మదీనా ప్రస్థానం (హిజ్రత్) | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) హిజ్రత్ అర్థం 
2) హిజ్రత్ విశిష్టత
3) దివ్య ఖుర్ఆన్ మరియు హదీసు వెలుగులో హిజ్రత్ ఆదేశం ప్రళయం వరకు ఉంది
4) మదీనాకు హిజ్రత్ : కారణాలు, వృత్తాంతాలు. 

మొదటి ఖుత్బా 

ధార్మిక సహోదరులారా! 

హిజ్రీ శకపు నూతన సంవత్సరపు ఆరంభాన్ని పురస్కరించుకొని, నేటి ప్రసంగంలో, ఎంతో ప్రాచుర్యం పొందిన “మదీనా ప్రస్థానం (హిజ్రత్)” వృత్తాంతాన్ని సమగ్రంగా వివరించడం సబబుగా అనిపిస్తోంది. ఎందుకంటే – ఈ సంఘటన ద్వారానే ఇస్లామీ శకం ఆరంభమైనది. కానీ, దీని వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు హిజ్రత్ అంటే ఏమిటి? దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో దీని గూర్చి వివరించబడ్డ విశిష్ఠతలు ఏమిటి? వీటిని గూర్చి తెలుసు కుందాం రండి. 

హిజ్రత్ అంటే – ‘అల్ హిజ్రహ్’ హిజర్ నుండి వచ్చింది. దీని అర్థం  ‘వదలిపెట్టడం‘ అని. 

అరబ్బులు ఇలా అనేవారు: “ఫలానా జాతి ఒక ప్రదేశాన్ని వదిలి మరో ప్రదేశానికి వెళ్ళిపోయింది.” ముహాజిర్ సహబాలు కూడా మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ
మరియు పడక గదులలో వారిని వదిలిపెట్టండి” (నిసా : 34) 

‘అల్ హిజ్రత్’ ను మెజారిటీ ఉలమాలు ధార్మికంగా ఇలా నిర్వచించారు: 
“అవిశ్వాస భూభాగం (దారుల్ కుఫ్ర్) నుండి ఇస్లామీయ భూభాగం (దారుల్ ఇస్లామ్) వైపు మరలిరావడం”. 

అయితే, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి ఇలా వివరించారు: 
“షరీయత్తు పరంగా ‘హిజ్రత్’ అంటే – అల్లాహ్ వారించిన ప్రతి కార్యాన్నీ విడిచిపెట్టడం.” 

బహుశా, హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఈ నిర్వచనాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హదీసు నుండి గ్రహించి వుండవచ్చు. 

అల్లాహ్ వారించిన కార్యాలను విడిచిపెట్టేవాడు ముహాజిర్” (బుఖారీ: 1/35, అల్ ఫతహ్) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే- ‘హిజ్రత్’ అన్న పదం – బాహ్యము మరియు అంతరంగం – ఈ రెండు రకాల హిజ్రత్ లకు కూడా వర్తిస్తుంది. 

అంతరంగ హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి షైతాను మరియు స్వయంగా అతని మనస్సు ఎంతో ఆకర్షకంగా మలచి అతని ముందు ప్రవేశపెట్టే కార్యాలను త్యజించడం. ఇక, బాహ్య హిజ్రత్ లక్ష్యమేమిటంటే – మనిషి తన ధర్మాన్ని అవిశ్వాసం మరియు ఉపద్రవాల బారి నుండి కాపాడుకొనే నిమిత్తం ఇస్లామీయ బోధనలపై శాంతియుతంగా ఆచరించుకోగలిగే ప్రదేశానికి మరలి వెళ్ళడం.” (ఫత్హుల్ బారి  : 1/54) 

ఇమామ్ అలాజ్ బిన్ అబ్దుస్సలామ్ (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు: 

హిజ్రత్ రెండు రకాలు. స్వదేశాన్ని విడిచిపెట్టడం మరియు పాపాలను, దౌర్జన్యాన్ని త్యజించడం. వీటిలో, రెండవ హిజ్రత్ ఉత్తమమైనది. ఎందుకంటే – దీని ద్వారా ఆ కరుణామయుడు (అల్లాహ్) సంతృప్తి చెందడమేకాక, మనస్సు మరియు షైతానుల దుష్ప్రరణ కూడా తగ్గుతుంది.”

హిజ్రత్ విశిష్టతలు 

హిజ్రత్ విశిష్టతలు మరియు దాని ద్వారా లభించే ప్రతిఫలాల వివరాలు దివ్య ఖుర్ఆన్ మరియు హదీసులలో లభ్యమవుతాయి. ముందుగా దివ్య ఖుర్ఆన్ లోని కొన్ని ఆయతులు వినండి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَاللَّهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ

1) నా కొరకు తమ దేశాన్ని విడిచిపెట్టినవారు, నా మార్గంలో తమ గృహాల నుండి గెంటి వేయబడినవారు, హింసించబడినవారు, నా కొరకు పోరాడి చంపబడిన వారు అటువంటి వారి తప్పులన్నింటినీ నేను క్షమిస్తాను. క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యాన వనాలలోకి వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే ఉంది. (ఆలి ఇమ్రాన్ 3: 195) 

الَّذِينَ آمَنُوا وَهَاجَرُوا وَجَاهَدُوا فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ اللَّهِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَانٍ وَجَنَّاتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِندَهُ أَجْرٌ عَظِيمٌ

2) “విశ్వసించి, అల్లాహ్ మార్గంలో ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి, తమ ప్రాణాలతో, తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టివారే సఫలీకృతులు. వారి ప్రభువు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తనూ, శాశ్వత భోగాల సామగ్రి గల స్వర్గవనాల శుభవార్తనూ ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వటానికి అల్లాహ్ వద్ద ఎంతో ఉంది.” (తౌబా 9 : 20-22) 

وَالَّذِينَ هَاجَرُوا فِي اللَّهِ مِن بَعْدِ مَا ظُلِمُوا لَنُبَوِّئَنَّهُمْ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ

3) “దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత అల్లాహ్ కోసం వలస పోయిన వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి నివాసాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే గొప్పగా ఉంటుంది. ఈ విషయం వారు తెలుసుకుంటే ఎంత బాగుండేదో!” (నహ్ల్ 16 : 41) 

ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِن بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ

4) “(విశ్వసించిన కారణంగా) బాధలకు గురి చెయ్యబడినప్పుడు ఇల్లూ వాకిలీ విడిచి పెట్టినవారూ, వలసపోయినవారూ, దైవమార్గంలో కష్టాలను భరించినవారూ, సహనంతో వ్యవహరించినవారూ- వారికొరకు నీ ప్రభువు నిశ్చయంగా క్షమించేవాడుగా, కరుణించేవాడుగా ఉంటాడు.” (నహ్ల్ 16 : 110) 

హాఫిజ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ పై వ్యాఖ్యానిస్తూ ఇలా పేర్కొన్నారు: 

“మక్కాలో బలహీనులుగా, అల్పులుగా అంచనా వేయబడ్డవారు వీరే. వారెన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. తదుపరి వారికి హిజ్రత్ ద్వారా ఉపద్రవాల నుండి ఉపశమనం పొందే అవకాశం దొరికింది. అందుకే వారు తమ కుటుంబీకులను, తమ సంపదను, అల్లాహ్ ప్రసన్నత మరియు ఆయన మన్నింపుల కోసం వదులుకొని మదీనాకు వచ్చి విశ్వాసులతో కలిసి పోయారు. ఆ తర్వాత వారు అవిశ్వాసులతో జిహాద్ చేశారు మరియు సహన స్థయిర్యాలను ప్రదర్శించారు. వారి గురించే, అల్లాహ్ సెలవిచ్చిందేమిటంటే- వారి అత్యుత్తమ ఆచరణల తర్వాత అల్లాహ్ తప్పకుండా వారి పాపాలను మన్నిస్తాడు మరియు ప్రళయదినం నాడు వారిని కరుణిస్తాడు.” (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/777) 

5) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَالَّذِينَ هَاجَرُوا فِي سَبِيلِ اللَّهِ ثُمَّ قُتِلُوا أَوْ مَاتُوا لَيَرْزُقَنَّهُمُ اللَّهُ رِزْقًا حَسَنًا ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ خَيْرُ الرَّازِقِينَ

ఎవరు అల్లాహ్ మార్గంలో వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేక మరణించారో వారికి అల్లాహ్ మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత.” (హజ్ 22 : 58) 

6) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَمَن يُهَاجِرْ فِي سَبِيلِ اللَّهِ يَجِدْ فِي الْأَرْضِ مُرَاغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِن بَيْتِهِ مُهَاجِرًا إِلَى اللَّهِ وَرَسُولِهِ ثُمَّ يُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُ عَلَى اللَّهِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا

“అల్లాహ్ మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందటానికి పుడమిలో కావలసినంత స్థలాన్నీ, బ్రతుకు తెరువుకు ఎక్కువ అవకాశాలనూ పొందుతాడు. అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలస పోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించినవానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ దే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడూను.” (నిసా 4: 100) 

వ్యాఖ్యాతలు ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానించిందేమిటంటే – దీనిలో హిజ్రత్ గురించి ప్రోత్సహించడం జరిగింది. అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశ్యం రీత్యా హిజ్రత్ చేసే వ్యక్తికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే – “తన ఇల్లూ వాకిలీ వదిలిన తర్వాత శాంతియుతంగా జీవించడానికి అతనికి పుడమిలో తప్పకుండా వేరే ఆశ్రయం దొరుకుతుంది. ఒకవేళ హిజ్రత్ ప్రయాణంలోనే గనక అతనికి మరణం సంభవిస్తే అల్లాహ్ తప్పకుండా అతనికి పుణ్యఫలం నుండి దూరం గావించడు.”  (జామె అల్ బయాన్ తబరీ – 4/238) 

ఇక హిజ్రత్ మహత్యాన్ని గూర్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చిన కొన్ని హదీసులు వినండి: 

1) అమ్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం అల్లాహ్ ఆయన హృదయంలో ఇస్లాం పట్ల ప్రేమను కలుగజేసినపుడు, ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి విచ్చేసి ఇలా అడిగారు: ఓ దైవప్రవక్తా! మీ చేయిని ముందుకు చాపండి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతిని ముందుకు చాపగానే ఆయన తన చేతిని వెనక్కు లాక్కున్నారు. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కారణం అడగ్గా, ఆయన – నేను ప్రమాణం చేసే ముందు ఒక షరతు పెట్టాలను కొంటున్నాను. అదేమిటంటే – అల్లాహ్ నా పాపాలను క్షమించాలి అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ నీకు తెలియదా? ఇస్లాం స్వీకారం గత పాపాలను సమాప్తం చేస్తుంది, హిజ్రత్ గత పొరపాట్లను తుడిచివేస్తుంది మరియు హజ్ గత లోటుపాట్లను క్షమించివేస్తుంది. (సహీ ముస్లిం: 121) 

2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూ ఫాతిమా (రదియల్లాహు  అన్హు)కు ఇలా ఉద్భోదించారు: “నీవు హిజ్రత్ తప్పకుండా చేయి, ఎందుకంటే (పుణ్యఫలం రీత్యా) దానికి సమానమైన ఆచరణ ఏదియూ లేదు”. (నసాయి, సహీ ఉల్రామె – అల్బానీ : 4045, అస్సహీహ : 1937) 

3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం: “నన్ను విశ్వసించి, ఇస్లాం స్వీకరించి, తదుపరి హిజ్రత్ చేసిన వ్యక్తికి స్వర్గంలో అధమ స్థాయిలో, మధ్యస్థాయిలో మరియు ఉన్నత స్థాయిలో ఒక గృహాన్ని గూర్చిన గ్యారంటీ నేను ఇస్తాను.” (నసాయి, సహీ ఉల్ జామె : 1465) 

4) అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం, ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో – నా అనుచర సమాజంలో అందరికన్నా ముందుగా స్వర్గంలోకి వెళ్ళే వ్యక్తులెవరో నీకు తెలుసా? అని అడిగారు. దీనిపై ఆయన అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకూ బాగా తెలుసు అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ ఇలా అన్నారు: వారు ముహాజిర్లు అయి వుంటారు. ప్రళయం రోజు వారు స్వర్గ ద్వారాల వద్ద కొచ్చి వాటిని తెరవమని విజ్ఞప్తి చేస్తారు. స్వర్గ సంరక్షణ దూతలు వారితో – మీ కర్మల విచారణ పూర్తయ్యిందా? అని అడుగుతారు. 

వారు జవాబిస్తూ – మా ఆచరణల్లో దేనిని గూర్చి విచారణ జరుగుతుంది? “మేము జీవితాంతం ఖడ్గాలను భుజాలపై మోస్తూ అల్లాహ్ మార్గంలో శ్రమించేవారం. ఈ స్థితిలోనే మాకు మరణం సంభవించింది” అని వారు జవాబిస్తారు. తదుపరి వారి కోసం స్వర్గ ద్వారం తెరువబడుతుంది మరియు ఇతరులు స్వర్గంలోకి ప్రవేశించడానికి 40 సంవత్సరాల ముందే వారు దానిలోకి ప్రవేశించి, మధ్యాహ్నం కునుకును (సయితం) ఆస్వాదిస్తారు. (హాకిమ్: 2/ 70, సహీ -బుఖారీ, ముస్లిం షరతులతో మరియు ఫికహ్ జహబీ)  

5) జాబిర్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం తుఫైల్ బిన్ అమ్ర్ అద్దాసీ (రదియల్లాహు  అన్హు) ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి ఆయనతో దౌస్ తెగవారి పటిష్ఠ కోటలోకి ఆయన (దైవప్రవక్త) సంరక్షణ నిమిత్తం వేంచేయమని విన్నవించుకున్నారు. కానీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విన్నపాన్ని తిరస్కరించారు. ఎందుకంటే ఈ గౌరవం మదీనా అన్సారులకు దక్కాల్సి వుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్రత్ చేసి మదీనాకు రాగా, తుఫైల్ బిన్ అమ్ర్ అద్దాసీ కూడా తన తెగకు చెందిన ఒక వ్యక్తితో కలిసి హిజ్రత్ చేసి మదీనాకు విచ్చేశారు. కానీ, మదీనా వాతావరణం వారికి సరిపోలేదు. తుఫైల్ (రదియల్లాహు  అన్హు) సహచరుడు అనారోగ్యానికి గురై తీవ్ర విచారానికి లోనయ్యాడు. ఓ రోజు అకస్మాత్తుగా అతను పదునుగా వున్న తన ఆయుధంతో వ్రేళ్ళ కొనలను కోసుకున్నాడు. దీని వల్ల అతని చేతుల నుండి రక్తం కారసాగింది. తుదకు అతనికి మృత్యువు సంభవించింది. 

ఆ తర్వాత తుఫైల్ (రదియల్లాహు  అన్హు) అతడిని ఒక రోజు కలలో చూడగా – అతడు మంచి రూపు రేఖలతో దర్శనమిచ్చాడు. కానీ, అతడి చేతులు మాత్రం కప్పబడి వున్నాయి. ఆయన, అతనితో – నీ ప్రభువు నీతో ఎలా వ్యవహరించాడు అని అడగ్గా, అతను జవాబిస్తూ – ‘దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వైపునకు హిజ్రత్ చేసిన కారణంగా అల్లాహ్ నన్ను మన్నించాడు‘ అని అన్నాడు. ఆయన తిరిగి ప్రశ్నిస్తూ మరైతే, నీ చేతులు కప్పబడి వుండడానికి కారణం ఏమిటి? అని అడిగారు, అతను జవాబిస్తూ – ‘స్వయంగా నీ చేతులారా చెడగొట్టుకున్న వాటిని మేము సరిచేయం’ అని నాకు చెప్పబడింది. అని అన్నారు. 

తుఫైల్ బిన్ అమ్ర్ (రదియల్లాహు  అన్హు) ఈ కలను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు ప్రస్తావించగా, ఆయన – “ఓ అల్లాహ్ ! అతని చేతులను కూడా మన్నించు” అని ప్రార్థించారు. (సహీ ముస్లిం – కితాబుల్ ఈమాన్ : 116) 

6) అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

బీద ముహాజిర్లు, ధనిక ముహాజిర్ల కన్నా 500 సంవత్సరాలు ముందుగా స్వర్గంలో ప్రవేశిస్తారు.” 
(ఇబ్నెమాజా : 4123, సహీ ఇబ్నె మాజా – అల్బానీ : 3327) 

7) అబ్దుల్లా బిన్ అమ్ర్  బిన్ ఆస్ (రదియల్లాహు  అన్హు) కథనం: ఓ రోజు మేమంతా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధిలో కూర్చొని వున్నాం. ఈ లోగా సూర్యోదయమయ్యింది. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: ప్రళయం రోజు నా అనుచర సమాజంలోని కొందరు సూర్యకాంతి లాంటి తేజస్సుతో వస్తారు. మేము ఓ దైవప్రవక్తా! వారెవరై వుంటారు? అని అడిగాము. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ‘బీద ముహాజిర్లు‘ అని అన్నారు. (అహ్మద్ : 2/177, 6609, అహ్మద్ షాకిర్ సహీ పరంపరతో) 

ప్రియ శ్రోతలారా! 

ఇంతవరకూ మీరు, హిజ్రత్ మహత్యం గురించి దివ్య ఖుర్ఆన్ ఆయతులు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులు విన్నారు. వీటిద్వారా, అల్లాహ్ దృష్టిలో హిజ్రత్ కు  గల గౌరవాన్నత్యాలు, ప్రాముఖ్యత మరియు ఇస్లాంలో దానికి గల స్థానం గురించి మీకు తెలిసిపోయి వుంటుంది. 

హిజ్రత్ ప్రళయం వరకు మిగిలి వుంది 

హిజ్రత్ ఆదేశం మక్కా విజయం తర్వాత సమాప్తం కాలేదు. పైగా ఇది ప్రళయం వరకు మిగిలి వుంది మరియు జరుగుతూ ఉంటుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

పశ్చాత్తాప ద్వారం మూసి వేయబడనంత వరకు హిజ్రత్ సమాప్తం కాదు. సూర్యుడు పడమర నుంచి ఉదయించనంత వరకు పశ్చాత్తాప ద్వారం మూయబడదు”. (ముస్నద్ అహ్మద్ : 4/99, అబూదావూద్ : 2479, సహీ అబూదావూద్ : 2166) 

ఇక, “మక్కా విజయం తర్వాత హిజ్రత్ లేదు” అన్న హదీసు విషయానికొస్తే – దాని అసలు ఉద్దేశ్యమేమిటంటే – మక్కా జయించబడ్డ తర్వాత మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేయడంలో అర్థం వుండదు. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (మక్కా విజయం) తర్వాత హిజ్రత్న వారించారు. అంతేగాని, దీని ద్వారా హిజ్రత్ సంపూర్ణంగా సమాప్తమయ్యింది. అని అనుకోవడం పొరపాటు. 

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) దీనికి గల మరో కారణాన్ని వివరిస్తూ ఇలా పేర్కొన్నారు: మక్కా విజయానికి పూర్వం హిజ్రత్ కు  గల విశిష్టత మరియు ఏ విధంగానయితే ముస్లిములు దౌర్జన్యాన్ని సహించి, కడు దీనావస్థలో హిజ్రత్ చేశారో ఆ విశిష్టత మక్కా విజయం తర్వాత సమాప్తమయ్యింది. ఎందుకంటే మక్కా విజయం తర్వాత ఇస్లాం ప్రాబల్యం వహించింది మరియు ముస్లిములు కూడా పటిష్టంగా, బలాఢ్యులుగా మారిపోయారు. మక్కా విజయానికి పూర్వం మాత్రం వారు పీడితులుగానూ, అత్యంత బలహీనులు గానూ వుండేవారు. అందుకే ఆ ప్రత్యేక విశిష్టత కలిగిన హిజ్రత్ మాత్రం మక్కా విజయం తర్వాత సమాప్తమయ్యింది. అంతేగాని, ఆదేశం రీత్యా, హిజ్రత్ ఆదేశం మిగిలివుంది మరియు ప్రళయం వరకూ వుంటుంది. (షరహ్ సహీ ముస్లిం : 13/8) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవితంలో హిజ్రత్ 

ఇస్లాం ప్రారంభ దశలో, ఇస్లాం స్వీకరించిన సహాబాలను మక్కావాసులు ఎంతో హింసించారు, పలు విధాలుగా శిక్షించారు. శిక్షలు కూడా ఎంత తీవ్ర స్థాయిలో వుండేవంటే వాటిని గుర్తుకు తెచ్చుకుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి మరియు హృదయం కంపిస్తుంది. 

ముస్లిములు బలహీనులుగా వుండగా, అవిశ్వాసులు మాత్రం బలాఢ్యులుగా వున్నారు. బలహీన ముస్లిములు ఇస్లాం కోసం అన్నింటినీ సహించేవారు. చివరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి హిజ్రత్ చేసే అనుమతి ఇచ్చారు. ఇలా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవితంలోనే మూడు హిజ్రత్ సంఘటనలు సంభవించాయి. 

1) అబిసీనియా వైపునకు మొదటి హిజ్రత్.  ఇది దైవదౌత్యపు 5వ సంవత్సరంలో జరిగింది. 12 మంది పురుషులు, 4 గురు స్త్రీలు కాలినడకన సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. అక్కణ్ణుండి ఓ పడవను అద్దెకు తీసుకొని అబిసీనియాకు ప్రయాణమయ్యారు. అక్కడ వారిని ప్రత్యేక అతిథులుగా వుంచడం జరిగింది. (ఫతహుల్ బారీ : 7/188) 

2) అబిసీనియా వైపునకు రెండవ హిజ్రత్ : మొదటిసారి అబిసీనియాకు హిజ్రత్ చేసిన వారికి మక్కావాసులు ఇస్లాం స్వీకరించారు అన్న వార్త అందింది. దీంతో వారిలో చాలా మంది మక్కాకు తిరిగి వచ్చారు. కానీ, అక్కడికొచ్చాక, ఆ వార్త నిజం కాదని వారికి తెలిసింది. అందుకే వారు మరియు వారితోపాటు ఇంకా ఎంతో మంది ముస్లిములు కలిసి మళ్ళీ అబిసీనియాకు తిరిగి హిజ్రత్ చేశారు. వీరి సంఖ్య 80 కన్నా ఎక్కువగానే ఉంది. (ఫతహుల్బారీ : 7/189) 

3) మదీనాకు హిజ్రత్ : మదీనా ప్రస్థానానికి సంబంధించిన సంఘటనలు ఎలాగైతే సంభవించాయో వాటి వరుస క్రమం ఇలా ఉంది: 

ఉఖ్బా ప్రదేశంలో మదీనా వాసుల మొదటి ప్రమాణం 

హజ్ సమయాల్లో మక్కా పట్టణానికి తరలి వచ్చే వేర్వేరు తెగల వారితో కలిసి, వారిని ఇస్లాం వైపునకు పిలవడం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలవాటు. 

ఇలా దైవదౌత్యపు 11వ సంవత్సరంలో హజ్ సమయంలో యస్రిబ్ (మదీనా) వాసులలో 6 గురు ఇస్లాం స్వీకరించారు. తదుపరి, వీరు యస్రిబ్ తిరిగొచ్చాక అక్కడి వారికి ఇస్లాంను పరిచయం చేసి, దాని ప్రత్యేకతలను గూర్చి వివరించారు. దీని ఫలితంగా, మరుసటి సంవత్సరం – అంటే, దైవ దౌత్యపు 12వ సంవత్సరంలో మదీనా నుండి 12 మంది మక్కాకు వచ్చి, మినా లోని ఉఖ్బా ప్రదేశంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతులపై ప్రమాణం చేశారు. 

ఈ ప్రమాణం గురించి ఈ 12 మందిలోనే ఒకరైన ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు  అన్హు) ఇలా వివరించారు: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “రండి! వచ్చి (నా చేతుల మీదుగా) ఇలా ప్రమాణం చెయ్యండి! అల్లాహ్ తో పాటు మరెవ్వరినీ (ఆయనకు) భాగస్వాములుగా చెయ్యము, దొంగతనం, వ్యభిచారానికి పాల్పడము, సంతానాన్ని హతమార్చము. (అమాయకులపై) నిందారోపణలు చేయము మరియు మంచికి సంబంధించిన కార్యాలలో దైవప్రవక్తకు అవిధేయత చూపము. మీలో ఎవరైనా ఈ షరతులకనుగుణంగా ఆచరిస్తే అతనికి ప్రతిఫలం అల్లాహ్ వద్ద వుంది. ఇక ఎవరైనా ఈ షరతులలో దేనినైనా ఉల్లంఘించడం మూలంగా అతనికి గనక ఈ లోకంలోనే శిక్షపడితే, అది అతని పాలిట పాప పరిహారమవుతుంది. కానీ, ఒకవేళ (అల్లాహ్) అతని తప్పులను కప్పిపుచ్చితే, అతని వ్యవహారం ప్రళయం నాడు అల్లాహ్ వద్ద వుంటుంది. తను తలచుకుంటే అతణ్ణి శిక్షించనూ వచ్చు లేదా అతణ్ణి క్షమించనూవచ్చు.” 

తదుపరి మేమంతా ఆయన వద్ద ప్రమాణం చేశాము. ఈ ప్రమాణం తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 12 మందితో పాటు ముసైబ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు  అన్హు) ను కూడా (ధర్మ ప్రచార నిమిత్తం) మదీనా పంపారు. ఆయనే ఇస్లాం యొక్క మొట్ట మొదటి సందేశప్రదాత, ఆయన మదీనా పట్టణానికి చేరుకున్న తర్వాత ఉస్అద్ బిన్ జరార (రదియల్లాహు  అన్హు) తో కలిసి ఉత్తమ రీతిలో ఇస్లాం సందేశాన్ని ప్రచారం చేయసాగారు. దీని పర్యవసానంగా చాలా మంది ఇస్లాం స్వీకరించసాగారు. ఆఖరికి, మదీనాలో, ఒక్క ముస్లిం కూడా లేని ఒక్క ఇల్లు కూడా మిగల్లేదు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఇస్లాం స్వీకరించారు. 

వీరి ప్రచారానికి సంబంధించి చారిత్రక గ్రంథాలలో నిక్షిప్తమై వున్న అత్యంత ఆసక్తికరమైన సంఘటన – సాద్ బిన్ ముఆజ్, ఉసైద్ బిన్ హుజైర్ మరియు ఆయన మొత్తం తెగ బనీ (అబ్దుష్షహల్) ఇస్లాం స్వీకరించడం. 

ముసైబ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు  అన్హు) దాదాపు 1 సంవత్సరం వరకు మదీనాలో వుండి, నిరంతరం ఇస్లాం ప్రచారం చేయసాగారు. తదుపరి, దైవదౌత్యపు 13వ సంవత్సరంలో హజ్ కాలానికి ముందుగా, మక్కాకు తిరిగి వచ్చి, మదీనా వాసుల ఇస్లాం స్వీకారానికి సంబంధించిన శుభవార్తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు తెలియజేశారు. 

చివరికి ఆయన, ఉహద్ యుద్ధంలో వీరమరణం పొందారు. సహాబాల కథనం ప్రకారం ఆయనను ఖననం చేసే సమయంలో ఆయన శరీరాన్ని కప్పడానికి ఒక చిన్న దుప్పటి మాత్రమే వుంది. దానితో ఆయన తలను కప్పితే కాళ్ళు బహిర్గతం కాసాగాయి మరియు కాళ్ళను కప్పితే తల కనబడ సాగింది. దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అతని తలను దుప్పటితో  కప్పి, కాళ్ళను గడ్డితో కప్పి ఖననం చేయండి’ అని ఆదేశించారు. (సహీ బుఖారీ : 1276, ముస్లిం : 940) 

ఉఖ్బా ప్రదేశంలో మదీనా వాసులు రెండవ ప్రమాణం 

దైవదౌత్యపు 13 సంవత్సరంలో, హజ్ కాలంలో, మదీనా వాసులలో దాదాపు 70కు పైగా ముస్లిములు హజ్ యాత్ర నిమిత్తం మక్కా విచ్చేశారు. వారి అంతర్యాలలో ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ వుంది. అదేమిటంటే – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా మక్కాలో ఎప్పటి వరకు కష్టాలకు గురి 

కావాలి? అందుకే, వారికి మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు మధ్య రహస్యంగా ‘ఖుర్బానీ దినాలలో, ఉఖ్బా ప్రదేశంలో సమావేశమవుదాం’ అని ఒప్పందం కుదిరింది. తదనుగుణంగా, మదీనా వాసులలో 73 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు రాత్రి చీకట్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో సమావేశమయ్యారు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు ఆయన బాబాయి అబ్బాస్ బిన్ ముత్తలిబ్ కూడా వున్నారు. ఆయన అప్పటి వరకు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అందరికన్నా ముందుగా ఆయనే మాట్లాడడం ప్రారంభించారు. 

ఓ ఖుజురుజ్ సమూహమా! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి ఏమిటో మీకంతా తెలుసు. మేమెలా ఆయన్ను కాపాడుతున్నామో అది కూడా మీకు తెలుసు. ఆయన, తన జాతిలో గౌరవంగానూ మరియు తన పట్టణంలో అత్యంత సురక్షితంగానూ వున్నారు. కానీ, మీ దగ్గరికి రావాలని ఆయన కోరిక. అందుకే మీరు ఆయన్ను కాపాడుకోగలిగితే మంచిది. మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి వుంటుంది. ఒకవేళ మీరు ఆయన్ను అగౌరవంపాలు చేయాలనుకొంటే, ఆయన్ను ఇక్కడే వదిలేయండి. కారణం, ఆయన తన జాతిలో ఇప్పటికీ సురక్షితంగా వున్నారు. 

దీనిపై స్పందిస్తూ, కాబ్ (రదియల్లాహు  అన్హు) అత్యంత దృఢ నిశ్చయంతో ఇలా పలికారు: మేము మీ సంభాషణను విన్నాము. ఓ దైవప్రవక్తా! ఇక మీరే స్వయంగా నిర్ణయం తీసుకోండి. ఆయన మాటలు – మదీనావాసులు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి తమ బాధ్యతను నిర్వర్తించడానికి పూర్తిగా కృత నిశ్చయంతో వున్నారు అని తెలియజేస్తున్నాయి. తదుపరి, వారంత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేతులపై ప్రమాణం చేశారు. ప్రమాణానికి సంబంధించిన విషయాలను గూర్చి ముస్నద్ అహ్మద్ జాబిర్ (రదియల్లాహు  అన్హు) ఉల్లేఖనం ప్రకారం సహాబాలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – ఓ దైవప్రవక్తా! ఏ విషయాలపై మేము మీతో ప్రమాణం చేయాలని అడగ్గా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా బదులిచ్చారు: 

మీరు ఈ విషయాల్లో (నాతో) ప్రమాణం చేయండి: 

1) చలాకీగా వున్నప్పుడు, సోమరితనం ఆవరించినప్పుడు ఈ రెండు పరిస్థితులలో కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట వినాలి మరియు ఆయనకు విధేయత చూపాలి. 
2) ధనవంతులుగా వున్నా, కటిక బీదరికంలో వున్నా – ఈ రెండు పరిస్థితుల్లోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టాలి. 
3) మంచిని బోధించాలి, చెడు నుండి నిరోధించాలి.
4) అల్లాహ్ కోసం (ఎల్లప్పుడూ) సర్వసన్నద్ధులై వుండాలి మరియు ఈ విషయంలో ఎగతాళి చేసే వారెవరినీ లెక్క చేయకూడదు. 
5) నేను మీ దగ్గరకు వచ్చినపుడు మీరు నాకు సహాయపడాలి మరియు మీ భార్యా పిల్లలను సంరక్షించుకొనే విధంగా నన్ను కాపాడాలి. బాగా గుర్తుంచుకోండి! దీని ప్రతిఫలం మీ కొరకు స్వర్గం. 

(ముస్నద్ అహ్మద్ : 3/339 (14694), సహీ ఇబ్నె హిబ్బాన్: 15/745, హాకిమ్ : 2/681 (4251) 

ఆ తర్వాత ముస్లిములంతా ఒక్కొక్కరూ ప్రమాణం చేశారు. తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిలోని 12 మందిని, ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికిగాను, నాయకులుగా నియమించారు. 

హిజ్రత్ ఆరంభము 

ఉఖ్బా ప్రదేశంలో యస్రిబ్ (మదీనా) వాసుల రెండవ ప్రమాణం తర్వాత ముస్లిములు మదీనా ప్రస్థానం చేయడానికి మార్గం సుగమమైంది. ఎందుకంటే, యస్రిబ్ వాసులు ఇస్లాం ధర్మం నిమిత్తం తమ ధన ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమేనని ప్రమాణం చేసి వున్నారు మరియు దౌర్జన్యానికి గురై వున్న దైవప్రవక్త సహాబాలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యతను కూడా తమ భుజస్కందాల పై వేసుకొని వున్నారు. 

మక్కాలోని బాధిత ముస్లిం ప్రజానీకానికి ఒక శాంతీయుత ఇస్లామీయ ప్రదేశం గోచరించసాగింది. కానీ, అక్కడి వరకు చేరడం అంత సులువు కాదు. కారణం, మక్కా బహుదైవారాధకులు- ముస్లిములకు మక్కా వదిలి వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ మాత్రం ముస్లిములను దౌర్జన్యం నుండి కాపాడి ఇస్లాంను ప్రాబల్యం వహించేలా చేయడానికి నిశ్చయించుకున్నాడు. చివరికి, అల్లాహ్ నిర్ణయించినట్లుగానే అయ్యింది. ముస్లిములు హిజ్రత్ చేయడం ప్రారంభించారు. తమ పూర్వీకుల ప్రదేశం, కుటుంబీకులు, సంపద, ఇల్లూ వాకిలి – అన్నింటినీ వదిలి మదీనాకు బయలుదేశారు. ముష్రిక్కులు, వారి మార్గంలో ఎన్నో రకాల ఆటంకాలను సృష్టించారు. అయినప్పటికీ, ముస్లిములు, ఎంతో ఓర్పుగా వాటిని ఎదుర్కొని ఒకరి తర్వాత మరొకరు హిజ్రత్ చేయసాగారు. 

తత్ఫలితంగా, ఉఖ్బా ప్రమాణం జరిగిన కొంత కాలానికే మక్కా పట్టణం ముస్లిములు లేకుండా ఖాళీ అయిపోయింది. కేవలం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) మరియు ఆయన కుటుంబ సభ్యులు మరియు అలీ (రదియల్లాహు  అన్హు)  మాత్రమే మక్కాలో వున్నారు. అలాగే ముష్రిక్కులు బలవంతంగా ఆపి వుంచిన ముస్లిములు కూడా అక్కడే వుండిపోయారు. (జాదుల్ మిఆద్ : 2/52) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా హిజ్రత్ కొరకు సిద్ధంగా వున్నరు. కానీ, అల్లాహ్ అనుమతి కొరకు ఎదురు చూడసాగారు. ఆయెషా (రదియల్లాహు  అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిములతో ఇలా సెలవిచ్చారు: మీరు హిజ్రత్ చేయాల్సిన పట్టణాన్ని నాకు కలలో చూపించడం జరిగింది. దానిలో ఖర్జూరపు చెట్లు అధికంగా వున్నాయి. అది, రెండు నల్లటి రాతి ప్రదేశాల మధ్య వుంది. అందుకే, ముస్లిములలో అధికమంది మదీనాకు హిజ్రత్ చేశారు. చివరికి, అబిసీనియా వైపుకు హిజ్రత్ చేసిన ముస్లిములు కూడా తిరిగి మదీనాకు ప్రస్థానం గావించారు. అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) కూడా మదీనా ప్రస్థానానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో – ‘కొంచెం ఆగు, నాక్కూడా (హిజ్రత్ చేయడానికి) అనుమతి లభించవచ్చు’ అని అన్నారు. దీనిపై అబూ బుక్ర్  – నా తల్లిదండ్రులు మీకు సమర్పితం అవుగాక! ఇలా అని మీరు ఆశిస్తున్నారా? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవునని బదులిచ్చారు. అందుకే అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి హిజ్రత్ చేయడానికి అక్కడే ఆగిపోయారు. ఆయన రెండు వాహనాలను ప్రయాణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు. (బుఖారీ: 2175, 3692, 5470) 

జాదుల్ నద్వా యందు ఖురైషీయుల పార్లమెంటు సమావేశం 

ముస్లిములంతా, ఒక్కొక్కరుగా, మక్కాపట్టణాన్ని వదిలి మదీనాకు ప్రస్థానం గావించడం చూసి ముష్రిక్కులు తీవ్రంగా కలత చెందారు. ఎందుకంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతటి శ్రేష్టమైన వ్యక్తో మరియు ఆయన సహచరులు ఎంతటి సహన స్థయిర్యాలు కలవారో, ఆయన ఒక్క సైగపై వారంతా ఎలా తమ సర్వస్వాన్ని ధారపోయగలరో వారికి (ముష్రిక్కులకు) బాగా తెలిసి వుంది. అంతేగాక, భౌగోళికంగా మదీనా పట్టణానికి గల ప్రాధాన్యత కూడా వారికి తెలిసి వుంది. మదీనా వారి వ్యాపార మార్గ మధ్యలో వుండేది. ఒకవేళ మదీనా గనక ముస్లిముల కేంద్రంగా మారితే, వారి వ్యాపార బృందాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తాయని భయపడసాగారు. 

అందుకే, వీటన్నింటిని గూర్చి చర్చించడానికి ముష్రిక్కులు (జాదుల్ నద్వా యందు) ఒక చారిత్రాత్మక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో ఖురైషీయుల అన్ని తెగల నాయకులు పాల్గొని, ఈ పరిస్థితులను అధిగమించడం ఎలా? అన్న దానిపై చర్చించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో అబూ జహల్, జుబైర్ బిన్ మతామ్, ఉత్బా, షైబా, అబుల్ జఖరీ మరియు ఉమయ్యా బిన్ ఖలఫ్ లు ముఖ్యులు. ఈ సమావేశ కార్యక్రమం ఆరంభం కావడానికి ముందే ఇబ్లీస్ ఒక ముసలి నాయకుడి వేషంలో దారుల్ నద్వా ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఖురెష్ సర్దారులు అతనితో – నీవెవరవు? అని అడిగారు. అతను జవాబిస్తూ – నేను నజద్వాసుల్లో ఒక నాయకుణ్ణి. మీరొక ముఖ్యమైన విషయ నిమిత్తం సమావేశమవుతున్నారని నాకు తెలిసింది. అందుకే నేను కూడా దీనిలో పాల్గొని ఏదైనా ముఖ్యమయిన సలహా మీకు ఇవ్వగలనేమో అని భావించాను అని అన్నాడు. వారతనికి అనుమతి ఇవ్వగా అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. సమావేశ కార్యక్రమం ఆరంభమైంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన అనుయాయులకు వ్యతిరేకంగా పన్నాల్సిన వివిధ వ్యూహాలను గూర్చి చర్చించడం జరిగింది. 

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నగర బహిష్కరణకు గురి చేయడం అనే వ్యూహం చర్చకు వచ్చింది. నజదీ నాయకుడు (ఇబ్లీస్) దీనిని తిరస్కరించాడు. తదుపరి, రెండవ వ్యూహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాళ్ళు చేతులు కట్టేసి, గదిలో (బందీగా) వుంచి తను మరణించే వరకు వేచి చూడాలి అన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఇబ్లీస్ దీనిని గూడా తిరస్కరించాడు. చివరికి, అందరికన్నా దుర్మార్గుడైన అబూ జహల్ సమర్పించిన వ్యూహంతో, ఇబ్లీస్తో సహా అందరూ ఏకీభవించారు. అతను తన వ్యూహాన్ని గూర్చి చెబుతూ ఇలా పలికాడు: నా అభిప్రాయమేమిటంటే – మనం ప్రతి తెగ నుండి ఒక బలాఢ్యుడైన యువకుణ్ణి ఎన్నుకొందాం. వారందరికీ ఒక్కొక్క కరవాలాన్ని అప్పగిద్దాం. వారందరూ కలిసి అతని (దైవప్రవక్త) వద్దకు వెళ్ళి, ఒక్క ప్రయత్నంలోనే అతణ్ణి అంతమొందించాలి. ఇలా, అతని బారి నుండి మనం బయట పడవచ్చు. హత్యాపరాధం అన్ని తెగలకూ వ్యాపిస్తుంది. మరియు అబ్దుమునాఫ్ సంతతి అన్ని తెగలతో యుద్ధం చేయలేక రక్తం పరిహారం కోసం తయారవుతారు. మన మందరం కలిసి దాన్ని చెల్లించేద్దాం. నజదీ నాయకుడు (ఇబ్లీస్) కూడా ఈ వ్యూహాన్ని ఎంతో ప్రశంసించాడు. పార్లమెంటులోని మిగిలిన ప్రతినిధులంతా ఈ వ్యూహంపై తమ ఆమోద ముద్ర వేసి, దీనిని వెంటనే అమలు చేయాల్సిందిగా నిర్ణయించి, సమావేశాన్ని ముగించారు. (సీరత్ ఇబ్నె హిషామ్: 1/480-482)  

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్రత్ 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను హతమార్చాలన్న కుతంత్రము రూపుదిద్దుకున్న తర్వాత జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త వద్దకు విచ్చేసి, ఈ విషయాన్ని తెలియజేసి, అల్లాహ్ మీకు హిజ్రత్ చేయడానికి అనుమతించాడు. అందుకే ఈ రోజు రాత్రి మీరు, మీ పడకపై పడుకోవద్దు అని హెచ్చరించారు. (జాదుల్ మిఆద్ : 2/52) 

తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూబక్ర్ (రదియల్లాహు  అన్హు) ఇంటికెళ్ళి, అక్కడే తన హిజ్రత్ కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు. అయేషా (రదియల్లాహు  అన్హు) కథనం: మేము మధ్యాహ్నం పూట అబూబక్ర్ ఇంట్లో వున్నాం. అకస్మాత్తుగా ఒకరు అబూబక్ర్ – చూడండి! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుప్పటి కప్పుకొని వస్తున్నారు అని అన్నారు. సాధారణంగా, ఇంతకు ముందెప్పుడూ, దైవప్రవక్త ఈ సమయంలో మా దగ్గరికి రాలేదు. దీనిపై అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) – నా తల్లిదండ్రులు మీకై సమర్పితంగాను! మీరు తప్పకుండా ఏదో అత్యవసర పని మీదే, ఈ సమయంలో విచ్చేసి వుండాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికొచ్చి, ఇంట్లో ప్రవేశానికి అనుమతి అడగ్గా, అబూబక్ర్ అనుమతి ఇచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లోపలి కొచ్చి అబూ బక్ర్ – మీ ఇంట్లో వున్న ఇతర వ్యక్తులను వేరే గదిలోకి పంపించి వేయండి అని అన్నారు. అబూ బక్ర్ నా తల్లిదండ్రులు మీకై సమర్పితం ఓ దైవప్రవక్తా! ఇక్కడున్న వారంతా మీ ఇంటి వారే అని బదులివ్వగా, దైవప్రవక్త నాకు హిజ్రత్ చేయడానికి అనుమతి ఇవ్వబడింది. అని అన్నారు. అబూ బక్ర్ – నా తల్లిదండ్రులు మీకై సమర్పితం! నేను కూడా మీతోపాటు హిజ్రత్ చేయనా? అని అడగ్గా, దైవప్రవక్త ‘అవును’ అని జవాబిచ్చారు. దీనిపై, అబూ బక్ర్ – అలాగైతే, ఈ రెండు వాహనాల్లో ఒకటి మీరు తీసుకోండి అన్నారు. దైవప్రవక్త – సరే, కాని దీని సొమ్మును నేను చెల్లిస్తాను అని జవాబిచ్చారు. ఆయేషా (రదియల్లాహు  అన్హా) కథనం : తదుపరి, మేము వెంటనే ఇద్దరి ప్రయాణ సామగ్రిని సర్ది, ఒక సంచిలో వేశాం. అస్మా బిన్తె అబూ బక్ర్, తన (నడుముకు కట్టుకున్న) వస్త్రంలోని కొంత భాగాన్ని చింపి, ఆ సంచి మూతిని మూసేసింది. అందుకే ఆమెను ‘జాతుల్ నతాభైన్’ అని అనసాగారు. (బుఖారీ: 2318, 3906) 

తర్వాత, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇంటికొచ్చి, రాత్రి కోసం వేచి చూడసాగారు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి ఘెరావ్ 

ఇటు, ఖురైషీయ దుర్మార్గులకు ఆ రోజంతా మనశ్శాంతి కరువయ్యింది. జాదుల్ నద్వ యందు తీసుకొన్న నిర్ణయాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేయసాగారు. చివరికి 11 మంది యువకులను ఎంపిక చేసారు. వారిలో అబూ జహల్, అబూ లహబ్ మరియు ఉమైయ్య బిన్ ఖలఫ్ లు కూడా వున్నారు. ఈ దుర్మార్గులంతా చీకటి పడగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటిని చట్టుముట్టి, తదుపరి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిద్రపోగానే, ఆయనను మట్టుబెడదామని నిరీక్షించసాగారు. చివరికి, అర్థరాత్రి సమయం రాగానే, నిర్ణయాత్మకమైన ఆ ఘడియ వచ్చేసింది. 

నేటి తర్వాత, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన అనుయాయుల ఉనికి ఇక ఏ మాత్రం మిగిలి వుండదని ఆ దుర్మార్గులు దృఢ నిశ్చయంతో వున్నారు. కానీ, భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి మరియు తాను అనుకున్నది చేయగల సామర్థ్యం కలిగి వున్న ఆ అల్లాహ్ పై ఏ శక్తీ ప్రాబల్యం వహించలేదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 وَإِذْ يَمْكُرُ بِكَ الَّذِينَ كَفَرُوا لِيُثْبِتُوكَ أَوْ يَقْتُلُوكَ أَوْ يُخْرِجُوكَ ۚ وَيَمْكُرُونَ وَيَمْكُرُ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ

ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ వున్నారు, నిన్ను నిర్బంధించాలని లేదా నిన్ను హత్య చెయ్యాలని లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని. వారు తమ ఎత్తులు తాము వేస్తూ వున్నారు. అల్లాహ్ తన ఎత్తు తాను వేస్తూ వున్నాడు. అల్లాహ్ అందరి కంటే బాగా ఎత్తులు వేస్తాడు.” (అన్ఫాల్ 8 : 30) 

ఈ నిర్ణయాత్మక ఘడియలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలీ బిన్ అబూ తాలిబ్ తో ‘నువ్వు నా దుప్పటి కప్పుకొని, నా పడకపై పడుకో, భయపడకు, నీకేమీ నష్టం వాటిల్లదు’ అని అన్నారు. (సీరత్ ఇబ్నె హిషామ్ :1/483) 

ఆ తర్వాత, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుండి బయటకు వచ్చారు. తన పిడికిలిలో కొంత మట్టిని తీసుకొని (నిరీక్షిస్తున్న) దుర్మార్గుల శిరస్సులపై చల్లారు. అల్లాహ్ వారి చూసే శక్తిని లాక్కున్నాడు. తద్వారా, వారు ఆయన్ను చూడలేకపోయారు, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖుర్ఆన్ లోని ఆయత్ – وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَమేము వారి ముందు ఒక గోడనూ, వారి వెనుక మరో గోడనూ నిలబెట్టాము. మేము వారిని (ఈ విధంగా) కప్పివేశాము, ఇక వారు చూడలేరు.” (యాసీన్ 36:9) ను పఠిస్తూ వారి మధ్య నుండి వెళ్ళిపోయారు. (జాదుల్ మిఆద్: 3/46) 

తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూబక్ర్ (రదియల్లాహు  అన్హు)  ఇంటికెళ్ళారు. ఆయనను అక్కణ్ణుండి వెంట తీసుకొని, సౌర్ గుహ వద్దకు చేరుకున్నారు. సౌర్ గుహ మక్కా నుండి యమన్ వైపునకు పోయే దిశలో వుంది. మదీనా వెళ్ళే దిశలో లేదు. బహుశా, దీనిలో (సౌర్ గుహ వద్దకు రావడంలో) ఇమిడి వున్న మర్మం – ఖురైషీయ తిరస్కారులకు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్రత్ గురించి తెలిస్తే, తప్పకుండా, మదీనా వెళ్ళే మార్గాలను అన్వేషిస్తారు అని కావచ్చు. అందుకే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు ప్రయాణంలోనే తన మార్గాన్ని మార్చుకున్నారు. తద్వారా, శత్రువులు ఆయనను అంత సులువుగా వెంబడించలేరు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు ) సౌర్ గుహలో 

ప్రయాణికులిరువురూ, రాత్రి చీకటిలో, అత్యంత కఠినమైన మరియు క్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించి, సౌర్ గుహ వద్దకు చేరుకున్నారు. అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గుహ బయటే వుండమని చెప్పి, స్వయంగా తనే ముందు లోపలికి ప్రవేశించి, దానిని శుభ్రం చేశారు. దానిలో ఒకవైపు రంధ్రం వుండడం చూసి, తన దుప్పటిలో కొంత భాగాన్ని చింపి, దాన్ని మూసేశారు. మరో రెండు రంధ్రాలు కనబడితే, వాటిలో తన పాదాలను వుంచి తదుపరి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను లోపలికి రమ్మని పిలిచారు. దైవప్రవక్త లోపలికి ప్రవేశించి, గుహ సహవాసి అయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు ) ఒడిలో తల వుంచి నిద్రపోయారు. ఈ తరుణంలో, అబూ బక్ర్ కాలుకు ఏదో విషప్రాణి కాటేసింది. కానీ, ఆయన మాత్రం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విశ్రాంతికి ఆటంకం కలక్కూడదని తన కాళ్ళను ఏ మాత్రం కదపలేదు. కానీ (బాధవల్ల) ఆయన కన్నీళ్ళు మాత్రం ఆగలేకపోయాయి. వాటిలో కొన్ని చుక్కలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందంపై పడ్డాయి. దీంతో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మేల్కొన్నారు. తదుపరి, అబూబక్ర్ – ఏడవడానికి కారణం అడగ్గా. ఆయన – ‘నా తల్లిదండ్రులు మీకై సమర్పితంగాను! ఏదో విషప్రాణి నన్ను కాటేసింది’ అని విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) లేచి, విషప్రాణి కాటేసిన చోట తన ఉమ్మిని పూసారు. దీనితో ఆయన నొప్పి తగ్గిపోయింది. (అర్రహీఖుల్ మఖూమ్ అరబీ: 164 పేజీ) 

ఆయెషా (రరదియల్లాహు అన్హా)  కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు)  సౌర్ కొండలో వున్న గుహ వద్దకు చేరుకున్నారు. దానిలో వారు మూడు రాత్రులు గడిపారు. రాత్రి (చీకటి పడ్డాక) వారి దగ్గరికి అబ్దుల్లా బిన్ అబూ బక్ర్ వెళ్ళేవారు. ఆయన బుద్ధి కుశలత, మంచి జ్ఞాపకశక్తి కలిగిన నవ యువకులు. రోజంతా ఖురైషీయులతో గడిపి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి వినే వార్తలన్నింటినీ గుర్తుపెట్టుకొనేవారు. చీకటి పడ్డాక సౌర్ గుహకు చేరుకొని వాటిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వినిపించేవారు. సహరీ సమయంలో (ఉషోదయానికి ముందు) మళ్లీ మక్కాకు తిరిగి వచ్చేసే వారు. ఖురైషీయులు మాత్రం ఆయన గురించి – ఈయన మక్కాలోనే రాత్రి గడిపారు అని అనుకొనేవారు. 

దీనితోపాటు, అబూబక్ర్ (రదియల్లాహు  అన్హు) బానిసైన ఆమిర్ బిన్ ఫహీరా పగలు మేకలను కాపుతూ, చీకటి పడే సమయంలో వాటిని సౌర్ గుహ వైపునకు మళ్ళించే వారు మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూ బక్ర్ కు పాలను సమర్పించేవారు. తిరిగి ఉషోదయానికి ముందే అక్కణ్ణుండి వెళ్ళిపోయేవారు. (బుఖారీ: 3906) 

ఖురైషీయులు సౌర్ గుహ ద్వారం వద్దకు 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇంటి నుండి బయలుదేరినప్పుడు, ఆయన ఇంటిని చుట్టుముట్టిన దుర్మార్గుల దగ్గర్నుండి ఒక వ్యక్తి వెళుతూ వారితో మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? అని ప్రశ్నించాడు. వారతనితో ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)’ కోసం అని అన్నారు. దీనిపై అతను – అయితే మీరు పరాభవం పాలయ్యారు మరియు నష్టానికి గురయ్యారు. అల్లాహ్ సాక్షి! ఆయన మీ మధ్య నుండి వెళ్ళిపోయారు, ఆయనే మీ శిరస్సులపై మన్నుపోసి వెళ్ళారు. దీంతో వారు తమ శిరస్సులపై వున్న మట్టిని జాడిస్తూ లేచి నిలబడి (ఇంట్లోకి తొంగి చూడగా అలీ (రదియల్లాహు  అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మంచంపై పడుకొని వున్నారు. వారంతా ఉషోదయం వరకు నిరీక్షించారు. చివరికి అలీ (రదియల్లాహు  అన్హు) మేల్కొన్నారు. ఆ దుర్మార్గులు ఆయనతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి అడిగారు. ఆయన ‘నాకేమీ తెలియదు’ అని జవాబిచ్చారు. దీంతో వారంతా అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) ఇంటికెళ్ళి తలుపు తట్టారు. అస్మా బిన్తె అబూ బక్ర్ (రరదియల్లాహు అన్హా) తలుపు తెచిచారు. దుర్మార్గులు ఆమెతో అబూ బక్ర్ గురించి అడిగారు. ఆమె ఆయన గురించి ‘నాకేమీ తెలియదు’ అని వారికి జవాబిచ్చారు. దీనితో దుర్మారుడైన అబూ జహల్ (కోపంతో) ఆమె చెంపపై కొట్టగా, ఆమె చెవులకు ధరించిన ఆభరణం క్రింద పడింది. (ఇబ్నె హిషామ్ : 1/487) 

దీని తర్వాత ఖురైషీయులు త్వరత్వరగా మక్కా నుండి బయటకు వెళ్ళే మార్గాలపై తమ నిఘా ను పెంచేశారు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను సజీవంగా లేక మరణించిన స్థితిలో పట్టి తెచ్చిన వారికి వంద ఒంటెల పెద్ద బహుమానాన్ని ప్రకటించారు. (బుఖారీ: 1/554) 

తదనుగుణంగా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు)లను కొండలలో, లోయలలో, గుహల్లో మరియు వీధుల్లో అత్యంత వేగంగా వెతకడం ఆరంభమైంది. వారిని వెతికే నిమిత్తం ప్రజలు గుర్రాలపై, ఒంటెలపై, చివరికి కాలినడకన నడుస్తూ అప్రమత్త మయ్యారు. 

అటూ ఇటూ అన్వేషిస్తూ చివరికి వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ లు దాగివున్న గుహ ద్వారం వద్దకు వచ్చేశారు. అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: గుహలో నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద కూర్చొని వున్నాను. నేను తల పైకెత్తి చూడగానే అన్వేషకుల పాదాలు కనిపించసాగాయి. “ఓ దైవ ప్రవక్తా! ఒకవేళ వీరిలో ఎవరైనా తన దృష్టిని క్రిందికి సారిస్తే తప్పకుండా మనల్ని చూడగలుగుతారు” అని నేను అన్నాను. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- ఓ అబూబక్ర్! మూడవ వాడుగా వారి మధ్య అల్లాహ్ వున్న ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అని అన్నారు. 

నిశ్చయంగా ఇది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గావించిన ఒక అద్భుతం. శత్రువులు ఆయనకు కొద్ది అడుగుల దూరం వరకు వచ్చి కూడా ఆయనకేమీ నష్టం కలిగించలేక పోయారు మరియు నిరాశా నిస్పృహలతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا ۖ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَيْهِ وَأَيَّدَهُ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ الَّذِينَ كَفَرُوا السُّفْلَىٰ ۗ وَكَلِمَةُ اللَّهِ هِيَ الْعُلْيَا ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ

“అవిశ్వాసులు అతనిని బహిష్కరించినపుడూ, అతను కేవలం ఇద్దరిలో రెండోవాడుగా ఉన్నప్పుడూ, వారిద్దరూ గుహలో ఉన్నప్పుడూ, అతడు తన స్నేహితునితో, ‘విచారపడకు, అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు’ అని అన్నప్పుడూ అల్లాహ్ అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో అల్లాహ్ అతనిపై తన తరఫునుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు. అల్లాహ్ మాట సర్వదా సర్వోత్కృష్టమైనదే! అల్లాహ్ మహాశక్తి సంపన్నుడూ, మహావివేకవంతుడూనూ.” (తౌబా 9 : 40) 

మదీనా మార్గంలో 

మక్కాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) లను వెతికే కార్యక్రమం కాస్త చల్లబడడంతో, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మిత్రునితో కలిసి మదీనా వైపునకు వెళ్ళడానికి పూనుకొన్నారు. ఆ ప్రదేశంలోని మార్గాల గురించి బాగా తెలిసి వున్న అబ్దుల్లా బిన్ అరీఖా అల్లెసి – అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) ద్వారా (ప్రయాణానికి) సిద్ధం చేసి వుంచబడ్డ రెండు ఒంటెలను తీసుకొని, మదీనా ప్రయాణం ఆరంభమయ్యే సౌర్ గుహ వద్దకు రావాలని ముందుగానే నిర్ణయించబడింది. తదనుగుణంగా అతను మూడు రాత్రుల తర్వాత సౌర్ గుహకు చేరుకున్నాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు), ఆయన బానిస ఆమిర్ బిన్ ఫహీరా మరియు వీరికి దారి చూపే అబ్దుల్లా బిన్ అరీఖా లతో కూడిన సమూహము మదీనాకు ప్రయాణమైంది. ఈ ప్రయాణపు విశేషాలు సహీ బుఖారీలో ఉల్లేఖించబడ్డాయి. 

అనస్ (రదియల్లాహు  అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా వైపునకు బయలుదేరారు. ఆయన తన వాహనంపై తన వెనుక అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) ను కూర్చోబెట్టుకుని వున్నారు. అబూ బక్ర్ ముసలివారు మరియు తేలిగ్గా గుర్తించబడేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (కొంచెం తక్కువ వయస్సు వారైనందువల్ల) యువకులుగా కనబడుతూ అంత తేలిగ్గా గుర్తించబడకుండా వున్నారు. (అందుకే) మార్గ మధ్యంలో ఎవరైనా తారసపడితే – ఓ అబూ బక్ర్! మీ ముందు కూర్చున్న ఈ వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించేవారు. అబూ బక్ర్ జవాబిస్తూ – ‘ఈయన నాకు మార్గం చూపుతారు’ అని పలికేవారు. 

వినేవారు ఈయన బహుశా ప్రయాణానికి సంబంధించిన మార్గం చూపుతారు కాబోలు అని అనుకొనేవారు. కానీ, అబూ బక్ర్ ఉద్దేశ్యం ఈయన మంచి వైపునకు మార్గం చూపేవారు అని అయి వుండేది. ప్రయాణం మధ్యలో, అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు వెనక్కు తిరిగి చూడగా, ఒక వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ, వారి వైపునకు రావడం గమనించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ విషయం తెలియజేశారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనక్కు తిరిగి అతణ్ని శపిస్తూ – అల్లాహ్ అతణ్ని ఓటమిపాలు చేయుగాక! అని పలికారు. వెంటనే, అతడి గుర్రం అతణ్ని క్రింద పడవేసి అరవడం ప్రారంభించింది. ఆ వ్యక్తి – ‘ఓ దైవ ప్రవక్తా! మీరు నాకు ఏదైనా ఆజ్ఞాపించండి’ అని అన్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనికి – ‘ఇక్కడే వుండు మరియు ఎవరినీ మా వెంట రాకుండా చూడు’ అని ఆజ్ఞాపించారు. ఆ వ్యక్తి దినం ఆరంభంలో దైవప్రవక్త శత్రువై వున్నాడు, కానీ సాయంత్రానికల్లా దైవప్రవక్త సంరక్షకుడిగా మారిపోయాడు. (బుఖారీ: 3911) 

సూరాఖా బిన్ మాలిక్ (రదియల్లాహు  అన్హు) వృత్తాంతం – ఆయన మాటల్లోనే 

సహీ బుఖారీలో సురాజా బిన్ మాలిక్ (రదియల్లాహు  అన్హు) కథనం: మా వద్దకు ఖురైషీయుల ప్రతినిధులెందరో వచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూబక్ర్ (రదియల్లాహు  అన్హు)  లను హత్య చేసిన వారికి లేదా సజీవంగా పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమానం ప్రకటించబడిందన్న విషయం తెలియజేశారు. 

ఓ రోజు నేను, మా తెగ బనీ ముద్ల జ్కు చెందిన ఒక సమూహంలో కూర్చొని వున్నాను. ఇంతలో ఓ వ్యక్తి అక్కడి కొచ్చి ఇలా అన్నాడు – నేనిప్పుడే సముద్ర తీరం వెంబడి కొందరు వెళ్ళడం గమనించాను. బహుశా వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన సహాయకులు కావచ్చు. సూరాఖా బిన్ మాలిక్ కథనం: వారే అయి వుంటారని నేను వెంటనే గ్రహించాను. కానీ, ఆ వ్యక్తితో – ‘బహుశా వారు వేరే ఇంకెవరైనా వుండి వుంటారు. బహుశా నువ్వు, ఇంతకు ముందే మా మధ్య నుండి వెళ్ళిన ఫలానా వ్యక్తులను చూసివుంటావు’ అని అన్నాను. 

తదుపరి, నేను ఆ సమూహంలో కొంతసేపు కూర్చున్నాను. ఆ తర్వాత లేచి ఇంటికొచ్చేశాను. ఇంటికొచ్చి, నా బానిస స్త్రీని – నా గుర్రం తీసుకెళ్ళి ఫలానా ఎత్తయిన ప్రదేశం వద్ద నిరీక్షించమని పురమాయించాను. తదుపరి నేను పరుగెత్తుకొంటూ ఆ ప్రదేశానికి చేరుకొని, గుర్రం తీసుకొని దానిపై స్వారీ చేస్తూ వారి (ప్రవక్త సమూహం) దగ్గరికి చేరే సరికి నా గుర్రపు కాళ్ళు జారి క్రింద పడిపోయాను. నేను లేచి నిలబడి జ్యోతిష్యపు బాణాలు సంచి నుండి బయటకు తీసి నేను వారికి నష్టం కలిగించగలనా లేదా అన్న విషయంపై లాటరీ వేసి పరీక్షించగా ‘నష్టం కలిగించలేను’ అని వచ్చింది. అయినప్పటికీ, నేనా బాణాల నిర్ణయం పట్టించుకోకుండా గుర్రమెక్కి ముందుకు సాగాను. చివరికి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఎంత దగ్గరగా వెళ్ళానంటే- ఆయన ఖుర్ఆన్ పారాయణం నేను విన్నాను. కానీ, ఆయన మాత్రం వెనక్కు తిరిగి చూడలేదు. అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) మాత్రం మాటి మాటికీ వెనక్కు తిరిగి చూడడం ప్రారంభించారు. అకస్మాత్తుగా నా గుర్రపు పాదాలు భూమిలో ఇంకిపోయాయి మరియు నేను క్రింద పడిపోయి గుర్రాన్ని తిట్టడం ప్రారంభించాను. గుర్రం అతి కష్టంగా తన పాదాలను, నేల నుండి బయటకు తీసి నిలబడింది. దీంతో ఒక్కసారిగా దుమ్ము పైకి లేచింది. నేను మళ్ళీ లాటరీ వేశాను. మళ్ళీ అదే నిర్ణయం వచ్చింది. ఈసారి నేను వారిని శాంతియుత స్వరంతో పిలవగా వారు ఆగిపోయారు. నేను గుర్రంపై ప్రయాణించి వారి దగ్గరకు చేరుకున్నాను. నాతో జరిగిన వ్యవహారాన్ని బట్టి చూస్తే, ‘దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞ ఏదో ఒకరోజు తప్పకుండా ప్రాబల్యం పొందుతుంది’ అన్న విషయం నా మనసుకు తట్టింది. నేను వారితో – మీ జాతి వారు మిమ్మల్ని చంపి లేదా బంధించి ఇచ్చిన వారికి బహుమానం ప్రకటించి వున్నారని చెప్పి, వారి సమాచారమంతా అందించి, ప్రయాణానికి కావాల్సిన సామగ్రిని ఇస్తానని విన్నవించుకోగా ఆయన (సున్నితంగా) తిరస్కరించారు. కేవలం – ‘మా గురించి ఎవరికీ చెప్పకు’ అని అన్నారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో శాంతికి సంబంధించిన కొన్ని సూచనలను నాకు రాసివ్వండి’ అని వేడుకోగా, ఆయన ఆమిర్ బిన్ ఫహీరాకు ‘రాసివ్వమని’ ఆజ్ఞాపించారు. తదుపరి ఆయన రంగుపూసిన ఒక చర్మపు ముక్కపై కొన్ని శాంతి వచనాలు రాసి ఇచ్చారు. ఆ తర్వాత వారు ముందుకు ప్రయాణమయ్యారు. (బుఖారీ: 3906) 

ఉమ్మె మాబిద్ గుడారం నందు 

ఇమామ్ హాకిమ్ తన ముస్తద్రక్ నందు హిసామ్ బిన్ హుబైష్ బిన్ ఖవీలద్ (రదియల్లాహు  అన్హు) ద్వారా ఇలా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కూడిన సమూహము ఉమ్మె మాబిద్ కు చెందిన రెండు గుడారాల వద్ద నుండి పోసాగింది. ఆ స్త్రీ ప్రయాణికులకు తినిపిస్తూ, త్రాగిస్తూ ఉండేది. హిజ్రత్ సమూహం ఉమ్మె మాబిద్ – మాంసం మరియు ఖర్జూరాలు కొనే నిమిత్తం దర్యాప్తు చేయగా అక్కడ వారికేమీ లభించ లేదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కడ ఓ మేకను చూసి దాని గురించి ఉమ్మె మాబిద్ను అడగ్గా – ఆమె – ఇది ఎంతో అలసి వున్నందువల్ల మేకల గుంపుతో వెళ్ల లేక వెనుకబడిపోయింది అని అంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో ఈ మేక పాలిస్తుందా? అని అడగ్గా, ఆమె ఇది ఎంతో బలహీనంగా, చిక్కిపోయి వుంది అని జవాబిచ్చింది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెతో -నేను దీని పాలు పిండుకోనా? అని అనుమతి అడగ్గా, ఆమె (ఆశ్చర్యపడుతూ) నా తల్లిదండ్రులు మీకై సమర్పితంకాను! మీకొకవేళ దీని శరీరంలో పాలు కనిపిస్తే వాటిని మీరు పిండుకోవచ్చు అని అంది. తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని స్థనాలను చేతులతో స్పర్శించి, ‘బిస్మిల్లాహ్’ అని పలికి, ఆపై అల్లాహ్ ను  వేడుకొని పాలు పిండడం ప్రారంభించారు. మేక స్థనాలు పాలతో నిండిపోయాయి. తదుపరి ఆయన ఉమ్మె మాబిద్ గిన్నెలో పాలు పిండసాగారు. కాసేపటికి గిన్నె నిండి పోయింది. ఆయన అందరికన్నా ముందుగా పాలను ఉమ్మె మాబిద్కు ఇచ్చారు. తర్వాత తన సహచరులకు, చివరికి తను కూడా కడుపు నిండా త్రాగారు. మళ్ళీ రెండవసారి పిండారు. గిన్నె మళ్ళీ పాలతో నిండిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం నిమిత్తం ముందుకు సాగిపోయారు. (ముస్తద్రక్ హాకిమ్ – కితాబుల్ హిజ్రత్ – 4333) 

అయితే ఈ ఉల్లేఖన పరంపర గురించి కొందరు హదీసువేత్తలు సందేహం వెలిబుచ్చారు. వాస్తవం అల్లాహ్ తెలుసు. 

రెండవ ఖుత్బా 

ప్రియ సోదరులారా! 

మొదటి ఖుత్బాలో మీరు హిజ్రత్ విశిష్టతలు మరియు దానికి సంబంధించిన వృత్తాంతాలు వివరంగా తెలుసుకున్నారు. రండి! ఇక, మదీనాకు విచ్చేసినప్పుడు మదీనావాసులు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఎలా స్వాగతం పలికారో తెలుసుకుందాం! 

మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు స్వాగతం 

మదీనా వాసులు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాకకోసం ఎంతగానో నిరీక్షించసాగారు. వారి ఉత్సాహాన్ని గూర్చి అమ్ బిన్ జుబైర్ (రదియల్లాహు  అన్హు) ఏం సెలవిచ్చారో వినండి! 

ఆయన కథనం ప్రకారం మదీనాకు వెళ్ళే మార్గంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆయనే తారసపడ్డారు. ఆయన ఒక వ్యాపార సమూహంతో కలిసి సిరియా నుండి తిరిగి వస్తున్నారు. జుబైర్ (రదియల్లాహు  అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ కు ఒక తెల్లటి వస్త్రాన్ని కానుకగా ఇచ్చారు. 

ఇటు, మదీనా వాసులకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్రత్ విషయం తెలియగానే, వారు ప్రతి రోజు ఉదయం హిర్ర(ఒక ప్రదేశం) దగ్గరకు వచ్చి మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరిగే వరకు ఆయన కొరకు వేచి చూసేవారు. ఒక రోజు, ఎప్పటిలాగే ఎంతో సేపు ఎదురు చూసి తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక యువకుడు ఏదో పని నిమిత్తం ఒక ఎత్తయిన ప్రదేశం ఎక్కగా, అకస్మాత్తుగా అతనికి తెల్లని వస్త్రాలు ధరించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) రావడం కనిపించింది. అతను వుండబట్టలేక పెద్దగా అరుస్తూ ఇలా ప్రకటించాడు- “ఓ అరబ్బు సమూహమా! ఇన్నాళ్ళుగా మీరు నిరీక్షిస్తున్న మీ పెద్ద మనిషి వచ్చేశాడు.” ఇది విని ముస్లిములలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. తమ ఆయుధాలు ధరించి వారంతా ‘హిర్ర’ వద్ద దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వాగతం పలికారు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో కలిసి అమ్ర్  బిన్ ఔఫ్ తెగ వద్దకు వచ్చి ఆగారు. ఆ రోజు రబీవుల్ అవ్వల్ నెల, సోమవారం. అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) అక్కడ నిలబడి, వచ్చే ప్రజానీకాన్ని స్వాగతించడం మొదలు పెట్టారు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా అక్కడే కూర్చున్నారు. మదీనా వాసుల్లో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అప్పటి వరకు చూడని వారు వచ్చి అబూ బక్ర్(రదియల్లాహు  అన్హు) కు సలాం చేసేవారు. ఈ లోగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఎండ తగులుతుండడం చూసి, ఆయన తన దుప్పటితో ఆయన (దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఎండతగలకుండా ఆపి వుంచారు. అప్పుడర్థమయ్యింది ప్రజలకు, ఆయన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అని. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అమ్ర్ బిన్ ఔఫ్ తెగ వద్ద 10 కన్నా ఎక్కువ రాత్రులు గడిపారు. ఈ అవధిలో ఆయన ఒక మస్జిద్ (ఖుబా) నిర్మించారు. దీని గురించి దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى التَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ ۚ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا ۚ وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ

మొదటి రోజు నుండే భయభక్తులు ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీవు (ఆరాధన కొరకు) నిలబడటానికి తగినది.” (తౌబా 9 : 108) 

దీనిలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజు చదివారు. తదుపరి తన వాహనంపై ఎక్కి ప్రజలతోపాటు బయలుదేరారు. చివరికి, నేడు మస్జిద్ నబవి వున్న ప్రదేశంలో ఆయన వాహనం (ఒంటె) కూర్చుండి పోయింది. ఆ ప్రదేశంలో అప్పుడు కొందరు ముస్లిములు నమాజు చదువుతూ వుండేవారు. వాస్తవానికి ఆ భూమి సహైల్ మరియు సహల్ అనే ఇద్దరు అనాధలకు చెందినది. వారిద్దరూ ఉస్ అద్ బిన్ జరార (రదియల్లాహు  అన్హు) పర్యవేక్షణలో వుండేవారు. ఆ ప్రదేశాన్ని ఖర్జూరాలు ఎండబెట్టడానికి ఉపయోగించేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాహనం ఆ స్థలంలో ఆగిన వెంటనే ఆయన, ఇన్షా అల్లాహ్ ఇదే మా గమ్యస్థానం అని సెలవిచ్చారు. తదుపరి ఆయన ఆ ఇద్దరు అనాధ బాలురను పిలిచి, ఆ స్థలంలో మస్జిద్ నిర్మించదలిచి దాన్ని అమ్మివేయమని అడిగారు. వారిరువురూ – కాదు ఓ దైవప్రవక్తా! మేమా స్థలాన్ని మీకు సమర్పిస్తాం అని విన్నవించుకున్నారు. 

కానీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానిని ఉచితంగా తీసుకోకుండా, పైకం చెల్లించి) కొన్నారు. తదుపరి ఆయన ఆ స్థలంలో మస్జిద్ నిర్మించారు. స్వయంగా తను కూడా దాని నిర్మాణంలో పాలుపంచుకున్నారు మరియు సహాబాలతోపాటు తను కూడా ఇటుకలు మోసి తీసుకువచ్చారు. (బుఖారీ: 3906) 

అనస్ (రదియల్లాహు  అన్హు) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ తర్వాత మదీనా దగ్గర (హిర దగ్గర ఆగి, మదీనా అన్సారులను పిలిపించారు. వారక్కడికి వచ్చి, దైవప్రవక్త మరియు అబూ బక్ర్ ను కలిసి – ‘మీరిరువురూ ఇప్పుడు పూర్తిగా సురక్షితులై వున్నారు. కనుక మీరిప్పుడు బయలుదేరవచ్చు. మీరిచ్చే ప్రతి ఆజ్ఞకు విధేయత చూపడం జరుగుతుంది’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు అబూ బక్ర్ (రదియల్లాహు  అన్హు) లు వాహనం ఎక్కారు. మదీనా అన్నారులు వారితో పాటు నడవసాగారు. ఇటు, మదీనా పట్టణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేరుకున్నారు అని ప్రకటన గావించబడింది. ప్రజలు గోడలపై, ఇంటి పైకప్పులపై, ఎక్కి ఎంతో ఉత్సాహంతో ఆయన్ను చూడడానికి నిరీక్షించసాగారు మరియు అమితానందంతో మాటిమాటికీ దైవప్రవక్త చేరుకున్నారు అని ఎలుగెత్తి చాటసాగారు. 

ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నడుస్తూ, నడుస్తూ చివరికి అబూ అయ్యూబ్ (రదియల్లాహు  అన్హు) ఇంటి దగ్గరకు చేరుకొని క్రిందికి దిగారు. తదుపరి ఆయన – ఎవరి ఇల్లు దగ్గరగా వుంది? అని అడగ్గా అయ్యూబ్ అన్సారీ – ఓ దైవప్రవక్తా! నా ఇల్లు అందరికన్నా దగ్గరగా ఉ ౦ది, ఇటు చూడండి, ఇదే నా ఇల్లు మరియు ఇదే దీని ప్రవేశ ద్వారం అని విన్నవించుకున్నారు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట్లాడుతూ -“సరే అయితే, లోపలికి పదండి మరియు నా విశ్రాంతి కొరకు ఏర్పాటు చేయండి” అని అన్నారు. 

ముస్తద్రక్ హాకిమ్లోని ఒక ఉల్లేఖనంలో ఇలా వుంది: అబూ అయ్యూబ్ (రదియల్లాహు  అన్హు) ఇల్లు రెండు అంతస్తులు కలిగి వుండేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన ఇంటికి విచ్చేసినప్పుడు తను క్రింది అంతస్తులో వుండేవారు మరియు అబూ అయ్యూబ్ తన భార్యతో కలిసి పై అంతస్తులో వుండేవారు. దీనిపై ఆ భార్యాభర్తలిద్దరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేసి, దీనిపై తమ అయిష్టతను విన్నివించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో – “మా కోసం మరియు మా దగ్గరికి వచ్చిపోయే ప్రజల సౌకర్యం కోసం క్రింది భాగమే ఉత్తమమైనది” అని బదులిచ్చారు. (హాకిమ్ : 5939) 

ఇటు, అబ్దుల్లా బిన్ సలామ్ ఆ సమయంలో ఖర్జూరపు తోటలో పండ్లు ఏరుతూ వున్నారు. (దైవప్రవక్త విచ్చేసిన వార్త విని) గబగబా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధికి చేరుకొని ఆయన సంభాషణ విని ఇలా పలికారు: మీరు దైవ సందేశహరులని, సత్యం తీసుకొని వచ్చారని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను యూదుల నాయకుణ్ణని మరియు యూదుల నాయకుడి పుత్రుడినని యూదులకు తెలుసు మరియు నేనొక గొప్పయూద పండితుణ్ణని మరియు ఒక గొప్ప యూద పండితుని పుత్రుణ్ణని కూడా వారికి తెలుసు. కనుక, మీరు వారిని పిలిపించి, నా ఇస్లాం స్వీకరణ వార్త వారికి తెలియడానికి ముందు, వారిని నా గురించి ప్రశ్నించండి. ఎందుకంటే నా ఇస్లాం స్వీకరణ వార్త విన్నాక వారు నా గురించి నిజం పలుకరు అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యూదులను పిలిచి ఇలా సెలవిచ్చారు: ఓ యూదుల సమూహమా! అల్లాహ్ కు  భయపడండి. తను తప్ప మరో ఆరాధ్యదైవం లేని అల్లాహ్ సాక్షి! నేను దైవ సందేశహరుణ్ణని మరియు మీ వద్దకు సత్యం తీసుకొని వచ్చానని మీకు ఖచ్చితంగా తెలుసు. కనుక మీరంతా ఇస్లాం స్వీకరించండి. యూదులు జవాబిస్తూ మేము ఈ విషయాన్ని (ముహమ్మద్ ప్రవక్త గురించి) ఎరుగము అని పలికారు. 

దైవప్రవక్త ఇలా అడిగారు: ఒక విషయం చెప్పండి, మీలో అబ్దుల్లా  బిన్ సలామ్ ఎటువంటి వారు? 
యూదులు : ఆయన మా నాయకులు మరియు ఒక నాయకుని పుత్రులు. మాలో అందరికన్నా గొప్ప పండితులు మరియు గొప్ప పండితుల కుమారులు. 
దైవ ప్రవక్త: ఒకవేళ ఆయన ఇస్లాం స్వీకరిస్తే-అప్పుడు మీ అభిప్రాయ మేమిటి? 
యూదులు: అలా ఎప్పటికీ జరుగదు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రశ్నే రెండు సార్లు అడిగారు. యూదులు ప్రతిసారీ ఇదే విధంగా జవాబిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు  అన్హు) లతో – ‘మీరిప్పుడు ముందుకు రండి’ అని పిలిచారు. ఆయన యూదుల ముందుకు వచ్చి ఇలా పలికారు. ఓ యూదుల సమూహమా! అల్లాహ్ కు  భయపడండి. తను తప్ప వేరే ఆరాధ్యుడు లేని ఆ అల్లాహ్ సాక్షిగా! ఈయన దైవ సందేశహరులని, మీ వద్దకు సత్యం తీసుకు వచ్చారని మీకు తెలుసు. దీనిపై యూదులు జవాబిస్తూ – నువ్వు అసత్యం పలుకుతున్నావు అని అన్నారు. తదుపరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యూదులను వెళ్ళి పొమ్మని ఆదేశించారు. (బుఖారీ: 3911) 

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు  అన్హు) కథనం : ముహాజిర్లలో మొట్ట మొదట ముసైబ్ బిన్ ఆమిర్, అబ్దుల్లా ఉమ్మె మఖ్తూమ్ (రదియల్లాహు  అన్హుమ్)లు మా దగ్గరికి విచ్చేశారు. వీరిద్దరూ ప్రజలకు దివ్య ఖుర్ఆన్ నేర్పేవారు. తర్వాత అమ్మార్ (రదియల్లాహు  అన్హు) , తదుపరి బిలాల్ మరియు సాద్ (రదియల్లాహు  అన్హుమ్)లు విచ్చేశారు. ఆ తర్వాత ఉమర్ (రదియల్లాహు  అన్హు) 40 మంది ప్రయాణికులతో కలిసి విచ్చేశారు. తదుపరి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విచ్చేశారు. అప్పుడు ప్రజల్లో నేను చూసిందేమిటంటే – వారి ముఖాల్లో వ్యక్తమైన ఆనందం మరెప్పుడూ కూడా వ్యక్తం కాలేదు. అందరూ ఆఖరికి స్త్రీలు, పిల్లలు మరియు బానిస స్త్రీలు సైతం ‘దైవప్రవక్త’ విచ్చేశారు అని అంటూ తిరగసాగారు. (బుఖారీ: 3925) 

అనస్ (రదియల్లాహు అన్హా) కథనం : “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాలో అడుగుపెట్టిన రోజు చూశాను. ఆ రోజు ఎంత అందంగా మరియు కాంతివంతంగా ఉందంటే అలాంటి రోజును నేను మరెప్పుడూ చూడలేదు. అలాగే, నేను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన దినాన్ని కూడా చూశాను. ఆ దినం ఎంత బాధాకరంగా వున్నదంటే అలాంటి చీకటి దినాన్ని మరెప్పుడూ చూడలేదు.” (దారిమి : 1/61, ముస్నద్ అహ్మద్ : 1311- సహీ) 

ప్రియ శ్రోతలారా! హిజ్రత్ కు  సంబంధించిన విశేషాలను మీరు సవివరంగా విన్నారు. వాటిలో మనకు గుణపాఠాన్ని నేర్పే ఎన్నో విషయాలు వున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే – అల్లాహ్ దాసులు అల్లాహ్ కు  విధేయత చూపి, ఆయన ధర్మానికి సహాయపడుతూ, ఆయన మార్గంలో ఎదురయ్యే కష్టాలకు గాను సహనం పాటిస్తారో, అలాంటి వారిని అల్లాహ్ కూడా కష్టకాలంలో ఒంటరిగా వదిలివెయ్యడు. పైగా వారికి తోడుగా వుంటాడు మరియు వారిని ఆ కష్టాల నుండి గట్టెక్కే మార్గాలను తెరుస్తాడు. దైవప్రవక్త మరియు ఆయన సహచరులకు సహాపడినట్లు. వారిని మక్కావాసులు దౌర్జన్యాల నుండి కాపాడి మదీనా లాంటి శాంతియుత ప్రదేశంలో వసింప జేశాడు. 

హిజ్రత్ సంఘటన అనేది నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన. ఆ తర్వాతే ఆయన నాయకత్వంలో ఒక ఇస్లామీయ రాజ్యం ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాతే, అల్లాహ్, తిరస్కారులతో యుద్ధం చేయమని ఆదేశించాడు. దాని ఫలితంగా సత్యాసత్యాల్లో వ్యత్యాసం ప్రస్ఫుటం కాసాగింది. ఆ తర్వాత అల్లాహ్ తన ప్రవక్తతో చేసిన వాగ్దానా లన్నింటినీ సంపూర్ణం గావించాడు మరియు ఇస్లామ్ కు ప్రాబల్యం, ఆధిక్యతలను ప్రసాదించాడు. 

హిజ్రత్ సంఘటన ప్రాముఖ్యతను దృష్టిలో వుంచుకొనే, ఉమర్ (రదియల్లాహు  అన్హు)  ఇస్లామీయ క్యాలండర్ను ఈ సంఘటన నుండే ప్రారంభించారు. కానీ, దురదృష్టవశాత్తూ నేడు ముస్లిములు తమ ఇస్లామీయ క్యాలండరే మరిచి పోయారు మరియు ముస్లిమేతర క్యాలండర్కు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించారు. అల్లాహ్ మనందరి స్థితిపై కరుణించుగాక! ఆమీన్! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్