[డౌన్ లోడ్ PDF]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
1) హిజ్రత్ అర్థం
2) హిజ్రత్ విశిష్టత
3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది
4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు.
మొదటి ఖుత్బా
ధార్మిక సహోదరులారా!
హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి.
హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం ‘వదలిపెట్టడం‘ అని.
అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ
“మరియు పడక గదులలో వారిని వదిలిపెట్టండి” (నిసా : 34)
‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు:
“అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”.
అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు:
“షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.”
బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు.
“అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది.
“అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి : 1/54)
ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు:
“హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”

You must be logged in to post a comment.