ఇహ్సాన్ : ఇస్లాం ధర్మంలోని మూడవ మరియు అత్యున్నత స్థాయి
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/ITBncGgMwvY [16 నిముషాలు]
ఈ పాఠంలో, ఇస్లాం ధర్మంలోని మూడవ మరియు అత్యున్నత స్థాయి అయిన ‘ఇహ్సాన్’ గురించి వివరించబడింది. ఇహ్సాన్ యొక్క ఏకైక స్తంభం (రుకున్) మరియు దానికి ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి ఆధారాలు (దలీల్) చర్చించబడ్డాయి. ఇహ్సాన్ అంటే అల్లాహ్‌ను చూస్తున్నట్లుగా ఆరాధించడం, లేదా కనీసం అల్లాహ్ తనను చూస్తున్నాడనే సంపూర్ణ నమ్మకంతో ప్రతి పనిని పరిపూర్ణంగా (perfection), చిత్తశుద్ధితో (sincerity) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో చేయడం. ప్రతి ముస్లిం తన ఆరాధనలలో మరియు జీవితంలోని ప్రతి అంశంలో ఈ ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ప్రయత్నించాలని ఈ పాఠం నొక్కి చెబుతుంది.
అల్హమ్దులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు. 16వ పాఠం. ఇహ్సాన్, దాని యొక్క రుకున్, ఒక మూలస్తంభం మరియు దాని యొక్క దలీల్, ఆధారాలు తెలుసుకుందాము. అయితే మీరు మరిచిపోలేదు కదా? ఇంతకుముందు 15 పాఠాలు విన్నారు కదా? మనం సమాధిలో ప్రశ్నించబడే అటువంటి మూడు ప్రశ్నల సమాధానాలు త్రి సూత్రాలు అన్న పేరుతో తెలుసుకుంటున్నాము వివరాలతో ఆధారాలతో.
ఇప్పుడు మనం రెండో ప్రశ్న అయినటువంటి మా దీనుకా నీ ధర్మం ఏది? అంటే నా ధర్మం ఇస్లాం అన్నటువంటి దానికి వివరణ ఆధారాలతో తెలుసుకుంటున్నాము. ఇస్లాం ధర్మం మూడు స్థానాలు ఉన్నాయి. మొదటి స్థానం ఇస్లాం, రెండవ స్థానం ఈమాన్, మూడవ స్థానం ఇహ్సాన్. ఇస్లాం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాము, దాని అర్థం, దాని యొక్క భావం మరియు దాని యొక్క ఐదు రుకున్లు మూల స్తంభాలు. వాటి యొక్క ఆధారాలు కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత రెండవ స్థానం, ఈమాన్, విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకున్నాము. విశ్వాసం భాగాలు ఏమిటో తెలుసుకున్నాము. దాని యొక్క ఆధారాలు మరియు విశ్వాసం యొక్క ఆరు మూల సూత్రాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇహ్సాన్ గురించి తెలుసుకుంటున్నాము.
ఇహ్సాన్ యొక్క రుకున్ (స్తంభం)
ఇహ్సాన్కు ఒకే ఒక రుకున్ మూలస్తంభం ఉన్నది. అదేమిటి? ఒక ఉపమానం, ఉదాహరణ వింటారా? మీరు ఏ జాబ్ చేసినా, ఏ కొలివి చేసినా, ఎవరి చేతి కింద ఏ పని చేసినా, మీ పై యజమాని మీ కళ్ళ ముందు ఉండి మీరు అతన్ని చూస్తూ ఉండి ఆ పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు కదా?
ఇక ఈనాటి కాలంలో, మీ యజమాని లేడు కానీ మీరు పని చేసే చోట కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకు? ఓ మా యజమాని, మా సేఠ్ గారు ఇక్కడ లేడు. కానీ ఈ సీసీటీవీల ద్వారా అతను తన ఆఫీసులో ఉండి లేదా అతడు ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా గాని తన మొబైల్లో చూసుకుంటాడు. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాము? పర్ఫెక్ట్గా చేస్తాము.
అల్లాహ్ మనందరినీ క్షమించు గాక, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపు గాక. ఇది ఇహ్సాన్కు సంబంధించి అల్లాహ్ గురించి కాదు ఉపమానం నఊదు బిల్లాహ్.
فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ
(ఫలా తద్’రిబూ లిల్లాహిల్ అమ్సాల్)
అల్లాహ్‌కు ఉపమానాలు కల్పించకండి.
ఇహ్సాన్ అన్న దానికి మనం ఎలా ప్రాక్టికల్‌గా దానిని మన ఆచరణలో తీసుకురావాలి, ఈ మాట మన బుర్రలో దిగడానికి, మనకు అర్థం కావడానికి ఒక ఉపమానం.
ఇహ్సాన్ యొక్క నిర్వచనం మరియు హదీస్ ఆధారం
హదీస్లో ఏం వచ్చింది? ఇహ్సాన్ యొక్క రుకున్, మూలస్తంభం ఏమిటి?
أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ
(అన్ త’బుదల్లాహ క అన్నక తరాహు)
నీవు అల్లాహ్‌ను చూస్తున్నట్లుగా భావించి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉండు.
అల్లాహు అక్బర్. అల్లాహ్ నీ ఎదుట ఉన్నాడు, నీవు అల్లాహ్‌ను చూస్తున్నావు, ఈ భావనతో అల్లాహ్ యొక్క ఆరాధన చేయు. ఇక్కడ ఆరాధన అంటే కేవలం నమాజ్, రోజాలు కావు. మనం చేసే ప్రతీ సత్కార్యం. ఇక ఈ భావన కలగకుంటే మీలో,
فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ
(ఫఇన్ లమ్ తకున్ తరాహు ఫఇన్నహూ యరాక)
నీవు అతన్ని చూడలేకపోతే, అతను మాత్రం నిన్ను చూస్తున్నాడు.
ఈ నమ్మకం గట్టిగా కలిగి ఉండు. సోదర మహాశయులారా గమనిస్తున్నారా? ఇది ఇహ్సాన్. అంటే మనం ఏది చేసినా గాని అల్లాహ్‌ను మనం చూస్తున్నట్లుగా, మన కళ్ళ ముందు అల్లాహ్ ఉన్నాడు, మన యొక్క ఈ ఆరాధన, మన యొక్క ఈ పని మనం ఏదైతే చేస్తున్నామో చూస్తున్నాడు, అంత పెద్ద గొప్ప భావన కలగకుంటే, కనీసం అల్లాహ్ తన ఏడు ఆకాశాలపై అర్ష్ పై ముస్తవీ అయి మనల్ని చూస్తున్నాడు, దూరంలో ఉండి మనం అతనికి దాగి ఉన్నాము అలాంటి భావన కాదు. సూరత్ ఫుస్సిలత్‌లో మీరు చూస్తే ఎవరైతే అల్లాహ్ మమ్మల్ని రాత్రిపూట చూడడు, పగలు చూస్తాడు అన్నటువంటి తప్పుడు ఆలోచనల్లో లేదా ఒకప్పుడు చూస్తాడు, ఒకప్పుడు చూడడు అన్నటువంటి తప్పుడు ఆలోచనల్లో పడి ఉన్నారో వారిని ఎలా దండించాడో, అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ చూపు నుండి, అల్లాహ్ యొక్క జ్ఞానం నుండి మనం ఏమాత్రం ఎక్కడా కూడా దాగి ఉండలేకపోతాము.
ప్రతి విషయంలో ఇహ్సాన్
ఇక ఇహ్సాన్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చి ఉన్నదో, దాని యొక్క ప్రాక్టికల్‌గా మనం చేసే పనుల్లో భావం ఏమిటంటే మనం చేసే ఏ పని అయినా, ఏ ఆరాధన అయినా, ఏ మాట అయినా, ఏ ఆలోచన అయినా, అల్లాహ్ వద్ద మనం జవాబు చెప్పుకోవలసి ఉన్నది. ఈ పని, ఈ మాట మాట్లాడుతున్నప్పుడు, ఈ పని చేస్తున్నప్పుడు అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, ఈ భయంతో చేయాలి. అంటే ఏమిటి? పర్ఫెక్ట్గా చేయాలి. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది.
إِنَّ اللَّهَ كَتَبَ الإِحْسَانَ عَلَى كُلِّ شَىْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذِّبْحَةَ
అల్లాహ్ త’ఆలా ఇహ్సాన్ ప్రతీ విషయంలో రాసిపెట్టాడు. అంటే ఏమిటి? మీరు ఇహ్సాన్ అవలంబించాలి అని అల్లాహ్ మీపై విధించాడు. చివరికి, మీరు ఎప్పుడైతే ఒక జంతువును జిబహ్ చేస్తారో అప్పుడు కూడా ఇహ్సాన్ను పాటించండి. మరియు ప్రతీకారంలో ఇస్లామీయ ప్రభుత్వం ఎవరినైనా హతమారుస్తుంది, ఆ సందర్భంలో కూడా ఇహ్సాన్ను పాటించండి అని అల్లాహ్ యొక్క ఆదేశం ఉంది.
అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి ప్రవక్త వారి మాట “అలా కుల్లి షై”, ప్రతీ విషయంలో ఇహ్సాన్ పాటించాలి. ఆ విషయం మన రోజువారీ ఐదు పూటల నమాజ్‌కు సంబంధించినటువంటి ఆరాధనలకు సంబంధించినది గానీ, లేదా ఇంకా మన జీవితంలోని ఏ కోణంలో ఏ పని మనం చేసినా.
సోదర మహాశయులారా, మనం చేస్తున్న ఆ పని అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహ్ మనతో లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ వద్ద మనం దాని గురించి జవాబు చెప్పుకోవలసి ఉంది.
ఇహ్సాన్ యొక్క విస్తృత భావం
నేను ఇక్కడ ఒక ముఖ్యమైన ఆయత్, ఒక విషయం గుర్తు చేసి ఇహ్సాన్కు ఏ ఆధారాలు ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ తెలిపారో అవి మీకు వినిపిస్తాను. ఏంటి ఆ ఒక్క విషయం? అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో మనల్ని ఏదైతే పుట్టించాడో దానికి అసలైన ఉద్దేశం ఏంటి?
لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا
(లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా)
అల్లాహ్ మిమ్మల్ని ఇహలోకంలో పరీక్షిస్తున్నాడు, మీలో ఎవరు అహ్సన్ అమల్ చేస్తారు.
ఇక్కడ కూడా చూడండి అహ్సన్ అని వచ్చింది పదం. ఇహ్సాన్ నుండి వచ్చినదే ఇది కూడా. అంటే ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని ఇహలోకంలో పరీక్షిస్తున్నాడు, దేని విషయంలో? మీలో ఎవరు అహ్సన్ అమల్ చేస్తారు.
ఇక్కడ అహ్సన్ అంటే ఏంటి? ఇఖ్లాస్‌తో ఎందరో వ్యాఖ్యానకర్తలు రెండు పదాలు చెప్తారు ఇక్కడ ఇహ్సాన్ యొక్క భావంలో ఒకటి అఖ్లస్, మరొకటి అస్వబ్. అంటే ఇఖ్లాస్‌తో చిత్తశుద్ధితో లిల్లాహియత్ అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి, వ అస్వబ్ అంటే ప్రవక్త విధానంలోనే చేయాలి.
గమనిస్తున్నారా? అందుకొరకే సోదర మహాశయులారా, ఇహ్సాన్ యొక్క విషయం ఈరోజు కొంచెం వివరంగా తెలుసుకుంటున్నారు కదా? మీలో ఎవరైనా ఉర్దూ తెలిసిన వారు ఉంటే కన్ఫ్యూజ్ కాకండి. అయ్యో ఉర్దూలో మేము కూడా ఇహ్సాన్ అంటాము కదా! ఒకరిపై ఏదైనా ఉపకారం చేయడాన్ని ఉర్దూలో ఇహ్సాన్ అంటారు. కానీ అరబీలోని ఇహ్సాన్ ఆ భావం కూడా వస్తుంది, అంతకంటే ఇంకా విశాలమైన భావం ఇందులో ఉంది.
