షైతాన్ పై అజాన్ ప్రభావం

216. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు:-

అజాన్ చెప్పడం ప్రారంభించగానే షైతాన్ వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. (తీవ్రమైన భయాందోళనతొ) వాడికి అపానవాయువు వెలువడుతుంది.  దాంతో వాడు అజాన్ వినరానంత దూరం పారిపోతాడు. అయితే అజాన్ చెప్పడం అయిపోగానే వాడు మళ్ళీ (ప్రార్ధనా స్థలానికి) చేరుకుంటాడు. ఇఖామత్ చెప్పగానే తిరిగి తోకముడిచి పారిపోతాడు. ఇఖామత్ చెప్పడం అయిపోగానే మళ్ళీ వచ్చి మానవుని హృదయంలో దుష్టాలోచనలు రేకేత్తిస్తాడు. మనిషికి అంతకు ముందు గుర్తుకురాని విషయాలన్నిటినీ (నమాజు కోసం నిలబడగానే) గుర్తు చేస్తూ ‘ఇది జ్ఞాపకం తెచ్చుకో’, ‘అది జ్ఞాపకం తెచ్చుకో’ అని పురిగొల్పుతాడు. దాంతో మనిషికి (వాడి మాయజాలంలో పడిపోయి) తాను ఎన్ని రకాతులు పఠించానన్న సంగతి కూడా జ్ఞాపకం ఉండదు.

[సహీహ్ బుఖారీ : 10 ప్రకరణం – అజాన్, 4 వ అధ్యాయం – ఫజ్లిత్తాజీన్]

నమాజు ప్రకరణం – 8వ అధ్యాయం – అజాన్ ఔన్నత్యం – షైతాన్ పై దాని ప్రభావం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2

సకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఉపవాసం ఔన్నత్యం

707. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:-

“దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవుడు చేసే సత్కార్యాలన్నీ తన కోసమే ఉన్నాయి. అయితే ఉపవాసం సంగతి అలా కాదు.ఉపవాసం నాకోసం ప్రత్యేకంగా పాటించబడుతుంది. అందువల్ల నేను స్వయంగా దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాను – ఉపవాసం ఒక డాలు వంటిది. మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే వారు అశ్లీలపు పలుకులు పలకరాదు, పోట్లాటల్లో దిగకూడదు; ఎవరైనా దూషిస్తే లేక జగడానికి దిగితే అలాంటి వ్యక్తితో తాము ఉపవాసం పాటిస్తున్నామని చెప్పాలి.”

“ఎవరి అధీనంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం! ఉపవాసకుడి నోటి వాసన దేవుని ద్రుష్టిలో కస్తూరి సువాసన కంటే ఎంతో శ్రేష్ఠమైనది. ఉపవాసి రెండు సందర్భాలలో  అమితానందం పొందుతాడు. ఒకటి : ఉపవాసం విరమిస్తున్నప్పుడు. రెండు : తన ప్రభువును సందర్శించినపుడు ఉపవాస పుణ్యఫలం చూసి”.

[సహీహ్ బుఖారీ: 30 వ ప్రకరణం – సౌమ్, 9 వ అధ్యాయం – హల్ యఖూలు ఇన్నీ సాయిమున్ ఇజాసితుమ్ ?]

ఉపవాస ప్రకరణం – 30 వ  ప్రకరణం – ఉపవాసం ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్