శుభనామమైన “అల్లాహ్” యొక్క వివరణ – నసీరుద్దీన్ జామిఈ [వీడియో]

శుభనామమైన “అల్లాహ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/yQolmFQcf6Q [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ అన్న పేరు నోటితో ఉచ్చరించడం ఎంత సులభం. పెదవులు కదిలే అవసరం కూడా లేదు. మాట్లాడే మాట శక్తిని కోల్పోయిన వ్యక్తి కూడా ఎంతో సులభతరంగా పలికే పదం. అల్లాహ్.

పాలు త్రాగే పిల్లవాడు నుండి మొదలుకొని సమాధిలో కాళ్ళు ఈలాడుతున్న వృద్ధుడు వరకు ప్రతి ఒక్కరూ ఈ అల్లాహ్ యొక్క అవసరం లేకుండా ఏ క్షణం కూడా లేరు. మనిషే కాదు,

وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ
(వమా తస్కుతు మిన్ వరఖహ్)
(ఒక ఆకు రాలినా)
ఏ ఆకు అయినా, అండము నుండి పిండము వరకు బ్రహ్మాండం వరకు సర్వము, సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్.

అల్లాహ్ గురించి దాని అరబీ పదం గ్రామర్ పరంగా దాని వివరాల్లోకి వెళ్ళను కానీ ఒక్క మాట తప్పకుండా మనం తెలుసుకోవడం చాలా అవసరం. అదేంటి? అల్లాహ్ ఎలాంటి పదం అంటే, దీనికి స్త్రీలింగ పురుషలింగ, మేల్ ఫీమేల్ అన్నటువంటి సెక్సువాలిటీ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో లేవు.

అల్లాహ్ అన్న పదం ప్రతి భాషలో సులభంగా పలకవచ్చు. ప్రతి భాషలో అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ భాష మాట్లాడినా గానీ, ఒక భాష మాట్లాడే వారికి వేరే భాషలోని కొన్ని పదాలు పలకడం ఎంతో ప్రాక్టీస్ అవసరం ఉంటుంది కదా. కానీ అల్లాహ్ అలాంటి ప్రాక్టీస్, అలాంటి పలకడానికి, ఉచ్చరించడానికి కష్టతరమైన పదం ఎంతమాత్రం కాదు.

మరొక అద్భుత విషయం, గొప్ప విషయం తెలుసుకోండి అందరికీ చాటండి. అదేమిటంటే, ఇంతకుముందు అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరో ప్రవక్తలు వచ్చారో, ఎన్ని భాషల్లో వచ్చారో, ఎన్ని గ్రంథాలు అవతరించాయో ప్రతి గ్రంథంలో, ప్రతి భాషలో, ప్రతి ప్రవక్త అల్లాహ్ ను అల్లాహ్ అనే అన్నారు. దీనికి ఇప్పటికీ రుజువులు ఉన్నాయి. కానీ ఎంతో మంది ప్రజలు ఆ రుజువులను అర్థం చేసుకోరు. వారికి తెలియదు. హిబ్రూ భాషలో వచ్చినటువంటి గ్రంథాలు కానీ, సంస్కృతంలో వచ్చిన గ్రంథాలు కానీ ఇంకా వేరే ఏ భాషలో వచ్చినా అక్కడ అల్లాహ్ కొరకు అల్లాహ్ అన్న పదమే ఉన్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి, అందరికీ చాటి చెప్పే అవసరం ఉంది.

దీనిని మనం లాజిక్ గా కూడా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. నా పేరు నసీర్. అల్లాహ్ యొక్క గొప్ప దయ, అనుగ్రహం, అరబీ, ఉర్దూ, తెలుగు సరళంగా ఈ మూడు భాషలు మాట్లాడుకోవచ్చును, మాట్లాడవచ్చును, రాయవచ్చును, చదవవచ్చును. దీని తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఎంతో కొంచెం కొంత. ఇదే కాకుండా ఇక్కడ తమిళ్, మలయాళం, బంగ్లా, ఫిలిప్పీన్, ఇండోనేషియా వేరు వేరు దేశాలకు సంబంధించిన వారితో కలుస్తూ లేస్తూ కూర్చుంటూ ఉంటాము గనుక చిన్నపాటిగా ఎలా ఉన్నారు, క్షేమమేనా, రండి తిందాము, కూర్చుందాము, కొన్ని వెల్కమ్ పదాలు ఆ భాషల్లో మాట్లాడుకున్నప్పటికీ నన్ను అందరూ ప్రతి భాష వారు నసీరే అంటారు. నసీర్ యొక్క తెలుగులో పదం, భావం సహాయకుడు. ఓ సహాయకుడా ఇటురా, ఏ సహాయకుడా ఎలా ఉన్నారు, ఓ షేక్ సహాయకులు ఇలా అంటారా? మీ పేరును అనువాదం చేసి పిలవడం జరుగుతుందా మీ యొక్క వేరే భాషలో గనక మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు? కాదు. ఇంపాజిబుల్. అల్లాహ్ యొక్క పేరు విషయంలో మనం ఎందుకు ఈ సత్యాన్ని, ఈ గొప్ప సత్యాన్ని, మహిమను, అద్భుతాన్ని గమనించలేకపోతున్నాము?

ఇక, ఈ చిన్న వివరణ తర్వాత, అల్లాహ్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా నేను కొన్ని విషయాల వైపునకు మీకు సైగ చేస్తూ మరి కొన్ని విషయాలు చిన్నపాటి వివరణతో తెలియజేయాలనుకుంటున్నాను.

మొదటి విషయం, అల్లాహ్ అంటే ఎవరు? అని స్వయం ముస్లింలకు ఈ ప్రశ్న వచ్చినా, హిందువులు ప్రశ్నించినా, బౌద్ధులు ప్రశ్నించినా, జైనిష్టులు ప్రశ్నించినా, యూదులు ప్రశ్నించినా, క్రైస్తవులు ప్రశ్నించినా, ఆస్తికులు ప్రశ్నించినా, నాస్తికులు ప్రశ్నించినా వారికి సూరతుల్ ఇఖ్లాస్ చదివి వినిపిస్తే సరిపోతుంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్)
(అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఖుల్ హువల్లాహు అహద్)
(చెప్పు: ఆయన అల్లాహ్, ఏకైకుడు.)

చెప్పండి అందరికీ, ఆయన అల్లాహ్. హువ అని, ఆ తర్వాత అల్లాహ్ అని, ఆయన ఎవరి గురించి అయితే మీరందరూ భేదాభిప్రాయంలో ఉన్నారో, ఎవరి ఆరాధన వదిలి వేరే వారిని పూజిస్తున్నారో, ఏ ఏకైక ఆరాధ్యుడిని పూజించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానో, పిలుస్తున్నానో వారి గురించి మీరు అనుమానాల్లో పడి ఉన్నారో తెలుసుకోండి. ఆయన అల్లాహ్, అహద్. ఆయన ఏకైకుడు.

ఏకైకుడు అన్న ఈ పదంలో అల్లాహ్ యొక్క అస్తిత్వం గురించి చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఉన్నాడు. అతనికి ఒక అస్తిత్వం అంటూ ఉన్నది. కానీ ఎలా ఉంది? అది ఇప్పుడు మనకు తెలియదు. అల్లాహ్ యొక్క దయ కరుణతో మనం ఆయన్ని స్వర్గంలో చూడగలుగుతాము. కొన్ని గుణగణాలు ఏవైతే ఖురాన్, సహీ హదీసుల్లో వచ్చాయో వాటిని మనం అలాగే నమ్మాలి. అహద్ అని అన్నప్పుడు, ఏకైకుడు అన్నప్పుడు, అతడు కొన్ని భాగాలు కలిసి ఒకటి అయ్యాడు అన్నటువంటి భావం రానే రాదు అహద్ లో. అందుకొరకే కొందరు ధర్మవేత్తలు ఇక్కడ ఈ అహద్ అన్న పదంలో ఉన్నటువంటి అద్భుతాన్ని, గొప్ప విషయాన్ని చెబుతారు, ఏమని? అరబీలో ఒకటి అనే దానికి వాహిద్ అన్న పదం కూడా ఉపయోగపడుతుంది. కానీ అల్లాహ్ వాహిద్ అని ఇక్కడ ఉపయోగించలేదు. ఎందుకంటే వాహిద్ లో కొన్ని సమూహాలను కూడా ఒకటి, కొందరిని కలిసి కూడా ఒకటి. ఉదాహరణకు ఖురాన్ లోనే చూడండి:

إِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً
(ఇన్న హాదిహి ఉమ్మతుకుమ్ ఉమ్మతన్ వాహిదహ్)
(నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక సమాజం.)

మీ ఈ సమాజం ఒక్క సమాజం. ఉమ్మత్ అని అన్నప్పుడు, సమాజం అన్నప్పుడు అందులో ఎందరో ఉన్నారు కదా? అయితే అందరూ కలిసి ఒక్క సమాజం. వాహిద్ లో ఇలాంటి భావం వస్తుంది కానీ ఇక్కడ అహద్ అన్న పదం ఏదైతే వచ్చిందో, ఇందులో ఎలాంటి, ఎందుకంటే కొందరు తప్పుడు విశ్వాసాల్లో ఉన్నారు. ఇద్దరు కలిసి లేదా ముగ్గురు కలిసి మరికొందరు కలిసి చివరికి అల్లాహ్ హిదాయత్ ఇవ్వు గాక ముస్లింలలో కొందరు ఇలాంటి చెడ్డ విశ్వాసంలో ఉన్నారు. మనిషి అల్లాహ్ యొక్క వలీ అయిపోతాడు, తర్వాత కుతుబ్ అయిపోతాడు, తర్వాత అబ్దాల్ అయిపోతాడు, తర్వాత ఫలానా అవుతాడు, చివరికి అల్లాహ్ లో కలిసిపోతాడు. నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి ఆధారం లేని తప్పుడు విశ్వాసాలన్నిటినీ కూడా ఖండిస్తుంది: قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (ఖుల్ హువల్లాహు అహద్).

ఆ తర్వాత, ఏ అల్లాహ్ వైపునకైతే మేము ప్రపంచవాసులందరినీ ఆహ్వానిస్తున్నామో, ఏ దేశంలో ఉన్నవారైనా, రాజులైనా ప్రజలైనా మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఎందుకు?

اللَّهُ الصَّمَدُ
(అల్లాహుస్ సమద్)
(అల్లాహ్ నిరపేక్షాపరుడు.)

ఆయన ఎలాంటి వాడు అంటే, అతని అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ అతనికి ఎవ్వరి అవసరం లేదు. అందుకే సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క ఈ పేరును, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గ్రహించండి. ఈ లోకంలో అల్లాహ్ తప్ప వేరే ఎవరూ లేరు, తనకు ఏ అవసరం లేకుండా ఉండడానికి. మనం ఎవరినైతే ఆరాధించాలో ఆ అల్లాహ్ ఎలాంటి వాడు? అతనికి ఎవరి అవసరం లేదు. కానీ అతని తప్ప సృష్టి రాశులందరికీ అల్లాహ్ యొక్క అవసరం ప్రతి క్షణంలో ఉంది.

يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ ۖ وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
(యా అయ్యుహన్నాసు అన్తుముల్ ఫుఖరాఉ ఇలల్లాహ్, వల్లహు హువల్ గనియ్యుల్ హమీద్)
(ఓ మానవులారా! మీరే అల్లాహ్ అవసరం గలవారు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ప్రశంసనీయుడు.)

ఇక ఆ తర్వాత మూడవ గుణం, అల్లాహ్ గురించి తెలుసుకోవలసిన మూడవ విషయం:

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
(లమ్ యలిద్ వలమ్ యూలద్)
(ఆయన ఎవరినీ కనలేదు మరియు ఎవరి చేతా కనబడలేదు.)

ఆ అల్లాహ్ ఎలాంటి వాడు అంటే, ఆ అల్లాహ్ ఒకరికి కనలేదు, ఒకరిని కనలేదు. అంటే అల్లాహ్ కు సంతానమూ లేదు, అల్లాహ్ కు తల్లిదండ్రులూ లేరు, భార్యాపిల్లలు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు. ఆయనే ఆరంభం, ఆయనే అంతం. హువల్ అవ్వలు వల్ ఆఖిర్.

ఆ అల్లాహ్ ఎలాంటి వాడు అంటే, నాలుగవ గుణం:

وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
(వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్)
(మరియు ఆయనకు సరిసమానులెవరూ లేరు.)

ఆయనకు సరిసమానులు ఏ రీతిలో గానీ, ఆయన అస్తిత్వంలో గానీ, ఆయన యొక్క పేర్లలో గానీ, ఆయన యొక్క గుణాలలో గానీ, ఆయన చేసే పనుల్లో గానీ, ఆయనకు మనం చేయవలసిన పనులు అంటే ఇబాదత్, ఏ విషయంలో కూడా అల్లాహ్ కు సరిసమానులు ఎవరూ లేరు.

సోదర మహాశయులారా, ప్రియ వీక్షకుల్లారా, అల్లాహ్ ఎంతటి గొప్పవాడు అంటే, ఖురాన్ లో అల్లాహ్ యొక్క పదం 2,700 కంటే ఎక్కువ సారి ఉపయోగపడింది. అల్లాహ్ ఇది అల్లాహ్ యొక్క అసలైన పేరు. దీనికి అనువాదం ఏ ఒక్క పదంలో మనం సరైన రీతిలో చెప్పుకోలేము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క స్తోత్రములు, అల్లాహ్ యొక్క ప్రశంసలు, పొగడ్తలు చెప్పుకున్నప్పుడు ఏ ఏ దుఆలైతే చేశారో ఒకటి ఏముంది:

لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(లా ఉహ్సీ సనాఅన్ అలైక, అంత కమా అస్నైత అలా నఫ్సిక)
(ఓ అల్లాహ్! నేను నిన్ను సంపూర్ణంగా ప్రశంసించలేను. నీవు నిన్ను ఎలా ప్రశంసించుకున్నావో అలాగే ఉన్నావు.)

నేను నిన్ను, నీవు ఎలాంటి ప్రశంసలకు అర్హత కలిగి ఉన్నావో అంతటి గొప్ప రీతిలో నేను నిన్ను ప్రశంసించలేను, నీ యొక్క ప్రశంసలను లెక్కించలేను. నీవు స్వయంగా నిన్ను ఎలా ప్రశంసించుకున్నావో అంతకంటే గొప్పగా మేము ఎవరూ కూడా మిమ్మల్ని, నిన్ను ప్రశంసించలేము.

అల్లాహ్ అన్న పదం అల్లాహ్ యొక్క అసలైన పేరు. అల్లాహ్ పేర్లన్నీ కూడా మిగితవి, అర్-రహ్మాన్, అర్-రహీమ్, అల్-మలిక్, అల్-కుద్దూస్, అల్-అజీజ్, అల్-జబ్బార్, అల్-ముతకబ్బిర్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ అల్లాహ్ యొక్క పేర్ల నుండి వెళ్ళినవి, వాటి నుండి ఇది రాలేదు. ఈ ముఖ్య విషయాన్ని గమనించాలి.

మరొక ముఖ్య విషయం, అల్లాహ్ తఆలా యొక్క ఈ పేరులో, అల్లాహ్ అన్న పదం ఏదైతే ఉందో ఇందులో ఆరాధన, అల్లాహ్ యొక్క ఇబాదత్ అన్నటువంటి ముఖ్యమైన భావం ఉంది. సూరతు లుక్మాన్, సూరతుల్ హజ్ లో మీరు చదివారంటే,

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ
(ధాలిక బి అన్నల్లాహ హువల్ హఖ్)
(ఇది ఎందుకనగా, నిశ్చయంగా అల్లాహ్ యే సత్యం.)

అల్లాహ్ అతని యొక్క ఆరాధన. ఆయనే సత్యుడు. అల్లాహ్ ను తప్ప వేరే ఎవరినైతే పూజించడం జరుగుతుందో అదంతా కూడా అసత్యం, వ్యర్థం, పనికిమాలినది అని ఈ ఆయతుల ద్వారా ఎప్పుడైతే తెలుస్తుందో, అక్కడ అల్లాహ్ అన్న పదం ముందుకు వచ్చి హఖ్ అని చెప్పాడు. అంటే ఆరాధన యొక్క భావం ఇందులో ఉంది. దీన్ని ఇంతగా నొక్కి చెప్పడానికి అవసరం ఏంటి ఈ రోజుల్లో? ఏంటి అవసరం అంటే, ఎంతో మంది ముస్లింలు అయినప్పటికీ, అల్లాహ్ యొక్క అసలైన ఈ పేరులో ముఖ్యమైన భావం దాన్ని మరిచిపోయిన కారణంగా, అల్లాహ్ అని అంటున్నారు, నోటితో పలుకుతున్నారు కానీ ఆరాధన అల్లాహ్ కు తప్ప వేరే ఎంతో మందికి లేదా అల్లాహ్ యొక్క ఆరాధనతో పాటు మరీ వేరే ఎంతో మంది పుణ్యాత్ములను కూడా వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పులో పడడానికి అసలైన కారణం, అల్లాహ్ యొక్క అసలైన భావం, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారు గమనించకపోవడం.

అల్లాహ్ యొక్క ఈ పేరు ఎంతటి గొప్ప పేరు అంటే, ప్రతి జిక్ర్ లో అల్లాహ్ దీనిని ఉంచాడు, పెట్టాడు. స్వయంగా ఈ పేరు ఎంత శుభకరమైనది అంటే మనిషి ఎప్పుడైతే స్వచ్ఛమైన మనస్సుతో, సంపూర్ణ విశ్వాసంతో, బలమైన ప్రగాఢమైన నమ్మకంతో అల్లాహ్ యొక్క ఈ పేరును ఉచ్చరిస్తాడో కష్టాలు తొలగిపోతాయి. బాధలన్నీ మాయమైపోతాయి. ఇబ్బందులన్నీ సులభతరంగా మారుతాయి. దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

అంతేకాదు, అల్లాహ్ యొక్క ఈ పేరు పుణ్యాల త్రాసులో ఎక్కడైతే వచ్చిందో, భూమ్యాకాశాలన్నీ అందులో ఉన్నటువంటి సమస్తాన్ని మరో పళ్ళెంలో పెడితే, అల్లాహ్ అన్న పదం ఏ పళ్ళెంలో ఉందో అది బరువుగా తేలుతుంది. మిగతా పళ్ళాలన్నీ కూడా ఎగిరిపోతాయి.

అల్లాహ్ యొక్క పదం ఇది కేవలం నోటితో ఉచ్చరించేది కాదు. అంతటి ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం తప్పనిసరి. మీరు ఏ జిక్ర్ పలికినా అల్లాహ్ అన్న పదం లేకుండా ఉండదు. బిస్మిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ ఇంకా ఇలాంటి ఏ జిక్ర్ అయినా గానీ, చివరికి బాధలో, కష్టంలో, నష్టంలో పడినప్పుడు, إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ (ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్) (నిశ్చయంగా, మేము అల్లాహ్ కే చెందిన వారం మరియు ఆయన వైపునకే మరలి పోవాలి.) అక్కడ కూడా అల్లాహ్ అన్న పదం వస్తుంది.

సోదర మహాశయులారా, ప్రియ వీక్షకుల్లారా, అల్లాహ్ యొక్క పేరు గురించి ఈ విషయం మనం తెలుసుకుంటున్నప్పుడు, సంక్షిప్తంగా మరొక విషయం కూడా తెలుసుకోవడం చాలా బాగుంటుంది. అదేమిటంటే అల్లాహ్ తఆలా స్వయంగా ఖురాన్ లో అనేక సందర్భాలలో తన యొక్క ఈ శుభ నామం ద్వారానే ఎన్నో ఆయత్ లు ప్రారంభించాడు. ఉదాహరణకు ఇక్కడ మీరు చూస్తున్నారు, సూరతుల్ హషర్ 22, సూరతుల్ హషర్ 23, సూరతుత్ తలాఖ్ 12. ఆ తర్వాత ఇంకా మీరు చూడగలిగితే సూరతుర్ రూమ్ ఆయత్ నెంబర్ 40. దీని యొక్క అనువాదం కూడా వినండి:

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
(అల్లాహుల్లదీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహ్యీకుమ్. హల్ మిన్ షురకాఇకుమ్ మన్ యఫ్అలు మిన్ ధాలకుమ్ మిన్ షయ్. సుబ్హానహూ వ తఆలా అమ్మా యుష్రికూన్)

(అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, ఆ తర్వాత మీకు ఉపాధిని ప్రసాదించాడు, ఆ తర్వాత మీకు మరణం ఇస్తాడు, ఆ తర్వాత మీకు జీవం పోస్తాడు. మీరు కల్పించిన భాగస్వాములలో ఈ పనులలో ఏదైనా చేయగలవాడు ఉన్నాడా? ఆయన పవిత్రుడు మరియు వారు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు.)

అల్లాహుల్లదీ, అల్లాహ్ ఎవరు? అల్లదీ, అతడే ఖలఖకుమ్, మిమ్మల్ని సృష్టించాడు, సుమ్మ రజఖకుమ్, మిమ్మల్ని పోషించాడు, సుమ్మ యుమీతుకుమ్, మీకు మరణం ప్రసాదిస్తాడు, సుమ్మ యుహ్యీకుమ్, మళ్లీ మిమ్మల్ని బ్రతికిస్తాడు. హల్ మిన్ షురకాఇకుమ్ మన్ యఫ్అలు మిన్ ధాలకుమ్ మిన్ షయ్, మీరు ఆ అల్లాహ్ ను వదిలి ఎవరినైతే భాగస్వామిగా కలుగజేస్తున్నారో వారిలో ఈ నాలుగింటిలో ఏదైనా ఒకటి చేసే అటువంటి శక్తి ఉందా? సుబ్ హానః , మీరు కల్పిస్తున్న ఈ భాగస్వామ్యాలకు అల్లాహ్ తఆలా ఎంతో అతీతుడు, పరిశుద్ధుడు. వ తఆలా అమ్మా యుష్రికూన్, ఆయన ఎంతో ఉన్నతుడు, ఎంతో ఉన్నతుడు.

మరియు ఈ సమస్త ప్రపంచంలో, విశ్వంలో ప్రతి విషయాన్ని నడుపుతున్న వాడు, ఈ విశ్వం మొత్తం నిర్వహిస్తున్న వాడు అల్లాహే. అందుకొరకే గాలుల గురించి సూరతుర్ రూమ్ ఆయత్ నెంబర్ 48 చూడండి. గాలులను ఎలా నడిపిస్తున్నాడు? వాటి ద్వారా మేఘాలను ఎలా కలుపుతున్నాడు? వాటి ద్వారా వర్షాలు కురిపించేటువంటి ప్రక్రియ ఎలా సిద్ధమవుతుంది?

ఆ తర్వాత సూరతుర్ రూమ్ ఆయత్ నెంబర్ 54 లో చూడండి, అల్లాహుల్లదీ అని ఆయత్ స్టార్ట్ అవుతుంది. ఆ అల్లాహ్ యే, ఇందులో మనిషి యొక్క పుట్టుక, స్టేజీలు, చిన్నతనం, బాల్యం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత వృద్ధాప్యం.

మళ్ళీ తర్వాత మీరు సూరతుస్ సజ్దాలో చూశారంటే భూమ్యాకాశాల యొక్క పుట్టుక గురించి మరియు అర్ష్ సింహాసనంపై అల్లాహ్ తఆలా ఏదైతే ఇస్తివా అయ్యాడో దాని గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది.

అలాగే సోదర మహాశయులారా సూరత్ ఫాతిర్ ఆయత్ నెంబర్ తొమ్మిదిలో గనక మీరు గమనిస్తే, ఇందులో కూడా అల్లాహ్ తఆలా మేఘాలను, గాలులను ప్రస్తావించిన తర్వాత మేఘాల ద్వారా వర్షం కురిపిస్తే చనిపోయిన భూమి, భూమి పగిలిపోయి ఇక ఎంత ఎండిపోయింది ఇందులో ఎప్పుడూ కూడా ఇక ఏదైనా పంట పండుతుందా అన్నటువంటి నిరాశకు గురి అయిన సందర్భంలో అల్లాహ్ వర్షం ద్వారా ఆ చనిపోయిన భూమిని ఎలా బ్రతికిస్తాడో, మృతులను కూడా అలా బ్రతికిస్తాడు అన్నటువంటి ఉదాహరణలు కూడా అల్లాహ్ తఆలా తెలుపుతున్నాడు.

అలాగే సూరతు గాఫిర్ ఆయత్ నెంబర్ 61, 64, 79 ఇందులో మీరు చూశారంటే రాత్రిని, పగలును అల్లాహ్ తఆలా ఏదైతే మారుస్తున్నాడో, ఇందులో బుద్ధి గల వారికి ఏదైతే ఎన్నో రకాల నిదర్శనాలు ఉన్నాయో దాని గురించి చెప్పాడు.

ఆ తర్వాత 64లో భూమిని అల్లాహ్ తఆలా నివసించడానికి ఒక పాన్పుగా మంచి విధంగా ఏదైతే ఉంచాడో, ఆకాశాన్ని కప్పుగా ఏదైతే చేశాడో దాని గురించి ఇంకా అల్లాహ్ తఆలా మన యొక్క అవసరాలు తీరడానికి జంతువులను ఏదైతే సృష్టించాడో వాటిలో కొన్నిటిని మనం వాహనంగా ఉపయోగిస్తాము, మరి కొన్నిటిని తినడానికి ఉపయోగిస్తాము, ఇవన్నీ వివరాలు ఏదైతే ఉన్నాయో, ఈ ఆయతులు నేను చూపిస్తున్నది దేని కొరకు? చదవండి ఖురాన్, శ్రద్ధగా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

సూరతుష్ షూరా ఆయత్ 17, అలాగే సూరతుల్ జాసియా ఆయత్ 12, ఇంకా సూరతుర్ రఅద్ ఆయత్ నెంబర్ 2, ఆకాశాన్ని పైకి ఏదైతే ఎత్తి ఉంచాడో దానికి ఎలాంటి పిల్లర్స్ ఏమీ లేకుండా దాని గురించి, అలాగే సూర్యుడు, చంద్రుడు వీటన్నిటినీ అల్లాహ్ ఏదైతే అదుపులో ఉంచాడో వాటి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది.

అలాగే సూర ఇబ్రాహీంలో కూడా భూమ్యాకాశాల గురించి, ఆకాశం నుండి వర్షం కురిపించేది, భూమి నుండి పంటలు పండించే దాని గురించి మరియు సముద్రాలలో పడవలు నడిపి మరియు ఈ సముద్రాల ద్వారా, నదుల ద్వారా అల్లాహ్ తఆలా మనకు ఏ ప్రయోజనకరమైన విషయాలు ఇస్తున్నాడో వీటన్నిటి గురించి ఇందులో ప్రస్తావన ఉంది.

సోదర మహాశయులారా, ఖురాన్ శ్రద్ధగా చదువుతూ అల్లాహ్ యొక్క గొప్పతనాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా అల్లాహ్ యొక్క శుభ నామం గురించి చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉన్నాయి. కానీ అల్లాహ్ యొక్క దయతో మనం ఇంకా ముందుకు ఇంకా ముందుకు అల్లాహ్ యొక్క అనేక శుభ నామాల గురించి తెలుసుకుంటూ ఉంటాము. అందులో కూడా మరెన్నో విషయాలు వస్తాయి. మనకు ఇవ్వబడినటువంటి సమయం కూడా సమాప్తం కాబోతుంది. ఈ చివరిలో నేను ఒక ఆయత్ ద్వారా నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ
(అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ)
(అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు.)

لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
(లహుల్ అస్మాఉల్ హుస్నా)
(అత్యుత్తమమైన పేర్లు ఆయనకే ఉన్నాయి.)

అల్లాహ్ ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ కూడా లేడు. సూరతుల్ అన్ఆమ్, సూరత్ యూనుస్ ఇంకా వేరే సూరాలలో చూశారంటే మీరు అల్లాహ్ తఆలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని పుట్టించిన, మీకు ఆహారం ఒసంగుతున్న, మీకు జీవన్ మరణాలు ప్రసాదిస్తున్న ఆ అల్లాహ్ ఏకైకుడే, మీ యొక్క ఆరాధనలకు ఏకైక అర్హుడు. ఆయన్ని తప్ప ఎవరినీ కూడా పూజించకండి.

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని తన ఖురాన్, ప్రవక్త హదీసుల ద్వారా తెలుసుకుంటూ ఉండేటువంటి సత్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ ఆఖిరు దఅవాన అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

అల్లాహ్ (త’ఆలా)
https://teluguislam.net/allah

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1