాలు, ముడుపులు ఇచ్చుట, తీసుకొనుటను నిషేధిస్తుంది.
24- బాధితుని సహాయము చేసే శక్తి ఉండి కూడా దూరంగా ఉండటాన్ని నివారిస్తుంది.
25- పరాయి ఇంట్లో వారి అనుమతి లేకుండా తొంగి చూడటం, పరస్పరం సంభాషించుకునే వారి మాట -వారు ఇష్ట పడనప్పటికీ- దొంగతనంగా వినడాన్ని నివారిస్తుంది.
ఇస్లాం నిషేధించిన విషయాల సంక్షిప్త పట్టిక పైన తెలుపబడింది.
15-పరలోకం
పరలోకం మరియు దానికి సంబంధించిన విషయాలను విశ్వసించనంత వరకు ఏ మనిషీ విశ్వాసి కాజాలడు. ఆ దినం ఎంత భయంకరమైనదో దివ్య ఖుర్ఆన్ ఇలా తెలిపిందిః “అది పిల్లలను వృద్ధులుగా చేసే దినం”. (72:17). ఆ నాడు సంభవించే వాటిలో కొన్ని దిగువ తెలుపుచున్నాము.
మృత్యువుః ఇది ఇహలోకంలో ప్రతి జీవికి అంతిమ విషయం. అల్లాహ్ ఆదేశాలు గమనించండి. “ప్రతి జీవి మరణాన్ని చవి చూస్తుంది”. (3: 185). “ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువూ నాశనమైపోతుంది”. (55:26). “నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు”. (39: 30). ఏ మానవునికీ ఇహలోకంలో శాశ్వత జీవితం లభించదు. “శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు”. (21:34).
1- మరణం ఖచ్చితమైన విషయం. ఇందులో ఇసుమంత సందేహానికి తావు లేదు. మృతుడు తన వెంట ఏమీ తీసుకెళ్ళలేడు. అతని వెంట మిగిలేవి అతను చేసిన కర్మలే.
2- మనిషి చావు గురించి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవడు ఎక్కడ, ఎప్పుడు ఎలా చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు. ఎందుకనగా ఇది ఒక అగోచరజ్ఞానం. ఇది అల్లాహ్ అద్వితీయునికే తెలుసు.
3- చావు వచ్చాక ఆలస్యమో, లేక దాన్ని నెట్టేయడమో, లేక దాని నుండి పారిపోవడమో కాని పని. అల్లాహ్ ఆదేశం “ప్రతి జాతి వారికొక గడువు నియమించబడియున్నది. మరియు వారి గడువు వచ్చి-నప్పుడు ఒక గడియ వెనుకగాని ముందుగాని వారు కానేరరు”. (734).
4- విశ్వాసునికి మరణం సమీపించినప్పుడు యమదూత అందమైన ఆకారంలో అతని వద్దకు వస్తాడు. కరుణదూతలు కూడా స్వర్గ శుభ- వార్తలతో హజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మళ్ళీ అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దైవదూతలు దిగివచ్చి మీరు భయపడకండి, చింతపడకండి, మీతో వాగ్దానము చేయబడుతున్న స్వర్గముతో సంతోషపడండి అని పలుకుతారు”. (41:30).
అవిశ్వాసి వద్దకు భయంకరమైన మసిబూసిన ఆకారంలో యమదూత వస్తాడు. అతనితో శిక్షదూతలు శిక్ష దుర్వార్త ఇస్తూ హాజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి, బయటకు తీయండీ మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది”. (6:93).
చావు వచ్చినప్పుడు వాస్తవము స్పష్టమయి అసలు విషయము ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః “తుదకు వారిలో ఒకనికి చావు వచ్చినప్పుడు ‘ఓ నా ప్రభువా! నన్ను తిరిగి పంపివేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును’ అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది”. (23:99,100).
చావును చూసి అవిశ్వాసి మరియు పాపాత్ముడు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యాలు చేయాలని కోరుదురు కాని అప్పుడు ఆ పశ్చాత్తాపము ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః “నీవు పాపాత్ములను చూచెదవు. వారు బాధను చూచునప్పుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు”. (42:44).
సమాధిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారం: శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పొయిన తరువాత ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘నీ ప్రభువు ఎవరు?, నీ ధర్మం ఏది?, నీ ప్రవక్త ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ ﷺ’ అని విశ్వాసి సమాధానమిస్తాడు. అప్పుడు వారిద్దరంటారుః ఇదిగో చూడు నరకంలో నీ స్థానం, అల్లాహ్ దానికి బదులుగా స్వర్గంలో నీకు ఈ స్థానం ప్రసాదించాడు. విశ్వాసి రెండు స్థనాలు చూస్తాడు. కాని అవిశ్వాసి లేక మునాఫిఖ్ (వంచకుడు) వారిద్దరు ప్రశ్నించబడినప్పుడు ‘అయ్యో! నాకు తెలియదు’ అని వాపోతాడు. అప్పుడు ఇద్దరు దూతలు ‘నీవు తెలుసుకోలేదు, దానికి ప్రయత్నమూ చేయలేదు’ అని అంటూ, ఇనుప సమ్మెటలతో కొడుతారు. అందుకు అతడు కేకలు వేసి అరుస్తాడు. అతని అరుపులు మానవులు, జిన్నాతులు తప్ప అందరూ వింటారు. సమాధి అతని కొరకు ఇరుకుగా ఉంటుంది. ఇద్దరు దూతలు అతనికి నరకంలో అతని స్థానం చూపిస్తారు. అక్కడి నుండి దాని తాపం, శిక్ష వస్తూ ఉంటుంది.
సమాధిలో ఉన్న శరీరములో ఆత్మను తిరిగి పంపడం పరలోక విషయాల్లో ఒకటి. దాన్ని మానవ మేధ ఇహలోకంలో ఉండి గ్రహించలేదు. మనిషి విశ్వాసి అయితే, అనుగ్రహాలకు అర్హుడయినచో సమాధిలో అనుగ్రహించబడుతాడు. శిక్షకు అర్హుడయినచో శిక్షింపబడుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరండి”. (అబూదావూద్). మంచి మనుస్సు దీన్ని తిరస్కరించదు. ఎందుకనగా దీనికి ఇంచుమించు పోలిన విషయం ఒకటి ఇహలోకంలో మనిషి చూస్తుంటాడు. పడుకున్న వ్యక్తి స్వప్నలో శిక్షకు గురి అయినట్లు చూస్తాడు. సహాయం కోరుతూ అరుస్తాడు. కాని అతని ప్రక్కనే మేలుకొని ఉన్న వ్యక్తి దాన్ని గ్రహించలేకపోతాడు. ఇక జీవన్మరణాల్లోని తేడా ఇంతకంటే గొప్పది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారుః “సమాధి పరలోక స్థానాల్లో మొదటి స్థానం. దాన్ని క్షేమంగా దాటినవారికి ఆ తరువాత స్థానాలు తేలికగా ఉంటాయి. దాన్ని క్షేమంగా దాటనివారికి దాని తరువాతవి కఠినంగా ఉంటాయి”. (తిర్మిజి).
సమాధి శిక్ష అని పేరు రావడానికి కారణం అనేక మందిని సమాధిలో పెట్టడం వల్లనే. కాలిపోయినవారు, మునిగిపోయినవారు మరియు కౄరజంతువులకు ఆహారమైనవారు ఇంకా ఎవరు ఎలా మరణించినా తమ కర్మల ప్రకారం శిక్షించబడుతారు లేక అనుగ్రహించబడుతారు. సమాధి శిక్షలు వివిధ రకాలుగా ఉంటాయిః ఇనుప సమ్మెటలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరకంలోని పరుపు అతనికి వేయబడును. దాని తలుపు అతని వైపునకు తెరువబడును. అందులో నుండి వేడి గాలి వస్తూ ఉండును. అతని దుష్కార్యాలు, దుర్వాసన గల దుస్తులు ధరించిన అందవికారంగల వ్యక్తి రూపంలో అతనికి తోడుగా ఉండును. అవిశ్వాసి మరియు మునాఫిఖులకు ఎడతెగకుండా శిక్ష ఉండును. పాపాత్ముడైన విశ్వాసికి తన పాపాలకు తగినరీతిలో శిక్ష ఉండును. తర్వాత శిక్ష నుండి రక్షింపబడవచ్చును.
సమాధిలో వరాలుః విశ్వాసి కొరకు అతని సమాధి వెడల్పు చేయబడును. నూర్ (కాంతుల)తో నింపబడును. స్వర్గం యొక్క ద్వారము అతని వైపునకు తెరువబడును. అందులో నుండి పరిమళం మరియు గాలులు వీస్తూ ఉండును. స్వర్గపు పరుపులు పరచబడును. అతని సత్కార్యాలు అందమైన మనిషి రూపములో అతనికి తోడుగా ఉండును.
16-ప్రళయం, దాని సూచనలు
1- అల్లాహ్ ఈ సృష్టిని శాశ్వతంగా ఉండుటకు సృష్టించలేదు. తప్పక ఒక దినం రానుంది ఇది అంతము కానుంది. అదే ప్రళయం సంభవించే రోజు. సందేహం లేనటువంటి రోజు. “పునరుత్థాన దినం రానున్నది. అందెట్టి సందేహం లేదు”. (22:7). “మాకు ప్రళయకాలము రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు? నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీకు వచ్చును”. (34:3). ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. దాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికీ తెలుపలేదు. “ప్రళయ కాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయము నీకేమి తెలుసు. ప్రళయ కాలము సమీపములోనే కావచ్చు”. (33:63).
2- ఈ ధరిణిపై దుష్టులు మాత్రమే మిగిలి యుండగా ప్రళయం సంభవించును. అది ఎలా అనగాః అది సంభవించేకి ముందు అల్లాహ్ ఒక మందమారుతమైన గాలిని పంపును. దానివలన విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టినంతటిని నాశనము చేయాలనుకున్నప్పుడు, శంకు ఊదే దూతకు ఆదేశమిస్తాడు, అతడు శంకు ఊదగా ప్రజలందరు సొమ్మసిల్లిపోతారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడును, కావున ఆకాశములలోనూ భూమిలోనూ ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోవుదురు. అల్లాహ్ కోరినవారు తప్ప”. (39:68). అది జుమా (శుక్రవారం) రోజగును. పిదప దైవదూతలు సయితం చనిపోవుదురు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ మిగిలి ఉండరు.
3- సమాధుల్లో ఉన్న మానవ దేహాలను మట్టి తినేస్తుంది. కేవలం వెన్నెముకలో ఉండే బీజము తప్ప. కాని ప్రవక్తల దేహాలను మట్టి తినదు. తరువాత అల్లాహ్ వర్షం కుర్పిస్తాడు, దానితో దేహాలు తయారవుతాయి. వారిని లేపాలని అల్లాహ్ ఉద్దేశించినప్పుడు శంకు ఊదే దూత ఇస్రాఫీల్ ను జీవింపజేస్తాడు. అతడు రెండవసారి శంకు ఊదగా అల్లాహ్ అందరినీ జీవింపజేస్తాడు. వారందరూ మొదటిసారి అల్లాహ్ పుట్టించినట్లు నగ్నముగా, సున్నతి చేయబడకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా సమాధుల నుండి లేచి వస్తారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడినప్పుడు వారంతా గోరీల నుండి లేచి తమ ప్రభువు వైపునకు పరుగెత్తుకుంటూ వస్తారు”. (36:51). అందరికంటె ముందు ప్రవక్త ముహమ్మద్ ﷺ భూమి నుండి వెలికి వస్తారు. తరువాత ప్రజలందరూ ‘మహ్ షర్’ మైదానము వైపునకు వెళ్తారు. అది చాలా విశాలమైన భూమి. అప్పుడు సూర్యుడు ప్రజలకు అతి సమీపంలో ఉంటాడు.
ఆ మైదానంలో ప్రజలు తమ లెక్క, తీర్పు కొరకు చాలా కాలం వేచి ఉంటారు. పిదప అల్లాహ్ వారి మధ్య తీర్పు కొరకు వస్తాడు. నరకంపై వంతెన వేయబడుతుంది. అది వెంట్రుక కన్నా సన్నగా, ఖడ్గం కన్నా పదునైనదిగా ఉంటుంది. దానిపై ప్రజలు తమ కర్మల ప్రకారంగా దాటుదురు. కొందరు కనురెప్ప పాటులో, మరికొందరు గాలి తీరుగా, ఇంకొందరు గుఱ్ఱపు రౌతుగా దాటుతే, అక్కడే కొందరు ప్రాకుచూ దాటుదురు. వంతెనకు కొండ్లుండును. అవి ప్రజలను పట్టి నరకంలో పడవేయును. అయితే అందులో పడువారు అవిశ్వాసులు మరియు పాపాలకు గురి అయిన విశ్వాసుల్లో అల్లాహ్ కోరినవారు. అవిశ్వాసులైతే శాశ్వతంగా అందులోనే పడి ఉంటారు. కాని పాపాలు చేసిన విశ్వాసులు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్షింపబడుతారు. తరువాత అందులో నుండి తీయబడి స్వర్గంలో ప్రవేశించబడుదురు.
స్వర్గవాసులు నరకంపై ఉన్న వంతెన క్షేమంగా దాటిన తరువాత స్వర్గం మరియు నరకం మధ్యలో ఉన్న వంతెనపైకి వచ్చి నిలుస్తారు. వారి పరస్పరం ఒకరిపై ఉండిన మరొకరి హక్కులు చెల్లించబడును. ఎవరైనా ఒకరిపై అన్యాయం చేసి ఉంటే, అతని నుండి పరిహారం బాధితునికి ఇవ్వబడి, వారి హృదయాల కల్ముషాలు దూరము కాక ముందు ఎవరూ స్వర్గంలో ప్రవేశించలేరు. స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో చేరిన పిదప మృత్యువును పొట్టేలు రూపంలో తీసుకు వచ్చి స్వర్గం మరియు నరకం మధ్యలో వారు చూస్తూ ఉండగా ‘జిబ్హ్’ చేయ(కోయ)బడును. స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి, ఇక మీకు మరణం లేదు. నరకవాసులారా! మీకూ శాశ్వతం ఇక మరణం లేదు అని అనబడుతుంది. ఒకవేళ మరణం అనేది ఉంటే సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు చనిపోతారు. చింత, బాధతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.
17-నరకం మరియు దాని శిక్షలు
సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదేశం: “ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయపడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (2:24).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తమ సహచరులతో “నరకాగ్ని మీరు రాజేస్తున్న (ఇహలోక) అగ్నికి డెబ్బై రెట్ల ఎక్కువ తీవ్రంగా ఉంటుంది” అని చెప్పారు. అనుచరులు ఈ మాట విని ‘ప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా! (కాల్చడానికి) ఈ అగ్నియే సరిపోతుంది కదా’ అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై అరవై తొమ్మిది రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బై భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (బుఖారి, ముస్లిం).
నరకంలో ఏడు అంతస్తులుంటాయి. ప్రతి అంతుస్తులో మరోదానికంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో ఉంటారు. మునాఫిఖులు (వంచకులు) నరకంలోని అతిక్రింది స్థానంలో, కఠిన శిక్షలో ఉంటారు. అవిశ్వాసులకు శిక్ష కలకాలం ఉంటుంది. అందులో కాలిపోయినపుడల్లా మరింత శిక్ష కలుగుటకు తిరిగి చర్మం మార్చబడును. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః
“వారి చర్మం కాలిపోయినపుడల్లా దానికి బదులుగా వేరే చర్మమును, వారు బాధ రుచి చూచుటకై, కల్పించుచుందుము”. (4:56).
“అవిశ్వాసానికి పాల్పడినవారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలనే తీర్పు ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏ మాత్రం తగ్గించడమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్వక్తికీ ప్రతిఫలం ఇస్తాము”. (35:36).
నరకవాసులను సంకెళ్ళతో కట్టి, మెడలలో పట్టీలు వేయబడును. “ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, తాళ్ళూ బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి”. (14: 49,50).
వారి తిండి విషయము ఇలా తెలుపబడిందిః
“నిశ్చయంగా జఖ్కూమ్ వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలా ఉంటుంది. సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది”. (4:43,46).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“జఖ్కూమ్ వృక్షం యొక్క ఒక చుక్క భూమిపై పడినచో భూనివాసుల జీవనోపాధి పాడయిపోతుంది. ఇక దాన్ని తినేవారి గతి ఏమవుతుందో?.
నరక శిక్ష యొక్క కఠినత్వాన్ని, స్వర్గం యొక్క భోగభాగ్యాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు విశదీకరిస్తుందిః
“ఇహలోకంలో అత్యధిక సుఖాలను అనుభవించిన అవిశ్వాసిని ఒకసారి నరకంలో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావా? అని ప్రశ్నిస్తే ‘లేదు, ఎప్పుడూ లేదు’ అని బదులిస్తాడు. ఒక్కసారి అందులో మునిగి లేచినందుకు సర్వ సుఖాలను మరచిపోయాడు. అదే విధంగా ప్రపంచంలో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభవించిన విశ్వాసిని ఒకసారి స్వర్గంలో ప్రవేశింపజేసి, ఎప్పుడైనా నీవు బీదరికాన్ని కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే, నేను ఎప్పుడూ చూడలేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేచినందుకు ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయాడు.”
18-స్వర్గ భోగభాగ్యాలు
స్వర్గం పుణ్యపురుషులకు సదా ఉండే గౌరవనీయమైన స్థానం. అందులో ఉన్న అనుగ్రహాలను ఏ కన్నూ చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి ఊహలకు అందలేదు. చదవండి దివ్యఖుర్ఆన్ సాక్ష్యం:
“వారి కర్మలకు ప్రతిఫలంగా, కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడి ఉందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికి తెలియదు“. (32:17).
అందులో వేరు వేరు స్థానాలు గలవు. విశ్వాసులు తమ కర్మల ప్రకారం అందులో ఉందురు.
“అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికి మరియు విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా చేయును“. (58:11).
స్వర్గవాసులు తమ ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనే కాలువలు, సేవించేవారికి మధురంగా ఉండే మద్య పానాలుండును. వారికివ్వబడే మద్యం ప్రపంచం లాంటింది కాదు. చదవండి దివ్య ఖుర్ఆన్:
“మద్యపు చెలమల నుండి పాత్రలు మాటిమాటికీ నింపబడి వారి మధ్య త్రిప్పబడుతాయి. మెరిసిపోతున్న మధువు, త్రాగేవారికి అది ఎంతో మధురం. దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు. వారి బుద్ధీ చెడిపోదు“. (37:45-47).
అందులో వారి వివాహం అందమైన కళ్ళుగల సుందర స్త్రీలతో జరుగును. వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“స్వర్గంలో ఉన్నటువంటి స్త్రీ భూనివాసుల వైపునకు ఒకసారి తొంగి చూసినచో భూమ్యాకాశాల మధ్య కాంతులీనుతాయి. సువాసనతో నిండిపోతాయి“. (బుఖారి).
స్వర్గవాసులకు లభించే వరాల్లో అతి పెద్ద వరం అల్లాహ్ దర్శనం
వారికి అక్కడ మలమూత్రములు కలగవు. ఉమ్మి, చీమిడీలు ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెమటలో కస్తూరి లాంటి సువాసన ఉండును. ఈ అనుగ్రహాలు కలకాలముంటాయి. ఇవి తరగవు, నశించవు. ప్రవక్త ﷺ ఉపదేశించారుః “స్వర్గంలో ప్రవేశించినవారికి అనుగ్రహాలు కలకాలముండును. ఏ కష్టమూ ఉండదు. దుస్తులు పాతబడవు. అందులో అతి తక్కువ అదృష్టవంతునికి లభించే వరం ఇహలోకం కంటే పది రెట్లు ఉత్తమమైనది”.
19-ఇస్లాంలో స్త్రీ స్థానం
ఇస్లాం ధర్మంలో స్త్రీల స్థానం వారికున్న హక్కులను గురించి చదివే ముందు ఇస్లామేతర మతాల్లో వారికున్న స్థానం, స్త్రీల పట్ల ఉన్న ఆ మతాలవారి వ్యవహారం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది. ఆమెకు ఏ హక్కూ లేకుండా ఉండేది. సర్వ హక్కులు పురుషునికే ఉండేవి. ఆస్తిలో వారసత్వము లేకుండా తన స్వంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా ఉండేది కాదు. ప్రఖ్యాతిగాంచిన అచ్చటి తత్వవేత్త సుఖరాత్ (Socrates the philosopher) ఇలా అన్నాడుః ‘స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూలకారణం. స్త్రీ ఒక విషమాలిన చెట్టు లాంటిది, చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి’.
రోమన్స్ వారు స్త్రీకి ఆత్మయే లేదనేవారు. వారి వద్ద స్త్రీకి ఏలాంటి విలువ, హక్కు లేకుండింది. ‘స్త్రీకి ఆత్మ లేదు’ అనడం వారి నినాదంగా ఉండేది. అందుకే వారిని స్తంభాలకు బంధించి కాగిన నూనె వారి దేహములపై పోసి వారిని బాధపెట్టేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుఱ్ఱపు తోకతో కట్టి వారు చనిపోయేంత వరకు గుఱ్ఱాన్ని పరిగెత్తించేవారు.
మన భారత దేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అంతేకాదు, దీనికి మరో అడుగు ముందు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనము చేయించేవారు. (స్త్రీలను దేవదాసీలుగా కూడా ఉపయోగించేవారు).
చైనీయులు స్త్రీలను ధనసంపదను మరియు సంతోషాన్ని నశింపజేసే నీటితో పోల్చేవారు. భార్యను అమ్మడము హక్కుగా భావించేవారు. అదే విధంగా ఆమెను సజీవంగా దహనం చేయుట కూడా ఒక హక్కుగా భావించేవారు.
ఇక యూదులు, హవ్వా, ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందన్న అసత్య ఆరోపణతో స్త్రీ జాతినే శపించబడినదిగా భావించేవారు. స్త్రీ బహిష్టురాలయినప్పుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు అపరిశుభ్రమవుతుందనేవారు. ఆమెకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు కారు.
క్రైస్తవులు స్త్రీని షైతాన్ (దయ్యం, పిశాచము) యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయములో ఇలా ప్రస్తావించాడుః ‘స్త్రీ మానవ పోలిక గలది కాదు’. బోనావెన్తూర్ (Saint bona ventura: 1217- 1274) ఇలా చెప్పాడుః ‘మీరు స్త్రీని చూసి మానవురాలే కాదు, కౄరజంతువని కూడా అనుకోకండి. మీరు చూసేది షైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు/బుసబుసలు’.
ఇంగ్లీషువారి చట్టం (Common Law) ప్రకారమయితే గత అర్థ శతాబ్దంలో ‘స్త్రీ’ పౌరుల తరగతులోని ఏ తరగతిలో కూడా లెక్కించబడేది కాదు, మరియు ఆమెకు స్వతహాగా ఏ హక్కు ఉండేది కాదు. చివరికి తను ధరించే దుస్తులు కూడా తన అధికారములో ఉండేవి కావు. క్రీ. శ. 1567న స్కాట్ ల్యాండ్ పార్లమెంటు (Scottish parliament)లో ఏ చిన్న అధికారము కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారిచేశారు. హెన్రి8th (Henry VIII) పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు స్త్రీ అపరిశుభ్రత గలది గనుక బైబిల్ చదవకూడదని చట్టం జారి చేసింది. 1586వ సంవత్సరము ఫ్రాన్సులో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి స్త్రీ మనిషా కాదా అని చర్చించి చివరికి మనిషే కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడిందన్న నిర్ణయానికి వచ్చారు. క్రీ. శ. 1805వ సంవత్సరము వరకు బ్రిటిషు చట్టం ‘భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే’ అని ఉండింది. మరియు వారు భార్య యొక్క ధర ఆరు పెన్సులు (Six pence ie Half Schilling) నిర్ణయించారు.
అరబ్బులు కూడా ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయి లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండేది. అనేక అరబ్బులు స్త్రీలను సజీవంగా దహనం చేసేవారు.
స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు, స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగా వారికీ హక్కులున్నవి అని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్యగ్రంథం ఖుర్ఆన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలిపాడుః {మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు}. (49:13). మరో చోట ఇలా సెలవియ్యబడిందిః {మంచి పనులు చేసేవారు పురుషులైనా, స్త్రీలైనా వారు గనుక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు}. (4:124). మరొక చోట ఇలా ఆదేశమివ్వబడిందిః {తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము}. (29:8). ప్రవక్త మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు సద్ప్రవర్తన గలవారు. మీలో మంచివారు తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు”. (తిర్మిజి). ‘నా సేవాసద్వర్తనలకు అందరికంటే ఎక్కువ అర్హులు ఎవరు?’ అని ఒక వ్యక్తి ప్రవక్తతో అడిగాడు, “నీ తల్లి” అని చెప్పారు మహాప్రవక్త ﷺ. ‘మళ్ళీ ఎవరు?’ అని అడిగాడు ఆ వ్యక్తి. “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త. ‘మళ్లీ ఎవరు’ అని అడిగాడు ఆ మనిషి. “నీ తల్లి” అని సమాధానమిచ్చారు. మరో సారి అడిగాడు ‘మళ్లీ ఎవరు’ అని, “నీ తండ్రి” అని బదులిచ్చారు మహానీయ ﷺ . (ముస్లిం).
ఇస్లాం దృష్టిలో స్త్రీ స్థానం ఎలా ఉందో సంక్షిప్తంగా పైన తెలుపబడినది.
20-స్త్రీ యొక్క సామాన్య హక్కులు
ఇస్లాంలో స్త్రీలకు ఉన్న సామాన్య హక్కుల్లో కొన్నిః
1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యజమాన్యంలో ఉంచుకోవచ్చును. స్త్రీ భార్య, తల్లి, కూతురు మరియు చెల్లి, ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారములో ఉంచ వచ్చును.
2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు, భర్తతో జీవితం గడపడంలో నష్టము ఏర్పడినప్పుడు వివాహ బంధమును తెంచుకొని విడాకులు కోరే హక్కు. ఇవి స్త్రీ యొక్క ప్రత్యేక హక్కులని రుజువైనది.
3- విద్యః తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం గురించి తెలుసుకొనుట తనపై విధియైఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తనలు నేర్చుకోవాలి, ఏలాంటి సంస్కారము సభ్యత, పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ యొక్క హక్కు. ఇవన్ని అల్లాహ్ యొక్క ఈ ఆదేశానుసారంగాః {అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైనవాడు ఎవడు లేడని బాగా తెలుసుకో}. (47:19). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః “విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యున్నది”.
4- తన స్వంత ధనము నుంచి తను కోరినట్లు తనపైగాని, ఇతరులపైగాని -వారు తన భర్త, సంతానము, తండ్రి లేక తల్లి ఎవరయినా సరే- ఖర్చు చేసే హక్కుంది. కాని హద్దులు మీరి, వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు. (అలా చేసినచో, నిరోధించడం భర్త విధి). ఖర్చు చేయడంలో పురుషునికెంత అధికారముందో స్త్రీకి కూడా అంతే ఉంది.
5- తన స్వంత ధనము నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వీలునామా) చేయవచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించవచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయము. పురుషులకున్న విధంగా స్త్రీలకు కూడా ఈ హక్కు ఉంది. కాని పురుషులైనా, స్త్రీలైనా తమ ఆస్తిలోని మూడవ వంతు కంటే ఎక్కువ వసియ్యత్ చేయకూడదు మరియు అల్లాహ్ నిర్ణయించిన వారసుని కొరకు వసియ్యత్ చేయకూడదు.
6- ధరించడంలో తాను కోరిన విధంగా పట్టు, బంగారం ఇంకేవైనా ధరించవచ్చును. -అయితే పట్టు, బంగారం పురుషుల కొరకు నిషిద్ధం.- కాని ధరించి కూడా నగ్నత్వాన్ని మరియు అర్థనగ్నత్వాన్ని కనబరచే దుస్తులు భర్త తప్ప ఇతరుల ఎదుట ధరించరాదు.
7- కంట్లో కాటిక, బుగ్గల మీద స్నో, పౌడరు పూసుకొని (ఇతరుల కొరకు కాదు) తన భర్త కొరకు సింగారించుకొనుట. ఇంకా సువాసనగల సుందర దుస్తులు ధరించుట స్త్రీ యొక్క హక్కు.
8- తనకిష్టమైన వస్తవులు తినే, త్రాగే హక్కు ఆమెకుంది. తినేత్రాగే విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసము లేదు. పురుషులకు యోగ్యమున్నవే స్త్రీలకూ యోగ్యం. ఇక నిషిద్ధమున్నవి ఇద్దరికీ నిషిద్ధం. మానవులదంరిని ఉద్దేశించి ఇచ్చిన అల్లాహ్ ఆదేశం చదవండిః {తినండి, త్రాగండి. మితిమీరకండి. అల్లాహ్ మితిమీరేవారిని ప్రేమించడు}. (7:31).
9- తన తండ్రి, భర్త, కొడుకు వగైరాల ఆస్తిలో ఆమెకు హక్కు గలదు. అలాగే ఆమె ఆస్తిలో వారి దగ్గరివారికి హక్కు గలదు.
21-భార్య హక్కులు భర్తపై
స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో భర్తపై ఉన్న తన భార్య హక్కులు.
అల్లాహ్ ఆదేశానుసారంగా ఇవి భర్తపై ఉన్న భార్య యొక్క హక్కులు. అల్లాహ్ ఆదేశం ఇదిః {మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (2:228). భార్య యొక్క హక్కులను సంపూర్ణంగా నెరవేర్చుట భర్తపై విధిగా ఉంది. హాఁ ఆమె తనకుతానుగా, తనిష్టముతో కొన్ని హక్కులకు మినహాయింపు ఇస్తే అది ఆమె ఇష్టం.
1- భర్త తన శక్తికొలది కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ మొ!నవి వసతుల ఏర్పాటు చేయాలి.
2- తన భార్య యొక్క ధన, ప్రాణము, ధర్మం, మానమును కాపాడాలి.
3- ధర్మానికి సంబంధించిన అనివార్యమైన విషయాలు భార్యకు నేర్పాలి. ఆతను నేర్పలేకపోతే స్త్రీల విద్యాబోధన ప్రత్యేక సమావేశాల్లో, కేంద్రాల్లో, మసీదుకు వెళ్ళి అచ్చట నేర్చుకొనుటకు అనుమతివ్వాలి. అక్కడికి వెళ్ళడంలో ఏలాంటి కీడు జరగకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏలాంటి నష్టము కలిగే భయం ఉండకూడదు.
4- {తమ భార్యలతో మంచివిధంగా మెలగండి}(4:19) అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం వారితో మంచి విధంగా మెలగాలి. అంటేః ఆమె యొక్క సంభోగ హక్కులో కొరత రానివ్వరాదు. తిట్టి, దూషించి, హీనపరచి బాధ కలిగించరాదు. ఏలాంటి నష్టము లేనప్పుడు తన బంధువులను దర్శించడం నుండి వారించరాదు. శక్తికి మించిన భారం ఆమెపై వేయరాదు. మనసా వాచా కర్మాన ఆమెకు మేలే చేయాలి. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “మీలో మంచివారు ఎవరయ్యా అంటేః తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి”.
22-పర్ద
కుటుంబ జీవితం విఛ్చిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భవించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికలను కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశమిచ్చింది. దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో సూర నూర్ (24:30-31) చదవండి.
స్త్రీ యొక్క గౌరవానికి, తాను అవమానము పాలు కాకుండా బంధ్రంగా ఉండుటకు, నీచ మనస్సుగలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు అమె నుంచి దూరముండుటకు, గౌరవమర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి భధ్రంగా ఉండుటకు, విషపూరితమైన చూపులకు కారణమగు ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క బధ్రతకు అల్లాహ్ పర్ద యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
ఇస్లాం పర్దాను విధిగా చేసి స్త్రీలకు శాంతియుతమైన, గౌరవజీవితం ప్రసాదించింది. ఎందుకంటే స్త్రీ వయసుమల్లిన తరువాత కొంతవరకు అందాన్ని కోల్పోతుంది. ఇక పురుషుడు దారిన వెళ్ళినప్పుడు యౌవనంలో ఉన్న అందకత్తెలను చూసి, తన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన ఇల్లాలిని వారితో పోలుస్తాడు. అక్కడి నుండే మొదలవుతాయి సంసార సాగరంలో తూఫానులు.
23-బహుభార్యత్వం
సుమారు మానవ చరిత్ర ఉన్నప్పటి నుండే బహుభార్యత్వం ఉంది. అందుకే యూద, క్రైస్తవ లాంటి పూర్వ ధర్మాల్లో, ప్రాచీన చైనా మరియు భారత సంస్కృతుల్లో కూడా ఉండినది. అయితే హద్దు లేకుండా భార్యలను ఉంచుకునేవారు. అందుకు స్త్రీ అన్యాయానికి గురి అవుతూ ఉండేది. ఇస్లాం వచ్చాక స్త్రీ జాతి భరిస్తున్న అన్యాయాన్ని తొలగించి నాలుగు భార్యల వరకు ఒకే సమయంలో ఉంచుకోవచ్చన్న హద్దు నిర్ణయించింది. ఇస్లాం దీని గురించి విచ్చలవిడిగా అనుమతించలేదు. ఒక షరతు విధించింది. అది వారి మధ్య న్యాయం పాటించటం. ఈ షరతును పాటించకుండా దీనికి పాల్పడేవాడికి కరకుగా హెచ్చరించింది. ఘోరశిక్ష ఉందని తెలిపింది.
ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల పురుషుడు బహుభార్యత్వం వైపుకు మొగ్గు చూపుతాడు. ఉదాహరణకు భార్య గొడ్డురాలు కావచ్చు, లేదా ఏదైనా రోగానికి గురి కావచ్చు. లేక మరేదైనా కారణం కావచ్చు. ఇలాంటి స్త్రీ కొరకు ఆమె భర్త ఆమెకు విడాకులివ్వడం మంచిదా? లేక ఆమెను తన వివాహబంధంలో ఉంచుకొని మరొకామెను వివాహమాడడం మంచిదా?
బహుభార్యత్వం వలన మన సమాజానికి మేలే చేకూరుతుంది. ఎలా అనగా యుద్ధాలు తదితర కారణాల వల్ల స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు: ప్రపంచ యుద్ధంలో కేవలం యూరప్ లో 25మిలియన్ల స్త్రీలు విధవలు అయ్యారు. ఈ స్త్రీలు భర్తలు లేకుండా ఉండిపోవడం మంచిదా? లేక రెండవ భార్యగా ఒక భర్త ఛాయలో ఉండడం మేలా? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945లో స్వయంగా స్త్రీలు జర్మన్ లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ‘స్త్రీల మేలు కొరకు బహుభార్యత్వ చట్టాన్ని తీసుకురావాలని, లేనిచో తమ అతివిలువైన సొమ్మును (పరువు, మానమును) ఒక వృత్తిగా చేసుకోనున్నారు’ అని డిమాండ్ చేశారు.
24-ఇస్లాంలో ప్రవేశం
ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని గమనించాక, అల్లాహ్ వద్ద ముక్తి పొందే మార్గం ఇదేనని గ్రహించిన ప్రతి ఒక్కరు అందులో ప్రవేశించుట తప్పనిసరి. దాన్ని అనుసరించకుండా ఏ మనిషికీ స్వర్గం ప్రాప్తికాదు. నరకం నుండి ముక్తి లభించదు. ఇందులో ప్రవేశ విధానం ఏమిటని నీవు అడగదలుచుకుంటే? ఇదిగో జవాబుః నీవు ఇస్లాంను స్వీకరించాలనుకుంటే నీవుః “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్”ను (అంటే అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు. ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని) సంపూర్ణ విశ్వాసంతో నోటితో పఠించు. పిదప ఇస్లాంకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ ఉండు, ఒక్కో విషయాన్ని ఆచరించు. ఉదాహరణకుః నమాజ్ ఆచరించాలి, దాని విధానం నేర్చుకోవాలి. అలాగే ఇతర ఆదేశాలు. ఇస్లామీయ బోధనలను వివరించు లెట్రిచర్ / సాహిత్యం చాలా ఉన్నాయి. వాటిని చదవడం మరువకండి. మమ్మల్ని సంప్రదించండి.
[1] అల్లాహ్ ఆరాధనలో ఇతరులను సాటి కల్పించుట
[2] మానవుడు చేసే శాసన నిర్మాణాలు అల్లాహ్ శాసనాలకు విరుద్ధంగా లేనిచో వాటిని అమలు పరచుట తప్పేమి కాదు.
You must be logged in to post a comment.