సమాజ సంస్కరణ – ధార్మిక బహిరంగ సభ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Htvm7QPyjI4 [47 నిముషాలు]
ఈ ప్రసంగం ఖురాన్ మరియు హదీసుల జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా స్వర్గ మార్గాన్ని సులభతరం చేసుకోవడం గురించి వివరిస్తుంది. సమాజ సంస్కరణ అనేది వ్యక్తిగత సంస్కరణ మరియు అల్లాహ్ పట్ల బలమైన విశ్వాసం (అఖీదా)తో మొదలవుతుందని వక్త ఉద్ఘాటించారు. షాబాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఉపవాసాలు ఉండేవారని, ఇది ప్రజలు నిర్లక్ష్యం చేసే నెల అని పేర్కొన్నారు. షబే బరాత్ (షాబాన్ 15వ రాత్రి) పేరుతో సమాజంలో ఉన్న బిద్అత్ (కొత్త ఆచారాల)ను, ప్రత్యేక నమాజులు, సమాధుల సందర్శన వంటి వాటిని ఆధారాలతో ఖండించారు. చివరగా, ప్రామాణికమైన ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడానికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
దగ్గరి మరియు దూరపు ప్రాంతాల నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నేను ముందు స్వాగతం పలుకుతున్నాను. ఆ తర్వాత నా మాటను గనక మీరు శ్రద్ధగా వింటున్నారంటే, మీకు ఒక శుభవార్తను ఇచ్చి, ఒక శుభవార్త తెలియజేసి ఆ తర్వాత నా అంశాన్ని ప్రారంభిస్తాను. ఏంటి శుభవార్త? ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశం దివ్య ఖురాన్ మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తులు అంటే హదీసులు, సారాంశం ఏంటి? ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానం వినడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుండి వచ్చారో, వారి ఆ నడక, వారి యొక్క ఆ ప్రయాణం స్వర్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సులభతరం చేయాలి, మనమందరము కూడా స్వర్గంలో ఇలాగే జమా కావాలి. అల్లాహ్ యే అలాంటి సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక.
ఈ గొప్ప శుభవార్త నేను నా మాటలో ఇచ్చాను. కానీ యాజ్ ఇట్ ఈజ్ (as it is) ఇలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ ముస్లిం లో వచ్చినటువంటి హదీస్:
مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
[మన్ సలక తరీకన్ యల్తమిసు ఫీహి ఇల్మన్ సహ్హ లల్లాహు లహూ బిహీ తరీకన్ ఇలల్ జన్న]
“ఎవరైతే జ్ఞానం నేర్చుకోవడానికి ఒక దారిన వెళ్తారో, ఆ దారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గం కొరకు సులభతరం చేస్తాడు.”
కనుక ఈ హదీస్ ఆధారంగా తెలుసుకున్నటువంటి శుభవార్త మనమందరము కూడా పొందాలి. మనమందరి కొరకు కూడా స్వర్గం సులభతరంగా మనం చేరుకోవాలి అంటే, మన యొక్క నియ్యత్, మన యొక్క సంకల్పం, మన యొక్క ఉద్దేశం అల్లాహ్ ఈ జ్ఞానం ఏదైతే ఇక్కడ పంచుతున్నాడో, దానిని నేర్చుకోవడం మాత్రమే ఉండాలి. ఇది ప్రధానంగా ఉండాలి. వేరే ఉద్దేశాలు ఏమైనా ఉంటే తర్వాత, కానీ మన అసలు ఉద్దేశం ఇక్కడికి రావడానికి ఖురాన్ హదీస్ జ్ఞానం నేర్చుకోవడం. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కు సంబంధించిన జ్ఞానం ఏదైతే ఖురాన్ హదీస్ లో ఉందో అది నేర్చుకోవడం.
సమాజ సంస్కరణ మరియు వ్యక్తిగత బాధ్యత
ఇక రండి, మీరు ఇక్కడ చూస్తున్నట్లు ‘సమాజ సంస్కరణ‘. సమాజ సంస్కరణ అన్నది మనం మన నుండి, మనలో ప్రతి వ్యక్తి తన నుండి ప్రారంభించకపోతే ఎన్నటికీ సమాజం సంస్కరించబడదు. ఎందుకు? సమాజంలో మనం ఒక భాగం. సమాజం ఎక్కడి నుండి వచ్చింది? మనుషుల ద్వారానే, వ్యక్తుల ద్వారానే. ఒకవేళ మనం, మనలోని ప్రతి వ్యక్తి, మన సంస్కరణ, నేను నన్ను సంస్కరించుకోవాలి, ఖురాన్ హదీస్ ప్రకారంగా నేను నా జీవితాన్ని గడపాలి అన్నటువంటి తపన లేకుంటే ఎన్నటికీ సమాజం సంస్కరణలో ఉండరాదు, ఉండబోదు. అందుకొరకే మన నుండి మనం సంస్కరించుకోవడానికే ఇక్కడికి హాజరయ్యాము.
సమాజ సంస్కరణ, ఈ అంశం వింటేనే సర్వసామాన్యంగా సామాజిక రుగ్మతలను తెలియజేసి వాటిని ఎలా సంస్కరించాలి, ఆ రుగ్మతలను ఎలా నిర్మూలించాలి అన్నటువంటి విషయాలపై మాట్లాడుకుంటారు. కానీ శ్రద్ధగా వినండి, అల్లాహ్ పై విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అంతే ఎక్కువ సమాజ సంస్కరణకు అది పునాదిగా, నాందిగా ఉంటుంది. అల్లాహ్ పై విశ్వాసం, అల్లాహ్ పట్ల ప్రేమ, ప్రవక్త పట్ల ప్రేమ, ప్రవక్తను అనుసరించడం ఎంత తగ్గిపోతుందో అంతే సమాజం దుస్థితికి వెళ్తుంది, సమాజ సంస్కరణకు చాలా పెద్ద లోటు ఏర్పడుతుంది. అవును, ఖురాన్ ను శ్రద్ధగా చదివితే ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలుస్తాయి.
అయితే సమాజ సంస్కరణ అన్న పేరుతో మరో తెలుగు వక్త మనకు ప్రసంగిస్తారు. కానీ సమాజ సంస్కరణకు మూల సూత్రాలైనటువంటి విషయాలు నేను ప్రారంభంలో చెప్పబోయి, మళ్ళీ ఇప్పుడు మన ఫరీద్ ఉమ్రీ గారు చెప్పినటువంటి అంశానికి వస్తున్నాను, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ఇల్లు బాగుండాలి అంటే మనం కేవలం దానిని అలంకరించడంతో సరిపోదు. ఉన్న మలినాన్ని, కచరాని (చెత్తని) బయటికి తీసేయాలి. కదా? మీరు ఎంత కంపు కొడుతుంది అని సువాసనలు, పర్ఫ్యూమ్ లు వేసినా అది కొంతసేపటి గురించే మీకు సువాసన వస్తుంది కావచ్చు, మళ్ళీ తర్వాత ఆ కంపు పోతుందా? ఈ దుర్వాసన ఎందుకని ఉన్నది? అది తెలుసుకొని దాన్ని ముందు దూరం చేస్తే, తర్వాత మీరు వేసే పర్ఫ్యూమ్, తర్వాత మీరు ఇంకా ఏ సువాసనలు అక్కడ పూసినా, అది మరింత ఎక్కువసేపు మీ కొరకు లాభదాయకంగా, మీరు ఆ ప్రాంతంలో ఉండడానికి చాలా మీకు అనుకూలంగా ఉంటుంది.
అలాగే సమాజ సంస్కరణలో కేవలం సామాజిక విషయాలు, ఒక మనిషి మరో మనిషికి సంబంధమైనటువంటి విషయాలతోనే కాదు. మనం ఈ లోకంలో వచ్చాము, దీనికి అసలైన కారకుడు అల్లాహ్. మనం ఈ లోకంలో పుట్టాము, మన ఇష్టంతో పుట్టామా? నేను ఫలానా దేశంలో, ఫలానా రాష్ట్రంలో, ఫలానా ఇంట్లో పుట్టాలి అన్నటువంటి ప్రణాళిక మనం తయారు చేసుకొని ఇక్కడికి వచ్చామా? చెప్పండి. లేదు కదా? అల్లాహ్ తన ఇష్టంతో మనల్ని పుట్టించాడు. చావు… ఈ చావు మనం కోరుకున్న సమయంలో, కోరుకున్న రీతిలో, మనం కోరుకున్నప్పుడు వస్తుందా? లేదు, అల్లాహ్ తలచినప్పుడే వస్తుంది.
ఈ పుట్టుక, ఈ మరణం మన చేతిలో లేనప్పుడు, ఈ పుట్టుక, ఈ జననం, మరణం దానికి మనం అధికారులము కానప్పుడు, ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితానికి నేను నా ఇష్టం ఎట్లంటే అట్లా జీవిస్తా, ఎవడు నువ్వు చెప్పే వానివి? ఇలాంటి విర్రవీగి మాట్లాడడం, అహంకారం దేనికి అవసరం? మనలో ప్రతి ఒక్కడు ఎంత పెద్ద హోదా అంతస్తులో, బిల్డింగుల మీద బిల్డింగులు, కార్లు, అన్ని సౌకర్యాలు ఉండి ఐశ్వర్యం అనేది అతని పుట్టుక పూర్వోత్తరాల నుండి అతనికి లభించినా… లేక పూట తిండికి కూడా ఏడుస్తూ చాలా బాధతో ఉన్నా… ప్రతి ఒక్కడు నన్ను పుట్టించిన అల్లాహ్ ఇష్టప్రకారంగా నేను జీవించాలి, నా ఇష్టంతో కాదు అని ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి వృద్ధుడు, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
దీనికొరకే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఆదం అలైహిస్సలాం ఆదిమానవుడు నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరి ప్రవక్తలను పంపాడో వారందరికీ ‘ఇస్లాం’ అన్నటువంటి శాంతియుతమైన ఉత్తమమైన మంచి ధర్మం మనకు ప్రసాదించాడు. దాని ప్రకారంగా మనం మన జీవితం గడిపితే ఇహలోకంలో కూడా బాగుపడతాము, పరలోకంలో మనం స్వర్గం పొందుతాము. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో చేర్చుగాక. ఆమీన్. అల్లాహ్ మనందరినీ కూడా నరకం నుండి రక్షించుగాక. ఆమీన్.
ఆదేశాలు మరియు నిషేధాలు
సోదర మహాశయులారా, సోదరీమణులారా! ఇస్లాం ధర్మ ప్రకారంగా మనం జీవించాలంటే కొన్ని పనులు చేసేవి ఉంటాయి. వాటిని తప్పకుండా చేస్తూ ఉండాలి. వాటినే అవామిర్, అహ్ కామాత్, ఆదేశాలు అని అంటాము. మరికొన్ని చేయకూడనివి, వదులుకోవలసినవి. వాటినే నవాహీ, ముహర్రమాత్, మన్ హియ్యాత్ అని అంటారు. అయితే మనం అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ప్రతి ఆదేశాన్ని పాటించాలి. ఇది చేయకండి అని చెప్పిన ప్రతి చెడు నుండి మనం దూరం ఉండాలి. అప్పుడే మనం నిజమైన ముస్లింలం.
ఇక మన జీవితాలు చాలా చిన్నగా ఉన్నాయి. 40, 50, 60 సంవత్సరాల లోపుగానే మనం చనిపోతూ ఉంటాము సర్వసామాన్యంగా. 80, 90 సంవత్సరాల వయసు పొందిన వారు చాలా తక్కువ ఉంటారు. అయితే శ్రద్ధగా వినండి… అవ్వలారా, అక్కలారా, చెల్లెల్లారా, బిడ్డలారా మరియు సోదర సోదరీమణులారా అందరూ కూడా శ్రద్ధగా వినండి. అల్లాహ్ మనపై చాలా చాలా గొప్ప కారుణ్యం చేసి, మనపై దయ చూపి, మన ఈ చిన్న జీవితాల్లో కూడా, చిన్నపాటి వయసులో కూడా ఎక్కువ పుణ్యాలు చేసుకోవడానికి కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలు ఇచ్చాడు. ఆ సమయ, సందర్భ మరియు స్థలాల్లో… సమయాలు, సందర్భాలు, స్థలాలు… వాటిని అల్లాహ్ ప్రకారంగా, ప్రవక్త విధానంలో మనం ఉపయోగించుకున్నాము, సద్వినియోగించుకున్నాము అంటే అందరికన్నా ఎక్కువ పుణ్యాలు తక్కువ సమయంలో సంపాదించుకోవచ్చు.
అందుకొరకే రమదాన్ లాంటి శుభప్రదమైన మాసాన్ని మనకు ప్రసాదించాడు. జుమా లాంటి ఒక మంచి రోజును మనకు ప్రసాదించాడు. మక్కా మరియు మదీనా లాంటి… ఈ రెండిటి తర్వాత బైతుల్ మఖ్దిస్ లాంటి పుణ్యక్షేత్రాలు మనకు ప్రసాదించాడు. కానీ ఏ సమయం, ఏ సందర్భం, ఏ స్థలం అయినా మన ఇష్టంతో అక్కడ ఏవి చేసేవి కావు. అల్లాహ్ ఇష్టప్రకారం, ప్రవక్త విధానంలో చేయవలసినవే చేయాలి. మన ఇష్టంతో మనం ఏమైనా చేసామంటే ఇది సమాజ దుస్థితికి కూడా కారణమవుతుంది, సమాజ సంస్కరణను లోపిస్తుంది. మనం షిర్క్, బిద్అతుల్లో పడి మరింత చాలా ఘోరమైన నష్టం పొందే వాళ్ళల్లో కలిసిపోతాము.
షాబాన్ మాసం ప్రాముఖ్యత
ఇప్పుడు రజబ్ యొక్క నెల సమాప్తం కావస్తుంది. ఈ నెలలో ఎంతోమంది ఉపవాస విషయాల్లో, నమాజ్ విషయాల్లో ఎన్నో రకాల బిద్అతులకు పాల్పడి ఉన్నారు. ఒకవేళ మీరు ఆ బిద్అతులు చేయకుండా సురక్షితంగా ఉన్నారు అంటే వాస్తవంగా మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. వాస్తవంగా మీరు చాలా గొప్ప అదృష్టవంతులు. ఇక ఒక లేదా రెండు రోజుల్లో షాబాన్ మాసం ప్రారంభం కానుంది. ఒకవైపున షాబాన్ మాసం కూడా మనం అధిక పుణ్యాలు సంపాదించడానికి ఒక మంచి సబబు అయితే, సర్వసామాన్యంగా ముస్లిం ప్రజలు ఈ మంచి అవకాశాన్ని వదులుకుంటారు, వాటికి వ్యతిరేకంగా ఎన్నో రకాల బిద్అతులకు పాల్పడతారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, మన సమాజంలో షిర్క్ పనులు, బిద్అత్ పనులు మనం మానుకోకుంటే సమాజం కూడా పాడవుతుంది. సమాజంలో ఉన్నటువంటి మనం కూడా పాడవుతాము మరియు స్వర్గానికి దూరం, నరకానికి దగ్గరగా అయిపోతాము.
షాబాన్ మాసం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు, సంవత్సరంలోని మాసాల్లోకెల్లా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షాబాన్ మాసానికి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ మనకు ఏదైతే కనబడుతుందో, అది ఉపవాసం యొక్క ఆచరణ. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రజియల్లాహు తాలా అన్హా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ మాసంలోనైతే సంపూర్ణంగా పూర్తి మాసం ఉపవాసం ఉండేవారు, ఎందుకంటే విధి, ఇస్లాం యొక్క ఐదు అర్కాన్ (మూల స్తంభాల)లో ఒకటి రమదాన్ లో ఉపవాసం ఉండడం. కానీ రమదాన్ తర్వాత మిగతా 11 మాసాలలో… 11 మాసాలలో షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. ఎంత ఎక్కువగా అంటే, ఎంత ఎక్కువగా అంటే… “ఈ పూర్తి షాబాన్ నెలనే ఉపవాసం ఉన్నారా” అని అనిపించేది. బుఖారి ముస్లింలలోని హదీస్. ఒకొక్క హదీస్ నేను అరబీలో వినిపించి దాని యొక్క రిఫరెన్స్ ఇచ్చి అనువాదాలు చేసుకుంటూ పోతే సమయం ఎక్కువ అవుతుందని నేను హదీస్ యొక్క భావం మీకు తెలియజేస్తున్నాను.
అయితే ప్రవక్త విధానం మనకేం తెలిసింది? షాబాన్ లో అత్యధికంగా ఉపవాసాలు పాటించడం. మరియు దీనికి సంబంధించి సునన్ నిసాయి మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చినటువంటి హదీసును గనక చూస్తే, ఉసామా రజియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ప్రశ్నించారు: “ప్రవక్తా! మీరు ఈ షాబాన్ మాసంలోనే అత్యధికంగా ఉపవాసాలు ఎందుకు పాటిస్తారు?” దానికి సమాధానంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు కారణాలు చెప్పారు. రెండు కారణాలు చెప్పారు, శ్రద్ధగా వినండి ఏంటి ఆ రెండు కారణాలు:
ذَلِكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ
[దాలిక షహరున్ యగ్ఫలున్ నాసు అన్హు బైన రజబిన్ వ రమదాన్]
“ఈ నెల ఎలాంటి నెల అంటే, సర్వసామాన్యంగా ప్రజలు అశ్రద్ధలో ఉంటారు.”
అశ్రద్ధలో ఉంటారు, కనుక నేను అశ్రద్ధ వహుల్లో, అశ్రద్ధగా జీవించే వాళ్ళల్లో ఉండదలుచుకోలేదు.
రెండవ కారణం:
وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الْأَعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ
[వ హువ షహరున్ తుర్ఫ ఉ ఫీహిల్ అఅమాలు ఇలా రబ్బిల్ ఆలమీన్]
“ఈ మాసం ఎలాంటి మాసం అంటే, ప్రజల యొక్క కర్మలన్నీ కూడా అల్లాహ్ ముందు హాజరు పరచబడతాయి.”
అల్లాహ్ ముందు హాజరు పరచబడతాయి. కనుక నేను ఉపవాసంతో ఉండాలి, అల్లాహ్ వద్ద నా కర్మలు ఉంచబడినప్పుడు నేను ఉపవాస స్థితిలో ఉండాలి.
ఈ రెండు కారణాలు సహీహ్ హదీసు ద్వారా రుజువయ్యాయి. కనుక మనం షాబాన్ మాసంలో ఈ ఉపవాసం యొక్క సున్నత్ ని పాటించాలి. ఉపవాసం షాబాన్ లో ఎక్కువగా ఉండి, రమదాన్ కొరకు మనం సిద్ధం అవ్వాలి. ఎందుకంటే రమదాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయి. మీరు కొందరిని చూడవచ్చు, రమదాన్ మొదటి రోజు ఉపవాసం వారికి చాలా కఠినంగా గడుస్తుంది. ఎందుకు? ఉపవాసం యొక్క అలవాటు లేదు గనక. కానీ ఉంటూ ఉంటూ ఒక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత వారికి చాలా సులభతరం అవుతుంది, ఉపవాసం ఉండడం సులభతరం అవుతుంది. అయితే ఆ మొదటి రెండు మూడు రోజులు, వారం రోజులు మనకు ఇబ్బందికరంగా ఉండకుండా, ఈ ఉపాయాన్ని పాటిస్తే, ప్రవక్త వారి సున్నత్ ను పాటించి ఉపవాసం ఉన్నవాళ్ళం మరియు అల్లాహ్ వద్ద చాలా గొప్ప పుణ్యాలు మనం పొందిన వాళ్ళం అవుతాము. అయితే ఈ షాబాన్ నెలలో చేయవలసిన సత్కార్యం అత్యధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు పాటించేవారు.
షబే బరాత్ మరియు బిద్అత్ ల ఖండన
కానీ సోదర మహాశయులారా! ఒక్కసారి మనం షాబాన్ నెలలో దృష్టి వేస్తే, ఎంతమంది మనలో ఉపవాసం ఉన్నవారు కనబడుతున్నారు? చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది లేదా వెయ్యిలో ఒకరిద్దరు కూడా బహుశా ఉండరు కావచ్చు. కానీ అదే స్థానంలో చేయరాని పనులు చేస్తారు, సున్నతులను వదిలి బిద్అతులకు పాల్పడతారు. మరి దాని కారణంగా వారు మహా నష్టానికి గురి అవుతారు. వాటిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఒక రెండు మూడు విషయాలను మనం ఒక ఉదాహరణగా తీసుకొని అన్ని రకాల బిద్అతులకు దూరం ఉండే ప్రయత్నం చేద్దాం.
ప్రధానంగా షాబాన్ మాసం అంటేనే ‘షబే బరాత్’ యొక్క నెల అని అనుకుంటారు. వాస్తవానికి ఈ పేరు కూడా ఎంత విచిత్రమైన పేరు గమనించండి. ఎందుకంటే ‘షబ్’ అన్నది ఫార్సీ పదం. ‘బరా అ’ (براءة) ఇది వాస్తవానికి అరబ్బీ పదం. వాస్తవానికి అరబ్బీ పదం. ఇక ఈ ‘షబే బరాత్’ అని ఒకవేళ దీనిని అరబ్బీలో అనువాదం చేస్తే ‘లైలతుల్ బరా అ’. భావం ఏమొస్తుంది? ఏ రాత్రి అంటే ప్రజలు సర్వసామాన్యంగా భావించేది నరకం నుండి విముక్తి పొందే అటువంటి రాత్రి అని. కానీ గమనించండి, ఎవరైతే బిద్అతులకు పాల్పడతారో వారు నరకం నుండి విముక్తి పొందరు, నరకంలో ప్రవేశిస్తారు.
సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం లోని సహీహ్ హదీస్, రెండు మూడు హదీసుల సారాంశం వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి. ప్రళయ దినాన ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మైదానె మహ్షర్ లో హౌజె కౌసర్ అన్నటువంటి గొప్ప ఒక హౌజ్, అందులో స్వర్గంలోని నహ్రె కౌసర్ నుండి వచ్చే అటువంటి నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఎంత శుభకరమైనవి అంటే, శుభప్రదమైనవి అంటే, ఎవరైతే ఒక్కసారి తాగుతారో ప్రవక్త శుభ హస్తాల నుండి, ప్రవక్త యొక్క ముబారక్ చేతుల నుండి, స్వర్గంలో వెళ్లే వరకు ఎన్నటికీ వారికి దాహం కలగదు. లాయజ్మ ఉ అబదా. కానీ ఏం జరుగుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క ఉమ్మతీలను, అనుచరులను వుజూ యొక్క గుర్తుల ద్వారా వారిని గుర్తుపట్టి ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రవక్త వద్దకు గుంపులు గుంపులుగా ప్రజలు వస్తూ ఉంటారు, ప్రవక్త తమ చేత వారికి నీళ్లు హౌజె కౌసర్ నీరు తాగిస్తూ ఉంటారు. అంతలోనే దైవదూతలు వచ్చేసి ఒక సమూహాన్ని, కొంతమందిని ఎడమ వైపునకు నెట్టేస్తారు. ఎడమ వైపునకు నెట్టేస్తారు. ప్రవక్త అంటారు: “వారిని రానివ్వండి నా దగ్గరికి”. అయితే అప్పుడు ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది:
إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
[ఇన్నక లా తద్రీ మా అహ్దసూ బాదక]
“ఓ ప్రవక్తా! నీ తర్వాత వారు ధర్మంలో ఎలాంటి కొత్త విషయాలు ఏర్పరుచుకున్నారో, ఎలాంటి బిద్అతులను పుట్టించారో, ఎలాంటి బిద్అతులపై ఆచరించారో, వాటి కారణంగానే వారిని మిమ్మల్ని నుండి దూరం చేయడం జరుగుతుంది.”
ఆ తర్వాత ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి ఇమాముల్ అంబియా, ప్రవక్తలకే నాయకులు, సయ్యదు వులూది ఆదం, ఆదం సంతతికే నాయకులు… ఇక ప్రవక్త ఎలాంటి సిఫారసు చేయలేరు. పైగా ఇంకా ఏమంటారు?
سُحْقًا سُحْقًا لِمَنْ غَيَّرَ بَعْدِي
[సుహ్ఖన్ సుహ్ఖన్ లిమన్ గయ్యర బాదీ]
“ఎవరైతే నా ధర్మంలో మార్పులు చేర్పులు చేశారో, నేను వారిని ఏ సున్నత్ ప్రకారంగా వదిలి వెళ్ళానో, ఆ సున్నతులపై ఉండకుండా బిద్అతులపై ఆచరించారో, అలాంటి వారు నా నుండి దూరమే దూరం ఉండుగాక.” అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
ఇక్కడ ఈ లోకంలో రాషన్ తీసుకోవడానికి మీరు దుకాణంలో వచ్చారు, మీ దగ్గర రాషన్ కార్డు లేదని, మీ ఆధార్ కార్డు లేదని మిమ్మల్ని నెట్టివేస్తే… వేరే ఎక్కడైనా మీకు నాలుగు… మీకు ఎక్కడైనా కిలో రెండు కిలోల బియ్యం దొరకవచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి బాధ్యుడు ఇవ్వకుంటే, లైన్ లో ఉన్నవారే ఎవరైనా దయచూపి మీకు ఏమైనా ఇవ్వచ్చు. ప్రళయం అలాంటిది కాదు. అక్కడ ఎవరి సిఫారిసు చెల్లదు, ఏ పెద్దల నాయకత్వం అక్కడ ఏమాత్రం చెల్లదు. కనుక సోదర మహాశయులారా, షాబాన్ లో షబే బరాత్ అన్న పేరుతో కానివ్వండి, ఇంకా వేరే ఏ రకమైన బిద్అతులైనా వాటన్నిటికీ దూరంగా ఉండండి.
ఈ షబే బరాత్ యొక్క బిద్అత్ ఎంతగా మన సమాజంలో ప్రచారం పొందిందంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, నేను స్వయంగా నా కళ్ళారా కొందరిని చూశాను, ఈదుల్ ఫిత్ర్ యొక్క పండుగ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత షబే బరాత్ కు ఇస్తారు. ఆ రాత్రి కొరకు కొత్త బట్టలు వారు ధరిస్తారు. ఆ రాత్రి కొరకు ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఆ రాత్రిలో ప్రత్యేకమైన జాగారాలు చేసి కొన్ని రకాల ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తూ ఉంటారు. మరియు ఈ షబే బరాత్ సందర్భంలో సలాతుత్తస్బీహ్ గురించి, ఇంకా వేరే నఫిల్ ఆరాధనల గురించి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే గుర్తుంచుకోండి, 15వ షాబాన్ రాత్రి, 14-15 షాబాన్ మధ్య రాత్రి షబే బరాత్ పేరుతో జాగారం చేయడం, ఇది అల్లాహ్ ఆదేశించిన ఆదేశం ఎంతమాత్రం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 23 సంవత్సరాల ప్రవక్త పదవిలో ఏ ఒక్కసారి కూడా, ఏ ఒక్కసారి కూడా షబే బరాత్ అన్న పేరుతో, లైలతుల్ బరాత్ అన్న పేరుతో జాగారం చేయలేదు, ఆ రాత్రి ప్రత్యేక నమాజులు చేయలేదు.
కొందరు మన సమాజంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. “కూమూ లైలహా వసూమూ నహారహా” (దాని రాత్రి నిలబడండి, దాని పగలు ఉపవాసం ఉండండి) అని ఇబ్నె మాజా లో ఉన్నది కదా అని అంటారు. కానీ సోదర మహాశయులారా! వాస్తవానికి అలాంటి ఏ ఆదేశం లేదు. ఇబ్నె మాజా లోని ఆ హదీస్ సహీహ్ తో దూరం, జయీఫ్ కూడా కాదు, మౌజూ, కల్పితమైనది. కల్పితమైనది. అంతేకాదు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 23 సంవత్సరాలు జీవించారు ప్రవక్త పదవి తర్వాత. ప్రవక్త మరణం తర్వాత సహాబాలు 110వ హిజ్రీ వరకు, అంటే ప్రవక్త మరణించాక వంద సంవత్సరాలు సహాబాలు ఉన్నారు. ఆ తర్వాత 200, 250, 300 వరకు తాబయీన్, తబె తాబయీన్… సహీహ్ బుఖారి హదీస్ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ప్రకారం ఈ మూడు తరాలు (సహాబా, తాబయీన్, తబె తాబయీన్) – ఈ తరాలను ‘ఖైరుల్ ఖురూన్’ (ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వారు) అని చెప్పడం జరుగుతుంది. అలాంటి వారి కాలంలో కూడా ఈ షబే బరాత్, లైలతుల్ బరాత్ మరియు దీని కొరకు జాగారం చేయడం, ప్రత్యేకమైన నమాజులు చేయడం, పగలు ఉపవాసం ఉండడం ఇలాంటివేవీ కూడా లేవు.
ఆ రాత్రి కొందరు జమాత్ తో నమాజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కొందరు జమాత్ తో నమాజ్ చేసే ప్రయత్నం చేస్తారు. బిద్అతులను ఖండిస్తూ అబూ షామ రహిమహుల్లాహ్ రాసినటువంటి ప్రఖ్యాతి గ్రంథం అందులో చాలా స్పష్టంగా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక 400 సంవత్సరాల తర్వాత, నాలుగు సంవత్సరాలు… 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ షబే బరాత్ లో ప్రత్యేక నమాజ్ చేసిన ఈ బిద్అత్ సిరియాలో ఒక వ్యక్తి స్వతహాగా వచ్చి చాలా మంచి ఖిరాత్ తో నమాజ్ ప్రారంభించాడు. వెనుక కొందరు అలాగే అతని వెనుక ముక్తదీలుగా తయారయ్యారు. అతనికి ఆ విషయం చాలా నచ్చింది, ప్రజలు అతని తిలావత్ ను మెచ్చుకున్నారు. మరుసటి సంవత్సరం అతడు మళ్ళీ ఇదే బిద్అత్ ని కొనసాగించాడు. అంతకుముందు షబే బరాత్ లో ప్రత్యేకమైన నమాజు పేరుతో ఏ నమాజు లేదు.
ఇక మరికొందరు ఏం చేస్తారు మన సమాజంలో? సమాధులను, ఖబరస్తాన్ లను ప్రత్యేకంగా అలంకరిస్తారు. అన్ని రకాల చెట్లను కొట్టేసి, లైట్లు పెట్టి, ఆ రోజు ప్రత్యేక జియారతులు అని, జియారత్ అని ఆ రోజు రాత్రి కూడా కొందరు వెళ్తూ ఉంటారు. కానీ చాలా విచిత్రమైన విషయం, ఎవరైతే తౌహీద్ పై స్థిరంగా ఉండరో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ పై మనం జీవించాలి, మన సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో ఖురాన్ హదీస్ ను అలాగే సలఫ్ విధానంలో ఉండాలి అన్నటువంటి తపన ఉండదో… వారిని ఎన్నో రకాల ప్రేరేపణలతో షైతాన్ మరియు షైతాన్ యొక్క అసలైన మానవులలోని ఫాలోవర్స్ ఎన్నో రకాల కొన్ని విషయాలు చూపి బిద్అతులలో పడవేస్తారు.
ఏంటి విషయం? షాబాన్ 15వ రాత్రి జియారత్ కు సంబంధించి తిర్మిజి లోని ఒక హదీసును ప్రస్తావిస్తారు. నేను వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నాను, ఖండిస్తున్నాను అంటే… ఎవరి ద్వారానైనా మీరు… “తిర్మిజిలో హదీస్ ఉంది కదా ఖబరస్తాన్ జియారత్ షబే బరాత్ లో చేయాలని” అని చెప్పినా… అది ఎంతవరకు సత్యం, ఏంటి… మీరు తెలుసుకొని ఉంటే వారికి సమాధానం ఇవ్వచ్చు, జవాబు ఇవ్వచ్చు. కానీ తిర్మిజి లో ఉన్నది ఒక హదీస్, షాబాన్ 15వ రాత్రి ప్రవక్త ‘బఖీయే ఘర్ఖద్’ లో జియారత్ కొరకు, దర్శించడానికి వెళ్లారు. కానీ అదే తిర్మిజిలో, అదే తిర్మిజిలో ఇమామ్ తిర్మిజి రహిమహుల్లాహ్ అలైహ్ చాలా స్పష్టంగా చెబుతున్నారు: “సమితు ముహమ్మదన్” – “నేను ముహమ్మద్ ఇబ్నె ఇస్మాయిల్ (ఇమామ్ బుఖారి)తో విన్నాను, ఈ హదీస్ సహీహ్ కాదు”. ఈ హదీస్ సహీహ్ కాదు అని ఆయన స్వయంగా చెప్తున్నారు. అలాంటి హదీసును తీసుకుంటారు. కానీ సహీహ్ ముస్లిం లో వచ్చినటువంటి హదీస్, సహీహ్ హదీసులు వారికి కనబడవు. సహీహ్ హదీసులు వారికి కనబడవు.
ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్ ఏమిటి? ఆయిషా సిద్దీఖా రజియల్లాహు తాలా అన్హా చెబుతున్నారు: “నా వద్ద ప్రవక్త వారి వంతు ఏ ఏ రాత్రుల్లో ఉండేదో, సర్వసామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వంతులోని ఆ రాత్రుల్లో బఖీయే ఘర్ఖద్ కు వెళ్లి ఆ సమాధులను దర్శించేవారు, వారి కొరకు అల్లాహ్ తో క్షమాపణ కోరేవారు.” అక్కడ 15వ షాబాన్ అన్నటువంటి ప్రస్తావన లేనే లేదు. ఏముంది? నా వద్ద ప్రవక్త వారి యొక్క వంతు. ప్రవక్త వారికి ఒకే సమయంలో తొమ్మిది భార్యలు ఉండేవారు. ప్రతి ఒక్కరికి ఒకొక్క రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేటాయించారు, న్యాయం పాటించారు. ఆ న్యాయాన్ని మనం పాటించాలి, ఒకవేళ ఎవరి వద్దనైనా ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉంటే. కానీ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఏమంటున్నారు? “నా వద్ద వంతు ఉన్న రాత్రి ప్రవక్త వారు సమాధి సందర్శనకు, బఖీయే ఘర్ఖద్ యొక్క విజిట్ కు వెళ్ళేవారు.” అయితే ఏం తెలిసింది? సంవత్సరంలో కనీసం, కనీసం ఒక 40 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి దగ్గర ఉండేవారు. ఎందుకంటే సంవత్సరంలో 52 వారాలు కదా. తొమ్మిది భార్యలు, ఆ ప్రకారంగా లెక్కేసుకోండి. కానీ అది వదిలేసి సహీహ్ హదీసులను, జయీఫ్ హదీసులను తీసుకొని, వాటిని ఆధారంగా పెట్టుకొని బిద్అతులకు దారి ఇవ్వడం వాస్తవానికి మనం మనల్ని స్వర్గం నుండి దూరం చేసి నరకం వైపునకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
ఇంకా సోదర మహాశయులారా, ఆ 15వ షాబాన్ యొక్క రాత్రి ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఈ వంటకాలు చేయడమే కాదు, స్వయంగా ఎంతో మంది అడిగినటువంటి ప్రశ్న, వారి ఇండ్లల్లో జరుగుతున్నటువంటి దురాచారం, బిద్అత్ ఏంటి? “పోయిన షాబాన్ 15 నుండి ఈ షాబాన్ 15 వరకు ఈ సంవత్సరంలో మా దగ్గరి బంధువుల్లో ఎంతమంది చనిపోయారో, వారు మా ఇంటికి వస్తారు. మేము వండినటువంటి ఈ భోజనాలు భుజిస్తారు, తింటారు” అన్నటువంటి నమ్మకం వారికి ఉంది. నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. వాస్తవానికి ఇలాంటి బిద్అత్ నమ్మకాలు మన సమాజంలో వేరే వారి నుండి వచ్చాయి. ‘వర్ధంతి’ అన్న పేరుతో, ఇంకా వేరే ఎన్నో దురాచార పేర్లతో ముస్లిం సమాజంలో ఏ చెడులు ప్రబలి ఉన్నాయో… మొన్న రెండు రోజుల, మూడు రోజుల క్రితం, శుక్రవారం… పోయిన బుధవారం రోజు ఒక జనాజాలో వెళ్లడం జరిగింది. జనాజాకు సంబంధించి ఏ ఏ బిద్అతులు అవుతాయో వాటన్నిటినీ ఖండించి వారికి చాలా మంచి రీతిలో నచ్చజెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక ముసలమ్మ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏమిటి? “అయ్యా! ఒకవేళ మేము ఆ మూడు ఒత్తులు చేయకుంటే, మా ఈ కొడుకు వస్తాడు కదా మళ్ళీ, మమ్మల్ని అడుగుతాడు కదా ఎందుకు చేయలేదు అని.” నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్.
గమనించండి, మనం ముస్లింలమై ఎంతవరకు మన విశ్వాసాలు దిగజారిపోయాయి, ఖురాన్ హదీస్ నుండి దూరమైపోయాయి! చనిపోయిన వ్యక్తి పేరు మీద మూడు ఒత్తులు, ఏడు ఒత్తులు, పది ఒత్తులు, ఇంకా 40వ, బర్సీ… ఇలాంటివన్నీ కూడా చేయకుంటే వారి ఆత్మ తిరిగి వస్తుంది, మమ్మల్ని చాలా పరేషాన్ చేస్తుంది, మేము ఒకవేళ చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది – ఇవన్నీ కూడా బిద్అత్. బిద్అత్ కాదు, బిద్అత్ కంటే చాలా ప్రమాదకరమైన కుఫ్రులో పడే అటువంటి భయం ఉన్నది. ఎందుకంటే అల్లాహు తాలా చాలా స్పష్టంగా చెప్పేసాడు: మనిషి చనిపోయిన తర్వాత పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా, ఫిరౌన్ లాంటి వాడైనా, మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి సహాబాల లాంటి వారైనా… ప్రతి ఒక్కరి ఆత్మ ఈ లోకంలో తిరిగి రాదు. ఏమవుతుంది? ఖురాన్ లో అల్లాహ్ చాలా స్పష్టంగా చెప్పాడు:
كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ
[కల్లా ఇన్న కితాబల్ అబ్రారి లఫీ ఇల్లియ్యీన్]
“నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ‘ఇల్లియ్యీన్’ లో ఉంటుంది.” (83:18)
పుణ్యాత్ముల ఆత్మలన్నీ కూడా వారి ప్రస్తావన, వాటి చోటు అది ఇల్లియ్యీన్. అదే:
كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ
[కల్లా ఇన్న కితాబల్ ఫుజ్జారి లఫీ సిజ్జీన్]
“నిశ్చయంగా దుర్మార్గుల కర్మల చిట్టా ‘సిజ్జీన్’ లో ఉంటుంది.” (83:7)
పాపాత్ములు, అవిశ్వాసులు వారి ప్రస్తావన, వారి యొక్క పేరు నమోదు, వారి యొక్క ఆత్మలు సిజ్జీన్ లో ఉంటాయి. ఈ లోకంలో ఎవరి ఆత్మ తిరిగి రాదు. ఒకవేళ పుణ్యం చేసుకొని ఉంటే, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో విశ్వాసం ఉండి, ప్రవక్త విధానంలో మన జీవితం గడిపితే, మనం చాలా హాయిగా ఉంటాము. సహీహ్ హదీస్ లో వచ్చిన విషయం: “ఫఫ్రిషూ లహూ మినల్ జన్న”. చూడడానికి మనం శరీరాన్ని, భౌతికాన్ని సమాధిలో పెట్టి వచ్చాము, కానీ అల్లాహ్ ఆదేశిస్తాడు: “అతడు నా యొక్క పుణ్యదాసుడు, నన్ను ఆరాధించిన వాడు, నా ఇస్లాం ధర్మం ప్రకారంగా తమ జీవితాన్ని గడుపుకున్న వాడు. కనుక స్వర్గం యొక్క పరుపులు అతని కొరకు పరవండి. స్వర్గం యొక్క కిటికీలు తెరవండి. అక్కడి నుండి సువాసనలు, మంచి గాలులు వస్తూ ఉంటాయి.” అదే ఒకవేళ అవిశ్వాసి లేదా మునాఫిక్ (కపట విశ్వాసి) లేదా ఒకవేళ అతడు మహా పాపి అయి ఉండేదుంటే, అతని కొరకు సమాధి ఇరుకుగా చేయడం జరుగుతుంది. నరకం యొక్క పరుపులు అతని కొరకు పరవడం జరుగుతుంది. నరకం యొక్క కిటికీలు తెరవడం జరుగుతుంది. దుర్వాసన, వేడి గాలులు అతనికి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి.
అందుకొరకే షాబాన్ యొక్క 15వ రాత్రిలో ఆత్మలు తిరిగి వస్తాయి అని నమ్మడం, మన వంటకాలు తింటాయి అని నమ్మడం, వారి కొరకు మనం సమాధి సందర్శన చేయాలి అని నమ్మడం చాలా చాలా కుఫ్రులో విచిత్రమైన పనులు. వేరే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన మా స్టూడెంట్స్ ఉన్నారు. వారు స్వయంగా వారి గ్రామంలో, పల్లెలో జరుగుతున్న విషయం చెప్పారు: 15వ షాబాన్ రాత్రిలో సమాధిని సందర్శిస్తారు. అక్కడ ఆ వ్యక్తికి తన జీవితంలో ఏ ఏ ప్రత్యేక విషయాలు ఇష్టమో, అవి తీసుకెళ్లి అతని సమాధి వద్ద పెడతారు. చివరికి ఎవరికైతే బీడీ ఇష్టమో ఆ బీడీ కూడా అక్కడ పెడతారు. నవ్వే విషయాలు కాదు, మన అజ్ఞానంపై ఏడ్చే విషయాలు. ఇలా చేస్తున్నారు ప్రజలు. అంతేకాదు, కల్లు, మత్తు పానీయాలు అతను సేవిస్తూ ఉంటే అది తీసుకెళ్లి సమాధి మీద పెడతారు. గమనించండి ఎంతవరకు మనం దిగజారిపోయాము! పేర్లు ముస్లింలవి, ముస్లిం సమాజంలో ఉన్నవారు. కానీ కుఫ్రు కంటే కూడా అధ్వానంగా ప్రవర్తన వారిది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడం లేదు.
కనుక సోదర మహాశయులారా, ఎప్పుడో నెలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటే సరిపోదు. వ్యక్తిగతంగా ప్రతి మనిషి ధర్మాన్ని నేర్చుకోవాలి. ఈ సందర్భంలో నేను ఒక విషయం చాలా ముఖ్యంగా గుర్తు చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సమాజం ఎంత ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుందో, సైన్స్ టెక్నాలజీ పరంగా ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో, మనం “నాకు తెలియదు” అన్నటువంటి సాకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటాడు. అర్థం కాలేదా నా మాట? “ఎందుకయ్యా ఈ షిర్క్ పని చేస్తున్నావు? ఎందుకు ఈ బిద్అత్ చేస్తున్నావు? ఇది మంచిది కాదు వదలండి” అని అంటే “అయ్యో బిడ్డా! మాకు ఎవరు చెప్పేవాళ్ళు రాలేదు కదా” అని మన పెద్దలు కొందరు అంటారు. కదా? కానీ ఇప్పుడు ఆ పెద్దల్లో ఎంతోమందిని చూడండి, మాషా అల్లాహ్, వారు ‘అ’ అంటే తెలియదు, ‘ఎ’ అంటే తెలియదు, ‘అలిఫ్’ అంటే కూడా తెలియదు కానీ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అవునా లేదా? తమ వారికి ఫోన్లు చేసుకుంటారు. సరే ఇది ఒక అవసరం అని అనుకుందాము ఫోన్లు చేసుకోవడం. అంతకంటే ఎక్కువగా ఇష్టమైన ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో, ఇంకా వేరే సోషల్ మీడియా అప్లికేషన్లలో ఇష్టమైన నాటకాలు, ఇష్టమైన కార్టూన్లు, ఇష్టమైన స్టోరీలు, సీరియళ్లు, ఫిలింలు చూస్తూ ఉన్నారు.
ఇలా చూసేవారు ఎంతోమంది చూడడానికి అజ్ఞానులం, మాకు రాయడం చదవడం రాదు అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేదా? మీరు మీ ఇహలోక ఆనందానికి ఎన్నో రకాల వస్తువులు వాడుతున్నారు. అయితే మీ పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఎందుకు పొందడం లేదు అన్నటువంటి ప్రశ్న వస్తే మనం ఏం సమాధానం చెప్పుకుందాము?
ధర్మ జ్ఞానం కొరకు ఆన్‌లైన్ వనరులు
కరోనా సందర్భం నుండి అల్లాహ్ యొక్క దయతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇస్లాం వారి ప్రతి ఇంట్లో చేరాలని ఆన్‌లైన్ క్లాసులు పెట్టడం జరుగుతుంది. కానీ తెలంగాణ పాపులేషన్ చూడండి ఎంతుందో, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంతుందో చూడండి, అందులో ముస్లింలు ఎంతమంది ఉన్నారు? కానీ ఆన్‌లైన్ క్లాసులు సలఫీ మన్హజ్ ప్రకారంగా జరుగుతున్నవి ఎన్ని? అందులో పాల్గొనే వాళ్ళం ఎంతమంది? బహుశా వంద మందికి తెలిసి ఉంటుంది, ఫలానా ఆలిం సాబ్, ఫలానా మౌల్వీ సాబ్ మంచి సలఫీ మన్హజ్ లో ఉన్నవారు ఆన్‌లైన్ క్లాసులు నడుపుతున్నారు అని కూడా తెలుసు. కానీ “ఏం చేద్దాం, మాకు సమయం లేదు, మాకు నెట్వర్క్ బాగుండదు, మాకు తీరిక లేదు” ఇలాంటి ఎన్నో సాకులు చెప్పుకుంటాము. కానీ పరలోకాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ప్రశ్నించినప్పుడు: “నీకు ఈ వయసులో ఎన్ని అనుగ్రహాలు నేను ప్రసాదించానో, దాని ప్రకారంగా నీవు నాకు ఎంత కృతజ్ఞత చెల్లించావు? నీవు నన్ను ఎంతవరకు ఆరాధించావు?” అప్పుడు మనం ఏం సమాధానం ఇద్దామో చూడండి ఒకసారి ఆలోచించండి.
కనుక రండి, ధర్మజ్ఞానం నేర్చుకోండి. మీ మస్జిద్ లో ఉన్నటువంటి మౌల్వీ సాబ్ దగ్గర హాజరవ్వండి. కనీసం ఒక అరగంట రోజు తీయండి. “మస్జిద్ లో దర్సు జరుగుతుంది” అని అంటాము, కానీ ఈరోజు దర్సు జరిగిందా అంటే “అవును” అంటాము. ఏం చెప్పారు మౌల్వీ సాబ్? “అబ్బా ఏదో మంచిగానే చెప్పారండి ఇప్పుడు గుర్తు రావట్లేదు.” ప్రతిరోజు దర్సు వింటాము, వారంలో కనీసం దర్సులో చెప్పిన ఒక్క విషయం గుర్తుంచుకోకపోతే ఎలా చెప్పండి?
అందుకొరకే రండి, రమదాన్ శుభప్రదమైన మాసం దగ్గరగా ఉంది, మధ్యలో కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. అల్లాహ్ యొక్క దయతో కరోనా సందర్భం నుండే ప్రతి రమదాన్ కు ముందు రమదాన్ స్పెషల్ ఆన్‌లైన్ క్లాసులు కూడా మేము జరుపుతూ ఉంటాము. ఎప్పుడు? షాబాన్ సుమారు 15-20 నుండి. మీరందరూ మా వాట్సాప్ నెంబర్లు తీసుకొని ప్రతిరోజు క్లాసులో హాజరై ధర్మజ్ఞానం నేర్చుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ధర్మవేత్తలను, తెలుగు ఉలమాలను హాజరుపరిచి ఒకొక్క రోజు ఒకొక్క ఆలిం సాబ్ ద్వారా రమదాన్ కు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, మనం నేర్చుకోవలసినవి.
అంతేకాకుండా నిన్ననే నాకు ఒక శుభవార్త అందింది. అందులో సుమారు ఒక 15 నిమిషాల సమయం నేను కూడా కేటాయించడం జరిగింది. ఒక సోదరీమణి ఫోన్ చేసింది ఇక్కడ నా లోకల్ నెంబర్ కి. చేసి “నా నెంబర్ కొత్తగా ఉన్నందుకు మీరు నన్ను గుర్తుపట్టలేదేమో” అంది. నేను అన్నాను “అవును గుర్తుపట్టలేదు, నేను మీ ఆన్‌లైన్ క్లాస్ స్టూడెంట్”. నేను వారికి ఆహ్వానించాను, శుభ… వారికి కంగ్రాట్యులేషన్స్ చెప్పాను. ఆ తర్వాత ఆమె ఏమందో తెలుసా? “సుమారు గత 20 రోజుల నుండి రమదాన్ కొరకు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనం రమదాన్ కొరకు ఎలా రెడీగా ఉండాలి? ఏ ఏ పుణ్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి?” అనే క్లాసులు పెట్టుకున్నాము. ప్రతిరోజు ఒకొక్క ఆలిం సాబ్ వచ్చి మాకు ప్రసంగిస్తున్నారు. తర్వాత మేము స్వయంగా ఆ ఆలిం సాబ్ ద్వారా విన్నటువంటి విషయాలను నోట్ చేసుకొని మళ్ళీ మేము రిపీట్ చేసుకుంటాము, ఇంకా నేర్చుకుంటూ ఉంటాము. “ఈరోజు మీరు మాకు సమయం ఇవ్వండి, 9 గంటలకు ఫోన్ చేసి 11 గంటలకు మాకు క్లాస్ జరుగుతుంది” అని చెప్పారు. చాలా ఆనందం కలిగింది. మన ప్రాంతాల్లో ఇలా చేయలేమా? స్టూడెంట్స్ వారి స్టూడెంట్స్ ను, వారి క్లాస్ వాళ్లను జమా చేసి… ఏదైనా ఆఫీసుల్లో పని చేసేవారు తమలాంటి స్నేహితులను… పొలంలో ఉన్నవారు, చేనులో ఉన్నవారు, తమ గ్రామంలో ఉన్నవారు… మనం మన అవసరాలకు ఎన్ని వాట్సాప్ గ్రూపులు లేవండి? ఒక్కసారి ఆలోచించండి. కానీ ధర్మజ్ఞానం నేర్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు మనం చేయాలి. స్త్రీలు చేస్తున్నారు అంటే మనం పురుషులం, మనం యువకులం, మనం స్టూడెంట్స్ ఇంకా ముందుకు దీంట్లో రావాలి. మన సమయాన్ని ఇందులో వెచ్చించాలి.
మరియు సోదర సోదరీమణులారా, నా సమయం సమాప్తం కావస్తుంది గనక, ఈ ఉప్పల్ గ్రామాన్ని కూడా మర్చిపోకండి. ఈనాటి కంటే సుమారు 40 సంవత్సరాల క్రితము నుండే మన పెద్దలు ఇక్కడ ఎలాంటి త్యాగాలు చేశారు, వారు పల్లె పల్లెల్లో గ్రామాల్లో ఎలా తబ్లీగులు చేశారు, ఇప్పటికి మన ముందు ఆ పెద్దలు ఉన్నారు. కలవండి, వారి అనుభవాలు నేర్చుకోండి. ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి మన వద్ద ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ద్వారా ఇంటింటికి ఇస్లాం ధర్మం చేర్పించి, మనం అల్లాహ్ వద్ద మన కొరకు పుణ్యాలు ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. మనం చనిపోక ముందే మనం మన కొరకు సదఖాయే జారియా ఏంటో తయారు చేసుకొని వెళ్ళాలి.
తర్వాత మన సంతానం మనం వదిలిన ఓ ఎకరం పొలం గురించి, మనం వదిలిన ఓ నాలుగు బిల్డింగ్ల ఇండ్ల గురించి కొట్లాడుకుంటారు. కానీ “నా చనిపోయిన తండ్రి, అతని గురించి నేను ఏం సదఖాయే జారియా చేయాలి” అన్నటువంటి తపన ప్రతి కొడుకుకు, ప్రతి బిడ్డకు ఉండదు. కనుక బ్రతికి ఉన్న కాలంలోనే:
إِذَا مَاتَ الإِنْسَانُ انْقَطَعَ عَنْهُ عَمَلُهُ إِلَّا مِنْ ثَلَاثَةٍ
[ఇదా మాతల్ ఇన్సాను ఇన్ ఖత అ అన్హు అమలుహు ఇల్లా మిన్ సలాసతిన్]
“మనిషి చనిపోతే అతని కర్మలన్నీ తెగిపోతాయి, మూడు తప్ప (సదఖాయే జారియా, ఉపయుక్తమైన జ్ఞానం, ప్రార్థించే సత్సంతానం).“
అమలు అని హదీస్ ఉంది కదా, దాని ప్రకారంగా ఆచరించుకుంటూ వెళ్ళండి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. విన్న విషయాలను అర్థం చేసుకొని వాటిలోని మంచి విషయాలపై ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్, వ ఆఖిరు దఅవానా అనిల్ హం దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44908