707. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-
“దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుడు చేసే సత్కార్యాలన్నీ తన కోసమే ఉన్నాయి. అయితే ఉపవాసం సంగతి అలా కాదు.ఉపవాసం నాకోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను – ఉపవాసం ఒక డాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే వారు అశ్లీలపు పలుకులు పలకరాదు, పోట్లాటల్లో దిగకూడదు; ఎవరైనా దూషిస్తే లేక జగడానికి దిగితే అలాంటి వ్యక్తితో తాము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పాలి.”
“ఎవరి అధీనంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఉపవాసకుడి నోటి వాసన దేవుని ద్రుష్టిలో కస్తూరి సువాసన కంటే ఎంతో శ్రేష్ఠమైనది. ఉపవాసి రెండు సందర్భాలలో అమితానందం పొందుతాడు. ఒకటి : ఉపవాసం విరమిస్తున్నప్పుడు. రెండు : తన ప్రభువును సందర్శించినపుడు ఉపవాస పుణ్యఫలం చూసి”.