598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర పండ్లను (దానంగా ఇవ్వడానికి) తీసుకు వచ్చారు. మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకు వచ్చాడు. అప్పుడు కొందరు కపట విశ్వాసులు (కారుకూతలు కూస్తూ) “దేవునికి అతని (అంటే అబూ అఖీల్ తెచ్చిన) దానం అవసరంలేదు (ఆయన ఇలాంటి అల్పదానాన్ని ఖాతరు చేయడు), రెండవ వ్యక్తి పేరు ప్రతిష్ఠల కోసం (దానం) చేశాడు” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ ధైవవచనం అవతరించింది:
“మనస్పూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధన త్యాగాలను గురించి వారు ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవమార్గంలో దానమిస్తున్న (నిరుపేద) విశ్వాసుల్ని ఎగతాళి చేస్తున్నారు. (అలా ఏకసక్కెం, ఎగతాళి చేస్తున్న ఈ పిసినారుల సంగతి అల్లాహ్ కి బాగా తెలుసు). దేవుడే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారి కోసం దుర్భరమైన (నరక) శిక్ష కాచుకొని ఉంది.” (ఖుర్ఆన్ – తౌబా : 79 )