ప్రళయదినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి? [మరణానంతర జీవితం – పార్ట్ 21 & 22] [ఆడియో & టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో] [43:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?

దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసులను పరిశీలిస్తే, అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి. మొదటిది, స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది. రెండవది, మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది. మూడవది, మనిషి కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది.

ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి? లాభం ఏమిటంటే, ఈ మూడిటిలో ఏ ఒకటైనా గాని లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో, ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు, విశ్వాసం మరియు సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్యాలు బరువుగా ఉంటాయి. మరియు ఎవరి పల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. మరి ఎవరి పల్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు.

దీని గురించి ఆయతులు సూరె అన్ఆమ్ లో, సూరె అంబియాలో, సూరతుల్ ముఅ్‌మినూన్ లో మరియు అల్ ఖారిఆ సూరాలో ఉన్నాయి:

فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَهُوَ فِيْ عِيْشَةٍ رَّاضِيَةٍ
“ఎవరి కర్మ పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చిన, మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో.”

وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُمُّهٗ هَاوِيَةٌ
“మరియు ఎవరి కర్మ పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది.”

وَمَآ اَدْرٰىكَ مَا هِيَهْ
“ఆ హావియా అంటే ఏమి తెలుసు నీకు?”

نَارٌ حَامِيَةٌ
“అది భగభగ మండే నరకాగ్ని.”

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించు గాక. ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక దొంగ, ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థం అవుతుందో, అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు, కర్మ పత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది, రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేయడం జరుగుతుంది—ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో, ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో, అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము. ఈ పరలోకానికి సంబంధించిన, మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి? ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది. దీన్ని గనక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాలలో ఇంకా ముందుకు ఎగసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము.