క్లుప్తంగా ఇమామ్ బుఖారీ & ఇమామ్ ముస్లిం గురుంచి | అల్-లూలు వల్ మర్జాన్

nature-bukhari-muslim

Brief Biography of Imam Bukhari & Imam Muslim

[ఇక్కడ చదవండి / PDF డౌన్లోడ్ చేసుకోండి]

రచయిత :సయ్యిద్ షబ్బీర్ అహ్మద్
మూలం:మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) గ్రంధ పరిచయం నుండి

కరుణామయుడు, కృపాసాగరుడయిన అల్లాహ్ పేరుతో

అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్, అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్. ఈ గ్రంథం అసలు పేరు అరబీ భాషలో “అల్ లూలు వల్ మర్జాన్”. ఇందులోని పదావళి దివ్యఖుర్ఆన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది:

مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

“ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలిసిపోయేలా వదలి పెట్టాడు. అయినా వాటిమధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలోకొకటి చొచ్చుకుపోలేవు. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువు శక్తి పరిధిలోని ఏ మహిమను మీరు నిరాకరించగలరు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు కూడా లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!!) మీ ప్రభువులోని ఏ ఔన్నత్యాన్ని మీరు కాదనగలరు?”(55:19-23)

ఈ గ్రంథంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయాల (హదీసుల)కు సంబంధించిన సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం అనే రెండు హదీసు గ్రంథాలను రెండు సముద్రాలతో పోల్చడంజరిగింది. అయితే ప్రస్తుత సంకలన కర్త అల్లామా ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ హదీసుల మూలం (Text) ని బుఖారీ గ్రంథం నుండి గ్రహించి స్కంధాలు, అధ్యాయాల క్రమాన్ని, శీర్షికలపేర్లను మాత్రం ముస్లిం గ్రంథం నుండి స్వీకరించారు. అదీగాక పై రెండు గ్రంథాలలోనూ ఒకే ఉల్లేఖకుడు తెలిపిన ఉమ్మడి హదీసుల్ని మాత్రమే ఈ గ్రంథం కోసం ఎంచుకున్నారు. వీటిని “ముత్తఫఖున్ అలైహ్” (ఉభయోకీభవిత) హదీసులని అంటారు. వీటినే ఈ సంకలనకర్త ముత్యాలు,పగడాలుగా అభివర్ణించి, దాన్నే తన గ్రంథానికి నామకరణం చేశారు.

అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచార వ్యవహారాలు, ఆజ్ఞలు, అనుజ్ఞలు, అలవాట్లు, అభిరుచులు, కదలికలు, కథనాలు, సలహాలు, సూచనలు, స్వరూప స్వభావాలు -ఒక్కటేమిటి, ఆ మహనీయుని జీవితంలోని ప్రతి అంశానికి, ప్రతి కోణానికి సంబంధించిన హదీసుల్ని సేకరించి, సంకలనం చేసి పకడ్బందీగా భద్రపరిచారు హదీసు వేత్తలు. ఈ మహాకార్యం వెనుక వారి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ, అసామాన్య సాహసం మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

హదీసువేత్తలు ఉల్లేఖకుల నుండి హదీసుల్ని సేకరిస్తున్నప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గౌరవోన్నతుల పై అణుమాత్రం కూడా మచ్చరాని విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ మహానాయకుని పట్ల విశ్వాసం, ప్రేమాభిమానాలు ఇసుమంత సడలినట్లనిపించినాసరే అలాంటి హదీసుల్ని వారసలు స్వీకరించనే లేదు. హదీసుల సేకరణ తరువాత వారా హదీసుల్ని పరి పరి విధాల పరిశీలించి, శల్యపరీక్ష చేసి, క్షుణ్ణంగా వడపోసి వాటి నుండి పూర్తిగా నమ్మకమయినవని, నిజమయినవని ధృవీకరించుకున్న హదీసుల్ని మాత్రమే ఎంచుకొని సంకలనం చేశారు. హదీసులు ప్రామాణికత విషయంలో వారి దైవభీతి పరాయణత, నిజాయితీ, విశ్వసనీయలతో పాటు, హదీసుల ప్రామాణికతను పరిశీలించడానికి వారు నిర్దేశించిన కొలమానాలు యావత్తు ముస్లిం జగత్తులో ఎంతో గుర్తింపు పొందాయి. ఇలా సంకలనం చేసిన గ్రంథాలలో సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, నసాయి. ఇబ్ను మాజా, ఇమాం మాలిక్ గారి మువత్తా, ఇమాం ముహమ్మద్ గారి మువత్తా, ముస్నద్ అహ్మద్, దార్మి, దారెఖత్ని, బైహఖీ మొదలైనవెన్నో ఉన్నాయి. వీటిలో హదీసుల ఆరోగ్యస్థితి, ప్రామాణికతల రీత్యా మొదటి ఆరు గ్రంథాలు అత్యున్నత స్థాయికి చెందిన గ్రంథాలుగా ఖ్యాతి చెందాయి. ఈ ఆరు గ్రంథాలను “సహీ సిత్తా” (షడ్నీజాలు) అంటారు.

వీటిలో మన సంకలనకర్త తన గ్రంథం కోసం ఎంచుకున్న రెండు గ్రంథాలు సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను గురించి, వాటిని సంకలనం చేసిన ప్రముఖ హదీసు వేత్తలు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్), ఇమాం ముస్లిం (రహిమహుల్లాహ్) గార్ల జీవిత చరిత్రలను గురించి ఇక్కడ సంక్షిప్తంగానయినా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సహీహ్ బుఖారీ గ్రంథాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అల్ బుఖారీ (రహిమహుల్లాహ్) హిజ్రీ శకం 194, షవ్వాల్ మాసం 13వ తేదీ శుక్రవారం నాడు బుఖారాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం ప్రారంభించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత ఉన్నత విద్యకోసం ముస్లిం జగత్తులోని యావత్తు ప్రధాన విద్యా కేంద్రాలన్నీ పర్యటించారు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఆయన 1080 మంది ధర్మవేత్తల నుండి హదీసు విద్య నేర్చుకున్నారు. పదేళ్ళ ప్రాయంలోనే ఆయన బుఖారాలో ఆనాటి హదీసు విద్యాపారంగతులు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలలో చేరారు.

ఒక రోజు ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఒక హదీసు ప్రమాణాన్ని పేర్కొంటూ “సుఫ్యాన్ అన్ అబీజుబైర్ అన్ ఇబ్రాహీం” అని అన్నారు. అప్పుడు ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) కల్పించుకొని “ఈ హదీసు ప్రమాణం ఈ విధంగా లేదండీ! అబూజుబైర్ ఈ హదీసుని ఇబ్రాహీం నుండి ఉల్లేఖించ లేదు”అని అన్నారు.

అతి పిన్న వయస్సులో ఉన్న ఒక శిష్యుడు తనను ఇలా తప్పుబట్టడంతో గురువు గారుఉలిక్కిపడ్డారు. ఆయన కోపంతో కొర కొర చూశారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు గారి పట్లఎంతో వినయ విధేయతలతో వ్యవహరిస్తూ “మీ దగ్గర అసలు గ్రంథం ఉంటే అందులో ఓసారిచూసుకోండి” అని ప్రశాంతంగా అన్నారు.

ఇమామ్ దాఖలీ (రహిమహుల్లాహ్) ఇంటికి వెళ్ళి అసలు గ్రంథాన్ని పరిశీలించి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) చేసిన విమర్శ సహేతుకమయినదేనని గ్రహించారు. ఆయన తిరిగి వచ్చి “అయితే సరయిన ప్రమాణం ఏమంటావు?” అని అడిగారు. ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తక్షణమే సమాధానమిస్తూ “సుఫ్యాన్ అనిజ్జుబైరి వహు వన్బు అదియ్యి అన్ ఇబ్రాహీం (ఇబ్రాహీం నుండి జుబైర్ బిన్ అదీ రహిమహుల్లాహ్-ఉల్లేఖించారు; అబూజుబైర్ అనడం సరికాదు)” అని అన్నారు.

అప్పటికి ఇమామ్ బుఖారీ వయస్సు పదకొండేండ్లు కూడా నిండలేదు. పదహారు సంవత్సరాలవయస్సులో ఆయన హజ్రత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహిమహుల్లాహ్), ఇమామ్ వకీ (రహిమహుల్లాహ్)లు సేకరించిన హదీసులన్నీ కంఠస్తం చేశారు. 18వ యేట చరిత్ర గ్రంథాన్ని రచించ నారంభించారు. ఇందులో సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు), తాబయీల (ఆ తరువాతి అనుచరుల) జీవిత చరిత్ర, వారుచెప్పిన మాటలు, చేసిన నిర్ణయాలన్నీ సమీకరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి దగ్గర కూర్చొని వెన్నెల రాత్రులలో రాశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) అసామాన్య జ్ఞాపకశక్తి గల మేధా సంపన్నులు. ఎంత పెద్ద హదీసయినాసరే ఒక్కసారి చదివితే లేక వింటే చాలు కంఠస్తమయిపోయేది.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) గారి సమకాలిక హదీసువేత్త హామిద్ బిన్ ఇస్మాయీల్ ఇలాతెలియజేస్తున్నారు: “ఇమామ్ బుఖారీ బస్రాలో మాతో పాటు హదీసు తరగతులకు హాజరవుతూ ఉండేవారు. అయితే ఆయన కేవలం వినేవారు. ఒక్క అక్షరం కూడా వ్రాసుకునేవారు కాదు. ఈవిధంగా 16 రోజులు గడిచిపోయాయి. చివరికి ఓ రోజు నేను, హదీసులు వ్రాసుకోకపోవడం పట్ల ఆయన్ని విమర్శించాను. దానికాయన సమాధానమిస్తూ “ఈ పదహారు రోజుల కాలంలో నీవు వ్రాసుకున్న విషయాలన్నీ తీసుకురా. వాటన్నిటినీ నేను చూడకుండా చదువుతాను విను” అని అన్నారు. ఆ విధంగా ఆయన పదిహేను వందలకు పైగా హదీసుల్ని ఒక్క పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు మాకు వినిపించారు. స్వయంగా మేము అనేక చోట్ల మా రాతల్లో దొర్లిన తప్పులను ఆయన నోట విని సవరించుకోవలసి వచ్చింది”.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి జ్ఞాపకశక్తి గాధలు దశ దిశలా వ్యాపించిపోయాయి. ఆయనఏ ప్రాంతానికి బయలుదేరినా, ఆయనకు ముందే ఆ ప్రాంతానికి ఆయన పేరు ప్రఖ్యాతులు చేరుకునేవి. ప్రజలు వివిధ రకాలుగా ఆయన జ్ఞాపకశక్తిని పరీక్షించేవారు. చివరికి వారు ఆయన అసాధారణ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యచకితులయి ఎంతో అభినందించేవారు. ఆ కాలంలోనే షేఖ్ అబూ జరఆ (రహిమహుల్లాహ్), అబూ హాతిం (రహిమహుల్లాహ్), ముహమ్మద్ బిన్ నస్ర్ (రహిమహుల్లాహ్), ఇబ్ను ఖుజైమా (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజి (రహిమహుల్లాహ్), ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్)లు ఆయనకు శిష్యులయిపోయారు.

ఇమాం బుఖారీ (రహిమహుల్లాహ్) ని ప్రశంసిస్తూ కొందరు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినండి:

“బుఖారీ (రహిమహుల్లాహ్) హదీసు విద్యలో నాకంటే ఎక్కువ వివేకం, దూరదృష్టి కల వ్యక్తి. ఆయన దైవదాసుల్లోకెల్లా ఎక్కువ వివేచనాపరుడు. నిజం చెప్పాలంటే బుఖారీని మించిన వారే లేరు.”- ఇమామ్ దార్మి (రహిమహుల్లాహ్)

“ఖురాసాన్ భూభాగంలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) లాంటి మహోన్నత వ్యక్తి మరొకరుజన్మించ లేదు.”-ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్)

“స్వయంగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన లాంటి వ్యక్తిని చూడలేదు.”- ఇబ్నుల్ మదీనీ (రహిమహుల్లాహ్)

“ఇమామ్ ముస్లిం బిన్ అల్ హిజాజ్ (రహిమహుల్లాహ్) ఓ సారి ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) సన్నిధికివెళ్ళి ఆయన రెండు కళ్ళ మధ్య (నుదుటిని) ముద్దాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ తరువాతఆయన ‘గురువులకు గురువూ! హదీసువేత్తల నాయకా! మీ పాదాలు చుంబించడానికి నాకు అనుమతి ఇవ్వండి’ అని అన్నారు.’- అహ్మద్ బిన్ హమ్డాన్ (రహిమహుల్లాహ్)

“ఆకాశం క్రింద ఈ ధరిత్రిపై ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని మించిన హదీసు పండితుడు, పారంగతుడు మరొకరు లేరు.” – ఇబ్నె ఖుజైమా (రహిమహుల్లాహ్)

ఇమామ్ జీవిత విశేషాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక విశేషం ఉంది. ఆయన తనజీవితంలో ఏనాడూ ఎవరినీ నిందించలేదు, దూషించలేదు, బాధించనూలేదు. ఆయన స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావిస్తూ “పరలోక విచారణ దినాన పరోక్ష నిందను గురించి నన్ను ప్రశ్నించడం జరగదనినేను ఆశిస్తున్నాను” అని అప్పుడప్పుడు అంటుండేవారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఎంతో ఆత్మాభిమానం గల వ్యక్తి. దీన్ని గురించి ఉమర్ బిన్ హఫ్స్(రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “బస్రాలోని హదీసు పాఠశాలలో నేను, ఇమామ్ బుఖారీ సహవిద్యార్థులంగా ఉండేవాళ్ళం. ఒక రోజు ఇమామ్ పాఠశాలకు రాలేదు. విచారిస్తే ఆ రోజు ఇమామ్ బుఖారీ దగ్గర ధరించి బయటికి రావడానికి సరిపడ్డ బట్టలు కూడా లేవని తెలిసింది. ఈ విషయం ఇతరుల ముందు బహిర్గతం కావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆయన ఆ రోజు ఇంటి నుంచి బయటికే రాలేదు. ఆ తరువాత మేము ఆయన కోసం బట్టలు సంపాదించి తీసికెళ్ళి ఇచ్చాము. దాంతో ఆయన మరునాటి నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) రాజులకు, పాలకులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండేవారు.అయితే ఓ రోజు బుఖారా గవర్నర్, తన దర్బారుకు వచ్చి తనకు హదీసులు వినిపించవలసిందిగా ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)కి విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు, ఇతరులెవరూ పాల్గొనకుండా ఉండే ఓ ప్రత్యేక సమావేశంలో తన పిల్లలకు హదీసు విద్య నేర్పవలసిందిగా కూడా అతను ఇమామ్ని కోరాడు.ఇమామ్ ఈ రెండు కోర్కెలను తిరస్కరిస్తూ “విద్యను గురువు దగ్గరకెళ్ళి నేర్చుకోవలసి ఉంటుంది.నా సమావేశంలో ధనికుడు-పేద అనే తారతమ్యం లేదు. ఇక్కడికొచ్చి హదీసు విద్య నేర్చుకోవడానికిప్రతి ఒక్కరికీ హక్కుంది” అని సమాధానమిచ్చారు.

ఈ సమాధానం విని బుఖారా గవర్నర్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. గవర్నర్ ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) మీద పగబూని బుసలు కొట్టడం ప్రారంభించాడు. దాంతో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) బుఖారా పట్నం వదలి ఖర్తుంగ్ అనే ప్రాంతానికివెళ్ళి తలదాచుకోవలసి వచ్చింది. అక్కడకు వెళ్ళిన తరువాత ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. చివరికి హిజ్రి శకం 256లో ఈదుల్ ఫిత్ర్ నాడు 62 సంవత్సరాల వయస్సులో ఆయన తనువు చాలించారు. -రహ్మతుల్లా అలై-

ఇది ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) జీవితాంతం శ్రమించి, అనేక ప్రాంతాలు పర్యటించి సంకలనం చేసిన హదీసు గ్రంథం. ఆయన వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఆరు లక్షల హదీసులు సేకరించి, వాటిలో ఈ గ్రంథం కోసం అత్యంత ప్రామాణికమైన 7,397 హదీసుల్ని ఎంపిక చేసి సంకలనం చేశారు. ఈ 7,397 హదీసుల్లో నుండి పునరావృత్త హదీసుల్ని తీసివేస్తే 2,602 హదీసులు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవన్నీ పటిష్ఠమైన ఆధారాలు గల నిజమైన హదీసులు. వీటిని ఆయన వివిధ శీర్షికల క్రింద ప్రకరణలుగా, అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సంకలనం చేశారు.

ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) ఈ మహాకార్యాన్ని నిరంతరాయంగా 16 సంవత్సరాల పాటు అహోరాత్రులు చెమట ధారపోసి పూర్తి చేశారు. ఆయన ప్రతి హదీసు గ్రంథస్తం చేయడానికి ముందుగా స్నానం చేసి, రెండు రకాతులు నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తరువాతనే ఆ హదీసు రాయడానికి ఉపక్రమించేవారు. ఈ విధంగా ఆయన మొత్తం హదీసుల్ని పూర్తి పరిశుద్ధావస్థలో, ఎంతో భక్తిభావంతో గ్రంధస్తం చేశారు.

ప్రసిద్ధి చెందిన వందలాది మంది హదీసువేత్తలు ఈ గ్రంథం ప్రామాణికతను పరీక్షించడానికివివిధ రకాలుగా ప్రయత్నించారు. కాని ఏ ఒక్కరూ ఇందులోని ఏ ఒక్క హదీసు ప్రామాణికతతో కూడా విభేదించలేకపోయారు. కనీసం దానిపట్ల సందేహం కూడా వెలిబుచ్చలేకపోయారు. చివరికి వారంతా దివ్యఖుర్ఆన్ తరువాత పటిష్ఠమైన ప్రామాణికతతో కూడిన నిజగ్రంథం ఏదయినా ఉందంటే అది సహీహ్ బుఖారీ మాత్రమేనని తీర్మానించారు. ఈ విధంగా ఇస్లామీయ గ్రంథాలలో సహీహ్ బుఖారీ ద్వితీయ స్థానం పొందగలిగింది.

ఈ గ్రంథ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి. ఇక్కడరెండు విషయాలను మాత్రం ప్రస్తావిస్తున్నాం. ఇందులోని హదీసుల్ని స్వయంగా ఇమామ్ బుఖారీ(రహిమహుల్లాహ్) నోట తొంభై వేల మంది హదీసువేత్తలు విన్నారు. ఈ గ్రంథానికి 53 వివరణ గ్రంథాలువెలువడ్డాయి. వాటిలో కొన్ని వివరణ గ్రంథాలు పద్నాలుగేసి సంపుటాలలో వెలువడ్డాయి. దీన్ని బట్టిసహీహ్ బుఖారీ ఎంత జనాదరణ పొందిన గ్రంథమో ఊహించవచ్చు.

సహీహ్ ముస్లిం గ్రంధాన్ని సంకలనం చేసిన ఇమామ్ అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హిజాజ్(రహిమహుల్లాహ్) హిజ్ర శకం 204లో నీషాపూర్లో జన్మించారు. బాల్యం నుండే హదీసు విద్యార్జనలో నిమగ్నులయిపోయారు. హదీసుల అన్వేషణ కోసం ఆయన ఇరాఖ్, హిజాజ్, ఈజిప్టు దేశాలు పర్యటించి, అక్కడి పండితుల దగ్గర హదీసులు నేర్చుకున్నారు. అలాంటి పండితులలో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గురువులు కూడా ఉన్నారు. చివరికి ఆయన నీషాపూర్లో ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్)ని కలుసుకొని, ఆయన దగ్గర కూడా శిష్యరికం చేశారు.

ఆ కాలంలో గొప్ప గొప్ప హదీసువేత్తలు సయితం తరచుగా ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) దగ్గరకొచ్చి హదీసులు వినిపోతుండేవారు. వారిలో అబూ హాతిం రాజి (రహిమహుల్లాహ్), మూసాబిన్ హారూన్(రహిమహుల్లాహ్), అహ్మద్ బిన్ సల్మ (రహిమహుల్లాహ్), ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రభృతులు కూడా ఉన్నారు.ఆయన బాల్యం నుండి అంతిమ శ్వాస వరకు ఎంతో దైవభీతి, ధర్మపరాయణతలతో కూడిన పవిత్ర జీవితం గడిపారు. ఆయన ఏనాడూ ఒకరిని నిందించడం గాని, బాధించడం గాని చేయలేదు.

ఇమామ్ ముస్లిం మరణ సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. ఒక సారి ఓ పండిత గోష్ఠిలో ఒక వ్యక్తి ఏదో హదీసుని గురించి సమాచారం అడిగాడు. అయితే ఆ సమయంలో ఇమామ్ గారికి ఆ హదీసు గురించిన సరయిన వివరాలు తెలియకపోవడం వల్ల సమాధానం ఇవ్వలేకపోయారు.తరువాత ఆయన ఇంటికి వెళ్ళి ఆ హదీసుని అన్వేషించడం ప్రారంభించారు. గ్రంథ పుటలను తిరగేస్తూ ప్రక్కనే ఉన్న ఖర్జూరపండ్ల బుట్టలో నుంచి ఒక్కొక్క ఖర్జూరాన్ని తీసి తింటూ పోయారు.హదీసు అన్వేషణలో తానెన్ని ఖర్జూర పండ్లు తిన్నానన్న సంగతిని కూడా గమనించలేదు. చివరికి అన్వేషిస్తున్న హదీసు లభించిన తరువాత బుట్ట వైపు చూస్తే అది దాదాపు ఖాళీ అయిపోయింది.అప్పుడర్ధమైంది ఆయనకు తాను బుట్టలోని పండ్లన్నీ తిన్నానని. కాని ఇక చేసేదేమీ లేదు; జరగవలసింది జరిగిపోయింది. ఎక్కువ పండ్లు తినడం వల్ల ఆయన వ్యాధిగ్రస్తులయ్యారు. ఆ వ్యాధితోనే ఆయన హిజ్రీ శకం 261, రజబ్ నెల 24వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం శాశ్వతంగా ఇహలోకం వీడిపోయారు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే. స్వగ్రామమైన నీషాపూర్లోనే ఆయన్ని ఖననం చేశారు.

అబూహాతిం (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు: “ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) చనిపోయిన తరువాత ఓ రాత్రి నేను ఆయన్ని కలలో చూశాను. ఆయన దగ్గరికెళ్ళి మీ పరిస్థితి ఎలా ఉందని అడిగాను. దానికి ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) అల్లాహ్ తనకు మంచి స్థితి కల్పించాడని, స్వర్గంలో తాను కోరుకున్న ప్రదేశానికి వెళ్ళే, కోరుకున్న చోట ఉండే అనుమతినిచ్చాడ’ని అన్నారు.”

ఈ గ్రంథం కూడా హదీసుల ప్రామాణికత రీత్యా, వాటి ఆరోగ్యస్థితి రీత్యా సహీహ్ బుఖారీకిఏ మాత్రం తీసిపోదు. సహీహ్ ముస్లిం కూడా సహీహ్ బుఖారీతో సమానమైన విలువ గల గ్రంథమన్న విషయంతో ధర్మవేత్తలంతా ఏకీభవించారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథాన్ని ఎంతో నేర్పుతో, వివేకంతో సంకలనం చేశారు.అందువల్ల దీన్ని చాలా సులభంగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ గ్రంథంలో ఇంచుమించు ఒకే భావం గల హదీసులన్నీ ఒకచోట చేర్చారు. దాంతో పాటు హదీసుల ప్రమాణ పద్ధతుల్ని, వాటి పదజాలాల్లోని వ్యత్యాసాలను కూడా సంక్షిప్త వాక్యాలలో కడు జాగ్రత్తగా తెలియజేశారు.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) యావత్తు ముస్లిం జగత్తులో జరిపిన తన సుదీర్ఘ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల హదీసుల్ని సేకరించారు. మొదట వాటిలో ఒక లక్ష పునరావృత హదీసుల్ని ఏరివేసి మూడు లక్షల హదీసుల్ని సంకలనం చేశారు. ఆ తరువాత ఓ సుదీర్ఘ కాలం పాటు వాటిని నిశితంగా పరిశీలించి చివరికి అన్ని విధాల నమ్మకమైనవని, ప్రామాణికమైనవని, భావించినహదీసుల్ని మాత్రమే ఆయన ఈ గ్రంథానికి ఎంచుకున్నారు. ఇలా మూడు లక్షల హదీసుల్లో 7,275హదీసులు మాత్రమే గ్రంథస్తం చేయబడ్డాయి. అయితే వాటిలోనూ పునరావృత హదీసుల్ని తొలగిస్తే నాలుగు వేల హదీసులు మాత్రమే మిగులుతాయి.

ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) స్వయంగా తన గ్రంథం గురించి ఇలా అన్నారు: “నేనీ గ్రంథంలోఏ హదీసుని గ్రంథస్తం చేసినా క్షుణ్ణంగా ఆలోచించిన మీదట తగిన ఆధారాలతోనే దాన్ని గ్రంథస్థం చేశాను. అలాగే ఈ గ్రంథంలో నుంచి ఏ హదీసుని తొలగించినా క్షుణ్ణంగా ఆలోచించిన తరువాత తగిన ఆధారాలతోనే దాన్ని తొలగించాను. అందువల్ల ప్రపంచంలోని జనమంతా రెండొందల యేండ్లపాటు హదీసుల్ని పరిశీలించి రాసినా, చివరికి వారి నమ్మకం ఈ గ్రంథం మీదే ఉంటుంది.”

సహీహ్ ముస్లిం, సహీహ్ బుఖారీ గ్రంథాలలో ప్రామాణికత తదితర విషయాల రీత్యా ఏదిగొప్ప అనే విషయంలో ధర్మవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. సహీహ్ బుఖారీ అన్నిటికంటేఉన్నతమైనదని కొందరు అభిప్రాయపడితే, సహీహ్ ముస్లిం అన్నటికంటే ఉన్నతమైన గ్రంథమని,మరి కొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలకు భిన్నంగా ఇంకొందరు, కొన్ని విషయాలరీత్యా సహీహ్ బుఖారీ ఉన్నతమైనది, మరికొన్ని విషయాల రీత్యా సహీహ్ ముస్లిం ఉన్నతమైనదనిఅభిప్రాయపడ్డారు.

ఏమయినప్పటికీ ఈ గ్రంథకర్తలిద్దరూ గొప్ప ధర్మపరాయణులు, దైవభీతిపరులు, నిజాయితీపరులన్న విషయంలో మాత్రం ఎవరి మధ్యా ఎలాంటి భేదాభిప్రాయం లేదు. అలాంటి మహనీయులు సంకలనం చేసిన బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఏకీభవిత (ముత్తఫఖుల్అలై) హదీసుల సంగతి ఇక చెప్పేదేముంది? పటిష్ఠమైన ప్రామాణిక గ్రంథాలలోని ఈ ‘ఏకీభవిత’ హదీసులు మరెంత ప్రామాణికమైనవో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు.

సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలను రెండు సముద్రాలుగా, వాటిలో ఉన్న హదీసుల్నిముత్యాలు, పగడాలుగా ప్రస్తుత సంకలన కర్త ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ అభివర్ణించిన సంగతిప్రారంభంలో నేను ప్రస్తావించాను. అంటే ఒక సముద్రంలో ముత్యాలు ఉంటే, మరో సముద్రంలోపగడాలు ఉన్నాయన్నమాట. ఈ రెండు సముద్రాలలోని ముత్యాలు, పగడాలను ఏరి కూర్చిన హారం ఇంకెంత విలువైనదో ఊహించండి. ఆ అమూల్యమైన హారమే మీ ముందున్న ఈ గ్రంథం!

ఇందులో మొత్తం 1906 హదీసులున్నాయి. సహీహ్ బుఖారీలో పునరావృత హదీసులుతీసివేయగా 2602 హదీసులు ఉన్నాయి. అంటే ఈ గ్రంథంలో సహీహ్ బుఖారీలోని 696 హదీసులుతగ్గిపోయాయి. మరో మాటలో చెప్పాలంటే ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో లేని 696 హదీసులు ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) గారి గ్రంథంలో చోటు చేసుకున్నాయన్నమాట. వేరొక రకంగాచెప్పాలంటే ఈ 696 హదీసుల విషయంలో ఇరువురు ఇమాముల మధ్య పూర్తిగా ఏకీభావం లేదన్నమాట.

దీన్ని బట్టి మన ముందున్న ఈ గ్రంథంలో ఆ ఇరువురు ఇమాములు పూర్తిగా ఏకీభవించినహదీసులే ఉన్నాయని అర్థమవుతుంది. ఇలాంటి హదీసులున్న గ్రంథం వెలకట్టలేని వినూత్న ఉద్గ్రంధం అనడంలో ఇక సందేహమేముంది? కనుక దీన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ గ్రంథం అనువాదంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-సయ్యిద్ షబ్బీర్ అహ్మద్(ఉర్దూ అనువాదకుడు, లాహోర్)