మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.