ఇప్పుడు అర్థమైందా మీకు ఇహ్సాన్ అంటే ఏమిటో? మీరు ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అందులో పర్ఫెక్షన్ ఉండాలి. ఆ పని పర్ఫెక్ట్గా చేయాలి. అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంది అన్నటువంటి భయంతో, ఆ పని చేస్తున్నప్పుడు అల్లాహ్ చూస్తున్నాడు అన్నటువంటి నమ్మకంతో మరియు అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు లిల్లాహ్, ఫిల్లాహ్ చిత్తశుద్ధితో చేయాలి మరియు ప్రవక్త యొక్క కరెక్ట్ సరైన విధానంలో చేయాలి. అప్పుడే అది మీరు ఇహ్సాన్తో చేసిన వారు అవుతారు, మిమ్మల్ని ముహ్సిన్ అని అనడం జరుగుతుంది. ఇ
ప్పుడు చూడండి ఖుర్ఆన్లో ఎక్కడెక్కడ ముహ్సిన్ లేదా ముహ్సినీన్ అన్న పదం వచ్చిందో అక్కడ అల్లాహ్ ఎవరిని ప్రశంసిస్తున్నాడో ఇప్పుడు ఇక మీకు ఇది తెలుస్తుంది. ఖుర్ఆన్ అరబీలో కనీసం మీరు చదువుతున్నా గాని అనువాదం లేకుండా ముహ్సిన్, ముహ్సినీన్, ఇహ్సాన్, అహ్సన అన్న పదాలు ఎక్కడ వస్తున్నాయో అక్కడ కొంచెం ఆగి అనువాదం చదివి శ్రద్ధ వహించండి.
దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలిసిందంటే, ప్రతీ ముహ్సిన్ ముఅమిన్ మరియు ముస్లిం అవుతాడు. కానీ ప్రతీ ముస్లిం ముఅమిన్ మరియు ముహ్సిన్ కాలేడు. అందుకొరకే ఇస్లాం కంటే ఎక్కువ గొప్ప స్థానం ఈమాన్. ఈమాన్ కంటే ఎక్కువ గొప్ప స్థానం ఇహ్సాన్. సమయం సరిపోదు లేదా అంటే ఈ మూడింటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఏది ఎంత ఉండాలి మనలో అన్నటువంటి వివరాలు ఇన్షా అల్లాహ్ వేరే సందర్భంలో.
ఖుర్ఆన్ నుండి ఇహ్సాన్ కు ఆధారాలు
ఇప్పుడు మనం ఇక్కడ ఒక దలీల్ తెలుసుకుందాము. సూరతున్నహల్ యొక్క ఆయత్ నంబర్ 128.
إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوْا وَالَّذِينَ هُمْ مُحْسِنُونَ
(ఇన్నల్లాహ మఅల్లదీనత్తఖవ్ వల్లదీన హుమ్ ముహ్సినూన్)
నిశ్చయంగా అల్లాహ్ త’ఆలా తఖ్వా పాటించే వారికి తోడుగా ఉన్నాడు మరియు ముహ్సినీన్కి తోడుగా ఉన్నాడు.
అల్లాహు అక్బర్. ఇక్కడ తోడు అంటే ఏంటి?
షేఖ్ సాలిహ్ అల్ షేఖ్ హఫిదహుల్లాహ్ చెబుతున్నారు. ఇక్కడ తోడు అంటే అల్లాహ్ యొక్క మఇయ్యత్ ఒకటి అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు. మీ ప్రతీ విషయాన్ని గమనిస్తున్నాడు. రెండవది, ఆ పుణ్య కార్యంలో మీకు అల్లాహ్ వైపు నుండి భాగ్యం, అల్లాహ్ వైపు నుండి సహాయం, మద్దతు లభిస్తుంది. ఈ రెండు భావాలు ఇందులో వస్తాయి.
ఆ తర్వాత ఇమామ్ రహిమహుల్లాహ్ సూరతుష్ షుఅరా లోని 217 నుండి 220 వరకు ఆయత్ ప్రస్తావించారు.
الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ * وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
(అల్లదీ యరాక హీన తఖూము, వ తఖల్లుబక ఫిస్సాజిదీన్)
మీరు ఎప్పుడైతే నమాజ్ కొరకు ఆరాధన కొరకు నిలబడతారో మరియు మీ యొక్క సహాబాలు మిత్రులు సజ్దాలో ఉన్నప్పుడు వారి మధ్యలో మీరు ఏదైతే తిరుగుతారో వాటన్నిటినీ కూడా అల్లాహ్ చూస్తున్నాడు.
షేఖ్ సాలిహ్ అల్ షేఖ్ చెబుతున్నారు, ఇహ్సాన్ ఒకే రుకున్, ఒకే మూల స్తంభం. కానీ అందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? అల్లాహ్ నీ ముందు ఉన్నాడు, నువ్వు అల్లాహ్‌ను చూస్తున్నావు. ఈ భావన రాలేకపోతే, రెండవది అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండడం. అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అన్న దానికి ఈ ఆయత్ దలీల్ ఉంటుంది, “అల్లదీ యరాక”, అల్లాహ్ నిన్ను చూస్తూ ఉన్నాడు.
అలాగే సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 61 లో కూడా:
وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِنْ قُرْآنٍ وَلا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلا كُنَّا عَلَيْكُمْ شُهُودًا
(వమా తకూను ఫీ షఅనిన్ వమా తత్లూ మిన్హు మిన్ ఖుర్ఆనిన్ వలా త’మలూన మిన్ అమలిన్ ఇల్లా కున్నా అలైకుమ్ షుహూదా)
నువ్వు ఏ స్థితిలో ఉన్నా, మరియు ఖుర్ఆన్లోని ఏ భాగం నీవు తిలావత్ చేస్తూ ఉన్నా, మరియు మీరు ఏ పని చేస్తూ ఉన్నా అప్పుడు మేము మీరు ఆ పని చేస్తున్నప్పుడు మీపై సాక్షులుగా ఉన్నాము. మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము.
అల్లాహు అక్బర్. షుహూద్ అన్నటువంటి పదం సాక్షులు అన్న భావమే కాకుండా, తోడుగా ఉండడం, ఆ సమయంలో, ఆ సిచువేషన్లో, ఆ పనిలో అక్కడ ఉండడం, హాజరవ్వడం అన్నటువంటి భావం కూడా వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా, ఏ స్థితిలో ఉన్నా, ఖుర్ఆన్ లాంటి గొప్ప అల్లాహ్ యొక్క పవిత్ర వచనాలు మనం తిలావత్ చేస్తూ ఉన్నా, అల్లాహ్ అంటున్నాడు, “ఇల్లా కున్నా అలైకుమ్ షుహూదా”. మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము. మేము మీకు ఆ సమయంలో తోడుగానే, మీ వెంటనే, మీ దగ్గరలోనే. అయితే ఇక్కడ అల్లాహ్ చూడడం, తెలుసుకోవడం, వినడం, సమఅ, బసర్, ఇల్మ్ దీని ప్రకారంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు. లేదా అంటే అల్లాహ్ త’ఆలా తన అస్తిత్వ ప్రకారంగా అర్ష్ పై ముస్తవీ అయి ఉన్నాడు.
అయితే ఈ ఆయతుల ద్వారా మనకు ఏం బోధపడింది? ఇంకా ఖుర్ఆన్లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి. అయితే మనం ఏ పని చేసినా అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో ఆ పని పర్ఫెక్ట్గా చేయాలి. ఆ పనిలో ఏ లోటు లేకుండా చేయాలి. అల్లాహ్ నాకు, మీకు, మనందరికీ కూడా ఈ సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40371
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
https://teluguislam.net/2023/04/19/u3mnj