మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర & షహాదత్ [ఆడియో]

మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర మరియు షహాదత్
https://youtu.be/ejJd6Qy1NWw [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, మూడవ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవితం మరియు ఘనత గురించి వివరించబడింది. ఆయన అల్లాహ్ పట్ల గల భయభక్తులు, ఆరాధన, మరియు దాతృత్వం గురించి ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్న కారణంగా ఆయనకు “జున్నూరైన్” (రెండు ప్రకాశాల యజమాని) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. హుదైబియా సంధి సమయంలో జరిగిన “బైఅతుర్ రిద్వాన్” (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)లో ఆయన ప్రాముఖ్యత, రూమా బావిని కొని ప్రజల కొరకు దానం చేయడం, మరియు తబూక్ యుద్ధం కోసం సైన్యాన్ని సిద్ధపరచడంలో ఆయన చేసిన అపారమైన సహాయం వంటి చారిత్రక సంఘటనలు ఉదహరించబడ్డాయి. ఆయన ఖిలాఫత్ కాలంలో ఖుర్ఆన్‌ను ఒక గ్రంథ రూపంలో సంకలనం చేయడం మరియు మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవీల విస్తరణ వంటి ఆయన చేసిన గొప్ప పనులను కూడా పేర్కొనడం జరిగింది. చివరగా, ఆయన అమరత్వం పొందిన విషాదకర సంఘటనను వివరిస్తూ, అంతర్గత కలహాలు (ఫిత్నా) యొక్క తీవ్రత గురించి హెచ్చరించి, ముస్లింలు ఐక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ. اَلْحَمْدُ لِلّٰهِ عَلَى نِعَمٍ تَتْرَى، وَعَلَى أَرْزَاقٍ لَا نُطِيقُ لَهُ حَصْرًا. وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، شَهَادَةً تَكُونُ لَنَا ذُخْرًا. وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُ اللهِ وَرَسُولُهُ الْمَخْصُوصُ بِالْفَضَائِلِ الْكُبْرَى. صَلَّى اللهُ عَلَيْهِ إِلَى يَوْمِ الْأُخْرَى. أَمَّا بَعْدُ. فَالتَّقْوَى وِقَاءٌ، وَلِبَاسُهَا خَيْرُ لِبَاسٍ.

(అల్ హందులిల్లాహ్. అల్ హందులిల్లాహి అలా నిఅమిన్ తత్రా, వ అలా అర్జాకిన్ లా నుతీకు లహూ హస్రా. వ అష్ హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్, షహాదతన్ తకూను లనా జుఖ్రా. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహుల్ మఖ్ సూసు బిల్ ఫదాయిలిల్ కుబ్రా. సల్లల్లాహు అలైహి ఇలా యౌమిల్ ఉఖ్రా. అమ్మా బ’అద్. ఫత్తఖ్వా వికావున్, వ లిబాసుహా ఖైరు లిబాస్.)

సమస్త ప్రశంసలు అల్లాహ్ కే శోభాయమానం. నిరంతరం కురుస్తున్న ఆయన అనుగ్రహాలకు, మనం లెక్కించలేనన్ని ఆయన జీవనోపాధులకు అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఈ సాక్ష్యం మా కొరకు (పరలోకంలో) ఒక నిధిగా ఉండుగాక. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త, ఆయన గొప్ప సద్గుణాలతో ప్రత్యేకించబడినవారు. ప్రళయదినం వరకు ఆయనపై (ప్రవక్తపై) అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక. ఇక ఆ తర్వాత. దైవభీతి ఒక రక్షణ కవచం, మరియు దాని వస్త్రం ఉత్తమమైన వస్త్రం.

ఈరోజు అల్లాహ్ యొక్క దయతో ఎలాంటి పుణ్యాత్ముని గురించి మనం తెలుసుకుంటామంటే, ఆయన అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేసేవారు. అల్లాహ్ యొక్క విధేయతలో చాలా ముందుగా ఉన్నవారు. రేయింబవళ్లు సజ్దాలో, ఖియాంలో ఉంటూ, పరలోకం పట్ల చాలా భయం కలిగి తన ప్రభువు యొక్క కారుణ్యాన్ని ఆశించేవాడు.

أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ
(అమ్మన్ హువ ఖానితున్ ఆనా అల్లైలి సాజిదవ్ వ ఖాయిమా, యహ్ జరుల్ ఆఖిరత వ యర్ జూ రహ్ మత రబ్బిహ్)
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?)(39:9)

హాఁ! ఆయనే, చాలా సిగ్గు బిడియం గల, దైవదూతలు సైతం ఆయనతో సిగ్గుపడే అటువంటి పుణ్యాత్ముడు, ప్రవక్త యొక్క సహచరుడు హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు). ఆయన షహీద్ (అమరవీరులు). ఆయన స్వర్గవాసులలో ఒకరు. ఆయన ఈ లోకంలో భూమిపై నడుస్తుండగానే ఆయన స్వర్గవాసి అన్నటువంటి శుభవార్త ఇవ్వడం జరిగింది.

అవును, సహీహ్ బుఖారీలో వచ్చినటువంటి హదీస్, హదీస్ నెంబర్ 2778. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ حَفَرَ رُومَةَ فَلَهُ الجَنَّةُ
(మన్ హఫర రూమత ఫ లహుల్ జన్నహ్)
“ఎవరైతే రూమా (బావిని) త్రవ్వుతారో, అతని కొరకు స్వర్గం ఉంది.”

وَمَنْ جَهَّزَ جَيْشَ العُسْرَةِ فَلَهُ الجَنَّةُ
(వ మన్ జహ్ హజ జైషల్ ఉస్రతి ఫ లహుల్ జన్నహ్)
“మరియు ఎవరైతే కష్టకాలంలో ఉన్న సైన్యాన్ని (తబూక్ యుద్ధ సైన్యాన్ని) సిద్ధపరుస్తారో, అతని కొరకు స్వర్గం ఉంది.”

తబూక్ యుద్ధ సందర్భంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఎవరైతే సైన్యాన్ని సిద్ధపరుస్తారో, సైన్యం కొరకు సహాయాలు అందిస్తారో, అలాంటి వారి కొరకు కూడా స్వర్గం అన్నటువంటి శుభవార్త ప్రవక్త ఇచ్చినప్పుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ బీరె రూమాను దాని యజమాని నుండి కొని అందరి కొరకు దానం చేశారు, వక్ఫ్ చేశారు. మరియు ఆ తబూక్ యుద్ధంలో 300 ఒంటెలు ఇంకా 10,000 దీనార్లు దానం చేశారు.

హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సుకుమార్తె అయినటువంటి రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొంతకాలం జీవితం గడిపిన తర్వాత, బద్ర్ యుద్ధం సందర్భంలో ఆమె చాలా అనారోగ్యానికి పాలైంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని ఆమె యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆమె అనారోగ్య సమయంలో ఆమె సేవలో ఉండడానికి వదిలారు. అంతేకాదు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ వీరులకు ఏ యుద్ధ ఫలం అయితే లభించిందో, యుద్ధ ఫలంలోని ఏ భాగం లభించిందో, అలాంటి ఒక భాగం ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారికి కూడా ప్రవక్త ఇచ్చారు. అయితే హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) అదే అనారోగ్యంలో ఆ బద్ర్ యుద్ధం సందర్భంలోనే చనిపోయింది.

ఆ తర్వాత వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సుకుమార్తె అయినటువంటి ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు త’ఆలా అన్హా)ను హజ్రత్ ఉస్మాన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ లోకంలో ప్రవక్త యొక్క కూతుర్లను ఒకరినొకరి ఇద్దరి కూతుర్లను పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావుడు వేరే మరెవ్వరూ లేరు. అందుకొరకే హజ్రత్ ఉస్మాన్ గారికి ‘జున్నూరైన్’ (రెండు ప్రకాశాల యజమాని) అన్నటువంటి బిరుదు లభించింది.

ఇక హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత ఆరవ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉమ్రా కొరకు బయలుదేరారు. అయితే మక్కా ఖురైషులు, అవిశ్వాసులు సహాబాలు, ప్రవక్త వారు ఉమ్రా చేయకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో వారితో సంధి కుదుర్చడానికి, మాట్లాడడానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని రాయబారిగా పంపడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వెంటనే ప్రవక్త ఆదేశం మేరకు బయలుదేరారు. ఎలాంటి తడబడాయించలేదు, ఏ రీతిలో కూడా వెనుక ఉండలేదు.

ఆ సందర్భంలో ఆయనకు తెలుసు, ఇక్కడ రాయబారిగా సంధి కుదుర్చడానికి వెళ్తున్నామంటే, అక్కడ మృత్యువును కూడా స్వీకరించడం లేదా వారు ఖైదీగా చేస్తే కూడా ఏమీ చేయలేక ఉండాలి. అలాంటి పరిస్థితులను గమనించి కూడా వెళ్లారు. అయితే ఎప్పుడైతే మక్కాలో ప్రవేశించారో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు), కాబా వైపున చూశారో, ఆ సందర్భంలో ఖురైష్ యొక్క పెద్దలు, నాయకులు, “ఓ ఉస్మాన్, నీవు మాతో, నీకు మంచి సంబంధం ఉంది. కనుక మేము నీకు తవాఫ్ చేయడానికి అనుమతిస్తున్నాము. కాబా యొక్క తవాఫ్ చేయాలంటే నీవు చెయ్యి. ఎలా మేము మిమ్మల్ని అడ్డుకోము.” కానీ, అల్లాహు అక్బర్! హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ సమయంలో ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? వారి వైపున చూస్తూ, వారితో చెప్పారు: “అల్లాహ్ సాక్షిగా, ఎప్పటివరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయరో, నేను తవాఫ్ చేయను.”

ఆ తర్వాత ఖురైష్ అతన్ని బంధించారు, అంటే పట్టుకున్నారు, ఆపుకున్నారు. ఆ సందర్భంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ చేయబడ్డారు, హతమయ్యారు, హత్య చేయబడ్డారు అన్నటువంటి ఒక పుకారు లేసినది. అయితే ఇటు సహాబాలందరికీ ఈ విషయం తెలిస్తే, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ కూడా జమా చేసి, మౌత్ (మరణం) కొరకు సిద్ధం అన్నటువంటి ‘బైఅత్’ (శపధం) తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి గొప్ప బైఅత్ మరొకటి కనబడలేదు. దానినే అల్లాహు త’ఆలా స్వయంగా ‘బైఅతుర్ రిద్వాన్’ అన్నటువంటి పేరు ఇచ్చాడు. చదవండి సూరతుల్ ఫత్హ్, ఆయత్ నంబర్ 18:

لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ
(లఖద్ రదియల్లాహు అనిల్ ముఅమినీన ఇజ్ యుబాయిఊనక తహ్ తష్ షజరతి ఫ అలిమ మా ఫీ కులూబిహిమ్)
(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. (48:18)

అయితే ఆ సందర్భంలో మరో చాలా గొప్ప సంఘటన, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గొప్ప ఘనత ఎంత స్పష్టమవుతుందో చూడండి. ఈ విషయం సహీహ్ బుఖారీలో వచ్చి ఉన్నది, హదీస్ నెంబర్ 3698, అలాగే ముస్నద్ బజ్జార్లో కూడా ఉంది. ఏంటి విషయం అది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరితో శపధం తీసుకుంటున్నారు. హజ్రత్ ఉస్మాన్‌కు బదులుగా ఆయన రక్తం యొక్క పరిహారం తీసుకోవడానికి మనమందరమూ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా. ఆ సమయంలో అక్కడ ఉస్మాన్ అయితే లేరు కదా! అయితే ప్రవక్త ఏం చేశారు? తమ కుడి చెయ్యిని పైకి లేపి, కుడి చేతిని తమ స్వయంగా ఎడమ చేతిపై కొడుతూ ఏం చెప్పారు? “ఈ కుడి చెయ్యి ఉస్మాన్ యొక్క చెయ్యి. ఉస్మాన్ కూడా నాతోని బైఅత్ చేస్తున్నారు” అన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచి, ఉస్మాన్ యొక్క ఘనతను ఇంత గొప్పగా చాటి చెప్పారు. ఈ సందర్భంలో ధర్మవేత్తలు ఏమంటున్నారు? అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! ప్రవక్త తమ కుడి చెయ్యిని ‘ఇది ఉస్మాన్ చెయ్యి’ అని ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆ చెయ్యి ఉస్మాన్ యొక్క చేతుల కంటే ఎంతో గొప్పదైనది.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక అబూబక్ర్, అబూబక్ర్ మరణించాక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖలీఫా అయ్యారు. వీరిద్దరి ఖలీఫాల తర్వాత, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) 72 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఖలీఫా అయ్యారు. 12 సంవత్సరాలు ఖిలాఫత్ నడిపించారు. వారి యొక్క ఖిలాఫత్ కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలలో, పుణ్య కార్యాలలో, ఖుర్ఆన్ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి, దాని యొక్క ఎన్నో కాపీలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు పంపడం, అంతేకాదు మస్జిద్-ఎ-హరామ్, మక్కతల్ ముకర్రమా, అలాగే మస్జిద్-ఎ-నబవీ, మదీనా ఈ రెండిటినీ కూడా చాలా విస్తీర్ణం చేశారు. అక్కడ వస్తున్న నమాజీల కొరకు, హజ్ ఉమ్రాలు చేసే వారి కొరకు, దాని యొక్క దర్శన కొరకు వచ్చే వారి కొరకు చాలా ఇరుకుగా అవుతుంది అని దానిని ఇంకా పెద్దగా పెంచారు.

అల్లాహు అక్బర్! వాస్తవానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క సీరత్, వారి యొక్క జీవిత చరిత్రలో చాలా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, అల్లాహు త’ఆలా, ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క చివరి సమయం కూడా ఎంత గొప్పగా జరిగింది! అల్లాహు అక్బర్! జుమా రోజున ఆయన షహీద్ అయ్యారు. అసర్ నమాజ్ తర్వాత సమయం. జిల్ హిజ్జా యొక్క హుర్మత్ (గౌరవప్రదమైన) మాసం. ప్రజలందరూ అటు హజ్ చేసి, అయ్యాముత్ తష్రీఖ్ యొక్క రెండవ రోజు, అంటే 12వ జిల్ హిజ్జా రోజున, 84 సంవత్సరాల వయసు నిండినది, అప్పుడు షహీద్ అయ్యారు.

చాలా కఠినంగా హంతకులు ప్రవర్తించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ అయ్యేకి కొన్ని క్షణాల ముందు చెప్పారు: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గడిచిన రాత్రిలో స్వప్నంలో చూశాను. ప్రవక్త వారు అంటున్నారు:

اصْبِرْ، فَإِنَّكَ تُفْطِرُ عِنْدَنَا الْقَابِلَةَ
(ఇస్బిర్, ఫ ఇన్నక తుఫ్ తిరు ఇందనల్ ఖాబిలహ్)
‘ఓ ఉస్మాన్, సహనం వహించు, రేపటి రోజు నీవు మాతో పాటు ఇఫ్తార్ చేస్తావు.'”

ఆ తర్వాత హజ్రత్ ఉస్మాన్ ఖుర్ఆన్ గ్రంథాన్ని తెప్పించారు, చదువుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. అది ఆయన ముందు ఉన్నది, ఆయన చేతుల్లో ఖుర్ఆన్ గ్రంథం ఉండగానే దుండగులు, హంతకులు ఆయనని హతమార్చారు.

ఈ ప్రస్తావన, మరియు నేను ప్రవక్తను స్వప్నంలో చూశాను, ప్రవక్త శుభవార్త ఇచ్చారు అన్నటువంటి మాట ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది. షేఖ్ అహ్మద్ షాకిర్ దాని యొక్క ముహక్కిఖ్, సహీహ్ అని చెప్పారు, హదీస్ నెంబర్ 526.

అంతేకాదు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖుర్ఆన్ చదువుతున్న సందర్భంలో ఆ దురదృష్టవంతులు, దుండగులు, హంతకులు, పాపాత్ములు ఇంట్లో ప్రవేశించారు. వారిలోని అత్యంత దురదృష్టుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గడ్డాన్ని పట్టుకొని తొమ్మిది సార్లు పొడిచాడు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క శరీరం నుండి చిమ్మిన రక్తం ఏదైతే చిందిందో, దాని యొక్క ఆ రక్తం ఆయన చదువుతున్నటువంటి ఖుర్ఆన్ పై కూడా పడింది. ఖుర్ఆన్లో ఏ ప్రాంతంలో పడిందో తెలుసా? సూరతుల్ బఖరాలోని ఆయత్ నెంబర్ 137:

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
(ఫస యక్ ఫీక హుముల్లాహ్, వ హువస్ సమీఉల్ అలీమ్)
వారికి వ్యతిరేకంగా నీకు అల్లాహ్‌ చాలు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ ఎరుగును. (2:137)

اللَّهُمَّ ارْضَ عَنْ أَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ وَعَلِيٍّ وَسَائِرِ الصَّحَابَةِ. وَاحْشُرْنَا فِي زُمْرَتِهِمْ. اللَّهُمَّ إِنَّا أَحْبَبْنَاهُمْ وَمَا رَأَيْنَاهُمْ. اللَّهُمَّ ارْزُقْنَا صُحْبَتَهُمْ فِي الْآخِرَةِ مَعَ نَبِيِّنَا صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

అల్లాహుమ్మర్ద అన్ అబీ బకర్ వ ఉమర వ ఉస్మాన వ అలీ వ సాయిరిస్ సహాబా. వహ్ షుర్నా ఫీ జుమ్రతిహిమ్. అల్లాహుమ్మ ఇన్నా అహ్ బబ్ నాహుమ్ వ మా రఅయ్ నాహుమ్. అల్లాహుమ్మ ర్ జుఖ్ నా సుహ్ బతహుమ్ ఫిల్ ఆఖిరతి మ’అ నబియ్యినా సల్లల్లాహు అలైహి వసల్లం.

ఓ అల్లాహ్, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ పట్ల నీవు సంతృష్టిగా ఉండు. వారిపై నీ యొక్క సంతృష్టి మరియు నీ యొక్క కరుణను కురిపించు. అలాగే తమ అందరి సహాబాలపై కూడా. ఓ అల్లాహ్, మమ్మల్ని కూడా వారితో పాటు లేపు. ఓ అల్లాహ్, మేము వారిని చూడలేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాము. కనుక ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్తతో పాటు వారి యొక్క సోహబత్, వారి యొక్క సాన్నిహిత్యం మాకు ప్రసాదించు.

మహాశయులారా, ఈ సంఘటన ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనం అన్ని రకాల బాహ్యమైన మరియు ఆంతర్యంలో ఉన్న, కనబడినవి కనబడకపోయేవి, అన్ని రకాల ఫితనాల నుండి, సంక్షోభాల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. మరొక గొప్ప విషయం, ఈ విభేదాలను వదులుకోవాలి. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారు షహీద్ అవ్వడానికి ముఖ్య కారణం, ఏ ఫితనాలు, ఏ సంక్షోభాలు అయితే లేశాయో అవే. మరియు ఆ సందర్భంలో ఇమామ్‌కు, మరియు నాయకునికి వ్యతిరేకంగా ఎవరైతే లేశారో, అలాంటి వారే వారిని షహీద్ చేశారు. అయితే అల్లాహు త’ఆలా ఏదైతే మనం ఏకంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, విభేదాలు లేకుండా ఉండాలని, పరస్పరం ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని మాటిమాటికీ ఆదేశిస్తూ ఉంటాడో ఖుర్ఆన్ హదీసులలో, ఆ ఆదేశాలను మనం శ్రద్ధ వహించి ఆచరిస్తూ ఉండాలి. చిన్న చిన్న ప్రాపంచిక కారణాలను తీసుకొని మనం పరస్పరం ఎలాంటి చీలికల్లో పడకూడదు. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్.

వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.


సహాబాలు మరియు మన సలఫ్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/sahaba-and-salaf/