అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్ – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

14వ అధ్యాయం
అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించ లేని ఏ శక్తిని వేడుకోకు. ఒక వేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు“. (యూనుస్ 10 : 106,107).

 إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ

అల్లాహ్ ను కాదని మీరు ఆరాధిస్తున్నవి మీకు ఏ ఉపాధినీ ఇచ్చే అధికారం కలిగి లేవు, ఉపాధి కొరకు అల్లాహ్ ను అడగండి!” (అన్ కబూత్ 29 : 17).

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ మార్గభ్రష్టుడైన వాడు ఎవడు? మానవులందరిని సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46: 5,6).

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ

బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు?.” (నమ్ల్  27: 62).

తబ్రానీలో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక కపటవిశ్వాసి విశ్వాసులకు చాలా బాధకలిగించేవాడు. ఒకసారి సహచరులు “పదండి! మనం ప్రవక్తతో ఈ కపటవిశ్వాసి గురించి మొరపెట్టుకుందాము” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు: “నాతో కాదు మొర పెట్టుకోవలసింది. అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి“.

ముఖ్యాంశములు:

1. “దుఆ” (ప్రార్థన) సర్వ సామాన్యమైనది. కాని “ఇస్తిగాస” (మొర) ప్రత్యేకించబడినది.

2. సూరె యూనుస్ లోని ఆయత్ (అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని ……….) యొక్క భావం తెలిసింది.

3. అదే షిర్క్ అక్బర్ .

4. పుణ్యపురుషుడు, మహాభక్తుడు అల్లాహ్ యేతరులతో వారి సంతృప్తి కొరకు మొరపెట్టుకుంటే అతడు కూడా దుర్మార్గులలో కలసిపోతాడు.

5. సూరె యూనుస్ లోని రెండవ ఆయతు (అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే …..) యొక్క భావం తెలిసింది.

6. అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకుంటే వారు ఏ లాభమూ చేకూర్చలేరు. అది అవిశ్వాసం కూడాను.

7. అన్ కబూత్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి…….) యొక్క భావం కూడా తెలిసింది.

8. స్వర్గం అల్లాహ్ తో కోరినట్లు, ఉపాధి కూడా అల్లాహ్ తో మాత్రమే కోరాలి.

9. అహ్ ఖాఫ్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి……..) యొక్క భావం తెలిసింది.

10. అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేసిన వానికంటే ఎక్కువ దుర్మార్గుడు, భ్రష్టుడు మరొకడు లేడు.

11. ఎవరితోనైతే మొరపెట్టుకొనడం జరుగుతుందో వారు మొరపెట్టుకునే వారిని ఎరుగరు.

12. ఇహలోకంలో మొరపెట్టుకోవటం, పరలోకంలో వారి పరస్పర ద్వేషానికి, శతృత్వానికి కారణమగును.

13. అల్లాహ్ ను వదలి ఇతరులను మొరపెట్టుకొనుట వారి ఆరాధన చేసినట్లు అగును.

14. మొరపెట్టుకోబడినవాడు ఈ మొరను తిరస్కరిస్తాడు.

15. ఇదే పరమ మార్గభ్రష్టత్వానికి కారణం.

16. అహ్  ఖాఫ్ వాక్యం (బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు……….) యొక్క భావం తెలిసింది.

17. చాలా ఆశ్చర్యకరమైన విషయం: కష్ట కాలాలలో అల్లాహ్ తప్ప ఎవరూ వినరని విగ్రహరాధకులు సయితం ఒప్పుకుంటారు. అందుకే ఆ సమయాల్లో అల్లాహ్ తోనే చిత్త శుద్ధితో మొరపెట్టుకుంటారు. (కాని ఈనాటి సమాధి పూజారులైన ముస్లింల విషయం బాధకరమైనది. అల్లాహ్ వారికి తౌహీద్ మార్గం చూపుగాక!).

18. పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తౌహీద్ ను అన్ని రకాల షిర్క్ నుండి దూరముంచడానికి చాలా ప్రయత్నం చేశారు. అల్లాహ్ తో ఏలాంటి మర్యాద పాటించాలో నేర్పారు.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

పదవ అధ్యాయం లోని తాత్పర్యంలో తెలుపబడిన షిర్క్ అక్బర్ యొక్క పరిచయాన్ని నీవు అర్థం చేసుకొనియుంటే 12, 13, 14వ అధ్యాయాలు కూడా అర్థం చేసుకోగలవు.

మొక్కుబడి ఒక ఆరాధన. దాన్ని పూర్తి చేసిన వారిని అల్లాహ్ ప్రశంసించాడు. అల్లాహ్ విధేయత కొరకు మొక్కుకున్న మొక్కు బడి పూర్తి చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు.

ఏ పని గురించి ధర్మం ఆదేశించిందో, లేక అది చేసినవారిని ప్రశంసించిందో అది ఇబాదత్. మరొకసారి ఇబాదత్ (ఆరాధన) పరిచయాన్ని (భావాన్ని) గుర్తుంచుకొండి: “అల్లాహ్, ఇష్టపడే, తృప్తి చెందే ప్రతీ బాహ్య, ఆంతర్య మాటలు, చేష్టలు“.

అన్ని రకాల కీడు నుండి అల్లాహ్ శరణు మాత్రం కోరాలని అల్లాహ్ ఆదేశించాడు. ఇది ఇబాదత్. అల్లాహ్ తో శరణు కోరితే దాన్ని తౌహీద్ , విశ్వాసం అంటారు. ఇతరులతో కోరితే షిర్క్ అంటారు.

దుఆ మరియు మొరపెట్టుకొనుటలో వ్యత్యాసం ఏమనగా: దుఆ అన్ని పరిస్థితులకు ఉపయోగపడుతుంది. కష్టకాలాల్లో మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నియు పూర్తి చిత్తశుద్ధితో అల్లాహ్ తోనే చేయాలి. ఆయనే దుఆలు వినేవాడు. అంగీకరించేవాడు. కష్టాలను తొలగించువాడు. శక్తి లేని దాని గురించి దైవదూత, వలీలతో మొరపెట్టుకునేవాడు ముష్రిక్, కాఫిర్ అవుతాడు. ధర్మభ్రష్టుడవుతాడు. సృష్టిలో ఎవరి వద్ద కూడా స్వయంగా తనకు, లేక ఇతరులకు లాభనష్టాలు చేకూర్చే ఏ శక్తి లేదు. అందరూ అన్ని విషయాల్లో అల్లాహ్ ఎదుట బీదవాళ్ళే.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా?? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా??
https://www.youtube.com/watch?v=Me4Hujjsn2A [4నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఈ వీడియో ఇస్తిఘాసా (సహాయం కోసం అర్ధించడం, మొరపెట్టుకొనటం) అనే ఇస్లామీయ భావనను వివరిస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుందని ప్రవక్త స్పష్టం చేశారు: అనుమతించబడినది మరియు నిషిద్ధమైనది. ఒక వ్యక్తి తన సామర్థ్యం పరిధిలో ఉన్న విషయాల కోసం జీవించి ఉన్న మరో వ్యక్తి సహాయం కోరడం అనుమతించబడినది. కానీ, కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాల కోసం అల్లాహ్ ను కాకుండా ఇతరులను (ప్రవక్తలు, ఔలియాలు, బాబాలు) వేడుకోవడం నిషిద్ధం, మరియు ఇది షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుంది. ప్రసంగంలో ఈ రెండు అంశాలను సమర్థించడానికి ఖురాన్ నుండి నిదర్శనాలు కూడా ఉదహరించబడ్డాయి.

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. ప్రియమైన ప్రేక్షకులారా, అల్లాహ్ యేతరులతో, అల్లాహ్ ను కాకుండా ఔలియా అల్లాహ్ తో, బాబాలతో, ఇలాంటి వారితో మొరపెట్టుకొనుట పాపమా?

చూడండి, అరబీలో ఇస్తిఘాసా అని ఒక పదం ఉపయోగపడుతుంది. దానిని ఉర్దూలో ఫరియాద్ కర్నా అంటే సహాయానికై ఎవరినైనా అర్ధించటం, మొరపెట్టుకొనటం. కష్టంలో ఉన్నప్పుడు, మనిషి ఆపదలో ఉన్నప్పుడు మొరపెట్టుకొనుట దీనిని ఇస్తిఘాసా అంటారు.

అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, కొన్ని కష్టాలు అవి దూరమగుటకు మనలాంటి మానవులు, మనకంటే మంచి వాళ్ళు, పుణ్యాత్ములు, బ్రతికి ఉన్నవారు మనకు సహాయం చేసి ఆ కష్టం దూరం అవ్వడంలో మనకు వారి యొక్క సహాయతను అందించగలుగుతారు. అలాంటి వాటిలో వారిని సహాయం గురించి మనం అర్ధించడం, మొరపెట్టుకొనటం తప్పులేదు.

ఇదే విషయాన్ని అల్లాహు త’ఆలా సూరతుల్ ఖసస్, సూరహ్ నంబర్ 28, ఆయత్ నంబర్ 15 లో తెలిపాడు. మూసా అలైహిస్సలాం వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి అతనిపై ఈజిప్ట్ దేశానికి సంబంధించిన అక్కడి వాస్తవ్యుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు

فَاسْتَغَاثَهُ الَّذِي مِنْ شِيعَتِهِ
(ఫస్తగాసహుల్లజీ మిన్ షీ’అతిహి)
అప్పుడు అతని వర్గానికి చెందిన వ్యక్తి శత్రు వర్గానికి చెందిన వ్యక్తికి వ్యతిరేకంగా సహాయం కోసం అతనిని (మూసాను) పిలిచాడు.

మూసా అలైహిస్సలాం వంశానికి సంబంధించిన వ్యక్తి మూసా అలైహిస్సలాం తో ఇస్తిఘాసా చేశాడు. అంటే సహాయం కొరకు అతడు మొరపెట్టుకున్నాడు. మూసా అలైహిస్సలాం వెళ్ళి అతనికి సహాయపడ్డాడు.

కానీ మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము, ఎన్నో సందర్భాలలో మనపై వచ్చే కొన్ని ఆపదలు, కష్టాలు ఎలా ఉంటాయి? అవి కేవలం అల్లాహ్ తప్ప మరెవరూ దానిని దూరం చేయలేరు. అలాంటి వాటిలో కేవలం అల్లాహ్ నే మొరపెట్టుకోవాలి. అల్లాహ్ నే అర్ధించాలి. అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరాలి. ఆయన తప్ప ఇంకా వేరే ఏ ప్రవక్తను గానీ, ఏ అల్లాహ్ యొక్క వలీని గానీ, ఏ బాబాలను గానీ, ఏ పీర్ ముర్షిదులను గానీ మొరపెట్టుకోరాదు.

సూరతుల్ అన్ఫాల్ సూరహ్ నంబర్ 8, ఆయత్ నంబర్ 9 లో

إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ
(ఇజ్ తస్తగీసూన రబ్బకుం ఫస్తజాబ లకుం)
మీరు మీ ప్రభువు సహాయం కోసం మొరపెట్టుకున్నప్పుడు, ఆయన మీకు సమాధానమిచ్చాడు.

ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే మీరు అల్లాహ్ తో మొరపెట్టుకుంటున్నారో అల్లాహ్ మీకు సమాధానం ఇచ్చాడు, మీకు సహాయం అందించాడు. మీరు ఆ యుద్ధంలో గెలుపొందడానికి, విజయం సాధించడానికి అన్ని రకాల మీకు సహాయపడ్డాడు.

చూసారా? స్వయంగా ఖురాన్ లో ఈ బోధన మనకు కనబడుతుంది. ఏ విషయంలోనైతే ఒకరు మనకు సిఫారసు చేయగలుగుతారో, ఒకరు మనకు సహాయం చేయగలుగుతారో వాటిలో మనం వారిని మొరపెట్టుకొనుట ఇది తప్పు కాదు.

కానీ ఈ రోజుల్లో ప్రజలలో అలవాటుగా అయిపోయింది. యా గౌస్, యా అలీ అల్-మదద్ ఇలాంటి మాటలు, ఇలాంటి పుకార్లు, ఇలాంటి సహాయం కొరకు అర్ధింపులు ఇవి ఏ మాత్రం యోగ్యం కావు, ధర్మసమ్మతం కావు. ఇవి హరాంలో లెక్కించబడతాయి, షిర్కులోకి వచ్చిస్తాయి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/p=8811

దర్గాలు, సమాధులు, ఔలియాల వాస్తవికత:
https://teluguislam.net/graves-awliya/

యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0IUeQVvT8sjlYDsK6O9rFF