1.15 జకాత్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు 

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

567 – حديث أَبِي سَعِيدٍ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوَاقٍ صَدَقَةٌ، وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ ذَوْدٍ صَدَقَةٌ، وَلَيْسَ فِيمَا دُونَ خَمْسِ أَوْسُقٍ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 4 باب ما أدى زكاته فليس بكنز

567. హజ్రత్ అబూసయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:- “ఐదు ఊఖియాల (52 1/2 తులాల) కన్నా తక్కువ వెండి పై జకాత్ లేదు. ఐదుకంటే తక్కువ ఒంటెల పై కూడా జకాత్ లేదు. అలాగే ఐదు వసఖ్ ల * కన్నా తక్కువ (ఖర్జూరం లేక ధాన్యం) పై కూడా జకాత్ లేదు.”

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 4వ అధ్యాయం – మాఅదీ జకాతుహూ ఫలైస బి కన్జ్ ]

* వసఖ్ అంటే శాబ్దిక భావం ‘బుట్ట లేక తట్ట’. బరువు రీత్యా ఒక వసఖ్ 60 ‘సా’లకు సమానం. ఒక ‘సా’ నాలుగు ‘ముద్’లు అవుతుంది. ఒక ‘ముద్’ రెండు ‘రతిల్ ల కు సమానం. ఒక ‘రతిల్ అర్ధ ‘సేరు’, పావు ‘సేరు’లకు సమానం. ఒక సేరు’ ఎనభై ‘తులాల’కు సమానం. ఒక ‘ముద్’ ఒకటింబావు సేరు అవుతుంది. ఒక ‘సా’ అయిదు ‘సేర్ల’కు సమానం. ఒక వసఖ్ (60 ‘సా’ లు) ఏడున్నర ‘మణుగు’లకు సమానం. ఇలా అయిదు ‘వసఖ్ లు 37 మణుగుల 20 సేర్లు అవుతాయి. (గమనిక : ఒక ‘తులం’ దాదాపు 11.5 గ్రాములు అవుతుంది – అనువాదకుడు)

568 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَيْسَ عَلَى الْمُسْلِمِ فِي فَرَسِهِ وَغُلامِهِ صَدَقَةٌ
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 45 باب ليس على المسلم في فرسه صدقة

568. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:- “ముస్లిం యాజమాన్యంలో ఉన్న గుర్రాలపై, బానిసలపై జకాత్ విధిగా లేదు”.*

[సహీహ్ బుఖారీ: 24వ ప్రకరణం – జకాత్, 45వ అధ్యాయం – లైస అలల్ ముస్లిమి ఫీ ఫరసిహీ సదఖా]

* గుర్రాల పై, బానిసల పై జకాత్ లేదన్న విషయంలో ఎలాంటి అభిప్రాయభేదం లేదు. కాకపోతే అత్యధిక సంఖ్యలో వ్యాపార నిమిత్తం ఉన్నప్పుడు జకాత్ విధిగా చెల్లించాలి. ఇందులో కూడా విభిన్న అభిప్రాయాలు లేవు. అయితే గుర్రాలు వ్యాపార నిమిత్తం కాకపోయినా ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటి జకాత్ విషయంలోనే అభిప్రాయభేదాలున్నాయి.

569 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: أَمَرَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالصَّدَقَةِ، فَقِيلَ: مَنَعَ ابْنُ جَمِيلٍ، وَخَالِدُ بْنُ الْوَلِيدِ، وَعَبَّاسُ بْن عَبْدِ الْمُطَّلِبِ؛ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: [ص:198] مَا يَنْقِمُ ابْنُ جَمِيلٍ إِلاَّ أَنَّهُ كَانَ فَقِيرًا فَأَغْنَاهُ اللهُ وَرَسُولُهُ وَأَمَّا خَالِدٌ، فَإِنَّكُمْ تَظْلمُونَ خَالِدًا، قَدِ احْتَبَسَ أَدْرَاعَهُ وَأَعْتُدَهُ فِي سَبِيلِ اللهِ؛ وَأَمَّا الْعَبَّاسُ بْنُ عَبْدِ الْمُطَّلِبِ، فَعَمُّ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَهِيَ عَلَيْهِ صَدَقَةٌ وَمِثْلَهَا مَعَهَا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 49 باب قول الله تعالى وفي الرقاب

569. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్ వసూలు చేయమని ఆదేశించిన తరువాత (ఒకసారి) హజ్రత్ ఇబ్బె జమీల్ * (రదియల్లాహు అన్హు), ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు), అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ లు జకాత్ చెల్లించడానికి నిరాకరించినట్లు ఆయనకు సమాచారం అందింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: “ఇబ్నె జమీల్ (రదియల్లాహు అన్హు) గతంలో పేదవానిగా ఉండేవారు. ఇప్పుడు అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని ధనికునిగా చేశారు. (అందుకు అతను వారి పట్ల కృతజ్ఞత చూపడా?) ఖాలిద్ (రదియల్లాహు అన్హు)ని జకాత్ అడిగి మీరతని పై అన్యాయానికి పాల్పడుతున్నారు. అతను తన యుద్ధ కవచాన్ని, ఆయుధాల్ని సైతం దైవమార్గంలో అంకితం చేశాడు. పోతే అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి అయినందున ఆయన జకాత్ ఆయనకే సదఖా (దానం) అవుతుంది. కాకపోతే అంతే జకాత్ మొత్తం (ఆయన తరఫున నేను చెల్లిస్తాను)”.*

[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 49వ అధ్యాయం – ఖౌలిల్లాహితఆలా (వఫిర్రిఖాబ్)]

* ఇబ్నె జమీల్ జకాత్ ని నిరాకరించడానికి అతని దగ్గర ఎలాంటి కారణం లేదు. ఆయన తప్పనిసరిగా జకాత్ చెల్లించాలి. అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల కృతఘ్నుడయి పోకూడదు.

* సహీహ్ ముస్లింలో వచ్చిన ఉల్లేఖనం ఇలా ఉంది. “ఇక అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారి విషయానికొస్తే ఆయన జకాత్ బాధ్యత నా పై ఉంది. పైగా నేను ఆయన తరఫున అంతకు మరింత చెల్లిస్తాను” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆ తరువాత “ఉమర్! మీకు తెలుసా! చిన్నాయన (లేదా పెదనాన్న) కన్నతండ్రితో సమానం” అన్నారు ఆయన.