ఏమీ లేనివారు దానం చేసేదెలా? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఏమీ లేనివారు దానం (సదకా) చేసేదెలా?
https://youtu.be/wB4zgYE0JwQ [21 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దానం (సదకా) యొక్క ప్రాముఖ్యత మరియు దాని విస్తృతమైన అర్థం గురించి వివరించబడింది. గత వారం ప్రసంగంలోని 18 ప్రయోజనాలను గుర్తుచేస్తూ, ఈ వారం ముఖ్యంగా ఏమీ లేని వారు కూడా ఎలా దానం చేయవచ్చో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. శారీరక శ్రమ చేసి సంపాదించి ఇవ్వడం, అది కూడా సాధ్యం కాకపోతే ఇతరులకు శారీరకంగా సహాయపడటం, అది కూడా చేయలేకపోతే కనీసం చెడు పనుల నుండి దూరంగా ఉండటం కూడా దానమేనని వివరించబడింది. మంచి మాట పలకడం, దారి చూపడం, ఇబ్బంది కలిగించే వస్తువులను తొలగించడం వంటి ప్రతి మంచి పని సదకాగా పరిగణించబడుతుందని చెప్పబడింది. దానం చేసేటప్పుడు ప్రదర్శనా బుద్ధి (రియా) ఉండకూడదని, అల్లాహ్ ప్రసన్నతను మాత్రమే ఆశించాలని ఖురాన్ ఆయతుల ద్వారా నొక్కి చెప్పబడింది. దానం రహస్యంగా ఇవ్వడం ఉత్తమమని, కానీ ఫర్జ్ అయిన జకాత్‌ను ఇతరులను ప్రోత్సహించడానికి బహిరంగంగా ఇవ్వవచ్చని కూడా పేర్కొనబడింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي يُجْزِلُ الْمُتَصَدِّقِينَ
దాతలకు గొప్ప ప్రతిఫలాన్నిచ్చే అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

وَيُخْلِفُ عَلَى الْمُنْفِقِينَ
ఖర్చు చేసేవారికి ప్రతిఫలం ఇస్తాడు.

وَيُحِبُّ الْمُحْسِنِينَ
సజ్జనులను ప్రేమిస్తాడు.

وَلَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
మరియు విశ్వాసుల ప్రతిఫలాన్ని వృధా చేయడు.

أَحْمَدُهُ سُبْحَانَهُ
నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను,

عَلَىٰ نِعَمِهِ الْعَظِيمَةِ
ఆయన గొప్ప అనుగ్రహాలకు,

وَآلَائِهِ الْجَسِيمَةِ
మరియు ఆయన అపారమైన వరాలకు,

وَصِفَاتِهِ الْكَرِيمَةِ
మరియు ఆయన ఉదార గుణాలకు.

وَأَسْأَلُهُ أَنْ يَجْعَلَ عَمَلَنَا فِي الْخَيْرِ دِيمَةً
మంచి పనులలో మా ఆచరణను నిరంతరం ఉండేలా చేయమని నేను ఆయనను వేడుకుంటున్నాను.

وَأَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.

وَهُوَ الرَّبُّ الْعَظِيمُ
ఆయనే గొప్ప ప్రభువు,

وَالْإِلَٰهُ الرَّحِيمُ
దయగల ఆరాధ్యుడు,

الْجَوَّادُ الْمُحْسِنُ الْكَرِيمُ
దాత, సజ్జనుడు, ఉదారుడు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

النَّبِيُّ الْأَمِينُ
విశ్వసనీయ ప్రవక్త,

وَالرَّسُولُ الْكَرِيمُ
గౌరవనీయమైన ప్రవక్త.

كَانَ أَجْوَدَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత దాతృత్వంగలవారు.

وَأَكْرَمَ النَّاسِ
ప్రజలందరిలోకెల్లా అత్యంత గౌరవనీయులు.

فَكَانَ أَجْوَدَ بِالْخَيْرِ مِنَ الرِّيحِ الْمُرْسَلَةِ
ఆయన మంచి చేయడంలో వేగంగా వీచే గాలి కంటే ఎక్కువ దాతృత్వం కలవారు.

صَلَّى اللَّهُ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ
అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులపై శాంతిని వర్షింపజేయుగాక.

الَّذِينَ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ
వారు మంచి పనులలో పోటీపడేవారు.

فَكَانُوا يُنْفِقُونَ مِمَّا يُحِبُّونَ
వారు తమకు ఇష్టమైన వాటి నుండి ఖర్చు చేసేవారు.

وَيُؤْثِرُونَ عَلَىٰ أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ
మరియు తమకు అవసరం ఉన్నప్పటికీ, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

وَمَنْ يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మరియు ఎవరైతే తన మనస్సు యొక్క పిసినారితనం నుండి రక్షించబడ్డాడో, అటువంటి వారే సాఫల్యం పొందేవారు.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! గత శుక్రవారం మనం ఇహపర లోకాలలో దానం వల్ల కలిగే 18 ప్రయోజనాలు తెలుసుకున్నాం.

ఈరోజు ఏమీ లేని వారు దానం చేసేది ఎలా? ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట ఇలా ఉంటుంది.

عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ
[అలా కుల్లి ముస్లిమిన్ సదఖతున్]
ప్రతి ముస్లింపై దానం (సదకా) చేయడం తప్పనిసరి.

ఇది హదీస్ కి అర్థం. ప్రతి ముస్లింపై దానం చేయడం తప్పనిసరి విధి. మరి సహాబాలలో చాలామంది పేదవారు, లేనివారు. అంతెందుకు, కొంతమంది సహాబాకి ఇల్లు కూడా లేదు, మస్జిద్ లో ఉంటున్నారు. వారి నివాసం మస్జిద్. వారిలో కొంతమంది కూలి పని చేసుకుని తన జీవితం గడిపితే, మరి కొంతమంది దీన్ నేర్చుకోవడం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి మస్జిద్ లోనే ఉండిపోయేవారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లాంటి వారు. అంటే ఎవరైనా ఏదైనా దానం చేసి ఖర్జూరం తీసుకుని వచ్చి ఇస్తే అది తినేవారు, లేకపోతే పస్తులు ఉండేవారు. మరి అటువంటి వారు దానం ఎలా చేయాలి? ఈ హదీస్ కి అర్థం ఏమిటి? “అలా కుల్లి ముస్లిం సదకా” – ప్రతి ముస్లింపై దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. మరి సహాబాలకి ఆశ్చర్యం వేసింది, సహాబాలు అడిగారు. ఏం అడిగారు? “ఓ ప్రవక్తా, ఒకవేళ అతని వద్ద స్థోమత లేకుంటే ఏం చేసేది?”

قِيلَ: أَرَأَيْتَ إِنْ لَمْ يَجِدْ؟
దానం చేసే అంత స్థోమత లేదు, మరి ఏం చేయాలి?

قَالَ
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يَعْتَمِلُ بِيَدَيْهِ
అతను కూలి పని చేయాలి.

فَيَنْفَعُ نَفْسَهُ
తద్వారా వచ్చిన వేతనంతో తాను తినాలి,

وَيَتَصَدَّقُ
అవసరార్థులకు తినిపించాలి.

ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా దానం చేసే స్థోమత లేదు. అటువంటి వారు ఏం చేయాలి? దానికి సమాధానం ప్రవక్త గారు ఏం చెప్పారు? కూలి పని చేయండి. తద్వారా వచ్చిన వేతనంతో స్వయంగా తినండి, అవసరార్థులకు తినిపించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.

అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే మిడిల్ క్లాస్ వారు, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, పేదవారు, లేనివారు దానం అనేది ధనవంతులు మాత్రమే చేస్తారు, వారు చేసే పని, నాలాంటి వారికి, మాలాంటి వారికి దానం లేదు, పేదవాళ్ళం కదా అని ఆ భ్రమలోనే జీవితాంతం అలాగే ఉండిపోతారు. కానీ ఈ హదీసులో ఏమీ లేని వారు కూడా తమ స్థోమతను బట్టి దానం చేయాలని మహాప్రవక్త ఆజ్ఞాపించారు. అంతటితో హదీస్ పూర్తి అవ్వలేదు. ఆ తర్వాత మళ్లీ సహాబాలు అడిగారు.

أَرَأَيْتَ إِنْ لَمْ يَسْتَطِعْ؟
కూలి పని చేసే అంత శక్తి కూడా అతనికి లేదు.

కొందరు ఉంటారు, అనారోగ్యం మూలంగా, ముసలితనం మూలంగా, ఇంకో ఏదైనా కారణంగా ఆ పని కూడా చేయలేరు. మరి మీరేమో “అలా కుల్లి ముస్లిం సదకా” అని చెప్పేశారు, తప్పనిసరి అని చెప్పేశారు. కూలి పని చేసే అంత శక్తి కూడా లేదు, ఆ అవకాశం కూడా లేదు. అటువంటి వారు ఏం చేయాలి? అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒకవేళ అతను కూలి పని కూడా చేయగలిగే శక్తి లేనివాడైతే ఆ వ్యక్తి దుఖితులకు, అవసరార్థులకు శారీరక సేవను చేయాలి. ఇది కూడా దానం కిందకే వస్తుంది. అంటే పేదవాడు, డబ్బు లేదు, ఏమీ లేదు, కూలి కూడా చేయలేడు, అటువంటి వాడు శారీరకంగా ఇతరులకు సహాయం చేయగలిగితే సహాయం చేయాలి, అది కూడా దానం కిందకే వస్తుంది. ఆ తర్వాత అది కూడా చేయలేకపోతే? అనారోగి. ఒక రోగి అనారోగ్యంతో ఉన్నాడు. శారీరకంగా కూడా సహాయం చేసే స్థితిలో లేడు. దాని గురించి అన్నారు, అది కూడా చేయకపోతే చెడు పనుల నుండి తన్ను తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా కిందకే వస్తుంది. చెడు నుండి తనకు తాను కాపాడుకోవాలి. ఇది కూడా సదకా, దానం గానే పరిగణించబడుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే బుఖారీలో ఒక హదీస్ ఉంది, అది ఏమిటంటే:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
ప్రతి మంచి మాట కూడా దానం కిందకే వస్తుంది.

ఒక మంచి మాట పలకడం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే అనేక హదీసులలో దారి తప్పిన బాటసారికి దారి చూపటం కూడా దానమే, ఒక గుడ్డివాని చేయి పట్టి మార్గదర్శకత్వం వహించడం కూడా దానమే, దారిలో నుండి ముల్లును, రాయిని, ఎముకను తొలగించడం కూడా దానమే. తన బొక్కెనలో ఉన్న నీరును తోటి సోదరుని కడవలో పోయటం కూడా దానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే దానం చేయాలంటే అనేక మార్గాలు మనకు ఇస్లాం తెలియపరుస్తుంది. కాకపోతే తన స్థోమత మేరకు ఆర్థికపరంగానైనా, శారీరకపరంగానైనా, ఏదో విధంగానైనా దానం చేయాలి, సహాయం చేయాలని బోధపడింది.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం చేసిన తర్వాత వాటి నుంచి ఏదీ ఆశించకూడదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మొదటి వహీ వచ్చింది: “ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్”. ఆ తర్వాత రెండవ వహీ సూరహ్ ముద్దస్సిర్. దాంట్లో ఒక వాక్యం ఉంది.

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. (74:6)

నేను దానం చేస్తే, నేను సహాయం చేస్తే, తిరిగి అతనితో నాకు ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో దానం చేస్తే అది దానం కాదు. అది సదకా కాదు. నువ్వు ఒక ఉద్దేశ్యంతో, ఒక లాభంతో, మళ్లీ నీకు ఏదో రూపంలో తిరుగు వస్తుందనే భావంతో నువ్వు ఇస్తున్నావు కదా? అది దానం ఎలా అయ్యింది? ఆ ఉద్దేశ్యంతో దానం, ఉపకారం చేయకు అని అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశించి అంటున్నాడు. “వలా తమ్నున్ తస్తక్ సిర్” – ఓ ప్రవక్తా, అధికంగా పొందాలన్న ఆశతో ఉపకారం చేయకు. సర్వసాధారణమైన రీతిలో ముస్లింలకు ఈ విధంగా తాకీదు చేయడం జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. (2:264)

ఈ ఆయతులో ప్రదర్శనా బుద్ధితో దానం చేయటం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిశ్వాసులతో పోల్చాడు. ఏ విధంగా అయితే “వలా యు’మిను బిల్లాహ్”, అల్లాహ్‌ను ఎవరు విశ్వసించరో, అల్లాహ్‌ను ఎవరు నమ్మరో, వారు ఈ విధానాన్ని పాటిస్తారు. వారికి మరణం తర్వాత జీవితం, వారికి అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ పట్ల భీతి లేదు కదా? విశ్వాసమే లేదు. అటువంటి వారు చేసే దానం, మీరు విశ్వసించే వారు, మీరు చేసే దానం ఒకే రకంగా ఉంటే తేడా ఏంటి? వారు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తారు, మీరు అలా చేయకండి. అలా చేస్తే వారు చేసిన దానం మాదిరిగా అవుతుంది అని అల్లాహ్ ఉపమానం ఇచ్చాడు. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ
దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్‌ అక్కరలేనివాడు, సహనశీలుడు.(2:263)

అంటే మీరు ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తున్నారు, దానికంటే మంచి మాట చెప్పటం మంచిది. పుణ్యం వస్తుంది. దీనికి పుణ్యం రాదు కదా. అది రియా అయిపోయింది కదా, పాపం అయిపోయింది కదా. డబ్బు పోయింది, పుణ్యం పోయింది. దానికంటే అటువంటి దానం కంటే మంచి మాట పలకటం ఇది గొప్పది అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ లో. అలాగే సూరహ్ బఖరాలో ఇలా ఉంది:

إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
[ఇన్ తుబ్దుస్ సదఖాతి ఫనిఇమ్మా హియ, వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్, వ యుకఫ్ఫిరు అన్కుమ్ మిన్ సయ్యిఆతికుమ్, వల్లాహు బిమా త’అమలూన ఖబీర్]
ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్‌ మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్‌కు మీరు చేసేదంతా తెలుసు.(2:271)

ఇక్కడ బహిరంగంగా అంటే కొంతమంది పండితులు ఇది జకాత్, ఫర్జ్ జకాత్. ఈ ఫర్జ్ జకాత్‌ని కొందరికి తెలిసి నేను ఇస్తే, వేరే వాళ్ళకి నేను ఆదర్శంగా ఉంటాను. ఇది ఫర్జ్ కదా. ఇప్పుడు మనం నమాజ్ ఫర్జ్, దాన్ని గోప్యంగా చేసే అవసరం లేదు. ఉపవాసం ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఉన్నవారికి హజ్ ఫర్జ్, గోప్యం అవసరం లేదు. ఆ విధంగా జకాత్ ఫర్జ్ అయిన వారు కొందరికి తెలిసి జకాత్ ఇస్తే అది మంచిదే. కానీ నార్మల్ సదకా, సాధారణమైన సదకా దానాలు, “వ ఇన్ తుఖ్ఫూహా వ తు’తూహల్ ఫుఖరాఅ ఫహువ ఖైరుల్ లకుమ్” అయితే మీరు వాటిని గోప్యంగా నిరుపేదల వరకు చేరిస్తే అది మీకు మరీ మంచిది. అల్లాహ్ మీ పాపాలను మీ నుండి దూరం చేస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు. అలాగే:

الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. (2:274)

ఇక దానం చేసిన తర్వాత మనసులో బాధ కలిగితే, అది ఎటువంటి దానం అది? ఇష్టం లేకుండా, అయిష్టకరంగా ఇవ్వటం. వారు ఇస్తున్నారు, నేను ఇవ్వకపోతే బాగుండదు కదా, అనుకుని ఇవ్వటం. ఇచ్చిన తర్వాత బాధపడటం, అయ్యో పోయింది అని చెప్పి. దీన్ని ఏమంటారు? ఖురాన్ లో ఉంది.

وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَارِهُونَ
వారు, అంటే కపట విశ్వాసులు, మునాఫిఖీన్లు, ఒకవేళ దైవ మార్గంలో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. (9:54)

ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కపట విశ్వాసుల గురించి చెప్పాడు. బాధపడుతూ దానం చేయటం, అయిష్టకరంగా దానం చేయటం, దానం చేసిన తర్వాత కుమిలిపోవటం, ఎందుకు ఇచ్చానా అని చెప్పి, డబ్బు పోయిందా అని అనుకోవటం, ఇది ఎవరి గుణము? కపట విశ్వాసుల గుణం. సూరహ్ తౌబాలో ఉంది. అంటే అయిష్టంగా ఖర్చు పెట్టడం ఇది కపట విశ్వాసుల లక్షణం.

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ
దైవ ప్రసన్నతను చూరగొనటానికి (అల్లాహ్ ప్రసన్నత, అల్లాహ్ కి మర్జీ, అల్లాహ్ కి రజా పానే కే లియే) తమ పనులను, మనసులను నిమ్మళించడానికి సంపదను ఖర్చు పెట్టే వారి ఉపమానం ఎత్తైన ప్రదేశంలో ఉన్న తోట వంటిది.

وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ
ఇంకా మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నతను బడయటానికే ఖర్చు చేయండి. మీరేం ఖర్చు చేసినా అది మీకు పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు. (2:272)

అంటే దానాల ప్రయోజనం అల్లాహ్ ఈ లోకంలో కూడా ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తాడు.

అభిమాన సోదరులారా, ఒకటి, ప్రతి వ్యక్తి దానం చేయవచ్చు. డబ్బు ఉన్నవారు ఆర్థికపరంగా, తక్కువ ఉన్నవారు తమ స్థోమతపరంగా, ఏమీ లేని వారు ఇతర మార్గాల ద్వారా ప్రతి వ్యక్తి దానం చేసే అవకాశం ఉంది. రెండవది ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో దానం చేయకూడదు, అది రియా అవుతుంది, చిన్న షిర్క్ అవుతుంది, దానికి ప్రతిఫలం రాదు.

మూడవ విషయం,

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
[కుల్లు మ’అరూఫిన్ సదఖతున్]
మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా క్రిందకే వస్తుంది.

కుల్లు మ’అరూఫిన్ సదకా, మేలుతో కూడుకున్న ప్రతి మంచి పని సదకా కిందకే వస్తుంది. కావున స్థోమత ఉన్నవారు తమ స్థోమత పరంగా ఏదో రూపంలోనైనా దానం చేయాలి, అది చిన్నది అని అల్పంగా భావించకూడదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ
ఏ సత్కార్యాన్ని అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి. ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించడాన్ని అయినా సరే.

అంటే చిరునవ్వుతో నవ్వటం కూడా మంచి సంకల్పంతో సదకా కిందకే వస్తుంది. అది ఎంత చిన్నదైనా, ఎంత రవ్వంత అయినా సరే, అల్పంగా భావించకండి. అల్లాహ్ మనసు చూస్తాడు, అల్లాహ్ నియ్యత్, సంకల్పం చూస్తాడు. ఎటువంటి సంకల్పంతో, ఎటువంటి బుద్ధితో ఇస్తున్నావు, అది ముఖ్యం. ఎంత ఇస్తున్నావు అది ముఖ్యం కాదు.

అలాగే చివర్లో ఒక హదీస్ చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఒక హదీసులో ఇలా ఉంది:

كُلُّ سُلامَى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ، كُلَّ يَوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ
ప్రతి ముస్లిం ప్రతి రోజూ అతని శరీరంలో ఎముకలు ఎన్ని జాయింట్లు ఉన్నాయో, ఎముకల జాయింట్లు, కొందరు అంటారు దాదాపు 360 జాయింట్లు ఉన్నాయి అంటారు. శరీరంలో ఎముకల జాయింట్లు 360 ఉన్నాయి. అంటే ప్రతి రోజూ ప్రతి జాయింట్ కి బదులుగా ఒక దానం చేయాలి, సదకా ఇవ్వాలి.

అంటే ప్రతి రోజు 360 దానాలు చేయాలి. కాకపోతే ఇక్కడ దానం అంటే డబ్బు రూపంలోనే కాదు. అది ఏమిటి?

يَعْدِلُ بَيْنَ اثْنَيْنِ صَدَقَةٌ
ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయటం సదకా.

وَيُعِينُ الرَّجُلَ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا
ముందు కాలంలో గుర్రాల్లో, గాడిదల్లో, ఒంటెల్లో సవారీ చేసేవారు. దానిపై వారికి ఎక్కించడానికి, కొందరు అనారోగ్యం మూలంగా, వృద్ధాప్యం వలన పైకి ఎక్కలేరు. ఇప్పుడు కూడా బస్సులో, కార్లలో, మోటార్లలో, రైళ్లలో సామాన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సామాన్లు ఎక్కించడానికి వారికి సహాయం చేయటం, కొందరికి ఆరోగ్యం బాగా లేదు, వికలాంగులు, వారికి కూర్చోబెట్టడానికి సహాయం చేయటం అది కూడా దానమే, సదకాయే.

أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ
సామాన్లు మోయటం అది సదకా.

وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ
మంచి మాట చెప్పటం, అది కూడా సదకా.

وَكُلُّ خُطْوَةٍ يَخْطُوهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ
నమాజు కోసం మనము వేసే ప్రతి అడుగు సదకా కిందకే వస్తుంది.

وَيُمِيطُ الْأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ
దారి నుండి హాని కలిగించే, నష్టం కలిగించే ముల్లు లాంటిది, బండ లాంటిది, రాయి లాంటిది, ఏదైనా అశుద్ధత లాంటిది దూరం చేయటం కూడా అది కూడా సదకా కిందకే వస్తుంది.

కావున, ఏమీ లేని వారు కూడా అనేక రకాలుగా దానాలు చేయవచ్చు, ప్రతి రోజు చేయవచ్చు, ప్రతి సమయం చేయవచ్చు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇటువంటి దానాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వా ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42048

జకాతు & సదఖా: (మెయిన్ పేజీ )
https://teluguislam.net/five-pillars/zakah/

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/