ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “సన్మార్గం వైపునకు ఆహ్వానించే వానికి అతని ద్వారా సన్మార్గం పొందిన వారికి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది. (అయితే) వారి ప్రతిఫలంలో మటుకు ఎటువంటి కొరతా రాదు. (ఇకపోతే) మార్గవిహీనత వైపునకు పిలిచే వ్యక్తికి, అతని ద్వారా మార్గభ్రష్టులైన వారికి లభించినంత దుష్ఫలం లభిస్తుంది. కాగా, ఆ మార్గభ్రష్టుల దుష్కర్మలు తగ్గటమూ జరగదు.” (ముస్లిం)
ఈ పవిత్ర హదీసు ద్వారా రూఢీ అయ్యేదేమిటంటే సౌశీల్యం దైవ మార్గదర్శకత్వాల ప్రాతిపదికలపై అల్లాహ్ వైపునకు, సత్కార్యాల వైపునకు సందేశం ఇచ్చేవాడు ఎంతో ఆదరణీయుడు. అతనికి లభించే ప్రతిఫలం అపారం. దాన్ని అతను ఊహించనైనా లేడు. అల్లాహ్ శుభవార్త ఇచ్చాడు :
41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ ‘నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను’ అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?(హామీమ్ సజ్దా 41 : 33)
అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వాని మాటకు అంతటి ఉన్నత స్థానం ఎందుకివ్వబడిందంటే అతని మాట ద్వారా ఎంతోమంది దైవ మార్గదర్శకత్వం పొందుతారు. వారందరికీ ఆ మహాభాగ్యం లభించటానికి కారకుడైనందుకు గాను వారు సంపాదించినంత పుణ్యం ఇతనికి కూడా ప్రాప్తిస్తుంది. సత్య సందేశానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో ఈ ఒక్క హదీసు ద్వారా అంచనా వేయవచ్చు.
పోతే; మార్గ విహీనత, మార్గభ్రష్టతల వైపునకు ప్రజలను పిలవటం మహా పాతకం. అదెంత ఘోరమయిన అపరాధం అంటే అతని ద్వారా ఎంతమంది మార్గభ్రష్టులయ్యారో, అంతమందీ ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాల భారం అతని పై కూడా పడుతుంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు : “ఏ ప్రాణీ అన్యాయంగా వధించబడినా దాని రక్తపు భారం ఆదం యొక్క మొదటి కుమారునిపై పడుతుంది. ఎందుకంటే మొదటి హత్య చేసిన వాడు అతనే.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి)
ఆదం కుమారుడైన ఖాబైల్, మరో కుమారుడైన హాబైల్ని హతమార్చాడు. లోకంలో అది మొట్టమొదటి హత్య. ప్రళయదినం వరకు ఎన్ని హత్యలు జరిగినా వాటి పాపం ఖాబైల్ ఖాతాలోకి వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే అతనే హత్యల ద్వారం తెరిచాడు. ఈ విధంగానే చెడుల వైపునకు ప్రజలను పురికొల్పేవాడు కూడా ప్రళయం వరకు అతని అనుయాయులు చేసిన పాపభారాన్ని మోస్తూ ఉంటాడు. మరోవైపు ఆ చెడులు చేసే వారి దుష్పలం కూడా ఏమాత్రం తగ్గదు.
“ఎవరయితే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారో…”
“ఎవరయితే మార్గ విహీనత వైపునకు పిలుస్తారో….”
అన్ని రకాల పిలుపు లేక ఆహ్వానం ఇందులో ఇమిడిఉంది. అది మూజువాణీగా కావచ్చు, సైగ ద్వారా కావచ్చు, ఆచరణ ద్వారా కావచ్చు, వ్రాతపూర్వకంగా కూడా కావచ్చు. ఇక్కడ సన్మార్గం అంటే దైవాదేశాలు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పవిత్ర పలుకులకు సంబంధించిన విషయం. అల్లాహ్ సెలవిచ్చాడు :
2:38 قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము వారితో అన్నాము: “మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా, దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (అల్ బఖర 2 : 38)
ఇక్కడ ‘నా తరఫు ఉపదేశం’ అంటే ఆకాశ గ్రంథాలు ప్రవక్తల ప్రబోధనలని భావం. అల్లాహ్ తరఫున అవతరించిన ఆదేశాలను పాటించటం, దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా సన్మార్గానుసరణగానే భావించబడుతుంది.
దివ్య ఖుర్ఆన్లో మరోచోట ఇలా సెలవీయబడింది :
7:3 اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ప్రజలారా!) మీ ప్రభువు తరఫున మీకు వొసగబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్‌ను వదలి ఇతర సంరక్షకులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తారు.(అల్ ఆరాఫ్ : 3)
మరోచోట చెప్పబడింది :
36:20 وَجَاءَ مِنْ أَقْصَى الْمَدِينَةِ رَجُلٌ يَسْعَىٰ قَالَ يَا قَوْمِ اتَّبِعُوا الْمُرْسَلِينَ
36:21 اتَّبِعُوا مَن لَّا يَسْأَلُكُمْ أَجْرًا وَهُم مُّهْتَدُونَ
(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి.”(యాసీన్ : 20, 21)
ఏ గ్రంథమైతే దైవోపదేశాలకు, దైవప్రవక్త సంప్రదాయానికి అనుగుణంగా లేదో అది మార్గ విహీనత వైపునకు గొనిపోయే గ్రంథంగానే పరిగణించబడుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు “మా ఈ (ధర్మ) వ్యవహారంలో ఎవరయినా లేనిపోని విషయాన్ని కల్పిస్తే అది రద్దు చేయబడుతుంది“ (బుఖారి, ముస్లిం). మరో సందర్భంలో ఇలా పలికారు : “మా పద్ధతిలో లేనిదాన్ని ఎవరయినా చేస్తే అది స్వీకారయోగ్యం కానేరదు.” (ముస్లిం)
“వారి పుణ్యఫలంలో ఏ కొరతా రాదు” అంటే సజ్జనుల లెక్కలోని సత్కర్మలను తీసి, వారిని సన్మార్గంలోకి తెచ్చిన వ్యక్తికి ఇవ్వటం జరగదు అని భావం. అల్లాహ్ కారుణ్యం అనంతమైనది. అది ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. విరివిగా లభిస్తుంది. ఈ వాక్యంలో అటు సద్వర్తనులకు, ఇటు సన్మార్గం వైపునకు ఆహ్వానించే వారికి ఇద్దరికీ శుభవర్తమానం ఉంది.
“వారి పాపాల భారంలో ఎటువంటి తగ్గింపూ జరగదు” : చెడులకు నాంది పలికి, అవి వెర్రితలలు వేయటానికి కారకుడైనందున ఆ చెడులను అనుసరించే వారందరికీ లభించేంత పాప భారం ఈ చెడుల పితామహుడికి కూడా లభిస్తుంది. ఈ వాక్యంలో దుర్వర్తనులకు, దుర్వర్తనం వైపునకు పిలిచిన వారికి కూడా గట్టి హెచ్చరిక ఉంది.
ప్రజలకు మార్గ దర్శకత్వం వహించటంలో ఉన్నత సంప్రదాయాలను నెలకొల్పటం, సత్ క్రియలకు పురికొల్పటం కూడా చేరి ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లా గారి హదీసు ద్వారా ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆయన ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి కొంతమంది పల్లెవాసులు వచ్చారు. వారు ఆపదలో ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దురవస్థను, అక్కరలను పసిగట్టి దానధర్మాల ద్వారా వారిని ఆదుకోవలసిందిగా ప్రజలకు పురికొల్పారు. అయితే ప్రజలు దానధర్మాలు చేయటంలో నిర్లిప్తత వహించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై విచార ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. అంతలో ఒక అన్సారి వెండి నాణాల సంచి తెచ్చారు. మరొకరు కూడా అదే పని చేశారు. ఆపై ఒకరి తరువాత ఒకరు తెచ్చి దానం చేయసాగారు. ప్రవక్త గారి మోము ఆనందంతో విచ్చుకునేవరకూ వారు తెస్తూనే ఉన్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “ఎవరయినా ఇస్లాంలో ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పితే తదనంతరం కూడా అది కొనసాగితే, దాన్ని పాటించే వారందరికీ లభించినంత పుణ్యఫలం, దాన్ని నెలకొల్పిన ఒక్క వ్యక్తికీ లభిస్తుంది. (అలా అని) అటు, దాన్ని అనుసరించే వారి ప్రతిఫలంలో కోత విధించటం జరగదు. (అదేవిధంగా) ఇస్లాంలో ఎవరయినా దుస్సంప్రదాయాన్ని ప్రవేశపెడితే, తరువాత వారు దాన్ని పాటిస్తే, ఆ పాటించే వారందరిపై పడే పాపభారం దాని మూల స్థాపకుడి పై కూడా పడుతుంది. అటు ఆ దుర్మార్గగాముల పాపంలో తగ్గింపు కూడా ఉండదు.” (ముస్లిం)
ఉన్నత సంప్రదాయాలను, ఉత్తమ అలవాట్లను నెలకొల్పటమంటే భావం ముస్లిములు షరీఅత్ ఆదేశాలను పాటించడంలో మార్గం సుగమం అయ్యే పనులు చేయడమని. అదేవిధంగా ఖుర్ఆన్, హదీసులను ఆయా ప్రజల మాతృ భాషలోకి అనువదించి, ధర్మావలంబనలో సాయపడటం కూడా ఈ కోవలోకే వస్తుంది.
ఈ హదీసులో పేర్కొనబడిన అన్సారీ సహచరుడు అందరి కంటే ముందు వెండి నాణాల సంచి తెచ్చి సమర్పించుకోవటం వల్ల ఇతర ముస్లిముల్లోని సేవాభావం జాగృత మయ్యింది. వారంతా దాన ధర్మాలకు పూనుకుని ఆ సత్కార్యంలో తలో చేయి వేశారు. దానికి గాను వారందరికీ లభించే సత్ఫలితం ఆ మొదటి అన్సారీకి లభిస్తుంది.
ఎందుచేతనంటే సత్కార్యం కోసం ఆయన వేసిన ముందడుగు ఇతర సహచరులకు ప్రేరణ నిచ్చింది. స్ఫూర్తి నిచ్చింది. ఇదేవిధంగా ఎవరయితే హితకార్యాల కోసం ప్రేరణ, ప్రోత్సాహాల వాతావరణం సృష్టిస్తారో వారి స్థానం గొప్పది. అయితే అటువంటి వారందరి ధ్యేయం అల్లాహ్ యొక్క ప్రసన్నతను చూరగొనడం అయి ఉండాలి. దాంతోపాటు చేసే పని కూడా ఉత్తమ పద్ధతిలోనే చేయాలి.
ఈ హదీసు ద్వారా మంచికై పురికొల్పే పని ఎంత మహత్పూర్వకమో, ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విశధమవుతోంది. అలాగే చెడులను సర్వసామాన్యం చేయడం ఎంత ఘోరపాతకమో స్పష్టమవుతోంది.
—
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