వీడ్కోలు హజ్జ్ (హజ్జతుల్ విదా) సందర్భంలో ఖుర్బానీ దినం నాడు మినా లో దైవప్రవక్త ﷺ ఇచ్చిన ఖుత్బా & వివరణ | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

మొదటిలో మీరు, హజ్జతుల్ విదాను పురస్కరించుకొని, అరాఫాత్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన ఖుత్బా గురించి విన్నారు. రండి! ఇక హజ్జతుల్ విదా సందర్భంలోనే, యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) నాడు మినా లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన మరో ఖుత్బాను గూర్చి వినండి. 

యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) ఖుత్బా 

అబూ బక్ర్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“కాలం తిరుగుతూ మళ్ళీ భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి స్థితికి వచ్చేసింది. సంవత్సరంలో 12 నెలలు వున్నాయి. వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. వరుసగా వచ్చే మూడు మాసాలు (జిల్ ఖాదా, జిల్ హిజ్జ, ముహర్రం) మరియు నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే ముజిర్ రజబ్ మాసం. 

తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): ఇది ఏ నెల? అని అడిగారు. మేము : అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు అని అన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా వుండి పోయారు. దీనితో, మేము – బహుశా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ నెలకు ఏదైనా క్రొత్త పేరు పెడతారేమోనని భావించాము.. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): ఇది జిల్ హిజ్జ నెల కదూ! అని అన్నారు.మేము : అవునండీ అని అన్నాం. 

తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : ఇది ఏ నగరం? అని అడిగారు. మేము : అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు బాగా తెలుసు అని అన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా వుండిపోయారు. దీనితో మేము – బహుశా ఆయన ఈ నగరానికి ఏదైనా క్రొత్త పేరు పెడతారేమో అని భావించాము. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : ఇది ‘అల్ బలద్’ (మక్కా నగరం) కదూ! అని అన్నారు. మేము : అవునండి అని అన్నాం. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : ఇది ఏ దినం? అని అడిగారు. మేము: అల్లాహ్ కు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు అని అన్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా ఉండిపోయారు. దీనితో మేము -బహుశా ఆయన ఈ దినానికి ఏదైనా క్రొత్త పేరు పెడతారేమో అని భావించాము. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : ఇది ‘యౌమున్నహర్’ (ఖుర్బానీ దినం) కదూ! అని అన్నారు. మేము : అవునండి అని అన్నాం. 

తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నిస్సందేహంగా, మీ ఈ దినం, ఈ నెల మరియు ఈ నగరం ఎలాగైతే పవిత్రమై నిషేధించబడ్డాయో, అలాగే మీ రక్తం, సంపద మరియు గౌరవం కూడా నిషేధించబడ్డాయి. మీరు త్వరలో మీ ప్రభువును కలుసుకోబోతున్నారు. ఆయన మీ ఆచరణల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. జాగ్రత్త! నా తర్వాత మీరు మళ్ళీ తిరస్కారులై (మార్గభ్రష్టులై) పోయి ఒకరి మెడలు మరొకరు నరుక్కోకండి. జాగ్రత్త! ఇక్కడున్న వారు, ఇక్కడ లేని వారి వద్దకు ఈ విషయాలు చేరవేయండి. బహుశా అతను, విన్న వారి కన్నా ఎక్కువగా జ్ఞాపకముంచు కొనేవాడు కావచ్చు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: జాగ్రత్త! నేను మీకు (అల్లాహ్ సందేశాన్ని) చేరవేసానా?  (బుఖారీ : 4406, ముస్లిం : 1679) 

ఈ ఖుత్బాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నిటికన్నా ముందుగా సంవత్సరపు 12 నెలలో 4 మాసాల నిషేధం గురించి వివరించారు. నిషేధ మాసాలకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలను గూర్చి మేము ముహర్రం మాసపు మొదటి ఖుత్బాలో సమగ్రంగా వివరించి వున్నాం. ఆ తర్వాత, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), రక్తం, సంపద, గౌరవాల నిషేధం గురించి వివరించారు. ముస్లిం రక్తం మరియు సంపదల నిషేధం గురించి ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఈ రోజు ఖుత్బా ఆరంభంలోనే మేము వివరించి వున్నాం. 

ఇక ముస్లిం గౌరవం విషయానికొస్తే మక్కా ముకర్రమ, జిల్ హిజ్జ మాసం, ఖుర్బానీ దినం ఎలాగైతే పవిత్రంగా చేయబడి నిషేధించబడ్డాయో, అది కూడా నిషేధించబడింది. అంటే, మక్కా ముకర్రమ పవిత్రతను ఎలా భంగపరచలేమో అలాగే ముస్లిం గౌరవాన్ని కూడా భంగపరచలేము. జిల్ హిజ్జ మాసం మరియు ఖుర్బానీ దినాల పవిత్రతను, నిషేధాలను ఎలాగైతే దృష్టిలో వుంచుకుంటామో, అలాగే ముస్లిం యొక్క గౌరవ మర్యాదలను కాపాడడం కూడా తప్పనిసరి. ముస్లిం యొక్క గౌరవ మర్యాదల పవిత్రతను దృష్టిలో వుంచుకొనే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇంటి వారి గౌరవ మర్యాదలను కాపాడుతూ మరణించే వ్యక్తిని, షహీద్ ఖరారు చేశారు. 

తన ఇంటి వారిని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయే వ్యక్తి షహీద్ (అమరగతుడు)”. 
(తిర్మిజి : 1421, అబూదావూద్ : 4772, నసాయి : 4094, సహీఉల్ జామె లిల్ అల్బానీ : 6445) 

దీని ద్వారా రూఢీ అయిన విషయం ఏమిటంటే ముస్లిం గౌరవాన్ని భంగపరచి, అతన్ని ఇతరుల ముందు అవమాన పరచడం హరామ్ (నిషిద్ధం). దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఒక ముస్లిం, మరొక ముస్లింకు సోదరుడు. అతను అతడిపై దౌర్జన్యం చేయడు, అవమానపరచడు మరియు అతన్ని అల్పుడిగా భావించడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడు సార్లు తన హృదయం వైపునకు చూపిస్తూ ‘దైవభీతి(తఖ్వా) అనేది ఇక్కడుంది’ అని అన్నారు”. 

తదుపరి, ఇలా సెలవిచ్చారు: “ఒక మనిషి చెడ్డతనానికి (చెడ్డవాడని ఖరారు చేయడానికి) – అతను తన తోటి ముస్లింను అల్పునిగా భావించటం ఒక్కటే చాలు. ప్రతి ముస్లిం యొక్క రక్తం, సంపద మరియు గౌరవ మర్యాదలు వేరే ముస్లింపై హరామ్ గావించబడ్డాయి“. (ముస్లిం : 2564)

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ‘ఖుర్బానీ దినం ఖుత్బా‘ కు సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలను మేము ఇన్షా అల్లాహ్ రాబోయే ఖుత్బాలో వివరిస్తాం. నేటి ఖుత్బా  ను మేము ఈ దుఆ తో ముగిస్తున్నాం. అల్లాహ్ మనందరినీ, మరణించే వరకు రుజుమార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్! 

హజ్ఞతుల్ విదా ఖుత్బా – (2) 

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) ఖుర్బానీ దినపు ఖుత్బా ముగింపు మరియు దాని ముఖ్యాంశాలు. 
2) ఖుర్బానీ దినపు ఖుత్బా గురించిన వేర్వేరు ఉల్లేఖనాలు. 
3) మినా లో మరో ఖుత్బా. 
4) హజ్జతుల్ విదా ఖుత్బా మరియు మసీహ్ దజ్జాల్. 

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సోదరులారా! 

గత శుక్రవారం ఖుత్బాలో మేము – అరాఫాత్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన హజ్జతుల్ విదా ఖుత్బా గురించి సమగ్రంగా వివరించడం తోపాటు యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) ఖుత్బా గురించి క్లుప్తంగా వివరించాం. దాని వివరణను రాబోయే ఖుత్బా లో వివరిస్తామని వాగ్దానం కూడా చేశాం. కనుక రండి, దాని వివరాలను వినండి! 

ఆచరణల గురించి ప్రశ్నించబడడం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖుర్బానీ దినం ఖుత్బా ఇలా సెలవిచ్చారు: 

మీరు త్వరలోనే మీ ప్రభువును కలుస్తారు, ఆయన మీ ఆచరణల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు.” 

అందుకే మనపై తప్పనిసరిగా వున్న విషయమేమిటంటే, మనం మన విశ్వాసాలను సరిదిద్దుకోవడం తోపాటు ఆచరణల దిద్దుబాటుపై కూడా దృష్టి సారించాలి. కేవలం అల్లాహ్ ను  సంతృప్తిపరచే కార్యాలే చేయాలి. అల్లాహ్ ఇష్టపడని కార్యాలకు దూరంగా వుండాలి. అల్లాహ్ ను  సంతృప్తిపరచే కార్యాలేవంటే – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారించిన లేదా భయపెట్టిన కార్యాలు. 

గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే – రెండు షరతులు నెరవేరనంత వరకు అల్లాహ్ వద్ద ఏ కార్యమూ స్వీకరించబడదు. అందులో, మొదటి షరతు ఏమిటంటే- ఆ కార్యం కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే చేసి వుండాలి. అందులో దైవేతరుల భాగస్వామ్యం ఉండకూడదు. ఇక రెండవ షరతు ఏమిటంటే – ఆ కార్యం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ప్రకారం చేయబడాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించ కూడదు.” (కహఫ్ 18 : 110) 

అబూ హురైరా (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

నిస్సందేహంగా అల్లాహ్ మీ ముఖాల వైపు, మీ సంపదల వైపు చూడడు. ఆయన మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు.” (ముస్లిం : 2564) 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: 

ప్రతి సోమవారం, గురువారం ఆచరణలు (అల్లాహ్ ముందు) సమర్పించ బడతాయి. తనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించని (షిర్క్ చేయని) ప్రతి వ్యక్తిని అల్లాహ్ మన్నిస్తాడు. కేవలం తన సోదరుని పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండే వ్యక్తి తప్ప. ఇలా అనబడుతుంది: ఇద్దరి మధ్య రాజీ కుదిరే వరకు వారిని విడిచి పెట్టండి, ఇద్దరి మధ్య రాజీ కుదిరే వరకు వారిని విడిచిపెట్టండి. (ముస్లిం : 2565) 

ఈ రెండు హదీసుల ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – సరైన విశ్వాసాలతోపాటు ఆచరణల దిద్దుబాటు కూడా చాలా ముఖ్యమైనది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ వెలుగులో తమ ఆచరణలను సరిచేసుకుంటూ వుండాలి. 

ధర్మ ప్రచార ప్రాధాన్యత 

అరాఫాత్ ఖుత్బాలో లేని, ఖుర్బానీ దినం ఖుత్బాలో ప్రస్తావించబడిన మూడవ ముఖ్యం విషయం- “ఇక్కడ వున్నవారు, ఇక్కడలేని వారి వద్దకు అల్లాహ్ ధర్మాన్ని చేరవేయాలి“. దీని ద్వారా తెలిసేదేమిటంటే – ధర్మాన్ని ప్రచారం చేస్తూ, దానిని ఇతరుల వద్దకు చేర్చటం ఎంతో ముఖ్యమైన కార్యం. ధర్మప్రచార కార్యాన్ని నిర్వర్తించేవాడు ఒక విషయం కారణంగా ఎంతో అదృష్టవంతుడై వుంటాడు. అదేమిటంటే ప్రజలు అతని సందేశాన్ని విని ఆచరిస్తే, ఆచరించేవారికి ఎంత పుణ్యఫలం లభిస్తుందో అతనిక్కూడా అంతే పుణ్యఫలం లభిస్తుంది. 

అబూ హురైరా (రదియల్లాహు  అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయినా సన్మార్గం వైపునకు పిలిస్తే, దానిని అనుసరించే వారికి ఎంత పుణ్యం లభిస్తుందో అతనిక్కూడా అంతే పుణ్యం లభిస్తుంది. అనుసరించే వారి పుణ్యంలో ఏ విధమైన కొరత రాదు. అలాగే, ఏ వ్యక్తి అయినా చెడు కార్యం వైపునకు పిలిస్తే, దానిని పాటించేవారికి ఎంత పాపం లభిస్తుందో అతనిక్కూడా అంతే పాపం లభిస్తుంది. పాటించేవారి పాపంలో ఏ కొరతా రాదు“. (ముస్లిం : 2674) 

కానీ, సందేశ ప్రచార బాధ్యతలు చేపట్టినవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – వాళ్ళు ఏ విషయం వైపునకు ప్రజలను ఆహ్వానిస్తున్నారో అది ఖుర్ఆన్ మరియు (ప్రామాణిక హదీసుల ద్వారా నిరూపించబడి వుండాలి. దాని గురించి వారికి తగినంత జ్ఞానం వుండాలి. ఎందుకంటే – సందేశ ప్రచార బాధ్యత కోసం ‘జ్ఞానం’ అనేది మొదటి షరతు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُلْ هَٰذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ ۚ عَلَىٰ بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي ۖ وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ

(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి: నా మార్గం (ఇస్లాం ధర్మం) అయితే ఇదే. నేనూ, నా అనుయాయులు పూర్తి అవగాహనతో (జ్ఞానంతో), దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను షిర్క్ చేసే వారిలోని వాణ్ణి కాను.” (యూసుఫ్ 12 : 108) 

సందేశ ప్రచార బాధ్యతను నెరవేర్చేవారి మహత్యాన్ని గూర్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా సందర్భంలో మినా లోని ‘ఖీఫ్’ ప్రదేశంలో నిలబడి ఇలా సెలవిచ్చారు: 

నా మాటను విని, దానిని ఇతరుల దాకా చేరవేసే వ్యక్తిని అల్లాహ్ తాజాగా (ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో) ఉంచుగాక! ఎందుకంటే, కొన్నిసార్లు ఎంతో మంది, వినేవారి కన్నా, చేరవేయబడిన వారు బుద్దిమంతులై వుంటారు. మూడు స్థితుల్లో విశ్వాసి హృదయంలో అసూయ ప్రవేశించలేదు- ఆచరణలను మనస్ఫూర్తిగా కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకోవాలి. ముస్లిం నాయకుల, పాలకుల శ్రేయస్సు కోరుకుంటూ, అన్ని పరిస్థితుల్లోనూ జమాత్ (సమూహం)తో కలిసి వుండాలి. ఎందుకంటే వారి సందేశం అందరినీ కవచంలా సంరక్షిస్తూ వుంటుంది. (ఎలాగైతే ఒక గోడ వారిని సంరక్షిస్తుందో అలాగే వారి సందేశం (ఇస్లాం సందేశం) కూడా వారిని సంరక్షిస్తూ, వారిని విభిన్న వర్గాలుగా విడిపోవడం నుండి కాపాడుతూ వుంటుంది.) (ఇబ్నెమాజ: 3056, సహీ -అల్బానీ) 

ఈ హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఆయన హదీసులను విని, తదుపరి వాటిని ఇతరుల దాకా చేరవేసే వారి గురించి, వారి సుఖ సంతోషాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. 

దానితోపాటు, అదనంగా మరో మూడు విషయాల వైపునకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రజల దృష్టిని మరలిస్తూ సెలవిచ్చిందేమిటంటే – ఈ మూడు విషయాలు ఈర్ష్య, అసూయలకు విరుద్ధంగా వుంటాయి. అంటే ఈ మూడు విషయాలు గనక వుంటే, విశ్వాసి హృదయంలోకి ఈర్ష్య, అసూయ ప్రవేశించలేదు. ఆ మూడు విషయాలు ఏమిటంటే – 

1) ఆచరణలను మనస్ఫూర్తిగా అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకోవడం

ఇంతకు ముందే మేము వివరించినట్లు, ప్రతి సత్కార్యం స్వీకారయోగ్యం కావడానికి మొదటి షరతు ఆ కార్యం అల్లాహు సంతృప్తిపరచడానికే చేయాలి. దైవేతరుల నెవ్వరినీ దానిలో భాగస్వాములుగా చేయకూడదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ

వారు అల్లాహ్ ను ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించు నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ఇస్తూ కోవాలనీ, ఏకాగ్రచిత్తులై ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడిది. ఇదే స్థిరమైన, సవ్యమైన ధర్మం.” (బయ్యనహ్ 98 : 5) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు : 

إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ

మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపునకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు – ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకిస్తూ. జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు  చెందుతుంది.” (జుమర్ 39 : 2-3) 

అలాగే ఇలా సెలవిచ్చాడు : 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఈ విధంగా ప్రకటించు: నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను మొదటివాణ్ణి.” (అన్ ఆమ్ 6 : 162-163) 

ఈ ఆయతులన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే – ప్రతి సత్కార్యాన్ని అల్లాహ్ కొరకే ప్రత్మేకించడం తప్పనిసరి. ఒకవేళ ఏ కార్యమైనా దైవేతరుల కోసం కానీ లేదా దైవేతరులను భాగస్వాములుగా చేర్చిగానీ చేస్తే లేదా దానిలో ప్రదర్శనా బుద్ధి లేదా ఇతరుల ద్వారా ప్రశంసలు పొందాలన్న సంకల్పం గనక కలిగి వుంటే ఆ కార్యం వల్ల ప్రయోజనమేమీ వుండదు. పైగా అది తలనొప్పిగా మారుతుంది. 

2) రాజ్యపాలకుల శ్రేయస్సు కోరుకోవడం

రాజ్యపాలకుల శ్రేయస్సు కోరుకుంటూ వారి శ్రేయోభిలాషులుగా ఉ ండడం అంటే – సత్యానికి అనుగుణంగా వున్న విషయాలలో వారికి విధేయత చూపాలి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను  వేడుకోవాలి. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలలో వారికి మంచి సలహాలు ఇవ్వాలి. రాజ్యంలో న్యాయస్థాపనకు అవసరమైన విషయాలను పరిపూర్ణం చేయడానికి వారికి మార్గం చూపాలి. 

సమాజంలో ఇస్లామీయ విషయాల వ్యాప్తికి మరియు చెడు కార్యాల సమాప్తి కోసం వారికి ఉత్తమ రీతిలో బోధించాలి. ఒకవేళ వారితో ఏదైనా తప్పు జరిగితే, వారి తప్పులను ప్రజల ముందు బహిర్గతం చేసి వారిని, వారికి వ్యతిరేకంగా ఉసిగొల్పకూడదు. పైగా ఒక శ్రేయోభిలాషిలా, రహస్యంగా వారి తప్పులను గూర్చి అప్రమత్తం చేయాలి. 

 దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ధర్మం అంటే మంచిని (శ్రేయస్సును కాంక్షించడమే.” సహాబాలు : (మంచి) ఎవరి కోసం ఓ దైవప్రవక్తా? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : “అల్లాహ్ కోసం, ఆయన గ్రంథం కోసం, ఆయన ప్రవక్త కోసం, సామాన్య ముస్లిముల కోసం, పరిపాలకుల కోసం” అని వివరించారు. (ముస్లిం: 55) 

3) ముస్లిముల జమాత్ (సమూహం)తో అన్ని పరిస్థితులలోనూ కలిసి ఉండడం

ఒకవేళ ముస్లిములందరూ లేదా వారిలో అధికులు, ఒక ఖలీఫా (నాయకుడు) క్రింద జమ అయితే (గుమిగూడితే, ఆ జమాత్ (సమూహం)ను విడిచిపెట్టకూడదు. వారి నుండి దూరమై వారిలో మనస్పర్థలు సృష్టించకూడదు. 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయినా, తన రాజ్యపాలకుని యందు, తాను ఇష్టపడని విషయ మేదైనా చూస్తే దాని కోసం అతను సహనం వహించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా జమాత్ నుండి జానెడంత దూరం జరిగి, తదుపరి అదే స్థితిలో గనక మరణిస్తే అతను అజ్ఞానపు చావు చచ్చినట్లే.” (ముస్లిం : 1849) 

హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు  అన్హు) కథనం: సాధారణంగా ప్రజలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో మంచి విషయాల గురించి ప్రశ్నించేవారు. 

నేనుమాత్రం – ఎప్పుడైనా చెడులో లిప్తమై పోతానేమో అని శంకించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో చెడు విషయాల గురించి అడిగేవాణ్ణి. నేను : ఓ దైవ ప్రవక్తా! మేము అజ్ఞాన కాలపు చెడులలో వున్నప్పుడు అల్లాహ్ మాకు ‘మంచి’ (ఇస్లాం) ద్వారా గౌరవించాడు. మరి ఈ ‘మంచి’ తర్వాత మళ్ళీ ‘చెడు’ వస్తుందా? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): అవును అని జవాబిచ్చారు నేను : ఆ ‘చెడు’ తర్వాత మళ్ళీ ‘మంచి’ వస్తుందా అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): వస్తుంది, కానీ కొంత మార్గభ్రష్టతతో కలిసి అని అన్నారు. నేను: ఆ మార్గభ్రష్టత (చెడు) గురించి చెప్పండి అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : నా పద్ధతిని (సున్నత్) వదిలిపెట్టి ఇతరుల పద్ధతిని పాటించే వాళ్ళు వస్తారు. నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోకుండా ఇతరుల మార్గంలో పయనిస్తారు. వారి కొన్ని మాటలు నీకు మంచిగా తోస్తాయి. కొన్ని మాటలు మంచిగా అనిపించవు అని అన్నారు. నేను : ఆ ‘మంచి’ తర్వాత మళ్ళీ ‘చెడు’ వస్తుందా? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): అవును. కొందరు సందేశ ప్రచారకులు వస్తారు. వారు నరకపు ద్వారాల వద్ద నిలబడి వుంటారు. వారి సందేశాన్ని స్వీకరించిన వాడిని వారు నరకంలో పడేస్తారు అని వివరించారు. నేను : వారి గుణగణాలను వివరించండి అని అడిగాను. అయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): వాళ్ళు మాలోని వారై వుంటారు. మా భాషలోనే మాట్లాడుతారు. నేను: ఓ దైవప్రవక్తా! నేనొకవేళ వారి కాలాన్ని పొందితే, మీరు నాకు ఏమని సలహా ఇస్తారు? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : నువ్వు అన్ని పరిస్థితులలోనూ ముస్లిముల జమాత్ ను, దాని పాలకుడిని పట్టుకొని వుండు అని వివరించారు. నేను : ఒకవేళ ముస్లిముల జమాఅత్ మరియు దాని పాలకుడు గనక లేకపోతే? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : అలాంటి స్థితిలో నువ్వు అన్ని వర్గాలను వదిలిపెట్టు. దీని కోసం చెట్టు వ్రేళ్ళను నమలాల్సి వచ్చినా సరే, ఈ స్థితిలో నీకు మరణం వచ్చినా సరే అని హితబోధ చేశారు. (బుఖారీ: 3606, ముస్లిం: 1847) 

అర్ ఫజ (రదియల్లాహు  అన్హు ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరంతా ఒక పరిపాలకుడిని మీ పాలకుడిగా స్వీకరించి వున్న సమయంలో ఎవరైనా మీ వద్దకు వచ్చి, మీ మధ్య బేధాభిప్రాయాలు సృష్టించి, మీ జమాఅత్ (సమూహాన్ని)ను ముక్కలు ముక్కలుగా చేయాలని ప్రయత్నిస్తే అతణ్ణి చంపేయండి.” (ముస్లిం : 1852) 

సారాంశమేమిటంటే – ఇంతవరకూ వివరించబడ్డ మూడు విషయాలు (ఆచరణలు అల్లాహ్ కొరకే ప్రత్యేకించడం, రాజ్యపాలకుల శ్రేయస్సును కాంక్షించడం, ముస్లిముల జమాఅత్ తో కలిసి వుండడం) ఎలాంటివంటే – వీటిని పాటించడం ద్వారా విశ్వాసి హృదయం ముస్లిముల పట్ల ఈర్ష్య, అసూయ చెందకుండా పరిశుద్ధంగా వుంటుంది. 

యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) ఖుత్చా…. మరొక ఉల్లేఖనం 

సునన్ ఇబ్నెమాజ లోని ప్రామాణిక ఉల్లేఖనం ద్వారా ఖుర్బానీ దినం ఖుత్బా గురించి గత ఉల్లేఖనాలలో ప్రస్తావించబడని కొన్ని పదాలు ఉల్లేఖించ బడ్డాయి. అవి ఇలా వున్నాయి : 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిముల రక్తం, సంపద, గౌరవ మర్యాదల నిషేధం గురించి వివరించాక ఇలా సెలవిచ్చారు: 

“జాగ్రత్త! ప్రతి నేరస్తుడు తన నేరానికి బాధ్యుడు. ఏ తండ్రీ తన సంతానంపై మరియు ఏ సంతానమూ తమ తండ్రిపై దౌర్జన్యం చేయకూడదు. జాగ్రత్త! షైతాను – ఈ నగరంలో వాడిని పూజించడం జరుగుతుంది – అన్న విషయం పట్ల నిరుత్సాహపడిపోయాడు. కానీ, ప్రజలు కొన్ని ఆచరణలను తేలిగ్గా తీసుకుని, వాడిని అనుసరిస్తూ ఉంటారు. వాడు, దానితోనే సంతోషపడ తాడు….” 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడు విషయాలను సూచించారు: 

1) ప్రతి వ్యక్తీ, తన నేరానికి తానే బాధ్యుడు. అందుకే దాని ప్రతీకారం ఇతరులతో కాకుండా అతనితోనే తీసుకోబడుతుంది. అల్లాహ్ యొక్క ఈ ఆయత్లో కూడా ఇదే అర్థం వివరించబడింది. 

وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు”. (బనీ ఇస్రాయీల్ 17 : 15) 

ఇంకా, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِينَةٌ
ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న దానికి (తాను చేసిన కర్మలకు) ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు.” (ముద్దస్సిర్ 74: 38) 

అరబ్బులలో ఒక ఆనవాయితి ఉండేది. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, అతని దగ్గరి బంధువులలో ఎవరినైనా పట్టుకొనేవారు. ఇది స్పష్టమైన దౌర్జన్యం. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా ఖుత్బా యందు దీనిని వారిస్తూ – నేరము, శిక్షల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించారు. అదేమిటంటే – చేసినవాడు అనుభవించక తప్పదు. అంతేగాని, చేసినవాడు ఒకడైతే అనుభవించేవాడు మరొకడు కాకూడదు. 

2) తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఒకరిపై నొకరు దౌర్జన్యానికి పాల్పడవద్దని ప్రత్యేకించి తండ్రి మరి మరియు సంతానం ఇద్దరికీ వారించారు. 

ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేయడం పూర్తిగా నిషేధించబడింది. కానీ, తండ్రి, సంతానం మధ్య ప్రగాఢ సంబంధం వుండి, ఒండొకరి విధులను హక్కులను నెరవేర్చాల్సి వుంటుంది. కాబట్టి ప్రత్యేకించి వారిని దీని నుండి (దౌర్జన్యం చేయడం) వారించడం జరిగింది. 

3) ఈ ఉల్లేఖనంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన మూడవ ముఖ్య విషయం, ఒకదాని గురించి హెచ్చరించడం. అదేమిటంటే – 

ప్రజలు గుంపులు గుంపులుగా ఇస్లాంను స్వీకరిస్తున్నారు. నిన్నటి వరకు ఇస్లాంకు శత్రువులుగా వున్న తెగలు ఈ రోజు ఇస్లాంను స్వీకరించాయి. అందుకే షైతాను – ఇక అరేబియా ద్వీపకల్పంలో తన పూజ, అంటే తిరస్కార కార్యాలలో అతని అనుసరణ జరుగదు అని నిరుత్సాహపడిపోయాడు. కానీ, సామాన్య ప్రజలు తేలిగ్గా తీసుకొనే విషయాలు ఉదాహరణకు – అసత్యం, నమ్మకద్రోహం, చాడీలు చెప్పడం, పరోక్షనింద, మోసం వగైరాలు… వీటిలో వాడిని (షైతాన్ను) అనుసరించడం జరుగుతుంది. దానితోనే వాడు సంతోషపడతాడు. 

యౌమున్నహర్ (ఖుర్బానీ దినం) – మరో ఖుత్బా 

అబూ ఉమామ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా సందర్భంలో తన ఒంటె (అల్ జుదా) మీద కూర్చొని, ఖుర్బానీ దినం నాడు మినా లో ఖుత్బా ఇచ్చారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒంటె జీను యొక్క రికాబులో కాళ్ళుపెట్టి నిలబడి ప్రజలు తనవైపునకు అభిముఖమవడానికి, బిగ్గరగా ఇలా సెలవిచ్చారు. ‘నా మాటలు మీరు వినడం లేదా?’ 

తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడుసార్లు ఇలా సెలవిచ్చారు. “బహుశా వచ్చే సంవత్సరం మీరు నన్ను చూడకపోవచ్చు.” 

దీనిపై, అందరికన్నా వెనక నిలబడి వున్న ఒక వ్యక్తి – (ఈ స్థితిలో) మీరు మాకేమని ఆదేశిస్తారు? అని అడిగాడు. దీనిపై, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీ ప్రభువైన అల్లాహ్ కు  మీరు భయపడుతూ వుండండి. ఐదుపూటలు నమాజును నెలకొల్పుతూ వుండండి. రమజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తూ ఉండండి. మీ సంపద నుండి జకాత్ను చెల్లిస్తూ వుండండి. మీ అధికారులకు విధేయత చూపుతూ ఉండండి. ఇలా మీరు మీ ప్రభువు స్వర్గంలోకి ప్రవేశించ గలుగుతారు.”

అహ్మద్ లోని ఉల్లేఖనంలో ‘మీ ప్రభువైన అల్లాహ్ కు  భయపడుతూ వుండండి’ అన్న పదానికి బదులు, ‘మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి‘ అని వుంది. (అహ్మద్ : 36వ సంపుటం, 486 పేజీ; 2261, 22258, 22260, తిర్మిజి : 616 – హసన్ సపీ, అబూ దావూద్ ముఖసర్: 1955, సహీ -అల్బానీ, అస్సహీహ : 867) 

ఈ ఖుత్బాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఐదు విషయాల గురించి ఆజ్ఞాపించారు. 

వాటిని ఆచరించే వారికి స్వర్గం యొక్క శుభవార్తను అందజేశారు. ఆ ఐదు విషయాలు ఇవి: 

1) తఖ్వా (దైవభీతి) 

తఖ్వా అంటే మనిషి హృదయంలో వుండే అల్లాహ్ భయం. దీని మూలంగా అతను అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా వుంటాడు. ఒకవేళ అతని మనస్సులో ఎప్పుడైనా చెడు ఆలోచన వచ్చినా లేదా షైతాన్ ఏదైనా చెడును అందంగా చేసి అతని ముందుంచినా, అల్లాహ్ భయం అతనికీ మరియు ఆ చెడు కార్యానికి మధ్య అడ్డుగా వచ్చి, ఫలితంగా అతను ఆ చెడు కార్యాన్ని చేయకుండా వుండాలి. 

ఖుర్ఆన్ లో అల్లాహ్ మాటిమాటికీ తఖ్వా గురించి ఆదేశించాడు. గుర్తుంచుకోవడానికిగాను కొన్ని ఆయతులు మీరు కూడా వినండి: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ

విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు  భయపడుతూ వుండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహు భయపడుతూ వుండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే వున్నాడు.” (హష్ర్ 59: 18) 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు  ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లిములుగా తప్ప మరణించకండి.” (ఆలి ఇమ్రాన్ 3 : 102) 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు  భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి). తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు.” (అహ్జాబ్33 : 70 – 71) 

ఈ ఆయతులలో అల్లాహ్ తఖ్వా (దైవభీతి) గురించి ఆదేశించాడు. ఇక దాని ప్రయోజనాలను గూర్చి వివరిస్తూ ఆయన ఇలా సెలవిచ్చాడు: 

وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مَخْرَجًا وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ

ఎవడయితే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించ నయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు.” (తలాఖ్ 65 : 2-3) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

وَمَن يَتَّقِ اللَّهَ يَجْعَل لَّهُ مِنْ أَمْرِهِ يُسْرًا
ఎవడు అల్లాహ్ కు  భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు.” (తలాఖ్ 65 : 4) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

وَمَن يَتَّقِ اللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّئَاتِهِ وَيُعْظِمْ لَهُ أَجْرًا
ఎవడు అల్లాహ్ కు  భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాడు.” (తలాఖ్ 65 : 5) 

ఈ ఆయతులలో అల్లాహ్ తఖ్వా ప్రయోజనాలను వివరిస్తూ – అల్లాహ్ కు భయపడే వారికి, ఆయన అవిధేయతకు దూరంగా వుండే విశ్వాసులకు అల్లాహ్ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. వారి కార్యాలను తేలికగా చేసేస్తాడు. పుష్కలంగా వారికి ఉపాధిని సమకూరుస్తాడు. వారి పాపాలను క్షమించి వారికి గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు అని వివరించాడు. 

2) ఐదు నమాజులు 

రేయింబవళ్ళలో ఐదు నమాజులు యోగ్యులైన ప్రతి ముస్లింపై విధిగా వున్నాయి. తౌహీద్ (ఏకదైవరాధన) మరియు రిసాలత్ (దైవదౌత్యం)లను అంగీకరించిన (విశ్వసించిన) తర్వాత వీటిని క్రమం తప్పకుండా నెలకొల్పడం ఇస్లాం యొక్క రెండవ మౌలిక అంశం. 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఎన్నోసార్లు నమాజును నెలకొల్పమని ఆజ్ఞాపించి వున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాటిని ధర్మం యొక్క స్థంభం అని ఖరారు చేశారు. వాటి విధిత్వము, మహత్యం గురించి ఇలా సెలవిచ్చారు: 

అల్లాహ్ (తన) దాసులపై ఐదు నమాజులు విధిగా చేశాడు. ఎవరైతే వాటిని తేలిగ్గా తీసుకుని, వృథా చేయకుండా ఎల్లప్పుడూ నెలకొల్పుతారో అతనికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే- ఆయన అతన్ని స్వర్గంలోకి ప్రవేశింప జేస్తాడు. ఇక ఏ వ్యక్తి అయినా వాటిని నెలకొల్పకపోతే అతనికి అల్లాహ్ వాగ్దానం ఏమీలేదు. ఆయన (అల్లాహ్) కోరుకుంటే అతన్ని శిక్షించనూ వచ్చు లేదా స్వర్గంలో ప్రవేశింపజేయనూ వచ్చు.” (అబూదావూద్, నసాయి, సహీ అత్ తర్గీబ్ వ తర్ హీబ్: 370) 

ప్రియ సోదరులారా! 

అల్లాహ్, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను తన వద్దకు, ఆకాశాలపైకి తను కోరుకున్నంత వరకు పిలిచి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు మేరాజ్ చేయించాడు. ఈ సందర్భంగా ఆయనకు, ఆయన అనుచర సమాజానికీ ఐదు నమాజులు విధిగా చేశాడు. దీనిద్వారా రూఢీ అయిన విషయం ఏమిటంటే విధి (ఫర్జ్)గా వున్న కార్యాలన్నింటిలోనూ నమాజ్ ఎంతో ప్రముఖమైన విధి. దీని ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకోనే, ప్రళయం నాడు అల్లాహ్ అన్నిటికన్నా ముందుగా నమాజు లెక్క తీసుకుంటాడు. 

దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

ప్రళయం రోజు అన్నింటికన్నా ముందుగా దాసుల నుండి నమాజు లెక్క తీసుకోబడుతుంది. ఒకవేళ నమాజు సవ్యంగా వుంటే, మిగతా ఆచరణలు కూడా సవ్యంగా వుంటాయి. ఒకవేళ నమాజు సరిగా లేకపోతే మిగతా ఆచరణలు కూడా సవ్యంగా వుండవు.” (తబ్రాని, సహీ అత్ తర్గీబ్ వ తర్ హీబ్  : 376) 

మరో ఉల్లేఖనం ప్రకారం ఇలా సెలవిచ్చారు: 

అతని నమాజును చూడడం జరుగుతుంది. అది గనక సవ్యంగా వుంటే అతను విజయం సాధించినట్టే. ఒకవేళ అది గనక సరిగా లేకపోతే, అవమానం పాలై నష్టపోయే వారిలో చేరిపోతాడు. (అస్సహీహ : 1358) 

ఐదు నమాజుల మహత్యం గురించి సల్మాన్ (రదియల్లాహు  అన్హు) కథనం: 

“నేనొకసారి ఒక చెట్టు క్రింద దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు వున్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎండిపోయిన ఒక కొమ్మను పట్టుకొని బలంగా ఊపేసరికి దాని ఆకులన్నీ రాలిపోయాయి. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): ఓ సల్మాన్! నేనెందుకిలా చేశానో అని నన్ను అడగవా? అన్నారు. నేను: మీరు ఎందుకిలా చేశారు? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): నిస్సందేహంగా ఒక ముస్లిం బాగా వుజూ చేసి, ఐదు నమాజులు (వాటి వాటి సమయాల్లో) నెలకొల్పుతూ వుంటే ఈ చెట్టు నుండి ఆకులు రాలినట్లే అతని పాపాలు కూడా రాలిపోతాయి. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఆయత్ను పఠించారు: “దినము యొక్క రెండు అంచులలోనూ నమాజను స్థాపించు. రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాప కార్యాలను దూరం చేస్తాయి. గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం.” (హూద్ : 114) (అహ్మద్, నసాయి, సహీ అత్ తర్గీబ్  వ తర్ హీబ్  : 363) 

అబూ హురైరా (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఒకవేళ మీలో ఎవరి గుమ్మం ముందైనా ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, దానిలో అతను ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ వుంటే అతని ఒంటి మీద మురికి ఏమైనా మిగిలి వుంటుందా? అని అడిగారు. అందరూ: వుండదు, ఏ మాత్రం మిగిలి వుండదు అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఐదు నమాజుల ఉదాహరణ కూడా ఇలాంటిదే. అల్లాహ్ వీటి ద్వారా పాపాలను కడిగేస్తాడు”. (బుఖారీ, ముస్లిం) 

3) రమజాన్ మాసపు ఉపవాసాలు 

ఐదు నమాజుల లాగానే రమజాన్ మాసపు ఉపవాసాలు కూడా యోగ్యు లైన ప్రతి ముస్లింపై విధిగా వున్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“ఓ విశ్వసించిన వారలారా! ఉపవాసాలుండడం మీపై విధిగా నిర్ణయించ బడింది- మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం వుంది.” (బఖర : 183) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసపు ఉపవాసాల ఎన్నో మహత్యాలను వివరించారు. వాటిలో ఒకటి ఇది: 

ఏ వ్యక్తి అయినా విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో అల్లాహ్ నుండి పుణ్యఫలాన్ని ఆశిస్తూ రమజాన్ ఉపవాసాలు పాటిస్తే, అతని గత పాపాలన్నీ క్షమించబడతాయి.” (బుఖారీ, ముస్లిం) 

 దీనితోపాటు ఇంకా ఎన్నో మహత్యాలు వేర్వేరు హదీసుల ద్వారా నిరూపించబడి వున్నాయి. వీటన్నిటినీ మేము రమజాన్ మాసపు ఖుత్బాలలో సమగ్రంగా వివరించాము. ఇక్కడ మళ్ళీ వాటి గురించి వివరించడంలో గల ఉద్దేశ్యమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్జతుల్ విదాలో, ఒక పెద్ద జన సమూహం ముందు, ఎన్నో సత్కార్యాల గురించి తాకీదు చేస్తూ, రమజాన్ మాసపు ఉపవాసాల గురించి కూడా తాకీదు చేశారు. తద్వారా వాటి గురించి ఎవరి మనసులోనూ ఏ విధమైన అనుమానం మిగిలి వుండ కూడదని. 

4) సంపద నుండి జకాత్ చెల్లించడం 

ఈ హదీసు యొక్క నాలుగవ విషయం సంపద నుండి జకాత్ చెల్లించడం. ఖుర్ఆన్లో అల్లాహ్ ఎన్నో ఆయతులలో నమాజు గురించి ఆజ్ఞాపించిన తర్వాత, వెంటనే దానితోపాటు జకాత్ను కూడా చెల్లించమని ఆజ్ఞాపించి వున్నాడు. 

దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – జకాత్ ప్రాముఖ్యత కూడా నమాజ్ కన్నా తక్కువేమీ కాదు. అందుకే ధనవంతులు తమ సంపద నుండి జకాత్ చెల్లించడానికి ఏ మాత్రం అశ్రద్ధ చూపకూడదు. 

అబూ బక్ర్ సిద్దీఖ్ పరిపాలనా కాలపు ఆరంభంలో జకాత్ ఇవ్వడానికి నిరాకరించిన కొందరికి విరుద్ధంగా ఆయన యుద్ధ ప్రకటన చేస్తూ ఇలా సెలవిచ్చారు: 

అల్లాహ్ సాక్షి! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఇచ్చిన ఒక త్రాడును సయితం నేడు ఇవ్వటానికి నిరాకరిస్తే నేను వారితో యుద్ధం చేస్తాను.” (బుఖారీ: 1399, ముస్లిం : 20) 

దీనిద్వారా మీరు – జకాత్ చెల్లించడం ఎంత ముఖ్యమో అంచనా వేయవచ్చు! 

ప్రత్యేకించి, ప్రస్తుత సమాజంలో జాతుల ఆధారంగా పంపకాలు జరుగుతున్నప్పుడు, ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు, అనుగ్రహాలు వుండి, దాని ప్రక్క ఇంట్లో తినడానికి ఏమీ దొరకని స్థితి వున్నప్పుడు, ఎక్కడైతే ధనవంతులు నివాసముంటున్నారో, దాని ప్రక్కనే బీదవారు, అగత్యపరులు నివాసముంటు న్నప్పుడు – ఇలాంటి పరిస్థితులలో జకాత్ ప్రాధాన్యం ఇంకా పెరుగుతుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు  అన్హు ) ను యమన్ వైపునకు పంపించినపుడు ఆయనకు ఇలా ఆజ్ఞాపించి పంపించారు. 

“(అక్కడి) ప్రజలను ముందుగా తౌహీద్ (ఏకదైవారాధన) మరియు రిసాలత్ (దైవదౌత్యం) వైపునకు ఆహ్వానించు, ఒకవేళ వారు దానిని స్వీకరిస్తే, అల్లాహ్ వారికి రేయింబవళ్ళలో ఐదు నమాజులు విధిగా చేశాడని చెప్పు. తదుపరి ఇలా సెలవిచ్చారు: “ఒకవేళ వారలా చేస్తే (అంటే నమాజు చదవడం ప్రారంభిస్తే) అల్లాహ్ వారిపై జకాత్ను విధిగా చేశాడని చెప్పు. అది వారిలోని ధనవంతుల నుండి తీసుకుని, వారిలోని బీదవారు, అగత్యపరుల మధ్య పంచబడుతుంది.” (బుఖారీ: 1458, ముస్లిం : 19) 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: 

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا

(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుండి దానాలను తీసుకో….”. (తౌబా 9: 103) 

దీనిద్వారా తెలిసిందేమిటంటే – జకాత్ చెల్లించడం ద్వారా సంపద పరిశుద్ధమవుతుంది. మనలోని అత్యాశ, పిసినారితనం కూడా శుద్ధి చేయబడతాయి. 

5) పాలకుని విధేయత

ఖుర్బానీ దినపు ఈ ఖుత్బా యొక్క ఐదవ అంశం – పాలకుని విధేయత. అంటే- మన రాజ్యపాలకులకు, బాధ్యతాయుత వ్యక్తులకు విధేయత చూపడం. 

అల్లాహ్ – తన మరియు తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపమని ఆజ్ఞాపించిన తర్వాత పాలకులకు, బాధ్యతాయుత వ్యక్తులకు విధేయత చూపమని ఆదేశించాడు. 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ క విధేయత చూపండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి మరియు మీలోని అధికారులకు కూడా.”  (నిసా 4: 59) 

ఈ ఆయతులో అల్లాహ్ – బాధ్యత కలిగిన అధికారులకు విధేయత చూపమని ఆదేశించాడు. తనకు విధేయత చూపమని ఆజ్ఞాపించాక, ప్రవక్త విధేయత కోసం “అతీఉ” అన్న పదం ఉపయోగించాడు. కానీ, అధికారుల విధేయత కోసం ఈ పదాన్ని ఉపయోగించలేదు. 

దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు విధేయత చూపడం అనేది శాశ్వతమైనది (అంటే అన్ని పరిస్థితుల్లోనూ విధేయత చూపాలి). కానీ అధికారులకు విధేయత అనేది షరతులకు లోబడి వుంటుంది. మరి ఆ షరతు ఏమిటి? 

దీని వివరణ మనకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ హదీసు ద్వారా లభిస్తుంది. 

వినడం మరియు విధేయత చూపడం ముస్లింకు తప్పనిసరి. ఆజ్ఞాపించ బడ్డ విషయం అతనికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా సరే. (అంటే అన్ని పరిస్థితుల్లోనూ విధేయత చూపాలి). కేవలం పాపకార్యాల గురించి ఆదేశిస్తే తప్ప. (అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త) అవిధేయత గురించి ఆదేశిస్తే దానిని వినకూడదు మరియు పాటించకూడదు.” (బుఖారీ : 7144, ముస్లిం : 1839) 

దీనిద్వారా తెలిసిందేమిటంటే – రాజ్యపాలకులు, నాయకులు, అధికారుల విధేయత అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధేయతకు లోబడి ఉంటుంది. అందుకే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత విషయంలో పాలకులకు విధేయత చూపకూడదు. 

ఇస్లామీయ సోదరులారా! 

ఈ రోజుల్లో సామాన్య విషయాల్లో కూడా పాలకులకు వ్యతిరేకంగా గొంతెత్తడం మొదలు పెడుతున్నారు. ధర్నాలు, ప్రదర్శనలతో శాంతియుత వాతావారణాన్ని కలుషితం చేస్తున్నారు. వాటిలో పాలకులను, మంత్రులను, దుర్భాషలాడడం జరుగుతూ వుంటుంది! మరి చూడబోతే ఈ పద్ధతి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులకు, అహ్లుస్సున్నహ్ వల్ జమాత్ దృక్పథానికి విరుద్ధంగా వుంది. ఎందుకంటే పాలకుల గురించి అహుస్సున్నహ్ వల్ జమాత్ యొక్క ఏకైక దృక్పథం ఏమిటంటే – వారి (పాలకులు) శ్రేయస్సును కాంక్షించాలి, సత్యానికి అనుగుణంగా వున్న కార్యాల్లో వారికి సహాయపడాలి. ఒకవేళ వారు ప్రజలపై దౌర్జన్యం చేస్తే గుప్తంగా వారికి హితబోధ చేయాలి, సహనం పాటించాలి మరియు వారి మేలు కోసం ప్రార్థించాలి. 

దీని గురించి కొన్ని హదీసులు వినండి: అనస్ (రదియల్లాహు  అన్హు ) కథనం: 

“పెద్ద సహాబాలు మాకు అధికారుల, పాలకుల అవిధేయత నుండి వారించారు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసును కూడా వినిపించారు: 

మీరు మీ పాలకులను తిట్టకండి, వారిని మోసం చేయకండి. వారి పట్ల ఈర్ష్య కలిగి వుండకండి. అల్లాహ్ భయపడుతూ వుండండి. సహనం పాటించండి. ఎందుకంటే వ్యవహారం (అంతిమ తీర్పు) దగ్గరలోనే వుంది”. (ఇబ్నె ఆసిమ్, సహీ-అల్బానీ ఫీ జిలాలుల్ జన్నహ్ : 1015) 

ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

జాగ్రత్త! ఒక వ్యక్తిపై ఎవరినైనా పాలకునిగా నియమించి, తదుపరి ఆ వ్యక్తి – పాలకుడు అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడడం చూసినా – అతని ఆ అవిధేయతను ఇష్టపడకూడదు కానీ, అతని విధేయతకు మాత్రం దూరంగా వుండకూడదు.” (ముస్లిం :1855) 

హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

‘నా తదనంతరం కొంతమంది పాలకులు వస్తారు. నా హితబోధను స్వీకరించరు మరియు నా సున్నత్ పైన గూడా ఆచరించరు. త్వరలో మీ నుంచి కొంతమంది లేచి నిలబడతారు. వారు మానవ శరీరాలు, పైతాను హృదయాలు కలిగి వుంటారు.” నేను: ఒకవేళ నేను అలాంటి కాలాన్ని గనక పొందితే ఏం చేయను? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) : నువ్వు పాలకుల మాట విను. దాని కనుగుణంగా ఆచరించు. వాళ్ళు (పాలకులు) నీ వీపు వాయించినప్పటికీ, నీ సంపదను దోచుకున్నప్పటికీ (అలాగే చేయి). (ముస్లిం : 1847) 

ఇయ్యాజ్ బిన్ గనీమ్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“ఏ వ్యక్తి అయినా పాలకునికి, అధికారికి హితబోధ చేయాలనుకుంటే దానిని బాహాటంగా (అందరి ముందు) చేయకూడదు. అతని చెయ్యి పట్టుకుని (ప్రజల గుంపు నుండి) వేరయిపోయి ఆ తర్వాత (హితబోధ చేయాలి). ఆ తర్వాత ఆ అధికారి, అతని హిత బోధ స్వీకరిస్తే మంచిది. అలా కాకపోయి నప్పటికీ, అతను మాత్రం తన విధిని పూర్తి చేశాడు.” (ఇబ్నె అదీ ఆసిమ్, సహీ అల్బానీ ఫీ జిలాలుల్ జన్నహ్ : 1096) 

ప్రియ సోదరులారా! 

ఈ హదీసులూ మరియు ఇలాంటివెన్నో హదీసులు పాలకులు, అధికారులు గురించి అహ్లుసున్నహ్ వల్ జమాత్ దృక్పథాన్ని స్పష్టంగా వివరిస్తూ, దానిని నిర్ధారిస్తున్నాయి. అందుకే ఈ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అంతేగాని, దేశంలో అరాజకం, తిరుగుబాటు వాతావరణాన్ని సృష్టించకూడదు. ఎందుకంటే, దీనివల్ల లాభం తక్కువ గానూ, నష్టం ఎక్కువగానూ ఉంటుంది. పైగా, దీని మూలంగా, దేశంలో చట్టవిరుద్ధత వ్యాపిస్తుంది. ఒకవేళ పాలకులు దీనిని అణిచివేయడానికి ప్రయత్నస్తే అమాయకులు మరణిస్తారు…. 

కానీ, ఒకవేళ పాలకులు, అధికారులు ఏ మాత్రం అనుమానం లేని కుఫ్ (తిరస్కారం) కార్యాలు బాహాటంగా చేస్తూవుంటే, తదుపరి జ్ఞానులు, విద్వాంసులు వారికి ఎంత నచ్చజెప్పినప్పటికీ వారు దానిని త్యజించడానికి సిద్ధం కాకపోతే, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవచ్చు. కానీ, షరతు ఏమిటంటే తిరుగుబాటు వల్ల పెద్ద అల్లర్లు, నష్టం జరగకుండా వుండాలి మరియు ఏ మాత్రం రక్తం చిందించకుండా ఆ పాలకుణ్ణి, అధికారిని తొలగించగలిగే బలాన్ని తిరుగుబాటుదారుడు కలిగి వుండాలి. 

ఒకవేళ తిరుగుబాటుదారునికి, వారిని తొలగించగలిగే బలం లేకపోతే, తిరుగుబాటు మూలంగా పెద్ద అల్లర్లు, నష్టం జరిగే అవకాశముంటే స్థితిలో సహనం పాటించడం తప్ప మరో మార్గం వుండదు. 

ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు  అన్హు) కథనం: మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద ఈ విషయాలపై బైత్ (ప్రమాణం) చేశాం – 

మేము అన్ని పరిస్థితులలోను వింటాం మరియు విధేయత చూపుతాం. మాకు అన్యాయం జరిగినప్పటికీ మేము అవిధేయత చూపం. అధికారి యొక్క అధికారాలను మేము లాక్కోవడానికి ప్రయత్నించం.”

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

కేవలం, అతని(పాలకుని) కుఫ్ర్  ను బాహాటంగా చూసినప్పుడు తప్ప. ఎందుకంటే ఆ స్థితిలో, మీ వద్ద అల్లాహ్ తరఫు నుండి ఆధారం లభ్యమై ఉంది.” (బుఖారీ: 7055, ముస్లిం : 1709) 

ఈ సారాంశమేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఖుత్బాలో ఐదు విషయాల గురించి ఆజ్ఞాపించారు. (తఖ్వా, ఐదు నమాజులు, రమజాన్ మాసపు ఉపవాసాలు, జకాత్ చెల్లింపు మరియు పాలకుల పట్ల విధేయత). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఐదు విషయాలను గురించి ప్రాస్తవించాక – ఒకవేళ మీరు వీటిపై ఆచరిస్తే, స్వర్గంలోకి ప్రవేశించ గలుగుతారు. 

అందుకే మనమంతా ఈ ఐదు విషయాలను ఎల్లప్పుడూ పాటిస్తూ ఉండాలి. 

రెండవ ఖుత్బా 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా సందర్భంలో ఇచ్చిన ఖుత్బాల గురించి మరికొన్ని ఉల్లేఖనాలు మీకు వివరిస్తాం. తద్వారా ఈ విషయాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవచ్చు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క మరో ఖుత్బా 

జాబిర్ (రదియల్లాహు  అన్హు) కథనం : దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అయ్యామె తష్ రీఖ్’ (ఖుర్బానీ దినాలు) మధ్యలో మాకు హజ్జతుల్ విదా ఖుత్బా ఇచ్చారు. దానిలో ఆయన ఇలా సెలవిచ్చారు: 

ప్రజలారా! మీ ప్రభువు ఒక్కడే, మరియు మీ తండ్రి కూడా ఒక్కడే. జాగ్రత్త! అరబ్బులకు ఇతరులపై, అలాగే ఇతరులకు అరబ్బులపై ఏ విధమైన శ్రేష్టత లేదు. నల్లవాడికి తెల్లవాడిపై, తెల్లవాడికి నల్లవాడిపై ఏ విధమైన ప్రత్యేకత లేదు. కేవలం తఖ్వా (దైవభీతి) మరియు భయభక్తుల వైఖరి మూలంగానే ఒకరిపై శ్రేష్టత పొందవచ్చు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ
యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు.” (హుజురాత్ 49: 13) 

జాగ్రత్త! నేను మీకు (అల్లాహ్ ధర్మాన్ని చేరవేసానా? సహాబాలు : అవునండీ అని బదులిచ్చారు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): “ఇక్కడున్న వారు ( ఈ విషయా లను) ఇక్కడ లేని వారి వద్దకు చేరవేయాలి“. (ముస్నద్ అహ్మద్ : 5వ సంపుటం, 416 పేజీ, అస్సహీహ : 2700) 

ఈ ఖుత్బాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రెడు ముఖ్య విషయాల గురించి తాకీదు చేశారు. అందులో మొదటిది అనుచర సమాజపు ఏకత్వం. అంటే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజం ఒకే అనుచర సమాజం. దీని ప్రభువు ఒక్కడే మరియు దీని తండ్రి కూడా ఒక్కడే. అందుకే, ఈ అనుచర సమాజపు ప్రతి వ్యక్తిపై తప్పనిసరిగా వున్న విషయం ఏమిటంటే అతను ఒకే అల్లాహ్ ను ఆరాధించాలి, దైవేతరులను ఆరాధించి దీనిలో (అనుచర సమాజంలో) మనస్పర్ధలు, వర్గ విభజనలు సృష్టించకూడదు. ఇదే విషయాన్ని అల్లాహ్ కూడా ఖుర్ఆన్లో వివరించాడు: 

إِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاعْبُدُونِ

మీరు ఈ సమాజం (లేక మత ధర్మం) వాస్తవానికి ఒకే సమాజం (ఒకే మత ధర్మం). నేను మీ అందరి ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి.” (అంబియా 21: 92) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا

అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి, చీలిపోకండి.” (ఆలి ఇమ్రాన్ 3 : 103) 

ఈ ఆధారాలు మరియు ఇలాంటివెన్నో ఆధారాల ద్వారా తెలిసేదేమిటంటే- ఇస్లాం, ఈ అనుచర సమాజానికి ఏకాభిప్రాయం వైపునకు, ఐకమత్యం వైపునకు ఆహ్వానిస్తూ, అభిప్రాయ బేధాలు కలిగి వర్గాలుగా చీలిపోవడం నుండి (గట్టిగా) వారిస్తుంది. 

కానీ, అనుచర సమాజం యొక్క నేటి పరిస్థితి చూస్తే, దురదృష్టవశాత్తూ అది విభిన్న వర్గాలుగా చీలిపోయి వుంది. దీని మూలంగా అది చాలా బలహీనమై పోయింది మరియు (దాని) శత్రువు దానిపై ప్రాబల్యం వహించి వున్నాడు! దీని నుండి బయటికొచ్చే మార్గం ఒక్కటే. అదేమిటంటే – ఈ అనుచర సమాజపు మొదటి తరాల వారు అనుసరించిన మార్గము. ఒక అనుచర సమాజం అంటే ఇలా వుండాలి అని, ఇతరులు అసూయ చెందేలా ఒక మంచి ఉదాహరణ వారు (ప్రపంచం) ముందుంచారు. ఏకాభిప్రాయాన్ని, ఐకమత్యాన్ని సాధించారు. వారనుసరించిన ఆ ఒకే ఒక్క మార్గం ఏమిటంటే – ఒకే ఒక్క అల్లాహ్ ఆరాధన మరియు కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడం. కేవలం, అల్లాహ్ ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశాల అనుసరణ. ఈ రెండు తప్ప, అనుసరించడానికి, విధేయత చూపడానికి మూడో విషయం, ఏదియూ వారి వద్ద లేదు. వాస్తవానికి ఖుర్ఆన్ – అనుసరించమని ఆజ్ఞాపించే రుజుమార్గం ఇదే. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ

ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరుపరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకు గాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు.” (అన్ ఆమ్ 6: 153) 

హజ్జతుల్ విదా యొక్క ఈ ఖుత్బాలో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాకీదు చేసిన రెండో విషయం – ప్రదేశాలు, జాతులు, రంగుల ఆధారంగా జరిగిన విభజనను సమాప్తం చేయడం. అంటే, ఒక జాతికి మరో జాతిపై, ఒక రంగుకు మరో రంగుపై ఏ విధమైన శ్రేష్టత లేదు. ఒకవేళ ఒకరిపైనొకరికి శ్రేష్టత అంటూ వుంటే అది కేవలం తఖ్వా (దైవభీతి) మూలంగా ఉంటుంది. అందువల్ల, ఏ జాతి అయినా లేదా ఏ వ్యక్తి అయినా ఎక్కువగా దైవభీతి కలిగి ఉంటే, వారికి ఇతర జాతులపై లేదా వ్యక్తులపై శ్రేష్టత లభిస్తుంది. వారు అరబ్బులైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు. నల్లవారైనా కావచ్చు, తెల్లవారైనా కావచ్చు. 

హజ్జతుల్ విదా ఖుత్బా మరియు మసీహ్ దజ్జాల్ 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు  అన్హు) కథనం : 

“మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో ‘హజ్జతుల్ విదా’ గురించి చర్చించుకొనే వాళ్ళం. వాస్తవానికి మాకు ‘హజ్ఞతుల్ విదా’ అంటే ఏమిటో తెలియదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హజ్జతుల్ విదా సందర్భంలో) అల్లాహ్ స్తోత్రం చేశాక మసీహ్ దజ్జాల్ గురించి చెబుతూ సమగ్రంగా వివరించారు. 

ఆయన ఇలా సెలవిచ్చారు: 

అల్లాహ్ ద్వారా పంపబడ్డ ప్రవక్తలందరూ తమ అనుచర సమాజానికి వాడి (దజ్జాల్) గురించి భయపెట్టారు. వాడి గురించి నూహ్ (అలైహిస్సలాం) మరియు ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ భయపెట్టారు. అతడు నిస్సందేహంగా మీ మధ్యకు వస్తాడు. వాడికి సంబంధించిన ఒక విషయం ఇప్పటి వరకు మీకు గోప్యంగా వుంది. కానీ ఇక ఆ విషయం మీకు గోప్యంగా వుండదు. నిశ్చయంగా మీ ప్రభువు మిమ్మల్ని గోప్యంగా వుంచడు. ఇలా మూడు సార్లు సెలవిచ్చారు. నిస్సందేహంగా మీ ప్రభువు ఒంటికన్ను కలవాడు కాడు. వాడు (దజ్జాల్) మాత్రం కుడి కన్ను లేని వాడై వుంటాడు. వాడి కుడి కన్ను ఉబ్బిన ద్రాక్ష పండులా వుంటుంది.” 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్జతుల్ విదా’ ఖుత్బాలో, తన అనుచర సమాజానికి దజ్జాల్ గురించి భయపెట్టారు. ప్రతి కాలంలోనూ ప్రతి ప్రవక్త, వాడి గురించి భయపెట్టడం చూస్తే, వాడి పరీక్ష (పీడన) ఎంత తీవ్రంగా వుంటుందో అంచనా వేయవచ్చు. కానీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భయపెట్టడంతోపాటు, ఇంత వరకు ఎవరూ వివరించని ఒక సూచనను తెలియజేశారు. అదేమిటంటే- వాడు కుడి కన్ను లేనివాడై వుంటాడు. దీనికన్నా మరో స్పష్టమైన సూచనను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరో హదీసులో వివరించారు. అదేమిటంటే – అతని నుదిటిపై ‘కాఫిర్’ అని లిఖించబడి ఉంటుంది… అల్లాహ్ మనందరినీ వాడి పరీక్ష (పీడన) నుండి సురక్షితంగా వుంచుగాక! ఆమీన్! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్