యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తహ్రీమ్):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3rcWu2KG3dbap82eYuTHIS
అహ్సనుల్ బయాన్ (తెలుగు అనువాదం & వ్యాఖ్యానం) నుండి :
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 12 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబ జీవనం గురించి, ఆయన భార్యల వివాదాల గురించి తెలియజేసింది. ఈ సమస్యలకు సూచించబడిన పరిష్కారాన్ని విశ్వాసులు ఒక పాఠంగా, సంతోషకరమైన కుటుంబ జీవనానికి ఆదర్శంగా స్వీకరించాలని చెప్పడం జరిగింది. ఈ సూరా మొదటి ఆయత్లో వచ్చిన పదాన్నే దీనికి పేరుగాపెట్టడం జరిగింది. ఈ సూరాలో రెండు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడంజరిగింది. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలను దూరంగా ఉంచారు. అందుకు కారణం వారిలో కొందరు ఈర్ష్యా అసూయలకు గురికావడం వల్ల ఆయన అలా చేయవలసి వచ్చింది.
రెండవ విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఒకరికి ఒకరహస్యాన్ని తెలియజేసారు. ఆమె ఆ విషయాన్ని మరో భార్యకు చెప్పారు. ఈ విషయంతెలిసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చాలా నిరాశకు గురయ్యారు. ఈ ప్రవర్తన విశ్వాస ఘాతుకంగా భావించారు. ఆయన ఎంతగా వేదనకు గురయ్యారంటే వారికి విడాకులు ఇస్తానని హెచ్చరించారు కూడా. ఈ సూరాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భార్యలను ఉద్దేశించి, వారి వివాదాల విషయమై కఠినంగా హెచ్చరికలు చేయబడ్డాయి.
ఈ సూరాలో భార్యలకు సంబంధించి రెండు విభిన్నమైన ఉదాహరణలను ఇవ్వడంజరిగింది. లూత్(అలైహిస్సలాం), నూహ్ (అలైహిస్సలాం) వంటి విశ్వాసులను పెళ్ళాడిన అవిశ్వాస భార్యలకు సంబంధించినది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణలో అవిశ్వాసిని పెళ్ళాడిన విశ్వాసి అయిన భార్య గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఫిర్ ఔన్ భార్య గురించి తెలియజేయడం జరిగింది. అలాగే అవివాహిత కన్య అయిన మర్యం గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకోవలసిన పాఠాలు ఏమంటే, తీర్పుదినాన కుటుంబ సంబంధాలు ఏ విధంగాను ఉపయోగపడవు. ఆ రోజున ఉపయోగపడేది మంచిపనులే. భార్య అయినా, భర్త అయినా ఎవరు చేసుకున్న మంచి పనులు వారికే ఉపయోగపడతాయి. బాధాకరమైన శిక్ష నుంచి మనిషిని కాపాడేది సదాచరణ మాత్రమే.