76. తఫ్సీర్ సూరా అల్ ఇన్సాన్ ( అద్ దహ్ర్ ) [వీడియోలు]

సూరా పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 31 ఆయతులు ఉన్నాయి. విశ్వసించి మంచిపనులు చేసిన వారికి లభించే సుఖసంతోషాల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. అల్లాహ్ మనలను సృష్టించి, మనకు రుజుమార్గాన్ని చూపించాడు. అల్లాహ్ పట్ల కృతజ్ఞతగా వ్యవహరించడం లేదా కృతఘ్నత చూపడం అన్నది మన ఇష్టానికి వదిలేయడం జరిగింది. ఈ సూరాలో విశ్వసించి మంచిపనులు చేసేవారి గుణగణాలను వర్ణించడం జరిగింది. వారు తమ ఆధ్యాత్మిక, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తారు. తీర్పుదినానికి భయపడతారు. నిరుపేదలకు, అనాధలకు సహాయపడతారు. కాగా, సత్యతిరస్కారుల కోసం సంకెళ్ళు, గుదిబండలు, భగభగలాడే అగ్ని సిద్ధం చేయబడ్డాయి. పుణ్యాత్ములకు అల్లాహ్ అనుగ్రహాలు అపరిమితమైనవి. వారికి స్వర్గంలోని సెలయేటి నీరు కలిసిన మద్యం పాత్రలు అందుబాటులో ఉంటాయి. వారు చక్కని పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారు బంగారు జలతారు వస్త్రాలు ధరిస్తారు. వారికి సౌకర్యవంతమైన ఆసనాలు ఉంటాయి. అక్కడ తీవ్రమైన వేడిగాని, తీవ్రమైన చలి గాని ఉండవు. అక్కడ వారికి వివిధ రకాల ఫలాలు లభిస్తాయి. అవి వారికి అందుబాటులో క్రిందికి వేలాడుతూ ఉంటాయి. వెండిపాత్రలు వారి ముందు ఉంటాయి. వారక్కడ సొంటి కలిసిన మధు పాత్రలు అందుకుంటారు (ఆ మద్యం ఎలాంటి మత్తు కలిగించదు- ఖుర్ఆన్:47:15). వారి సేవ కోసం నిత్యబాలలు అటూఇటూ పరుగిడుతూ ఉంటారు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూరా అల్ ఇన్సాన్ / అద్ దహ్ర్):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV39ZiSrI7WEQ6sDTB53WPku

76:1 هَلْ أَتَىٰ عَلَى الْإِنسَانِ حِينٌ مِّنَ الدَّهْرِ لَمْ يَكُن شَيْئًا مَّذْكُورًا
సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? [2]

76:2 إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا
నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో[3] పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.[4]

76:3 إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేదా కృతఘ్నుడుగా తయారైనా[5] (వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్చను హరించలేదు.)

76:4 إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.[6]

76:5 إِنَّ الْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا
నిశ్చయంగా సజ్జనులు (విశ్వాసులు) ‘కాఫూర్’ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు.[7]

76:6 عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ اللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا
అదొక సరోవరం.[8] దైవదాసులు దాన్నుండి (తనివి తీరా) త్రాగుతారు. (తాము కోరిన చోటికి) దాని పాయలు తీసుకుపోతారు.[9]

76:7 يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا
వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు.[10] ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు.[11]

76:8 وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَىٰ حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا
అల్లాహ్ ప్రీతికోసం[12] నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు.

76:9 إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ اللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَاءً وَلَا شُكُورًا
(పైగా వారిలా అంటారు) : “మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని గానీ, ధన్యవాదాలను గానీ ఆశించటం లేదు.”

76:10 إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا
“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”[13]

76:11 فَوَقَاهُمُ اللَّهُ شَرَّ ذَٰلِكَ الْيَوْمِ وَلَقَّاهُمْ نَضْرَةً وَسُرُورًا
అందువల్ల అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షించి,[14]” వారికి ఉల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ వొసగాడు.[15]

76:12 وَجَزَاهُم بِمَا صَبَرُوا جَنَّةً وَحَرِيرًا
వారి సహనానికి బదులుగా[16] వారికి స్వర్గాన్నీ , పట్టువస్త్రాలను ప్రసాదించాడు.

76:13 مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۖ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు.[17]

76:14 وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَالُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا
స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి.[18] వాటి పండ్ల గుత్తులు క్రిందికి వ్రేలాడుతూ (అందుబాటులో) ఉంటాయి.[19]

76:15 وَيُطَافُ عَلَيْهِم بِآنِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا
వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి.[20]

76:16 قَوَارِيرَ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا
ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి.[21] వాటిని (నింపేవారు) ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు.[22]

76:17 وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا
వారికక్కడ సొంటి[23] కలిపిన మధు పాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి –

76:18 عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا
స్వర్గంలోని ఒక సెలయేరు నుండి. దాని పేరు సల్ సబీల్.[24]

76:19 وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا
వారి చుట్టూ (నవ నవలాడే) పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు.[25] వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాలా! అని భావిస్తావు.[26]

76:20 وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا
నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప[27] అనుగ్రహాలు, మహా సామ్రాజ్య వైభవమే కానవస్తాయి.

76:21 عَالِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ ۖ وَحُلُّوا أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَاهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا
వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు,[28] దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా, వారికి వెండి కంకణాలు – ఆభరణంగా – తొడిగింపబడతాయి.[29] వారి ప్రభువు వారికి స్వచ్చమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు.

76:22 إِنَّ هَٰذَا كَانَ لَكُمْ جَزَاءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا
ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది (గుర్తించబడింది అని వారితో అనబడుతుంది).”

76:23 إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ الْقُرْآنَ تَنزِيلًا
నిశ్చయంగా మేము నీపై ఖుర్ఆన్ ను అంచెల వారీగా అవతరింపజేశాము.[30]

76:24 فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ آثِمًا أَوْ كَفُورًا
కాబట్టి (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు నీ ప్రభువు ఆదేశం పై స్థిరంగా ఉండు.[31] వారిలోని ఏ పాపాత్ముని , మరే కృతఘ్నుని మాట వినకు.[32]

76:25 وَاذْكُرِ اسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا
నీ ప్రభువు నామాన్ని ఉదయం, సాయంత్రం స్మరిస్తూ ఉండు.[33]

76:26 وَمِنَ اللَّيْلِ فَاسْجُدْ لَهُ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا
రాత్రి వేళ ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు.[34]

76:27 إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
వీళ్ళు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.[35] తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదలి వేస్తున్నారు.[36]

76:28 نَّحْنُ خَلَقْنَاهُمْ وَشَدَدْنَا أَسْرَهُمْ ۖ وَإِذَا شِئْنَا بَدَّلْنَا أَمْثَالَهُمْ تَبْدِيلًا
(మరి చూడబోతే) వీరిని పుట్టించింది , వీళ్ళ కీళ్ళను దృఢపరచినది మేమే.[37] మరి మేము తలచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము.[38]

76:29 إِنَّ هَٰذِهِ تَذْكِرَةٌ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا
నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరినవారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు.[39]

76:30 وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
అల్లాహ్ కోరనిదే మీరు కోరలేరు.[40] నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.[41]

76:31 يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.

1. ఈ సూరా మక్కాలో అవతరించిందా? లేక మదీనాలోనా? అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అత్యధికమంది విద్వాంసులు మాత్రం దీన్ని మదీనా సూరా గానే ఖరారు చేశారు. ఈ సూరాలోని చివరి 10 వచనాలు మాత్రం మక్కాలోనివనీ, మిగతా ఆయతులన్నీ మదీనాలో అవతరించాయని మరి కొంతమంది భావిస్తున్నారు. (ఫత్ హుల్ ఖదీర్). మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు శుక్రవారం నాడు ఫజ్ర్ నమాజులో సజ్దా సూరాతో పాటు దహ్ర్ (ఇన్సాన్) సూరా కూడా పఠించేవారు (సహీహ్ ముస్లిం జుమా ప్రకరణం). ఈ సూరాను సూరయె ఇన్సాన్ గా కూడా వ్యవహరిస్తారు.

2. కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ ఆయతులో ‘ఇన్సాన్‘ అనే పదం ఆదిమానవుడు హజ్రత్ ఆదం నేపథ్యంలో ఉంది. ‘హీన్‘ అంటే ఒకప్పుడు, ఒక సమయం అని అర్థం. అంటే ప్రాణం పోయకముందు ఉన్న (గడచిన) సమయం ఏండ్లు. చాలామంది ఖుర్ఆన్ వ్యాఖ్యాతల ప్రకారమైతే ‘ఇన్సాన్’ అనే పదం మనుజ జాతి అన్న భావంలోనే ప్రయోగించబడింది. మానవుడు తల్లి గర్భంలో ఉన్న కాలం ‘హీన్’ అనబడుతుందని వారు వ్యాఖ్యానించారు. గర్భస్థ శిశువుగా ఉన్న సమయంలో మనిషి పెద్దగా చెప్పుకోదగ్గవాడు కాడు. అత్యంత అల్పమైన వీర్య బిందువుతో అతని నిర్మాణ దశ మొదలవుతుంది. కాని వాడు తీరా అత్యంత అందమైన శరీరాకారంతో తల్లి కడుపును చించుకుని బయటకు రాగానే గడసరి మనిషిగా మారిపోతాడు. పెడసరి మాటలు పలుకుతాడు. బీరాలు పోతాడు. నిజానికి వాడు తన పూర్వ స్థితిని మరువరాదు. ఒకప్పుడు తనకంటూ ఒక ఉనికి లేదని, తనెవరో ఎవరికీ తెలియదని అతను గుర్తించాలి. ఈ విధంగా అహంభావులైన మనుషులందరినీ ఈ ఆయతు హెచ్చరిస్తుంది.

3. ‘మిశ్రమ వీర్య బిందువు’ అంటే స్త్రీ పురుషులిద్దరూ రతిక్రీడ జరిపినప్పుడు వెలువడే ద్రవపదార్థం అన్నమాట. ఆ తరువాత స్త్రీ గర్భాశయంలో అది వివిధ దశల్లో అభివృద్ధి చెందుతుంది. ఇంతకీ ఈ మానవ పుట్టుకలోని పరమార్థం అతన్ని పరీక్షించటమే. ఎవరు ఉత్తమంగా ఆచరిస్తారో పరీక్షించేందుకే (అల్ ముల్క్ – 2) అల్లాహ్ మనిషిని సృజించాడు.

4. అంటే అతనికి కనే, వినే శక్తులను కానుకగా ప్రసాదించాము. ఎందుకంటే అతను అన్నింటినీ చూడాలి. అందరూ చెప్పేది వినాలి. ఆ తరువాత మంచీ చెడులలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి.

5. మేము మనిషికి ఈ శక్తియుక్తులను ప్రసాదించి ఇట్టే వదలిపెట్టలేదు. ఆధ్యాత్మికంగా అతని మార్గదర్శకత్వం కోసం గొప్ప ఏర్పాటు కూడా చేశాము. మేము మా ప్రవక్తల ద్వారా, మా గ్రంథాల ద్వారా, మా సందేశహరుల ద్వారా సన్మార్గమేదో చక్కగా వివరించాము. ఇప్పుడతను దైవవిధేయతా మార్గాన్ని అవలంబించి ధన్యజీవిగా నెగ్గుకువస్తాడో లేక దుర్మార్గాన్ని అనుసరించి మా మేలును మరచిపోతాడో అతని ఇష్టం. ఈ విషయాన్నే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా ప్రవచించారు : “ప్రతి వ్యక్తీ తన అంతరాత్మను క్రయవిక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని చంపినా చంపేస్తాడు లేదా దానికి స్వేచ్ఛనయినా ప్రసాదిస్తాడు” (సహీహ్ ముస్లిం – శుచీశుభ్రతల ప్రకరణం). అంటే అతడు తన కర్మల ద్వారా దాని గొంతు నులిమి వేయటమో లేక దాని గౌరవాన్ని కాపాడటమో చేస్తాడు. అతను దురాగతాలకు పాల్పడితే అంతరాత్మను చంపేసినట్లే. ఒకవేళ అతను సత్కార్యాలు చేస్తే అంతరాత్మకు ముక్తిని ప్రసాదించిన వాడవుతాడు.

6. అల్లాహ్ ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను దుర్వినియోగపరచినందుకు కలిగిన పర్యవసానమిది.

7.’కాసున్’ అంటే నిండుగా ఉన్న గ్లాసు. ‘కాపూర్’ అనేది చల్లని, సువాసనతో కూడిన పదార్థం. దానిని మధువులో కలపటం వలన దాని రుచి, మాధుర్యం ఇంకా పెరుగుతుంది. మధువు సేవించే చోట సువాసన గుభాళిస్తూ ఉంటుంది.

8. కాఫూర్ ద్రవ్యం కలిసిన ఆ మద్యం కాస్తో కూస్తో ఉండదు. అదొక పెద్ద సరోవరం. అది ఎన్నటికీ తరగదు.

9. వారు ఆ సరోవరం నుంచి తాము విడిదిచేసిన చోటికి పిల్ల కాలువలు తీసుకుపోతారు.

10. అంటే వారు నిజ దైవాన్ని పూజిస్తారు. ఆయనకే విధేయత చూపుతారు. మొక్కుకున్నా ఆ ఒక్కదైవం పేరునే మొక్కుకుంటారు. ఆయన పేరుమీదే మొక్కుబడులు చెల్లిస్తారు. దీన్నిబట్టి అర్ధమయ్యేదేమిటంటే మొక్కుబడులను చెల్లించటం అవసరం. అయితే ఆ మొక్కుబడులలో షిర్క్ ఉండకూడదు. హదీసులో ఈ విధంగా ఉంది : “ఎవరయితే అల్లాహ్ కు విధేయత చూపుతానని మొక్కుకున్నాడో అతను ఆ మొక్కును నెరవేర్చాలి. మరెవరయితే అల్లాహ్ కు అవిధేయత కనబరుస్తానని మొక్కుకున్నాడో అతను దాన్ని నెరవేర్చకూడదు” (సహీహ్ బుఖారీ – కితాబుల్ ఈమాన్).

11. అంటే ఆ రోజు భీకరస్థితిని తలచుకుంటూ పాపకార్యాలకు, అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉంటారు. ఆ రోజు అల్లాహ్ తన మన్నింపు, కారుణ్య ఛాయలోకి తీసుకున్న వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. మిగిలిన వారిని ఆ రోజు ఆపద నలువైపుల నుంచీ చుట్టుముట్టుతుంది.

12. వారు తమ సుఖసంతోషాలను సయితం పక్కనబెట్టి అల్లాహ్ మెప్పుకోసం అగత్యపరులకు అన్నం పెట్టేవారు. కారాగారవాసులు తమ మతస్థులు కాకపోయినా వారిపట్ల సద్వ్య వహారం చేయాలని ఈ ఆయతులో తాకీదు చేయబడింది. ఉదాహరణకు : బద్ర్ యుద్ధానంతరం యుద్ధ ఖైదీల పట్ల మర్యాదగా మసలుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు ఉపదేశించారు. అందువల్ల ప్రియసహచరులు తాము తినకుండానే ఆ యుద్ధ ఖైదీలకు పెట్టేవారు. వాళ్లు మాత్రం తరువాత తినేవారు (ఇబ్నె కసీర్). అలాగే బానిసలు, ఇంటి సేవకులు కూడా ఈ కోవలోకే వస్తారు. వారిపట్ల అలాగే మసలు కోవాలి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి బోధనల్లో ఒకటి “నమాజులను, బానిసలను కనిపెట్టుకుని ఉండండి” అన్నది. (ఇబ్ను మాజ – వీలునామాల ప్రకరణం).

13. ‘ఖమ్ తరీరా‘ అంటే చాలా సుదీర్ఘమైనది అని హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) అభిప్రాయపడ్డారు. ‘అబూస్‘ అంటే కఠినమైనది అని అర్థం. ఆ రోజు అత్యంత కఠినమైనది, దుర్భరమైనదవటంచేత అవిశ్వాసులకు అది చాలా సుదీర్ఘం అనిపిస్తుంది (ఇబ్నె కసీర్).

14. ఎందుకంటే ఆనాటి కీడుకు వారు భయపడేవారు. దాన్నుండి తమను కాపాడమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండేవారు.

15. వారి మొహాలపై ఉల్లాసం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారి మనసులు సంతోషంతో పులకిస్తాయి. మనిషి మనసులో తృప్తి, ఆనందం ఉన్నప్పుడు అతని మొహంపై కూడా ఆహ్లాదం కానవస్తుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా సంతోషం కలిగినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందం పూర్ణచంద్రుని వలె వెలిగి పోతుండేదని హదీసు ద్వారా తెలుస్తోంది (బుఖారీ – కితాబుల్ మగాజీ; ముస్లిం – కితాబుత్తౌబా).

16. సహనం (సబ్ర్) అంటే దైవమార్గంలో ఎదురైన కష్టనష్టాలను మనస్ఫూర్తిగా సహించటం, దైవవిధేయతా యత్నంలో మనోవాంఛలను అదుపులో పెట్టుకోవటం, పాపాలకు దూరంగా ఉండటం అని అర్ధం.

17. స్వర్గంలోని వాతావరణం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. అక్కడ తీవ్రమైన వేసవి గాని, ఎముకలు కొరికే చలిగానీ ఉండదు. పైగా అక్కడి వాతావరణం మధ్యస్థంగానూ – వసంతకాలం మాదిరిగానూ ఉంటుంది. ‘జమ్ హరీర్‘ అంటే విపరీతమైన చలి.

18. అక్కడ గ్రీష్మతాపం ఉండనప్పటికీ స్వర్గవనాల నీడలు స్వర్గవాసులపై పడుతూ ఉంటాయి. లేదా చెట్ల శాఖలు వారికి దగ్గరగా వంగి ఉంటాయి.

19. పండ్ల గుత్తులు ఎంతో వినయంగా వారి ముందు వాలి ఉంటాయి. స్వర్గవాసులు ఎప్పుడు ఏ పండు తినాలనుకున్నా అది వారికి అందుబాటులోకి వచ్చేస్తుంది. వారు కూర్చుని, పరుండి కూడా వాటిని తుంచుకోవచ్చు (ఇబ్నె కసీర్).

20. అంటే – సేవకులు వాటిని పట్టుకుని స్వర్గవాసుల మధ్య తిరుగుతూ ఉంటారు.

21. అంటే ఆ పాత్రలు, కప్పులు వెండితోనూ, గాజుతోనూ చేయబడినవి. అవి ఎంతో నాజూగ్గా, తెల్లగా ఉంటాయి. ప్రపంచంలోని ఏ పరిశ్రమలో కూడా అటువంటి నాణ్యమైన పాత్రలు తయారవవు.

22. ఆ గిన్నెలలో నింపబడిన మధువు స్వర్గవాసులకు సరిగ్గా సరిపోతుంది. తగ్గటంగానీ, మిగిలిపోవటంగానీ ఉండదు. సేవకులు ఎంతో మర్యాద పూర్వకంగా వారికి ఈ ద్రాక్షరసాన్ని సమర్పిస్తూ ఉంటారు.

23. ‘జన్ జబీల్’ అంటే శొంఠి లేక ఎండు అల్లం. ఇది వేడి వస్తువు. దీనిని కలుపటం వల్ల మనసుకు, మస్తిష్కానికి ఒకలాంటి వెచ్చదనం, హాయి లభిస్తుంది. శొంఠి అరబ్బులకు ఎంతో ప్రియమైనది. వారు కాఫీ మాదిరిగా త్రాగే ‘గహ్వా’ లో కూడా శొంఠి కలుపబడుతుంది. మొత్తానికి తేలిందేమిటంటే స్వర్గంలో రెండు రకాల మద్యాలుంటాయి. ఒకటి : చల్లని మద్యం. అందులో కర్పూర జలం కలుపబడుతుంది. రెండవది : వేడినిచ్చే మద్యం. అందులో సొంటి కలుపబడుతుంది.

24. అంటే – ఈ రకమైన వేడిమద్యాన్ని త్రాపే సెలయేరు ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. అది ‘సల్ సబీల్’గా వ్యవహరించబడుతుంది.

25. మధువు గుణం గురించి తెలుపబడిన తరువాత, ఆ మధువును అందించే సేవకుల గుణగణాలు కూడా వివరించబడ్డాయి. వారు నిత్యం స్వర్గవాసుల సేవలో ఉంటారు. ‘నిత్యం’ అన్న మాటలో రెండు అర్థాలు స్ఫురిస్తున్నాయి. 1. వారికి అసలు మృత్యువు అనేది ఉండదు. 2. వారు సదా టీనేజీ కుర్రాళ్లుగానే ఉంటారు. వారు ముసలి వారవరు. వారి అందం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది.

26. పరిశుభ్రత రీత్యా, అందచందాల రీత్యా, ఆకర్షణ రీత్యా వారు కడిగిన ముత్యాల్లా ఉంటారు. ‘చెదిరిన’ అంటే వారు ఒకే చోట నిలబడకుండా స్వర్గవాసుల సేవలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

27. అంటే – స్వర్గంలో ఏ వైపు దృష్టిని సారించినా…

28. ‘సుందుస్‘ అంటే పలుచటి పట్టువస్త్రాలు. ‘ఇస్తబ్రఖ్‘ అంటే దళసరి పట్టు వస్త్రాలు.

29. ఒకప్పుడు రాజులు, కులపెద్దలు, ప్రముఖులు ఇలాంటి కంకణాలను ధరించేవారు.

30. అంటే – దివ్య ఖుర్ఆన్ను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా, అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా – వివిధ సందర్భాలలో – అవతరింపజేశాము. ఈ వాక్యానికి మరో అర్థం ఇది కూడా కావచ్చు : “ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము. (ఓ ప్రవక్తా!) ఈ ముష్రిక్కులు నిందిస్తున్నట్లు ఇది నీ స్వీయరచన కాదు.”

31. అంటే నీ ప్రభువు నిర్ణయం కొరకు ఎదురుచూస్తూ ఉండు. నీకు తోడ్పాటునందించటంలో అల్లాహ్ ఆలస్యం చేసినంత మాత్రాన నువ్వు కలవరం చెందనవసరం లేదు. ఇందులో కూడా ఏదైనా పరమార్థం ఉండవచ్చు. అందుకే నీవు ఓపికపట్టాలి.

32. వాళ్లు ఎప్పుడయినా నిన్ను దైవాదేశాల నుండి ఆపే ప్రయత్నం చేస్తే నువ్వు వాళ్ల మాట వినకు. సందేశ ప్రచార కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉండు. అల్లాహ్ పై భారం మోపి ముందుకు సాగిపో. జనుల కీడు నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. దైవధిక్కారులైనా, మనసుల్లో తిరస్కారం పెనవేసుకుపోయిన వారైనా, శత్రుత్వంలో హద్దులు మీరిపోయే వారైనా – వారెవరూ నిన్ను ఏమీ చేయలేరు. మూలంలో ‘కఫూరా‘ అని ఉంది. మనసులో తిరస్కార వైఖరిని అవలంబించేవారిని, తిరస్కారంలో మితిమీరిపోయేవారిని ‘కఫూర్‘ అంటారు. కాగా చేతల్లో దైవ అవిధేయ తకు పాల్పడుతుండేవాడిని ‘ఫాజిర్‘ అంటారు.

కొంతమంది ఖుర్ఆన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ వాక్యం వలీద్ బిన్ ముగీరాను దృష్టిలో పెట్టుకుని అవతరించింది. ఎందుకంటే ఈ దైవవిరోధి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు పంపిన ఒక ప్రతిపాదనలో ”నువ్వు ఈ పనిని మానుకుంటే, నువ్వు కోరినంత ధనాన్ని నీ పాదాక్రాంతం చేస్తాం. అరేబియాలోని ఏ సుందరాంగిని నువ్వు వివాహ మాడదలచినా ఆమెను నీకిచ్చి వివాహం జరిపిస్తాం” అన్నాడు (ఫత్ హుల్ ఖదీర్).

33. ‘ఉదయం, సాయంత్రం’ అంటే ఎల్లవేళలా అని దీని భావం. లేక ఉదయం అంటే ఫజ్ర్ నమాజ్ అనీ, సాయంత్రం అంటే అస్ర్ నమాజులో అనీ అర్ధం కావచ్చు.

34. రాత్రివేళ సజ్దా చేయటమంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం మగ్రిబ్, ఇషా నమాజులన్నమాట. పవిత్రతను కొనియాడటమంటే ఏ ఏ విషయాలతో అల్లాహ్ కు ఎలాంటి సంబంధం లేదో వాటినుండి అల్లాహ్ పరిశుద్ధుడు అనే భావాన్ని స్ఫురింపజేసే పదాలతో, వాక్యాలతో అల్లాహ్ ను స్తుతించటం. రాత్రిపూట నఫిల్ నమాజు – తహజ్జుద్ నమాజ్ లో ఎక్కువసేపు గడపటమని దీని భావం అని మరికొంతమంది వ్యాఖ్యానించారు.

35. ఈ మక్కా అవిశ్వాసులుగానీ, వీరిలాంటి ఇతర జనులుగానీ ప్రాపంచిక వ్యామోహంలో పడి ఉన్నారు. వీరి సకల సన్నాహాలు, సమస్త పథకాలు ఈ ఐహిక జీవితం కొరకే పరిమితం అయినాయి.

36. అంటే ప్రళయదినాన్ని వీళ్లు విస్మరిస్తున్నారు. ఆ దినాన తిరస్కారులకు ఎదురయ్యే ఎన్నో గడ్డు సమస్యల మూలంగా దానిని బరువైన దినంగా పేర్కొనటం జరిగింది. కాని ఈ మొండి ఘటాలు ఆ దినం కోసం ఏ మాత్రం చింతించటం లేదు.

37. అంటే, వారి పుట్టుకను మేము ఎంతో పటిష్టపరచాము. లేదా నరాల ద్వారా, నాడుల ద్వారా వారి ఎముకలకు శక్తిని ఇచ్చాము.

38. అంటే వీరిని తుదముట్టించి, వీరి స్థానంలో మరొక జాతిని ఉనికిలోనికి తీసుకురాగలము. లేక ప్రళయదినాన వీరిని మళ్లీ బ్రతికిస్తాము అన్న అర్థం కూడా కావచ్చు.

39. అంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథం ద్వారా వారు ఉపదేశం గ్రహించవచ్చు.

40. అంటే – మీలో ఎవరూ ఎవరికీ సన్మార్గం ప్రసాదించే శక్తినిగానీ, మీ స్వయానికి ఏదైనా లాభాన్ని చేకూర్చుకోగల అధికారంగానీ కలిగిలేరు. అయితే అల్లాహ్ గనక తలిస్తే ఇలా జరగటం సాధ్యమే. ఆయన ఇచ్ఛతో నిమిత్తం లేకుండా మీరేమీ చేయలేరు. కాని సంకల్పశుద్ధిని బట్టి ఆయన ప్రతి ఒక్కరికీ పుణ్యఫలాన్ని మాత్రం ప్రసాదిస్తాడు. “ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రతి మనిషికీ అతను సంకల్పిం చుకున్నదే లభిస్తుంది.”

41. ఆయన మహాజ్ఞాని. గొప్ప వివేకవంతుడు. అందువల్ల ఆయన తరఫున జరిగే ప్రతి పనిలో యుక్తి, వివేకం నిండి ఉంటుంది. సన్మార్గం, అపమార్గాల నిర్ణయాలు కూడా అల్లాటప్పాగా జరగవు. సన్మార్గ భాగ్యానికి యోగ్యుడైన వ్యక్తికే సన్మార్గం ప్రసాదించబడుతుంది. మరెవరి వాటాలోనికయినా మార్గవిహీనత వచ్చిందంటే, వాస్తవానికి అతను దానికే తగినవాడని భావించాలి.

ఖురాన్ (మెయిన్ పేజీ ) :
https://teluguislam.net/quran/

యూట్యూబ్ ప్లే లిస్ట్ – 29వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ తబారక్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3F699qIIVBzBASsKq5XLR2