ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
ఖుత్బా అంశము: ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క హక్కు: ఆయన సతీమణులను గౌరవించడం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢
يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవ భీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! (అహ్లె సున్నత్ వల్ జమాఅత్) యొక్క అఖీదా ఏమిటంటే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి భార్యలను తప్పక గౌరవిస్తారు. అల్లాహ్ తఆలా వారికి ఉన్నతమైనటువంటి స్థానాలను ప్రసాదించాడు. అంతేకాదు వారందరినీ విశ్వాసుల మాతృ మూర్తులుగా తీర్చిదిద్దాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:
النبي أولى بالمؤمنين من أنفسهم وأزواجه أمهاتهم
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు.
ఇందులో పవిత్రత, గౌరవం మర్యాద గురించి బోధించడం జరిగింది. దీని కారణంగానే ప్రతి ముస్లిం కూడా వారి ఈ హక్కును షరియత్ రక్షించిన విధంగా రక్షించడం తప్పనిసరి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులను గౌరవించడం తప్పనిసరి చేసే విషయాలలో మొదటి విషయం; వారు మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి లోపల విధానాన్ని గుర్తుంచుకొని బాధ్యతగా ఉమ్మత్ కు తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారు, ఎందుకంటే ఈమె ప్రవక్త గారి హదీసులను ఉల్లేఖించిన వారిలో అగ్రగామిగా ఉన్నారు.
ఖదీజా (రదియల్లాహు అన్హా ) గారి విషయానికి వస్తే ఈమె మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మొదటి భార్య. ప్రవక్త గారికి మీరు సరియైన మార్గానే ఉన్నారని అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ అగౌరవపరచడని ధైర్యాన్నిచ్చేవారు. జిబ్రాయిల్ గారు మొదటిసారి “వహీ” తీసుకొని హీరా గుహ వద్దకు వచ్చిన ఆ సంఘటన జరిగినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వణుకుతూ వణుకుతూ ఖదీజా (రదియల్లాహు అన్హా) దగ్గరకు వస్తారు. అప్పుడు ఆమె గారు ప్రవక్త గారికి భరోసా ఇస్తారు ఆ తరువాత ఆమె బంధువు అయినటువంటి వరఖా బిన్ నౌఫిల్ వద్దకు తీసుకువెళ్తారు (అతను అజ్ఞాన కాలంలో క్రైస్తవ పండితుడుగా ఉండేవాడు) అతను ప్రవక్త వారికి మరికొంత భరోసాని ఇచ్చాడు మరియు ఇలా అన్నాడు: మీ పై అవతరించే “వహీ” అల్లాహ్ తరపు నుండి వస్తుంది. (బుఖారి,ముస్లిం)
షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) తెలియచేశారు:
(అహ్లె సున్నత్ వల్ జమాఅత్) యొక్క అఖీదా ఏమిటంటే వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులను విశ్వాసుల మాతృమూర్తులుగా స్వీకరిస్తారు, మరియు పరలోకంలో కూడా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితోనే ఉంటారని విశ్వసిస్తారు. ముఖ్యంగా హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా) గారు ఈమె ద్వారానే ప్రవక్త గారు అధిక సంతానం పొందారు మరియు మొట్టమొదటిగా ప్రవక్తను విశ్వసించింది మరియు అన్ని సందర్భాలలో ప్రవక్త గారికి తోడ్పాటును ఇచ్చింది. ఆయనతో ధైర్యంగా నిలబడింది కూడా ఈ ఖదీజా (రదియల్లాహు అన్హా) గారు కాబట్టి ఈమె ప్రవక్త గారి దృష్టిలో ఉన్నత స్థానంలో ఉన్నారు.
సిద్దీఖా బిన్తే సిద్దీఖ్ (రదియల్లాహు అన్హుమా) గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా అన్నారు:
“స్త్రీలపై ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి ఘనత ఎటువంటిది అంటే ఏ విధంగా అయితే “తరీద్” భోజనానికి మిగతా ఆహార పదార్థాలపై ఘనత ఉందో.” (బుఖారి,ముస్లిం)
విశ్వాస మాతృమూర్తుల గొప్పదనం యొక్క మరొక ఆధారం ఏమిటంటే వారిపై ప్రత్యేకంగా దరూద్ పంపుతూ ఉండాలి. అనగా వారి కొరకు ఈ విధంగా దుఆ చేస్తూ ఉండాలి (అల్లాహ్ దైవదూతల సమావేశంలో వారి కీర్తిని పెంపొందించు గాక)
హజ్రత్ అబూ హుమైద్ అస్సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం తామొకసారి (దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి), “మీ పై దరూద్ పంపమని మమ్మల్ని ఆదేశించబడింది. మరి మీపై ఏమని దరూద్ పంపాలి?” అని అడిగాం. అందుకాయన ఈ విధంగా పఠిస్తూ ఉండమని చెప్పారు:
అల్లాహ్! నీవు ఇబ్రాహీమ్ ని కరుణించినట్లుగానే ముహమ్మద్ ను, ఆయన సతీమణులను, ఆయన సంతానాన్ని కూడా కరుణించు. నీవు సర్వలోకాలలో ఇబ్రాహీమ్ సంతానంపై శుభాల్ని కురిపించినట్లుగానే ముహమ్మద్ పై, ఆయన సతీమణులపై, ఆయన సంతానం పై కూడా శుభాల్ని కురిపించు. నిస్సందేహంగా నీవు స్తుతిపాత్రుడవు. ఘనత కలవాడవు. (బుఖారి,ముస్లిం)
విశ్వాసుల మాతృమూర్తుల యొక్క హక్కు ఏమిటంటే వారి క్షమాపణ (మగ్ ఫిరత్) కొరకు దుఆ చేస్తూ ఉండాలి. మరియు వారి ప్రత్యేకతలను వారి కీర్తిని తెలియపరుస్తూ ఉండాలి. మరియు వారిని ప్రశంసిస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దృష్టిలో వారికి ఉన్నత స్థానాలు ఉన్నాయి మరియు ఈ ఉమ్మత్ లో ఉన్న స్త్రీలందరిపై వారికి ఆధిక్యత ప్రసాదించబడింది.
ఓ విశ్వాసులారా! దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు అన్ని రకాల చెడు, అశ్లీలత నుండి క్షేమంగా ఉన్నారని తెలియజేసింది. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا)
ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష
ఇబ్నే జరీర్ (రహిమహుల్లాహ్) ఇలా ఆన్నారు :
ఓ ముహమ్మద్ కుటుంబీకులారా! అల్లాహ్ తఆలా మీ నుండి చెడు మరియు అశ్లీలతను తొలగించాలని మరియు అశ్లీలత నుండి మిమ్మల్ని పూర్తిగా శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. మరియు అల్లాహ్‌కు విధేయత చూపేవారు మాత్రమే ఇందులో ఉంటారు.
కాబట్టి ఈ ప్రాతిపదికన, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క భార్యల గౌరవాన్ని అవమానించడం మరియు వారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను బాధించేటు వంటి ఒక రూపం. ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని బాధించడాన్ని అల్లాహ్ నిషేధించాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
[إن الذين يؤذون الله ورسوله لعنهم الله في الدنيا والآخرة وأعد لهم عذابا عظيما]
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ శాపం పడుతుంది. ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది.
ఓ ముస్లింలారా! రవాఫిజ్ లను అల్లాహ్ నాశనం చేయుగాక! ఎందుకంటే వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులను అగౌరపరిచేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. మరియు వీరు కపట విశ్వాసుల అడుగుజాడల్లో మడుగులెత్తుతున్నారు. ఈ దుర్మార్గులు పవిత్రవంతురాలైనటువంటి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి మీద వ్యభిచారం యొక్క అబాండాన్ని మోపుతారు, అపమార్గాన్ని, చెడు విశ్వాసాన్ని ధర్మములో భాగంగా భావిస్తారు, ఇది వారిని కుఫ్ర్ వరకు చేరుస్తుంది. ఎందుకంటే ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి పై ఉన్న వ్యభిచారం యొక్క అపనింద నుండి ఆమెను నిర్దోషిగా రుజువు చేస్తూ అల్లాహ్ తఆలా ఖుర్ఆన్ లో అవతరించిన వాక్యాన్ని వారు విశ్వసించడం లేదు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
﴿إن الذين جاءوا بالإفك عصبة منكم لا تحسبوه شراً لكم بل هو خير لكم لكل امرئ منهم ما اكتسب من الإثم والذي تولى كبره منهم له عذاب عظيم * لولا إذ سمعتموه ظن المؤمنون والمؤمنات بأنفسهم خيرًا وقالوا هذا إفك مبين﴾
(ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చినది కూడా మీలోని ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే (ఈ వ్యవహారంలో), వారిలో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్నిబట్టి పాపం లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడుతుంది.)
మరోచోట అల్లాహ్ ఇక్కడ వరకు తెలియజేశాడు:
﴿ولولا إذ سمعتموه قلتم ما يكون لنا أن نتكلم بهذا سبحانك هذا بهتان عظيم * يعظكم الله أن تعودوا لمثله أبداً إن كنتم مؤمنين﴾
అసలు మీరు ఆ మాట వినగానే, “ఇలాంటి మాట చెప్పటం మనకు ఎంత మాత్రం తగదు. ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు. ఇది మాత్రం పెద్ద అభాండమే” అని ఎందుకు అనలేదు?
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) వారు ఇలా తెలియజేశారు:
ధార్మిక పండితులందరూ ఏకీభవించినటువంటి విషయం ఏమిటంటే ఈ వాక్యంలో తెలియజేసిన హెచ్చరిక తర్వాత కూడా ఏ వ్యక్తి అయినా సరే దీనికి వ్యతిరేకంగా నిందలు వేస్తే అతను (కాఫిర్) ఆవిశ్వాసి అవుతాడు. ఎందుకంటే అతను ఖుర్ఆన్ ను తిరస్కరించాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణుల గౌరవ మర్యాదలకు సంభందించిన కొన్ని విషయాలు ఇవి, అల్లాహ్ వారి పట్ల ఇష్టుడు అవు గాక!
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ ముస్లిం లారా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి భార్యలు అనగా ఆయన సంభోగం చేసిన స్త్రీలు వీరు పదకొండు మంది.
1. హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హా)
2. హజ్రత్ సౌదా బిన్తె జమ్ఆ (రదియల్లాహు అన్హా)
3. హజ్రత్ ఆయిషా సిద్దీకా బిన్తె అబూ బక్ర్ (రదియల్లాహు అన్హా)
4. హజ్రత్ హఫ్సా బిన్తె ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హా)
5. హజ్రత్ జైనబ్ బిన్తె కజీమా (రదియల్లాహు అన్హా)
6. హజ్రత్ ఉమ్మె సల్మా బిన్తె అబీ ఉమయ్యా (రదియల్లాహు అన్హా)
7. జైనబ్ బిన్తె జహష్ బిన్ రియాబ్ (రదియల్లాహు అన్హా)
8. జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)
9. ఉమ్మె హబీబా రమలా బిన్తె అబీ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హా)
10. హజ్రత్ సఫియ్యా (రదియల్లాహు అన్హా) బిన్తె హుయ్ బిన్ అక్తబ్
11. హజ్రత్ మైమూనా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా)
మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు తనపై ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపమని చెబుతూ ఇలా సెలవిచ్చారు: ఉత్తమమైన రోజుల్లో జుమా రోజు కాబట్టి ఆరోజు నాపై అతి ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపండి అవి నా ముందు ప్రదర్శించబడతాయి.
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు. నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ న్యాయం గురించి, బందువుల హక్కులు నెరవేర్చడం గురించి అజ్ఞాపిస్తున్నాడు. మరియు అశ్లీలం దౌర్జన్యం నుండి ఆపుతున్నాడు. ఆయన మనకు హితోపదేసిస్తున్నాడు. కనుక మనం ఎల్ల వేళళా ఆయనను స్మరిస్తూ ఉండాలి. ఆయన ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపాలి. అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

You must be logged in to post a comment.