సూరా అన్ నస్ర్ – ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్ (వ్యాఖ్యానం)[వీడియో]

బిస్మిల్లాహ్
సూరా అన్ నస్ర్ , ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్ – https://youtu.be/pDLl7ULHgiM

[46 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[సూరా అన్ నస్ర్]

110:1 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ
ఇదా జాఅ నస్రుల్లాహి వల్ ఫత్ హ్
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు,

110:2 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا
వ రఅయ్ తన్నాస యద్ ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్ వాజా
ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు,

110:3 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا
ఫసబ్బిహ్ బిహమ్ ది రబ్బిక వస్ తగ్ ఫిర్ హు, ఇన్నహూ కాన తవ్వాబా
నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు.

[క్రింది వ్యాఖ్య అహ్ సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో మొత్తం ౩ ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా విశ్వాసులకు హామీ ఇవ్వబడిన అల్లాహ్ సహాయం గురించి ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన నస్ర్ (సహాయం) అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రజలు తండోపతండాలుగా సత్యధర్మాన్ని స్వీకరిస్తారని ఈ సూరా తెలిపింది. అల్లాహ్‌ ఔన్నత్యాన్ని స్తుతిస్తూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ, ఆయన సన్నిధిలో పొరబాట్లకు క్షమాపణ కోరుకుంటూ విధేయంగా ఉండాలని ఈసూరా ఉద్బోధించింది.

ఖుర్‌ఆన్‌ అవతరణా క్రమం ప్రకారం ఇది చివరి సూరా (సహీహ్‌ ముస్లిం – వ్యాఖ్యాన ప్రకరణం). ఈ సూరా అవతరించినప్పుడు; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణకాలం సమీపించిందని, అందుకే అల్లాహ్ స్తోత్రం, క్షమాపణ గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆజ్ఞాపించబడిందని కొంతమంది సహాబీలకు అర్ధమైపోయింది. బుఖారీలో ప్రస్తావించబడిన హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌, హజ్రత్‌ ఉమర్‌ (రదియల్లాహు అన్‌హుమా)ల సంఘటనే దీనికి నిదర్శనం. ( అన్ నస్ర్ సూరా వ్యాఖ్యానం).

“అల్లాహ్‌ సహాయం” ( نَصْرُ اللَّهِ ) అంటే మిథ్యావాదంపై, మిథ్యావాదులపై ఇస్లాం మరియు ముస్లింలకు లభించిన తిరుగులేని ఆధిక్యం. “విజయం” అంటే మక్కా విజయం అన్నమాట! మక్కా నగరం దైవప్రవక్త జన్మస్థలం. కాని అవిశ్వాసులు ఆయన్ని అక్కడ ప్రశాంతంగా ఉందనివ్వలేదు. ఆయన్ని ఆయన ప్రియసహచరులను వలసపోక తప్పని పరిస్థితులను సృష్టించారు. కాని దైవప్రవక్త హిజ్రీ శకం 8వ ఏట మక్కాలో విజేతగా తిరిగి వచ్చినప్పుడు జనులు జట్లు జట్లుగా వచ్చి ఇస్లాంలో ప్రవేశించసాగారు. అంతకు ముందు ఈ విధంగా భారీ సంఖ్యలో ప్రజలు ఇస్లాంలో చేరేవారు కాదు. మక్కా విజయం తరువాత పరిస్థితి అనూహ్యంగా మారింది. ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)అల్లాహ్ నిజ ప్రవక్త అనీ, ఇస్లాం నిజధర్మమని ప్రజలు తెలుసుకున్నారు. తమ మోక్షానికి ఇస్లాం తప్ప మార్గాంతరంలేదని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు.

ఓ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! అల్లాహ్ సందేశాన్ని జనులకు చేరవేయవలసిన నీ బాధ్యత పూర్తికావచ్చింది. నీవు ఇహలోకం నుండి ప్రస్థానం చేయవలసిన సమయం కూడా దగ్గర పడింది. కాబట్టి నువ్వు సాధ్యమైనంత ఎక్కువగా అల్లాహ్ స్తోత్రంలో నిమగ్నుడవైఉండు. పొరపాట్ల మన్నింపు కోసం నీ ప్రభువును వేడుకుంటూ ఉండు. ఈ దైవోపదేశాన్నిబట్టి అవగతమయ్యే దేమిటంటే జీవితపు చరమదశలో మనిషి వీలైనంతఅధికంగా దైవధ్యానం చేయాలి. క్షమాభిక్షకై వేడుకుంటూ ఉండాలి.

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

సూరహ్ అల్ మసద్ (అల్ లహబ్), ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

సూరహ్ మసద్ , ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్
https://youtu.be/uisEvhOnq3M [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్‌లోని 111వ అధ్యాయమైన సూరతుల్ మసద్ (దీనిని సూరతుల్ లహబ్ అని కూడా అంటారు) యొక్క వివరణాత్మక తఫ్సీర్‌ను అందిస్తారు. పదాల వారీగా అర్థాలను వివరించడంతో ప్రారంభించి, సూరా యొక్క పూర్తి అనువాదాన్ని అందిస్తారు. అబూ లహబ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి, ఇస్లాం పట్ల తీవ్రమైన శత్రుత్వం వహించిన తీరును మరియు సఫా పర్వతంపై జరిగిన సంఘటన తర్వాత ఈ సూరా అవతరించిన సందర్భాన్ని వివరిస్తారు. అబూ లహబ్ మరియు అతని భార్య ఉమ్మె జమీల్ యొక్క గర్వం, వారి సంపద, మరియు వారు ఎదుర్కొన్న భయంకరమైన పర్యవసానాలను చారిత్రక ఆధారాలతో వివరిస్తారు. సత్యానికి మరియు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వారికి, వారి సంపద, హోదా లేదా బంధుత్వం ఎలాంటి సహాయం చేయలేవని ఈ సూరా నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలను వక్త నొక్కి చెబుతారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద అమ్మా బా’ద్.

సూరతుల్ మసద్, ఇది ఖుర్ఆన్ క్రమంలో 111వ సూరా. దీనికంటే ముందు సూరతున్నస్ర్ 110వ సూరా ఉంది, దీని తర్వాత సూరతుల్ ఇఖ్లాస్ 112వ సూరా.

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]
అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి, వాడు సైతం నాశనమైపోయాడు.

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
వాడి ధనం గానీ, వాడి సంపాదన గానీ వాడికి ఏ మాత్రం పనికిరాలేదు.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
త్వరలోనే వాడు భగభగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు.

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
[వమ్ర అతుహు హమ్మాలతల్ హతబ్]
ఇంకా అతని భార్య, పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది.

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ముందు ముఖ్యమైన పదాల భావం, అర్థం తెలుసుకొని ఆ తర్వాత సరళమైన, సులభ భాషలో మనం అనువాదం తెలుసుకుందాము, ఆ తర్వాత దాని యొక్క వ్యాఖ్యానంలోకి వెళ్దాం.

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]
అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి, వాడు సైతం నాశనమైపోయాడు.

تَبَّتْ
[తబ్బత్]
విరిగిపోయాయి / నష్టంలో పడిపోయాయి / నాశనమైపోయాయి

يَدَا
[యదా]
రెండు చేతులు

أَبِي لَهَبٍ
[అబీ లహబ్]
ఇది ఒక వ్యక్తి గురించి సూచిస్తుంది, అబూ లహబ్. అతను ఎవరు, ఏంటి విషయం తర్వాత తెలుసుకుందాము.

وَتَبَّ
[వతబ్]
వ అంటే మరియు, తబ్బ్ అంటే అతను నాశనమైపోయాడు.

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
మా అగ్నా – పనికిరాలేదు / ప్రయోజనం కలుగజేయలేదు. అన్హు – అతనికి. మాలుహు – అతని సంపద / అతని యొక్క ధనం. వమా కసబ్ – మరియు అతను సంపాదించినది.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
సయస్లా – అతడు సమీపంలోనే ప్రవేశిస్తాడు. యస్లా అంటే ప్రవేశిస్తాడు. స అనే అక్షరం ఏదైతే వచ్చిందో, సమీపంలోనే, అతిదగ్గరలోనే అని అర్థం. నారన్ – అగ్నిలో. జాత లహబ్ – భగభగ మండేది.

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
[వమ్ర అతుహు హమ్మాలతల్ హతబ్]
వమ్ర అతుహు – మరియు అతని యొక్క భార్య. హమ్మాలతల్ హతబ్ – హమ్మాల్, సర్వసాధారణంగా మన ఏరియాలో స్టేషన్లలో, బస్టాండ్లలో ఈ పదం ఉపయోగపడుతుంది, కూలీలు అని హమ్మాల్ అని సామాన్లు మోసేవారు. హమ్మాలత్ – మోసుకుంటూ ఉండేది. అల్ హతబ్ – పుల్లలు, కట్టెలు.

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఫీ జీదిహా – ఆమె మెడలో. హబ్లున్ – తాడు. మిమ్ మసద్ – మసద్ అంటే పేనినది, గట్టిగా దానిని పేని ఉంటుంది కదా, దానిని అంటారు.

అల్లాహ్ దయవల్ల మనం పదాల యొక్క విడివిడి భావం, అర్థం తెలుసుకున్నాము. ఇక ఒకసారి మనం సరళమైన, సులభకర భాషలో దీని యొక్క అనువాదం విని, ఆ తర్వాత వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, దీనికంటే ముందు ఖురాన్ క్రమంలో 110వ సూరా సూరతున్నస్ర్ ఉంది అని ఇంతకు ముందే నేను చెప్పాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విజయం, గొప్ప సహాయం అండజేశాడో దాని శుభవార్త ఉంది. కానీ వెంటనే 111వ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మానికి విరోధులు ఎవరైతే ఉన్నారో, వారికి ఏ గతి పట్టిందో, ఇంకా ఎవరైతే ఇలాంటి విరోధంలో ఉంటారో, వారికి ఎలాంటి గతి పడుతుందో అది చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? సూరత్ లహబ్, సూరత్ మసద్ లేదా సూరత్ తబ్బత్ ఈ మూడు పేర్లతో ఈ సూరా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఖురాన్ లో ఎవరి పేరు అయినా తీసుకొని, అతడి నాశనం గురించి, అతడు నరకవాసి అని చెప్పబడిన ఏదైనా సూరా ఉంటే, ఈ ఒక్క సూరా మాత్రమే. ఇక మీరు గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ శత్రువుని పేరు తీసుకొని ఒక సూరా పేరు పెట్టి, ఒక ముకమ్మల్, సంపూర్ణ సూరా అల్లాహ్ అవతరింపజేశాడు అంటే, అతడు ఎంతటి విరోధానికి, శత్రుత్వానికి, కపటత్వానికి పూనుకొని ఉండెనో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దీని ద్వారా మనం తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సత్య ధర్మాన్ని అనుసరించకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మాన్ని నమ్మకుండా, ఆచరించకుండా, అందులో పుల్లలు వెతికేవాడు, దానికి విరోధం, కపటత్వం, శత్రుత్వం వహించేవాడు, దానికి విరుద్ధంగా ప్రయత్నాలు చేసేవాడు, తాను ఎంత డబ్బు, ధనం గలవాడైనా, ఎంతటి హోదా, అంతస్తు ఉన్నవాడైనా, ఇహలోకంలో అతనికి ఎంతటి పెద్ద స్థానం, పరపతి మరియు అతనికి ఎంత అతని యొక్క ఫాలోవర్స్ ఉన్నా గానీ, అతడు ఇస్లాంకు విరుద్ధంగా ఏదైతే వెళుతున్నాడో, దానికి కారణంగా అతనిపై వచ్చిపడే శిక్ష ఏదైతే ఉందో, ఆ శిక్ష నుండి అతన్ని తప్పించడానికి అతని ఏ ధనము పనికిరాదు, అతని ఏ సంపద పనికిరాదు, అతనికి ప్రజలో ఉన్నటువంటి పెద్ద హోదా, అంతస్తు ఏదీ కూడా పనికిరాదు, అతడు సర్వనాశనమైపోతాడు అన్నటువంటి హెచ్చరిక మనకు ఈ సూరాలో కనబడుతుంది.

ఇక రండి,

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ‘తబ్బత్ యదా అబీ లహబ్’ ఇది బద్వా (ఒక శాపం). ‘వతబ్’ ఇది ఒక సమాచారం. మొదటి పదంలో బద్వా ఉంది, శాపం ఉంది. రెండవ చిన్న పదం ‘వతబ్’ అందులో ఒక విషయం తెలియజేయబడుతుంది.

అయితే ఈ సూరాలో అబూ లహబ్ అని ఏదైతే ప్రస్తావన వచ్చిందో, ఎవడు అతడు? షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ సూరా ఇస్లాం సత్య ధర్మం అనడానికి, ఖురాన్ అల్లాహ్ వైపు నుండి వచ్చిన, ప్రళయం వరకు పొల్లుపోకుండా ఏ అక్షరంలో మార్పు లేకుండా సురక్షితంగా ఉంది అనడానికి ఒక గొప్ప మహిమ ఈ సూరా. ఈ విషయం ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ కూడా ప్రస్తావించారు.

అయితే షేఖ్ ఇబ్ను ఉథైమీన్ చెప్పారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి ముందే చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రవక్త వారికి తొమ్మిది మంది బాబాయిలు – పెత్తండ్రులు, పినతండ్రులు. అర్థమైంది కదా? ప్రవక్త తండ్రి యొక్క సోదరులు తొమ్మిది మంది, ఎందుకంటే తాత అబ్దుల్ ముత్తలిబ్ కి పది మంది సంతానం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ అంకుల్స్, తండ్రి యొక్క సోదరుల్లో ఇస్లాం దృష్టిలో చూస్తే, మూడు రకాల వారు ఉన్నారు. షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లాహ్ చెప్తున్న మాట ఇది. పినతండ్రులు, పెత్తండ్రుల్లో మూడు రకాల వారు ఉన్నారు. ఒకరు ఎవరు? సంపూర్ణంగా ప్రవక్త వారికి సహాయం అందించారు, ఇస్లాం స్వీకరించారు. ఎవరు? హమ్జా మరియు అబ్బాస్ రదియల్లాహు అన్హుమ్. రెండో రకమైన వారు, ఇస్లాం స్వీకరించలేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంపూర్ణంగా సహాయపడ్డారు. ఎవరు? అబూ తాలిబ్. చివరి వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రయత్నం చేశారు. ఆయన కనీసం ఒక్కసారి మరణానికంటే ముందు, ఒక్కసారైనా కలిమా చదవాలి అని, కానీ చివరి పలుకులు అతనివి, “అలా మిల్లతి అబ్దిల్ ముత్తలిబ్” – నేను నా తాత ముత్తాతల ధర్మం పైనే ఉన్నాను అన్నట్లుగా చెప్పాడు. మూడో వారు ఎవరు? బద్ధ శత్రువుగా తేలాడు. అతడే ఈ అబూ లహబ్. అతని ప్రస్తావనే ఈ సూరాలో ఉంది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సొంత బాబాయి అయినప్పటికీ, ఆ కాలంలో అరబ్బులు షిర్క్, కుఫ్ర్, బిద్అత్ ఇంకా ఎన్నో రకాల చెడుల్లో ఉన్నప్పటికీ, ఒక మంచి గుణం వారిలో ఏముండింది అంటే బంధుత్వాన్ని కాపాడుకునేవారు. బంధుత్వాన్ని తెంచుకునే వారు కాదు. బంధుత్వాన్ని కాపాడుకోవడం, బంధువులకు సహాయంగా నిలబడడం ఒక గొప్ప, ఉత్తమ గుణంగా భావించేవారు. అందుకే మనం చూస్తున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రలో, ఇస్లాం ప్రచారం మొదలుపెట్టిన తర్వాత సుమారు ఒక ఏడు సంవత్సరాలు, ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సామాజిక బహిష్కరణ (బాయ్‌కాట్) చేయడం జరుగుతుంది కదా? ముస్లింలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించారో, ప్రవక్త మరియు ముస్లింలందరికీ వ్యతిరేకంగా ఒక సామాజిక బహిష్కరణ ఆనాటి కాలంలోని అవిశ్వాసులు, ముష్రికులు చేస్తారు. దానికి ఒక ఒప్పందం రాసుకొని కాబాలో కూడా పెడతారు. ఇళ్ల నుండి తరిమివేయడం జరుగుతుంది. వారు వెళ్లి గుట్టల్లో, కనుమల్లో శరణు తీసుకొని గడుపుతారు. ఆ సందర్భంలో మనం చూస్తున్నాము చరిత్రలో, బనూ హాషిం మరియు బనూ అబ్దుల్ ముత్తలిబ్, ఈ రెండు తెగల వారు ఎంతోమంది ఇస్లాం స్వీకరించనప్పటికీ, ప్రవక్త మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ బంధువులు ఇస్లాం స్వీకరించారో, ఏ ముస్లింలు అయితే ఉన్నారో, వారికి సపోర్ట్‌గా నిలిచి, వారికి తోడుగా ఉండి, వారు కూడా ఆ కనుమల్లోనే జీవితం గడిపారు.

నేను చెప్పదలచుకున్నది ఏమిటి అర్థమైందా మీకు? ఆనాటి కాలంలోని అరబ్బుల్లో ఒక ఉత్తమ గుణం బంధువులకు సహాయంగా, అండదండగా, తోడుగా ఉండడం. అలాంటి ఆ ఉత్తమ గుణాన్ని ఈ దుష్టుడు వదిలేసి, ప్రవక్తకు బద్ధ విరోధిగా, శత్రువుగా మారాడు. ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాల్లో ఎన్నో హదీథులు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క పిలుపు ఇస్తున్నప్పుడు, అతడు వ్యతిరేకంగా, ప్రవక్త వెనక వెనక తిరుగుతూ, “ఇతడు పిచ్చివాడయ్యాడు, ఇతని యొక్క మాట వినకండి” అని తప్పుడు ప్రచారం చేసేవాడు.

అయితే సోదర మహాశయులారా, ఈ సూరా ఎలాంటి సందర్భంలో అవతరించింది? అతను పేరు చెప్పి ఎందుకు ఇంతగా అతన్ని శపించడం జరిగింది? రండి, సహీహ్ బుఖారీలో హదీథ్ ఉంది 4972, అలాగే మరోచోట సందర్భంలో 1394, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో సహీహ్ బుఖారీలో కూడా ఉంది, ఇంకా వేరే హదీథుల్లో కూడా. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సూరతుష్ షుఅరాలో ఒక ఆయత్ అవతరింపజేశాడు:

وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
[వఅన్‌దిర్ అషీరతకల్ అఖ్రబీన్]
“నీ దగ్గరి బంధువులకు నీవు అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపెట్టు.”

అలాగే:

فَاصْدَعْ بِمَا تُؤْمَرُ
[ఫస్దఅ బిమా తుఅ్మర్]
“ఇక ఇప్పుడు నీవు బహిరంగంగా ధర్మ ప్రచారం చేయడం మొదలుపెట్టు.”

అప్పుడు ఆనాటి అలవాటు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఎత్తైన ప్రదేశం, అంటే సఫా కొండపై ఎక్కి, “యా సబాహా!” అని పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏముంటుంది? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంది, అందరిపై ఒక ప్రమాదం ఏదైనా వస్తుంది అన్నప్పుడు దాన్ని గమనించిన వారు అందరినీ హెచ్చరించడానికి ఇలా ఎత్తైన ప్రదేశంలో వెళ్లి పిలుపునిచ్చేవారు, గొంతెత్తి పెద్ద శబ్దంతో అరిచేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పద్ధతిని అనుసరించి, అంటే ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి మీరు. ప్రతి కాలంలో ఆనాటి కాలంలో పబ్లిసిటీ కొరకు ఉన్నటువంటి, ఆనాటి కాలంలో ఉన్నటువంటి మీడియా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, వాటిని అవలంబించడం మన బాధ్యత. ఇది గమనిస్తూ వెళ్ళండి.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ వెళ్లి ఇలాంటి నినాదం వేసిన తర్వాత, అందరూ అక్కడ జమా అయ్యారు. ఎవరైతే తమ ఈ శబ్దం విని వెళ్లేటువంటి స్థితిలో లేడో, ఎవరినైనా కనీసం పంపేవాడు. వారిలోనే ఒకడు అబూ లహబ్ కూడా వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తన యొక్క సత్యతను నిరూపించారు. ప్రవక్త చెప్పారు? “నేను ఇప్పుడు ఈ ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను. మీరు కొండ కింద ఇటువైపున ఉన్నారు. ఒకవేళ నేను చెప్పానంటే, అటువైపు నుండి ఒక సైన్యం ఉదయమో, సాయంకాలమో మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది అని నేను చెప్పేది ఉంటే, మీరు నా మాటను నమ్ముతారా?” అందరూ ఏకంగా, ఏకధాటిగా, ఏకమాటతో అన్నారు: “ఎన్నడూ కూడా నీవు అబద్ధం చెప్పినట్లు మేము వినలేదు. కనుక నీ మాటను సత్యంగా నమ్ముతాము.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

فَإِنِّي نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ
[ఫఇన్నీ నదీరుల్ లకుమ్ బైన యదై అదాబిన్ షదీద్]
“మీ ముందు ఉన్నటువంటి ఘోరమైన, భయంకరమైన శిక్ష నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు గనుక విగ్రహారాధన వదులుకోకుంటే, బహుదైవారాధన వదులుకోకుంటే, మనందరి ఏకైక సృష్టికర్త అల్లాహ్‌ను ఆరాధించకుంటే, మీరు ఈ శిక్షకు, విపత్తుకు గురి అవుతారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వెంటనే, అందరూ ముస్లింలు కాలేదు, బహుదైవారాధనను వదిలి ఏకదైవారాధన, తౌహీద్‌ను, అల్లాహ్ యొక్క ఆరాధనను స్వీకరించలేదు కానీ కనీసం మాట విన్నారు, మౌనం వహించారు. కానీ వారందరిలోకెల్లా ఈ ఒకే ఒక్క దుష్టుడు అందరి ముందు నిలబడి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాపనార్థాలు పెడుతూ, “అలి హాదా జమాతనా? తబ్బన్ లక్!” (నీవు నాశనమవు గాక! ఇందుకేనా మమ్మల్ని పోగు చేసినది? ఇక్కడకి పిలిచినది?) అని తన యొక్క ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ సూరత్, సూరతుల్ లహబ్ (మసద్) అవతరింపజేశాడు. “అబూ లహబ్ యొక్క చేతులు విరిగిపోవుగాక!” ఒకరి నాశనం గురించి, ఒకరి యొక్క నష్టం గురించి చెప్పదలచినప్పుడు, చేతులు విరిగిపోయాయి అన్నట్లుగా చెప్పడం ఇది ఒక సామెతగా ఉండింది. ‘తబ్బన్‘ అని అబూ లహబ్ ఏ పదాలైతే ఉపయోగించాడో, అవే పదాలతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇక్కడ అతన్ని సంబోధించాడు.

సోదర మహాశయులారా, అబూ లహబ్ యొక్క చెడు గుణం, అతని యొక్క శత్రుత్వం యొక్క సంఘటనలు చాలా ఉన్నాయి. సూరా అవతరణకు ఒక కారణంగా సహీహ్ బుఖారీలోని హదీథ్ మీ ముందు పెట్టడం జరిగింది. అబూ లహబ్ మరియు అతని యొక్క భార్య ఉమ్మె జమీల్, ఆమె పేరు అర్వా. ఇద్దరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎన్నో రకాలుగా బాధ కలిగిస్తూ ఉండేవారు. బాధ కలిగిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పొరుగులోనే ఉన్నాడు అతను. ప్రవక్త ఇల్లు మరియు అతని యొక్క ఇల్లు మధ్యలో కేవలం ఒక గోడ. ఆ అరబ్బులో ఉన్నటువంటి ఒక మంచి గుణం పొరుగువారిని కూడా పలకరించడం, వారి పట్ల మేలు చేయడం. అంతే కాదు అరబ్బులో ఉన్నటువంటి మరొక ఉత్తమ గుణం ఏమిటి? తండ్రి చనిపోయిన తన సోదరుని కొడుకును తన సంతానంగా భావించి, సంతానం మాదిరిగా చూసుకునేవారు. కానీ ఈ దుష్టుడు ఆ ఉత్తమ గుణాన్ని కూడా కోల్పోయి, స్వయం సోదరుడు అబ్దుల్లా యొక్క కొడుకు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, పొరుగువాడు, నాకు దగ్గరివాడు అన్నటువంటి భావన కూడా లేకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దారిలో ముళ్లకంప వేయడం గానీ, పై నుండి ఏదైనా వస్తువులు పడవేసి బాధ కలిగించడం గానీ ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది కలిగించేవాడు.

అంతేకాదు, రెండో ఆయతులో గమనించండి:

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
అతనికి అతని యొక్క ధనం, సొమ్ము గానీ, అతని సంపద గానీ ఏమీ ప్రయోజనం చేకూర్చలేదు.

సోదర మహాశయులారా, ఒకవేళ మనం గమనించామంటే ఇక్కడ కూడా, అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ అబూ లహబ్ అతని వద్ద చాలా ధనం ఉండింది మరియు అతడు పిసినారి కూడా. కానీ ఏమనేవాడు? నా ఇంత ధనం, నా యొక్క ఇంత డబ్బు, నేను ముహమ్మద్ కు వ్యతిరేకంగా నేను ఉపయోగిస్తాను. అతని యొక్క భార్య ఆమె మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. అవసరం పడితే నేను వీటిని అమ్మేసి, ముహమ్మద్ కు వ్యతిరేకంగా నేను సల్లల్లాహు అలైహి వసల్లం, ఉపయోగిస్తాను అని కూడా చెబుతూ ఉండేవారు వీరిద్దరూ.

అంతే కాదు, ఇందులో హెచ్చరిక మరో రకంగా చూస్తే, “వమా కసబ్” (అతను సంపాదించినది). సర్వసాధారణంగా ఇహలోకంలో మనం చూస్తాము, మనిషి అతడు సంపాదించిన డబ్బు, ధనం, సొమ్ము గానీ లేదా అతని యొక్క హోదా, అంతస్తు ఇంకా ఇలాంటివి ఏవైనా గానీ వాటి ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తాడు. అవి అతనికి ప్రయోజనం కలుగజేయాలనే చూస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే నరక శిక్ష నుండి విముక్తిని పొందరో, అలాంటి వారికి వారి యొక్క ధనం, వారి యొక్క సంపద అంతా కూడా మరింత వారి శిక్షను పెంచడానికే ఉపయోగపడుతుంది. వారి యొక్క శిక్ష మరింత ఎక్కువగా పెరగడానికే అది కారణమవుతుంది. అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా, ఇస్లాం ధర్మ వ్యాప్తికి వ్యతిరేకంగా ఇంత శత్రుత్వం వహించాడు. అతనికి సంతానం కూడా ఉండినది, సమాజంలో ఒక పలుకుబడి కూడా ఉండినది. కానీ అదంతా అతనికి ఏమైనా ప్రయోజనం కలుగజేసిందా? కలుగజేయలేదు.

అతడు భయపడి స్వయంగా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. అతనికి ఆస్ ఇబ్న్ వాఇల్ నుండి 4000 రావాల్సి ఉంది. ఇక అతడు ఇచ్చే స్థితిలో లేడు అని, నీవు ఆ డబ్బులకు బదులుగా, నీవు వెళ్లి అందులో పాల్గొను అని చెప్పాడు. అందులో అవిశ్వాసులు పరాజయానికి పాలయ్యారు, ఓడిపోయారు. ఆ ఓడిపోయిన బాధ కూడా అతనికి ఎంతగా కలిగిందంటే, ఆ తర్వాత అతను వారం పది రోజుల్లోనే నాశనమయ్యాడు. ఏ విధంగా? అతనికి ఒక భయంకరమైన అంటువ్యాధి సోకింది. ఆ అంటువ్యాధిలోనే అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరం కుళ్లిపోయి, కంపులేసింది. అతని యొక్క సంతానం కూడా దగ్గరికి వచ్చి, అతన్ని పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. కొన్ని చరిత్ర పుటల్లో ఉన్న ప్రకారం, కొందరు బానిసలకు కొంత డబ్బు ఇచ్చి, ఒక గొయ్యి తవ్వి కొన్ని కట్టెల సహాయంతో అతన్ని నెట్టేసి, ఆ గుంతలో పడవేయడం జరిగింది. తర్వాత మట్టి, రాళ్లు వేసి పూడ్చివేయడం జరిగింది. అంటే అతని యొక్క శవాన్ని కూడా స్వయం సంతానం దగ్గరికి వచ్చి ముట్టుకోలేనటువంటి స్థితి. ఒక భయంకరమైన అంటువ్యాధిలో చనిపోవడం, అవిశ్వాస స్థితిలో చనిపోవడం. ఆ సమయంలో కూడా అతని యొక్క ధనం, సొమ్ము, డబ్బు, సంపద ఏమీ కూడా అతనికి ప్రయోజనం కలుగజేయలేదు.

సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుత్ తౌబాలో కూడా చాలా స్పష్టంగా తెలిపి ఉన్నాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క ధర్మానికి వ్యతిరేకంగా డబ్బు, ధనాన్ని, ఉన్నటువంటి పలుకుబడిని దుర్వినియోగం చేస్తాడో, సూరతుల్ అన్ఫాల్ ఆయత్ నంబర్ 36లో అల్లాహ్ తెలిపాడు:

إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ
నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్‌ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. (8:36)

ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు తమ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను అడ్డుకోవడానికి. పెట్టండి, ఖర్చు పెడుతూ ఉండండి. ఇది మీ కొరకు ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ మరియు ఎంతో కుమిలిపోయేటువంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకువస్తుంది. అంతే కాదు, ఇహలోకంలో ఓడిపోతారు, పరాజయానికి పాలవుతారు. మరియు ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగడతారో, వారందరినీ కూడా నరకంలో త్రోసివేయడం జరుగుతుంది. ఈ విధంగా డబ్బు, ధనం అతనికి ఏ ప్రయోజనం కలుగజేయలేదు.

ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు:

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
“త్వరలోనే అతడు భగభగ మండేటువంటి నరకాగ్నికి ఆహుతి అవుతాడు.”

సోదర మహాశయులారా, ఈ సూరా ఖురాన్, ఇస్లాం ధర్మం సత్యం అన్నదానికి గొప్ప నిదర్శనం అని ఏదైతే చెప్పామో, గమనించండి. ఇక్కడ అతను నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అని అతని బ్రతికి ఉన్న కాలంలోనే చెప్పడం జరిగింది. ఈ సూరా అవతరించిన తర్వాత సుమారు ఐదారు, ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు అతడు బ్రతికి ఉన్నాడు కానీ, ఇస్లాం స్వీకరించలేదు. ఇస్లాం స్వీకరించేది ఉంటే, అతని గురించి చెప్పబడిన ఈ హెచ్చరిక తప్పు పోయేది. ఖురాన్ ఒక తప్పు అని, అసత్యం అని మాట వచ్చేది. ఆ భాగ్యం అతనికి కలగలేదు. ‘లహబ్‘ అగ్ని, జ్వాలను కూడా అంటారు.

అలాగే సోదర మహాశయులారా, అతడు అతని యొక్క అందచందాల రీత్యా అతని యొక్క ముఖం ఏదైతే మెరుస్తూ ఉండేదో దానికి గర్వంగా అతడు ‘అబూ లహబ్’ అన్నటువంటి బిరుదుకు చాలా సంతోషించేవాడు. అయితే, అతని యొక్క ఆ కుఫ్ర్, అవిశ్వాసం, సత్యానికి, సత్య ధర్మానికి శత్రుత్వం కారణంగా, అతని పేరు లాంటి పలుకులతోనే అల్లాహ్ అతనికి హెచ్చరిక ఇస్తున్నాడు, “నారన్ జాత లహబ్” – ‘లహబ్’ అంటే ఏంటి? నిప్పు, అగ్ని. అందులో అతడు త్వరలోనే ప్రవేశిస్తాడు అని ఇక్కడ హెచ్చరిక ఇవ్వడం జరిగింది.

అతడు ఒక్కడే కాదు,

وَامْرَأَتُهُ
[వమ్ర అతుహు]
“అతని భార్య కూడా.”

ఇక వినండి, ఎవరైతే చెడుకు తోడుపడతారో, చెడు నుండి అడ్డుకునేదానికి బదులుగా ఒకరికి బాధ కలిగించడంలో తోడుపడతారో, వారు అల్లాహ్ తో భయపడాలి. అబూ లహబ్ యొక్క భార్య ఏం చేసేది? ఇహలోకంలో ప్రవక్తకు వ్యతిరేకంగా, తన భర్తకు సహాయపడుతూ ఉండేది. అందుకొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమె కూడా నరకంలో ప్రవేశిస్తుంది అని హెచ్చరిక ఇచ్చాడు.

حَمَّالَةَ الْحَطَبِ
[హమ్మాలతల్ హతబ్]

‘హమ్మాలతల్ హతబ్’ అనే పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో, దీనికి ఒకటి కంటే ఎక్కువ భావాలు ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్టే. ఒకటేమిటి? ఇహలోకంలో ముళ్లకంప, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారిలో వేస్తూ ఉండేది ఆమె. దాని గురించి చెప్పడం జరిగింది. ‘హమ్మాలతల్ హతబ్’ అన్నది ఒక సామెతగా కూడా అరబ్బులో వాడుతూ ఉండేవారు, దేని గురించి? ఎవరైతే చాడీలు చెప్తారో, పరోక్ష నిందలు చేస్తారో, ఆమె యొక్క అలవాటు ప్రవక్తకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండేది.

ఇక్కడ మరొక భావం ఏమిటంటే, అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఇంకా వేరే కొందరితో కూడా తఫ్సీర్లో వచ్చి ఉంది. ఇహలోకంలో ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు వ్యతిరేకంగా తన భర్తకు సహాయపడింది గనుక, నరకంలో ఉండి ఆమె యొక్క భర్త శిక్ష అధికం కావడానికి అక్కడ కూడా నరకంలోని కట్టెలు తీసుకువచ్చి ఇంకా అతనిపై వేస్తూ ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం వ్యాప్తి కొరకు, ఇస్లాం ధర్మ ప్రచారం కొరకు పరస్పరం చేదోడు వాదోడుగా ఒకరికి మరొకరు తోడుపడి సహాయం అందించే వారి పుణ్యాత్ముల్లో చేర్చుగాక.

ఇంతకుముందు నేను తెలిపినట్లు, ఆమె యొక్క మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. వాటిని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ తిరిగేది, ఇవి అమ్మి నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు వ్యతిరేకంగా డబ్బులు ఉపయోగిస్తాను అని. అలాంటి మాట మరియు పదంతోనే, నగలు వేసుకొని ఒక తప్పుడు విషయంలో నీవు ఏదైతే గర్వపడుతున్నావో, నీ ఆ మెడలో నరకాగ్నిలోని ఒక పేనిన మంచి త్రాడు, గట్టిగా, బలమైన ఒక త్రాడు నీ మెడలో ఉంటుంది అని ఈ విధంగా ఆమెను అవమానపరచడం కూడా జరిగింది.

సోదర మహాశయులారా, వీటన్నిటి ద్వారా మనకు తెలిసిన అసలైన బోధ ఏమిటో మీరు గ్రహించారు కదా? మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని దానికి ప్రాధాన్యత ఇచ్చి, దానికి గౌరవం ఇచ్చి, దానికి తోడుపడే ప్రయత్నం చేయాలి కానీ వ్యతిరేకించే ప్రయత్నం చేయకూడదు. మరొక విషయం ఇక్కడ తెలిసింది మనకు ఈ సూరత్ ద్వారా, ఇస్లాంలో బంధుత్వం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది కానీ, ఒకవేళ వారు అవిశ్వాసులయ్యేది ఉంటే ఇహలోకంలో మానవ రీత్యా వారితో సత్సంబంధాలు ఉన్నా గానీ, వారి యొక్క అవిశ్వాస కారణంగా వారు ప్రళయ దినాన ఏ మాత్రం ఎవరికీ ప్రయోజనం కలుగజేయలేరు. అలాగే అవిశ్వాసంపై ఉన్నవారికి ఇహలోకంలో ఏదైనా లాభం చేకూరుస్తారో కానీ, పరలోకంలో విశ్వాసులు కూడా తమ అవిశ్వాసులైన బంధువులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేరు. ఈ భావంలో ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

ఈ సూరత్ మరియు ఆయతుల ద్వారా మనకు తెలిసిన మరొక బోధన ఏమిటంటే, మనిషి డబ్బు, ధనం, సంపాదన మరియు ఈ లోకంలో సంపాదించినటువంటి వేరే హోదా, అంతస్తులు, పలుకుబడి వీటన్నిటి గర్వంలో పడి సత్యాన్ని త్రోసిపుచ్చకూడదు. వీటి గర్వంలో పడి సత్యాన్ని తిరస్కరించకూడదు. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే, ఈ లోకంలో ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, శిక్ష వచ్చి పడడంలో ఆలస్యం అయితే, శిక్ష రాదు అని అనుకోకూడదు. అబూ లహబ్ బ్రతికి ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వెంటనే శిక్ష పడలేదు కానీ, అతనికి ఈ శిక్ష అనేది ఖాయం, దానికి అతడు ఆహుతి అవుతాడు.

అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ మన చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్ని రకాల మేళ్లు ప్రసాదించి, అన్ని రకాల ఆపదల నుండి, కీడుల నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని కాపాడుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

చూడండి, అబూ లహబ్ యొక్క అసలు పేరు అబ్దుల్ ఉజ్జా. ‘అబూ’ అని అంటే తండ్రి అన్న భావం వస్తుంది కానీ, అరబీ భాష ప్రకారంగా ‘అబూ’ మరియు ‘ఉమ్’ తండ్రి, తల్లి కాకుండా వేరే పదాలతో ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో, అక్కడ వేరే భావాలు కూడా వస్తాయి. ఇక్కడ అసలు ఉద్దేశం, ఇది అతని యొక్క ఒక బిరుదుగా చాలా ప్రఖ్యాతి గాంచిపోయింది.

జజాకుముల్లాహు ఖైరా. సుబ్ హా నకల్లాహుమ్మ వబిహందిక అష్హదు అల్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/