https://youtu.be/xCWLjjGHElI [36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క శుభ నామమైన “అస్-సమీ” (సర్వం వినేవాడు) గురించి వివరిస్తారు. సమయాభావం వలన అల్-బసీర్ (సర్వం చూసేవాడు) మరియు అల్-అలీమ్ (సర్వజ్ఞాని) అనే ఇతర రెండు నామాలను వదిలి, కేవలం అస్-సమీ పై దృష్టి సారిస్తారు. అల్లాహ్ వినికిడి శక్తి ఎంత గొప్పదో, విశాలమైనదో ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తారు. ఒకే సమయంలో సృష్టిలోని జీవరాశులన్నిటి ప్రార్థనలను, విభిన్న భాషలలో, ఎలాంటి గందరగోళం లేకుండా వినగలడని ఉదాహరణలతో వివరిస్తారు. ఈ నమ్మకం ఒక విశ్వాసి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాలి, వారి మాటలు, చేతలు ఎలా ఉండాలి, మరియు ప్రార్థనలలో అల్లాహ్ వైపు ఎలా ఏకాగ్రతతో మళ్ళాలో వివరిస్తారు. షిర్క్‌ను ఖండిస్తూ, వినలేని వారిని ఆరాధించడం నిరర్థకమని, సర్వం వినే అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని నొక్కి చెబుతారు.
పరిచయం
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
[అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్]
(శపించబడిన షైతాన్ నుండి సర్వం వినేవాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుతున్నాను)
لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
[లైస కమిస్లిహి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్]
(ఆయనను పోలినది ఏదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)
సోదర మహాశయులారా, ప్రియ మిత్రులారా, ఈరోజు అల్లాహ్ శుభ నామములైన మూడు నామాల గురించి, అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్. ఈ మూడిటి గురించి చెప్పేది ఉండే. కానీ ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. మూడిటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే, మరీ ఇంకా చాలా దీర్ఘం, ఎక్కువ సమయం అవుతుంది గనక, ఈరోజు కేవలం సమీ గురించి చెబుతున్నాను. ఎలాగైతే మీరు ఇప్పుడు ఇక్కడ టైటిల్ లో కూడా చూస్తున్నారు. అయితే రండి.
అస్-సమీ: సర్వం వినేవాడు
అస్-సమీ అల్లాహ్ యొక్క పేరు అని, అందులో ఉన్నటువంటి గుణం ‘సమ్’ (వినికిడి), వినడం అల్లాహ్ యొక్క గుణం అని మనం నమ్మాలి. ఖురాన్లో 50 కంటే ఎక్కువ చోట్ల అల్లాహ్ యొక్క ఈ పేరు ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ యొక్క ఈ పేరు, అస్-సమీ అంటే వినేవాడు. ఈ ఒక్క పదం వాస్తవానికి మన తెలుగులోనిది, అస్-సమీలో ఉన్నటువంటి విశాలమైన భావానికి సరిపోదు. అందుకొరకే వివరణ చాలా అవసరం.
కేవలం మానవులదే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీ దాని గురించి అల్లాహు తఆలా చాలా స్పష్టముగా మంచి రీతిలో వింటాడు. అల్లాహు తఆలా యొక్క వినే శక్తి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎలా వింటాడు అన్న దాని గురించి కైఫియత్ (ఎలాగో), అది మనకు తెలియదు. కానీ ఖురాన్లో అల్లాహు తఆలా ఏ ఆయతులు అయితే తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏ హదీసులు అయితే వచ్చాయో, వాటన్నిటిని కలుపుకుంటే, పూర్తి విశ్వంలో నుండి ఎలా వింటాడు అనేది కాకుండా, కేవలం ఒక మానవుల విషయం మనం చిన్నగా ఆలోచిస్తే, పూర్తి ప్రపంచంలో ఉన్న మానవులు ఒకే సమయంలో, ఒకే సందర్భంలో, ఒకే పెద్ద మైదానంలో ఉండి, ప్రతీ ఒక్కరూ తమ తమ భాషల్లో, ప్రతీ ఒక్కరూ తమ వేరువేరు కోరికలు ఏదైతే వెళ్లబుచ్చుతారో, అల్లాహు తఆలా ఆ ఒకే సమయంలో అందరి మాటలు వింటాడు, అందరి భాషలు వింటాడు అర్థం చేసుకుంటాడు, అందరి కోరికలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని వింటాడు.
జన సమూహంలో ఉండి అందరి శబ్దాలు, భాషలు, వారు చెప్పే మాటలు ఎంత వేరువేరు ఐనా, వారికి పరస్పరం ఒకరికి ఒకరు ఎంత డిస్టర్బెన్స్ ఐనా, అల్లాహ్ అజ్జవజల్లా యొక్క వినే శక్తి ఎంత గొప్పది అంటే, అతనికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు. అల్లాహు తఆలా ప్రతీ ఒక్కరి మాట, ప్రతీ ఒక్కరి కోరిక, ప్రతీ ఒక్కరి భాష వింటాడు. అంతేకాదు, ఎవరైనా ఇప్పుడు నేను చెబుతున్నట్లుగా బిగ్గరగా, శబ్దంతో చెప్పినా, (మెల్లగా) “ఓ అల్లాహ్ మేము ఉపవాసం ఉంటున్నాము, మా ఉపవాసాలను స్వీకరించు ఓ అల్లాహ్”. నేను ఎంత మెల్లగా చెబుతున్నాను అంటే బహుశా నా పక్కన ఉన్నవానికి కూడా వినబడదు కావచ్చు, కానీ అల్లాహ్ బిగ్గరగా చెప్పేవారి మాట వింటాడు, నిశ్శబ్దంగా చెప్పే వాని మాట వింటాడు. అంతే కాదు, కొన్ని సందర్భాలలో మనలో మనమే నాలుకను కదిలించి మాట్లాడుతూ ఉంటాము, ఏ శబ్దమూ రాదు. అలాంటి మాటలు సైతం అల్లాహ్ వింటాడు.
ఒక సామెతగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. అందులో అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్ మూడు అల్లాహ్ యొక్క నామాల ప్రస్తావన వచ్చేస్తుంది. అదేమిటంటే, అమావాస్య రాత్రి, చిమ్మని చీకటి రాత్రి, నల్ల రాయి కింద పాతాళంలో ఉన్నటువంటి చీమను అల్లాహ్ చూస్తాడు (బసీర్), నడిచే నడక యొక్క శబ్దాన్ని అల్లాహ్ వింటాడు (అస్-సమీ), ఆ చీమ తన చీమల గ్రూప్‌తో ఏం మాట్లాడుతుందో అది కూడా అల్లాహ్‌కు తెలుసు (అల్-అలీమ్).
ఖురాన్ మరియు హదీసుల ఆధారాలు
ఈ మూడు పేర్లు అనేక సందర్భాలలో కూడా ఖురాన్లో వచ్చి ఉన్నాయి. ఒక ఉదాహరణ మీకు మన సోదరులు తెలిపారు కూడా. అందుకొరకే మూడిటిని కలిపి ఒకే సమయంలో మనం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆశ ఉండింది కానీ సమయం సరిపోదు. అందుకొరకే ఇప్పుడు సమీ గురించి చెప్పడం జరుగుతుంది. ముస్నద్ అహ్మద్‌లో వచ్చిన ఒక హదీస్, ఇబ్ను మాజా, నసాయిలో కూడా ఉంది. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి మాటను గమనించండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక స్త్రీ వచ్చి ఒక విషయం అడిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు ఇంకా వహీ రాలేదని, దీని గురించి ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పలేనని అంటారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు:
الْحَمْدُ لِلَّهِ الَّذِي وَسِعَ سَمْعُهُ الْأَصْوَاتَ
[అల్హందులిల్లాహిల్లజీ వసిఅ సమ్ఉహుల్ అస్వాత్]
(ఆ అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు, ఏ అల్లాహ్ యొక్క వినికిడి అన్ని రకాల శబ్దాలను ఆవరించి ఉందో.)
لَقَدْ جَاءَتِ الْمُجَادِلَةُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تُكَلِّمُهُ
లకద్ జాఅతిల్ ముజాదిలతు ఇలన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం తుకల్లిముహు
(ఆ వాదించే స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి మాట్లాడుతుండగా)
ఆ ఒక సమస్య గురించి అడుగుతూ వచ్చినటువంటి స్త్రీ యొక్క మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆమె మాట్లాడుతుంది,
وَأَنَا فِي نَاحِيَةٍ مِنَ الْبَيْتِ مَا أَسْمَعُ مَا تَقُولُ
వఅనా ఫీ నాహియతిన్ మినల్ బైతి మా అస్మఉ మా తఖూల్
(నేను ఇంటిలోనే ఒక పక్కన, ఒక మూలన ఉండి వింటూ ఉన్నాను),
فَأَنْزَلَ اللَّهُ عَزَّ وَجَلَّ
ఫఅన్జలల్లాహు అజ్జవజల్ల
(అప్పుడు అల్లాహు తఆలా ఆయత్ అవతరింపజేశాడు).
సూరతుల్ ముజాదలాలోని మొదటి ఆయత్:
قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
(నిశ్చయంగా అల్లాహ్ తన భర్త విషయంలో మీతో వాదిస్తూ ఉండిన, మరియు అల్లాహ్‌కు మొరపెట్టుకుంటున్న ఆ స్త్రీ యొక్క మాటను విన్నాడు. మరియు అల్లాహ్ మీ ఇద్దరి మాటలను వింటూ ఉన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)
సోదర మహాశయులారా, ఇంతకుముందు నేను చెప్పినట్లు, ఆ హదీస్ కూడా సహీహ్ ముస్లింలో వచ్చి ఉంది, 2577. అల్లాహ్ అంటున్నాడు, హదీస్ ఖుద్సీ ఇది.
يَا عِبَادِي، لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ قَامُوا فِي صَعِيدٍ وَاحِدٍ فَسَأَلُونِي فَأَعْطَيْتُ كُلَّ وَاحِدٍ مَسْأَلَتَهُ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِي شَيْئًا إِلَّا كَمَا يَنْقُصُ الْمِخْيَطُ إِذَا غُمِسَ فِي الْبَحْرِ
[యా ఇబాదీ, లవ్ అన్న అవ్వలకుమ్ వ ఆఖిరకుమ్ వ ఇన్సకుమ్ వ జిన్నకుమ్ ఖామూ ఫీ సయీదిన్ వాహిదిన్ ఫసఅలూనీ, ఫఅఅతైతు కుల్ల వాహిదిన్ మస్అలతహు, మా నఖస జాలిక మిన్ ముల్కీ షైఆ, ఇల్లా కమా యన్ఖుసుల్ మిఖ్యతు ఇజా గుమిస ఫిల్ బహర్]
(ఓ నా దాసులారా, మీలోని మొదటివాడి నుండి మొదలుకొని చివరి వాడి వరకు, మానవులే కాదు జిన్నాతులు సైతం ఒకే ఒక మైదానంలో మీరందరూ నిలబడి, మీరందరూ నాతో అర్ధించారంటే, అడిగారంటే, ప్రతి ఒక్కరికి అతను అడిగినది నేను ఇచ్చేశానంటే, నా యొక్క రాజ్యంలో ఏ కొంచెం కూడా తరగదు, సముద్రంలో ఒక సూది ఇలా ముంచి తీస్తే సముద్రంలో ఎంత తరుగుతుంది? అంత కూడా, నేను ప్రతీ ఒక్కరికి మీరు అడుగుతున్నది విని, వారు అడిగినది వారికి ఇచ్చేస్తే ఇంత కూడా తరగదు.
బుఖారీ ముస్లింలో అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలా అన్హు వారి హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారు సహాబాలు ప్రయాణంలో ఉన్నారు. అబూ మూసా అంటున్నారు: فَكُنَّا إِذَا عَلَوْنَا كَبَّرْنَا ఫకున్నా ఇజా అలౌనా కబ్బర్నా (మేము నడుస్తూ నడుస్తూ అంటే ప్రయాణంలో దారిలో ఎత్తు ప్రదేశంలో ఉండగా ‘అల్లాహు అక్బర్’ అని గొంతు ఎత్తి కొంచెం పెద్ద శబ్దంతో అంటూ ఉంటిమి). ఫఖాల్ (అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు):
أَيُّهَا النَّاسُ ارْبَعُوا عَلَى أَنْفُسِكُمْ، فَإِنَّكُمْ لَا تَدْعُونَ أَصَمَّ وَلَا غَائِبًا، وَلَكِنْ تَدْعُونَ سَمِيعًا بَصِيرًا قَرِيبًا
[అయ్యుహన్నాస్, ఇర్బవూ అలా అన్ఫుసికుమ్. ఫఇన్నకుమ్ లా తద్ఊన అసమ్మ వలా గాఇబా. వలాకిన్ తద్ఊన సమీఅన్ బసీరన్ ఖరీబా]
(ఓ ప్రజలారా, మీరు స్వయం మీపై కొంచెం తగ్గించుకోండి, నిదానం అనేది పాటించండి. మీరు ఎవరిని అర్ధిస్తున్నారు? ఏదైనా చెవిటి వాడిని కాదు, ఏదో దూరం ఉండి ఏమీ తెలియని వానికి కాదు. మీరు వినే వాడితో, చూసే వాడితో, మీకు దగ్గరగా ఉన్న వాడితో దుఆ చేస్తున్నారు, మీరు పిలుస్తున్నారు, అర్ధిస్తున్నారు.)
అందుకే సోదర మహాశయులారా, అల్లాహు తఆలా ఇంత గొప్పగా వినేవాడు అన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం నోటితో చెబుతాము, అవును అల్లాహ్ అన్నీ వింటాడు, అల్లాహ్‌కు ప్రతీ భాష తెలుసు. అంటాము నోటితో. కానీ వాస్తవంగా మనకు ఆ సంపూర్ణ విశ్వాసం ఉందా? దానిపై ప్రగాఢమైన, బలమైన నమ్మకం ఉన్నదా? ఉండేది ఉంటే, వాస్తవానికి మన జీవితాల్లో మార్పు వచ్చేది. ఈ విశ్వాసం ప్రకారంగా మన యొక్క జీవితాలపై దాని ప్రభావం ఉండేది. ఒక హదీస్, ఖురాన్ ఆయత్ ఆధారంగా వినండి ఒక సంఘటన. చూడండి.
అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, సహీహ్ బుఖారీ, హదీస్ నెంబర్ 6384, సహీహ్ ముస్లిం 2704 లో వచ్చిన హదీస్. ఏమంటున్నారు? اجْتَمَعَ عِنْدَ الْبَيْتِ قُرَشِيَّانِ وَثَقَفِيٌّ، أَوْ ثَقَفِيَّانِ وَقُرَشِيٌّ ఇజ్తమఅ ఇందల్ బైతి ఖురషియాన్ వ సఖఫియ్యాని వ ఖురషి (కాబా వద్ద ఇద్దరు ఖురైషీలు ఒక సఖీఫ్‌కు చెందిన లేదా ఇద్దరు సఖీఫ్‌కు చెందిన ఒక ఖురైష్కు చెందిన ముగ్గురు మనుషులు కలిసి ఉన్నారు). శరీర వైభవం కలిగినవారు కానీ అర్థం చేసుకునేటువంటి మనసు చాలా తక్కువగా వారికి ఉండింది. బుర్ర చిన్నగా, శరీరం పెద్దగా. అర్థం చేసుకునే గుణం లేదు కానీ మాటలు చాలా. వారిలో ఒకడు ఏమన్నాడు? أَتَرَوْنَ أَنَّ اللَّهَ يَسْمَعُ مَا نَقُولُ؟ అతరౌన అన్నల్లాహ యస్మఉ మా నఖూల్? (మనం చెప్పే మాటలు అల్లాహ్ వింటాడా?). అయితే రెండోవాడు అన్నాడు, మనము బిగ్గరగా మాట్లాడితే వింటాడు, నవూజుబిల్లాహ్, మనం మెల్లిగా, నిశ్శబ్దంగా, గుప్తంగా మాట్లాడితే వినడు. మూడోవాడు అన్నాడు, ఒకవేళ అల్లాహు తఆలా బిగ్గరగా మనం మాట్లాడినప్పుడు వినేవాడైతే, మనం మెల్లిగా మాట్లాడినా గానీ వింటూ ఉంటాడు. అప్పుడు అల్లాహు తఆలా సూరత్ ఫుస్సిలత్ అవతరింపజేశాడు. సూరా నెంబర్ 41, ఆయత్ నెంబర్ 22 నుండి శ్రద్ధగా చూడండి, చదవండి.
وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ
(మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.)
చూశారా, అవిశ్వాసులు, బుద్ధి తక్కువ ఉన్నవారు, అల్లాహ్ యొక్క వినే, అల్లాహ్‌కు తెలిసే, అల్లాహ్ చూసే, సమీ, బసీర్, అలీమ్ విషయంలో ఎలాంటి దురాలోచనలకు పాల్పడ్డారు? మరియు ఇలాంటి దురాలోచన ఎప్పుడైతే ఉంటుందో, మనిషి యొక్క వ్యవహారంలో, అతని యొక్క చేష్టల్లో, అతని పనుల్లో, ఇతరులతో అతను ఏదైతే బిహేవియర్, అతడు మసులుకుంటాడో అందులో కూడా చాలా మార్పు ఉంటుంది.
అందుకొరకే, అల్లాహ్ సంపూర్ణంగా వినేవాడు, ఎంతటి గొప్పగా వినేవాడో, స్టార్టింగ్‌లో మనం కొన్ని విషయాలు ఏదైతే తెలుసుకున్నామో, దాని ప్రకారంగా బలమైన నమ్మకం ఉండాలి. బలమైన నమ్మకం లేకుంటే, మనిషి ఆచరణలలో చాలా చెడు ప్రభావం చూపుతుంది, దాని కారణంగా మనిషి చెడుకు పాల్పడి నరకం పాలవుతాడు. ఒకసారి మీరు మళ్ళీ చూడండి, వెంటనే దాని తర్వాత ఆయతులు.
وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ * فَإِن يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۖ وَإِن يَسْتَعْتِبُوا فَمَا هُم مِّنَ الْمُعْتَبِينَ
మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురి అయ్యారు. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు.
…ఈ క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు ఎక్కడ ఇది? ఇది నరకంలో ఉండి. అందుకొరకే ఇప్పటికైనా గానీ అవకాశం ఉంది. నిన్ననే తవ్వాబ్, అఫూ, గఫూర్, గఫార్ గురించి విన్నారు. అల్లాహ్ పట్ల, అల్లాహ్ యొక్క పేరు సమీ, గుణం సమ్అ, పేరు బసీర్, గుణం బసర్ చూడడం, మరియు అలాగే అలీమ్, ఇల్మ్, వీటి గురించి ఎలాంటి తప్పుడు ఆలోచన ఉన్నా, మన ఆచరణలో ఎలాంటి చెడు ఉన్నా, దానిని తొందరగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలుగుతాము మనం సరిదిద్దుకునే ప్రయత్నం? రండి, ఇప్పుడు చెప్పబోయే మాటలు మీరు శ్రద్ధగా విన్నారంటే, మనం చేంజ్ కావచ్చు, మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. ఎలా అంటారా?
అల్లాహ్ వింటాడు అని ఎప్పుడైతే మనం అంటామో, అందు రెండు భావాలు వస్తాయి. ఒకటి, ఏ ఎవరి విషయాలు, ఎవరి మాటలు వింటూ ఉన్నాడో, వారికి సంబంధించి. రెండవ భావం, స్వయం వినేవాడు అల్లాహ్‌కు సంబంధించి. అర్థమైందా?
ఇప్పుడు, అల్లా క్షమించుగాక నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను, అల్లాహ్ కొరకు ఎలాంటి ఉపమానాలు, ఉదాహరణ కాదు, మనకు అర్థం కావడానికి ఇట్లాంటి కొన్ని చిన్న ఉదాహరణలు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. కదా? అయితే ఇప్పుడు, వినడం అన్న ఈ ప్రస్తావన ఇక్కడ ఏదైతే ఉందో, ఇందులో రెండు భావాలు. ఒకటి, ఎవరి మాటలు వింటున్నారో వారికి సంబంధించి. మరొకటి, వినేవాడు అల్లాహ్, అతనికి సంబంధించి. అల్లాహ్‌కు సంబంధించి ఏంటి? కొన్ని సందర్భాలలో, కొన్ని ఆయతులలో, అల్లాహ్ విన్నాడు, అల్లాహ్ వింటాడు, అల్లాహ్ వినేవాడు, ఇలాంటి పదాలు ఎక్కడైతే వస్తాయో, అక్కడ భావం, అల్లాహ్ మీ మాటను వినేశాడు, స్వీకరిస్తాడు, మీరు కోరినది నొసంగుతాడు, ఇస్తజాబ (అంగీకరించాడు), ఈ భావంలో. ఇది చాలా సంతోషకరం మన కొరకు.
ఉదాహరణకు, సమిఅల్లాహు లిమన్ హమిదహ్. ఎప్పుడంటారు? రుకూ నుండి నిలబడి కదా? అల్లాహు తఆలా విన్నాడు, సమిఅల్లాహు, అల్లాహ్ విన్నాడు, లిమన్ హమిదహు, ఎవరైతే అతనిని అంటే అల్లాహ్‌ని ప్రశంసించారో. ఇక్కడ ధర్మవేత్తలు అంటారు, అజాబ, وَلَيْسَ الْمُرَادُ سَمْعَهُ مُجَرَّدَ سِمَاعٍ فَقَطْ వలైసల్ మురాదు సమ్ఉహు ముజర్రద్ సిమాఅ ఫఖత్ (కేవలం వినడం మాత్రమే ఉద్దేశం కాదు, అంగీకరించాడు). అంటే, అల్లాహ్ మీ యొక్క ఈ స్తోత్రాలను విన్నాడు అంటే, అంగీకరించాడు, స్వీకరించాడు, దీనికి ప్రతిఫలం అల్లాహ్ మీకు ప్రసాదిస్తాడు.
అలాగే, సూరత్ ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 39 లో మీరు చూస్తే, إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ [ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ] (నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని వస్తుంది. అంటే, నిశ్చయంగా నా ప్రభువు దుఆలను వినేవాడు, అంటే కేవలం విని ఊరుకోడు, అంగీకరిస్తాడు, మీరు అడిగేది మీకు ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ఉంది. అర్థమైంది కదా?
ఇక వినే వాడు అన్న దానిలో రెండవ భావం ఏదైతే చెప్పామో, మరొక భావం, వినే వారి, అంటే ఎవరి మాటలు వింటున్నాడో, ఎవరి మాటలు వినబడతాయో, వారి గురించి. ఇక్కడ మానవులు అని మనం ఒకవేళ తీసుకుంటే, అందులో మూడు భావాలు వస్తాయి. ఏంటి?
మొదటి భావం, అల్లాహు తఆలా విన్నాడు అని అంటే ఇక్కడ, నీకు అల్లాహు తఆలా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అర్థమైందా? కాలేదా? ఉదాహరణకు, మీరు ఒకచోట పని చేస్తున్నారు అనుకోండి. మీ యజమాని , “ఒరేయ్, ఏమంటున్నావు రా, వింటున్నా నేను” అని అన్నాడు. అంటే అక్కడ ఏంటి? ఏదైనా శుభవార్తనా? మీరు ఏదో పొరపాటు మాట అన్నారు, దాని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కదా?
ఉదాహరణకు ఖురాన్లో చూడండి, సూరత్ అజ్-జుఖ్రుఫ్, ఆయత్ నెంబర్ 80:
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم
[అమ్ యహసబూన అన్నా లా నస్మఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్]
(వారి రహస్యాలను, వారి గుప్త విషయాలను మేము వినము అని వారు భావిస్తున్నారా?)
ఇక్కడ వినే మాట వచ్చింది, అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటి? హెచ్చరిస్తున్నాడు అల్లాహు తఆలా.
అలాగే సూరత్ ఆల్-ఇమ్రాన్, ఆయత్ నెంబర్ 181లో చూడండి:
لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ
[లఖద్ సమిఅల్లాహు ఖౌలల్లజీన ఖాలూ ఇన్నల్లాహ ఫఖీరున్ వ నహ్ను అగ్నియాఉ]
(యూదులలో కొందరు దుష్టులు ‘నిశ్చయంగా అల్లాహ్ పేదవాడు మేము సిరి సంపదలు గలవారిమి’ అని అన్నవారి మాటను నిశ్చయంగా అల్లాహ్ విన్నాడు.)
అల్లాహ్ ఏమంటున్నాడు? మేము విన్నాము. అంటే ఏంటి? అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా మీ మాట? అల్లాహ్ పట్ల ఇలాంటి భావాలు కలిగి ఇలాంటి మాటలు పలుకుతారా మీరు? తహదీద్, హెచ్చరిక, చేతావని.
రెండవ భావం, అల్లాహు తఆలా తన ప్రియమైన దాసులకు, ప్రవక్తలకు, పుణ్యాత్ములకు సపోర్ట్ చేస్తున్నాడు, వారికి మద్దతు ఇస్తున్నాడు అన్నట్లుగా భావం ఉంటుంది. ఇది చూడాలనుకుంటే సూరత్ తాహా ఆయత్ నెంబర్ 46 మీరు చూడవచ్చు. ఏముంది?
إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
[ఇన్ననీ మఅకుమా అస్మఉ వ అరా]
(నిశ్చయంగా నేను మీ ఇద్దరితో ఉన్నాను, నేను వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను.)
ఓ మూసా, హారూన్ అలైహిముస్సలాం, మీరిద్దరూ వెళ్ళండి, ఫిరౌన్‌కు దావత్ ఇవ్వండి, తౌహీద్ గురించి చెప్పండి, బనీ ఇస్రాయీల్‌పై అతడు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో, దాని గురించి హెచ్చరించండి. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం వారిని అల్లాహు తఆలా ఫిరౌన్ వద్దకు పంపుతూ ఏమన్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను మీకు తోడుగా ఉన్నాను.” అల్లాహు అక్బర్. దావత్ పని చేసే వారులారా, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ప్రజల వరకు చేరవేసే వారులారా, భయపడకండి. ఎన్ని గద్దింపులు మీకు వచ్చినా, అయ్యో, ఫలానా అంత పెద్ద ఇంటర్నేషనల్ దాయికే ఫలానా ఫలానా ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు ఇచ్చేసింది, ఇక మనం దావత్ పని వదులుకుందామా? హెచ్చరికలు ఇవ్వడం వారి యొక్క పని, వారికి ఈ సత్యం అర్థం కాక. కానీ నీకు తోడుగా ఎవరున్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను నీకు తోడుగా ఉన్నాను” అని అల్లాహు తఆలా మూసా మరియు హారూన్ అలైహిముస్సలాంకి ఓర్పునిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, స్థైర్యాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఏమంటున్నాడు? “అస్మఉ వ అరా, నేను ప్రతీ విషయాన్ని వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను.” మీ యొక్క కదలికలు, మీరు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు, ఫిరౌన్ ముందు మీరు ఎలా దావత్ ఇస్తారు, అవన్నీ నేను చూస్తూ ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీ మాటలు వింటూ ఉంటాను, మీరు ఎలాంటి భయం పడకండి.” అల్లాహ్ యొక్క ధైర్యం, అల్లాహ్ వైపు నుండి ఒక తోడ్పాటు లభిస్తుంది. ఇక్కడ ‘సమఅ’ ఈ భావంలో ఉంది.
ఇక మూడవ భావం, అల్లాహు తఆలా ఈ పూర్తి విశ్వంలో ఎక్కడా, ఏదీ కూడా అతని వినికిడికి బయట లేదు. మనిషి ఏ గుహలో, అంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఏ ఏ ప్రూఫ్‌లలో మనిషి బంధించబడి తనకు తాను లోపల వేసుకున్నా, అల్లాహ్ వినకుండా ఎక్కడా ఏ మనిషి ఉండలేడు. ఈ లోకంలో ఏ ప్రాంతం కూడా, ఈ లోకంలో ఏ స్థితి కూడా, ఈ లోకంలో ఎక్కడ ఏది కూడా అల్లాహ్ వినికిడికి బయట లేదు.
అయితే సోదర మహాశయులారా, ఇక ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంతటి గొప్ప వినే వాడైన ఆ అల్లాహ్‌ను మనం విశ్వసిస్తున్నాము గనక, మన మొరలను అతను వినడా, అంగీకరించడా? ఓ అల్లాహ్, నేను ఈ కష్టంలో ఉన్నాను, నా కష్టాన్ని దూరం చెయ్యి ఓ అల్లాహ్, అని నిజంగా మనసుతో మన మాట వెళ్లి, కళ్ళతో కన్నీరు కారుతూ, రాత్రి వేళ ఎవరు చూడని సమయంలో అతని ముందు మనం నిలబడ్డామంటే, అతను మన మాట వినడా? అతడు మనకు ప్రసాదించడా? ప్రసాదిస్తే, మరి ఎవరైతే వినేవారు కారో, ఎన్నో టన్నుల మట్టి కింద శవం అయి ఉన్నారో, లేక చనిపోయి కాలాలు గడిచి మొత్తం కుళ్ళిపోయారో, అలాంటి వారు ఎవరిలోనైతే వినే శక్తి లేదో, ఎందుకు వారిని ఆరాధించాలి? ఎందుకు వారిని పూజించాలి?
అల్లాహు తఆలా షిర్క్‌ను ఖండిస్తూ, తన వినే శక్తిని స్పష్టంగా తెలియజేసినప్పుడు, ఎవరినైతే మీరు అల్లాహ్‌ను కాదని పూజిస్తున్నారో, వారిలో వినే శక్తి లేదు అని కూడా స్పష్టంగా తెలియజేశాడు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన ఆయతులు చదివితే విషయం చాలా మంచి రీతిలో అర్థమవుతుంది. రండి, ఒక్కసారి చూడండి ఇక్కడ సూరతుల్ అఅరాఫ్ ఆయత్ నెంబర్ 195. 194 నుండి చదువుదాము, విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి:
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ * أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ
(మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, వారంతా మీ లాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)
ఈ ఆయత్‌ను నోట్ చేసుకోండి. మన వద్ద కొందరు ఏం చేస్తారు, మన మిత్రులు, మనలాంటి కల్మా చదివే ముస్లింలు, నమాజ్ చేసే వారు, “అయ్యా, ఈ వలీలను మేము పూజిస్తుంటే మీరు తప్పు అని ఎందుకు అంటున్నారు? ఆనాటి కాలంలో రాళ్లను, రప్పలను, చెట్లను పూజించేవారు, వాటిని ఖండించడం జరిగింది. పుణ్యాత్ములను, పుణ్య పురుషులను వద్దకు వెళ్లి, వారి సమాధుల వద్దకు వెళ్లి ఈ కొన్ని పనులు చేసినందుకు రద్దు చేయబడలేదు” అని అంటారు. ఈ ఆయత్‌ను వారికి దలీల్‌గా చూపండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరితో దుఆ చేస్తున్నారో, ఎవరి సమాధి వద్ద ఆరాధనకు సంబంధించిన ఏదైనా ఒక పని చేస్తున్నారో, వారంతా మీ లాంటి దాసులే, ఇబాదున్ అమ్సాలుకుమ్, మీ లాంటి దాసులే. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి.
فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
[ఫద్ఊహుమ్ ఫల్యస్తజీబూ లకుమ్ ఇన్ కున్తుమ్ సాదిఖీన్]
(మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)
ఆ తర్వాత ఆయత్ నెంబర్ 7:195,196:
أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ
ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.”
إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ
“ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహ్‌యే ముమ్మాటికీ నా సహాయకుడు. సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే.”
ఇదే సూరత్‌లో మరొక ఆయత్, ముందు కొంచెం ఆయత్ నెంబర్ 198 లో కూడా ఈ మాట చాలా స్పష్టంగా వచ్చింది:
وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا
(ఒకవేళ మీరు వారికి ఏదైనా చెప్పటానికి పిలిచినా, వారు మీ మాటను వినలేరు) లా యస్మవూ, వినలేరు
షిర్క్‌ను ఖండించడానికి అల్లాహు తఆలా ఈ విధంగా ఇంత స్పష్టంగా తెలియజేశాడు. ఈ భావంలో ఆయతులు సూరత్ మర్యమ్ 41-42 లో కూడా ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయిన ఆజర్ను షిర్క్ నుండి ఆపుతూ ఏమన్నారు?
يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ
(ఓ నా తండ్రీ, ఏమి వినలేని మరియు ఏమి చూడలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు?)
సోదర మహాశయులారా, చివరి మాట ఇక ఈ రోజు ఈ ప్రసంగంలో అదేమిటంటే, అల్లాహ్ వినేవాడు, ఎంత గొప్పగా, విశాలంగా, ఎంత సున్నితంగా. మన తెలుగులో ఒక సామెత ఉంది గుర్తుందా మీకు? ఎంత నిశ్శబ్దం అంటే సూది పడినా వినగలిగే అంతటి నిశ్శబ్దం ఏర్పడింది అని అంటారు. సూది పడితే మనకు వినబడుతుందా? కానీ అల్లాహ్ వింటాడు. అల్లాహ్ వింటాడు అన్నటువంటి విశ్వాసం ఇలాంటి సామెతల ద్వారా మరింత అల్లాహ్‌పై మన విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగిందంటే, మన ఆచరణలో, మన జీవితంలో ప్రభావం చూపాలి. ఎలాంటి ప్రభావం? అల్లాహ్ వింటాడు అయితే మనం మాట్లాడే ప్రతీ మాట అల్లాహ్‌కు ఇష్టమైనదే ఉండాలి. మనం మాట్లాడే మాట ద్వారా ఎవరికీ బాధ కలిగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అఫ్దలుల్ ముస్లిమీన (ముస్లింలలో అత్యుత్తముడు ఎవడయ్యా అంటే), ఏ ముస్లిం ద్వారానైతే ఇతరులందరికీ అతని నాలుక ద్వారా గానీ, చేతుల, కాళ్ల ద్వారా గానీ ఏ హాని కలగకుండా ఉంటుందో, నష్టం కలగకుండా ఉంటుందో.
మరియు మనం అల్లాహ్ యొక్క ఈ పేరును మంచి రీతిలో అర్థం చేసుకున్నామంటే, మనం అల్లాహ్‌తో ఏ దుఆ చేసినా గానీ, అల్లాహ్ యొక్క ఈ పేరు మాధ్యమంతో, వసీలాతో దుఆ చేయాలి. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే యూసుఫ్ అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే జకరియా అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే ఇమ్రఅతు ఇమ్రాన్ (మర్యమ్ అలైహస్సలాం యొక్క తల్లి) దుఆ చేశారు.
إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ
[ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ]
(నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని ఇంతకుముందే మనం విన్నాము.
సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126, 7, 28 ఇట్లా చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఏదైతే దుఆ చేశారో అందులో:
رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
[రబ్బనా తఖబ్బల్ మిన్నా, ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్]
(ఓ అల్లాహ్, నీవు స్వీకరించు మా నుండి. నిశ్చయంగా నీవు వినేవాడివి, అన్నీ తెలిసిన వానివి.)
సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 35 లో కూడా ఈ భావం ఉంది.
చివరి మాట, మరీ చివరి, ఎక్దం చివరి, ఇంత అల్లాహ్ యొక్క పేరుతో మనం దుఆ చేశామంటే, తప్పకుండా అల్లాహ్ స్వీకరిస్తాడన్నటువంటి నమ్మకం కూడా మళ్ళీ కలిగి ఉండాలి. అల్లాహ్ చాలా వినేవాడు అని నేను ఎంతో వసీలతో దుఆ చేశానండి, ఇంకా ఖుబూలే కావట్లేదు నా దుఆ, అని అల్లాహ్ పట్ల నిరాశ, అల్లాహ్ పట్ల తప్పుడు ఆలోచన కలగకూడదు. మనం దుఆ చేసే విషయంలో ఏదైనా లోపం ఉండవచ్చు అని ఇంకా దుఆ చేయాలి. అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా కలిగి ఉండాలి. దీని గురించి చదవండి సూరత్ యూసుఫ్ ఆయత్ నెంబర్ 34.
అల్లాహు తఆలా ఈ యొక్క పేరు ‘సమీ’ గురించి ఏదైతే మనం తెలుసుకున్నామో, దీని ప్రకారంగా మన జీవితంలో మార్పు తెచ్చుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఇంతటితో ఈనాటి ప్రసంగం ముగుస్తుంది. కొంచెం ఆలస్యం అయినందుకు క్షమించండి. వాస్తవానికి అల్లాహ్ యొక్క పేర్ల విషయం చెబుతున్నాము, ఎన్ని చెప్పినా మాటలు పూర్తి కావు. అల్లాహ్ యొక్క గొప్పతనం అంత విశాలమైనది, గొప్పది. కానీ మీతో క్షమాపణ కోరుతున్నాను ఆలస్యం అయినందుకు.
అల్లాహ్ తఆలా మీ అందరికీ కూడా ఇహపరలోకాల్లో అన్ని రకాల మేళ్లు ప్రసాదించుగాక. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/
అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb