https://youtu.be/JntXw28d4MQ [51 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]
పరిచయం: ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అల్లాహ్ అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హృదయాన్ని అల్లాహ్ కారుణ్యంతో నింపాడు. ప్రజలందరినీ ఆహ్వానించే హృదయవైశాల్యం ప్రసాదించాడు. కష్టనష్టాలను తొలగించి, ఆయన హోదా గౌరవాలను ఇనుమడింపచేసాడు. కాబట్టి, అధైర్యపడకుండా, క్రుంగిపోకుండా, అల్లాహ్ ప్రసన్నత పొందడానికి తీరిక లభించినపుడు ఆరాధనలో నిమగ్నమై పోవాలని ఆయనకు బోధించడం జరిగింది.
94:1 أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) ఏమిటి, మేము నీ హృదయాన్ని నీ కోసం విప్పలేదా? [1]
94:2 وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ
ఇంకా నీ మీది నుంచి నీ భారాన్ని కూడా మేము దించేశాము. [2]
94:3 الَّذِي أَنقَضَ ظَهْرَكَ
అది నీ వీపును విరిచి వేస్తూ ఉండేది.
94:4 وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ
ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము. [3]
94:5 فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
అయితే (ప్రతి) కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది.
94:6 إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
నిశ్చయంగా (ప్రతి) కష్టంతో పాటే సౌలభ్యం కూడా ఉంది. [4]
94:7 فَإِذَا فَرَغْتَ فَانصَبْ
కాబట్టి నీకు తీరిక చిక్కినప్పుడు (ఆరాధనలో) గట్టిగా శ్రమించు. [5]
94:8 وَإِلَىٰ رَبِّكَ فَارْغَب
నీ ప్రభువు వైపే మనసును లగ్నం చెయ్యి. [6]
Footnotes:
[1] ఈ సూరాను అలమ్ నష్రహ్ లేదా అష్ షర్హ్ సూరా అని కూడా అంటారు. వెనుకటి (దుహా) సూరాలో అల్లాహ్ యొక్క మూడు అనుగ్రహాలు ప్రస్తావించబడ్డాయి. మరో మూడు మహదనుగ్రహాలు ఈ సూరాలో కూడా పేర్కొనబడ్డాయి. హృదయాన్ని విప్పారజేయటం వీటిలో మొదటిది. దీని ఆంతర్యం ఏమిటంటే మేము (ఓ ముహమ్మద్) నీ హృదయాన్ని జ్యోతిర్మయం చేశాము. నీకు హృదయ విశాలతను ప్రసాదించాము. తత్కారణంగా సత్యవాక్కు నీకు శీఘ్రంగా అవగతమవుతుంది. అది నీ పాలిట ఫలవంతమవుతుంది. ఈ విషయాన్నే దివ్య ఖుర్ఆన్లోని ఈ ఆయతులో ఇలా చెప్పటం జరిగింది : “అల్లాహ్ తాను సన్మార్గం చూపగోరిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పారజేస్తాడు” (అల్ అన్ఆమ్ – 125). అప్పుడు ఆ వ్యక్తి ఇస్లాంను సత్యధర్మంగా తెలుసుకోవటమేగాక, దాన్ని హృదయపూర్వకంగా గ్రహిస్తాడు కూడా. హృదయాన్ని విప్పారజేసే ఈ ప్రక్రియలో ‘రొమ్మును చీల్చటం’ కూడా అంతర్లీనమై ఉంది. ప్రామాణిక ఆధారం ప్రకారం రెండుసార్లు అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారి రొమ్ము చీల్చబడింది. ఒకసారి బాల్యంలో ఈ పని జరిగింది. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాల్గవ యేటలో ఉండగా దైవదూత హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి ఆయన రొమ్మును చీల్చి, అందులోని పైశాచిక భాగాన్ని తీసివేశారు. (ఈ పైశాచిక ప్రవృత్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది). తరువాత ఆ రొమ్మును కడిగి, దాన్ని మూసివేశారు (సహీహ్ ముస్లిం – కితాబుల్ ఈమాన్). రెండవసారి మేరాజ్ (గగన యాత్ర) సందర్భంగా ఈ పని జరిగింది. ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రొమ్మును చీల్చి హృదయాన్ని బయటికి తీసి, దాన్ని జమ్ జమ్ జలంతో కడిగి, యధాస్థానంలో ఉంచటం జరిగింది. దాన్ని విశ్వాసంతో, యుక్తితో నింపటం జరిగింది. (సహీహ్ బుఖారీ, ముస్లిం మేరాజ్ అధ్యాయాలు, నమాజు ప్రకరణం).
[2] ఈ భారం ప్రవక్తగా నియమించబడక మునుపు గల 40 ఏండ్ల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితానికి సంబంధించినది. ఈ 40 ఏండ్ల కాలంలో ఆయన పాపకార్యాలకు దూరంగా ఉండినప్పటికీ, ఏ విగ్రహం ఎదుట కూడా ఆయన సాష్టాంగప్రణామం చేయనప్పటికీ, ఎన్నడూ సారాయి త్రాగనప్పటికీ, ఇతరత్రా చెడులకు ఆమడ దూరంగా ఉన్నప్పటికీ – ఈ కాలంలో తాను సజావుగా దైవారాధన చేయలేకపోయానే! అన్న భావన ఆయన్ని కృంగదీసేది. నిజానికి అందులో ఆయన దోషం ఏమీలేకపోయినప్పటికీ, ఒక సుదీర్ఘకాలం జీవితం అర్థరహితంగా, లక్ష్య రహితంగా కరిగిపోయిందే అన్న బాధ లోలోపలే కలిగి, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమిలి పోతుండేవారు. ఈ భారాన్ని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పైనుంచి దించివేస్తున్నట్లు అల్లాహ్ ప్రకటించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మహోపకారం చేశాడు. “అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను, భావికాలపు పొరపాట్లను మన్నించదలిచాడు”(అల్ ఫత్హ్-2) అన్న ఆయతు కూడా దాదాపు ఈ నేపథ్యంలోనే ఉంది. మరికొంతమంది ఖుర్ఆన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ ‘భారం’ ప్రవక్త పదవీ బాధ్యతలకు సంబంధించినది. ఈ బాధ్యతలు మానసికంగా ఆయన్ని (సల్లల్లాహు అలైహి వసల్లం) తీవ్రమైన ఒత్తిడికి లోనుచేసేవి. అందువల్ల అల్లాహ్ దాన్ని తేలిక చేశాడు. అంటే ఈ మార్గంలో ఎదురయ్యే బాధలను ఓర్పుతో, నేర్పుతో భరించే స్థయిర్యాన్ని ప్రసాదించాడు. దైవధర్మ ప్రచార కార్యంలో గల కొన్ని అవరోధాలను సులభతరం చేశాడు.
[3] ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! నీ పేరు మార్మోగిపోయేలా చేశాము. దీని భావం ఏమిటంటే ‘అల్లాహ్’ పేరు వచ్చిన చోటల్లా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు కూడా వస్తుంది. ఉదాహరణకు: అజాన్, ఇఖామత్, నమాజులలోనూ, ఇతరత్రా ధార్మిక సదనాలలోనూ మీరు ఈ విషయాన్ని గమనిస్తారు. వెనుకటి ఆకాశగ్రంథాలలో కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు, గుణగణాలు ప్రస్తుతించబడ్డాయి. దైవదూతలు సయితం ఊర్థ్వలోకాలలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) స్మరణ చేస్తూ ఉంటారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయతచూపటం తనకు విధేయత చూపటం వంటిదేనని అల్లాహ్ సెలవిచ్చాడు.
[4] ఈ వాక్యంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు, ఆయన ప్రియసహచరులకు శుభవార్త ఉంది. దైవ మార్గంలో కష్టాలు ఎదురైనంత మాత్రాన మీరు కలత చెందవలసిన అవసరం లేదని, ఈ కష్టాల తరువాత సుఖాలు కూడా వస్తాయని తెలియజేయబడింది. చివరికిజరిగింది కూడా అదే. యావత్ప్రపంచానికి ఈ సంగతి తెలిసిందే.
[5] అంటే దైవధర్మ ప్రచార కార్యక్రమం నుండి, మిథ్యావాదులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం నుండి వెసులుబాటు లభించినప్పుడల్లా ప్రార్థనల్లో లీనమై తీవ్రంగా పరిశ్రమించాలి. సుదీర్ఘమైన దుఆలు చేయాలి. అలసిపోయే వరకూ అల్లాహ్ ను ఆరాధిస్తూనే ఉండాలి.
[6] అంటే నీ ప్రభువు పైనే ఆశలు పెట్టుకో. ఆయన నుంచే స్వర్గాన్ని కోరు. నీకేం కావాలన్నా ఆయన్నే అర్థించు. వ్యవహారాలన్నింటిలోనూ ఆయనపైనే నమ్మకం పెట్టుకో. ఆయనే నమ్మదగ్గ నేస్తం.
—
30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr