వ్యభిచారం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

వ్యభిచారం (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/OIK2VedWGQA (16 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వ్యభిచారం (జినా) యొక్క నిషేధం గురించి, దాని తీవ్రత, అది దారితీసే మార్గాలను ఇస్లాం ఎలా నిరోధిస్తుంది, మరియు ఈ పాపానికి పాల్పడిన వారికి ప్రపంచంలో మరియు మరణానంతరం విధించబడే కఠిన శిక్షల గురించి చర్చించబడింది. హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత, చూపులను అదుపులో ఉంచుకోవడం, మరియు ఒంటరిగా పర స్త్రీ-పురుషులు కలవడాన్ని ఇస్లాం ఎందుకు నిషేధించిందో వివరించబడింది. వివాహితులు మరియు అవివాహితులు చేసే వ్యభిచారానికి గల శిక్షలలో తేడా, వృద్ధాప్యంలో ఈ పాపానికి పాల్పడటం యొక్క తీవ్రత, మరియు పేదరికాన్ని కారణంగా చూపి ఈ పాపంలో మునిగిపోవడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టం చేయబడింది. ఆధునిక సమాజంలో వ్యభిచారానికి దారితీసే కారణాలను వివరిస్తూ, ఈ చెడు నుండి దూరంగా ఉండేందుకు అల్లాహ్‌ను ప్రార్థించడం జరిగింది.

ఇక రండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి, ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ నిషేధాల్లో అనేకమంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము. అది వ్యభిచారం.

ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ త’ఆలా సూరత్ బనీ ఇస్రాయీల్ ఆయత్ నంబర్ 32 లో తెలిపాడు,

وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం” (17:32)

వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇక్కడ గమనించండి ఆయతులో ‘లా తఖ్రబు’ అని చెప్పబడింది. ‘లా తజ్నూ’ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ గా చెప్పలేదు. ‘లా తఖ్రబు’ అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకండి.

నిశ్చయంగా అది అతి దుష్టకార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం. షేక్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు. ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది? ఎందుకు దీనిని అశ్లీలం, అతి దుష్టకార్యం అని చెప్పడం జరిగింది? అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్స్ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము.

సర్వసామాన్యంగా వ్యభిచారానికి పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల. అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది. దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది.

ఈ మార్గాలను, వ్యభిచారం వరకు చేర్పించే సాధనాలను ఏదైతే మూసివేశాడో, వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ త’ఆలా హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు, పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా, రెడ్ లైన్ గా, రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోదీ మీడియా అనండి లేదా స్వార్థపరులైన పత్రికా రిప్రజెంటేటివ్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికే లేదు వారికి, ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు, అస్తగ్ఫిరుల్లాహ్.

ఇక్కడ చూడండి, సూరతుల్ అహ్ జాబ్, సూరా నంబర్ 33, ఆయత్ నంబర్ 53. అలాగే సూరతుల్ అహ్ జాబ్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే,

فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَاۤءِ حِجَابٍ
(ఫస్ అలూహున్న మివ్ వరా’ఇ హిజాబ్)
“పరదా వెనుక ఉండి అడగాలి.” (33:53)

హిజాబ్ వెనుక ఉండి అడగాలి. ముంగటగా అటు ఒక స్త్రీ ఉంది, ఇటు నేను ఉన్నాను, డైరెక్ట్ గా అడగకూడదు. ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి, పరదా ఉండాలి, హిజాబ్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ‘ఫస్ అలూహున్న’ అనేది అమ్ర్ (ఆర్డర్, ఆదేశం). అంతేకాకుండా ‘మివ్ వరా’ఇ హిజాబ్’ అని చెప్పాడు అల్లాహ్ త’ఆలా. ఇది డైరెక్ట్ ఆదేశమే ఉన్నది. ఇక ఖుర్ఆన్లో ఎక్కడా కూడా పరదా ఆదేశం లేదు అని అంటారు? ఇది వారి యొక్క అజ్ఞానం. వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం.

అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఆయత్ నంబర్ 59 లో కనబడుతుంది. అక్కడ అల్లాహ్ త’ఆలా అంటున్నాడు,

قُلْ
(ఖుల్)
“ఓ ప్రవక్త, మీరు చెప్పండి.” (33:59)

వారికి ఆదేశం ఇవ్వండి. ఎంత స్పష్టంగా ఉంది! చెప్పండి, ఆదేశం ఇవ్వండి,

يُدْنِيْنَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيْبِهِنَّ
(యుద్నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్)
“తమ దుపట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని.” (33:59)

ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము? మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్లాలంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? సూరతున్ నూర్, ఆయత్ నంబర్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది.

మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు, కానీ మాట వచ్చింది గనుక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను. ఇవి సరిపోతాయి, మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాఅల్లాహ్ తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ‘సాధనాలను’ అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో, దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి ఒక వీడియో మీకు ఇన్షాఅల్లాహ్ ఓపెన్ అవుతుంది.

వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను, అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు. చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి, మితిమీరి వ్యభిచారానికి పాల్పడ్డాడంటే, ఇక వారికి శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది, ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని.

శ్రద్ధగా వినండి. వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం. అతను చనిపోయేవరకు అతనిపై రాళ్లు రువ్వబడాలి. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి. అతని శరీరము యొక్క ప్రతీ భాగం, అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో, అలాగే ఈ శిక్ష ద్వారా బాధను, నొప్పిని అనుభవించాలి. ఇది ఎవరి కొరకు? వివాహితుడైన, పెళ్లి అయిన తర్వాత భార్యతో అతడు సంసారం చేసేసాడు, ఆ తర్వాత మళ్లీ వ్యభిచారానికి పాల్పడ్డాడు, అలాంటి వానికి ఈ శిక్ష.

కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువ. ఇక్కడ వివాహం కాని యువకుడు, యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద కొరడా దెబ్బల శిక్ష, ఇది చాలా ఎక్కువ సంఖ్య, ఈనాటి ఈ పాపానికే విధించబడినది.

అంతేకాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. ఇది ప్రాపంచిక శిక్ష.

చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహితునికైనా, వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మనం సామాన్య మనుషులం, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు. ఒక ప్రభుత్వం, అధికారం చేతిలో ఉన్నవారు ఈ శిక్షను విధిస్తారు.

ఇక రండి, ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు, శిక్ష పడలేదు, అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి.

పైన ఇరుకుగా, కింద వెడల్పుగా ఉండే కుండ లాంటి ఆవంలో వారు నగ్నంగా వేయబడతారు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మ అజిర్నా మిన్హు. ఓ అల్లాహ్ మమ్మల్ని రక్షించు ఇలాంటి పాపాల నుండి, ఇలాంటి శిక్షల నుండి. దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది. అందులో జ్వాలలను ప్రజ్వలింప జేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు. కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు. ఇలా పైకి రావడం, జ్వాలలు ఎగిరినప్పుడు, అవి చల్లారినప్పుడు కిందికి పోవడం, అగ్నిలో కాలుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు.

క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష, ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే మాటేనా? కానీ ప్రపంచ వ్యామోహంలో పడి, స్త్రీల యొక్క ఫితనాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు. ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.

పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు? మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ, అల్లాహ్ శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తౌబా కొరకు, అల్లాహ్ తో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునిగి తేలుతున్నప్పుడు. ఏంటి ఆ విషయం? వినండి హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمْ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ شَيْخٌ زَانٍ وَمَلِكٌ كَذَّابٌ وَعَائِلٌ مُسْتَكْبِرٌ

“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).

గమనించారా? వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే, అల్లాహ్ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి.

సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).

ఇక దీని గురించి మరొక విషయం, సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అయితే అలాంటి సంపద చాలా చెడ్డది. ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో, అర్ధరాత్రి ఆకాశ ద్వారాలు తెరువబడే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క దుఆలను అంగీకరించే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క రోదనలను, వారి యొక్క ఆర్ధింపులను వింటున్న సమయాన ఆ వ్యభిచారి యొక్క దుఆ స్వీకరించబడదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా. అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసికోవాలి.

ఇక పేదరికం, అవసరం కొందరంటారు కదా, పేదరికం ఉన్నది, ఎక్కడా మాకు ఏ మార్గం లేదు, మా బ్రతుకు తెరువు ఎలా గడవాలి, మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము, అందుకొరకే ఈ చెడుకు పాల్పడ్డాము. అయితే, పేదరికం, అవసరం అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంతమాత్రం ధార్మిక సబబు కావు. అరబ్బుల్లో జాహిలియ్యత్ లో, ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది, “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.

నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పరదా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడటం, స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు, నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యా గృహాలు లైసెన్సులు ఇచ్చి తెరువబడుతున్నాయి, అల్లాహు అక్బర్. ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయని. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి, అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి, అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.

ఓ అల్లాహ్, మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధపరచి, మా మానాలను కాపాడుము, మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము. ఆమీన్. అందుకొరకే దుఆ చేసుకుంటూ ఉండాలి.

اَللّٰهُمَّ طَهِّرْ قُلُوْبَنَا
(అల్లాహుమ్మ తహ్హిర్ ఖులూబనా)
ఓ అల్లాహ్ మా హృదయాలను శుద్ధిపరచు

اَللّٰهُمَّ أَحْصِنْ فُرُوْجَنَا
(అల్లాహుమ్మ అహ్సిన్ ఫురూజనా)
మా మర్మాంగాలను కాపాడు.

ఓ అల్లాహ్ మా చూపులను మేము కిందికి వాలించి, కిందికి వేసి ఉండే విధంగా మాపై ఎల్లప్పుడూ భాగ్యం ప్రసాదించు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41181

వ్యభిచారం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి [వీడియో]

భర్త అక్రమ సంభంధం పెట్టుకొని చెడుపనులకు పాల్పడకుండా ఉండటానికి ఏదయినా దుఆ ఉందా? [వీడియో]

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.

ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.

అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.

ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.

చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.

అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.

ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.

అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.

షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.

అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.

ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.

అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.

ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్‌గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.

ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.

అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.

అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.

అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.

తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.

వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.

ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.

ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.

షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.

ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్) దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.

దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.

చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.

మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.

మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,

وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
(వజ్కుర్ ఫిల్ కితాబి ఇద్రీస ఇన్నహూ కాన సిద్దీఖన్ నబియ్యన్, వ రఫఅనాహు మకానన్ అలియ్యా)

ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)

అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.

మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.

ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.

అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.

ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.

ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.

ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.

మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.

అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?

మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.

రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.

కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.

అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.

దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.

దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.

అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.

ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31097

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8