ప్రేమ బంధాలు – Bonds of Love

prema-bandhaalu


ప్రేమ బంధాలు
(Muhabbat ke Bandhan) –  Bonds of Love in Islam
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [84 పేజీలు]

విషయ సూచిక 

ఇస్లామీయ మర్యాదలు :

[1] ఇస్లామీయ అభివందనం
[2] ఆహ్వాన స్వీకారం
[3] జన శ్రేయోభిలాష ధర్మానికి పునాది
[4] తుమ్మిన వారికి బదులు పలకడం
[5] రోగిని పరామర్శించడం
[6] జనాజా వెంట వెళ్లడం

హృదయాలను కలిపే కళ :

[1] సహాబా శిక్షణ పొందిన ఉన్నత ఉదాహరణ
[2] విభేదాలను విడనాదడంలో ఇస్లామీయ విధానం
[3] ఇస్లాం పై మాత్రమే ఐక్యత

[క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]

ముందు మాట

ఇన్నల్ హంద లిల్లాహి నహ్మదుహూ వ నస్తఈనుహూ వ నస్తఘ్ ఫిరుహూ వ నస్తహ్ దీహ్, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా, మన్ యహ్ దిహిల్లాహు ఫలా ముజిల్లలహూ వమన్ యుజ్లిల్ హు ఫలా హాదియ లహ్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్, సల్లల్లాహు అలైహి వ అలా ఆలిహీ వసహ్ బిహీ వ సల్లమ తస్లీమన్ కసీరా. అమ్మా బాద్:

నిశ్చయంగా అల్లాహ్ కొరకే ప్రేమించడమనేది విశ్వాస మూల సూత్రాల్లో ఒకటి, అది దాని పటిష్ఠమైన కడియాల్లో ఒకటి అని సత్య సంధులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

మన ప్రభువు విశ్వాసుల మధ్య కొన్ని ప్రేమ బంధాలను ఏర్పరిచాడు. వారి హృదయాలను వాటితో కలిపాడు. వాటి ప్రస్తావన తన దివ్య గ్రంథంలో అనేక చోట్ల చేశాడు. ఉదాహరణకు:-

విశ్వాసులందరూ పరస్పర సహోదరులు. (హుజురాత్ 49: 10).

మీరంతా కలసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. (ఆలె ఇమ్రాన్ 3: 103).

ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపిన వాడూ ఆయనేకదా! నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (అన్ఫాల్ 8: 63).

పరస్పర స్నేహం విశ్వాసుల వరకే పరిమితం చేశాడు అల్లాహ్. చదవండిః

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరి కొకరు సహచరులు. (తౌబా 9: 71). మరో ఆదేశం:

వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, నమాజును స్థాపించే జకాత్ ఇచ్చే, అల్లాహ్ ముందు రుకూ చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తనూ, విశ్వాసులనూ తమ మిత్రులుగా స్వీకరించేవారు, అల్లాహ్ పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి. (మాఇద 5: 55,56).

ప్రేమ బంధాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించటమే కాదు, ఆయనే దానికి నాంది వేశారు. దాని నిర్మాణాన్ని బలపరిచారు. ఈ ప్రేమ తన అనుచరుల హృదయాల్లో ప్రళయం వరకు ఉండేట్లుగా చేశారు. అబూ హురైరా  ఉల్లేఖనాన్ని గమనించండిః

عَنْ أَبِي هُرَيْرَةَ  أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (حَقُّ الْـمُسْلِمِ عَلَى الْـمُسْلِمِ سِتٌّ) قِيلَ مَا هُنَّ يَا رَسُولَ الله قَالَ: (إِذَا لَقِيتَهُ فَسَلِّمْ عَلَيْهِ وَإِذَا دَعَاكَ فَأَجِبْهُ وَإِذَا اسْتَنْصَحَكَ فَانْصَحْ لَهُ وَإِذَا عَطَسَ فَحَمِدَ اللهَ فَشَمِّتْهُ وَإِذَا مَرِضَ فَعُدْهُ وَإِذَا مَاتَ فَاتَّبِعْهُ).

“ఒక ముస్లిం పట్ల మరొక ముస్లింకు ఆరు హక్కు (బాధ్యత) లున్నవి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా, అక్కడున్న వారు అవేమిటి ప్రవక్తా? అని అడగ్గా, ఆయన ఇలా సమాధాన మిచ్చారుః “1. నీవు ముస్లిం సోదరుడ్ని కలిస్తే అతనికి సలాం చేయి. 2. అతను (భోజనానికి) ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. 3. అతను నీ ద్వారా ఏదయినా మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయి. 4. అతను తుమ్మి ‘అల్ హందులిల్లాహ్’ అనంటే నీవు దానికి ‘యర్ హముకల్లాహ్’ అని బదులు పలుకు. 5. అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. 6. అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు”([1]).

పై హదీసులో చెప్పబడిన విషయాల అవసరం, నేటి మన సమాజానికి చాలా ఉంది. గడిచే ప్రతీ రాత్రి లేక పగలులో మనలోని ఏ ఒక వ్యక్తికైనా ఈ అవసరం పడుతుంది. అయినా చాలా మంది తమ ముస్లిం సోదురుల పట్ల గల బాధ్యతలు నెరవేర్చడంలో చాలా వెనకబడియున్నారు. రోగులను పరామర్శించడం లేదు. ఏ ఒక్క జనాజా వెంట నడవడం లేదు. పరస్పరం సలాం చేసుకోవడం లేదు.

ఎప్పుడైతే నేను ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా గమనించానో అల్లాహ్ సహాయం కోరుతూ ఈ పుస్తక రచనకు అవసరమైన అంశాలను సమకూర్చాను. ఇందులో కొన్ని ప్రేమ మార్గాల(బంధాల)ను ప్రస్తావించాను. ఇవి స్వయంగా నాకు ఉపదేశాలుగా, పిదప నా ముస్లిం సోదరుల కొరకు, వారు తమ మధ్య ప్రేమ బంధాలను పెంపొందించాలని. ఇలా వారి మధ్య ప్రేమానురాగాలు మరియు వాత్సల్యం పెరగాలని అభిలషిస్తున్నాను.

*   రండి! పరస్పరం ప్రేమగా ఉండడానికి…… కలిసిమెలసి ఉండడానికి……… కనికరించుకోడానికి……….

ఇస్లామీయ మర్యాదలు

మొదటిది: ఇస్లామీయ అభివందనం

1- సలాం… ఇస్లామీయ అభివందనం.

ఒక ముస్లిం మరొక ముస్లింను కలుసుకున్నప్పుడు ఏమనాలనే విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారుః

(إِِذَا لَقِيَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ)

“మీలో ఎవరైనా తన సోదరుడ్ని కలిసినప్పుడు అతనికి సలాం చేయాలి”([2]). అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సలాం ఇదే. మరియు స్వర్గవాసుల సలాం కూడా ఇదే. అల్లాహ్ ఆదేశం:

వారు ఆయనను కలిసే రోజున వారి అభివందనములు సలాము అని యుండును. (అహ్ జాబ్ 33: 44). అల్లాహ్ తన దాసుల కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తమ అనుచరుల కొరకు ఈ సలామునే ఇష్టపడ్డారు. ఈ ఇస్లామీయ సలాంను వదలి ఇతర అభివందనాలను ఉపయోగించుట ఏ ముస్లింకూ తగదు. ఉదాహరణకుః గుడ్ మార్నింగ్, స్వాగతం, లాంటి తదితర అభివందనాలు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు చెప్పారుః మేము అజ్ఞాన కాలంలో ‘అన్అమల్లాహు బిక ఐనా’, ‘అన్అమ సబాహా’ అని అనే వారము. ఇస్లాం వచ్చిన తరువాత వాటి నుండి మమ్మల్ని వారించడం జరిగింది(2). ఇబ్ను అబీ హాతిం మఖాతిల్ బిన్ హయ్యాన్ నుండి ఉల్లేఖించారుః అజ్ఞాన కాలంలో వారు ‘హుయ్యీత మసాఅన్’, ‘హుయ్యీత సబాహన్’ అని అనే వారు. అయితే వాటిని అల్లాహ్ సలాంతో మార్చేసాడు([3]). అందుకని ముస్లిం ఈ గొప్ప సలామునే ఉపయోగించాలి. ఇది మనకు ప్రవక్త నుండి లభించిన ఆస్తి. ధార్మిక పద్ధతి కూడా ఇదే. అల్లాహ్ ఆదేశం:

మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంత కంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతిసలాము చెయ్యండి. లేదా కనీసం అదే విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు. (నిసా 4: 86).

పై ఆయతులో [{అంతకంటే ఉత్తమమైన పద్ధతి లో} అని అంటే అతను ‘అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్’ అని అంటే నీవు జవాబులో ‘వఅలైకుముస్సలాము వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అనాలి. లేదా కనీసం ‘వఅలైకు ముస్సలాము వ రహ్మతుల్లాహ్’ అనాలి.

అబూ దావూద్, తిర్మిజి([4])లో సహీ సనద్ (ప్రామాణిక ఆధారం)తో ఇమ్రాన్ బిన్ హుసైన్  ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి అస్సలాము అలైకుం అన్నాడు. ప్రవక్త ﷺ అతనికి బదులు పలికారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త “పది” అని చెప్పారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్ అన్నాడు. ప్రవక్త ﷺ జవాబు ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త “ఇరవై” అని అన్నారు. ఇంకొక వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు అన్నాడు. ప్రవక్త ﷺ ప్రతిసలాము చేశారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త ﷺ “ముప్పై” అని అన్నారు. అంటే పూర్తి సలాము చెప్పినతనికి ముప్పై పుణ్యాలు అని భావం.

ఇవి ప్రవక్త బోధనలు. మరియు ఇది ప్రవక్త శిక్షణా విధానం. అయితే ప్రవక్త బోధనలను ఆచరణ రూపంలో తీసుకువచ్చి, ఆయన విధానాన్ని అనుసరించడం వల్ల ఏకైకుడైన అల్లాహ్ నుండి లభించే ఏ గొప్ప ప్రతిఫలం వారి కొరకు వేచి ఉన్నదో దాని శుభవార్త తమ సహచరులకు తెలుపుతూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయాల్లో సున్నతుల ప్రేమ ఎలా నాటుతున్నారో గమనించండి.

2- ఎవరికి సలాం చేయాలిః

عَنْ عَبْدِ الله بْنِ عَمْرٍو ؆ أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ ﷺ أَيُّ الْإِسْلَامِ خَيْرٌ؟ قَالَ: (تُطْعِمُ الطَّعَامَ وَتَقْرَأُ السَّلَامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ).

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ఏ ఇస్లాము మేలైనది? అని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అన్నం తినిపించు. నీకు పరిచయం ఉన్నవారికీ లేనివారికీ అందరికీ సలాం చేయి” అని సమాధానం ఇచ్చారు.([5])

నీకు ముందు నుండే పరిచయం ఉన్నవారు, పరిచయం లేని వారందరికీ సలాం చేయి. ఇది కూడా ఇస్లామీయ మరియు ప్రవక్త గారి పద్ధతి. కొందరు సలఫె సాలిహీన్ ఇలా చెప్పారుః ‘వెనకటివారిలో సలాం కేవలం పరిచయం ఉన్నవారికే పరిమితం అయ్యింది. ఇది ప్రళయసూచనల్లో ఒకటి. ముస్లిములందరికీ -వారు తెలిసినవారైనా, తెలియనివారైనా- సలాం చేయటం ప్రతి ముస్లింపై విధిగా ఉంది. – అయితే యూదులు, క్రైస్తవులు మరియు విగ్రహారాధకులకు తప్ప. పై హదీసు గాని, పరస్పర హక్కులను స్పష్టపరచడానికి వచ్చిన హదీసుల్లో గాని ‘అందరికి సలాం చెయ్యండి’ అని అంటే ముస్లి ములు అనే భావం. ఏ మనిషి ముస్లిం సమాజములో జీవిస్తు న్నాడో అతను కలిసినవారందిరికీ సలాం చేయాలి. వారు అతని స్నేహితులైనా కాకపోయినా, బంధువులైనా కాకపోయినా – ఏ ముస్లిమైనా సరే.

నేడు మనం సమాజములో తెలిసినవారికే సలాం చేస్తున్నాము. దారిలో వెళ్తూ గమనిస్తే అందరూ తమ పరిచయస్తులకే సలాం చేస్తున్నారు. పరిచయం లేనివారికి సలాం చేయడం లేదు. ఇది అజ్ఞానకాలం నాటి ఆచరణ. ప్రవక్త ﷺ పద్ధతికి వ్యతిరేకం. బుఖారీ, ముస్లింలో ఉందిః అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాంను పుట్టించిన తర్వాత ఇలా చెప్పాడుః “అదిగో అక్కడ కూర్చుండియున్న దూతల వద్దకు వెళ్ళి సలాం చేయి. వారు ఏమని జవాబిస్తారో శ్రద్ధగా విను, అదే నీ యొక్క మరియు నీ సంతానం యొక్క సలాం”. ఆయన వెళ్ళి అస్సలాము అలైకుం అన్నారు. వారు అస్సలాము అలైక వ రహ్మతుల్లాహ్ అని సమాధానమిచ్చారు([6]). అంటే రహ్మతుల్లాహ్ అన్న పదాలు ఎక్కువ పలికారు. ఇదే ఆదం అలైహిస్సలాం, ఆయన సంతతి మరియు స్వర్గవాసుల సలాం.

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అబూ హురైరా  ఉల్లేఖించారుః

عَنْ أَبِي هُرَيْرَة  قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (لَا تَدْخُلُونَ الْـجَنَّةَ حَتَّى تُؤْمِنُوا وَلَا تُؤْمِنُوا حَتَّى تَحَابُّوا أَوَلَا أَدُلُّكُمْ عَلَى شَيْءٍ إِذَا فَعَلْتُمُوهُ تَحَابَبْتُمْ أَفْشُوا السَّلَامَ بَيْنَكُمْ).

“మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు పరస్పరం ప్రేమతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు. నేను ఒక విషయం చెప్పనా? దాన్ని మీరు పాటిస్తే తప్పక పరస్పరం ప్రేమతో మెలగ గలుగుతారు! మీలో పరస్పరం సలాంను వ్యాపింప చేయండి”([7]).

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారుః విశ్వాసం లేనిదే స్వర్గంలో ప్రవేశం లభించదు. ప్రేమ లేనిదే విశ్వాసం ప్రాప్తి కాదు. సలాంను వ్యాపింప జేస్తే తప్ప ప్రేమను పొందలేరు.

సలాంను వ్యాపింపజేయటం వల్ల హృదయాల్లో ఉన్న కాపట్యం దూరమవుతుంది. ప్రత్యేకంగా బంధువుల్లో, ఇరుగు పొరుగువారిలో. ఇస్లాంలో దాని భావం ఏమిటంటే నీవు సంధి కొరకు తెల్ల జెండాను ఎగరవేస్తున్నావు. అంటే నీవు ఇలా అంటున్నావన్న మాట! నేను నా తెల్ల జెండాను ఎగరవేస్తు వచ్చాను నేను మీ శాంతి కోరుతున్నాను, నా నుండి కూడా మీకు శాంతియే కలుగును గనక మీరు నా పట్ల భయ పడకండి.

ఇదే ప్రేమ చిహ్నం మరియు ఉత్తమ పద్ధతినూ. మన ప్రవక్త ﷺ దాన్ని స్థాపించారు. ప్రవక్త తమ సహచరుల్లో వారి తరువాత తమ అనుచర సంఘ సభ్యుల హృదయాల్లో నాటడానికి ప్రోత్సహించారు. బుఖారీలో ఉందిః అమ్మార్ బిన్ యాసిర్  చెప్పారుః ‘మూడు విషయాలు ఎవరిలో ఉన్నాయో అతనిలో విశ్వాసమున్నట్లేః తన ఆత్మకు న్యాయం చేసుకోవటం. అందరికీ సలాం చేయటం. లేమిలో కూడా దానం చేయటం'([8]). అందరికీ సలాం చేసే వ్యక్తిలో వినమ్రత ఉందని భావం. అతను ఎవరిపై అహంభావాన్ని వ్యక్తపరచడు. చిన్న, పెద్ద, గౌరవంగలవానికి, నీచునికి, పరిచయస్తునికి, అపరిచితునికి అందరికీ సలాం చేస్తాడు. అదే అంహంభావి అయితే దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అతడు తన అహంభావం వల్ల కనీసం సలాం చేసినవారికి ప్రతిసలాం కూడా చేయడు. ఇక ఇతరులకు సలాం చేయడంలో ఎలా ముందంజం వేస్తాడు?. (జాదుల్ మఆద్ 2/410 చూడండి).

బుఖారి, ముస్లింలో ఉంది: ప్రవక్త ﷺ చిన్నారులకు కూడా సలాం చేసేవారని అనస్ రజయల్లాహు అన్హు తెలిపారు([9]). ఇది ప్రవక్త గారి జాలితనం, మృదుత్వం మరియు వినమ్రత. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సలాములు పొందినందు వల్ల ఆ చిన్నారుల మనుస్సుల్లో ఓ గొప్ప సంతోషం, ఆనందం చోటు చేసుకుంటుంది. మహాప్రవక్త నాకు సలాం చేశారు అని వారు తమ సభల్లో చెప్పుకుంటారు.

అందుకు ముస్లింలు ఇలాంటి వారితో కూడా వినమ్రతా గుణం పాటించాలి. వారు చిన్నారులు (బచ్చాగాళ్ళు) కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని వెదికి, వారికి సలాం చేసి, వారికి ఇలాంటి ప్రేమ నేర్పాలి. ఉత్తమ గుణాల వైపు ప్రోత్సహించాలి.

చరిత్రలో మనం ఉమర్ రజియల్లాహు అన్హు గారిని చూశాము. ధర్మం విషయంలో ఆయన నిర్భయుడు, ప్రబలుడై కూడా బాలల నుండి దాటుతున్నప్పుడు వారి వద్ద నిలిచి వారికి సలాం చేసి, వారి వినోదంలో కొంత పాలుపంచుకునేవారు. ఈ  సందర్భంలో అతను ‘ఖలీఫా’. అంటే పెద్ద రాజు.

ఒక రోజు మదీనా బాలలు ఆడుకుంటుండగా వారి దగ్గరి నుండి దాటారు, వారు ఆయన్ని చూసి తమ ఇంటికి పరిగెత్తారు. అంతకు ముందే వారు ఆయన పలుకుబడి, అధికారం గురించి విని ఉన్నారు.

ఉమర్ ముందు నుండి షైతానులు పారిపోయినప్పుడు బాలలదేముంది?

చిన్నారుల హృదయాలు పక్షిలాంటివి. ఎందుకని పారిపోరు? ఆ నాటి సూపర్ పవర్ దేశాల (రోమ్ మరియు పర్షియా/ ఇరాన్) రాజులు ఉమర్ పేరు విని (తమ  భవిష్యత్తు గురించి) నిరాశ చెంది ఒక్కోసారి స్పృహ తప్పేవారు. పిల్లవాళ్ళు ఏ పాటి?

అందరూ పరుగులు తీశారు. కాని అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ మాత్రం పోలేదు. అక్కడే ఉండిపోయాడు. ఆ సందర్భంలో అతడు నవయువకుడు. ఉమర్ పరియాచకంగా ‘ఏమిటి నీ మిత్రులు పారి పోయారు. నీవు పారిపోలేదు? నీవు భయపడలేదా? అని అడిగారు.

దానికి అబ్దుల్లాహ్ ‘నేనేమి పాపం చేయలేదు కదా మీకు భయపడ్డానికి! దారి కూడా అంత ఇరుకగా లేదు కదా నేను పక్కకు జరిగి మీకు దారివ్వడానికి! అని సమాధానమిచ్చాడు.

అప్పటి నుండే అతని ప్రతిభ, తెలివితేటలు, ధైర్య సాహసాలు ప్రస్ఫుటమయ్యాయి. అయినా అతను ఎవరి బిడ్డ? అతని తండ్రి జుబైర్ బిన్ అవ్వామ్  మరియు తల్లి అస్మా రజియల్లాహు అన్హా .

{ఒకరి వంశాన్నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అంతా తెలుసు}. (ఆలె ఇమ్రాన్ 3: 34).

3- ఇతరులకు సలాం అందజేసే బాధ్యతః

తమకు ఎదురైన వారికి ప్రవక్త ﷺ స్వయంగా సలాం చేసే వారు. దూరంగా ఉన్నవారిలో ఆయన సలాం కోరువారికి సలాం పంపేవారు. ఒకసారి ఆయన ﷺ ఓ రోగి వద్దకు ఒక యువ కుడిని పంపారు. అతను ఆ రోగి వద్దకు వచ్చి ప్రవక్త ﷺ మీకు సలాం తెలుపుతున్నారు అని చెప్పాడు([10]). అలాగే ఎవరికైనా సలాం అందజేసే బాధ్యత కూడా ఆయన ﷺ స్వీకరించేవారు([11]). ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి వచ్చారు, అప్పుడే ఖదీజ రజియల్లాహు అన్హా ప్రవక్త ﷺ వద్దకు వస్తున్నారు. జిబ్రీల్ చెప్పారుః ‘ప్రవక్తా! అదిగో ఖదీజా ఏదో తిను పదార్థం లేక పానీయం తీసుకొని వస్తున్నారు, ఆమె వచ్చాక ఆమెకు ఆమె ప్రభువు యొక్క సలాం తెలుపండి. నా సలాం కూడా తెలుపండి. ఇంకా ఆమె కొరకు స్వర్గంలో ఒక ముత్యాల గృహం ఉందని, అందులో ఏ మాత్రం అలజడిగానీ మరియు అలసటగానీ లేదని శుభవార్త ఇవ్వండి’([12]). ఈ విధంగా జిబ్రీల్ యొక్క సలాం ఆయిషా రజియల్లాహు అన్హా గారికి కూడా అందజేశారు([13]).

సలాం పదాలు ‘వబరకాతుహు’తో ముగిస్తాయి. దీనిని బలమైన సనదు(ఆధారా)లతో అబూ దావుద్ మరియు తిర్మిజి ఉల్లేఖించారు. కొన్ని ఉల్లేఖనాల్లో ‘వమగ్ఫిరతుహు’ అని అదనంగా ఉంది. కాని ఇది జఈఫ్ (బలహీనమైన ఆధారం). అబూ దావూద్ స్వయంగా నిరాధారమైన హదీసు అని దీని గురించి ప్రస్తావించారు([14]).

ప్రవక్త ﷺ ఒక్కోసారి మూడేసి సార్లు సలాం చేసేవారని అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు([15]). ఒక పెద్ద జనసమూహానికి సలాం చేసినప్పుడు ఒకే సలాం అందరికి వినబడదన్న ఉద్దేశంతో బహుశ ఈ పద్ధతి పాటించేవారు. ఈ విషయం హాకిం వద్ద ఒక ఉల్లేఖనంలో ఉంది.

హదీసులో వచ్చిన ఒక విషయం ఇది కూడానుః ప్రవక్త ﷺ సఅద్ బిన్ ఉబాదాను కలుసుకోడానికి వెళ్ళారు. అతని ఇంటి వద్దకు వచ్చి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. సఅద్ విని మనుసులోనే జవాబి చ్చారు. గొంతెత్తి జవాబు పలుకలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరోసారి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. ప్రవక్తకు వినబడనట్లుగా సఅద్ మెల్లగా జవాబిచ్చారు. ప్రవక్త ﷺ మూడవసారి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. అప్పుడు కూడా సఅద్ మెల్లగానే జవాబిచ్చారు. ప్రవక్త గారికి వినబడలేదు గనక ప్రవక్త అక్కడి నుండి తిరిగి వెళ్లారు. సఅద్ బిన్ ఉబాద వెంటనే ప్రవక్త వెనక వెళ్ళి ఇలా విన్నవించుకున్నారుః ‘ప్రవక్తా! తమరు సలాం చేసినప్పుడల్లా నేను విన్నాను. మెల్లగా జవాబిచ్చాను. దీని వెనక నా ఉద్దేశ్యం మీ సలాములను ఎక్కువగా పొందాలన్నది మాత్రమే’. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అస్సలాము అలైకుం అహ్లల్ బైతి వ రహ్మతుహు ఇన్నహూ హమీదుమ్మజీద్”([16]).

4- స్త్రీలకు సలాం:

ఒకసారి ప్రవక్త ﷺ స్త్రీల సమూహం నుండి దాటుతూ (చెయ్యి సైగతో) వారికి సలాం చేశారు([17]). ఇది ప్రవక్త ﷺ యొక్క ఉత్తమ గుణం. ఎందుకనగా ఆయన స్త్రీపురుషులందరి వైపునకు ప్రవక్త.

కొందరు విద్యావంతులు ఇలా చెప్పారుః ఏ అటంకాలూ లేనప్పుడు, చెడు వైపునకు కారణమయ్యే భయం లేనప్పుడు పురుషులు స్త్రీలకు సలాం చేయవచ్చు. ఉదాహరణకు వృద్ధు రాళ్ళకు సలాం చేయుట. అలాంటి వారికి నీవు సలాం చేసి కొంత సేపు వారితో ఉండి వారి సంక్షేమాలు తెలుసుకో, ఇలా ప్రవక్త సహచరులు చేశారు. బుఖారీలో సహల్ బిన్ సఅద్  ఉల్లేఖనంలో ఉందిః వారు జుముఅ నమాజు చేసుకొని వారి దారి మధ్యలో ఉన్న ఒక ముసలి తల్లి వద్దకు వచ్చి, ఆమెకు సలాం చేసేవారు. ముస్లిముల్లో వయసుగల వారితో ఇలాంటి గౌరవభావం చాలా మంచి విషయం. ఇస్లాం ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నట్లు అనేక ఆధారాలు గలవు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం జాదుల్ మఆద్ (2/412) లో పేర్కొన్నారు.

సలాం మర్యాదలుః

1- ప్రవక్త ﷺ చెప్పారుః “చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు, కాలినడకన వెళ్ళేవారు కూర్చున్నవారికి, వాహనముపై ఉన్నవ్యక్తి కాలినడకన వెళ్ళేవారికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి([18]).

చిన్నవారు పెద్దవారికి సలాం చేయాలిః ప్రవక్త ﷺ గారి ఈ ఆదేశంలో గొప్ప వివేకం గలదు. పెద్దవారు గౌరవమర్యాదలకు హక్కు దారులు. అందుకు చిన్నవారు పెద్ద వారికి సలాం చేయడంలో ముందడుగు వేయాలి. నీవు వయసులో నీకంటే పెద్దవారిని కలిసినప్పుడు నీవు ముందుగా అతనికి సలాం చేయడం నీపై విధిగా ఉంది. అతను నీకంటే పెద్ద వాడైనందు వల్ల నీవు అతన్ని గౌరవిస్తున్నావు అని అతనికి తెలియజేయాలి. ఒకవేళ అతనే నీకు ముందుగా సలాం చేస్తే అతను నీకంటే ఉత్తముడు. అందులో ఏ అనుమానం లేదు.

చిన్నవారు పెద్దవారికి సలాం చేయాలి అనే ఆధారంపై పెద్ద ఆలింకు, ముస్లిం పండితునికి ఇంకా ఉన్నత స్థానం కలవారికి మనం సలాం చేయాలి.

కూర్చున్నవారికి కాలినడకన వెళ్ళేవారు సలాం చేయాలిః ప్రవక్త ﷺ గారి ఈ ఆదేశం ప్రకారం కాలినడకన వెళ్ళేవారు కూర్చున్న వారికి సలాం చేయుట విధిగా ఉంది. కొందరు నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా అన్ని స్థితుల్లో ఇతరుల సలాం కొరకు వేచి ఉంటారు. స్వయంగా ముందుకు వెళ్ళి సలాం చేయరు. ఇది చాలా తప్పు. దీని కారణంగా అతను గర్వానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో సున్నతు పద్ధతి ఏమిటో తప్పక తెలుసుకోవాలి. దాన్ని అనుసరించాలి. నడిచే వ్యక్తియే కూర్చున్న వ్యక్తికి సలాం చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి అతనే ఒంటరిగా ఉండవచ్చు. కూర్చున్నవారు కొంతమంది అయి ఉండవచ్చు. నడిచేవ్యక్తి వారి మధ్య హఠాత్తుగా రావచ్చు.

  • వాహనముపై ఉన్న వ్యక్తి నడిచివెళ్ళే వ్యక్తికి సలాం చేయాలిః వాహనములో ఉన్న వ్యక్తి నడిచి వెళ్ళే వ్యక్తికి సలాం చేయాలి. ఇందులో కొన్ని సూక్ష్మవిషయాలున్నాయి అని ఫత్ హుల్ బారిలో ఉందిః వాహనములో ఉన్న వ్యక్తి తనకు తాను ఉన్నతుడుగా భావిస్తాడు. అందుకని ఇస్లాం నడిచేవాళ్ళకు సలాం చేయుట అతనిపై విధిగా చేసింది. అతనిలో నమ్రత మరియు మృదుత్వ గుణాలు రావాలని మరియు అహంకార భావానికి గురి కాకూడదని.
  • చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలిః ఒక వ్యక్తి ఒక సమూహం దగ్గరి నుండి వెళ్తుంటే అతను ఆ సమూహానికి సలాం చేయాలి. ఐదుగురు పది మంది మీదుగా పోతున్నప్పుడు ఐదుగురు పది మందికి సలాం చేయాలి. పది మంది ఐదుగురికి కాదు సలాం చేయాల్సింది. “జమాఅతులోని ఒక వ్యక్తి సలాం చేసినా అది వారందరి తరఫున సరిపోతుంది. అలాగే కూర్చున్నవారిలో ఏ ఒక్కరు జవాబిచ్చినా అది వారందరి తరఫున సరిపోతుంది”. ఈ హదీసు అబూదావూద్([19])లో ఉంది. దీనికొక సాక్ష్యం ముఅత్త మాలిక్([20])లో ఉంది. దానితో కలసి ఇది హసన్ స్థానానికి చేరుతుంది.
  • ప్రవక్త ﷺ చెప్పారుః “నడిచే వ్యక్తి నిలుచున్న వ్యక్తికి సలాం చేయాలి([21])“.

ఇవి ప్రవక్త ﷺ పద్ధతులు, శిక్షణలు, వివేకముతో కూడిన ఆదేశాలు. ఆయన మనకు మేలైన ప్రతీ విషయాన్ని చేయాలని ప్రోత్సహించారు. ప్రతీ చెడు నుండి వారించారు.

5- ముందుగా సలాం చేయటంలోని ఘనతః

عَنْ جَابِر قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (يُسَلِّمُ الرَّاكِبُ عَلَى الْـمَاشِي وَالْـمَاشِي عَلَى الْقَاعِدِ وَالْـمَاشِيَانِ أَيُّهُمَا بَدَأَ فَهُوَ أَفْضَل).

“వాహనముపై ఉన్న వ్యక్తి నడుస్తున్న వ్యక్తికి, నడుస్తున్న వ్యక్తి కూర్చున్న వ్యక్తికి సలాం చేయాలి. ఇక ఇద్దరు నడుస్తూ ఎదురెదురుగా కలుసు- కున్నప్పుడు ఎవరు సలాం చేయటంలో ముందుంటారో వారే ఉత్తములు” అని ప్రవక్త ﷺ చెప్పారని ఇబ్ను హిబ్బాన్([22]) మరియు బజ్జార్ లు([23]) జాబిర్ ﷜ తో ఉల్లేఖించారు.

 (إِنَّ أَوْلَى النَّاسِ بِالله مَنْ بَدَأَهُمْ بِالسَّلَامِ).

అబూ ఉమామ  ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ప్రవచించారుః “సలాం చేయటంలో ఎవరు ముందంజ వేస్తారో నిశ్చయంగా వారే అల్లాహ్ కు అతి సన్నిహితులు”([24]). దీని భావం చాలా స్పష్టంగా ఉందిః ముస్లిములను కలసి వారికి సలాం చేయటంలో ముందంజ వేసేవారు అల్లాహ్ కు చాలా సమీపంగా, ప్రియులుగా మరియు అతి సన్నిహితులుగా ఉంటారు. సహాబా, తాబిఈనుల ఉత్తమ గుణం ఇదే. సలాం చేయడంలో ఇతరులకంటే వారు ముందంజ వేశేవారు.

ఒక హదీసులో ఉందిః “ప్రశ్నకంటే ముందు సలాం చేయాలి. మీతో ఎవరైనా సలాంకు ముందు ఏదైనా అడిగితే అతనికి సమాధానం చెప్పకండి”([25]). అంటే ఎవరూ కూడా సలాంకు ముందు మాట్లాడవద్దు. సలాం చేసిన తరువాత మాట్లాడవచ్చు.

కలదా బిన్ హంబల్ చెప్పారుః పాలు, జున్ను, లేడి మరియు చిన్నజాతి దోసకాయలిచ్చి సుఫ్వాన్ బిన్ ఉమయ్య అతన్ని ప్రవక్త ﷺ వద్దకు పంపాడు. అప్పుడు ప్రవక్త ﷺ మక్కాలోని ఎగువ ప్రాంతములో ఉండిరి. నేను ఆయన ఉన్న గదిలోకి ప్రవేశిం చాను, సలాము చేయలేదు మరియు అనుమతి కోరలేదు. ప్రవక్త ﷺ చెప్పారుః “తిరిగి వెళ్ళు, అస్సలాము అలైకుం అని పలికిన తర్వాత “లోనికి రావచ్చా?” అని అనుమతి అడుగు”([26]).

నిరక్షరాస్యుల సంఘం… {ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన ఆయతులను వినిపిస్తున్నాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు}. (జుముఅ 62: 2). అల్లాహ్ ఈ జాతిలో ప్రవక్తను పంపాడు. ఆయన వారిని తీర్చిదిద్ది, వారికి ధర్మ జ్ఞానం నేర్పడానికి, ఉన్నత మర్యాదలు, ఉత్తమ గుణాలు నేర్పడానికి.

పైన పేర్కొనబడిన కలదా హదీసు ద్వారా బోధపడేదేమిటంటేః సలాం ప్రవేశానికి, మాటకు ఒకటేమిటి సర్వానికి ముందు ఉండాలి.

అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఎవరింటికైనా వచ్చినప్పుడు తలుపుకు ఎదురుగా నిలబడేవారు కాదు. దాని కుడి ప్రక్కన లేక ఎడమ ప్రక్కన ఉండే వారు. అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం అనేవారు([27]).

కలిసిన వారికి సలాం చేయడంలో ముందంజ వేయటం ప్రవక్త  అలవాటు. ఇలాంటి అవకాశాన్ని మరీమరీ పొందాలని కాంక్షించే వారు. అహంభావానికి గురైనవారి లాగా కాదు. అహంభావులు ప్రజల నుండే ఎల్లప్పుడూ సలాం వినడానికి ప్రయత్నిస్తుంటారు.

సలాం చేసే వ్యక్తి ‘అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకా- తుహు’ అని ప్రారంభించాలి. జవాబిచ్చే వ్యక్తి ‘వఅలైకు ముస్సలాం…’ అని ప్రారంభించాలి. ఈ పద్ధతిని నవవీ మరియు ఇబ్నుల్ ఖయ్యిమ్ రుజువు చేశారు. ఇది ‘అలైకుముస్సలాం’ కంటే చాలా మంచిది, ఉత్తమం.

సలాం చేసే వ్యక్తి ‘అలైకస్సలాం’ అనటం మంచిది కాదు. అబూ జురై అల్ హుజైమీ చెప్పారుః నేను ప్రవక్త వద్దకు వచ్చి, అలైకస్సలాం యా రసూలుల్లాహ్ అని అన్నాను. అలైకస్సలాం అనకు, అలైకస్సలాం అని మృతులకు సలాం చేయబడుతుంది అని ప్రవక్త చెప్పారు([28]).

ఇక నుండి అలైకస్సలాం పదాలను మానుకోవాలి. ఆ కాలంలో ఈ పదాలతో మృతులకు సలాం చేయబడేది. ప్రవక్త ﷺ కూడా ఈ పద్ధతిని అసహ్యించుకున్నారు. ఆయన ﷺ అసహ్యిం చుకున్నారు గనక ఈ పదాలతో సలాం చేసే వ్యక్తికి జవాబివ్వ కూడదు. (చూడండిః జాదుల్ మఆద్ 2/420, 421).

6- సభల్లో సలాం పద్ధతులు

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِذَا قَعَدَ أَحَدكُمْ فَلْيُسَلِّمْ وَإِذَا قَامَ فَلْيُسَلِّمْ فَلَيْسَتِ الْأُولَى أَحَقَّ مِنَ الْآخِرَة).

“మీలో ఎవరైనా (ఏదైనా సభలోకి) ప్రవేశిస్తే సలాం చేయాలి. అక్కడి నుండి లేచి పోవాలనుకున్నప్పుడు కూడా సలాం చేయాలి. తుదిసారి చేసేది తొలిసారిదానికంటే ప్రాముఖ్యత గలది”([29]).

దీని అర్థం చాలా స్పష్టంగా ఉందిః నీవు ఏదైనా సమావేశం, సభ నుండి వెళ్తూ నీ సోదరులతో, మిత్రులతో వీడ్కోలు తీసుకుంటూ అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అను. ఈ సున్నతును చాలా మంది ముస్లిములు మరచిపోయి ఉన్నారు. ఫీ అమానిల్లాహ్, అస్తౌదిఉకుముల్లాహ్ (ఖుదాహాఫిజ్) లాంటి పదాలంటూ ఉంటారు, ప్రవక్తతో రుజువైన ఈ గొప్ప సున్నతును వదిలేస్తూ ఉంటారు.

అబూ దావూదు([30])లో రెండు సనదులు: -ఒకటిః మర్ఫూ సహీ సనద్ తో, మరొకటిః మౌఖూఫ్ జఈఫ్ సనద్- తో వచ్చిన హదీసు ఇలా ఉందిః

عَنْ أَبِي هُرَيْرَةَ  عَنْ رَسُولِ الله ﷺ قال: (إِذَا لَقِيَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ فَإِنْ حَالَتْ بَيْنَهُمَا شَجَرَةٌ أَوْ جِدَارٌ أَوْ حَجَرٌ ثُمَّ لَقِيَهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ).

“మీలో ఎవరైనా తన సోదరుడ్ని కలిసినప్పుడు అతనికి సలాం చే యాలి. కలిసి వెళ్తుండగా ఇద్దరి మధ్యలో ఏదైనా చెట్టు, గోడ లేదా పెద్దరాయి అడ్డు వచ్చి మళ్ళీ కలుసుకుంటే సలాం చేయాలి”. ఈ పద్ధతి ప్రవక్త సహచరుల్లో ఉండేది. అనస్  తెలిపారుః ప్రవక్త ﷺ సహచరులు కలిసి నడుస్తుండేవారు, ఏదైనా చెట్టు లేదా కొమ్మ అడ్డు వస్తే కుడి, ఎడమ వైపుల్లో విడిపోయి మళ్ళీ కలుసు కున్నప్పుడు మళ్ళీ సలాం చేసుకునేవారు([31]). దీని ఆధారంగానే సమావేశాల్లో వచ్చే, పోయే వ్యక్తి వచ్చిపోయినప్పుడల్లా సలాం చేయాలి. ఇది ఓ మంచి కార్యాం. దీని కర్తకు పుణ్యం లభిస్తుంది.

7- మస్జిదులో ప్రవేశించినప్పుడు సలాం పద్ధతులు:

ఇబ్నుల్ ఖయ్యిమ్ చెప్పారుః ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఒకటిః మస్జిదులో ప్రవేశించు వ్యక్తి తహియ్య తుల్ మస్జిద్ రెండు రకాతులు చేయాలి. ఆ తరువాత వచ్చి అందులో ఉన్నవారికి సలాం చేయాలి. ఆయన దీనికి ఆధారం నమాజులో పొరపాటు జరిగిన సహాబీ రిఫాఅ యొక్క హదీసును ప్రస్తావించారు. ఆయన నమాజు చేసి వచ్చి ప్రవక్తకు సలాం చేశారు. ప్రవక్త అతని సలాంకు జవాబు పలికి నీవు మళ్ళీ నమాజు చెయ్యి, నీవు నమాజు చేయలేదు. అని చెప్పారు([32]). ఇది వారి అభి ప్రాయం, కాని రిఫాఅ సహాబీ మస్జిదులో ప్రవేశించిన తరువాత సలాం చేయలేదని ఏ ఆధారమూ లేదు. బహుశా అతను మస్జిదు మూలలో నమాజు చేసి ప్రవక్త వద్దకు వచ్చి సలాం చేసి ఉండ వచ్చు. నిజం ఏమిటంటే మనిషి మస్జిదులో ప్రవేశించి, ముందు సలాం చేయాలి. పిదప నమాజు చేయాలి.

నీవు నమాజులో ఉన్నప్పుడు -అది ఫరజు, సున్నతు, నఫిలు ఏ నమాజైనా సరే- ఎవరైనా ముస్లిం సలాం చేస్తే, దాని జవాబు నోటితో కాకుండా చేతి సైగతో ఇవ్వాలి([33]). అయితే దాని పద్ధతి ఇదిః కుడి చెయ్యి అరచేతి లోపలి భాగాన్ని భూమి వైపు, పై భాగాన్ని తన ముఖము వైపు చేయాలి. బొటనవ్రేళితో సైగ చేయమని కొందరు విధ్వాంసులు చెప్పారు. కాని చేత్తో సైగ విషయమే నిజమైనది, నిర్థారితమైనది.

8- ఇంటివారికి సలాం చేసే పద్ధతి:

ప్రవక్త ﷺ రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పడుకునేవారు మేల్కోకుండా, మేల్కొని ఉన్నవారు వినేవిధంగా సలాం చేసేవారు([34]). ఏ మనిషి కూడా తన ఇంట్లో ప్రవేశించి గట్టిగా, వారికి ఇబ్బంది కలుగు విధంగా సలాం చేయకూడదు. చూడండి! ప్రవక్తగారి మృదుత్వాన్ని, మెత్తదనాన్ని.

ఇక మాటకు ముందే సలాం (అస్సలాము కబ్లల్ కలాం) అన్న హదీసు నిరాధారమైనది. ప్రవక్త వరకు దీని పరంపర ప్రామాణికంగా లేదు. ఇమాం తిర్మిజి  ([35]) జాబిర్ తో ఉల్లేఖించారు. కాని దీని సనదులో అంబస బిన్ అబ్దుర్రహ్మాన్ ఉన్నాడు. అతడు (మత్రూక్). అతను (వజ్జాఅ) అని అబూ హాతిం చెప్పాడు. అలాగే అంబస యొక్క గురువు ముహమ్మద్ బిన్ జాజాన్ కూడా (మత్రూక్). అందుకు ఈ హదీసు బాతిల్ (చెల్లనిది, నిరాధారమైనది).

9- ముస్లిమేతరులకు సలాం చేయటం?

గ్రంథమివ్వబడినవారికి ప్రవక్త ﷺ సలాం చేసేవారు కారు. ఆయన ఇలా సెలవిచ్చారుః “యూదులు, క్రైస్తవులకు సలాం చేయడంలో మీరు ముందు పడకండి”([36]). యూద, క్రైస్తవుల చుట్టుప్రక్కన ఉన్నవారు స్వయంగా వారికి సలాం చేయకూడదు. కాని వారు సాలం చేస్తే, వఅలైకుం అనాలి.

ముస్లిములు, ముష్రికులు, బహుదైవారాధకులు మరియు యూదులు కలిసి కూర్చున్న ఒక సమావేశం మీదుగా ఒకసారి ప్రవక్త ﷺ సాగిపోయారు. వారికి సలాం చేశారు([37]). నీవు ఏదైనా సభ, సమావేశము నుండి దాటుతూ ఉంటే అందులో ముస్లిములు (ముస్లిములు ఉండడం తప్పనిసరి) యూదులు, క్రైస్తవులు కలిసి ఉంటే వారికి నీవు ధర్మ రీత్యా చేయవలసిన సలాం (అంటే అస్సలాము అలైకుం…) చేయవచ్చును.

ప్రవక్త ﷺ హెరిక్లిస్ రాజుకు వ్రాసిన పత్రములో ‘అస్సలాము అలా మనిత్తబఅల్ హుదా’ అని సంబోధించారు([38]). ఇలాంటి సలాం ప్రస్తావన ఖుర్ఆనులో కూడా వచ్చి ఉంది. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఫిర్ఔనుకు చెప్పిన విషయం: {వస్సలాము అలా మనిత్తబఅల్ హుదా}. (తాహా: 47). మీరు యూదులు, క్రైస్తవులకు సలాం చేసినప్పుడు, లేదా వారికి పత్రము వ్రాయునప్పుడు “అస్సలాము అలా మనిత్తబఅల్ హుదా” వ్రాయండి. కాని అస్సలాము అలైకుం అని ఆరంభించకండి.

10- అపరాధి తౌబా చేయనంత వరకు సలాం విడనాడటం:

ఎవరైనా ఏదైనా అపరాధం చేస్తే అతను దాని నుండి (పశ్చా త్తాపం చెంది) తౌబా చేయనంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చేసేవారు కారు, జవాబు సయితం ఇచ్చేవారు కారు. ఆయన ﷺ కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మరియు అతని ఇద్దరి మిత్రుల పట్ల అలాగే ప్రవర్తించారు. ప్రవక్త ﷺ వారికి సలాం చేసేవారు కాదు. ఆ విషయాన్ని స్వయంగా కఅబ్ ﷺ ఇలా తెలిపారుః ‘నేను ప్రవక్త ﷺ కు సలాం చేసేవాణ్ణి, ఆయన నా సలాంకు సమాధానం ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు. కనీసం ఆయన పెదవులైనా కదిలాయా లేదా నాకు తెలియకపోయేది’([39]).

ఇదే విధంగా స్పష్టంగా బిద్అత్ పనులు చేస్తున్న బిద్అతీకి. ముందు అతనికి ఉపదేశాలు చేస్తూ ఉండాలి. బిద్అత్ యొక్క కీడును గురించి హెచ్చరిస్తూ ఉండాలి. దాన్ని విడనాడమని ప్రోత్స హించాలి. ఈ ప్రయత్నాలన్నీ సఫలం కాకుంటే అతను దాన్ని విడనాడి తౌబా చేయనంత వరకూ అతనితో దూరముండాలి. అతనికి సలాం చేయకూడదు, అతని సలాముకు జవాబివ్వ కూడదు.

అదే విధంగా మస్జిదుకు పక్కనే, ఆరోగ్యంగా ఉండి, అకారణంగా నమాజు జమాఅతుతో (సామూహికంగా) చేయనివాడు. అతనికి మంచి విధంగా నచ్చజెప్పిన తర్వాత కూడా సామూహిక నమాజుకు హాజరు కాకున్నట్లైతే అతనికి సలాం చేయటం మానుకోవాలి. అతని సలాంకు జవాబు కూడా ఇవ్వకూడదు.

అబూ అయ్యూబ్ అన్సారీ  ఉల్లేఖనంలో ప్రవక్త ﷺ చెప్పారుః “ఒక ముస్లిం మరో ముస్లింతో మూడు రోజుల కంటే ఎక్కువగా సంబంధాలు త్రెంచుకొని ఉండటం, ఇద్దరూ దారిలో కలిసినప్పుడు ఎడముఖం పెడముఖంగా తప్పుకోవటం ధర్మసమ్మతం కాదు. వారిద్దరిలో ఎవరు ముందుగా సలాం చేస్తారో వారే ఉత్తములు”([40]). ఇది ప్రాపంచిక విషయాల్లో. ఐహిక విషయాల కోపతాపాలు మూడు రోజుల్లో అంతమయి పోవాలి. ఆ తరువాత మాట్లాడక పోవడం నిషిద్ధం. కాని ధర్మపర విషయాల్లో మూడు రోజులకు అంతం కాదు. తౌబా చేసి తన బిద్అత్, దుర్మార్గాన్ని వడనాడితేనే అంతమయ్యేది.

రెండవది: ఆహ్వాన స్వీకారం

1- ముస్లిం ఆహ్వానాన్ని స్వీకరించటం విధి:

ప్రేమ మార్గాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రవచనం: “అతను (భోజనానికి) ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు”.

కొన్ని ఆహ్వానాలను స్వీకరించటం విధిగా ఉంటే, కొన్నిటిని స్వీకరించటం సున్నత్. మరి కొన్నింటి స్వీకారం నిషిద్ధం కూడా.

స్వీకరించటం విధిగా ఉన్న ఆహ్వానాలు: పెళ్ళి పిలుపు. [అచ్చట ఏలాంటి ధర్మవ్యతిరేక కార్యం లేనప్పుడు]. ఇబ్ను ఉమర్ ؆ ఉల్లేఖనంలో ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “మీలో ఎవరికైనా వలీమ ఆహ్వానం వస్తే అతను దాన్ని స్వీకరించాలి”([41]). ముస్లింలోని మరో ఉల్లేఖనంలో ఉందిః “మీలో ఎవరైనా తన సోదరున్ని ఆహ్వానిస్తే అతను దాన్ని స్వీకరించాలి. అది పెళ్ళి పిలుపైనా ఇంకేదైనా సరే”. ఇందులో (స్వీకరించండి) అనే ఆదేశం, విధిగా ఉన్నట్లు సూచిస్తుంది. అంటే ధర్మానికి వ్యతిరేకమైన ఏ కార్యాలు లేనప్పుడు వలీమా పిలుపును స్వీకరించుట మీపై విధిగా ఉంది.

2- ఆహ్వాన పద్ధతులు:

عَنْ أَبِي هُرَيْرَة  أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (شَرُّ الطَّعَامِ طَعَامُ الْوَلِيمَةِ يُمْنَعُهَا مَنْ يَأْتِيهَا وَيُدْعَى إِلَيْهَا مَنْ يَأْبَاهَا وَمَنْ لَمْ يُجِبْ الدَّعْوَةَ فَقَدْ عَصَى اللهَ وَرَسُولَهُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “భోజనాల్లో అతి చెడ్డది వలీమా భోజనం, అందులో వచ్చేవారిని పిలవడం జరగదు. రాని వాళ్ళను ఆహ్వానించటం జరుగుతుంది. ఇక ఎవరు ఆ పిలుపును అంగీకరించరో అతను అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి అయినట్లే”([42]).

దీని ద్వారా తెలిసిందేమిటంటేః పెద్దవాళ్ళను ఆహ్వానించి, పేదవాళ్ళను దూరం చేసి, ప్రదర్శనాబుద్ధితో, పేరు ప్రఖ్యాతుల కొరకు చేయబడే వలీమాలు చాలా చెడ్డవి.

“మీలో ఎవరికైనా పిలుపు వస్తే అతను దాన్ని స్వీకరించి, అందులో పాల్గొనాలి. (ఆకలి ఉండి) ఇష్టముంటే తినాలి. ఇష్టము లేకుంటే మానాలి”(2). ఉద్దేశమేమిటంటే నీవు అందులో పాల్గొనాలి. తినాలి అని కాదు. ఈ రొజుల్లో కొందరు, వారికి వలీమా పిలుపు ఇవ్వబడినప్పుడు, ‘నేను రాలేను, నేను తిన్నాను’. లేదా ‘నేను తినదలుచుకోలేదు’ అని అంటారు. ఇలా అనడం తప్పు. నీవు అందులో పాల్గొని వారికి దుఆ ఇవ్వడం ముఖ్యం, తినడం కాదు అసలుద్దేశం., వారితో మాట్లాడటం. వారి ఆ శుభకార్యంలో వారికి సహాయపడి, వారి పట్ల ప్రేమ, అప్యాయత చూపటం. మన పూర్వ పుణ్యాత్ములు రోజా (ఉపవాసం) ఉన్నప్పటికీ ఆహ్వానం స్వీకరించి, వారి కార్యంలో హాజరయ్యేవారు. ఆ ఇంటివారితో తమ ఉత్తమ గుణాలతో మెలిగి వారిని ఆశీర్వదించేవారు.

ఇబ్ను మస్ఊద్  ద్వారా మర్ఫూ ఉల్లేఖనం ఉందిః “మొదటి రోజు వలీమా భోజనం వాస్తవమైనది. రెండవ రోజు వలీమా భోజనం సున్నత్. మూడవ రోజు వలీమా భోజనం పేరు ప్రఖ్యాతుల కొరకు చేయబడునది. పేరు ప్రఖ్యాతుల కొరకు చేసేవాని ఆ ఉద్దేశం ఇక్కడే పూర్తి కావచ్చు. కాని పరలోకంలో నష్టమే కలుగుతుంది”. ఈ హదీసు ను ఇమాం అబూదావూద్, ఇమాం అహ్మద్([43])లు ఉల్లేఖించారు. దీని సనదులో ఒక ఉల్లేఖకుడు ‘మజ్ హూల్’ ఉన్నాడు. అందువల్ల ఇది జఈఫ్ హదీసు. ఇమాం బుఖారీ దృష్టిలో కూడా ఇది జఈఫే. బుఖారీయే తన సహీ (బుఖారీ)లో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలీమా విషయంలో ఒక, రెండు రోజులు నిర్ణయించలేదు” అని ఉల్లేఖించారు. అందుకే అవసరాన్ని బట్టి ఒకటి, రెండు, మూడు రోజుల వరకు కూడా వలీమా చేయవచ్చు. కాని ధర్మానికి చేరువుగా ఉన్నది ఒక్క రోజు మాత్రమే.

మరీ అక్కడ ఏలాంటి ధర్మవ్యతిరేకత లేకుంటే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలి.

ఒకరికంటే ఎక్కువ మంది ఆహ్వానించినప్పుడు ఎవరు ముందు ఆహ్వానించారో వారి ఆహ్వానాన్నే స్వీకరించాలి. రెండోవారికి ఇలా స్పష్టంగా చెప్పాలిః ఫలానా వ్యక్తి మీ కంటే ముందు ఆహ్వానించారు గనక మీ వద్దకు రాలేను. ఇద్దరూ ఒకే సందర్భంలో ఆహ్వానిస్తు న్నప్పుడు, దగ్గరి బంధువు పిలుపును స్వీకరించు. రక్త సంబంధి కుడు మరియు పొరుగువారిద్దరు ఒకేసారి ఆహ్వానించినప్పుడు రక్త సంబంధికుని వద్దకు వెళ్ళు.

ధర్మవిరుధ్ధ కార్యాలు అందులో ఏమైనా ఉంటే పాల్గొన కూడదన్న విషయం ముందే చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా వాటిని ఖండించగలుగుతే అతను పాల్గొనవచ్చును.

మూడవది: జన శ్రేయోభిలాష ధర్మానికి పునాది

1- జన శ్రేయోభిలాష తప్పనిసరి:

ప్రవక్త ﷺ ప్రవచనం: “అతను నీ ద్వారా ఏదయినా మేలును కాంక్షిస్తే దాన్ని అందజెయ్యి”. ఇది మూడవ పునాది. దీని గురించి మనకు ప్రవక్త ﷺ స్పష్టంగా బోధించారు. ఇదే ప్రేమ చిహ్నం. ఇది మనలోని ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది.

పండితుల దృష్టిలో శ్రేయోభిలాష తప్పనిసరి. ప్రవక్త ﷺ గారి ఈ హదీసు ఆధారంగాః

عَنْ تَمِيمٍ الدَّارِيِّ  أَنَّ النَّبِيَّ ﷺ قَالَ: (الدِّينُ النَّصِيحَةُ) قُلْنَا: لِمَنْ؟ قَالَ: (لله وَلِكِتَابِهِ وَلِرَسُولِهِ وَلِأَئِمَّةِ الْـمُسْلِمِينَ وَعَامَّتِهِمْ).

ప్రవక్త ﷺ ప్రవచించారని తమీం బిన్ ఔస్ అద్దారి  ఉల్లేఖించారుః “దీన్ (ధర్మం) చిత్తశుద్ధితో కూడిన శ్రేయోభిలాషకు మారుపేరు”. (ప్రవక్త ﷺ ఇలా మూడు సార్లు అన్నారు). ఈ శ్రేయోభిలాష ఎవరి పట్ల? అని మేమడిగాము. “అల్లాహ్ పట్ల, ఆయన గ్రంథం పట్ల, ముస్లిముల నాయకుని పట్ల వారి సామాన్య ప్రజల పట్ల” అని ప్రవక్త బదులిచ్చారు([44]).

ప్రవక్త గారి మరో హదీసు కూడా శ్రేయోభిలాష గురించి బోధిస్తుందిః “నీ సోదరుడు దౌర్జన్యపరుడైనా లేక బాధితుడైనా అతనికి సహాయపడు” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ‘ప్రవక్తా! దౌర్జన్యానికి గురైన పక్షంలో సహాయం చేయడమంటే తెలిసిందే, అది చేస్తునే ఉంటాము, అయితే దౌర్జన్యపరుడైన పక్షంలో ఎలా సహాయపడాలి అని సహచరులన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “దౌర్జన్యం చేయకుండా అతని చేతులను పట్టుకోండి. ఇదే అతనికి చేయవలసిన సహాయం”([45]).

మనము పరస్పరం శ్రేయోభిలాషులై ఉండడం తప్పనిసరి. మనిషి లోపాలు, కొరత లేకుండా ఉండలేడు. మన అనేక పనుల్లో మనందరి వల్ల ఏదో తప్పు జరుగుతూనే ఉంటుంది. తప్పుల్లేని జీవితం ప్రవక్తలదే కదా. అలాంటప్పుడు ఎవరైనా తన సోదరుణ్ణి ఏదైనా విషయంలో, ప్రయత్నంలో, విధానంలో, కార్యంలో తప్పు చేస్తుండగా చూస్తే అతనిపై ఉన్న బాధ్యతేమిటంటే అతని వద్దకు వెళ్ళి, అతనికి ఉపదేశించి, అతనికి మేలు చేయాలి. ఇలా మేలు చేసేవాడు ప్రేమ, దుఆ, సంతోషం మరియు స్వాగతమే పొందుతాడు. అలీ  అనేవారుః విశ్వాసులు పరస్పరం శ్రేయోభిలాషులు. వంచకులు (మునాఫికులు) పరస్పరం మోసగాళ్ళు.

తెలుసుకోండి! ఎవరైనా తన సోదరులను విమర్శిస్తూ, సభల్లో, నలుగురి మధ్యా వారి గురించి చెప్పుకుంటూ, వారి మాన, మర్యాదలను మంట గలుపుతూ ఉంటాడో, వారి వద్దకు వెళ్ళి వారిలో ఉన్న లోపాల్ని వారికి చూపి సరిదిద్దకుండా, వారి పట్ల సదభిలాష లేని వ్యక్తిని మీరు చూసినప్పుడు అతను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మరియు విశ్వాసులను మోసగించువాడు అని తెలుసుకోండి!

విశ్వాసుని గుణము ఇదండీః తన సోదరునిలో ఉన్న తప్పు, లోపాన్ని దూరము చేయాలనుకున్నప్పుడు అతని వద్దకు వెళ్ళి ఒంటరిగా కలిసి (నలుగురిలో కాదు), తను అతని పట్ల మేలు కోరుతున్నట్లుగా తెలియజేస్తూ, అతనిపై కనికరం చూపుతూ, మృదుభావంతో అతన్ని మంచి దారిన బెడతాడు. ఇలాంటి వాడే వాస్తవంగా శ్రేయోభిలాషి. ఇలా గాకుండా ఎవరు తన సోదరుడ్ని అవమానపరచగోరుతారో అల్లాహ్ యే వారి దుశ్చేష్టల నుండి కాపాడేవాడు. అల్లాహ్ అలాంటి వారికి చాలు. వారి ఉద్దేశాల్ని ఎరిగేవాడు అల్లాహ్ యే.

దివ్యగ్రంథం ఖుర్ఆనులో అల్లాహ్ ప్రవక్తల ప్రచార విధానాన్ని తెలిపాడు. వారి ప్రచారంలో శ్రేయోభిలాష ఉట్టపడేది. ఇదిగో చూడండి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తమ జాతితో ఏమంటున్నారోః

{నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తాను. నేను మీ శ్రేయోభిలాషిని}. (ఆరాఫ్ 7: 62). ఇంకా ఇలా అంటారుః

{నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు ఏ లాభాన్నీ చేకూర్చలేదు}. (హూద్ 11: 34).

ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం తమ జాతివారితో ఇలా అంటున్నారుః

{నా జాతి ప్రజలారా! నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. నేను మీ శ్రేయస్సునే సదా అభిలషించాను}. (ఆరాఫ్ 7: 79).

ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం ఇలా అన్నారుః

{నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను. మీ శ్రేయోభి- లాషిగా నేను నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చాను}. (ఆరాఫ్ 7: 93).

వీరందరు అల్లాహ్ యొక్క ప్రవక్తలు, సందేశహరులు. తన సృష్టిలో ఎన్నుకొనబడినవారు. ఎవరు ఎవరి పోలిక వహిస్తారో వారు వారితోనే ఉంటారు.

2- శ్రేయోభిలాష పద్ధతులు:

మూడు పద్దతులున్నాయి: ఒకటిః చిత్తశుద్ధి. రెండవదిః మెతక వైఖరి. మూడవదిః ఏకాంతములో మేలును బోధించడం.

అనేక సార్లు మనిషి వల్ల ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది. మనలో ఎవరు తప్పుచేయని వారు లేరు. నేను మరీ మరీ చెప్పేదొకటే. శ్రేయోభిలాషి దీన్ని గమనించాలని! తప్పు, పొరపాటు మన నైజంలో ఇమిడి యుంది. అది సామాన్యమైన విషయం. అందుకే మనిషి శ్రేయోభిలాషి అయినప్పుడు పక్షపాతం వహించవద్దు.

అతన్ని ఏకాంతములో తీసుకెళ్ళి అతని తప్పు గురించి తెలియజేయుట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి. ప్రజల ముందు అతన్ని నిలదీసి, విమర్శిస్తే అతన్ని అవమాన పరిచినట్లవుతుంది.

ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పేవారుః ‘అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించుగాక! అతను నాలో ఉన్న లోపాలు నాకు చూపుతాడు. సహచరులు అతని (ఉమర్ )కి ఏదైనా మేలు గురించి చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు.

నాల్గవది: తుమ్మినవారికి బదులు పలకడం

1- తుమ్మిన వారికి ఎప్పుడు బదులివ్వాలి? దాని విధానం ఏమిటి?

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ప్రవచనం ఇలా ఉంది: “అతను తుమ్మి ‘అల్ హందులిల్లాహ్’ అనంటే నీవు దానికి ‘యర్ హముకల్లాహ్’ అని బదులు పలుకు”. మరో ఉల్లేఖనంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ తుమ్మును ప్రేమిస్తాడు. ఆవలింపును ఏవగించుకుంటాడు”. (బుఖారీ/ అల్అదబ్/ మా యుస్తహబ్బు మినల్ ఉతాస్/ 6223).

తుమ్ము అల్లాహ్ యొక్క కరుణ. మరియు ఆవలింత షైతాను నుండి ఉంది. తుమ్ము వలన ధమనులు వివృతమవును (వికసించును). హృదయము తెరియును. అందుకే అది అల్లాహ్ కరుణ. ఇక ఇందులోని మర్మాన్ని అల్లాహ్ యే ఎరుగును. కాని మనపై విధిగా ఉన్న విషయం ఏమిటంటే మనము తుమ్మిన తరువాత అల్ హందులిల్లాహ్ అనాలి.

ఇక ఆవలింత, నీ శక్తి మేరకు దానిని ఆపే ప్రయత్నం చేయి.

عَنْ أَبِي هُرَيْرَةَ  عَنْ النَّبِيِّ ﷺ قَالَ: (إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ الْـحَمْدُ لله وَلْيَقُلْ لَهُ أَخُوهُ أَوْ صَاحِبُهُ يَرْحَمُكَ اللهُ فَإِذَا قَالَ لَهُ يَرْحَمُكَ اللهُ فَلْيَقُلْ يَهْدِيكُمُ اللهُ وَيُصْلِحُ بَالَكُمْ).

అబూ హురైరా  ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “మీలో ఎవరైనా తుమ్మితే (అల్ హందులిల్లాహ్) అనాలి. అది విన్న అతని సోదరుడు లేక మిత్రుడు (యర్ హముకల్లాహ్) అనాలి. మళ్ళీ తుమ్మిన వ్యక్తి (యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం) అనాలి”. (బుఖారీ 6224. అహ్మద్ 2/353).

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ  قَالَ: عَطَسَ عِنْدَ النَّبِيِّ ﷺ رَجُلَانِ فَشَمَّتَ أَحَدَهُمَا وَلَمْ يُشَمِّتِ الْآخَرَ فَقَالَ الَّذِي لَمْ يُشَمِّتْهُ: عَطَسَ فُلَانٌ فَشَمَّتَّهُ وَعَطَسْتُ أَنَا فَلَمْ تُشَمِّتْنِي قَالَ: (إِنَّ هَذَا حَمِدَ اللهَ وَإِنَّكَ لَمْ تَحْمَدِ اللهَ).

అనస్  ఉల్లేఖించారుః ప్రవక్తﷺ  ముందు ఇద్దరు తుమ్మారు. ప్రవక్త ఒకరికి జవాబిచ్చారు. మరొకరి తుమ్ముకు జవాబివ్వలేదు. ఎవరి తుమ్ముకైతే జవాబివ్వలేదో ఆ వ్యక్తి ప్రవక్తను ప్రశ్నించాడుః ‘అతను తుమ్మితే జవాబిచ్చారు, నేను తుమ్మితే జవాబివ్వలేదు’ అని. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “అతను తుమ్మిన తరువాత అల్ హందులిల్లాహ్ అని అన్నాడు. నీవు అల్ హందులిల్లాహ్ అనలేదు గనక”([46]).

عَن أَبِي مُوسَى الأشعري  سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (إِذَا عَطَسَ أَحَدُكُمْ فَحَمِدَ اللهَ فَشَمِّتُوهُ فَإِنْ لَمْ يَحْمَدْ اللهَ فَلَا تُشَمِّتُوهُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నానని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే మీరు జవాబివ్వండి. అల్ హందులిల్లాహ్ అనకపోయినచో మీరు జవాబివ్వకండి”([47]).

పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే తుమ్మిన వ్యక్తి అల్ హందు లిల్లాహ్ అన్నప్పుడు మనం యర్ హముకల్లాహ్ అని బదులివ్వడం తప్పనిసరి. అతను మౌనంగా ఉండిపోయి, అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే యర్ హముకల్లాహ్ అని పలకటం తప్పనిసరి కాదు. మనం మౌనంగా ఉండిపోవాలి.

2- బదులు పలకడం ఫర్జె ఐనా లేక ఫర్జె కిఫాయానా?([48])

మాలికియలో ఇబ్ను అబీ జైద్, ఇబ్నుల్ అరబీ ప్రకారం అది ఫర్జె ఐన్. ఇదే మాట నిజమైనది కూడా. ఉదాః ఒక సభలో కూర్చున్నవారు తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది విన్నప్పుడు ప్రతీ ఒక్కరూ యర్ హముకల్లాహ్ అనాలి. ఎవరైనా ఒక్కరు యర్ హముకల్లాహ్ అని అంటే సరిపోదు. ఎందుకంటే ఇది ఫర్జె కిఫాయ కాదు. ఫర్జె ఐన్.

తుమ్ము విషయంలో ప్రవక్త ﷺ గారి మరో ఉత్తమ పద్ధతిః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: (كَانَ رَسُولُ الله ﷺ إِذَا عَطَسَ وَضَعَ يَدَهُ أَوْ ثَوْبَهُ عَلَى فِيهِ وَخَفَضَ أَوْ غَضَّ بِهَا صَوْتَهُ).

ఆయన ﷺ తుమ్మినప్పుడు తమ చేయిని లేక చేతి రూమాలు నోటికి అడ్డం పెట్టుకునేవారు. తక్కువ స్వరముతో తుమ్మేవారు([49]). అని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలిపారు.

ధర్మం ఇదే; ముస్లిం తుమ్మినప్పుడు స్వరం పెంచకూడదు.

ఇక్కడ రెండు జఈఫ్ హదీసుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం:

ఒకటిః

(التَّثَاؤُبُ الشَّدِيدُ وَالعَطسَةُ الشَّدِيدةُ مِنَ الشَّيطَان).

“పెద్ద స్వరముతో ఆవలింపు మరియు తుమ్ము ఇవి రెండూ షైతాను తరఫున ఉంటాయి”. దీనిని ఇబ్నుస్సినీ([50]) ఉల్లేఖించారు. ఇది జఈఫ్. ప్రవక్తతో రుజూవైన విషయం కాదు.

రెండవదిః

(إنَّ اللهَ يَكْرَهُ رَفعَ الصَّوتِ بِالتَّثَاؤُبِ وَالعُطَاس).

“ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు శబ్దం పెంచటాన్ని అల్లాహ్ ఇష్ట పడడు”([51]). ఇది కూడా జఈఫ్ హదీసు. ప్రవక్తతో రుజువైనది కాదు.

(ఇవి రెండు జఈఫ్ అయినప్పటికీ వేరే సహీ హదీసుల ద్వారా రజువైన విషయం ఏమిటంటే; తుమ్మినప్పుడు తక్కువ స్వరం ఉండాలి, పైన ప్రవక్త వద్ధతి చదివాము. ఇక ఆవలింపు వచ్చినప్పుడు హా అని శబ్దం చేయడం వల్ల షైతాన్ నవ్వుతాడు. అందుకు దానిని ఆపడం మంచిది. బుఖారీ 6223).

ఎన్నిసార్లు బదులు పలకాలనే విషయంలో ప్రవక్త ﷺ చెప్పారుః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (شَمِّتْ أَخَاكَ ثَلَاثًا فَمَا زَادَ فَهُوَ زُكَامٌ).

“నీ సోదరుని మూడు తుమ్ములకు బదులు పలుకు, అంతకు ఎక్కువ తుమ్మాడంటే అతనికి జలుబుందన్న మాట”([52]). అనగా అతను మొదటిసారి తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడు నీవు యర్ హముకల్లాహ్ అను. రెండవసారి యర్ హముకల్లాహ్ అని బదులు పలుకు. మూడవసారి కూడా యర్ హముకల్లాహ్ అని జవాబివ్వు. ఇక నాల్గవసారి “ఆఫాకల్లాహ్” అని చెప్పు. ఒక వ్యక్తి తుమ్మాడు. ఆయన ﷺ యర్ హముకల్లాహ్ అన్నారు. అతను ఇంకా తుమ్ముతూ పోయాడు. ప్రవక్త ﷺ అన్నారుః ఇతనికి పడిసెమయింది([53]).

ఇబ్నుల్ ఖయ్యిం చెప్పారుః “ఇతనికి పడిసెమయ్యింది” అనే పదంలో అతని స్వస్థతకై దుఆ చేయాలన్న సూచన ఉంది. ఎందుకంటే జలుబు ఒక వ్యాధి. అలాగే మూడు తరువాత బదులు పలకక పోవడంలో పాపం లేదని తెలుస్తుంది. అలాగే ఇది ఒక వ్యాధి, తగిన చికిత్స చేయించాలి, నిర్లక్ష్యం చేసి వ్యాధి ముదిరే వరకు చూడ వద్దు అన్న సూచన కూడా ఉంది. ఆయన ﷺ గారి ప్రతి మాటలో వివేకం, కరుణ, జ్ఞానం మరియు సన్మార్గాలున్నాయి.

ప్రవక్త ﷺ చెప్పారుః “మీలో ఎవరైనా తుమ్మినప్పుడు అతని పక్కన ఉన్నవాడు బదులు పలకాలి. మూడిటికంటే ఎక్కువ తుమ్మినవాడు జలుబు వ్యాధికి లోనయ్యాడని అర్థం. ఇక మూడు తరువాత మీరు బదులు పలకకండి”([54]). ధర్మ వేత్తలు చెప్పారుః మూడిటికంటే ఎక్కువ తుమ్మిన వారి కొరకు, అల్లాహ్ వారికి స్వస్థత కలిగించాలని దుఆ చెయ్యాలి.

ఒక విషయం: తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది నీవు వినలేదు, కాని అతని పక్కన ఉన్న వ్యక్తి విన్నాడు. నీవు విననప్పటికీ అతని పక్కవాడు విన్నాడని తెలిసాక నీవు ఏమి చేస్తావు? యర్ హముకల్లాహ్ అని బదులు పలుకు. అల్ హందులిల్లాహ్ అన్న విషయం స్పష్టం కాకపోతే జవాబివ్వకు.

రెండో విషయం: తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అనడం మరచిపోతే అతనికి గుర్తు చేయాలా? 

అవును గుర్తు చేయించాలి.

ఇమాం నవవీ మరియు ఇతర ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఇదే. ఇంకా దీనిని (అంటే అతను మరచిపోతే, గుర్తు చేయటం)  మంచి పద్ధతి అన్నారు. ఇబ్రాహీం తైమీ ఇలా చేశాడు. అలాగే ఇబ్ను ముబారక్ వద్ద ఒక వ్యక్తి తుమ్మి, అల్ హందులిల్లాహ్ అనలేదు. మనిషి తుమ్మినప్పుడు ఏమంటాడు అని ఇబ్ను ముబారక్ అతడ్ని అడిగారు. అల్ హందులిల్లాహ్ అంటాడు అని ఆ వ్యక్తి చెప్పాడు. యర్ హముకల్లాహ్ అని ఆయనన్నారు.

మరచిపోయిన వ్యక్తికి గుర్తు చేయడం తప్పనిసరేమీ కాదు. ఎందుకంటే ఒక వేళ అది తప్పనిసరి అయి ఉంటే స్వయంగా ప్రవక్త ﷺ తన ముందు తుమ్మి అల్ హందులిల్లాహ్ అని చెప్పని వ్యక్తికి గుర్తు చేసేవారు. గుర్తు చేయనూ లేదు. జవాబు ఇవ్వనూ లేదు. అతను అల్ హందులిల్లాహ్ యొక్క శుభాన్ని కొల్పోయి నందుకు, ఇతరులు అతనికివ్వబోయే దుఆ యొక్క బర్కత్ (శుభాన్)ని కూడా నోచుకోలేదు. (జాదుల్ మఆద్ 2/442). ప్రవక్త ఉన్న సమావేశాల్లో కొందరు తుమ్మి అల్ హందులిల్లాహ్ అనలేదు. ప్రవక్త వారికి జవాబు ఇవ్వలేదు. గుర్తు చేయనూ లేదు. ఇదే తిరుగు లేని విషయం. (ప్రవక్త ﷺ గుర్తు చేయించలేదని రచయిత పై హదీసు ద్వారా రుజువు చేసే ప్రయత్నం చేశారు. కాని ఆ వ్యక్తి వెంటనే ప్రవక్తతో అడిగి సమాధానం తెలుసుకున్నారన్నది కూడా అదే హదీసులో ఉంది. అందుకు గుర్తు చేయించకూడదన్న సమస్యే తీసుకురావద్దు. గుర్తు చేయించడమే మంచిది. ఇలా గుర్తు చేయించే వ్యక్తి, తుమ్మిన వ్యక్తి ఇద్దరికీ పుణ్యం లభించును. (అనువాదకుడు).

యూదుల తుమ్ముకు సమాధానం: యూదులు ప్రవక్త ﷺ ముందు తుమ్మి, ఆయన ‘యర్ హముకల్లాహ్’ అంటారన్న ఆశతో అల్ హందులిల్లాహ్ అనేవారు. కాని ప్రవక్త ﷺ వారికి సమాధానంగా “యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం” అనేవారు([55]). ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం గారి వివేకమును గమనించండి; యూదులకున్న అవసరం ‘హిదాయత్’ (సన్మార్గము)ది. వారు అల్లాహ్ కరుణకు యోగ్యులు కారు. వారు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విరోధులు. అలాంటి వారు కరుణించబడాలని దుఆ చేయవచ్చునా?

లేదు. ముందు వారికి సన్మార్గం అవసరం. ఇది పొందారంటే తరువాత అల్లాహ్ యొక్క కరుణ, దయ అవసరం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘యర్ హముకల్లాహ్’కు బదులుగా ‘యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్’ అన్నారు.

ఐదవది: రోగిని పరామర్శించటం

1- రోగిని పరామర్శించు ఘనత మరియు అతని కొరకు దుఆః

ప్రవక్త ﷺ ఉపదేశం: “అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు”.

ఇది ముస్లిముల మధ్య ప్రేమ మార్గాల్లో మరొకటి. ఒక ముస్లింపై ఉన్న మరో ముస్లిం హక్కు ఏమిటంటే అతను వ్యాధిగ్రస్తుడైతే అతన్ని పరామర్శించాలి. పరామర్శ యొక్క కొన్ని పద్ధతులున్నాయి. అల్లాహ్ వద్ద దాని ఘనత చాలా గొప్పగా ఉంది. ముస్లిం షరీఫు([56])లో ఉంది ప్రవక్త ﷺ ఇచ్చిన శుభవార్తను సౌబాన్  ఉల్లేఖించారుః

 (مَنْ عَادَ مَرِيضًا لَمْ يَزَلْ فِي خُرْفَةِ الْـجَنَّةِ حَتَّى يَرْجِعَ).

“రోగిని పరామర్శించే వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు ‘ఖుర్ఫతుల్ జన్నహ్’లో ఉంటాడు”. మరో ఉల్లేఖనంలోః ‘ఖుర్ఫతుల్ జన్నహ్ అంటేమిటి ప్రవక్తా’ అని సహచరులు అడిగారు. దానికి ఆయన ﷺ “స్వర్గ వనాలు” అని చెప్పారు. అంటే ఆ మనిషి స్వర్గ వనాల్లో నడుస్తూ ఉంటాడన్న మాట. ప్రవక్త, ఆయన సహచరులు రోగులను పరామర్శించేవారు. ఒకసారి సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హుని పరామర్శించారు. ఆ సందర్భంలో వారితో ఇలా అన్నారుః “నీ వలన అనేకమందికి ప్రయోజనం చేకూరి, అనేక మందికి నష్టం వాటిల్లే వరకు నీవు బహుశా జీవించి ఉంటావు”([57]).

అలాగే జాబిర్ రజియల్లాహు అన్హును పరామర్శించడానికి కూడా వెళ్ళారు ఆయన ﷺ. అప్పుడు అతను స్పృహ తప్పియున్నాడు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి ఆయనపై నీళ్ళు పోసారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చింది([58]).

మరోసారి ఒక ఎడారి అరబ్బు యొక్క పరామర్శ కొరకు వెళ్ళారు. అతని వద్దకు చేరుకొని, “లాబఅస తహూరున్ ఇన్షాఅల్లాహ్” (బాధ పడవద్దు. ఇన్షాఅల్లాహ్! నీకు పాప ప్రక్షాళన కలుగుతుంది) అన్నారు. అతడన్నాడుః ముమ్మాటికి అలా కాదు. అది (అగ్ని లాంటి) జ్వరం. వృద్ధులపై మరింత రెచ్చిపోతుంది. సమాధి వరకు చేర్పిస్తుంది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “సరే అలాగే”([59]). దీని పర్యవసానం, పాపం, అతను అదే వ్యాధిలో మరణించాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పరామర్శకైనా వెళ్ళినప్పుడు అతని కొరకు దుఆ చేసేవారు, కొంతసేపు అతని తలగడ వద్ద కూర్చునేవారు, తమ శుభహస్తాన్ని అతని ఛాతిపై పెట్టేవారు. ఇందువల్ల రోగి ఓ రకమైన తృప్తి, ఆనందం పొందుతాడు.

2- పరామర్శ పద్ధతులుః

అహ్లుస్సున్న వారి ప్రకారం ప్రతి మూడు రోజులకొకసారి రోగిని పరామర్శించాలి. తండ్రి, కొడుకు, సోదరుడు లాంటి దగ్గరి సంబంధికు- లైతే వారి విషయం వేరు. (ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోవలసి ఉంటుంది. రోగి వెంటనే ఎల్లప్పుడు ఉండే అవసరం కూడా ఇంతటి దగ్గరి సంబంధికులకు పడవచ్చు). ఇతరుల పరామర్శకై మూడు రోజులకొకసారి వెళ్ళాలి. అలాకాకుండా ప్రతి రోజు లేదా పొద్దు మాపు వస్తూ పోతూ ఉంటే అందువల్ల రోగికి మరింత ఇబ్బంది కలుగవచ్చు.

ఇమాం జహబీ రహిమహుల్లాహ్ సులైమాన్ బిన్ మహ్రాన్ -అతని బిరుదు అఅమష్- చరిత్రలో వ్రాసారుః అతను చాలా రోజులు ఏదో వ్యాధికి గురిఅయి ఉండగా, పరామర్శ కొరకు ప్రజల రాకపోకలు మొదలయి అతనికి ఇబ్బంది కలిగించసాగారు. చివరికి ఓ ఉపాయం తట్టింది; తన రోగానికి సంబంధించిన వివరాలన్నీ ఓ కాగితంలో వ్రాసి మెత్త క్రింద పెట్టుకున్నాడు. ఎవరు వచ్చినా అది తీసి చూపించి, ఇదిగో చదువుకో అనేవాడు. అయినా జనం అధికమే అయ్యారు తప్ప తగ్గలేదు. ఇక భరించలేక తొందరగా లేచి, తన మెత్తను చంకలో పెట్టుకొని బజారులో వచ్చి నిలబడి ‘ప్రజలారా! అల్లాహ్ మీ రోగికి స్వస్థ కలిగించాడు’ అని ప్రకటించారు.

(పరామర్శి తన అనుకూలాన్ని కాదు) రోగికి అనుకూలమైన సమయాన్ని చూసి అప్పుడే అతని వద్దకు వెళ్ళాలి. అతడు పడుకునే సందర్భంలో, అతని తిండి సందర్భంలో, అతని నమాజు సమయంలో, అతను విశ్రాంతి తీసుకుంటున్న వేళ కాకుండా వేరే ఏదైనా అనుకూల ఘడియలో పరామర్శించాలి.

పరామర్శ పద్ధతులుః రోగి వద్ద ఎక్కువ సేపు కూర్చోకూడదు. కొందరు రోగి పరామర్శకై వెళ్ళినప్పుడు, గంటల తరబడి అక్కడే కూర్చుండి వ్యాధిని మరింత పెంచుతారు. ఇది పరామర్శ పద్ధతి కాదు.

నీవు రోగిని పరామర్శించినప్పుడు వ్యాధి గంభీరముగా కాకుండా అతను కోలుకుంటూ ఉంటే, అతనికి శుభవార్త ఇవ్వాలిః ‘నీ ఆరోగ్యం చాలా బావుంది, మాషాఅల్లాహ్! ఇంత మంచిగా ఉన్నావని నేననుకో- లేదు. అల్లాహ్ నీకు స్వస్థత, క్షేమము ప్రసాదించుగాక! తొందరగా ఈ వ్యాధి నుండి విముక్తి కలుగుతుంది ఇన్షాఅల్లాహ్’ అనాలి. ఇలా కాకుండా కొందరు మరింత వ్యాధిని పెంచేవాళ్ళుంటారు. అల్లాహ్ వారికి సద్బుద్ధిని ఇవ్వుగాక! రోగీ చాలా భయంకరమైన వ్యాధికి గురి అయి యున్నాడు, ఈ వ్యాధికి చికిత్సయే లేదు, తొందరగా తన ధనసంపద గురించి వీలునామాలు వ్రాయాలి, వ్రాయించాలి అన్న మాటలు మాట్లాడతారు. చివరికి రోగిని మృతుల్లో లెక్కిస్తారు. ఇది పెద్ద తప్పు. మానసిక స్థితిగతుల ప్రభావం ప్రాముఖ్యత తెలిసినదే. అతడు ఆరోగ్యంగా ఉన్నాడన్న భావన నీవు అతనికి కలుగజేస్తే ఇది అతను బాగుపడటానికి ఓ కారణం కావచ్చు. ఇన్షాఅల్లాహ్! అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ‘లాబఅస తహూరున్ ఇన్షాఅల్లాహ్’ అనేవారు. ఈ విషయం పైన మీరు చదివి ఉన్నారు.

విద్వాంసులు చెప్పినట్లు: పరలోకానికి దగ్గర అయిన, స్వస్థత కలిగే ఆశలేని రోగి వద్దకు వెళ్ళినప్పుడు ముందు అతనికి అల్లాహ్ పై మంచి నమ్మకం ఉంచమని, అల్లాహ్ ముందు మంచి విధంగా చేరుకోవాలని, అల్లాహ్ అతని పట్ల మేలే చేస్తాడని ఆశించాలన్న బోధ చేయాలి. ఇదే పరామర్శ పద్ధతి.

పరామర్శి రోగి వద్ద ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలు, అధిక జోకులు, నవ్వులాటలు మరియు వృధా మాటలు మాట్లాడవద్దు. అడపాదడపా మాత్రమే అతని దర్శనానికి వెళ్ళాలి.

ఆరవది: జనాజా వెంట వెళ్ళడం

1- జనాజా వెంట వెళ్ళు ఘనత:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం: “అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు”. ఇది ఒక ముస్లింపై ఉన్న మరో ముస్లిం హక్కు. అతను శవం అయి పోయి, అతని ఆత్మ ‘ఇల్లియ్యీన్’లో చెరుకున్నాక కూడాను, నీవు అతని వెనక నడచి, నీపై ఉన్న అతని హక్కులు నెరవేర్చు. అతని జనాజా నమాజు చేస్తూ అతని కొరకు సిఫారసు చేయి. అతను మట్టిలో పెట్టబడిన తరువాత కూడా అతనిపై అల్లాహ్ కరుణ, దయ కురవాలని దుఆ చేస్తూ ఉండు.

ఇది ఇస్లామీయ సోదరభావం. విశ్వాస వాగ్దానం. ఇవి ఒక ముస్లింపై మరొక ముస్లిం హక్కులు. ఇవి కేవలం జీవితకాలం వరకే పరిమితం కావు. చనిపోయిన తరువాత కూడా ఉంటాయి. సహీ హదీసు([60])లో ఉందిః

أَنَّ أَبَا هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ شَهِدَ الْـجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ) قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: (مِثْلُ الْـجَبَلَيْنِ الْعَظِيمَيْنِ).

ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అబూహురైరా ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “రెండు ‘ఖీరాత్’లంటే అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. చూడండి ఎంత తేలికైన ఆచరణ మరియు గొప్ప పుణ్యం!

2- జనాజ మరియు సంతాప పధ్ధతులుః

జనాజా ముందు నడవడం సున్నత్. ఇందులో ఘనత కూడా ఉంది. ఇబ్ను ఉమర్  తెలిపారుః “నేను ప్రవక్త ﷺ, అబూ బక్ర్  మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలను చూశాను. వారు జనాజ ముందు నడిచేవారు”([61]). జనాజ ముందు నడవడమే సున్నత్. కాని వాహనముపై ఉన్నవాడు వెనకనే ఉండాలి. నడిచే వ్యక్తి వెనక నడిచినా అభ్యంతరమేమీ లేదు.

ఉమ్మె అతియ్య రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: “మేము జనాజా వెంట వెళ్ళడం నిషేధించబడింది. అయితే ఈ వారింపు తీవ్రంగా రాలేదు”([62]). అయినా స్త్రీలను వారించుట విధిగా ఉంది. ఎందుకనగా స్త్రీ స్వభావికంగా బలహీనురాలు. తొందరగా ఏడుపు, దుఃఖానికి గురి అవుతుంది. ఏదైనా పరీక్షకు గురి కావచ్చు. అల్లాహ్ విధి చేసిన అదృష్టంపై అసంతృప్తి చెందవచ్చు. అందుకే వృద్ధురాలైనా సరే జనాజ (శవపేటికల) వెంట నడవకూడదు. సమాధుల దర్శనం కూడా చేయకూడదు.

ధర్మానికి వ్యతిరేకైమైన కొన్ని దురాచారాలు ప్రజల్లో ప్రబలి ఉన్నాయి. పండితులు వాటి గురించి హెచ్చరించి, తప్పును స్పష్టపరిచారు. వాటికి బదులుగా సరియైన ఆధారిత సత్కర్యాలేమిటో తెలియజేశారు. అల్లాహ్ దీనికి బదులుగా వారికి సత్ఫలితం నొసంగుగాక! వాటిలో కొన్ని దిగువ చదవండిః

  • సంతాప సభలు ఏర్పాటు చేసి, టెంట్లు వేసి, భోజనాలు వడ్డించి, శోకగీతాలు పాడుకుంటూ, పెడబొబ్బలు పెట్టుట నెత్తినోరు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అదృష్టంపై అసంతృప్తి చెందుట.
  • మరో వ్యతిరేక విషయం: ఆ సభల్లో ప్రజల సంతృప్తి కొరకు, వారి మనోహరానికి పరిహాసమాడటం, నవ్వులాటలు ఆడటం ప్రాపంచిక విషయాల్లో నిమగ్నులైపోవటం లాంటి అనేకానేక దురాచారాలున్నాయి. పండితులు వాటికి సంబంధించిన వివరాలు తెలిపి ఉన్నారు. వాటిని చదవాలి.

పైన పేర్కొనబడిన కొన్ని ప్రేమ బంధాల గురించి, ప్రవక్త ﷺ తెలిపారు. ప్రవక్త సహచరులు  వాటిని అలవర్చుకున్నారు. వాస్తవ (ప్రాక్టికల్) జీవితములో వాటిపై ఆచరించిచూపారు. వాటి పట్ల వారి అంగీకరణ సంపూర్ణంగా ఉండింది. ఈ ఉత్తమ గుణాలతో వారి హృదయాంతరాళాలు నిండిపోయాయి. దానికనుగుణంగా అల్లాహ్ అనుమతితో ఫలితం కూడా వచ్చింది. తత్ఫలితంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ అధిరోహణ సాధ్యమయ్యేది అల్లాహ్ దాస్యం, ఆరాధన మంచి విధంగా చేసినవారికి, అల్లాహ్ గ్రంథాన్ని, ప్రవక్త సంప్రదాయాల ప్రకారం దృఢంగా అమలు చేయువారికి మరియు ఇస్లామీయ గుణగణాలు అలవర్చుకున్నవారికి మాత్రమే.

అల్ హందులిల్లాహ్!….. ఇప్పటికీ ఈ ద్వారము తెరచుకునే ఉంది, ఈ సరుకు అందరి ముందూ వేసియుంది, ఇక మనం అల్లాహ్ తో వర్తకం చేయటమే ఆలస్యం. ఇది సాధ్యపడేది పైన పేర్కొనబడిన ఉత్తమ తరం (ప్రవక్త సహచరుల తరం) లాంటి నడవడికను అలవరుచుకోవటం ద్వారానే. అవి అవలంభించామంటే, మానవుడు ఇహలోకంలో ఏ మానవతా ఉన్నత శిఖరానికి చేరడం సాధ్యమో, తప్పక అక్కడికి చేరుకుంటాము. దైవదూతలు కూడా వచ్చి కరచాలనము చేస్తారు ఇన్షాఅల్లాహ్.

హృదయాలను కలిపే కళ

మొదటిది: సహచరు (సహాబా)లు శిక్షణ పొందిన ఉన్నత ఉదాహరణ

హృదయాలను కలిపే కళ, సహీ సనదుతో రుజూవైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చరిత్ర, ఆయన విద్యాసొత్తు, ప్రచారం నుండి మద్దతు తీసుకొంటూ ఆ కళను నేర్చుకుందాము, దాని గురించి చర్చించుకుందాము, దాని శిక్షణ పొందుదాము. ఎలాగైతే మన పూర్వికుల్లో అగ్రశ్రేణి సహచరులు శిక్షణ పొందారో. అయితే మేము ఈ గొప్ప కళ యొక్క పునాది దేనిపై ఉందో దానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను క్రింద పేర్కొంటున్నాముః

1- కోపాన్ని దిగమ్రింగటం:

ఈ కళ యొక్క ఓ మూల అంశాన్ని అల్లాహ్ తన పటిష్ఠమైన గ్రంథం ఖుర్ఆనులో తెలిపాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ వాచాకర్మ ద్వారా తెలిపారు. మరియు ఉన్నత, ఉత్తమ నడవడిక ద్వారా చూపారుః అల్లాహ్ ఆదేశం చదవండిః

{కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతర తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం}. (అలి ఇమ్రాన్ 3: 134).

విద్వాంసుల ప్రకారం ఇందులో ముగ్గురి మూడు స్థానాలు తెలుప బడ్డాయి. 1. తొలిదశలో ఉన్నవారు. 2. మధ్యేమార్గంలో ఉన్నవారు. 3. పుణ్యాల్లో అందరిని మించి ముందుగా ఉన్నవారు.

మొదటి స్థానం: ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించడం జరిగిందో అతనుతన కోపాన్ని దిగమ్రింగాలి. ఇది మన లాంటి (పుణ్యాల్లో కొరత చూపే) ముస్లిముల స్థానం. ‘తన కోపాన్ని దిగమ్రింగాలి’ అంటే (చెడుగా ప్రవర్తించిన వాని) పరువు తీసి, సభల్లో కూర్చుండి తన ఆవేశాన్ని వ్యక్త పరచి తృప్తిగా శ్వాస పీల్చే ప్రయత్నం చేయవద్దు.

రెండవ స్థానం: కోపాన్ని దిగమ్రింగాక మరో అడుగు ముందుకు వేసి మరో మంచి పని చేయాలి. అదేః {ఇతర తప్పులను క్షమించే- వారు}. అంటే ఎవడు బాధించాడో, చెడుగా ప్రవర్తించాడో అతని వద్దకు వెళ్ళి ‘అఫల్లాహు అన్ క’ (అల్లాహ్ నిన్ను క్షమించుగాక) అని దుఆ ఇవ్వాలి. 

మూడవ స్థానం: మరో అడుగు ముందుకు వేసి, మంచి కార్యం చేయాలి. అదేః {సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం}. అంటే అతని వద్దకు వెళ్ళి అతనితో ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (కౌగిలించుట) చేసి, అతనికి ఏదైనా కానుక ఇవ్వాలి.

చరిత్రకారులు ఒక సంఘటన పేర్కొన్నారుః హారూన్ రషీద్ యొక్క బానిస తన యజమాని సేవ చేస్తూ ఒకసారి అతనికి వేడి నీళ్ళు పోస్తూ ఉండగా ఆ వేడి నీళ్ళ చెంబు చేతిలో నుండి జారిపోయి హారూన్ రషీద్ తల మీద పడింది. హారూన్ రషీద్ విశ్వ విఖ్యాత ఖలీఫ. అతనికి కోపం వచ్చేసింది. బానిస వైపు తిరిగి చూశాడు.

బానిస -చాలా తెలివగలవాడు- ఇలా అన్నాడుః {కోపాన్ని దిగమ్రింగేవారు}.

నేను నా కోపాన్ని దిగమ్రింగాను అని ఖలీఫా అన్నాడు.

{ఇతర తప్పులను క్షమించేవారు} అని బానిసన్నాడు.

నిన్ను క్షమించానని ఖలీఫా అన్నాడు.

{సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం} అని బానిస అన్నాడు.

వెళ్ళిపో, నిన్ను బానిసత్వం నుండి విముక్తి కలిగించాను అని ఖలీఫా చెప్పాడు.

2- ద్వేషం, అక్కసు తీసెయ్యాలి:

జమల్ యుద్ధంలో ఆయిషా రజియల్లాహు అన్హా, తల్హా రజియల్లాహు అన్హు మరియు జుబైర్ రజియల్లాహు అన్హు వారితో పాటు కొందరు సహాబాలు ఒక వైపున ఆయుధాలు తీసుకొని వెళ్ళారు. మరో వైపున అలీ రజియల్లాహు అన్హు మరియు వారితో పాటు బద్ర్ వీరులు ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. యుద్ధం మొదలైంది. ఆ సందర్భంలో ఆమిర్ శొఅబీతో ఒక వ్యక్తి ‘అల్లాహు అక్బర్! సహాబాలు ఒకరిపై ఒకరి ఆయుధం లేపారే? ఎవరు కూడా వెనుతిరగడం లేదేమిటి?’ అని ప్రశ్నించాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడుః ‘స్వర్గవాసులు ఒకరినొకరు కలుసుకున్నారు. పరస్పరం సిగ్గుపడుతున్నారు’. అదే రణరంగంలో తల్హా రజియల్లాహు అన్హు షహీద్ అయ్యారు. అతను అప్పుడు అలీ రజియల్లాహు అన్హుకు వ్యెతిరేకంగా మరో పక్షంలో ఉండిరి. ఇతని మరణ వార్త విన్న అలీ రజియల్లాహు అన్హు తన గుఱ్ఱాన్నుండి దిగి, ఆయుధం దూరం విసిరేసి, కాలినడకన తల్హా వైపు వచ్చారు. అతన్ని చూశారు. అతను హత్యచేయబడ్డారు. -ఇహలోకంలోనే స్వర్గం శుభవార్త పొందిన పది మందిలో ఒక్కరు తల్హా- అతని గడ్డానికి అంటిన దుమ్మును దులిపారు. తరువాత ఇలా అన్నారుః “అబూ ముహమ్మద్ -తల్హా యొక్క నిక్ నేమ్- నిన్ను ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నాను. కాని అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకుంటున్నాను, అల్లాహ్ నిన్ను మరియు నన్ను తను ఖుర్ఆనులో తెలిపిన పుణ్యాత్ముల్లో చేర్చుగాక!

{వారి హృదయాలలో మిగిలి ఉన్న మాలిన్యాన్నీ కాపట్యాన్నీ మేము తొలగిస్తాము. వారు పరస్పరం సోదరులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుంటారు}. (15: హిజ్ర్: 47).

చూడండి వారి హృదయాలు ఎంత నిర్మలంగా, పరిశుద్ధంగా ఉన్నాయో! ఎంతటి దూరపు ఆలోచన, పరలోక చింతన! వారు పరస్పరం పోరాడుతున్నారు. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి. అలీ రజియల్లాహు అన్హు, తల్హా రజియల్లాహు అన్హు తలను తన ఒడిలో తీసుకొనియున్నారు. వారి శాంతి సంక్షేమాలకై అర్థిస్తున్నారు. ఇంకా ఆయనతో కలిసి స్వర్గాల్లో, స్వర్గపు సెలయేల్లలో ఉంటారు. గౌరవస్థానం, మహత్తరమైన అధికారాలు కల చక్రవర్తికి సమీపంలో ఉంటారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వాస్తవంగా ఇది అపూర్వమైన దర్శనం!  వింత నిదర్శనం!!

ఈ అపూర్వ దర్శనాలు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్న దేమంటే; వారూ మానవులే! మానవ పరిధిని దాటిన వారు కాదు. ఏ ఒక్క రోజూ వారు దైవదూతలూ కాలేదు. కాని మానవత యొక్క ఉన్నత శిఖరానికి ఎదిగారు.

* ఒక రోజు ఇబ్ను సమ్మాక్ మిత్రుడు కోపంగా అతని దగ్గరి నుండి వెళ్తూ “గదన్ నతహాసబ్” అన్నాడు. అంటే నీ సంగతి రేపు చూసు కుంటాను. రేపు మన తీర్పు జరగనుంది. నేను నిన్ను నిలదీస్తాను, నీవు నన్ను నిలదీస్తావు. మనలో తప్పు ఎవరిదో అప్పుడు తెలుస్తుంది. ఇబ్ను సమ్మాక్ ఇది విని, “కాదు, కాదు, అల్లాహ్ సాక్షిగా! రేపు మనం ఒకరినొకరు మన్నించుకుంటాము” అని అన్నాడు.

విశ్వాసులు పరస్పరం లెక్క చూసుకోరు, ఒకరికొకరు నీవు నా గురించి ఇలా…….. వ్రాసావు, ఇలా …… చెప్పావు, నీవు నన్ను పరోక్షంగా నిందించావు….. మరియు ….. మరియు ….. కాదు, ఇది సరియైన పద్ధతి కాదు. సరియైన పద్ధతి ఏమిటంటే “అల్లాహ్ నిన్ను మన్నించుగాక!” అని దుఆ ఇవ్వాలి (వేడుకోవాలి).

3- తన మానాన్ని, ధనాన్ని అల్లాహ్ మార్గంలో వెచ్చించటం:

ప్రవక్తగారి శుభ కాలంలో అబూ జమ్ జమ్ అను ఒక వ్యక్తి రాత్రి వేళ మేల్కొని అల్లాహ్ సన్నిధిలో ఈ విధంగా మొరపెట్టుకుంటాడుః “అల్లాహ్! నీ మార్గంలో ఖర్చు చేయుటకు నా వద్ద ధనం లేదు. నీ మార్గంలో పోరాడుటకు నాలో శక్తీ లేదు. అందుకు నేను నా మానాన్ని (గౌరవప్రతిష్ఠ) ముస్లిముల కొరకు అంకితం చేస్తున్నాను. ఓ అల్లాహ్! ఇక నుండి ఎవరు నన్ను దూషించినా, బాధించినా, పరోక్షంగా నిందించినా దానిని స్వయం వారి పాపాలకే పరిహారంగా చేయి!!

మరో ఉల్లేఖనంలో ఉందిః ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం దానధర్మాలు చేయండని ప్రోత్సహించారు. అప్పుడు ఉల్బా బిన్ జైద్ నిలబడి “ప్రవక్తా! దానధర్మాలు చేయమని మీరు ప్రోత్సహించారు. అయితే నా వద్ద నా మానము (గౌరవప్రతిష్ఠ) తప్ప మరేమీ లేదు. అందువల్ల నేను దాన్ని నాపై అన్యాయం చేసినవారికి దానం చేస్తున్నాను. ప్రవక్త ﷺ అతనికేమి సమాధానమివ్వలేదు. మరుసటి రోజు స్వయంగా ప్రవక్త ﷺ “ఉల్బ  బిన్ జైద్ ఎక్కడున్నాడు?, తన ఆత్మాభిమానాన్ని దానం చేసినతను ఎక్కడున్నాడు?. నిశ్చయంగా అల్లాహ్ అతని ఈ దానాన్ని స్వీకరించాడు” అని శుభవార్త అందజేశారు.([63]).

ఇది ఆత్మాభిమానాల దానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ధన మాన ప్రాణాలను ఈ శాశ్వత ‘దావత్’ (ఇస్లాం ప్రచారం) కొరకు త్యాగం చేసినట్లు, ధర్మప్రచారకులు, విద్యార్థులు తప్పక తమ మాన మర్యాదలను త్యాగం చేయాలి. మన ప్రాణం, ధనం, మానం, సంతానం ఒక్కటేమిటి సమస్తం “లాఇలాహ ఇల్లల్లాహ్” కొరకు అర్పించే సద్భాగ్యం అల్లాహ్ మనకు ప్రసాదించుగాక! (ఆమీన్).

4- ఇతరుల తప్పిదాలను సహించటం:

‘ఇహ్ యాఉల్ ఉలూం’ రచయిత ఇమాం గజాలి పేర్కొన్నారుః ఒక వ్యక్తి హసన్ బస్రీ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి ‘అబూ సఈద్ (హసన్ బసరీ కునియత్)! ఫలానా మనిషి మిమ్మల్ని పరోక్షంగా నిందించాడు’ అని చెప్పాడు. అతన్ని దగ్గరికి పిలిచి, తాజా ఖర్జూర పండ్ల బుట్ట ఇచ్చి ఇలా చెప్పారుః “నీవు అతని వద్దకు వెళ్ళి ఈ బుట్ట అతనికి ఇచ్చి నీవు మాకు పుణ్యాలిచ్చావు, దానికి బదులుగా మేము నీకు తాజా ఖర్జూర పండ్లు ఇచ్చాము అని చెప్పు”. ఇతను వెళ్ళి అవి అతనికి ఇచ్చాడు, అలాగే చెప్పాడు.

దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ప్రపంచ విషయం సులభం. కొందరు తమ పుణ్యాల దానం చేస్తూ ఉంటారు. ఎవరైనా నిన్ను చూసి అసూయపడినా, పగతీర్చుకొనదలచినా, నిన్ను వ్యతిరేకించినా  అందుకు నీవు బాధ పడకు, ఇవన్నియూ నీ పత్రంలో పుణ్యాలుగా చేరుతాయి. నీ స్థానాన్ని పెంచుతాయి అన్న విషయాన్ని తెలుసుకో!

* హజ్రత్ మూసా అలైహిస్సలాం చరిత్రలో ఉంది, ఆయన ఒకసారి “ప్రభువా! నేనో విషయం కోరుతున్నాను”. (అతను కోరేదేమిటో అల్లాహ్ కు తెలుసు, అయినా) అదేమిటి మూసా? అని అడిగాడు. “ప్రజలు నాకు వ్యతిరేకంగా మాట్లడకుండా వారి నోరును మూయించు” అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా చెప్పాడుః “మూసా! నా గౌరవం, గొప్పతనం సాక్షి! నేను ఈ పని నా కొరకు చేయలేదు. నేను వారిని సృజించాను, నేనే వారికి ఆహారం నొసంగుతాను. అయినా వారు నన్ను దూషిస్తారు”. సుబ్ హానల్లాహ్!! అల్లాహ్, కరుణించేవాడు, ఒక్కడు, అద్వితీయుడు, అక్కరలేనివాడు, ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. ఇంతటి ఆ సృష్టికర్తయే ప్రజల దూషణలకు గురి అవుతున్నాడు. ఈ బలహీన, అధమ మానవుడు, వీర్య బిందువుతో పుట్టినవాడు గౌరవ సృష్టికర్త అయిన అల్లాహ్ ను దూషిస్తాడా?

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: (قَالَ اللهُ تَعَالَى يَشْتِمُنِي ابْنُ آدَمَ وَمَا يَنْبَغِي لَهُ أَنْ يَشْتِمَنِي وَيُكَذِّبُنِي وَمَا يَنْبَغِي لَهُ، أَمَّا شَتْمُهُ فَقَوْلُهُ إِنَّ لِي وَلَدًا وَأَمَّا تَكْذِيبُهُ فَقَوْلُهُ لَيْسَ يُعِيدُنِي كَمَا بَدَأَنِي).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః ఆదము కుమారుడు నన్ను దూషిస్తాడు. ఇది అతనికి తగదు. ఆదము కుమారుడు నన్ను తిరస్కరిస్తాడు. ఇది అతనికి శోభించదు. నాకు సంతానం ఉంది అని ఆరోపించడం నన్ను దూషించినట్లు. నేను తొలిసారి పుట్టించినట్లు మరోసారి పుట్టించలేను అని అనడం నన్ను తిరస్కరించినట్లు”([64]).

ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ తన రచన కితాబుజ్జుహ్ ద్ లో పేర్కొన్నారు అల్లాహ్ ఇలా చెప్పాడుః “మానవుడా! ఎంత ఆశ్చర్యం!  నేను నిన్ను పుట్టించాను. నీవు ఇతరులను ఆరాధిస్తున్నావు. నేను నీకు ఆహారం నొసంగాను. నీవు ఇతరులకు కృతజ్ఞత తెలుపుతున్నావు. నేను నీ అక్కరలేనివాడిని, అయినా నేను నిన్ను సంతోషంగా ఉంచడానికి వరాలు ప్రసాదిస్తూ ఉన్నాను. నీవు నా అక్కరగలవాడివై కూడా నాకు అవిధేయత చూపుతూ నన్ను అసంతృప్తి పరుచు తున్నావు. నా వైపు నుండి నీపై మేళ్ళు కురుస్తున్నాయి. కాని నీ తరఫున నా వైపుకు దుష్కార్యాలే చేరుతున్నాయి”.

అన్ని లోపాలకు అతీతుడైన, ఏకైక అద్వితీయుడినే కొందరు తిడుతున్నారంటే మన లాంటి లోపాలుగల వారు ఏ పాటి?

ప్రవక్త సహచరుల ఉత్తమ మరియు ఉన్నత ఆదర్శానికి ఇదో గొప్ప నిదర్శనం. ఎలా అనగా; వారు పరస్పరం సంతోషంగా ఉండేవారు అయినా సామాన్య మానవుల్లో మాదిరిగా ఒకప్పుడు వారి మధ్య విభేదాలు చోటు చేసుకునేవి. పరస్పరం కొద్ది రోజులు అసంతృప్తిగా ఉండేవారు. కాని తిరిగి తెల్లటి నిష్కల హృదయులుగా మారారు. పరస్పరం కలిసారు, కౌగిలించుకున్నారు. సహనాన్ని ప్రదర్శించారు. ప్రేమలను పంచుకున్నారు. ఎందుకంటే వారందరి పునాది ఒక్కటి, వేరు వేరు ఎంతమాత్రం కాదు. అదే “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మ దర్రసూలుల్లాహ్”. ఇక వారి మధ్యలో జరిగినదంతా, వారు మనుషులే అన్నదానికి నిదర్శన. దైవదూతలూ కారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును మించి పోలేరుః “ప్రతి ఆదము కుమారుడు తప్పు చేయువాడే”([65]).

ఎలాంటి మచ్చ లేని తెల్ల కాగితం లాగా కూడా లేకుండిరి. ఎన్నటికీ అలా లేకుండిరి!

వారూ మనుషులే, వారి హృదయాల్లో కూడా మానవ స్వభావమే కదులుతుండేది. వాటితోనే వారు భూమి మీద తిరుగుతుండేవారు. కాని వారి ఆ స్వభావం ఉత్తమ స్థితి మరియు ఉన్నత శిఖరంలో ఉండింది. ఎప్పుడైనా ఏదైనా కారణంగా తప్పు జరిగినా, వెంటనే సర్దుకొని మళ్ళీ ముందుకు, పైకి ఎదిగే ప్రయత్నమే చేసేవారు.

హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఉపమాణం చరిత్రలో ఉంది. ఒకసారి ఒక వ్యక్తి ఆయనతో అంటాడుః అబూ బక్ర్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ఎలా తిడతానంటే, ఆ తిట్లు నీతో నీ సమాధిలో చేరుతాయి. హజ్రత్ అబూ బక్ర్ అతనికి ఇలా సమాధానమిచ్చారుః నీతో నీ సమాధిలోనే చేరుతాయి, నా సమాధిలో కాదు.

హజ్రత్ అబూ బక్ర్ నిజం చెప్పారు. అవి దూషించబడినవారి సమాధిలోకి రావు. ఎవరు తమ నాలుకను ప్రజలను బాధించడానికి ఉపయోగించారో వారి సమాధిలోనే చేరుతాయి. ఏ మూర్ఖుడు హజ్రత్ అబూ బక్ర్ ను తిట్టాడో, ఆ తిట్లు అబూ బక్ర్  సమాధిలో చేరుతాయని భావిస్తున్నాడా? ఏలాంటి మూర్ఖత్వం ఇది? ఇంతకంటే మించిన మూర్ఖత్వం మరేముంటుంది?

మళ్ళీ హజ్రత్ అబూ బక్ర్ జవాబును గమనించండి! ఏమన్నారు? “నీతో నీ సమాధిలోనే చేరుతాయి, నా సమాధిలో కాదు” అని చెప్పారు. ఇదే సమాధానమిచ్చారు, ఇది గాకుండా, “నేనూ నిన్ను తిడతాను, నా తిట్లు నీ సమాధిలో చేరుతాయి” అని గాని, “నేను నీకు ఇలా చేస్తాను, అలా చేస్తాను” అని గానీ అనలేదు. కేవలం “నీతో నీ సమాధిలో చేరుతాయి” అని మాత్రమే అన్నారు.

హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ జవాబు, ఆయన ప్రవర్తన చాలా సరియైనది. మనసును నొప్పించే మాట, దుర్భాష, వాటి దుష్ఫలం, పరిణామం, ఆ మాటలు అనడానికి సాహసం చేసినవాడే అనుభవిస్తాడు.

5- జగడము మాని, సంధి ప్రయత్నం చేయాలి:

ఒక వ్యక్తి హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుతో అన్నాడుః నేను తీరిక చూసుకొని నీ పని పడతాను. దానికి హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్  ‘అలాగైతే నీకు పని తగిలింది’ అన్నారు.

ఇదే సరియైన జవాబు. ఎవడైతే తన సొదరులను బాధ కలిగించ- టానికి, వారిని దూషించటానికి, వారికి వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నటానికి తీరిక పొందాలనుకుంటాడో, వాస్తవానికి అతడు ఎప్పుడూ తీరిక పొందడు, అల్లాహ్ అతన్ని ఇలాగే తీరిక లేకుండా చేసేస్తాడు. వాస్తవానికి అతను ఈ విధంగా తన జీవితంలోని అమూల్యమైన సమయాన్ని లాభం లేని వషయాల్లో వృధా చేసుకుంటున్నాడు.

హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్  జవాబు సరియైనది మరియు వివేకంతో కూడుకున్నది. {ఎవరికి దివ్యజ్ఞానం (వివేకం) లభించినదో, వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే}. (సూరె బఖర 2: 269).

హదీసు వేత్తల కథనం, ఒక వ్యక్తి ఆమిర్ బిన్ షొఅబీ -పేరు గాంచిన తాబిఈన్ పండితుల్లో ఒకరు- యదుట నిలబడి ‘ఆమిర్ నీవు అబద్ధం పలుకుతున్నావు’ అని అన్నాడు.

ఆమిర్ ఇలా జవాబిచ్చారుః నీవు సత్యవంతునివైతే, అల్లాహ్ నన్ను క్షమించుగాక! నీవు అబద్ధం పలికినవానివైతే అల్లాహ్ నిన్ను క్షమించుగాక!

చెప్పండి! ఆ తరువాత అతడేమని యుంటాడు??

ఏమంటాడు? ఊరుకున్నాడు!! ఎందుకంటే ఎవరు జగడాన్ని అంతమొందించి, రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరిపై అత్యాచారం జరపకుండా ఉంటారో -ప్రత్యేకంగా హోదా, అంతస్తులు, గొప్ప స్థానంగల వారిపై- అలాంటివారు స్వయంగా తమ పట్ల తరువాత ఇస్లాం మరియు ముస్లిముల పట్ల మేలు చేసినవారౌతారు.

6- ఆత్మ పరిశీలన:

హజ్ సందర్భంగా మినాలో ఒక వ్యక్తి సాలిం బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ను ఢీకొన్నాడు. మళ్ళీ అతనే తిరిగి సాలింతో అంటాడుః నీవు చాలా చెడ్డ మనిషివి. సాలిం -తాబిఈన్ లోని గొప్ప పండితుడు- ఇలా జవాబిచ్చాడుః “ఈ విషయం నీవే కనుగొన్నావు, నీవే నాకు తెలిపావు. ఇప్పటి వరకెవరూ నాకు తెలుపలేదు”. ఎందుకంటే సాలిం తనకు తాను చెడ్డవాడని భావించేవారు. ఇది నిజమే. విశ్వాసి తనలో తాను లోపం, కొరత ఉన్నట్లు గమనిస్తాడు. తన ఆత్మ పెద్దిరికానికి, ఆహంభావానికి గురవుతుందని అనుకున్నప్పుడు అతను దాన్ని నిందిస్తాడు, పరిశీలిస్తాడు. కాని దుర్మార్గుడు, వంచకుడు తనను తాను మంచివానిగా ప్రచారం చేసుకుంటుంటాడు.

సఈద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ అర్థ రాత్రి తరువాత నిద్ర మేలుకొని, తన ఆత్మనుద్దేశించి ఇలా అనేవారుః ‘ఓ చెడులను ప్రేరిపించే మనసా! లే అల్లాహ్ సమక్షంలో నిలబడు’.

సఈద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ ఇలా అంటున్నారు!! మనం మన ఆత్మలతో ఏమంటాము?. (ఓ అల్లాహ్ మా లోపాల్ని కప్పి పుచ్చు).

సహీ సనదులతో రుజువైన ఒక సంఘటన ఇలా ఉందిః ఖుర్ఆన్ వ్యాఖ్యాత, పండితులకే పండితులైన హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు గారిని ఒక వ్యక్తి మస్జిదుల్ హరాంలో, ప్రజల ముందు దూషించడం మొదలెట్టాడు. ఆయన తల దించుకొని ఉన్నారు. కర్షకుడు, ఎడారివాసి అయిన అతడు ప్రపంచములోకెల్లా గొప్ప మేధావిని తిడుతున్నాడు. ఆయన ఏమీ బదులు పలుకడం లేదు……. ఈ (నిశబ్దాన్ని చూసిన అతను) తిడుతూనేపోయాడు. అప్పుడు ఇబ్నె అబ్బాస్ తల ఎత్తి ఇలా అంటారుః నన్ను తిడుతున్నావా? నాలో ఈ మూడు గుణాలున్నాయి!

‘ఇబ్నె అబ్బాస్ అవేమిటి?’ అని అడిగాడతను.

ఇబ్నె అబ్బాస్ చెప్పారుః అల్లాహ్ సాక్షిగా! ఎప్పుడు వర్షం కురిసినా నేను సంతోషించి, అల్లాహ్ స్తోత్రం చేస్తాను. మరి నాకు ఒంటెలు, మేకలు ఏమీ లేవు!!

‘రెండవదేమిటి?’ అని అడిగాడతను.

ఆయనన్నారుః న్యాయం చేసే ఏ న్యాయాధిపతి గురించి నేను విన్నా, అతని పరోక్షంలో నేను అతని కొరకు దుఆ చేస్తాను, మరి చూడబోతే అతని వద్ద నా అర్జీ ఏదీ లేదు.

‘మూడవదేమిటి?’ అని అడిగాడతను.

ఆయన చెప్పారుః ఖుర్ఆనులోని ఒక్క ఆయతు భావం నాకు తెలిసినా, నాకు తెలిసిన విధంగా ముస్లిములందరికీ తెలియాలని నేను కోరుకుంటాను!!

ఇది, సహాబాలో గల ఉన్నత ఆదర్శం! విశ్వాసం మరియు ఉత్తమ నడవడికల అసలైన పునాదులపై మహాప్రవక్త ﷺ వారికి శిక్షణ ఇచ్చారు. లేకుంటే వారు ఎడారి నుండి వెలికి వచ్చిన నిరక్ష్యరాస్య వర్గమే. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమక్రమంగా వారికి శిక్షణ ఇచ్చి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. చివరికి వారు సమస్త జాతులపై నాయకత్వం వహించు- టకు అర్హులయ్యారు. ప్రజలందరికీ ఉత్తమ ఆదర్శంగా నిలిచారు.

నూటికి నూరు పాల్లు నీవు ఎవరిని పొందుతావు?. నీవు వందశాతం మంచి వ్యక్తిని పొందాలంటే, ఎన్నటికీ పొందలేవు. కొంచెం, 30 శాతం, 50 శాతం మంచి వాడిని పొందగలవు. ముస్లిం సమాజములో ఒక ముస్లిం వ్యక్తి -అతను ఎంత ఉత్తమ, ఉన్నత స్థానానికి చేరుకున్నా- ఏ చిన్న లోపం, కొంత అయిన కొరత లేనివాడిని చూడలేవు. ఇలా ముమ్మాటికి అసంభవం.

{ఒక వేళ అల్లాహ్ అనుగ్రహం ఆయన కారుణ్యం మీ మీద లేకపోతే, మీలో ఏ వ్యక్తీ పరిశుద్ధుడు కాలేడు. కాని అల్లాహ్ యే తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు}. (సూరె నూర్ 24:21).

ఫలానా వ్యక్తి దాతృత గుణం గలవాడు కాని కోపిష్టి. ఫలానా వ్యక్తి నిగ్రహశక్తి గలవాడు కాని పిసినారి. ఫలానా వ్యక్తి సద్గుణుడు కాని తొందరపాటు స్వభావి. ఇలా వివిధ గుణాలవారుంటారు. ఎందుకంటే మంచి, చెడు గుణాలన్నీ పంచింది అల్లాహ్ యే.

                  ఏ వ్యక్తి యొక్క పాపాలు లెక్కించటం సాధ్యమో అతనే మంచివాడు. కాని కొందరుంటారు, నీవు ఎంత ప్రయత్నం చేసినా వారి పాపాల్ని లెక్కించ లేవు!! మరి కొందరు, నీవు వారి మంచితనాన్ని చూసి వారిలో ఏ తప్పు లేదు, కేవలం ఇది …. మాత్రమే అని అంటావు, ఇలాంటే వారే మంచివాళ్ళు. ఎవరి పుణ్యాలు వారి పాపాలను అధిగమిస్తాయో వారే ఇస్లాం యొక్క సరియైన మార్గంలో ఉన్నవారు. మరెవరి పాపాలైతే వారి పుణ్యాలకంటే మించి ఉంటాయో అతనే అల్లాహ్ మార్గం నుండి వైదొలగినవాడు. ఎందుకంటే అల్లాహ్ ప్రళయదినాన పాపపుణ్యాలను త్రాసులో తూకంవేస్తాడు. దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః

{ఇటువంటి వారి నుండే మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము; వారు చేసిన చెడుకర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్యవాగ్దానం ప్రకారం, వారు స్వర్గవాసులలో చేరిపోతారు}. (అహ్ ఖాఫ్ 46: 16).

ఈ ఆయతులో వారిలో పాపాలు, తప్పిదాలున్నాయని, అయితే ఆయన వాటిని మన్నిస్తాడని స్పష్టపరిచాడు. ఒక హదీసులో ఈ విధంగా ఉందిః “నీటి పరిమాణం రెండు పెద్ద కడవలకు సమానంగా ఉన్నప్పుడు అది మాలిన్యాన్ని గ్రహించదు”([66]).

కొందరి నీళ్ళు (పుణ్యాలు) తక్కువ ఉండి, అందులో ఎంత చిన్న వస్తువు పడినా తన ప్రభావం చూపుతుంది, నీళ్ళు కలుషితమైపోతాయి. మరి కొందరి సత్కార్యాలు రెండు పెద్ద కడవల మాదిరిగా ఉండి అందులో ఏ వస్తువు పడినా అందులో మార్పు రాదు. వారి దానం, విద్య, ప్రచారం ఇంకా ఇతర సద్గుణాల వల్ల షైతాన్ నుండి కొన్ని దుష్ప్రేరణలు కలిగినా అవి తమ ప్రభావం చూపవు.

“హజ్రత్ మూసా అలైహిస్సలాం శిలాఫలకాలను తీసుకువచ్చారు. వాటిపై అల్లాహ్ వాక్కు, వాణి లిఖించబడి ఉంది. వాటిని ఒక పక్కన పడేశారు. తన సోదరుని జుత్తును పట్టుకొని అతన్ని లాగాడు” అని వచ్చిన విషయంలో ఇబ్ను తైమియ్య చెప్పారని ఇబ్ను ఖయ్యిమ్ మదారిజుస్సాలికీన్ లో పేర్కొన్నారుః ఆయన సోదరుడు కూడా ప్రవక్తే. అయినా మూసా అలైహిస్సలాం ప్రజల ముందు తన సోదరుని గడ్డము పట్టి లాగాడు. కాని అల్లాహ్ ఆయన్ని మన్నించాడు.

(أَقِيلُوا ذَوِي الْـهَيْئَاتِ عَثَرَاتِهِمْ إِلَّا الْحُدُودَ)

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “సద్గుణ సంపన్నుల తప్పిదాలను మన్నించివేయండి. ‘హుదూద్’ తప్ప”([67]). హద్దుల్లో అందరూ సమానులే. కాని ఏ విషయాల్లో హద్దు నిర్ణయించబడలేదో, అవి సద్గుణ సంపన్నుల ద్వారా జరుగుతే వారిని మన్నించాలి. సద్గుణ సంపన్నులంటే ఇస్లాంపై సత్యంగా, స్థిరంగా ఉన్నవారు, ప్రచార, సంక్షేమ కార్యక్రమాలు, దానధర్మాలు, సలహా సంప్రదింపులు ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ముందున్నవారు. వారి నుండి ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు జరిగితే ఓర్చుకోవాలి. (వారి ఆ ఒక్క తప్పును “గోరంతను కొండంత చేయుట” మాదిరిగా చేయకుండా,) వారి సత్కర్యాలు, దానధర్మాలు మరియు అల్లాహ్ వద్ద మరియు ప్రజల్లో వారికున్న మంచితనాన్ని చూడాలి.

సోదరులతో కలసి ఉండు, వారి పొరపాట్లను ఓర్చుకో, వారి తప్పిదాలను మన్నించు.

ఇబ్ను ముబారక్ రహిమహుల్లాహ్ ముందు వారి మిత్రుల, శిష్యుల, చెడు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఇలా అనేవారుః ‘ఫలాన మాదిరిగా ఎవరుంటారు. అతనిలో ఇలాంటి …. ఉత్తమ గుణాలున్నాయి’. వారి చెడులను ప్రస్తావించేవారు కాదు.

అయ్యో! మనము కూడా ప్రజల మంచి కార్యాలను ప్రస్తావిస్తూ ఉంటే ఎంత బాగుండు?. ఎంత చెడ్డ ముస్లిమైనా అతనిలో కొన్ని సత్కార్యాలు లేకుండా ఉండవు. కనీసం నమాజైనా చేస్తాడు కావచ్చు. ఇది లేకున్నా అల్లాహ్, ఆయన ప్రవక్తను ప్రేమించే వాడై ఉండవచ్చు. ఇదే నిజమైతే, అతని మంచితనానికి ఇదే సరిపోతుంది.

* మత్తు సేవించిన ఒక వ్యక్తిని ప్రవక్త సమక్షంలో తీసుకురావడం జరిగింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరడా శిక్ష విధించారు. అతను ఇంతకు ముందు కూడా అనేక సార్లు శిక్ష అనుభవించాడు. అతన్ని చూసిన ఒక వ్యక్తి ‘ఇతనిపై అల్లాహ్ శాపం పడుగాక! ఎన్ని సార్లు పట్టుబడ్డాడు’ అని అన్నాడు. ఇది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు శాపనార్థాలు పెట్టకండి. అల్లాహ్ సాక్షిగా అతను అల్లాహ్ , ఆయన ప్రవక్తను ప్రేమిస్తాడన్నది నాకు తెలుసు”. మరో ఉల్లేఖనంలో ఉందిః ఒక వ్యక్తి ‘అల్లాహ్ ఇతన్ని అవమానపరుచుగాక!’ అని శపించాడు. ప్రవక్త ﷺ “మీ సోదరునికి వ్యతిరేకంగా షైతాన్ కు సహాయపడకండి” అని చెప్పారు.

అతను అల్లాహ్, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుజువు పరిచారు. ఈ ప్రేమ కూడా ఒక సత్కార్యమే. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ సోదరత్వంలో అతన్ని చేర్చారు. ఇది అతి గొప్ప సత్కార్యం. మరలాంటప్పుడు మనం ముస్లిముల మేళ్ళను, ఇస్లాములో వారి త్యాగాలను ఎందుకు ప్రస్తావించకూడదు?

సంపూర్ణ దుర్మార్గంపై నీవు ఏ మనిషినైనా చూస్తున్నావంటే అతడు సత్యతిరస్కారి, లేదా అల్లాహ్ హద్దులను మితిమీరినవాడు, లేదా ఘోరపాపాలు బహిరంగంగా చేసేవాడు, లేదా సిగ్గూ లజ్జా వస్త్రాన్ని పూర్తిగా దించేసినవాడు, లేదా పుణ్యాత్ములతో, సద్పురుషులతో శతృత్వం వహించేవాడు, లేదా ఇస్లాంను తన వీపు వెనక వదిలేసినవాడు. 

రెండవది: విభేదాలను విడనాడడంలో ఇస్లామీయ విధానం

క్రియాత్మక ఆదర్శాలు/ దృష్టాంతాలు:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ కాలంలో ఆయన సహచరుల ద్వారా ఉనికిలో వచ్చిన అత్యుత్తమ ఆదర్శాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని దిగువ తెలుపబడుతున్నవిః

1- బిలాల్  మరియు అబూ జర్ర్ ల మధ్య విభేదం:

ఒకసారి అబూ జర్ర్  బిలాల్  ను అతని తల్లి గురించి ప్రస్తావించి సిగ్గు చేటయిన విషయమన్నాడు. బిలాల్ అతని గురించి ప్రవక్తకు ఫిర్యాదు చేశారు. అటు అబూ జర్ర్ తను చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాప పడ్డారు. ఇకేమయింది? తన చెంప భూమి మీద పెట్టి బిలాల్ తో అన్నారుః ‘అల్లాహ్ సాక్షిగా! మీ పాదం నా చెంప పై పెట్టనంత వరకు నేను భూమి మీద నుండి లేవను’. ఇద్దరు ఒకరికొకరు కరచాలనం చేసి, కలుసుకున్నారు.

2- ముహాజిరీన్ మరియు అన్సారుల మధ్య విభేదం([68]):

ఇస్లాం స్వీకరణ తరువాత, ముహాజిరుల మరియు అన్సారుల మధ్య పరస్పరం ఆయుధాలు బైటికి తీసి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. “ఏమిటిది, అనాగరిక నినాదం? విడనాడండి. ఇది అత్యంత నీచమైనది, దుర్గంధభూయిష్టమైనది” అని అన్నారు. అందరూ కన్నీరు కార్చారు. తమ చేతుల నుండి ఆయుధాల్ని వదిలేసారు. పరస్పరం కలుసుకున్నారు. ఇది నిజమైన సోదరభావం. ఇది అల్లాహ్ పై ప్రగాఢ విశ్వాసం ద్వారా లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. ఆయన తన దాసుల్లో తాను కోరినవారికి ప్రసాదిస్తాడు. పరస్పర ద్వేషాలతో నిండియున్నమనస్సులు కలవడం కేవలం ఇస్లాం ద్వారానే సాధ్యమయ్యేది. అది కేవలం అల్లాహ్ యొక్క త్రాడు. దాన్ని గట్టిగా పట్టుకుంటేనే, అల్లాహ్ కరుణతో సోదరులవుతారు. కాలాల తరబడి రగులుతున్న వైరాన్ని కాలరాయటానికి, వర్గాల కక్షలను అంతం చేయటానికి, వ్యక్తిగత కోరికల్ని హరించివేయటానికి మరియు జాతీయ ద్వేషాలను అంతమొందించటానికి అల్లాహ్ కొరకైన సోదరభావం తప్ప మరే మార్గం లేదు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః

{అందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరి కొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పులతో నిండివున్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు}. (ఆలి ఇమ్రాన్ 3: 103).

* చరిత్రకారులు సహీ సనదు (ప్రామాణిక ఆధారాల)తో ఒక సంఘటన పేర్కొన్నారుః ప్రవక్త సహచరులు బనీ ముస్తలిక్ యుద్ధానికి బయలు దేరారు. (దారి మధ్యలో ఓ చోట మజిలీ చేశారు). ఉమర్ ﷜కు ఓ బానిస ఉండేవాడు. అతని పేరు జహ్ జాహ్. అతను మరియు అన్సారులోని సనాన్ బిన్ వబ్రా మధ్య గొడవ మొదలయి, ఇద్దరూ కోపానికొచ్చి, కేకలు వేశారు. ఉమర్ రజియల్లాహు అన్హు బానిస ‘ముహాజిరులారా!’ అని, అన్సారీ ‘అన్సారులారా!’ అని పిలిచారు. ఆ నినాదాలు మనస్సులను కలుషితం చేశాయి. మునాఫిఖు (వంచకు)ల నాయకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉబై బిన్ సలూల్ ఇలా అన్నాడుః ‘ఎవరు చెప్పాడో కాని బలే మంచి సామెత చెప్పాడుః నీవు నీ కుక్కను ఆకలితో ఉంచుతే అది నీ వెనక వెనక వస్తుంది. తినిపించి లావు చేస్తే నిన్నే తినేస్తుంది. ఒకవేళ మనము, వాళ్ళను మన ఇండ్ల నుండి తరిమివేసియుంటే ఈనాడు మనతో ఇలాగా ప్రవర్తించి యుండే వారు కాదు. మనము మదీనా తిరిగి వెళ్ళిన తరువాత మనలోని గౌరవనీయులు నీచులని అక్కణ్ణించి వెళ్ళగొడదాము’. ఈ విషయం జైద్ బిన్ అర్ఖమ్ విని, ప్రవక్తకు తెలియజేశారు. ప్రవక్త ﷺ సహచరుల వద్దకు వచ్చి, ఆ ప్రాంతం నుండి బయలుదేరాలని ఆదేశించారు. ఎందుకంటే అక్కడే ఉండడం వల్ల వంచకులు ఈ విషయాన్ని మరింతగా లేపి పరిస్థితిని చెడగొట్టకుండా ఉండటానికి. సమాజంలో కొందరుంటారు, ఇతరుల తప్పు, పొరపాట్లను పట్టడానికి మాటు వేసి యుంటారు. వాటి గురించి చిలువలు పలువలు చేస్తారు. దీనినే ఓ పనిగా పెట్టుకోని కుక్క ప్రతి పల్లములో మూతి పెట్టినట్లు ఇతరుల మాన మర్యాదలలో జోక్యం చేసుకోనిది తృప్తి పడరు.

కాని ఇక్కడ ప్రవక్త ﷺ గారి వివేచనతో కూడిన విధానాన్ని గమనించండి! ఎవరికీ ఆ విషయంలో గొడవపడే అవకాశం లభించకుండా, ఆ ప్రాంతం నుండి బయలుదేరాలని ఆదేశించారు.

అందుకే వదంతులను అంతమొందించి, పరస్పరం ప్రేమగా ఉన్నవారి మధ్య ఏర్పడే చిచ్చులు చల్లారటానికి సులభమైన పద్ధతి ఏమిటంటే? ప్రజల్ని విద్యా, విద్య సంబంధిత విషయాల్లో, చింతనాత్మక పనుల్లో నిమగ్నుల్ని చేయాలి. ముస్లిం సమాజ పెద్ద పెద్ద సమస్యలు వారి ముందుంచాలి. ఎందుకంటే ఇస్లాం మరియు ముస్లిముల సమస్యలు మన వ్యక్తిగత సమస్యల కంటే, మన గొడవలకంటే ముఖ్యమైనవి. ఇస్లాంను వ్యాప్తి చేసే సమస్య. అంతర్జాతీయంగా యూదులను అణచివేసే సమస్య. సెక్యులిరిజం (లౌకికవాదం), కమ్యూనిజం (సామ్యవాదం) మరియు క్రైస్తవుల దినదినానికి పెరుగుతున్న సమస్యలు. కలకాలం ఉండే ముస్లిం సమాజ ఐక్యత సమస్య. అల్లాహ్ ముస్లిం సమాజాన్ని సర్వ సమాజాలపై సాక్షిగా ఉండే మధ్యస్త సమాజంగా చేశాడు. అది దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రవక్త ﷺ యొక్క సహీ హదీసులను అనుసరిస్తుంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఅద్ బిన్ ఉబాదతో కలసి జరిగిన ఈ సంఘటన గురించి తెలిపారు. అతనన్నాడుః ప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా! మీకిష్టముంటే మేము అతడ్ని (అబ్దుల్లాహ్ బిన్ ఉబై) నరికేస్తాము. లేదా అతడు మదీనాలో ప్రవేశించకుండా అడ్డుకుంటాము. నిస్సందేహంగా మీరు గౌరవపాత్రులు, అతడే నీచుడు. ఉమర్  వచ్చి, ప్రవక్తా! నాకు అనుమతివ్వండి, నేను అతన్ని అంతమొందిస్తాను అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఉమర్! ముహమ్మద్ తన అనుచరులనే హతమారుస్తున్నాడని ప్రజలు పుకార్లు లేపుతారు కదా, అందుకు నీవు ఆ పని చేయకు” అని అన్నారు. ([69]).

ఇస్లామీయ ప్రచార సందర్భాలలో శత్రువులతో, విరోధులతో ప్రవర్తించాల్సిన సరియైన విధానం ఇదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మంచి ప్రచార విధానం ఉండింది, దానిని ఆయన అనుసరించేవారు. ప్రచారం ముందుకు సాగుతూ ఉండాలన్నదే ఆయన కాంక్ష. ఇందులో తమ ధనం, ప్రాణం, రక్తం, భార్యా పిల్లలందరిని త్యాగం చేయవలసి వచ్చినా, అన్నిటికీ సిద్ధమై ఉండేవారు. ఎందుకంటే ఇస్లామీయ ప్రచారం ఎల్లవేళల్లో జరుగుతూ ఉండాలి. ప్రజలు లబ్ధి పొందుతూ ఉండాలి. ప్రజలు వినాలి, గుణపాఠం నేర్చుకోవాలి. ఆయన ద్వారా అనేకానేక మంది సన్మార్గం పొందాలి. స్వార్థం కొరకు ప్రతీకారం తీర్చుకోవడం, ఆగ్రహపడడం ఆయన గుణాల్లో ఎంత మాత్రం లేదు.

అటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ రజియల్లాహు అన్హుని నిలిపేసారు. ఇటు అబ్దుల్లాహ్ బిన్ ఉబై కుమారుడు -అతని పేరు కూడా అబ్దుల్లాహ్ యే, (అతను ముస్లిం)- వచ్చి, ‘మీరు నా తండ్రి హత్య చేయదలుచుకున్నట్లు నేను విన్నాను. నా తండ్రి హత్య కొరకు మీరు ఎవరినైనా పంపుతే, ఆ హంతకుడిని నా కళ్ళ ముందు నడుస్తూ చూసి, అతడ్ని హత్య చేయనిదే నా ఆత్మకు తృప్తి కలగదు. అందుకే ప్రవక్తా! మీతో విన్నవించుకునేదేమిటంటే మీరు నాకు అనుమతిస్తే, ఇప్పుడే నా తండ్రి తల నరికేసి మీ ముందు తెచ్చి- పెడతాను. మీకిష్టముంటే నేను తప్పక అతన్ని హతమారుస్తాను. నిశ్చయంగా మీరు గౌరవపాత్రులు. అతడే నీచుడు’ అని చెప్పాడు.

చూడండి! ఈ ఇస్లాంను. దీని పట్లగల గొప్ప సంబంధాన్ని! తండ్రి మరియు కుమారుడిలో ఎలా వేర్పాటు జరిగింది! కొడుకు అతని రక్తం, అతని వంశోద్ధారకుడే మరి! కాని…..?

ఆ సహచరుని విశ్వాసాన్ని కూడా చూడండి, అది అతనిలో ఇమిడిపోయింది. నరనరాల్లో జీర్ణించుకుపోయింది.

వాస్తవంగా “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూ లుల్లాహ్” ద్వారా ప్రస్ఫుటమయ్యే విశ్వాసం, నమ్మకం మరియు ధైర్యం, సాహసం యొక్క వర్ణనాతీత విషయాలు (చరిత్ర పుటల్లో) లిఖించబడ్డాయి. విచిత్ర సంఘటనలు వెలికి వచ్చాయి. అవి విజ్ఞానులను, బుద్ధి- మంతులను ఆశ్చర్యంలో పడవేస్తాయి. వారు వాటి గురించి ఏ వివరణా ఇవ్వలేని స్థితిలో ఉంటారు.

ఆ దౌర్భాగ్యుడు (అబ్దుల్లాహ్ బిన్ ఉబై) చనిపోయాడు. అతని కొడుకు అబ్దుల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఆయనగారి చొక్కా అడిగాడు. అందులో తన తండ్రి భౌతిక కాయాన్ని చుట్టి సమాధి చేయడానికి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ చొక్కా ఇచ్చేశారు. ప్రవక్త, తన తండ్రి యొక్క జనాజ నమాజు చేయించాలని కోరాడతను. నమాజు చేయించటానికి ప్రవక్త నిలబడ్డారు. అంతలోనే ఉమర్ రజియల్లాహ్ అన్హు ప్రవక్త వస్త్రాన్ని పట్టుకొని, ప్రవక్తా! మీరు అతని జనాజ నమాజు చేయిస్తారా?, మీ ప్రభువు మిమ్మల్ని నివారించాడు కదా? అని గుర్తు చేయగా, అప్పుడు ప్రవక్త చెప్పారుః అల్లాహ్ నాకు అధికారం ఇస్తూ ఇలా ఆదేశించాడుః

{నీవు వారిని క్షమింపవేడినను, వేడకపోయినను సమానమే. నీవు వారి కొరకు డెబ్బై సార్లు క్షమాపణ వేడినను అల్లాహ్ ఎన్నటికీ వారిని క్షమించడు}. (సూరె తౌబా 9: 80). అయితే నేను డెబ్బైకన్నా ఎక్కువ సార్లు అతడి మన్నింపు కోసం ప్రార్థిస్తాను.

అతడు మునాఫిఖ్ కదా! అని ఉమర్ చెప్పారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నమాజు చేశారు. సహచరులు చేశారు. ఆ తరువాత అల్లాహ్ వైపు నుండి ఈ ఆదేశం వచ్చిందిః

{వారిలో మరణించినవాని కొరకు ఎప్పటికిని నీవు ప్రార్థన చేయకు. వాని గోరి యొద్ద నిలవకు}. (సూరె తౌబా 9: 84).

* అల్లాహ్ అవిధేయతకు ఒడిగట్టిన, ప్రవక్త ﷺ ఆదేశాన్ని వ్యతిరేకించిన, ప్రవక్త ﷺ తో కలిసి జిహాద్ చేయడం మానుకున్న మరియు ముస్లిములతో అసభ్యంగా వ్యవహరించిన మునాఫిఖులు (కపటులు), ఒక్కొక్కడు ప్రవక్త (యుద్దం నుండి తిరిగి వచ్చాక, ఆయన) వద్దకు వచ్చి, ప్రవక్తా! నేను వ్యాధిగ్రస్తునిగా ఉంటిని అని అన్నాడు. ప్రవక్త సరే మంచిది అని జవాబిచ్చారు. అతను శారీరక రోగి కాదు, హృదయరోగి. మరొకడు వచ్చి, యుద్ధ సందర్భంలో నా భార్య ఆరోగ్యం పాడయింది అందు వల్ల నేను మీతో పాల్గొన లేదు అన్నాడు. అతనికీ సరే, నీవు చెప్పేది సత్యమే కావచ్చు అని సమాధానమిచ్చారు. మరొకడు వచ్చాడు. ప్రవక్తా! ప్రయాణానికి ఒక ఒంటె ఖరీదు చేసేంత శక్తి లేని బీదవాణ్ణి నేను అందుకే మీ వెంట రాలేదు అని చెప్పుకున్నాడు. నీవు కూడా నిజమే చెప్పావు అని ఇలా సమాధానమిస్తూ పోయారు. అటు అల్లాహ్ వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పై ఈ ఆయతు అవతరించిందిః

{అల్లాహ్ నిన్ను క్షమించుగాక! సత్యవంతులు నీకు స్పష్టపడి అసత్యవంతులు నీకు తెలియనంత వరకు నీవెందుకు వారికి సెలవొసంగితివి?}. (సూరె తౌబా 9: 43).

ఈ ఉత్తమ ప్రవర్తన ద్వారా ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం- ఏమి సాధించారు?

ఆయన తమ (సత్ర్పవర్తనతో కూడిన) ప్రచారం ద్వారా హృదయాల్ని కలిపారు, తమ వివేకం ద్వారా మనసులను ఒకటిగా చేశారు. ఒక సహచరుడు వచ్చి ఇలా అంటాడుః సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ సాక్షిగా! మీరు నా దృష్టిలో స్వయంగా నా ఆత్మకంటే ఎక్కువ అభిమానులు. మరొకడు ఇలా అన్నాడుః ఆయన గొప్పతనం చెప్పరానిది, నేను ఎన్నడూ వారిని కళ్ళారా చూడలేదు. అల్లాహ్ సాక్షిగా! ఆయన ఎలా ఉండిరి తెలుపమని మీరు నన్ను అడిగినచో నేను చెప్పలేను.

ప్రవక్త సహచరులు ప్రవక్తను ప్రేమించిన తీరు అపూర్వం. వారి రక్తాలు పారినా, మెడలు నరికినా సహిస్తారేమో కాని ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం- పాదములో ఒక ముళ్ళు గుచ్చుకుంటే భరించలేకపోయేవారు. ఇదే నిజమైన ప్రేమ.

3- ముఆవియ మరియు ఇబ్ను జుబైర్ ల మధ్య విభేదం:

మదీనాలో ముఆవియ రజియల్లాహు అన్హు గారికి ఒక చేను ఉండేది. అందు లో అతని పని మనుషులుండేవారు. దాని ప్రక్కనే అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి చేనూ ఉండింది. అప్పట్లో ముఆవియ రజియల్లాహు అన్హు ఈనాటి ఇరువై దేశాలంతటి రాజ్యానికి పాలకుడు. ఇక ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు ఆయన రాజ్యపాలనలో ఒక పౌరుడు. వారిద్దరి మధ్యలో (ఈ భూమికి సంబంధించిన) ఓ గొడవ ఎప్పటి నుండో ఉండింది. అయితే ఒకసారి ముఆవియ రజియల్లాహు అన్హు పనిమనుషులు ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు చేనులో చొరబడ్డారు. అప్పుడు ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు –కోపోగ్రహీతుడై- మఆవియా రజియల్లాహు అన్హుకు ఇలా లేఖ వ్రాసారు.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఈ లేఖ ‘హవారియె’([70]) రసూల్ జుబైర్ మరి  జాతున్ నితాఖైన్([71]) అస్మా కుమారుడగు అబ్దుల్లాహ్ తరఫున, పచ్చి కాలేయాన్ని నమిలిన హిందా కొడుకు ముఆవియా పేర, వ్రాయునది! అమ్మాబఅద్: నీ చేనులోని పనిమనుషులు నా చేనులో చొరబడ్డారు. సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ సాక్షిగా! నీవు వారిని ఆపకున్నట్లయితే నీతో నా సమస్య మరింత జటిలమవుతుంది!!

ముఆవియా లేఖ చదివారు. అతను చాలా ఓర్పు, సహనం గలవారు. తన కుమారుడైన యజీదును పిలిచారు. యజీదు తొందర పాటుగల మనిషి. ముఆవియా రజియల్లాహు అన్హు తన కొడుకు ముందు లేఖనుంచి నీ అభిప్రాయం ఏమిటి? దీనికి ఎలా జవాబివ్వాలి? అని ప్రశ్నించారు. అతడన్నాడుః ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధ పరచండి, దాని మొదటి సిపాయీ మదీనాలో ఉండగా, చివరి సిపాయి ఇక్కడ మీ వద్ద డమస్కస్ లో ఉండాలి. ఆ సైన్యం అతని (ఇబ్ను జుబైర్) తల తీసుకురావాలి.

‘లేదు, దానికంటే ఉత్తమమైన మరియు ప్రేమను, రక్త సంబంధాన్ని పటిష్ఠం చేసే ఒక పద్ధతి నా వద్ద ఉంది’ అంటూ ముఆవియా రజియల్లాహు అన్హు లేఖ వ్రాయడం మొదలెట్టారు.  

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, మిఆవియా బిన్ అబీ సుఫ్యాన్ తరఫున, ‘హవారియె’ రసూల్ జుబైర్ మరియు జాతున్ నితాఖైన్ అస్మా కుమారుడగు అబ్దుల్లాహ్ కు, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ, వబఅద్: (ఈ చేనేమిటి) నా మధ్య మరియు నీ మధ్య  ఈ జగమంతటి సమస్య ఎదురైనా, నీవు దాని గురించి నన్ను మందలిస్తే అది నీకు అప్పగిస్తాను. నా ఈ లేఖ నీ వద్దకు చేరిన వెంటనే నా చేను కూడా నీదే మరియు నా పని మనుషులు కూడా నీకే. ఇక అవన్నియూ నీ సొత్తే. వస్సలామ్!!

లేఖ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హుకు చేరింది. దాన్ని చదివి, ఆయన కంటతడి పెట్టారు. లేఖ కూడా తడిసిపోయింది. ఇక లేచి ముఆవియా రజియల్లాహు అన్హును కలుసుకోవటానికి డమస్కస్ బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఆయన తలను చుంబించి, ఇలా అన్నారుః అల్లాహ్ నీ బుద్ధిజ్ఞానాలు, తెలివితేటలను కాపాడుగాక! ఇందువలనే అల్లాహ్ నిన్ను ఖురైషుల్లో ఈ గొప్ప స్థానానికి చేర్పించాడు.

మూడవది: ఇస్లాం పై మాత్రమే ఐక్యత

మనము ఇతర జాతులకంటే విలక్షణమైన వారం. మనం దేశా- భిమానం ఆధారంగా ఒకటి కాలేము. మనల్ని దేశం ఐక్య పరచదు. ముస్లిములు నివసిస్తున్న దేశాలన్నీ మన దేశాలు. ఏ ప్రాంతంలో అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో అది ముస్లిం దేశమే.

అలాగే మనలో రక్తం ప్రాతిపదికపై కూడా ఐక్యత కుదరదు. ఇది భూవాసుల నినాదం. అల్లాహ్ దాని గురించి ఏ ఆధారమూ అవతరింప జేయలేదు. భాషా పరంగా కూడా మనలో ఐక్యమత్యమేర్పడదు. భాషలు అనేకం గలవు.

విశ్వాస పరంగా మాత్రమే మనం ఒక్కటి కాగలము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం ఆధారంగా. అదే “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” ఆధారంగా సంఘటితం కాగలం.

ఇదే గొప్ప మూల సూత్రం. ఇది విడివిడిగా ఉన్న మనల్ని ఏకం చేసింది. వర్గాల్లో ఉన్న మనల్ని ఒక్కటిగా చేసింది.

మనలో ఏ చిన్న ఎడబాటు, అనైక్యత ఏర్పడినా మనం ధర్మం వైపునకు మరలాలి. మనమందరం కలిసే ఐదు పూటల నమాజు చేస్తూ ఉంటాము. మన అందరి ఖిబ్లా కూడా ఒక్కటే. మనమనుసరించే ప్రవక్త కూడా ఒక్కరే. మనమందరం ఆరాధించే అల్లాహ్ కూడా ఒక్కడే. మనందరి గ్రంథం (ఖుర్ఆన్) ఒక్కటే. ఇంకా మనందరి సున్నత్ కూడా ఒక్కటే అన్న విషయాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి.

ప్రేమగా ఉన్నవారి మధ్యలో ఏదైనా సందర్భంలో కలత వచ్చినా అది ప్రేమను, ఆంతర్యంలో ఉన్న అభిమానాలను నశింపజేయరాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః {నీ ప్రభువు కాంక్షించినచో వారు ఎన్నటికీ అలా చెయ్యరు}. (సూరె అన్ఆమ్ 6: 112). అల్లాహ్ అభీష్టంతో ఇలాంటి చిన్న సంఘటనలు జరిగినా, అందులో అల్లాహ్ కు మాత్రమే తెలిసియున్న ఏదైనా ఔచిత్యం ఉండవచ్చు?

ఒకప్పుడు ఒక విషయం మనకు నచ్చకపోచ్చు కాని అందులోనే మేలు ఉండవచ్చు. మరొక్కప్పుడు ఒక విషయం మనకు ఇష్టముండ వచ్చు కాని అందులో మనకే నష్టం ఉండవచ్చు. సంపూర్ణ వివేచనా పరుడు అల్లాహ్ మాత్రమే.

అల్లాహ్ యొక్క ఏ నిర్ణయాన్నీ అసహ్యించుకోకు, నష్టం అనిపించేదే బహుశా లాభదాయకంగా ఉండవచ్చు. ఒక్కోసారి ఏదైనా అనైక్యత లేదా ఇంకేదైనా ఏర్పడినచో అందులో గొప్ప లాభాలు కలగవచ్చు. వాటిని మనం మన బుద్ధీజ్ఞానాలతో, మన పథకాలతో లేదా ప్రయత్నాలతో తెలుసుకోలేము. ఇందులో మన స్థానాల రెట్టింపు, రక్షణ, పాపాల మన్నింపు లాంటి ఎన్నో మేళ్ళుండవచ్చు. కాని మనిషి (దూరదృష్టి, లేక ఇతర కారణాల వల్ల) వాటిని విపత్తుగా, పీడనగా భావిస్తాడు. అలా భావించకూడదు. అల్లాహ్ సంపూర్ణ వివేచనాపరుడు. మనిషి పగలు, రేయి ఇలా అనాలిః “రజీతు బిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబిముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వ సల్లమ నబియ్య”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “ఎవరు రజీతు బిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ నబియ్యా చదువుతారో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది”. (అబూ దావూద్).

ఐహిక కారణాల మూలంగా లేదా స్వార్థం కోసం మనం పరస్పరం ఎవరితో కూడా తగవు పెట్టుకోకూడదు. ప్రతీ వ్యక్తి తన ధర్మ ప్రాభల్యానికి, దాన్ని అనుసరించే వారి ఉన్నతి, వారి సంక్షేమాల కొరకు పాటుపడాలి. మనందరం ఐకమత్యాన్ని పాటించి అనైక్యతకు దూరంగా ఉండాలి. ఇంకా ముస్లిం సమాజంపై వచ్చే విపత్తును ఆపడానికి ప్రయత్నం చేయాలి. చివరికి ఈ ఖుర్ఆను ఆయతు వెలుగులో అందరూ ఒక్కటై యుండాలి.

{ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడూ ఆయనేకదా! నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడు}. (8: అన్ఫాల్: 63).

ఓ అల్లాహ్ మమ్మల్ని పాపాల నుండి కాపాడు. వృధా మాటల, చేష్టల నుండి రక్షించు. ఘోర ప్రమాదాల్లో నుండి వెలికితీయుము!!

ఓ అల్లాహ్! ధర్మంపై మాకు నిలకడ ప్రసాదించు. మా బాణాలు గురిపై పడుటకు సహకరించు. మా చేతులారా ఇస్లాం కేతనమెగిరేసే భాగ్యం ప్రసాదించు. ఇస్లాం ద్వారా మాకు సహాయం నొసంగు.

ఓ అల్లాహ్ !మా హృదయాల్లో మా సోదరుల పట్ల ఉన్న అక్కసును, పొరుగువారి పట్ల గల కక్షను, మాతోటి వారి పట్ల గల ఈర్ష్యను తీసివేయుము.

ఓ అల్లాహ్! పరిశుద్ధ నీటితో మా హృదయాల్ని కడిగి వేయి, ధర్మజలంతో మా ఆత్మలను పరిశుద్ధపరచు. విశ్వాసులకు శాంతి, తృప్తినిచ్చి మా గుండెలను చల్లపరచు.

సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వ సలామున్ అలల్ ముర్సలీన్, వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వ సల్లల్లాహు వ సల్లమ వ బారక అలా నబియ్యినా ముహమ్మద్, వఅలా ఆలిహీ వ సహబిహీ అజ్ మఈన్.


[1] ముస్లిం/ అస్సలాం/ మిన్ హక్కిల్ ముస్లిం…./ 2162.

[2] అబూ దావూద్/ అదబ్/ ఫిర్రజులి యుఫారిఖుర్రజుల…/ 5200. ఈ హదీసు రెండు ‘సనదుల’తో ఉల్లేఖించబడినది. ఆ రెండిట్లో ఒకటి సహీ ఉంది అని షేఖ్ అల్బానీ మిష్కాత్/ 4650లో తెలిపారు.

2  అబూ దావూద్/ అదబ్/ ఫిర్రజులి యఖూలు అన్అమల్లాహు బిక ఐనా/ =

=5227 ఈ హదీసు ఉల్లేఖన కర్తలు నమ్మకస్తులైనప్పటికీ ఇది ‘మున్ ఖతిఅ’ (అంటే హదీసు పరంపరలో ఒక ఉల్లేఖన కర్త తన గురువు నుండి కాకుండా అతని గురువు నుండి ఉల్లేఖించడం) అని ‘ఫత్ హుల్ బారి’ (11/6) రచయిత తెలిపారు.

[3] ఈ విషయం ఫత్ హుల్ బారి 11/6లో ఉంది.

[4] అబూ దావూద్/ అదబ్/ కైఫస్సలాం/ 5195. తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మా జుకిర ఫీ ఫజ్లిస్సలాం/ 2689. ఈ విధంగా హసన్, సహీ, గరీబ్ ఉంది అని తిర్మిజి చెప్పారు. ఇది హసన్ అని షేఖ్ అల్బానీ తెలిపారు. మిష్కాత్: 4643.

[5]  బుఖారీ/ ఈమాన్/ ఇత్ఆముత్తఆమ్/ 12. ముస్లిం/ ఈమాన్/ బయాను తఫాజులిల్ ఇస్లాం…../ 39.

[6] బుఖారీ/ అల్ ఇస్తీజాన్/ బద్ఉస్సలామ్/ 6227. ముస్లిం/ అల్ జన్నహ్…/ యద్ ఖులుల్ జన్నత అక్వామున్…./ 2841.

[7] ముస్లిం/ అల్ఈమాన్/ బయాను అన్నహూ లా యద్ ఖులుల్ జన్నత…../54.

[8] బుఖారి/ అల్ ఈమాన్/ ఇఫ్ షాఉస్సలాం.

2 బుఖారీ/ అల్ ఇస్తిఅజాన్/ అత్తస్లీమ్ అలస్సబ్యాన్/ 6247. ముస్లిం/ అస్సలాం/ ఇస్తిహ్బాబుస్సలాం అలస్సబ్యాన్/ 2168.

[10] ముస్లిం/ అల్ఇమార/ ఫజ్లు ఇఆనతిల్ ఘాజీ ఫీ సబీలిల్లాహ్…./ 1894.

[11] చూడండి జాదుల్ మఆద్ 2/416.

[12] బుఖారీ/ అల్ మనాకిబ్/ తజ్వీజున్నబియ్యి ఖదీజత వ ఫజ్లుహా/ 3821. ముస్లిం/ ఫజాఇలుస్సహాబా/ ఫజాఇలు ఖదీజ/ 2432.

[13] బుఖారీ/ =/ ఫజ్లు ఆయిష/ 3768. ముస్లిం/ =/ ఫజాఇలు ఆయిష/ 2447.

[14] అబూ దావూద్/ అల్అదబ్/ కైఫస్సలాం/ 5196. ఇబ్ను ఖయ్యిమ్  =

= ఇందులో మూడు లోపాలు ప్రస్తావించాడు. చూడండిః జాదుల్ మఆద్ 2/417. హాఫిజ్ కూడా ఫత్ హుల్ బారి 11/8లో జఈఫ్ అని పేర్కొన్నారు.

[15] బుఖారీ/ అల్ఇల్మ్/ మన్ అఆదల్ హదీస సలాసన్…/ 94. తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మా జాఅ ఫీ కరాహియతి అయ్యఖూల … ముబ్తదిఅన్/ 2723.

[16] ఈ హదీసు ముస్నద్ అహ్మద్ లో రెండు చోట్లుంది. ఒకటిః 3/138లో అనసు  తో. ఇది సహీ హదీసు. మరో చోట 3/421లో ఖైస్ బిన్ సఅద్  తో. ఇది జఈఫ్.

[17] తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మా జాఅ ఫిత్తస్లీమి అలన్నిసా/ 2697. అబూ దావూద్/ అల్అదబ్/ ఫిస్సలామి అలన్నిసా/ 5204. ఇబ్నుమాజ/ అల్అదబ్/ అస్సలాము అలస్సిబ్యాని వన్నిసా/ 3701. అల్అదబుల్ ముఫ్రద్/ 1047.

[18] బుఖారి/ అల్ ఇస్తీజాన్/ తస్లీముల్ కలీల్ అలల్ కసీర్. 6231, 6232. ముస్లిం/ అస్సలాం/ యుసల్లిముర్రాకిబ్ అలల్ మాషి.. తిర్మిజి/ అల్ ఇస్తీజాన్/ మా జాఅ ఫీ తస్లీమిర్రాకిబ్…

[19] అబూదావూద్/ అల్అదబ్/ మాజాఅ ఫీ రద్దిల్ వాహిది అనిల్ జమాఅ/ 5210. దీని సనద్ లో సఈద్ బిన్ ఖాలిద్ ఖుజాఈ ఉన్నాడు. అతని గురించి హాఫిజిబ్నె హజ్ర్ తక్రీబ్ 235లో ‘జఈఫ్ మినస్సాబిఅ’ అని చెప్పారు. షేఖ్ అల్బానీ  ఇతర హదీసుల ఆధారంగా దీనిని హసన్ అని ఇర్వాఉల్ గలీల్ 778లో చెప్పారు.

[20]  ముఅత్త 2/959. ఇది ప్రామాణికమైన (సహీ) ముర్సల్ ఉల్లేఖనం.

[21] తిర్మిజి/ అల్ ఇస్తిజాన్/ మాజాఅ ఫీ తస్లీమిర్రాకిబి…/ 2705. తిర్మిజి హసన్, సహీ.

[22]  అల్ఇహ్సాను ఫీ తక్రీబి సహీహిబ్ని హిబ్బాన్ (2/251), నం: 498. దీని ఉల్లేఖకులు నమ్మకస్తులైన ఇమాం ముస్లిం యొక్క ఉల్లేఖకులే. కాని అబుజ్జుబైర్ మదల్లిస్. అతను ఈ హదీసును ‘అన్’ అని ఉల్లేఖించాడు అని అర్నావూత్ చెప్పారు.

[23] హైసమీ ‘అల్ మజ్ మఅ’ 8/39లో దీనిని బజ్జార్ ఉల్లేఖించారు, దీని ఉల్లేఖకులు సహీకి సంబంధించిన వారే అని చెప్పారు. షేఖ్ అల్బానీ  సహీ అని చెప్పారు. సహీహుత్తర్గీబ్ 2704.

[24] అబూ దావూద్/ అల్అదబ్/ ఫీ ఫజ్లి మన్ బదఅస్సలాం/ 5197. అహ్మద్.

[25] ఈ పదాలు కామిల్ 2/303లో ఇబ్ను అదీ ఉల్లేఖించారు. కాని దీని సనద్ జఈఫ్ ఉంది. తబ్రానీ, ఔసత్ లో ఉల్లేఖించారు. అయితే హైసమీ, అల్ మజ్ మఅ 8/35లో చెప్పాడుః దీని సనద్ (పరంపర)లో హారూన్ బిన్ ముహమ్మద్ అబుత్తయ్యిబ్  ఉన్నాడు. అతడు కజ్జాబ్ (అబద్ధకుడు). ఇబ్నుస్సినీ మరో విధంగా ఉల్లేఖించారు. దాని పదాలు= =ఇలా ఉన్నాయిః “సలాంకు ముందు మాటనారంభించేవానికి జవాబు ఇవ్వకండి”. చూడండిః అమలుల్ యౌమి వల్లైల 214. షేఖ్ అల్బానీ  దీని సనదును హసన్ అని చెప్పారు. సహీహ: 816.

[26] తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మాజాఅ ఫిత్తస్లీం కబ్లల్ ఇస్తిఅజాన్/ 2710. అబూదా వూద్/ అల్అదబ్/ కైఫల్ ఇస్తిఅజాన్/ 5176. అహ్మద్ 3/414. షేఖ్ అల్బానీ సహీహ 818లో సహీ అని చెప్పారు.

[27] అబూ దావూద్/ అల్అదబ్/ కమ్ మర్ర యుసల్లిముర్రజులు ఫిల్ ఇస్తిఅజాన్/ 5186. షేఖ్ అల్బానీ  దీనిని ధృవపరిచారు. సహీహుల్ జామి 4638.

[28] అబూదావూద్/ అల్అదబ్/ కరాయహియతు అయ్యకూల అలైకస్సలాం/ 5209. తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మాజ్అ ఫీ కరాహియతి…./2722. అహ్మద్ 5/63,64. సహీహుల్ జామి: 7402లో షేఖ్ అల్బానీ  సహీ అన్నారు.

[29] సునన్ నిసాయి కుబ్రా 6/100. దీని భావంలో ఉందిః అబూదావూద్/ అల్అదబ్/ ఫిస్సలామి ఇజా కామ మినల్ మజ్లిస్/ 5208. తిర్మిజి/ అల్ఇస్తీజాన్/ మాజాఅ ఫిత్తస్లీమి ఇందల్ కియాం…/ 2706. అదబుల్ ముఫ్రద్ లిల్ బుఖారీ 1007, 1008. ముస్నదుల్ హుమైది 1162. అల్ఇహ్సాన్ ఫీ తక్రీబి సహీ ఇబ్ని హిబ్బాన్ 2/247. నం 494,495,496లలో. దీని సనదును అర్నాఊత్ హసన్ అని చెప్పారు.

[30] అబూదావూద్/ అల్అదబ్/ ఫిర్రజులి యుఫారిఖుర్రజుల…../5200.

[31] తబ్రానీ ఉల్లేఖించారని, దీని సనద్ హసన్ అని హైసమీ మజ్ మఉజ్జవాయిద్ 8/37 లో పేర్కొన్నాడు. అమలుల్ యౌమి వల్లైల లిబ్నిస్సినీః 245. అదబుల్ ముఫ్రద్: 1011.

[32] బుఖారీ/ అల్ఐమాన్ వన్నుజూర్/ ఇజా హనస నాసియన్…/ 6667. ముస్లిం/ అస్సలాహ్/ వుజూబు కిరాఅతిల్ ఫాతిహ…./ 397.

[33] ముస్లిం/ అల్ మసాజిద్/ తహ్రీముల్ కలామి ఫిస్సలా/ 540.

[34] ముస్లిం/ అల్అష్రిబ/ ఇక్రాముజ్జైఫ్/ 2055.

[35] అల్ఇస్తిఅజాన్/ మాజాఅ ఫిస్సలామి కబ్లల్ కలాం/ 2699. తిర్మిజి ఈ హదీసును మున్కర్ అని చెప్పారు. (షేఖ్ అల్బానీ  దీనిని హసన్ అని చెప్పారు. అయితే విషయమేమిటంటే ‘అస్సలాము కబ్లల్ కలామ్’  హదీసు మాత్రం ఇతర ఆధారాలతో కలిసి హసన్ స్థానానికి చేరుకుంది. కాని దానితో కలిసిఉన్న మరో వాక్యం అది మౌజూ, బాతిల్).

[36] ముస్లిం/ అస్సలాం/ అన్నహ్యు అన్ ఇబ్తిదాఇ అహ్లిల్ కితాబి…./ 2167. అబూదావూద్/ అల్ అదబ్/ ఫిస్సలామి అలా అహ్లిజ్జిమ్మ/ 5205. తిర్మిజి/ అస్సియరు అన్ రసూలిల్లాహ్/ 1602.

[37] బుఖారీ/ తఫ్సీర్/ వలతస్మఉన్న మినల్లజీన…./ 4566. ముస్లిం/ అల్ జిహాద్/ ఫీ దుఆఇన్నబియ్యి…../ 1798. అహ్మద్ 5/203.

[38] బుఖారీ/ బద్ఉల్ వహీ/ బద్ఉల్ వహీ/ 7. ముస్లిం/ అల్ జిహాద్/ కితాబున్నబియ్యి లిహిర్ కల్/ 1773.

[39] బుఖారీ/ అల్ మగాజి/ హదీసు కఅబ్/ 4418. ముస్లిం/ అత్తౌబా/ హదీసు తౌబతు కఅబ్…/ 2769. అహ్మద్ 3/459,460.

[40] బుఖారీ/ అల్అదబ్/ అల్ హిజ్ర/ 6077. ముస్లిం/ అల్ బిర్ర్/ తహ్రీముల్ హజ్రి…./ 2560.

[41] బుఖారీ/ అన్నికాహ్/ హక్కు ఇజాబతిల్ వలీమ/ 5173. ముస్లిం/ అన్నికాహ్/ అల్అమ్ర్ బి ఇజాబతిద్దాఈ…./ 1429.

[42] ముస్లిం/ అన్నికాహ్/ అల్అమ్ర్ బిఇజాబతిద్దాఈ…/ 1432. బుఖారీ/ అన్నికాహ్/ మన్ తరకద్దావ…./ 5177.                       2 ముస్లిం/ =/ =/1430

[43] అబూ దావూద్/ అల్అత్ఇమ/ ఫీ కమ్ తుస్తహబ్బుల్ వలీమ/ 3745. అహ్మద్ 5/28. షేఖ్ అల్బానీ  జఈఫుల్ జామి 3616లో దీన్ని జఈఫ్ అని చెప్పారు.

[44] ముస్లిం/ అల్ఈమాన్/ అన్నద్దీన అన్నసీహ/ 55.

[45] బుఖారీ/ అల్ మజాలిమ్/ అఇన్ అఖాక జాలిమన్/ 2444. ముస్లిం/ అల్ బిర్ర్…./ ఉన్సురిల్ అఖ జాలిమన్…/ 2584.

[46] బుఖారీ/ అల్అదబ్/ లా యుషమ్మతుల్ ఆతిస్…/ 6225. ముస్లిం/ అజ్జుహ్ద్…./ తష్మీతుల్ ఆతిస్…/ 2991.

[47] ముస్లిం/ =/ =/ 2992.

[48] విడివిడిగా ప్రతీ ఒక్కరిపై ఉన్న విధిని ఫర్జె ఐన్ అంటారు. ప్రతీ ఒక్కరిపై కాకుండా ఏ ఒక్కరు, లేదా కొందరు నిర్వహించినప్పుడు ఇతరులపై అది విధిగా లేని దానిని ఫర్జె కిఫాయ అంటారు.

[49] అబూదావూద్/ అల్అదబ్/ ఫిల్ఉతాస్/ 5029. తిర్మిజి/ అల్అదబ్/ మాజాఅ ఫీ తక్ఫీజిస్సౌత్/ 2745. అహ్మద్ 2/439.

[50] అములుల్ యౌమి వల్లైల. పేః 132. నం. 264. షేఖ్ అల్బానీ కూడా జఈఫ్ అని చెప్పారు. జఈఫుల్ జామి 2505.

[51] అమలుల్ యౌమి వల్లైల. పేః 133. నం. 267. షేఖ్ అల్బానీ మౌజూఅ అని చెప్పారు. జఈఫుల్ జామి 1756.

[52] అబూదావూద్/ అల్అదబ్/ కమ్ మర్ర యుషమ్మతుల్ ఆతిసు/ 5034.

[53] ముస్లిం/ అజ్జుహ్ద్/ తష్మీతుల్ ఆతిస్/ 2993.

[54]  అమలుల్ యౌమి వల్లైల లిబ్నిస్సినీ 1/475. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమ- హుల్లాహ్ జాదుల్ మఆద్ 2/441లో మరియు షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ 3/404 హ.నం.1330లో హసన్ అని చెప్పారు.

[55] అబూదావూద్/ అల్అదబ్/ కైఫ యుషమ్మతుజ్జిమ్మి/ 5038. తిర్మిజి/ అల్అదబ్/ కైఫ తష్మీతిల్ ఆతిస్/ 2739. అహ్మద్ 4/400. 411. అదబుల్ ముఫ్రద్ 940. తిర్మిజి, నవవి మరియు హాకిం (ముస్తద్రక్ 4/268లో) సహీ అని చెప్పారు.

[56] ముస్లిం/ అల్ భిర్ర్ వస్సిల/ ఫజ్లు ఇయాదతిల్ మరీజ్/ 2568.

[57] బుఖారీ/ జనాయిజ్/ రిసాఉన్నబీ సఅద్…/ 1296. ముస్లిం/ అల్ వసియ్య/ అల్ వసియ్తు బిస్సులుస్/ 1628.

[58] బుఖారి/ వుజూ/ సబ్బున్ నబియ్యి వుజూఅహూ…./194.

[59] బుఖారీ/ అల్ మర్జా/ ఇయాదతుల్ అఅరాబ్/ 5656.

[60] బుఖారీ/ అల్ జనాయిజ్/ మనింతజర హత్తా తుద్ఫన్/ 1325. ముస్లిం/ అల్ జనాయిజ్/ ఫజ్లుస్సలాతి అలల్ జనాజ…./ 945.

[61] అబూదావూద్/ అల్ జనాయిజ్/ అల్ మష్యు అమామల్ జనాజ/ 3179. తిర్మిజి/ =/ ఫిల్ మష్ యి అమామల్ జనాజ/ 1007. నసాయి/ =/ మకానల్ మాషి మినల్ జనాజ/ 1944. ఇబ్ను మాజ/ =/ ఫిల్ మష్ యి అమామల్ జనాజ/ 1482. ఇబ్ను హిబ్బాన్ సహీ అని చెప్పారు. నసాయి ముర్సల్ అని చెప్పారు. దీని నిర్థారణ కొరకు తల్ఖీసుల్ హబీర్2/118,119 చూడండి.

[62] బుఖారీ/ అల్ జనాయిజ్/ ఇత్తిబాఉన్నిసాఇల్ జనాయిజ్/ 1378. ముస్లిం/ అల్ జనాయిజ్/ నహ్ యున్నిసాఇ…../ 938.

[63] హైసమీ ‘మజ్మఉజ్జవాఇద్ లో ఇలా చెప్పారుః దీనిని బజ్జార్ ఉల్లేఖించాడు. అందులో ముహమ్మద్ బిన్ సులైమాన్ బిన్ మష్మూల్ జఈఫ్ ఉన్నాడు.

([64]) బుఖారీ/ బద్ఉల్ ఖల్క్/ మాజాఅ ఫీ ఖౌలిల్లాహి తఆల వహువల్లజీ యబ్ దఉల్ ఖల్క…./ 3193.

([65]) తిర్మిజి/ సిఫతుల్ ఖియామ…/ మిన్హు../ 2499. ఇబ్ను మాజ/ అజ్జుహ్ ద్/ జిక్రు త్తౌబా/ 4251. దార్మి/ రిఖాఖ్/ ఫిత్తౌబా/ 2611. అహ్మద్/ 3/198. ముస్తద్రక్ హాకిం/ 4/244. హాకిం దీని సనద్ సహీ అని చెప్పారు. అల్బానీ సహీహుల్ జామిఅ 4515లో  హసన్ అని చెప్పారు.

([66]) అబూ దావూద్/ తహార/ మా యునజ్జిసుల్ మాఅ/ 63. తిర్మిజి/ తహర/ 67. నిసాయీ/ తహార/ 52. ఈ హదీసును ఇబ్ను ఖుజైమ, హాకిం, ఇబ్ను హిబ్బాన్, షేఖ్ అహ్మద్ షాకిర్ ~ (తాలీఖ్ తిర్మిజి 1/98లో) మరియు అల్బానీ ~ (ఇర్వా 23లో) సహీ అని చెప్పారు. దీని వివరణ తెలుగులో చూడదలుచుకున్న వారు

([67]) అబూ దావూద్/ అల్ హుదూద్/ ఫిల్ హద్ది యుష్ ఫఉ ఫీహి/ 4375. అహ్మద్ 6/181. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అబీ దావూద్ మరియు సహీహుల్ జామిఅ 1185లో సహీ అని చెప్పారు. ‘హుదూద్’ అంటేః ఏ పాపాల పై ఇస్లాంలో వాటి శిక్ష ఇహలోకములో నిర్ణయించబడిందో అవి అని భావం. ఉదాః దొంగ యొక్క హస్త ఖండన, వివాహితుడైన వ్యబిచారి యొక్క శిలా శిక్ష వగైరా.

([68]) ముహాజిరీన్ అంటే మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ప్రవక్త సహచరులు. అన్సార్ అంటే ముహాజిరీన్ కు ఆశ్రయమిచ్చిన మదీనవాసులు.

([69]) ఈ సంఘటన సంక్షిప్తంగా బుఖారీలో ఉంది

[70] హవారియె రసూల్ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుబైర్ రజియల్లాహు అన్హుకు నొసంగిన ప్రత్యేక బిరుదు. దీని భావం: ప్రత్యేక సహాయకులు అని.

[71] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూ బక్ర్ రజియల్లాహు అన్హు మదీనాకు హిజ్రత్ (వలస) చేసే సందర్భంలో ‘సౌర్’ గుహలో ఉండగా వారి కొరకు అస్మా రజియల్లాహు అన్హా తీసుకురాబోయిన, సద్ధి అన్నం కట్టడానికి ఏ త్రాడు దొరకనప్పుడు ఆమె తమ నడికట్టును రెండు ముక్కలుగా చీల్చి ఒకటి ఆమె కట్టకొని మరోదానితో సద్ధి మూటను కట్టింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ‘జాతున్ నితాఖైన్’ అని బిరుదిచ్చారు. అంటే రెండు నడికట్లు గల స్త్రీ.

%d bloggers like this: