సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు) – Sumayyah (radhiyallaahu anha)
వీరి గురించి ప్రవక్త “ఓపిక వహించండీ, మీకు స్వర్గవాగ్దానం ఉంది“ అని అన్నారు

సుమయ్య (రజియల్లాహు అన్హా) జీవిత చరిత్ర | ఇస్లాంలో తొలి షహీదా (అమరవీరురాలు)
https://youtu.be/0RpTYePDBes [38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో మొట్టమొదటి మహిళా షహీద్ అయిన సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవిత చరిత్రను వివరించబడింది. ఆమె జీవితంలోని మూడు ముఖ్యమైన గుణపాఠాలు- ఈమాన్ (విశ్వాసం), సబర్ (సహనం), మరియు ఇస్తిఖామత్ (స్థిరత్వం) – ఎలా మనకు ఆదర్శంగా నిలుస్తాయో చర్చించబడింది. సూరహ్ అల్-అహ్జాబ్ మరియు సూరహ్ అల్-ముల్క్ నుండి ఆయతులను ఉటంకిస్తూ, ఒక విశ్వాసి యొక్క లక్షణాలను మరియు జీవితం యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయబడింది. యాసిర్ (రది యల్లాహు అన్హు) కుటుంబం ఇస్లాం ప్రారంభ రోజులలో ఎదుర్కొన్న కఠినమైన హింసలు, మరియు అబూ జహల్ చేతిలో సుమయ్య (రది యల్లాహు అన్హా) యొక్క దారుణమైన షహాదత్ (అమరగతి) గురించి వివరించబడింది. చివరగా, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందడానికి అవసరమైన మూడు లక్షణాల గురించిన హదీసును వివరిస్తూ, సుమయ్య (రది యల్లాహు అన్హా) జీవితం నుండి ప్రేరణ పొంది మన విశ్వాసాన్ని, సహనాన్ని మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రబోధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్. వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మాబాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు నా ప్రసంగాంశం, ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

ఆవిడ జీవిత చరిత్రలో ముఖ్యమైన మూడు విషయాలు మనకు ఆదర్శం. అన్నిటికంటే విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, దానికి మించినది ఏదీ లేదు అనే విషయం ఈమాన్, విశ్వాసం. అలాగే రెండవది సబర్, సహనం. మూడవది ఇస్తిఖామత్, స్థిరత్వం. ముఖ్యమైన ఈ మూడు విషయాలు మనకి సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవిత చరిత్రలో బోధపడుతుంది.

ఒక విశ్వాసిలో ఉండవలసిన గుణాలు, గుణాలలో కొన్ని గుణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అహ్జాబ్, సూరహ్ నంబర్ 33, ఆయత్ నంబర్ 35లో ఇలా సెలవిచ్చాడు.

إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

“నిశ్చయంగా, ముస్లిం పురుషులు, ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు, విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు, సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు, అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు, ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు, కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు, స్మరించే స్త్రీలు- వీరిందరి కోసం అల్లాహ్ మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.”

ప్రియ సోదరులారా! ఈ సూర అహ్జాబ్ ఆయత్ నంబర్ 35 కి ఇది అర్థం.

కాకపోతే ఇక ఈ ఆయత్ యొక్క వివరము, తఫ్సీర్ లో నేను వెళ్ళదలచలేదు. కేవలం ఈ ఆయత్ లో వివరించబడిన గుణాలలో ఒక్క ముఖ్యమైన గుణం – వస్సాబిరీన వస్సాబిరాత్. సహనశీలురైన పురుషులు, సహనవతులైన స్త్రీలు. సబర్ గురించి. సబర్ అంటే సహనం. సాబిర్, సహనం చేసేవారు, వహించేవారు.

సహనశీలి అయిన స్త్రీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. మరొకసారి నేను ఈ అర్థానికి రిపీట్ చేస్తున్నాను. సహనశీలి అయిన స్త్రీ అంటే ఏమిటి? సాబిరహ్ అంటే ఏమిటి? జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎంతో సహనంతో ఎదుర్కొంటూ దైవధర్మంలో స్థిరంగా ఉండే స్త్రీని సాబిరహ్ అంటారు. నిరాశ చెంది దైవాభిష్టానికి వ్యతిరేకమైన ఎటువంటి పనులకు పాల్పడకూడదు. తూఫాను భీభత్సంలో చిక్కుకొని భయంకరమైన కెరటాలకు ఊగిపోయే జీవిత నౌకను సహన స్థైర్యాలు కలిగిన నావికురాలు అల్లాహ్ మీద భారం వేసి అంతిమ శ్వాస వరకు దాన్ని తీరానికి తీర్చడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి స్త్రీయే సుమయ్య రది యల్లాహు అన్హా.

సత్య ధర్మాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకునే ధృఢ మనస్కులు సహన స్థైర్యాలతో శత్రువుల దౌర్జన్యాలను తట్టుకుంటూ ఇస్లామీయ ఉద్యమంలో పురోగమిస్తున్న సాహసవతులలో యాసిర్ రది యల్లాహు అన్హు, ఆయన యొక్క అర్ధాంగి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హు కూడా ఉన్నారు.

సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రది యల్లాహు అన్హుని మిట్టమధ్యాహ్నం మండుటెండలో ఇసుక నేల మీద నగ్నంగా పడేసి కొరడాలతో ఒళ్ళు హూనం చేశారు. నిప్పుతో వాతలు పెట్టేవారు. మక్కాలో ఇస్లాం ప్రారంభ కాలంలో ఆ యాసిర్ రది యల్లాహు అన్హు, భార్య సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు, ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితిని చూసి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కళ్ళారా చూసి, ఏమీ చేయలేని సమయం అది. ఆ సమయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట వచ్చిన మాట: “ఇస్బిరూ యా ఆల యాసిర్, ఫ ఇన్న మౌయిదకుముల్ జన్నహ్.” ఓ యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి ఎందుకంటే మీ నివాస స్థలం స్వర్గం. చివరికి యాసిర్ రది యల్లాహు అన్హు అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ ప్రాణం విడిచారు.

సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా గాథ కూడా దయనీయమైనదే. పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రది యల్లాహు అన్హా మీదికి బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేల కొరిగారు. ఈ విధంగా ఇస్లాం ధర్మంలో షహీద్ అయిన, అమరగతి నొందిన మొదటి మహిళ సుమయ్య రది యల్లాహు అన్హా.

అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముల్క్ లో ఇలా సెలవిచ్చాడు, ఆయత్ నంబర్ రెండు సూర ముల్క్ లో:

الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ
(అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లు వకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా, వహువల్ అజీజుల్ గఫూర్)
“మీలో ఎవరు ఉత్తమమైన కర్మలు చేస్తారో పరీక్షించడానికి, ఆయనే మరణాన్ని, జీవితాన్ని సృష్టించాడు. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.”

అంటే ఈ జీవన్ మరణాలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్షించే నిమిత్తం మీలో ఎవరు మంచి పనులు చేస్తారు, సదాచరణ చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, మంచి పనులు, మంచి వారు ఇవి చూడటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ చావుని, ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ మరణాన్ని సృష్టించాడు. కనుక ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలతో పాటు దుఃఖాలు, విచారాలు కూడా ఉన్నాయి. ఆనందము ఉంది. బాధా ఉంది. ప్రశాంతత, అప్రశాంతతలు రెండూ ఉన్నాయి. ఏ కష్టాలు వచ్చినా, ఏ కడగండ్లు ఎదురైనా నిరాశ చెందకుండా ధైర్యంతో, సంపూర్ణ విశ్వాసంతో సహనంతో ఏది పోగొట్టుకున్నా, ఏది నష్టం అయిపోయినా విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు అనే పాఠం మనకు బోధపడుతుంది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలో.

అభిమాన సోదరులారా! సుమయ్య రది యల్లాహు అన్హా అసలు ఆవిడ ఎవరు? ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఇది ప్రారంభ కాలం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబువ్వత్ వచ్చిన ప్రారంభంలో మక్కాలో ఒక వీధి ఉంది. దాని పేరు బనూ మఖ్జూమ్ వీధి. ఆ మక్కాలో బనూ మఖ్జూమ్ ఆ వాడ నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా ఒక ముసలావిడని ఇనుముతో తయారు చేసిన ఆ వస్త్రాలలో, దానికి ఉర్దూలో జిరాహ్ అంటారు. దాంట్లో బాగా కట్టేసి మండుటెండలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అంటే ఒక సందర్భంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వీధులలోని ఒక వీధి, వాడలోని ఒక వాడ బనూ మఖ్జూమ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోతుండగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ శుభప్రదమైన, పవిత్రమైన తమ కళ్ళతో చూసిన దృశ్యం ఇది. ఒక ముసలావిడను ఇనుముతో తయారు చేసిన దానితో బాగా కట్టేసి భగభగ బాగా విపరీతమైన వేడిలో పడేశారు. ఆవిడే సుమయ్య రది యల్లాహు అన్హా.

అసలు సుమయ్య రది యల్లాహు అన్హా ఎవరంటే అజ్ఞాన కాలంలో మక్కాలో ధనవంతులలో ఒక ధనవంతుడైన అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా మఖ్జూమి అనే వ్యక్తి యొక్క బానిసరాలు సుమయ్య రది యల్లాహు అన్హా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రవక్త పదవి లభించక, అంటే బేసతే నబవి, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవక్త పదవి లభించక 45 సంవత్సరాల ముందు, అంటే ఇంకా అప్పుడు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టనే లేదన్నమాట, 45 సంవత్సరాల ముందు యమన్ నుంచి యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి మక్కాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి యొక్క ఒక తమ్ముడు వ్యాపార నిమిత్తమో, ఏదో నిమిత్తమో యమన్ నుంచి వేరే దేశాలకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి పోలేదు. తప్పిపోయారన్నమాట. తన తప్పిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ మక్కాకి వచ్చారు యాసిర్ బిన్ ఆమిర్ అనే వ్యక్తి. ఆ విధంగా వచ్చి మక్కాలోనే ఉండిపోయారు. తమ నివాసంగా మార్చుకున్నారు.

ఆ యాసిర్ బిన్ ఆమిర్ తో అబూ హుజైఫా బిన్ అల్ ముగైరా అంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క యజమాని, ఆ అబూ హుజైఫా తన బానిస అయిన సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యమన్ నుంచి తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన యాసిర్ బిన్ ఆమిర్ తో జరిపించాడు. ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క వివాహం యాసిర్ బిన్ ఆమిర్ తో జరిగింది.

ఆ విధంగా వారి జీవితం కొనసాగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాకపోతే యాసిర్ రది యల్లాహు అన్హు వేరే దేశం నుంచి వచ్చారు గనుక, సుమయ్య రది యల్లాహు అన్హా ఒక దగ్గర బానిసగా ఉన్నారు గనుక, వారికి ఆదుకోవటానికి, వారికి కష్ట సమయాలలో సహాయం చేయటానికి, ఆర్థిక పరంగా వారికి సహాయం చేయటానికి, సుఖదుఃఖాలలో పాల్గొనటానికి వారికి రక్త సంబంధీకులు మక్కాలో ఎవరూ లేరు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. తౌహీద్ సందేశం మొదలెట్టారు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, విశ్వాసం గురించి, వాస్తవాల గురించి, జీవన విధానం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించే వారిలో ముందున్న వారు ఆల యాసిర్. అంటే యాసిర్ రది యల్లాహు అన్హు, సతీమణి సుమయ్య రది యల్లాహు అన్హా, తనయుడు అమ్మార్ రది యల్లాహు అన్హు.

ఇక ఆ తర్వాత మనము మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చదివితే మక్కాలో వహీ వచ్చిన తర్వాత ప్రారంభ కాలంలో ఎవరెవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వారి స్థితి ఎలా ఉన్నిందో మనకు అర్థం అవుతుంది. రకరకాలుగా, ముఖ్యంగా ఎవరైతే బానిసలుగా ఉన్నారో, పేదవారిగా ఉన్నారో, ఆర్థికంగా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారో, బంధువులు లేని వారు, రక్త సంబంధం లేని వారు, అటువంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి. వారిలో ఈ కుటుంబం కూడా, ఆల యాసిర్.

చాలా విధాలుగా హింసించబడ్డారు. వారిని కొట్టటం, వారిని తిట్టటం, హింసించటం, బట్టలు తీసేసి విపరీతమైన వేడి కాలంలో మిట్ట మధ్యాహ్నం బట్టలు తీసి ఇసుక మీద పడుకోబెట్టేవారు. అల్లాహు అక్బర్. తండ్రి ఓ పక్కన, తల్లి ఓ పక్కన, కొడుకు ఓ పక్కన, ఒకరి ముందర ఒకరికి శిక్ష ఇస్తున్నారు.

కాస్త మనము గమనించాలి. ఈ రోజు మనం అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఆర్థికంగా కూడా పస్తులు ఉండే సమయం కాదు. రెండు రోజులు, మూడు రోజులు తినటానికి తిండి లేదు అనేది లేదు. అల్హందులిల్లాహ్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుష్కలంగా మనకి వరాలు ప్రసాదించాడు. అయినా కూడా ఇస్లాం పరంగా జీవించటానికి మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ మనము చాలా విషయాలలో నిర్లక్ష్యం పాటిస్తున్నాం, చేస్తున్నాం.

మన కళ్ళ ముందర కూడా చెడు జరిగితే మనకెందుకేలే అని చెప్పి మౌనం వహిస్తున్నాం. ఒకవేళ మనలో కొందరు దీన్ పరంగా నడుచుకున్నా వారి కుటుంబంలో ఎంత మంది? భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అమ్మా నాన్న వారు దీన్ పరంగా ఉన్నారా? తౌహీద్ లో ఉన్నారా? షిర్క్ లేకుండా ఉన్నారా? బిద్అత్ చేయకుండా ఉన్నారా? దీన్ ప్రకారం నడుచుకుంటున్నారా?

దీన్ పరంగా నడుచుకోవటానికి, తౌహీద్ పైన నిలకడగా ఉండటానికి, షిర్క్ చేయకుండా ఉండటానికి, తౌహీద్ విశిష్టత తెలుసుకోవటానికి, దాని అనుగుణంగా జీవితం గడపటానికి, అల్లాహ్ ను స్మరించటానికి, నమాజులు నెలకొల్పటానికి మనకు ఎవరైనా అడ్డు వస్తున్నారా? చేతిలో కర్ర తీసుకొని కొడుతున్నారా? ఆ విధంగా మనము పోల్చుకుంటే లెక్కలేని అనేక వరాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ప్రసాదించాడు. ఈ విషయం గురించి మనందరమూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, నేను ప్రారంభంలోనే చెప్పాను. అవిశ్వాసులు పెడుతున్న బాధలు అనుభవిస్తూ చనిపోయారు సుమయ్య రదియల్లాహు అన్హా యొక్క భర్త యాసిర్ రదియల్లాహు అన్హు. చనిపోయారు. అలాగే సతీమణి సుమయ్య రదియల్లాహు అన్హాను కూడా పరమ దుర్మార్గుడైన అబూ జహల్ ఆవిడను బాధించడమే కాకుండా ఒక రోజు అనరాని మాటలు అని తన చేతిలో ఉన్న ఈటెను ఎత్తి సుమయ్య రదియల్లాహు అన్హా మీదికి, అంటే కొంతమంది చరిత్రకారులు కడుపు మీద అంటారు, కొందరు నాభి కింద అంటారు, అక్కడ బలంగా విసిరాడు. ఆ దెబ్బకు ఆ సాధీమణి విలవిల్లాడుతూ నేలకొరిగారు. ఇంత దారుణంగా ఇస్లాం ప్రారంభ కాలంలో, ఎందుకంటే అప్పుడే వారి పెద్ద వయసు వారిది, వృద్ధాప్యానికి చేరుకున్నారు యాసిర్ రదియల్లాహు అన్హు, సుమయ్య రదియల్లాహు అన్హా. ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేవాళ్ళు. బంధువులు ఎవరూ లేరు, రక్త సంబంధీకులు ఎవరూ లేరు. ఇస్లాం ప్రారంభం. ఆ సమయంలో ఎన్ని బాధలు వచ్చినా, అవిశ్వాసుల తరపు నుండి, బహుదైవారాధకుల తరపు నుండి, ఇస్లాం శత్రువుల తరపు నుండి రకరకాల బాధలు వచ్చినా, వారి యొక్క విశ్వాసంలో కొంచెం కూడా మార్పు రాలేదు, బలహీనతకి వారు గురి కాలేదు. ఇది మనకోసం ఉన్న గుణపాఠం.

చివరికి బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడు కదా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు సుమయ్య మరియు యాసిర్ లేరు కదా రది యల్లాహు అన్హుమా, తనయుడు కొడుకు అమ్మార్ ఉన్నారు కదా. అప్పుడు ఎప్పుడైతే బద్ర్ యుద్ధంలో అబూ జహల్ చంపబడ్డాడో అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రది యల్లాహు అన్హును ఉద్దేశించి ఇలా అన్నారు: “ఖద్ ఖతలల్లాహు ఖాతిల ఉమ్మిక్.” ఓ అమ్మార్! నీ తల్లిని చంపినవాడు ఈరోజు చంపబడ్డాడు.

అభిమాన సోదరులారా, సుమయ్య రది యల్లాహు అన్హా ఇస్లాం ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆవిడ జీవించలేదు. అంటే అనేక మంది తండోపతండాలుగా ముస్లింలు అయిపోయారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేశారు, అది ఆ జీవితము, ఆ సమయము సుమయ్య రది యల్లాహు అన్హా జీవితంలో రాలేదు. ప్రారంభంలోనే ఆవిడ ఇస్లాం స్వీకరించారు, ప్రారంభంలోనే ఆవిడ అమరగతులయ్యారు, షహీద్ అయ్యారు.

నేను ఈరోజు నా ప్రసంగానికి సారాంశం ఏమిటంటే సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మనకోసము ఉండే అనేక గుణపాఠాలలో మూడు విషయాలు, వారు మాకోసం ఆదర్శం. ఈమాన్, సబర్, సాబిత్ ఖద్మీ. ఈమాన్ – విశ్వాసం, సబర్ – సహనం, సాబిత్ ఖద్మీ – నిలకడ, స్థైర్యం. ఇవి మూడు ముఖ్యమైనవి. ఎందుకంటే సుమయ్య రది యల్లాహు అన్హాకి భర్త తరపు నుంచి పరీక్ష. ఎందుకంటే తన కళ్ళ ముందర భర్తని కొడుతున్నారు. భర్త శరీరం నుంచి బట్టలు తీసేసి మిట్ట మధ్యాహ్నం ఇసుకలో ఎడారిలో పడుకోబెడుతున్నారు, కళ్ళతో చూస్తున్నారు భర్త పడే, భరించే ఆ బాధలు. స్వయంగా సుమయ్య రది యల్లాహు అన్హాని కూడా ఆ ఐరన్ తో తయారు చేసిన ఆ సంకెళ్ళతో బాగా బిగించి ఆవిడని కూడా, అల్లాహు అక్బర్, ముసలావిడ. ఆ ముసలావిడని ఈ విధంగా బంధించడం. కొడుకు అమ్మార్ ని కొట్టటం. ఆ తల్లికి, ఆ విశ్వాసమూర్తికి, ఆ విశ్వాసమూర్తి పడిన బాధ కొంచెం ఊహించుకోండి. ఓ పక్క భర్త, ఓ పక్క కొడుకు, ఓ పక్క స్వయంగా ఆవిడ, అన్ని విధాల అవిశ్వాసుల, ముష్రికుల, ఖురైషుల, కుఫ్ఫార్ల తరపు నుంచి బాధలు పడతా ఉంటే, ఆమె ఎంత స్థిరంగా, ధైర్యంగా, సహనంతో, ఓర్పుతో, తన విశ్వాసంలో మార్పులు ఏ విధంగా కూడా రాకుండా, రానివ్వకుండా ఆవిడ ఉన్నిందంటే, అర్థమవుతుంది

ఈమాన్ అంటే ఏమిటి, తౌహీద్ అంటే ఏమిటి. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ కొన్ని రోజుల జీవితం కోసం మనము మాటిమాటికి విశ్వాసాన్ని లెక్క చేయకుండా ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని మనము అమ్మేస్తున్నాం. చిన్న కారణాల వల్ల నమాజ్ చేయటం ఆలస్యం చేస్తాం మనం. మనలో చాలా మంది. ప్రతి ఒక్కరు కాదు, చాలా మంది. మనం గమనిస్తున్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చిన్న కారణం ఉంటుంది, అది తర్వాత కూడా చేసుకోవచ్చు. అంత పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. అయినా కూడా ఆ ప్రాపంచిక చిన్న లబ్ధి కోసము మనము నమాజ్ వదిలేస్తాము, జమాత్ వదిలేస్తాము, తర్వాత నమాజ్ చేస్తాం. ఇది మన జీవితం.

అంటే కొంచెం ప్రాపంచిక కొంత లాభం కోసం మన ఈమాన్ లో ఎంత మార్పు వస్తా ఉంది. ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాను నేను. కానీ వారు అన్ని కష్టాలు వారికి వచ్చినా వారి విశ్వాసంలో ఎటువంటి తేడా జరగలేదు.

అభిమాన సోదరులారా, ఇక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ సెలవిచ్చారు, ఆ హదీస్ మనం తెలుసుకొని నేను ముగిస్తాను. అదేమిటంటే ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది:

ثَلَاثٌ مَنْ كُنَّ فِيْهِ وَجَدَ حَلَاوَةَ الْإِيْمَانِ
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్)
“మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో, ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు.”

మూడు విషయాలు ఎవరిలోనైతే ఉంటే, ఏ వ్యక్తిలో మూడు విషయాలు, మూడు గుణాలు ఉంటే ఆ వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందాడు. ఇప్పుడు మనము విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందామా లేదా అనేది ఈ హదీస్ తెలుసుకొని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ మూడు విషయాలలో మొదటిది ఏమిటి?

أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా)
“అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి.”

మొదటి విషయం ఇది. అంటే ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము అన్నిటికంటే ఎక్కువ, అంటే తన భార్య కంటే, పిల్లల కంటే, స్త్రీ అయితే భర్త కంటే, పిల్లల కంటే, అమ్మా నాన్న కంటే ఎక్కువ, బంధుమిత్రుల కంటే ఎక్కువ, ఈ ధనం కంటే ఎక్కువ, ఆస్తుల కంటే ఎక్కువ, ఆప్తుల కంటే ఎక్కువ, హోదా కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువ అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఇది మొదటిది.

రెండవది:

وَأَنْ يُحِبَّ الْمَرْءَ لَا يُحِبُّهُ إِلَّا لِلَّهِ
(వ అన్ యుహిబ్బల్ మర్అ లా యుహిబ్బుహు ఇల్లా లిల్లాహ్)
“ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.”

అంటే ఇతరులను స్వార్థం కోసం కాకుండా, అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రేమించాలి. ఉర్దూలో ఒక కవి ఇలా అంటాడు, ఉర్దూలో ఒక కవిత్వం ఉంది, ఒక పద్యము, దాంట్లో ఒక షేర్, ఒక వాక్యం ఇలా ఉంటుంది: “దిల్ మే ఆగ్, లబోం పే గులాబ్ రఖ్తే హైఁ, హమ్ అప్నే చెహ్రే పే దోహ్రీ నఖాబ్ రఖ్తే హైఁ.” మనసులో మాత్రం, హృదయంలో మాత్రం ప్రేమ లేదు, ద్వేషం ఉంది, మంట రగిలిపోతుంది. పెదవులపై నటిస్తాము. పువ్వులు ఉంటాయి, పెదవుల పైన పువ్వు ఉంది, కానీ లోపల మంట ఉంది. అంటే మన జీవితం ఈ విధంగా ఉంది. స్వార్థం ఉంటే మాట్లాడతాము, లాభం ఉంటే మాట్లాడతాము, అవసరం ఉంటే మాట్లాడతాము. ఆ అవసరాన్ని బట్టి మనము చేసే సలాం కూడా అలాగే ఉంటుంది. సలాం చేసే పద్ధతి, సలాం చేసే విధానము అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? రెండవ గుణం అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఎవరు పొందారు? ఆ పొందటానికి రెండవ గుణం ఏమిటి? ఇతరులను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ప్రేమించాలి.

ఇక మూడవది:

وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ
(వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్)
“నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు.”

అంటే నరకాగ్ని భయంతో మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. అంటే ఇస్లాం స్వీకరించాము లేకపోతే పుట్టుకతోనే ముస్లింగా ఉన్నాము, కొన్ని కారణాల వల్ల మళ్ళీ అవిశ్వాసిగా పోవటం అతని దృష్టిలో “నాకు భగభగ మండే అగ్నిలో వేసేస్తున్నారు. నేను భగభగ మండే ఆ అగ్నిలో నాకు వేసేస్తే అది నాకు ఇష్టమా? ఇష్టం ఉండదు. ఆ విధంగా విశ్వాసం నుంచి అవిశ్వాసం వైపునకి మరటం కూడా నాకు ఇష్టం ఉండదు”.

ఈ విధంగా ఈ మూడు గుణాలు ఉంటే అటువంటి వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందినట్లే. ఈ మూడు విషయాలు మనలో ఉన్నాయా లేవా అనేది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

అభిమాన సోదరులారా, ఈ విధంగా మొదటి విషయం సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని ఈమాన్, దాని ప్రాముఖ్యత ఏమిటి, విశిష్టత ఏమిటి? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ విషయంలో, నాన్న ఏ విధంగానైనా, అన్ని విధాల కుడి వైపు నుంచి, ఎడమ వైపు నుంచి, వెనుక నుంచి, ముందు నుంచి, కింద నుంచి, పైన నుంచి, అన్ని విధాల ఆర్థిక పరంగా, మానసికంగా, అన్ని విధాలా కూడా బాధలు వచ్చినా, హింసలు పెట్టినా, విశ్వాసంలో లోపం రానివ్వకూడదు. తౌహీద్ లో తేడా రానివ్వకూడదు. షిర్క్ కి పాల్పడకూడదు. ఇది సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితంలోని మొదటి పాఠం. రెండో పాఠం ఏమిటి? సబర్, సహనం. మూడవది స్థిరత్వం, నిలకడ.

ఒక వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: ఓ దైవ ప్రవక్తా, నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అన్నాడు. అంటే ఇస్లాం గురించి బోధనలు చాలా ఉన్నాయి కదండీ. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగే వ్యక్తి యొక్క మానసిక స్థితిని గమనించి, దానికి తగిన విధంగా, సమయ సందర్భాన్ని బట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు ఇచ్చేవారు. ఒక వ్యక్తి వచ్చి అడిగారు, ఓ దైవ ప్రవక్తా నాకు ఇస్లాం గురించి ఏమైనా బోధించండి అంటే, అయితే దాని గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకరిని అడగవలసిన అవసరం రాకూడదు. ఇస్లాం గురించి ఒక విషయం చెప్పండి. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకెవ్వరికీ అడిగే అవసరం రాకూడదు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటంటే: “ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్.” అంటే నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నేను విశ్వసించాను, నేను ముస్లింగా ఉన్నాను, నేను మోమిన్ గా ఉన్నాను అని చెప్పు, ఆ తర్వాత ఆ మాట పైనే నిలకడగా ఉండు. చెప్పటమే కాకుండా నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఈ విధంగా సుమయ్య రది యల్లాహు అన్హా యొక్క జీవితాన్ని అల్లాహ్ మనందరికీ ఆదర్శంగా తీసుకొని, కష్టాలలో కూడా మొదటి విషయము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి బాధ నుండి కాపాడుగాక. ఒకవేళ అల్లాహ్ ఇష్టం నిమిత్తం ఏదైనా సమస్య, బాధ వస్తే సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, సహనంతో ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సుమయ్య రది యల్లాహు అన్హాని ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17185

ముస్లిం వనిత (మెయిన్ పేజీ):
https://teluguislam.net/muslim-woman/

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM