78. తఫ్సీర్ సూరా నబా (Tafsir Surah Naba) [వీడియోలు]

తఫ్సీరె సూర నబా (Tafsir Surah Naba) [వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0bQpVcUnGot1P7G5t8KIv8

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

[78] సూరా అన్ నబా

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 40 ఆయతులు ఉన్నాయి. ప్రళయాన్ని, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని, తీర్పుదినాన్ని, శిక్షా బహుమానాలను ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరాలోని రెండవ ఆయతులో ప్రస్తావించబడిన ‘అన్ నబా’ (గొప్పవార్త) అన్న పేరునే దీనికి పెట్టడం జరిగింది.

అవిశ్వాసులు ముఖ్యంగా మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్న విషయమై ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో వాదించేవారు. వారు మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడాన్ని తిరస్కరించేవారు, ఎగతాళి చేసేవారు. ఈ సూరా అవిశ్వాసులకు వారు వినడానికి ఇష్టపడని గొప్పవార్తను తెలియజేసింది. ఆ వార్త… మనిషి చేసిన పనులకు బాధ్యత వహించవలసి ఉంటుంది, జవాబు చెప్పుకోవలసి ఉంటుందన్న వార్త. తీర్పుదినం తప్పనిసరిగా వస్తుందని ఈ సూరా నొక్కి చెప్పింది.

సత్యతిరస్కారుల వాదనను తిప్పికొట్టడానికి ఈ సూరాలో అల్లాహ్ శక్తిసామర్ధ్యాలను, ప్రకృతిలో కనిపించే దృష్టాంతాలను వివరించింది. అల్లాహ్ భూమిని పరచి మనిషికి నివాసయోగ్యంగా చేసాడు. భూమి తొణకకుండా దానిపై పర్వతాలను నిలబెట్టాడు. ఆయన మనలను జంటలుగా సృష్టించాడు. నిద్రను విశ్రాంతికోసం సృష్టించాడు. ఆయన మనపై ఏడు ఆకాశాలను నిలబెట్టాడు. ఆకాశంలో దీపంగా సూర్యుడిని ఉంచాడు. మేఘాల నుంచి వర్షాన్ని కురిపిస్తున్నాడు. తీర్పుదినం స్వచ్ఛమైన సత్యం. మంచిచెడులను వేరు చేసే రోజు. ప్రతి ఒక్కరు తప్పక చవిచూడవలసిన రోజు. ఈ విషయాలు తెలుపుతూ నరకాగ్నిని వర్ణించడం కూడా జరిగింది. సత్యాన్ని తిరస్కరించిన వారికి, తీర్పుదినాన్ని కాదన్న వారికి నరకాగ్ని ఒక మాటు వంటిదని చెప్పడం జరిగింది. నరకంలో వారికి నల్లని, జుగుప్సాకరమైన, సలసలకాగే ద్రవంఇవ్వబడుతుంది. అక్కడ చల్లని నీడ కాని, చల్లని పానీయం కాని దొరకదు. మరోవైపు స్వర్గవనాలను వర్ణిస్తూ మనోహరమైన ఉద్యానవనంగా పేర్కొనడం జరిగింది. అక్కడివారికి సమవయస్కులైన కన్యలు, ప్రశాంతత లభిస్తాయి.

78:1 عَمَّ يَتَسَاءَلُونَ
వీళ్ళు దేన్ని గురించి అడుగుతున్నారు?

78:2 عَنِ النَّبَإِ الْعَظِيمِ
గొప్ప సమాచారాన్ని గురించేనా?

78:3 الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ
దాని గురించి వారందరూ విభేదించుకుంటున్నారు.

78:4 كَلَّا سَيَعْلَمُونَ
కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు.

78:5 ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ
మరెన్నటికీ కాదు. అతి త్వరలోనే వారికి (వాస్తవం) తెలిసిపోతుంది.

78:6 أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا
ఏమిటి, మేము భూమిని పాన్పుగా చేయలేదా?

78:7 وَالْجِبَالَ أَوْتَادًا
పర్వతాలను మేకులుగా (పాతిపెట్టలేదా?)

78:8 وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا
ఇంకా, మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము.

78:9 وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
ఇంకా, మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము.

78:10 وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا
ఇంకా, మేము రాత్రిని మీ కొరకు ఆచ్చాదనగా చేశాము.

78:11 وَجَعَلْنَا النَّهَارَ مَعَاشًا
ఇంకా, పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.

78:12 وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا
ఇంకా, మీపైన మేము పటిష్టమైన ఏడు ఆకాశాలను నిర్మించాము.

78:13 وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا
ఇంకా, ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము.

78:14 وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا
ఇంకా, మేము నీళ్ళతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము.

78:15 لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا
తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్ళు వెలికితీయటానికి.

78:16 وَجَنَّاتٍ أَلْفَافًا
దట్టమైన తోటలు (ఉత్పన్నం చేయటానికి!)

78:17 إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا
నిశ్చయంగా తీర్పుదిన సమయం నిర్ధారితమై ఉంది.

78:18 يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
శంఖం పూరించబడిననాడు, మీరు తండోపతండాలుగా తరలి వస్తారు.

78:19 وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
మరి ఆకాశం తెరువబడుతుంది. అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి.

78:20 وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
పర్వతాలు నడిపింపబడి, ఎండమావుల్లా మారిపోతాయి.

78:21 إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది.

78:22 لِّلطَّاغِينَ مَآبًا
తలబిరుసుల నివాస స్థలమదే.

78:23 لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
వారందులో యుగాల తరబడి (మ్రగ్గుతూ) ఉంటారు.

78:24 لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
వారందులో ఎలాంటి చల్లదనాన్నిగానీ, త్రాగటానికి ఏ పానీయాన్నిగానీ, రుచిచూడరు –

78:25 إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
మరిగే నీరు, (కారే) చీము తప్ప.

78:26 جَزَاءً وِفَاقًا
మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది.

78:27 إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు.

78:28 وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
మా వాక్యాలను వారు యదేచ్ఛగా ధిక్కరించేవారు.

78:29 وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ كِتَابًا
మేము ప్రతి విషయాన్ని లిఖించి, లెక్కించి ఉంచాము.

78:30 فَذُوقُوا فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا
ఇక మీరు (మీ స్వయంకృతాల) రుచి చూడండి. మేము మీకు (నరక) శిక్ష తప్ప మరే విషయాన్నీ పెంచము.

78:31 إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا
నిశ్చయంగా దైవభీతి పరులు సాఫల్య భాగ్యం పొందుతారు.

78:32 حَدَائِقَ وَأَعْنَابًا
వారి కొరకు స్వర్గ వనాలు, ద్రాక్ష ఫలాలున్నాయి.

78:33 وَكَوَاعِبَ أَتْرَابًا
నవనవలాడే సమ వయస్కులైన కన్యలున్నారు.

78:34 وَكَأْسًا دِهَاقًا
మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి.

78:35 لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّابًا
అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపనలుగానీ, అసత్యాలనుగానీ వినరు.

78:36 جَزَاءً مِّن رَّبِّكَ عَطَاءً حِسَابًا
నీ ప్రభువు తరఫు నుండి వారికి (వారి కర్మలకు ప్రతిఫలంగా) తగినంతగా లభించే బహుమానం ఇది.

78:37 رَّبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الرَّحْمَٰنِ ۖ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا
ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు, మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించడానికి ఎవరూ సాహసించరు.

78:38 يَوْمَ يَقُومُ الرُّوحُ وَالْمَلَائِكَةُ صَفًّا ۖ لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا
ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో (ఆ రోజు), కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు.

78:39 ذَٰلِكَ الْيَوْمُ الْحَقُّ ۖ فَمَن شَاءَ اتَّخَذَ إِلَىٰ رَبِّهِ مَآبًا
ఆ రోజు (సంభవించటం అనేది) సత్యం. ఇక కోరినవారు (మంచి పనులు చేసి) తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు.

78:40 إِنَّا أَنذَرْنَاكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ الْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا
దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము నీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి – ముందుగా పంపుకున్న – దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.